నారద మహా పురాణము
గ్రహ పూర్వకముగా నానావిధ మహోత్పాతములు
సనందన మహర్షి పలికెను: చైత్రము మొదలు ఫాల్గుణము వరకు పన్నెండు నెలలలో వరుసగా మేషము మొదలు మీనము వరకు పన్నెండు సంక్రమణములు ఉండును. చైత్రశుద్ధ ప్రతిపత్ ఏ వారమున వచ్చునో ఆ గ్రహమే ఆ సంవత్సరమునకు రాజు అగును. మేష సంక్రమణము ఏ వారమున ప్రవేశించునో ఆ గ్రహము సేనాపతి అగును. కర్కట సంక్రమణము ఏ వారమున వచ్చునో ఆ గ్రహము సస్యాధిపతి అగును. సూర్యుడు రాజుగాగల సంవత్సరము మధ్యమము. చంద్రుడు రాజుగాగల సంవత్సరము ఉత్తమము. కుజుడు, బుధుడు, బృహస్పతి రాజుగా ఉన్న సంవత్సరము మంచిది కాదు. శుక్రుడు రాజుగా ఉన్నచో మిక్కిలి శుభమును కలిగించును. శని రాజుగా ఉన్నచో అధమము. ఇట్లు ఈ గ్రహముల బలాబలమును తెలిసి విశేషఫలమును చెప్ప వలయును. సూర్యమండలమున దండాకారముకాని, కబంధా కారముకాని, ధ్వాంక్షాకారముకాని, కీలకముకాని కనపడినచో వ్యాధి, భ్రాంతి, చోరుల వలన అర్థనాశము జరుగును. ఛత్ర ధ్వజ పతాకాద్యాకారములు కాని స్ఫులింగములతో పొగవలె సూర్య మండలమున కనబడినచో ప్రపంచ నాశము సంభవించును. తెలుపు ఎరుపు రంగులు, పసుపు, నలుపురంగులు కనబడినచో విప్రా దులకు పీడకలుగును. రెండు, మూడు, నాలుగు రంగులు ఒకేసారి కనబడినచో రాజులను ప్రజలను నశింపచేయును. తామ్ర వర్ణములుగల సూర్యకిరణములు ఊర్థ్వముగా కనబడినచో సేనాపతి నశించును. పీతవర్ణము కలవైనచో రాజపుత్రుడు, తెలుపు వర్ణము కలవైనచో పురోహితుడు, చిత్ర వర్ణమున్నచో ప్రజలు నశింతురు. ధూమ్రవర్ణము కలిగి ఉన్నచో రాజు, పిశంగవర్ణము కాని, మేఘవర్ణము కాని కలిగి అధోముఖముగా నున్నచో జగత్తు నశించును. శిశిర ఋతువున సూర్యుడు తామ్ర వర్ణగుడైనచో శుభకరుడగును. వసంత ఋతువున కుంకుమ వర్ణుడు శుభకరుడు. గ్రీష్మర్తువులో ఆపాండుర వర్ణము కలిగియున్న శుభకరుడు. వర్ష ఋతువులో చిత్రవర్ణుడు, శరదృతువున పద్మోదర వర్ణుడు, హేమంత ఋతువులో లోహిత వర్ణుడు శుభకరుడు. శీతకాలమున పీతవర్ణుడు, వర్షర్తువులో శ్వేతవర్ణుడు, గ్రీష్మమున లోహిత వర్ణుడు, క్రమముగా రోగమును, అనావృష్టిని, భయమును కలిగిం చునని చెప్పబడినది. ఇంధ్ర ధనువులో అర్థ భాగమువంటి ఆకారముగల సూర్యుడు రాజులకు విరోధమును కలిగించును. కుందేటి నెత్తురు వర్ణముగల సూర్యుడు భూమండలమున త్వరలో యుద్ధము జరుగునని తెలుపును. నెమిలి పింఛము రంగు కలిగి ఉన్నచో పన్నెండు సంవత్సరములు భూమిమీద వర్షము కురియును. సూర్యుడు చంద్రునివలె ఉన్నచో కొత్త రాజును ఏర్పరచును. సూర్యుడు శ్యామవర్ణుడైనచో కీటభయము, భస్మవర్ణుడైనచో రాష్ట్రమువలన భయము, ఆర్క మండల మున ఛిద్రము కనపడినచో మహారాజు నాశము, ఘటాకారమున ఉన్నచో ఆకలి భయమును, తోరణాకారమున ఉన్నచో పట్టణ నాశనమును, ఛత్రాకారమున నున్నచో దేశమునకుహానిని, ఖండభానువు రాజ నాశనమును కలిగించును. సూర్యోదయ సమయమున, అస్తమయ సమయమున మెరుపులు, ఉల్కా పాతము, పిడుగుపాటు సంభవించినచో రాజవధకాని, రాజులకు విరోధము కాని జరుగును. పక్షముకాని పక్షార్థముకాని పగలు రాత్రి సూర్యచంద్రులకు పరివేషము కనబడి నచో ఉన్న రాజు పోయి కొత్తరాజు వచ్చును. అస్తమయ సమయమున శస్త్రముల ఆకారము కల మేఘములచే సూర్యుడు కప్పబడి ఉన్నచో యుద్ధము సంభవించును. గాడిదలు, ఒంటెలు వంటి ఆకారముగల మేఘములచే కప్పబడినచో భయమును కలిగించును.
దక్షిణ దిక్కున శృంగము ఉన్నతముగా ఉన్న చంద్రుడు మీన మేషములలో ఉన్నచో శుభప్రదుడు. మిధున మకర రాశులలో ఉత్తరదిశగా శృంగోన్నతుడగు చంద్రుడు ఉత్తముడు. కుంభ వృషభ రాశులలో చంద్రుడు సముడుగా ఉన్నచో ఉత్తముడు కర్క ధనూ రాశులలో ఉన్నచో సముడుగా ఉండును. ధనువువలె వృశ్చిక సింహ రాశులలో ఉన్నపుడు తులా కర్కటక రాశులలో శూలమువలె, విపరీతముగా ఉదయించిన చంద్రుడు దుర్భిక్ష కలహము లను కలిగించును. పూర్వాషాఢ, ఉత్తరాషాఢా నక్షత్రములలో మూలా జ్యేష్ఠా నక్షత్రములో నున్న చంద్రుడు దక్షిణ దిశలో ఉన్నచో అగ్నినిచ్చి చోరులను చరప్రాణులను వనములను సర్పములను నశింపచేయును. విశాఖ అనూరాధా నక్షత్రములో ఉండి దక్షిణ పార్శ్వ భాగమున ఉండు చంద్రుడు పాపుడగును. మఘా నక్షత్రములోని చంద్రుడు మధ్యముడు. విశాఖా నక్షత్రమున సౌమ్యుడు. పుష్యమి పూర్వాభాద్రా నక్షత్రాదులలోని చంద్రుడు శుభ ప్రదుడు. జ్యేష్ఠా నక్షత్రము నుండి తొమ్మిదవ నక్షత్రములను వాటి భరణి జ్యేష్ఠ ఆశ్లేషా నక్షత్రములలోకాని, మరుత్తులు అర్థతారకలు పునర్వసు, విశాఖా నక్షత్రములు అర్థ ఫల ప్రదములు. ఇతర నక్షత్రములు సమములు. దక్షిణ శృంగోన్నతుడు ఇష్టుడు కాజాలడు. శుక్ల పక్షమున పిపీలిక ఆకారమున శుభుడు. కార్యహాని, కార్యసిద్ధి అనునవి క్రమమును అనుసరించి జరుగును. విశాల చంద్రుడు సుభిక్షమును కలిగించును. అవిశాల చంద్రుడు పాపములను నశింప చేయును. చంద్రుడు అధోముఖముగా ఉన్నచో శస్త్రభయము, దండా కారమున ఉన్నచో కలహము సంభవించును. కుజాదులచే శృంగము నిహతమైనను, మండలము నిహతమైనను యథా క్రమముగా క్షేమాదులు వృష్టి, భూపాల నాశము జననాశము కలుగును.
ఆశ్లేషా మఘా నక్షత్రములో కుజుడు ఉదయించి బలవంతుడుగా నుండి వక్రగతుడైనచో వక్రమునకు ఉష్ణము అనిపేరు. దీనివలన ప్రజాపీడ, అగ్ని భయము కలుగును. పదియవ పదకొండవ పన్నెండవ నక్షత్రములలో ఉదయించిన కుజుడు వక్రుడైనచో దానిని కూక్రము అందురు. సస్యమును వర్షమును నశింపచేయును. కుజుడు పదమూడవ నక్షత్రమున ఉండుటకాని, పదునాలుగవ నక్షత్రమున వక్రించినచో దానిని బాలాస్య చక్రమందురు. ఇందు సస్యమును, వృష్టిని నశింపచేయును. పదునైదు, పదునారు నక్షత్రములలో వక్రుడైనచో రుధిరానన మందురు. దీని వలన దుర్భిక్షము, క్షుద్భయము, రోగములు కలుగును. పదునేడవ పదునెనిమిదవ నక్షత్రమున వక్రించినచో ముసల మందురు. దీని వలన దుర్భిక్షము, ధనధాన్యాది నాశనము, భయమును కలిగించును. పూర్వఫల్గునీ, ఉత్తరఫల్గునీ నక్షత్రములలో ఉదయించి ఉత్తరాషాఢా నక్షత్రమున వక్రించినచో అట్లే రోహిణీ నక్షత్రమున అస్తమించినచో లోకత్రయమును నశింపచేయును. శ్రవణా నక్షత్రమున ఉదయించి పుష్యమీ నక్షత్రమున వక్రగతిని పొందినచో శ్వానములకు హానిని కలిగించును. కుజుడు ఏ దిక్కున ఉదయించిన ఆ దిక్కులోని రాజులకు భయమును కలిగించును. మఘా నక్షత్ర మధ్యన చరించును. అచటనే వక్రి అయినచో అనావృష్టి శస్త్రభయము, కలహము రాజక్షయము జరుగును. మఘా విశాఖా రోహిణీ నక్షత్రముల యోగ తారకలను కుజుడు భేదించినచో దుర్భిక్షము, మరణము, రోగములు కలుగును. ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, మూల, శ్రవణా, మృగశిరా నక్షత్రములలో కుజుడు చరించినచో, అట్లే రోహిణీ నక్షత్రమునకు దక్షిణ దిశగా ఉన్నచో అనావృష్టిని కలిగించును. కుజుడు అన్ని నక్షత్రములకు ఉత్తరదిక్కున చలనము కలిగియుండుట శుభప్రదము. దక్షిణదిశగా వెళ్ళినచో అనిష్ట ఫలము ఇచ్చును. రాజులలో భేదమును కలిగించును. ఉత్పాతము లేకుండా ఒక్కొక్కసారి స్వచ్ఛమైన ఆకాశమున బుధుడు ఉదయించినచో అనావృష్టి భయమును, అగ్నిభయమును రాజులలో విరోధమును కలిగించును. ధనిష్ఠా శ్రవణము, ఉత్తరాషాఢా, మృగశిరా రోహిణీ నక్షత్రములలో చరించు బుధుడు యోగ తారలను భేదించినచో, ప్రజలలో కలహములు అనావృష్టి కలిగి భయమును కలిగించును.
ఆర్ద్రా నక్షత్రము నుండి మఘా నక్షత్రము వరకు బుధుడు చరించునపుడు దుర్భిక్షమును, కలహములను, రోగమును, అనావృష్టిని, భీతిని కలిగించును. హస్తనుండి జ్యేష్ఠా నక్షత్రము వరకు ఉన్న అరు నక్షత్రములలో చరించు బుధుడు, క్షేమమును, సుభిక్షమును, ఆరోగ్యమును, రోగ నాశమును కలిగించును. కృత్తికా, భరణీ నక్షత్రములలో చరించు బుధుడు, వైద్య, తరంగ, వాణిజ్య వృత్తులను నశింపచేయును. పూర్వ ఫల్గునీ, పూర్వాషాఢ, పూర్వాభాద్రా నక్షత్రములలో చరించు యోగతారను భేదించినచో ఆకలి వలన, శస్త్రముల వలన, అగ్ని వలన, చోరుల వలన ప్రాణులకు భయమును కలిగించును. భరణి, కృత్తిక, రోహిణి, చిత్తా నక్షత్రములలో ప్రకృత గతి, ఆరుద్ర, మృగశిరా, ఆశ్లేష, మఘా నక్షత్రములలో మిశ్రగతి ఉండవలయును. పూర్వఫల్గుని, ఉత్తరఫల్గునీ, పుష్యమి, పునర్వసు నక్షత్రములలో సంక్షిప్తగతి చెప్పబడినది. ఉత్తరాభాద్ర నక్షత్రమున తీక్ష్ణాజచరణగతి భరణి, పుష్యమీ, ధనిష్ట, శతభిష నక్షత్రములలో ఘోరగతి. జ్యేష్ఠా, కృత్తిక, విశాఖ, హస్త నక్షత్రములలో పాపగతి అనబడును. ప్రాకృతాది గతులలో ఉదయించినను, అస్తమించినను ఎన్ని దినములు కనపడునో అన్నియే దినములు కనపడడు. నలుబది దినములు సూర్యుడు, ముప్పది దినములు చంద్రుడు, కుజుడు తొమ్మిది దినములు, పదిహేను లేదా పదకొండు దినములు బుధుడు ఉండును. బుధుడు ప్రాకృత గతిలో ఉన్నచో క్షేమమును, ఆరోగ్యమును, సుభిక్షమును కలిగించును. మిశ్ర సంక్షిప్త గతులలో నున్ననూ ఫలప్రదుడు. ఇతర గతులలో ఉన్నచో వృష్టి నిచ్చును.
వైశాఖ మాసమున, శ్రావణ మాసమున, పుష్య మాసమున, ఆషాఢ మాసమున ఉదయించిన బుధుడు జగత్తునకు పాపఫలమును ఇచ్చును. ఇతర మాసములలో ఉదయించి నచో శుభప్రదుడు. ఆశ్వయుజ కార్తీకమాసములలో ఉదయించినచో శస్త్ర, దుర్భిక్ష అగ్ని భయములను కలిగించును. రజత స్ఫటిక వర్ణముతో ఉదయించిన బుధుడు శ్రేష్ఠుడు. బృహస్పతి ఏ నక్షత్రమున ఉదయించునో ఆ నక్షత్రము పేరే ఆ సంవత్సరమునకు ఉండును. కార్తీక మార్గశీర్ష మాసములలో ఉదయించినచో నరులకు దుష్ట ఫలములను ఇచ్చును. పుష్య మాఘ మాసములలో ఉదయించినచో శుభప్రదుడు. ఫాల్గుణ చైత్ర మాసములు మధ్యమములు. వైశాఖ మాసము శుభప్రదము. జ్యేష్ఠ మాసము మధ్యమము. అషాఢము మధ్యమము. శ్రావణము శ్రేష్ఠము. భాద్రపదము ఉత్తమము. అశ్వయుజ మాసము అత్యుత్త మము. ఇది మాసముల ఫలము. నక్షత్రములకు ఉత్తరదిశగా సంచరించు బృహస్పతి క్షేమమును ఆరోగ్యమును సుభిక్షమును ప్రసాదించును. భరణీ నక్షత్రమున చరించుచు విపరీత ఫలమును ఇచ్చును. మధ్యలో మధ్యమముగా చరించును. పీత, అగ్ని, శ్యామ, హరిత, రక్తవర్ణములుకల బృహస్పతి క్రమముగా వ్యాధి, అగ్ని, చోర, శస్త్ర, అస్త్ర భయములను కలిగించును. భూమ్నవర్ణముకల బృహస్పతి అనావృష్టిని కలిగించును. పగటిపూట బృహస్పతి కనిపించినచో రాజమరణము, రాష్ట్రమును నశింపచేయు రోగమును కలిగించును. సంవత్సరము శరీరముగా ఉండును. కృత్తికా రోహిణి నాభి, అర్ద్ర పాదయుగళము, మఘ హృదయము. శరీరమును క్రూర గ్రహములు పీడించినచో దుర్భిక్షము, అగ్ని వాయు భయము కలుగును.
నాభిలో ఉన్నపుడు ఆకలి దప్పుల భయము, పుష్యమీ నక్షత్రమున ఉన్నచో మూల ఫలనాశము హృదయేశ నిధనము సంభవించును. శుభ గ్రహములచే శరీరము కూడి ఉన్నచో శుభము కలుగును. సస్యవృద్ధి, ప్రజారోగ్యము కలుగును. బృహస్పతి అతిచారముచే యుద్ధము సంభవించును. మధ్యలో ఉన్నచో గో, నృప, స్త్రీ సుఖము కలుగును. అవృష్టి ఫణులచే వృష్టి, స్వాస్ధ్యము మహోత్సవము జరుగును. మహార్ఘమగు సంపద, దేశనాశము, అతివృష్టి, అద్వేషము, రోగము అభయము, రోగ భయము, సస్య వర్షణమున కలుగును. మఘ మొదలగు నక్షత్రములలో బృహస్పతి ఉన్నచో, రోగము, ధాన్యము కలుగును. శుక్రునికి అంగారకుని వలన ఉత్తర దక్షిణ మధ్య దిశలలో మూడు గతులు ఉండును. నాగ ఇభ ఐరావత, వృషథ, ఉష్ట్రఖర, మృగ, అంజ, దహనములు అని దక్షిణదిశతో ముగియు తొమ్మిది వీధులుండును. శుక్రుడు ఉత్తర మార్గమున ఉండు మూడు వీధులలో తిరుగుచు ధాన్య, అర్థ వృష్టి సన్యములకు పరిపూర్ణతను కలిగించును. మధ్యమార్గమున నుండు మూడు వీధులలో తిరుగుచు ధాన్య, అర్థ వృష్టి సస్యములకు పరిపూర్ణతను కలిగించును. మధ్య మార్గమున ఉండు మూడు వీధులలో చరించుచున్నచో, అధమ ఫలము సంభవించును. తూర్పు దిక్కులో ఉండు మేఘము మఘాది పంచకమున శుభదము. స్వాతి నుండి మూడు నక్షత్రములలో పశ్చిమ దిక్కున నుండు శుక్రుడు అట్టి ఫలితమునే కలిగించును. విపరీతముగా ఉన్నచో అనావృష్టి సంభవించును. బుధునితో కలిసియున్నచో వృష్టిని కలిగించును. బహుళాష్టమీ తిథిన, చతుర్దశీ తిథినాడు, అమావాస్య నాడు, శుక్రుడు ఉదయించిననూ, అస్తమించిననూ భూమి జలమయము అగును. ఒకరికొకరు ఏడవరాశిలో ఉంటూ, పశ్చిమ తూర్పు వీధులలో ఉన్న గురు శుక్రులు అనావృష్టిని, దుర్భిక్షమును, యుద్ధమును కలిగింతురు. శుక్రునికి అగ్ర భాగమున కుజుడు, బుధుడు, బృహస్పతి, శని చరించుచున్నచో యుద్ధము, వాయువును దుర్భిక్షమును జలనాశమును కలిగింతురు.
పూర్వాషాఢ, అనూరాధ, ఉత్తర ఫల్గుని, ఆశ్లేష, జ్యేష్ఠా నక్షత్రములలో శుక్రుడున్నచో సుభిక్షమును కలిగించును. ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్రములలో ఉన్నచో భయము. మూలలో ఉన్నచో వృష్టిని కలిగించును. శ్రవణా, స్వాతి, హస్త, ఆర్ద్ర, భరణి, పూర్వఫల్గునీ నక్షత్రములలో చరించు శనినరులకు సుభిక్షమును, ఆరోగ్యమును, సస్యమును కలిగించును. శని శరీరాకారమున నక్షత్రముల స్థితి ఇట్లుండును. ముఖమున ఒక నక్షత్రము, గుదమున రెండు నక్షత్రములు, లింగమున మూడు నక్షత్రములు, నేత్రమున రెండు నక్షత్రములు, హృదయమున అయిదు నక్షత్రములు, వామహస్తమున నాలుగు, వామ పాదమున మూడు, దక్షిణ పాదమున మూడు, దక్షిణ హస్తమున నాలుగు. ఇది జన్మ నక్షత్రము నుండి శని స్థితి. రోగము, లాభము, హాని, లాభము, సౌఖ్యము, బంధనము, ఆయాసము, శ్రేష్ఠ యాత్ర, ధనలాభము. ఇవి పైనచెప్పిన స్థితులవలన వరుసలో కలుగు లాభములు. శని ఎక్కువగా వక్రగతిగా ఉండును. కావున ఈ ఫలము చెప్పబడినది. సమగతి ఉన్నచో సమఫలమునే యొసంగును. అతిచారమున్నచో ఫల వ్యుత్ర్కమము జరుగును. విష్ణుచక్రముచే ఛేదించబడిన శిరస్సుకలవాడు. కుంటివాడు, అమృత పానమును చేసినందున అమరత్వమును పొందినవాడు గ్రహముగా కల్పించబడెను. ప్రతిపర్వ కాలమున సూర్య చంద్రులను బాధించుచుండును. ఇతనే రాహువు. ఈ రాహువు విక్షేపము చేయబడుటవలన, అవనతి వలన సూర్యచంద్రులకు దూరముగా నుడుంను.
ప్రతి ఆరు నెలలకు సూర్య చంద్రుల గ్రహణమును పరిశోధించవలయును. ఈ పర్వలకు సూర్యుని నుండి వరుసగా సత్యదేవులు అధిపతులు. బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, యముడు అనువారలు అధిపతులు. బ్రాహ్మ పర్వమున పశు సస్య బ్రాహ్మణ వృద్ధి జరుగును. చంద్ర పర్వమున కూడా ఇట్టి ఫలితమే కలుగును. ఈ పర్వమున శ్లేష్మ పీడ ఉండును. ఇంద్ర పర్వమున రాజులకు పరస్పర విరోధము, సస్యనాశము, ధనవంతులకు ధననాశము కలుగును. కౌబేర పర్వలో ధాన్యవృద్ధి రాజులకు మాత్రము అశుభము కలుగును. వరుణపర్వలో రాజభిన్నులకు క్షేమము కలుగును. బాగుగా వర్షించును. సస్యవృద్ధి క్షేమము కలుగును. అగ్నిపర్వలో అనావృష్టి, సస్యహాని, దుర్భిక్షము కలుగును. యమపర్వలో కాలముకాని కాలమున సస్యహాని రాజులకు పరస్పర యుద్ధము, పుష్పహాని, భయము, సస్యనాశము కలుగును. ఒకే నెలలో సూర్య చంద్రులకు గ్రహణము సంభవించినచో రాజులకు పరస్పర విరోధము, అర్ధనాశము, వృష్టి నాశము కలుగును. గ్రస్తులైన ఉదయించిన సూర్య చంద్రులు, గ్రస్తులై అస్తమించిన సూర్య చంద్రులు నృప నాశమును, ధాన్యనాశమును చేయుదురు. సూర్యచంద్రులు సంపూర్ణముగా గ్రహించబడినచో (సంపూర్ణ గ్రహణము) ఆకలి, వ్యాధి, అగ్ని భయమును కలిగింతురు. ఉత్తరాయణమున గ్రహణము ఏర్పడినచో క్షత్రియులను బ్రాహ్మణులను నశింపచేయును. అట్లే గ్రామభేదములు మోక్షభేదములు పదియున్నవి. ఈ భేదములను దేవతలే తెలియలేరు. ఇక ప్రాకృత జనులెట్లు తెలియగలరు. గ్రహ గణితములను తీసుకొని వారి భాగములను ఆలోచించవలయును. కాలముయొక్క లక్షణమును శుభాశుభ మధ్యమములచే గ్రహించవలయును. కావున మానవులు కాలజ్ఞానముకొరకు కేతువులు ఉదయాస్తమయము లను ఉత్పాతరూపములను పరిశీలించవలయును.
దివ్యములు, అంతరిక్షములు భౌమములని ఆ ఉత్పాతరూపములు మూడు విధములు. ఇవియే శుభాశుభ ఫలములను ఇచ్చునవి. యజ్ఞధ్వజ, అస్త్ర, భవనముల రక్షను వృద్ధి పరుచునని గజోపమములైన కేతువులు స్తంభ, శూల, అంకుశాకారములతో ఉండు కేతువులు అంతరిక్షములు అనబడును. నక్షత్రాంశలలో ఉండునవి దివ్యములు. భూమిపైనున్న వాటిని భౌమములందురు. జంతువు యొక్క నామము ఒకటైనను, భిన్న రూపము నొందినచో శుభమును కలిగించును. కేతువు పలు రూపములతో ఎన్ని దినములు కనపడునో అన్ని మాసములు ఫలము నిచ్చును. దివ్యములైన కేతువులు కూడా జీవులకు ఫలములను ఇచ్చునవే. హ్రస్వము, స్నిగ్ధము సుప్రసన్నము అగు శ్వేతకేతువు సువృష్టిని కలిగించును. ఇంద్రధనువు వంటి కాంతిగల ధూమకేతువు అనిష్ట ఫలము ఒసంగును. ద్విశూల, త్రిశూల, చతుశూలరూపమగు కేతువు రాజ్యమును నశింపచేయును.
పలు వర్ణములుకల మణిహారములు మిక్కిలి కాంతి గలవి సూర్యుని నుండి పుట్టునవి. తూర్పు పశ్చిమ దిశలలో ఉదయించిన కేతువులు రాజులకు హానిని కలిగించును. వంసుక, బింబ, క్షితిజ, శుకతుండముల వలెనుండు కేతువులు అగ్నినుండి పుట్టునవి. ఇవి కూడా ప్రాణులకు ఫలముల నొసంగును. జలమువలె, తైలమువలె గుండ్రగా నుండు కేతువులు భూపుత్రులు. ఇవి అకలి, భయములను కలిగించును. చంద్రుని నుండి పుట్టిన శ్వేత కేతువులు సుభిక్షమును క్షేమమును కలిగించును. పితామహుని నుండిన కేతువు మూడు వర్ణములు, మూడు దశలు కలిగియుండును. బ్రహ్మదండము నుండి పుట్టిన ధూమకేతువు ప్రజలను నశింపచేయును. ఈశాన్య దిక్కున ఉదయించు శ్వేతకేతువు శుక్రుని వలన పుట్టునది. ఇది అనిష్టమును కలిగించును. శనిపుత్రులగు కమకములను పేరుగల శిఖలు లేని కేతువులు కూడా అనిష్టమునే కలిగించును. గురుపుత్రులగు వికచములను పేరుగల కేతువులు దక్షిణదిక్కున నుండునవైనను ఇష్టఫలములనే ఒసంగును. బుధుని నుండి పుట్టిన కేతువులు సూక్ష్మములు శుక్లములు చోర, రోగ భయములను కలిగించును. కుజునినుండి పుట్టిన కేతువులు కుంకుమ అను పేరుగలవి రక్తవర్ణములు గలవి. శూలా కారముతో ఉండునవి అనిష్టమును కలిగించును. అగ్నివలన పుట్టునవి విశ్వ రూపములు అనుపేరుగలవి అగ్నివర్ణములు సుఖమును కలిగించును. సూర్యపుత్రులు అరుణములనునవి శ్యామలాకారమున ఉండునవి. పాపఫలమునే ఇచ్చును. శుక్రుని వలన పుట్టినవి నక్షత్రము వలె ఉండునవి. శుభఫలము నొసంగును. కృత్తికలలో పుట్టు ధూమకేతువు ప్రజా క్షయమును కలిగించును. ప్రాసాద వృక్ష శైలములలో పుట్టిన కేతువులు రాజులను నశింపచేయును. కలువవలె నుండు కుముదమను పేరుగల కేతువు సుభిక్షమును చేయును. సంధ్యాసమయమున పుట్టు అవర్త కేతువు అనిష్టఫలమును ఒసంగును.
కాలమానము తొమ్మిది విధములు. బ్రహ్మమానము, దేవమానము, మనుమానము, పితృమానము, సౌరమానము, సావనమానము, చాంద్రమానము, నక్షత్రమానము, గురు మానము అని ఈ నవమానముల వ్యవహారము అయిదింటిచే చేయబడును. ఈ మానములకు వ్యవహారమును అనుసరించి వేరువేరుగా చెప్పబడును. సౌరమానమును అనుసరించి అన్ని గ్రహముల అన్ని చారములను గ్రహించెదరు. వర్షవిధానము, స్త్రీగర్భ విషయమును సావనమానముచే గ్రహించెదరు. ప్రవర్ధణమును, సమగర్భములను నక్షత్రమానముచే గ్రహించెదరు. యాత్రలు, వివాహము, వ్రతములు, క్షౌరము, తిథి, వర్షాధిపతి నిర్ణయము, పర్వము, వాస్తు, ఉపవాసాదులు చాంద్రమానముచే చేయబడును. ప్రభవాది సంవత్సర లక్షణములను గురుమానముచే తెలియుదురు. ఆయా పన్నెండు మాసములచే, ఆయా అష్టకములు ఏర్పడును. గురుమధ్యమ చారముచే ప్రభవ మొదలుకొని అరువది సంవత్సరములు ఉండును. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగిరా, శ్రీముఖ, భావ యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధీ, విక్రమ, వృష, చిత్రభాను, సుభాను, తారణ, పార్ధివ, అవ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నంద, విజయ, జయ, మన్మథ, దుర్ముఖ, హేలంబ, విలంబ, వికారి, శార్వరి, లవ, శుభకృత్, శోభన, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సామాప్త, విరోధకృత్, పరిభావి, ప్రమాది, అనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్త, సిద్ధార్ధ, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షీ, క్రోధన, క్షయ అనునవి అరువది సంవత్సరములు.
ఈ అరువది సంవత్సరములు తమతమ పేరుకు తగిన విధముగానే ఫలములను ఒసంగును. అయిదు సంవత్సరములకొక యుగమని పేరు. ఇట్లు పన్నెండు యుగములు ఉండును. ఆ యుగములకు అధిపతులు వరుసగా విష్ణువు, బృహస్పతి, పురందరుడు, లోహితుడు, త్వష్టా, అహిర్బుధ్న్యుడు, పితృదేవతలు, విశ్వేదేవతలు, చంద్రుడు, అగ్ని, అశ్వినీ దేవతలు, భగుడు అని తెలియవలయును. యుగములోని అయిదు సంవత్సరములకు వరుసగా అగ్ని, నరుడు, చంద్రుడు, బ్రహ్మ, శంకరుడు అధిపతులు. ఇప్పుడు సంవత్సరాధిపతి, సేనాపతి, సస్యాధిపతుల బలాబలములను, ఆ సమయమున ఉన్న గ్రహచారమును బాగుగా తెలుసుకొని ఫలమును చెప్పవలయును. ఉత్తరాయణము ఆరు మాసములు. మకరమునుండి మిధునమువరకు సూర్యభుక్తి వలన ఉండును. ఈ ఉత్తరాయణము దేవతలకు పగలు దేవతలకు రాత్రి దక్షిణాయనము. ఇది సూర్యుడు కర్కాటక రాశియందు ప్రవేశించిననాటినుండి మొదలగును. ధనూరాశ్యంతము వరకుండును. గృహప్రవేశము, వివాహము, ప్రతిష్ఠ, మౌంజీబంధనము మొదలగు శుభకర్మలను ఉత్తరాయణమున మాఘాది మాసములలో చేయవలయును. దక్షిణాయనమున శుభకర్మలను చేయుట నిందించబడినది. మాఘము నుండి రెండు రెండు నెలలు శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు ఉండును. కర్కటక సంక్రమణ నుండి ఆరునెలలు దక్షిణాయన కాలమున వర్ష, శరత్, హేమంత ఋతువులుండును. అమావాస్యనుండి ఉండునది చాంద్రమానము సంక్రమణము నుండి చెప్పునది సౌరమానము, దినములతో చెప్పునది సావన మానము, చంద్ర నక్షత్ర గణములు ముప్పదితో చెప్పు మాసము నక్షత్ర మానము అనబడును. చైత్రాది మాసములకు వరుసగా మధు, మాధవ, శుక్ర, శుచి, నభస్, నభస్య, ఇష, ఊర్జ, సహాః, సహస్యకః, తపః, తపస్య అనునవి పేర్లు. ఏ నెలలోని పూర్ణిమ ఏ నక్షత్రముతో కలిసి యుండునో ఆ నక్షత్రము పేరే ఆ మాసమునకు ఉండును. పూర్ణిమకు కూడా ఆ పేరే యుండును. ఆ మాసమున దేవ పక్షము, పితృపక్షము అని రెండు పక్షములు ఉండును. అట్లే శుక్ల పక్షము, కృష్ణ పక్షము అని మరి రెండు పేర్లు కూడా కలవు. ఈ రెండు పక్షములు శుభా శుభ కర్మలకు ప్రశస్తములుగా పేర్కొనబడినవి. ఇట్లే పదిహేను తిథులకు అధిపతులుగా వరుసగా బ్రహ్మ, అగ్ని, విరించి, విష్ణు, శైలజా, వినాయక, యమ, నాగ, చంద్ర, స్కంద, అర్క, వాసవ, మహేన్ద్ర, వాసవ, నాగ, దుర్గా, దండధర, శివ, విష్ణు, హరి, రవి, కామ, సర్వ, కలీ, చంద్ర, విశ్వేదేవ, ధర్మ అనువారలు మరియు పితృ దేవతలుగా తెలియవలయును. నందా, భద్రా, జయా, రిక్తా, పూర్ణా అని తిథులు అయిదు విధములు. అయిదింటిని మూడా వృత్తులచే తిథులను తెలియ వలయును. శుక్ల పక్షమున అనిష్టము మధ్యన కలిగి ఇష్టములను ఇచ్చును. కృష్ణ పక్షమున ఇష్ట మధ్యలై అనిష్టము ఇచ్చును. అష్టమి, ద్వాదశి, షష్ఠి, చతుర్థి, చతుర్దశి, అను అయిదు తిథులకు రంధ్రములు అనిపేరు. ఇవి చాలా క్రూరములుగా పేర్కొనబడినవి. సముద్రము అను రంధ్రతత్త్వ సంఖ్యలు గలవి నాడికలు. ఆయా తిథులలో క్రమమును అనుసరించి ఈనాడికలను విడువ వలయును. అమావాస్య, నవమిలను విడిచి మిగిలిన బేసి తిథులు ప్రశస్తములైనవి.
శుక్ల ప్రతిపత్ మధ్యమము. షష్ఠి తిథిన తైలమును, అష్టమి తిథిన మాంసమును, నవమీ తిథిన కారమును, పూర్ణిమా అమావాస్యలలో స్త్రీని సేవించరాదు. అమావాస్య తిధినాడు, షష్ఠినాడు, ప్రతిపత్తున, ద్వాదశి తిధిన, ప్రతిపర్వలో, నవమి తిథిన, దంత ధావనము చేయరాదు. వ్యతీపాత్తున, సంక్రాంతిన ఏకాదశిని, ప్రతిపర్వలో ఆదివారము, మంగళవారము, షష్ఠి తిథినాడు, వైదృతినాడు అభ్యంగనము చేయరాదు. దశమీ తిధిన ఉసిరికాయలతో స్నానము చేసినచో పుత్రహాని, త్రయోదశిన చేసినచో ధనక్షయము కలుగును. ద్వితీయా తిథిన చేసినచో ధన క్షయము, పుత్ర క్షయము జరుగును. అమావాస్య నాడు, నవమీనాడు, సప్తమినాడు చేసినచో కులక్షయ మగును. పగలుకూడా చంద్రుడున్న పూర్ణిమను సానుమతి యందురు. రాత్రి చంద్రుడున్న పూర్ణిమను రాకా అందురు. అట్లే అమావాస్య కూడా రెండు విధములు. చంద్రుడుకల అమావాస్యను సినీవాలి అని, చంద్రుడు లేని అమావాస్యను కుహూ అని అందురు. కార్తిక శుక్ల నవమి కృతయుగాది వైశాఖశుద్ధ త్రేతాయుగాది. దీనికే పుణ్యా అనిపేరు. మాఘ బహుళ పంచమి ద్వాపర యుగాది. భద్రపద బహుళ త్రయోదశి కలియుగాది.
కార్తికశుక్ల ద్వాదశి, అశ్వయుజ శుద్ధ నవమి, చైత్రశుద్ధ తదియ, భాద్రపద శుద్ధ తదియ, పుష్యశుద్ధ ఏకాదశి, అషాఢశుద్ధ దశమి, మాఘశుద్ధ సప్తమి, భాద్రపద బహుళాష్టమి, శ్రావణ అమావాస్య, ఫాల్గుణ పూర్ణిమ, ఆషాఢ కార్తిక జ్యేష్ఠ, చైత్ర పూర్ణిమలు అను ఈ పదునాలుగు మన్వాది కాలములు. మానవులు ఈ దినములలో శ్రాద్ధముచేసిన మిక్కిలి పుణ్యవంతులు అగుదురు. భాద్రపద బహుళ త్రయోదశిన చంద్రుడు మఘా నక్షత్రమున, సూర్యుడు హస్తా నక్షత్రమున ఉన్నచో దానిని గజచ్ఛాయ అందురు. శ్రాద్ధమును చేసినచో అధిక పుణ్యమును ప్రసాదించును. ఒకే దినమున మూడు తిథులు వచ్చినచో తిథిక్షయము. మూడు దినములలో ఒకే తిథి వచ్చినచో ఒకటి అధిక, రెండు తిథులు నిందితములు, సూర్యాస్తమయ పర్యంతము ఏ దినమున ఏ తిథి ఉండునో ఆ తిథి అఖండతిథి అనబడును. తక్కువగా ఉన్నచో ఖండతిథి అందురు. తిథియొక్క పదిహేనవ భాగము వరుసగా ప్రతి పదాదులని తెలియవలయును. వాటిలో సగ భాగము క్షణము అనబడును. ఇట్లు వాటిలో అర్థ ప్రమాణమును అనుసరించి సూర్యుడు, చంద్రుడు చరుడు, బుధుడు క్రూరుడు వక్రుడు, బృహస్పతి లఘువు, శుక్రుడు మృదువు, శని తీక్ష్ణుడు అని సిద్ధాంతము, భానువారమున అభ్యంగనమును చేసుకొనిన మానవుడు కష్టముల పాలగును. సోమవారమున చేసినచో కాంతిమంతుడగును, మంగళవారమున చేసినచో వ్యాధి కలుగును. బుధవారము చేసినచో సౌభాగ్యవంతుడగును. గురువారము చేసినచో అనిష్టము. శుక్రవారము చేసినచో హాని, శనివారము చేసినచో సర్వసమృద్ధులు కలుగును. లంకోదయము నుండి వారాది అగును. దాని తరువాత కాని ముందుకాని దేశాంతరమున స్వచరార్ధనాడులతో తక్కినవి అగును. గ్రహము బలయుతుడుండగా చేసిన పని చక్కగా నెరవేరును. అదే గ్రహము బలహీనముగా ఉన్నపుడు కష్టపడిచేసిననూ సిద్దించదు. సోమ బుధ గురు శుక్ర వారములు అన్ని పనులకు శభప్రదములు. మిగిలిన వారములు క్రూరములు. సూర్యుడు రక్తవర్ణుడు, చంద్రుడు గౌరవర్ణుడు. అంగారకుడు లోహితవర్ణుడు, బుధుడు దూర్వావర్ణుడు, గురువు పీతవర్ణుడు, శుక్రుడు శ్వేతవర్ణుడు, శని కృష్ణవర్ణుడు. తమ తమ వారములలో తమ తమ వర్ణములను పనులను చేయుచుందురు. అద్రి, బాణ, పాతాళ, పర్వత, బాణ, అగ్నిలోచన, వేద, బహు, బాణ, నేత్ర, గోత్ర, నామ, చంద్ర, రస, ఋతువుల సంఖ్యతో అనగా 7, 5, 1, 7, 5, 3, 2, 4, 2, 5, 2, 7, 3, 1, 9, 6 ఈ సంఖ్యలు గలవి వారవేలలగును. ఈ వేళలకు కులికా ఉపకులిక అను పేర్లుండును. అదివారమునుండి వరుసగా అన్ని వారములలో ఈ వేళలు సగము ఝాము కాలము ఉండును. ఏ వారమున ఆవారాధిపతి క్షణకాలము చూడబడునో అది ఆద్యవేళ, దానినుండి ఆరవది రెండోవేళ, దాని నుండి ఆరవది మూడవవేళ ఇట్లు ఆరు ఆర్లు చేసినచో ఏడు వేళలు వచ్చును. మిగిలినవాటిని ఆయా గ్రహములు హోరాధిపతులగుదురు. రెండున్నర నాడులచే క్రమమును అనుసరించి పగలు రాత్రులు ఏర్పడును. ఆ గ్రహము యొక్క క్షణములో ఆవారములో చెప్పబడిన కర్మను చేయవలయును. ఆయా నక్షత్రములకు క్రమముగా దస్ర, యమ, వహ్ని, పితామహ, చంద్ర, ఈశ, అదితి, బృహ్పతి, సర్ప, పితృ, భగ, అర్యమ, అర్క, త్వష్కృ, మరుత్, శక్ర, అగ్ని, మిత్ర, వాసవ, నైరుతి, ఉదక, విశ్వేదేవ, లిజ, గోవింద, వసు, జలాధిపతి, అజైకపాత్, అహిర్బుధ్న్య, పూష అను వారలు పూర్వఫల్గుణి, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, మఘ, కృత్తిక, విశాఖ, భరణి, మూలా అను తొమ్మిది నక్షత్రములు అధోముఖ నవకమని, ఈ నవకములో సూర్యుడు ప్రవేశించి యున్నప్పుడు బలప్రవేశ, గణిత, భూతసాధన లేఖనము, శిల్పకర్మ, కలా, కూప, నిక్షేపోద్ధరణము మొదలగునవి విధించబడినవి అనగా చేయవలయును. అనూరాధ, మృగశిర, చిత్త, హస్త, జ్యేష్ఠ, పునర్వసు, రేవతి, అశ్వని, స్వాతి అను ఈ తొమ్మిది తిర్యఙ్ముఖ నవక మందురు. ఈ తొమ్మిది నక్షత్రములలో సూర్యుడు ఉన్నపుడు, హల, ప్రవాహగమన, గంత్రీపత్ర, గజ, ఉష్ట్ర, ఖర, గో, రథ, నౌయాన, తిలాయ, హయ కర్మలు చేయవలయునని విధించ బడినవి. రోహిణి, శ్రవణం, ఆరుద్ర, ఉత్తరఫల్గుని శతభిష, ధనిష్ఠ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుష్యమి అను తొమ్మిది ఊర్ధ్వ ముఖము అను నవకము అనబడును. ఈ తొమ్మిది నక్షత్రములలో సూర్యుడున్నచో రాజ్యాభిషేక, మాంగల్య, గజ, ధ్వజకర్మలు, ప్రాసాద, తోరణ, ఆరామ, ప్రాకారాదులను చేయబడవలయును. రోహిణి, ఉత్తర, హస్త, అశ్విని, పుష్యమి, ఈ నక్షత్రములు స్థిరములని, విశాఖ, కృత్తికలు సాధారణములని చెప్పబడినవి. ధనిష్ఠ, పునర్వసు, పూర్వాషాఢ, పుష్యమీ శ్రవణములు చర నక్షత్రములు అనబడును. మృగశిర, అనూరాధ, చిత్ర, రేవతి అనునవి మృదు నక్షత్రములు, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, పుబ్బ, మఖా నక్షత్రములు ఉగ్రములు. మూలా, అర్ద్రా, ఆశ్లేష, జ్యేష్ఠా నక్షత్రములు తీక్ష్ణములు. ఈ నక్షత్రములు తమ తమ పేర్లకు తగిన ఫలములను ఇచ్చును. చిత్త, పునర్వసు, పూర్వాషాఢ, శ్రవణం, రేవతి, అనూరాధ, ధనిష్ఠ, మృగశిర, పుష్యమి, నక్షత్రములలో బాలురకు చౌలమును చేయవలయును. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి నక్షత్రములలో, స్థిర నక్షత్రములలో గజకర్మ చేయవలయును. సూర్యవారమున (ఆదివారమున) అశ్వకర్మను చేయవలయును. చిత్త, శతభిష, రోహిణి, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రములలో గమనాగమనములను చేయవలయును. అమావాస్య, అష్టమి, చతుర్దశీ తిథులలో పశువుల పనిని చేయరాదు. మృదు, ధ్రువ, క్షిప్ర, చర నక్షత్రములలో, విశాఖా మఘా నక్షత్రములలో, మూలా నక్షత్రమున వృషభము లతో మొదటి నాగలిని లాగించవలయును. (భూమిని దున్నవలయును) పైన చెప్పిన నక్షత్రముల నుండి మూడు నక్షత్రములలో హస్త నక్షత్రమున హలాదిచే దున్నించినచో వృషభములు నశించును. అగ్రభాగముతో దున్నించిన వృభములు వృద్ధిచెందును. మూటితో దున్నించిన సంపద చేకూరును. ఉత్తర భాగమున పంచకమును చేయవలయును. శూలత్రయమున నవకము, పంచకము మరణమును కలిగించును. సంపదకు పుష్టికి త్రయము శ్రేష్ఠము. లాంగల నామక చక్రములో మూడునాగళ్ళచే దున్నించుట ఉత్తమము. మృదు, ధ్రువ, క్షిప్ర నక్షత్రములలో, మఖ, స్వాతి, ధనిష్ఠ, మూలా నక్షత్రములలో విత్తనమువేసినచో పంటపుష్కలముగావచ్చును. రాహునక్షత్రమునుండి మూడు నక్షత్రములు శిరస్నానమున ఉండును. కావున ధాన్యనాశము కలుగును. కంఠ స్థానమున నుండు మూడు నక్షత్రములు చెడుఫలము నిచ్చును. ఉదర స్థానమున నుండి పన్నెండు నక్షత్రములు వృద్ధిని ప్రసాదించును. లాంగూల స్థానమున నున్న నక్షత్రములలో విత్తినచో తండుల శూన్యత్వమును కలిగించును. నాభి స్థానమున ఉన్న అయిదు నక్షత్రములలో విత్తినచో అగ్ని భయము కలుగునని శాస్త్ర నిర్ణయము, స్థిర నక్షత్రములలో, పునర్వసు, ఆశ్లేష, రేవతి, మఘ, స్వాతి నక్షత్రములలో రోగముక్తునికి స్నానమును చేయించరాదు. ఆశ్లేష, మృగశిర, పుష్యమీ నక్షత్రములలోకూడా చేయించరాదు. ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాధ, జ్యేష్ఠ, ధనిష్ఠా, శతభిషా నక్షత్రములలో నృత్యారంభము ప్రశస్తముగా పేర్కొనబడినది. అట్లే పుష్యమి, హస్త, రేవతీ నక్షత్రములుకూడా నృత్యారంభమునకు ఉత్తమములు. పూర్వార్ధముతో కలిసియున్న ఆరు నక్షత్రములు, రేవతి, ఉత్తరా నక్షత్రములు మధ్య భాగములు కలిసియున్న పన్నెండు నక్షత్రములు జ్యేష్ఠ నుండి తొమ్మిది నక్షత్రములు, పరార్ధముచే కలిసియున్న నక్షత్రములు క్రమముగా దంపతులకు ప్రీతిని పెంచునవి. శతభిష, అర్ద్రా, ఆశ్లేష, స్వాతి, భరణి, జ్యేష్ఠా నక్షత్రములు అధమములు. పునర్వసు, విశాఖ నక్షత్రములు, బృహత్తారలు సమములు. ఈ నక్షత్రముల ప్రమాణ ఘడియలు క్రమముగా ముప్పది, తొంబది, పదునారుగా తెలియవలయును. చంద్రోదయము తరువాత వరుసగా అర్ఘసమములను గ్రహించ వలయును. అశ్విని, మృగశిర, పుష్యమి, మూల, చిత్త, ఉత్తరా, మఘా, విశాఖ, ధనిష్ఠా నక్షత్రములకు కులమని పేరు. రోహిణి, జ్యేష్ఠా, పునర్వసు, స్వాతి, రేవతి, హస్త, శ్రవణ, ఆశ్లేష, నక్షత్రములకు అకులములని పేరు. మిగిలిన నక్షత్రములకు కులాకులములని పేరు. కులసంజ్ఞకల నక్షత్రములలో రాజు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళినచో పరాజయమును పొందును. అకుల నక్షత్రములలో యుద్ధమునకు వెళ్లిన రాజు విజయమునుపొందును. నక్షత్ర సంధిలో వెళ్ళినను, కులాకుల నక్షత్రములలో వెళ్ళినను అట్టి ఫలమునే పొందును. ఆది శని మంగళ వారములలో, భద్రా నక్షత్రముల యొక్క విషమ పాదములలో త్రిపుష్కరమున అయినచో త్రిగుణములను కలిగించును. ఉత్తరాషాఢ ఆశ్లేషా నక్షత్రములలో ద్విగుణ ఫలము లభించును. ఈ దోషము తొలగుటకు మూడు గోవులను కాని, మూడు గోవుల మూల్యమును కాని దానమును చేయవలయును.
ద్విపుష్కరమున చేసినచో రెండు గోవులను దానము చేయవలయును. త్రిపుష్కరమున దానము చేసినచో దోషమంటదు. పుష్యమీ నక్షత్రము క్రూర నక్షత్రములచే కలిసియున్ననూ వివాహమును తప్ప ఇతర శుభకార్యములను చేయవచ్చును. 3, 3, 6, 5, 3, 1, 4, 3, 5, 2, 2, 5, 1, 1, 2, 4, 3, 4, 2, 3, 4, 3, 100, 2, 2, 32. ఇవి అశ్వినీ మొదలగు నక్షత్రములకు వేరువేరుగా వరుసగా తారా సంఖ్యలని తెలియవలయును. వీటిలో దీప్తతారలుగా కనపడునవి తమ తమ గణములలో యోగతారలుగా పిలువబడును.
ఇక ఇప్పుడు ఆయా నక్షత్రములవలన వచ్చిన వృక్షములను చెప్పుచున్నాము. అశ్వని వలన వృష వృక్షము భరణీ నక్షత్రమున యమకరవృక్షము, కృత్తికా నక్షత్రమున మేడిచెట్టు, రోహిణీ నక్షత్రమున జంబుక వృక్షము, మృగశిరా నక్షత్రమువలన చండ్రచెట్టు, అర్ద్రా నక్షత్రమువలన నల్లజువ్వి, పునర్వసు నక్షత్రమువలన వెదురు, పుష్యమీ వలన పిప్పలము, అశ్లేషవలన నాగవృక్షము, మఘావలన మఱ్ఱిచెట్టు, పుబ్బా నక్షత్రమువలన మోదుగు, ఉత్తరా నక్షత్రమువలన అక్షవృక్షము, హస్త వలన అరిష్ట వృక్షము, చిత్తా నక్షత్రమువలన శ్రీవృక్షము, స్వాతివలన అర్జున వృక్షము, విశాఖా నక్షత్రమువలన వికంకత వృక్షము, అనూరాధా నక్షత్రమువలన పొగడచెట్టు, జ్యేష్ఠా నక్షత్రము వలన విష్టివృక్షము, మూలా నక్షత్రము వలన సర్జవృక్షము, పూర్వాషాఢా నక్షత్రమువలన కంజల వృక్షము ఉత్తరాషాఢా నక్షత్రమువలన పనస వృక్షము, శ్రవణా నక్షత్రమువలన జిల్లేడు, ధనిష్ఠా నక్షత్రమువలన జమ్మిచెట్టు, శతభిషా నక్షత్రము వలన కదంబవృక్షము, పూర్వాభాద్ర నక్షత్రము వలన మామిడిచెట్టు, ఉత్తరాభాద్రా నక్షత్రము వలన వేపచెట్టు, రేవతి వలన ద్రాక్షచెట్టు పుట్టినవి. ఈ వృక్షములు అన్నియు నక్షత్రముల వలన ఏర్పడినవిగా తెలియవలయును. ఏ నక్షత్రమున శని ఉండునో ఆ వృక్షమును ప్రయత్న పూర్వకముగా అర్చించవలయును. యోగేశులు, యముడు, విశ్వేదేవతలు, చంద్రుడు, భూమి, రుద్రుడు, వరుణుడు, గణేశుడు, రుద్రుడు, కుబేరుడు, త్వష్ట, మిత్రుడు, కుమారస్వామి, సావిత్రి, లక్ష్మి, గౌరి, అశ్వనీ దేవతలు, అదితి, పితృ దేవతలు వీరిని అర్చించ వలయును. వైదృతి వ్యతీపాతము మహాపాతములు అనబడును.
పరిఘా యోగముయొక్క పూర్వార్ధము ఏకార్యములకు పనికిరాదు. విష్కంభ వజ్ర యోగముల యొక్క మూడు నాడికలు, గండ, అతిగండ యోగముల ఆరు నాడికలు, వ్యాఘాతమున తొమ్మిది నాడులు, శూలమున అయిదు నాడులు. అశుభ ఫలప్రదములు. పునర్వసు, మృగశిర, మఘా, అశ్విని, మూల, అనూరాధ, పుష్యమీ, చిత్తా నక్షత్రములు వరుసగా మూర్ధాస్థాన నక్షత్రములని తెలియ వలయును. పై భాగమున ఒక రేఖను, అడ్డముగా పదమూడు రేఖలను గీయవలయును. ఆ ఖర్జూర చక్రమున పైన చెప్పబడిన నక్షత్రములను మూర్ధస్థానమున ఉంచవలయును. ఒకే రేఖలో ఉండు సూర్య చంద్రులకు పరస్పరము దృష్టిపాతమున్నచో ఏకార్గలము అందురు. అభిజిత్తును వదిలి పన్నెండు వినాడులు లేని రెండు ఘడియలు యోగము అందురు. అట్లే కరణము అందురు. ఈ యోగములు వరుసగా ఇరువది యేడు ఉండును. ఇంద్రుడు, ప్రజాపతి, మిత్రుడు, త్త్వష్టా, భూమి, హరితిప్రియా, యముడు, కలి, రుద్రుడు, నాగము, వాయువు అనువారలు తిధ్యర్దేశులుగా తెలియవలయును. ‘బవ’ మొదలుకొని ‘వణిజము’ వరకు ఆరు శుభకరణములు, శుభకార్యములను పరీతమగు విష్టికాని విపరీతమగు విష్టికాని ఇష్టప్రదము కాజాలదు. ముఖమున అయిదు, కంఠమున ఒకటి, వక్షస్థ్సలమున పదకొండు, నాభిస్థానమున నాలుగు, కటిస్థానమున ఆరు, పుచ్ఛమున మూడు నాడికలుండును. ముఖనాడికలలో కార్యమును ప్రారంభించినచో కార్యహాని, గల స్థాన నాడికలలో ప్రారంభించిన మృత్యువు, వక్షస్థ్సల నాడికలలో అర్థహాని, కటి స్థాననాడి కలలో ఉన్మాదము, నాభి స్థాననాడికలలో చ్యుతి, పుచ్ఛ నాడికలలో ప్రారంభించిన జయము కలుగును. మధ్యభాగమున ఉన్న నక్షత్రములు స్థిరములు. అవియే మధ్యనాగ చతుష్పదములు అనబడును. ఆరుద్ర, ఆశ్లేష, అనూరాధ, మఘా, ధనిష్ఠ, పూర్వాషాఢ, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ, రోహిణి, జ్యేష్ఠా, ఆర్ద్ర, కృత్తిక, ధనిష్ఠ, శతభిషం అను ఈ పదిహేను నక్షత్రములు దివా ముహూర్తములని తెలియవలయును. ఆర్ద్ర, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, జ్యేష్ఠ, పునర్వసు, పుష్యమి, శ్రవణము, హస్త, చిత్త, స్వాతి, నక్షత్రములు ఒక దినములో పగలులో పదిహేనవ భాగము అట్లే రాత్రిలోని పదిహేనవ భాగము ముహూర్త మానమగును. క్షణములు నక్షత్రములు సరిగా చూడ వలయును. ఉత్తర ఫల్గుణి, మూల, రోహిణి, మఘా, కృత్తిక, అభిజిత్ ఈ నక్షత్రములలో భరణి మఘా నక్షత్రములు రాక్షసములను పేరుగలవి. సూర్యాదులలో భర్గ, అజాంశలుగా నుండును. శుభకర్మలను చేయునపుడు ఆయా వారములలో పైన చెప్పబడిన ముహూర్తములను వదులవలయును. యే నక్షత్రములలో ఏ పనిని చేయవలయునని చెప్పబడినదో, ఆ విధముగా ఆయా దేవతలున్న ముహూర్తములలోనే యాత్రాదికములను చేయ వలయును. హస్తా నక్షత్రము నుండి ఏడవ నక్షత్రమున అనగా మూలా నక్షత్రమున భూకంపము, హస్త నుండి అయిదవ నక్షత్రమున అనగా అనూరాధా నక్షత్రమున విద్యుత్, 8, 10 యవ నక్షత్రములలో అనగా పూర్వాషాఢా శ్రవణా నక్షత్రములలో శూలము, 18వ నక్షత్రమున అనగా జ్యేష్ఠా నక్షత్రమున శని, పదిహేనవ నక్షత్రమున కేతువు, పందొమ్మిదవ నక్షత్రమున ఉల్కాపాతము, 9, 5 నక్షత్రములలో నిర్ఘాతపాతమను సంజ్ఞలను తెలియవలయును. మోహము, నిర్ఘాతపాతము, కంపము, కులిశము, పరివేషణము అనునవి 21వ నక్షత్రము నుండి వరుసగా ఆయా నక్షత్రముల లోనివి అని తెలియవలయును. పైన చెప్పబడిన ఈ నక్షత్రములలో చంద్రుడు ఉన్నచో శుభ కార్యములు చేయకూడదు. హస్త మఘ చిత్త, అనూరాధ, అప్త నక్షత్రములలో శ్రవణమున క్రమముగా హస్తనుండి చంద్రునితో కూడియున్నచో, అంత వరకు ఆ నక్షత్రమున దుష్టయోగము అనబడును. వాటిలో చండీశ, చందాయుధా యోగములు ఉన్నపుడు ఈయోగములలోనే శుభకార్యములను ఆచరించ వలయును. తిథి వారములు మలినములు పదమూడు ఉండును. దీనిని క్రకచ యోగము అందురు. శుభ కార్యములను ఈ క్రకచ యోగమున ఆచరించరాదు.
ఆదివారమున సప్తమి, బుధవారమున ప్రతిపత్తు ఏర్పడినచో సంవర్తయోగమందురు. ఈ యోగము శుభకర్మలను నశింపచేయును. ఆనందము, కాలదండము, ధూమ్రము, ధాతృ, సుధాకర, ధ్వాంక్ష, ధ్వజ, శ్రీవత్స, వజ్ర, ముద్గర, ఛత్రకమిత్ర, మానస, పద్మ, లుంబన, ఉత్పాత, మృత్యువు, కాణ, సిద్ధి, శుభ, అమృత్యు, ముసల, అంతక, కుంజర, రాక్షస, వర, స్థైర్య, వర్ధమానము అనునవి ఇరువది ఎనిమిది యోగములు. తమ పేరులో ఉన్న ఫలమును ఒసంగునవి. అదివారమున క్రమముగా అశ్వని మృగశిరలలో చంద్రుడు ఉన్నను, ఆశ్లేషలో కుజుడున్ననూ, హస్తా నక్షత్రమున బుధుడున్నను, అనూరాధలో బృహస్పతి యున్ననూ, ఉత్తరాషాఢలో శుక్రుడున్ననూ, శతభిషమున శని ఉన్ననూ, హస్తలో చంద్రుడు, మృగశిరా అశ్వినులలో కుజుడున్ననూ, అనూరాధలో బుధుడున్నను పుష్యమిలో బృహస్పతి యున్ననూ, రేవతిలో శుక్రుడున్ననూ, శని వారమున రోహిణీ నక్షత్రము వచ్చినచో ఇవియన్నియూ సిద్ధయోగములు అనబడును. అది మంగళవారములలో నందా, శుక్ర సోమవారములలో భద్రా, బుధవారములలో జయా, గురు వారము రిక్త, శనివారము పూర్ణఉన్నచో శుభప్రదములు, శుక్ర వారమున నందాతిథి, బుధ వారమున భద్రా, మంగళవారమున జయ, శని వారమున రిక్త, గురువారమున పూర్ణాయున్నచో సిద్ధ యోగములందురు. ఏకాదశి తిథి సోమవారము, ద్వాదశి ఆదివారము గురువారము షష్ఠి, బుధవారము తృతీయ, శుక్ర వారము అష్టమి, శనివారము నవమి, మంగళవారము పంచమి. ఇవి దగ్ధయోగములు అనబడును. ఆదివారము భరణీ నక్షత్రము, సోమవారము చిత్తా నక్షత్రము, మంగళవారము ఉత్తరాషాఢ, బుధ వారము శ్రవణము, గురువారము ఉత్తర ఫల్గుణి, శుక్రవారము జ్యేష్ఠా, శనివారము రేవతి ఉన్నపుడు గ్రహోదయము జరిగినచో నక్షత్రనాశమును కలిగించును. విశాఖ నుండి నాలుగు వర్గములు ఆదివారము నుండి వరుసగా ఏర్పడినచో అదే వరుసలో ఉత్పాత, మృత్యు, కాణ, సిద్ధి యోగములు అనబడును. తిధివారములు కలిసినపుడు ఏర్పడిన యోగము శుభప్రదము కాదు. వార నక్షత్రముల కలయిక వలన ఏర్పడిన యోగములు ఇతర దేశములలో శుభప్రదములు. ఘోరా, అష్టాక్షీ, మహోదరీ, మందా, మందాకినీ, మిశ్రా, రాక్షసీ అను యోగములు ఆదివారాది వారములలో వరుసగా ఉండును. శూద్ర, తస్కర, వైశ్య, బ్రాహ్మణ, క్షత్త్రియ, గోవులకు ఇంకా చెప్పువాటికి అన్నిటికి వరుసగా ఘోరాది యోగములు సుఖప్రదములు. పూర్వాహ్ణమున రాజులను, మధ్యాహ్నమున బ్రాహ్మణులను, అపరాహ్ణమున వైశ్యులను, ప్రదోషకాలమున శూద్రులను, రాత్రి పిశాచములను, అపరరాత్రమున రాక్షసులను, నాట్యకారులను, ఉషఃకాలమున గోపాలురను, సంధ్య కాలమున బ్రహ్మచారులను సూర్య సంక్రమణము ఏర్పడినచో నశింపచేయును. మేష సంక్రమణము పగలు వచ్చినచో అనర్ధములను కలహములను కలిగించును. రాత్రివచ్చినచో సుభిక్షము, సంధ్యాకాలమున వృష్టినాశము కలుగును, సింహము, శార్దూలము, వరాహము, ఖరము, కుంజరము, మహిషము, అశ్వము, కంచరగాడిద, వృషభము ఇవి పాదాయుధములు, కరణములు వాహనములుగా ఉండును. భుశుడి గద, ఖడ్గము, దండము, ధనుస్సు, తోమరము. కుంతము, పాశము, అంకుశము, అస్త్రములు, బాణములు వీటిని చేతులలో సూర్యుడు ధరించును. అన్నము పాయసము, భైక్ష్యము, పాలు, పెరుగు, విష్టాన్నము గుడము, తేనె, నెయ్యి, శర్కర, హవిస్సు ఇవి ఆహారము. సూర్యుడు చరరాశిలో ఉండగా పక్షులు వైశ్యులు బవకరణమున బావమున సూర్యుడున్నచో కాలవమున శకునిలో సూర్యుడు ఉన్నచో, కింస్తుఘ్నమున చోరులలో ఉన్నను, చతుః పాదమున, తలమున, నాగమున పరున్నచో క్రాంతిని చేయును.
ధర్మ, ఆయుష్య వృద్ధులలో వరుసగా శ్రేష్ఠము, నష్టము, ఫలము అనునవి ఫలము లుగా నుండును. సూర్యుని ఆయుధములు, వాహనములు, ఆహారములు ఎటు వంటివో నిద్రించుట, కూర్చొనుట, నిలబడుట ఎవరికి అలవాట్లుగా ఉండునో అటువంటి లోకములు క్షేమమును పొందగలవు. రోహిణి నుండి నాలుగు నక్షత్రములు అంధకము, మందము, మధ్యము సులోచనము అను సంజ్ఞలను పోలియున్నవి. ఈ నాలుగు పాటీయములుగా పరిగణించవలయును. స్థిరరాశులలో సూర్య సంక్రాంతి ఏర్పడినచో విష్ణు పదమందురు. ద్వి స్వభావ రాశులలో సంక్రమణము జరిగినచో షడశీతిముఖ యందురు. తుల కుంభ మేషములలో సూర్య సంక్రమణము ఏర్పడినచో విషువత్ అందురు. దక్షిణాయనమున స్థిరరాశులలో ఏర్పడినపుడు మొదటివి, కర్కాటక కన్య మిథున రాశులలో ఏర్పడినపుడు తరువాత చెప్పినవి ఏర్పడును. విషువత్తులో పుణ్యనాడులు పదునాఱని చెప్పబడినవి. సంధ్యాకాలము నాడీత్రయ పరిమితము. సూర్యబింబము ఉదయించుట, ఊర్ధ్వగతి మిగిలిన నాడులలో జరుగును. దినమున పూర్వాహ్ణ పరాహ్ణములలో తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తర దిశలలో జరిగినచో పుణ్యమగును. ఎటువంటి చంద్రునితో భానుసంక్రాంతి ఏర్పడునో అట్టి ఫలము కలుగును. ఆ రాశిలో చంద్రునిమంచి చెడులవలన కలుగు ఫలమునే మానవుడు పొందును. సంక్రాంతి తరువాత సూర్యుడు ఎన్ని అంశల భుక్తుల తరువాత సూర్యుని అయన సంక్రాంతి కలుగునో అదే ఆరాశి సంక్రమణము వలన ఏర్పడును. సంక్రాంతి గ్రహము, నక్షత్రము కాని జన్మలో, రెండు పార్శ్వములలో ఉన్నచో వ్రతవివాహాదులలో ఆ క్రమముచే ఆ రెండు ఇష్టములు కావు, నువ్వుల మీద చక్రమును లిఖించవలయును. మూడు త్రిశూలములను మూడు కోణములుగా లిఖించి వాటిపై బంగారమునుంచి దోషనివృత్తి కొరకు దానమును చేయవలయును. తారాబలముచే చంద్రుడు బలీయుడగును. చంద్రుని వలన సూర్యుడు బలీయుడగును. సంక్రమణము జరుగు సూర్యుడు బలీయుడు. అట్లే గ్రహములు బలీయములు. శుభుడగు సూర్యుడు జన్మనుండి 3, 11, 10, 6లో 9, 5లలో, శనికంటే భిన్న గ్రహములచే వేధించబడనిచో శుభకరుడు అగును. 3, 11, 6 స్థానములలో కుజుడు శుభుడు. అదియును జన్మవిద్ధ కానపుడు మాత్రమే. 12వ స్థానమున అంకస్థితులతో శని బుధ సూర్యులచే చూడబడనపుడు కుజుడు శుభుడు. జన్మనక్షత్రమునుండి చంద్రుడు శుభుడు 7, 9, 6, 3 స్థానములలో అంత్యాంబు ధర్మస్థానములలో ఉండు గ్రహములచే
విద్దలేనపుడు మాత్రమే. బుధుడు 1, 11, 6, 8 స్థానములలో నుండి జన్మనుండి లిద్ద లేనిచో 4, 3 మోదలగు గజాంతములలో ఉండి చంద్రుడులేని శుభగ్రహ వీక్షణమున్నచో శుభుడగును. జన్మరాశినుండి గురుడు, అస్తగతుడు స్వాయగతుడు కానిచో శుభుడగును. 1, 9, 6, 3 స్థానముల లోనున్న గ్రహము లచే చూడబడినపుడు మాత్రమే. శుక్రుడు జన్మరాశి నుండి 4, 6, 8, 12, 11 ఉన్నచో శుభుడు. 7, 6, 1, 11 స్థానములలో విద్ధ లేనపుడు మాత్రమే.
గ్రహమునకు వేధ ఉన్నచో శుభము నీయజాలడు. కావున గ్రహవేధను చక్కగా పరిశీలించిన తరువాతనే శుభాశుభ ఫలములను చెప్పవలయును. వామ భేదవిధానముచే దుష్ట గ్రహముకూడా శుభమును కలిగించును. సౌమ్య గ్రహములచే చూడబడినచో అనిష్ట ఫలమును కలిగించును. పాప గ్రహములచే చూడబడినచో శుభముల నిచ్చును. తనను తాను చూచుకొనినను, శత్రువుచేత చూడబడిననూ గ్రహములు నిష్ఫలములగును. నీచరాశిలో ఉన్ననూ, తన శత్రు క్షేత్రమున ఉన్ననూ అస్తగతుడైనను శుభాశుభ ఫలముల నీయజాలడు. గ్రహములు విషమ స్థానములలో ఉన్నపుడు ప్రయత్న పూర్వకముగా శాంతిని జరుపవలయును. శుక్ల పక్షమున ద్వితీయ నవ పంచమ స్థానముల లోని చంద్రుడు గ్రహముల వేధ లేకయున్నచో శుభుడు. జన్మతారనుండి వరుసగా ప్రతి తొమ్మిది నక్షత్రములకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, వైధన, మిత్ర, పరమమిత్ర అని తారాబలమును తెలుపు పేర్లు. ఇట్లు ఈ తొమ్మిందింటినే మరల మరల చూడవలయును. జన్మ, విపత్, ప్రత్యక్, నైధన తారలు అనిష్టఫలమును ఒసంగును. ఆయనిష్టము నశించుటకు శానదానము, గుడదానము, లవణదానము, తిలదానము, సువర్ణ దానము వరుసగా ఆయా తారలలో దానము చేయవలయును. కృష్ణ పక్షమున తారలు బలము కలిగియుండును. శుక్ల పక్షమున చంద్రుడు బలవంతుడుగా ఉండును. చంద్రుని ప్రతిరాశిలో ఆ వరుసలోనే ద్వాదశావస్థలు ఉండును. యాత్ర, వివాహాదికార్యములలో ఆయా అవస్థలు తమ పేరులో ఉన్న ఫలములనే ఇచ్చును. షష్ఠ స్థాన వేధ యున్నది, చంద్ర నక్షత్రము దాటినది ఆయా సమయములలోని ఘటికలలో కూడినది, నాలుగుతో కొట్టబడినది 5, 4, 12 అవస్థలు సూర్య భాగము వలన ప్రవాస, నష్ట, మృత, జయ, హాస్యం, రతి, మోసము, శని, భుక్తి, జ్వరము, కంపము, సుస్థితి అని చంద్రుని 12 అవస్థలుండును. పట్ట బంధము, యానము, ఉగ్రకర్మ, సంధి విగ్రహకర్మలు ఆభరణ ధారణము, ధాత్వాకరము, యుద్ధకర్మ ఈ పనులను మేషలగ్నమున చేయుట శుభప్రదము. శుభ కార్యములు, స్థిరమైన కార్యములు, జలకర్మ, గృహకర్మ, కృషివాణిజ్యపశ్వాది కర్మలను దుష్ట లగ్నమున చేయవలయును. కాలవిజ్ఞానము, శిల్పకర్మ భూషణ ధారణము, యుద్ధము, గజకార్యము, వివాహము, అభిషేకాది కర్మలను మిథున లగ్నమున చేయవలయును. వాపీకూపతటాకాది కర్మలను, వాటి బంధనమును, వాటి మోక్షమును, పౌష్టిక కర్మను, లిపి లేఖనమును కర్కాటక లగ్నమున చేయవలయును.
ఇక్షు కర్మ, ధాన్యకర్మ, వాణిజ్యకర్మ, విక్రయకర్మ, వ్యవసాయము, సేవాదికర్మలు స్థిర లగ్నమున చేయవలయును. సాహసకార్యములను, యుద్ధమును, రాజ కార్యములు మొదలగు వాటిని సింహ లగ్నమున చేయవలయును. విద్యాభ్యాసము, శిల్పకర్మ, ఔషధకర్మ, భూషణ ధారణ, చరస్థిర లగ్నములలో చేయవలయును. పౌష్టిక కర్మలు, సర్వశుభ కార్యములు, కన్యాలగ్నమున చేయవలయును. కృషికర్మను, వాణిజ్యకర్మను, యానకర్మ, పశుకర్మ, వివాహము, వ్రతాది కార్యములను తూలాభారా శ్రితమైన కర్మలను తులాలగ్నమున చేయవలయును. సమస్తములగు స్థిర కర్మలను, రాజసేవను, రాజాభిషేకమును, చోరకర్మ, స్థిరములగు ప్రయత్నములను వృశ్చిక లగ్నమున ఆచరించవలయును. వ్రతములను, వివాహమును, ప్రయాణమును, అశ్వగజ కర్మలను, శిలకర్మలను, కళాకర్మలను, చరస్థిర కర్మలను ధనుర్లగ్నమున ఆచరించవలయును. చాప బంధనము, చాప మోక్షమును, అస్త్ర కర్మను కృషికర్మ, గోకర్మ, అశ్వాది కర్మలు, ప్రస్థానము, పశుకర్మ, దాసకర్మలను మకర లగ్నమున చేయవలయును. కృషి, వాణిజ్య, పశు, జల, శిల్ప కలాదికములను, జలపాత, అస్త్ర శస్త్రాది కర్మలను కుంభ లగ్నమున చేయవలయును. వ్రతములను వివాహమును, అభిషేకమును, జల స్థాపనము, సన్నివేశనము, భూషణములను జలపాత్ర, అశ్వ కర్మలను మీన లగ్నమున చేయ వలయును. మేషాది విలగ్నములు శుద్ధములుగా ఉన్నపుడు ఈ కర్మలను ఆచరించుట ప్రసిద్ధి కలదు. క్రూర గ్రహములచే చూడబడినను, ఉగ్ర గ్రహములు ఉన్ననూ క్రూర ఫలితమే కలుగును. వృషభ, మిథున, కర్కాటక, కన్యా, మీన, తులా, ధనుర్లగ్నములు శుభప్రదములు, శుభ నక్షత్రములు శుఖ “గ్రహములు ఉన్నపుడు శుభములు. ఇతర రాశులు పాపరాశులు.
గ్రహ యోగమువలన గ్రహ వీక్షణము వలన రాశి గ్రహోద్భవమును ధరించును. అట్లే ఫలమును ధరించును. గ్రహయోగము, గ్రహవీక్షణములేని రాశి తన స్వభావమును అనుసరించును. రాశి ఆదిలో సంపూర్ణ ఫలమును ఇచ్చును. మధ్యలో మధ్యమ ఫలమును ఇచ్చును. లగ్నాంత్యమున తుచ్ఛఫలము నిచ్చును. అన్ని లగ్నములలో ఇదే విధమగు ఫలము ఉండును. అన్ని విషయములలోను మొదట లగ్నము, తరువాత కర్తకు చంద్రబలమును చూడవలయును. సప్తమ స్థానమున బలయుతులగు గ్రహములు ఉండవలయును. చంద్రబలము ఆధారము, ఇతర గ్రహముల బలము ఆధేయము. ఆధారముచే ఆధేయము ధరించబడును. చంద్రుడు శుభ ప్రదుడైనచో అన్ని గ్రహములు శుభ ఫలములనే ఇచ్చును. చంద్రుడు అశుభ ప్రదుడైనచో ఇతర గ్రహములుకూడా అశుభఫలమునే ఇచ్చును. ఒక్క ధనాధిపుడు మాత్రమే చంద్రుని ఆధారము చేసుకొని ఫలములను ఒసంగుడు. లగ్నముయొక్క అంశలలోనున్న గ్రహములు లగ్నమునుండి వచ్చు ఫలమును ధరించి ఉండును. ధనాతీతము ద్వితీయ ఫలమును ఒసంగును. ఇట్లు అన్ని స్థానములు శేషములైన పిదప ఒకటి లగ్నమును నిర్ణయించ వలయును.
కొద్ది దినములలో సర్వగుణయుతము లగ్నము లభించదు. తక్కువ దోషములు ఎక్కువ గుణములుకల లగ్నము శుభదాయకము. కాలము దోషమువలననే దుష్టమగును. ఆ దోషము చతుర్ముఖ బ్రహ్మకూడా తొలగించజాలడు. అశౌచ గుణములు ఎక్కువగా ఉన్ననూ దోషావహమే అగును. అశౌచగుణములను తెలిపెదను. ఆమరిక్తయగు అష్టమి, షష్ఠీ, ద్వాదశి ప్రతిపత్తు, పరిఘ యొక్క పూర్వార్ధము, వ్యతీపాత్, వైధృతి, ఉభయ సంధ్యలు, ఉపప్లవము, విష్టి, ఋతువు యొక్క ప్రథమ భాగము ఇవి యన్నియూ అశుభ ప్రదములు. ఈ దోషములుకల లగ్నము నిశ్చయించినచో అనిష్టము తప్పదు. ఆదివారము మొదలు శనివారము వరకుకల వారములలో వివాహము చేసినచో వరుసగా స్త్రీ రోగముకలది, పతిప్రియ, దుఃఖముకలది, పుత్రవంతురాలు, భోగములు కలది, పతివ్రత, సుందరములగు కేశములు కలది అగును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ మొదలగు నక్షత్రములు, చైత్రము, కార్తీకము, జ్యేష్ఠము, పుష్య మాసములు హితకరములుకావు. భద్ర, సంక్రమణము, నిద్రా, రాత్రి, సూర్యచంద్ర గ్రహణములు, అట్లే నింద్య నక్షత్రములలో నింద్య వారములలో వివాహము జరిపినచో కులటయగును. పాపభోగములందు అభిరుచి కలది అగును. ఈ దోషముల నివృత్తికి తిలలచే, నెయ్యిచే దూర్వ(గరిక)లచే గాయత్రి మంత్రముతో 800లు హోమమును చేయవలయును. సర్వదోష నివృత్తికి, బంగారమును, గోవులను, తిలలను దానము చేయవలయును. మొదటి నాలుగు నిశలు సమములైనను విడువవలయును. చంద్రుడు బీజరాశి అంశగతుడై లగ్నమును పురుష గ్రహములు చూచుచున్నపుడు, ఉపవీతి అయి, సరితిథిలో నగ్నుడు కాకుండా స్త్రీని కామించవలయును. పుత్రులను కోరు పురుషుడు రేవతి, మూల, అశ్లేష, మఘా నక్షత్రములను వదిలి స్త్రీ సంగమమును చేయవలయును. గర్భము తెలిసిన తరువాత రెండవ నెలలో కాని మూడవనెలలోకాని సీమంతమువలె పుంసవనమును చేయవలయును. నాలుగవ, ఆరవ, ఎనిమిదవ మాసమునకాని మాసాధి పతి బలయుతుడుగా నున్నపుడు, దంపతులకు తారా చంద్ర బలమున్నపుడు శూన్యముకాని పర్వ దివసమున, మంగళ, గురు, ఆదిత్య వారములలో తీక్ష్ణ గ్రహములతో కలిసి యున్న సూర్యుని వదలి చంద్రుడు పురుష నక్షత్రాంశలో ఉన్నపుడు, జన్మలగ్నము నుండి అష్టమ శుద్ధి యున్నపుడు ఇద్దరికి నైధన లగ్నము కానపుడు శుభగ్రహములు లగ్నమున ఉన్నపుడు కాని, శుభ గ్రహముల వీక్షణమున్నప్పుడుకాని, పాపగ్రహములుకాని, పాపగ్రహ దృష్టికాని లేనపుడు శుభ గ్రహములు 3, 4 స్థానములలో కేంద్ర స్థానములలో ఉన్నపుడు 6, 1 స్థానములలో పాప గ్రహములున్నపుడు, చంద్రుడు 12, 7, 6 స్థానములలో లేనపుడు సీమంతము కాని, పుంసవనమునుకాని చేయవలయును. ఒక్క క్రూర గ్రహముకాని 12వ స్థానమున, పుత్ర స్థానమున, అష్టమ స్థానమునకాని ఉన్నచో సీమంతినినికాని, ఆమె గర్భమును కాని నశింపచేయును. పుత్రుడు కలిగిన తరువాత జన్మ ముహూర్తమున కాని, జాతాశౌచము తొలగిన తరువాతకాని శిశువునకు జాతకర్మను ఆచరించవలయును. జాతకర్మకు ముందు పితృదేవతలను పూజించ వలయును. జాతా శౌచము తొలగిన తరువాత ఆయా కులములకు తగిన విధముగా నామకరణమును చేయవలయును. నామము మొదట ప్రశస్తిచెందినదై ఉండవలయును. శుభగ్రహ వీక్షణమున్నపుడు చేయవలయును. దేశకాల విఘ్నములు కలిగి కాలాతిక్రమణమైనచో శుక్రుడు గురువు అస్తగులు కానపుడు, ఉత్తరాయణమున, చర స్థిర మృదు క్షిప్ర నక్షత్రములలో, శుభ వాసరమున, తారాచంద్ర బలము ఉన్నపుడు, శుభలగ్నమున, శుభాంశమున సప్తమశుద్ధి ఉన్నపుడు, నామ కరణమును చేయవలయును. పురుషుడైనచో అరవనెలలో కాని, ఎనిమిదవ నెలలో కాని, స్త్రీ అయినచో అయిదవ నెలలో కాని, ఏడవ నెలలోకాని అన్నప్రాశనమును చేయవలయును. రిక్తతిథిని, దినక్షయమును, నందను, ద్వాదశిని, అష్టమిని వదలి, ఇతర తిథులలో శుభవాసరమున అన్నప్రాశనమును చేయవలయును. చరస్థిర మృదు క్షిప్ర నక్షత్రములలో సప్తమ స్థానమున శుభ గ్రహములు ఉన్నపుడు, ధశమ శుద్ధియుండగా శుభలగ్నమున, శుభాంశమున, పూర్వార్ధమును సౌమ్యగ్రహము చూచుచున్నపుడు లేదా సౌమ్యగ్రహము ఉన్నపుడు, క్రూర గ్రహములు మూడు ఆరు లాభ స్థానములలో, శుభ గ్రహములు కేంద్ర ధర్మస్థానములలో ఉన్నపుడు, చంద్రుడు 12, 6, 7 స్థానములలో ఉండగా అన్నప్రాశనము శుభప్రదము. బాలునికి మూడవ సంవత్సరమునకాని, అయిదవ సంవత్సరమున కాని, తమతమ కులాచారమును అనుసరించి, గృహ్యసూత్ర ప్రకారముగా చౌలకర్మ నాచరించ వలయును. ఉత్తరాయణమున గురు శుక్రులు అస్తమించినపుడు, పర్వరిక్త తిథులు లేనపుడు, శుక్ర గురు బుధ సోమ వారములలో, అశ్విని, పునర్వసు, పుష్యమి, మృగశిర, జ్యేష్ఠా, రేవతి నక్షత్రములలో చేయవలయును. చౌలకర్మలో హస్తనుండి మూడు నక్షత్రములు, శ్రవణము నుండి మూడు నక్షత్రములు శుభప్రదములు, పట్టబంధనముల, చౌలము, అన్నప్రాశనమున, ఉపనయనమున జన్మనక్షత్రము శుభప్రదము. ఇతర కర్మలకు అశుభప్రదము. అష్టశమశుద్ధి యుండ వలయును. శుభలగ్నమున, శుభాంశమున, జన్మలగ్నము నుండి అష్టమ స్థానమున చంద్రుడు లేనపుడు షష్ఠ, అష్టమ, అంత్య స్థానములలో లేనపుడు, శుభగ్రహములు ధన, త్రికోణ, కేంద్ర స్థానములలో నుండగా, ఇతర గ్రహములు మూడు ఆరు స్థానములలో ఉండగా, ఉభయ సంధ్యలలో కాక, అభ్యంగనము చేయక, రాత్రికాక, భోజనమును చేయక, యుద్ధమున, ఉత్కటయోగమున, భూషణములు ధరించియుండగా, ప్రయాణము చేయుచుండగా తొమ్మిదవదినమున కాక రాజులకు క్షౌరకర్మ చేయవలయును. అయిదవయేట అయిదవ దినమున, క్షౌరయోగ్యమగు నక్షత్రమున లేదా శుభోదయమున క్షౌరకర్మ చేయవలయును. నృపాజ్ఞచే, బ్రాహ్మణాజ్ఞచే, యజ్ఞమున, మరణమున, బంధమోక్షణ సమయమున వివాహమున అన్నివారములలో, అన్ని నక్షత్రములలో, అన్ని తిథులలో క్షౌరము చేసుకొనవచ్చును. శుభకార్యములలో మొదట శుభముకొరకు క్షురార్పణమును చేయవలయును. తొమ్మిదవ, ఏడవ, ఐదవ దినములలో తృతీయము బీజనక్షత్రముగా నున్నపుడు శుభవారమున, శుభోదయమున, వితాన ధ్వజతోరణములచే చక్కగా ఇంటిని అలంకరించి, ఆశీర్వాదమును, పుణ్యాంగనలచే పుణ్యకర్మను చేయించవలయును.
వాద్య నృత్యములచే ఈశాన్యదిశకు వెళ్ళి అచట తీక్ష్ణమైన ఉపకరణముచే మట్టిని తీసుకొని మరలవచ్చి, మృణ్మయ పాత్రలోకాని, వెదురు పాత్రలోకాని ఆ మట్టిని నింపవలయును. అనేక బీజములతో కలిసియున్న నీటిని పుష్పాదులచే అలంకరింపచేసి, చల్లవలయునను. గర్భాధానమున నుండికాని, పుట్టుకనుండికాని అష్టమ వర్షమున బ్రాహ్మణులకు, రాజులకు పదకొండవయేట, వైశ్యులకు పన్నెండవయేట మౌంజీ బంధనమును (ఉపనయనమును) చేయవలయును. పుట్టుకనుండి అయిదవయేట, వేదశాస్త్ర విశారదుడు అగువాడు, ఉపవీతుడై, కాంతిమంతుడై ఉపనయనమును చేయ వలయును. బాలునికి శుక్రుడు జీవుడు బలహీనుడైనను శుభప్రదులే. చెప్పబడిన సంవత్సరములోనే ఉపనయనమును చేయవలయును. చెప్పబడనపుడు చేయరాదు. గురువు, శుక్రుడు కనపడుచున్నపుడు, ఉత్తరాయణ కాలమున చేయవలయును. వేదములకు గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు అధిపతులు. ఇతరులకు శరత్, గ్రీష్మ వసంత ఋతువులలో చేయవచ్చును. బ్రాహ్మణులకు మాత్రము వ్యుత్ర్కమముతో మాఘాది పంచకమున చేయుట సాధారణ నియమము. స్వకులాచార ధర్మములను తెలిసినవాడు మాఘమునకాని, ఫాల్గుణ మాసమునకాని, విధులను తెలిసినవాడు, ధనవంతుడు చైత్ర మాసమున, వేదవేదాంగ పారగుడు ధనవంతుడు వైశాఖ మాసమున, వేదశాస్త్ర విశారదుడు, ఉపనీతుడు, బాలాధ్యుడు జ్యేష్ఠమాసమున, విధులను బాగుగా తెలిసినవాడు శుద్ధ ద్వితీయ, తృతీయ, పంచమీ, త్రయోదశి, దశమీ, సప్తమీ తిథులు శుభప్రదములు. ఉపనయనమునకు ఏకాదశి, షష్ఠీ, ద్వాదశీ శుభప్రదములు. ఇతర తిథులు నిందితములు. హస్తనుండి మూడు నక్షత్రములు, రేవతి, పుష్యమి, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తర, శ్రవణము నుండి మూడు నక్షత్రములు, అశ్వని, అనూరాధ, మృగశిర, పుబ్బ, నక్షత్రములు ఉపనయనమునకు శుభప్రదములు. జన్మ నక్షత్రమునుండి పదియవనక్షత్రము కర్మ, పదునారవ నక్షత్రము సంఘాతము, పదునెనిమిదవ నక్షత్రము సముదయము, ఇరువది మూడవ నక్షత్రము వినాశనము, ఇరువదియైదవ నక్షత్రము మానసము. ఈ నక్షత్రములలో శుభ కార్యములను చేయరాదు. గురు బుధ శుక్ర సోమ ఆదివారములు ప్రశస్తములు. ఉపనయనమునకు మధ్యనున్న వారములు శ్రేష్ఠములు. ఇతరములు నిందితములు, దినమును మూడు భాగములుగా విభజించి, వాటిలో మొదటి భాగమున దైవకర్మను, రెండవ భాగమున మానవకర్మను, తృతీయ భాగమున పితృకర్మను చేయవలయును. స్వనీచ స్థానమున కాని, నీచాంశలోకాని, తన శత్రురాశిలోకాని, ఆయంశలోకాని గురు కుజులు శాఖేశుడున్నచో వటువు కలాహీనుడు శీలవర్జితుడు అగును. తనకు శత్రు గృహముకాని, ఆంశలోకాని గురుడు శుక్రుడు శాఖేశులలో ఎవరున్ననూ ఉపనీతుడు మహాపాతకములను చేయువాడగును. స్వోచ్ఛ స్థానమున ఉన్నపుడు, ఆ అంశలోను, స్వరాశిలో, స్వరాశిగత గణములో గురు శుక్రులున్ననూ, కేంద్ర త్రికోణములందు గురు శుక్రులున్ననూ మిక్కిలి ధనవంతుడు, వేద వేదాంగపారగుడు అగును. గురువు పరమోచ్చలో ఉన్నపుడు, శాఖేశుడు న్ననూ, శుక్రుడున్ననూ, సప్తమ శుద్ధియున్నచో ఉపనీతుడు వేదశాస్త్ర విశారదుడగును. గురువు, శుక్రుడు, శాఖేశుడు స్వోచ్ఛలోకాని, మిత్ర గృహములోకాని, మిత్రునికి ఉచ్చస్థానమునకాని, ఉచ్చాంశలోకాని యున్నపుడు ఉపనయనముచేసినచో, వటువు విద్యాధన సమన్వితుడగును. శాఖాధిపతి వారము, శాఖాధిప బలము, శాఖాధిపతి లగ్నము ఈ మూడు ఉపనయనమున దుర్లభములు. కావున చంద్రుడు వేదాంశలో ఉన్నపుడు ఉపనయనమును చేసినచో విద్యావిశారదుడగును. చంద్రుడు పాపాంశలో కాని, స్వాంశలో కాని ఉన్నచో దరిద్రుడు నిత్యదుఃఖితుడు అగును. శ్రవణాది నక్షత్రములలో, చంద్రుడు కర్కటకాంశలో ఉన్నపుడు, ఉపనయనమును చేసినచో వేదశాస్త్ర సమృద్ధి, ధనధాన్య సమృద్ధి గలవాడగును. శుభలగ్నమున, శుభాంశమున, సప్తమశుద్ధి కలిగియున్న లగ్నమున కాని, సప్తమస్థానమున సౌమ్యగ్రహములున్ననూ, సౌమ్యగ్రహ వీక్షణమున్ననూ ఇష్టులగు గురు సూర్య చంద్రాది గ్రహములు అయిదు బలయుతులై, స్థానాది బలపూర్ణులైనను, నలుగురు శుభ గ్రహములు కలిసియున్ననూ, ఏకవింశ మహాదోషములు లేకుండగా నున్నచో, శుభ గ్రహములున్న రాశులుకాని శుభగ్రహములచే చూడబడిననూ శుభకరములు నవాంశ గతములు అయిన శుభరాశులను అన్నింటిని గ్రహించవచ్చును. కాని కర్కట కాంశము శుభ గ్రహములతో కూడియున్ననూ, శుభ గ్రహములచే చూడబడుచున్ననూ వర్ణింపదగినదే. కావున గో మిధునాంశములు, తులా కన్యాంశములు శుభములు. ఇట్లు లగ్నమును సిద్ధపరిచి నవాంశములను చూచి ఉపనయనమును ఆచరించవలయును. పాపగ్రహములు మూడు, ఆరు, పదకొండు స్థానములలో నుండి ఆరు ఎనిమిది పన్నెండు రాశులలో శుభ గ్రహములు లేకుండగా, చంద్రుడు ఆరు, ఎనిమిది, లగ్న, పన్నెండు స్థానములలో లేకుండగా ఉండుట చాలా ముఖ్యము. చంద్రుడు తన ఉచ్చస్థానములో ఉన్ననూ ఉపనయనము చేయువాని లగ్నములో ఉన్నచో వటువును ధనహీనుని, క్షయరోగిని చేయును. సూర్యుడు కేంద్రస్థానమున యున్నచో వటువుకు పితృనాశము సంభవించును. ఉపనయనమునకు పంచదోషములులేని లగ్నము శుభ ప్రదము. వసంతఋతువులో తప్ప ఉపనయనము కృష్ణ పక్షమునకూడా చేయవచ్చును. కాని అనధ్యయన దినములలో విష్టిలో షష్ఠలో ఉపనయనమును చేయరాదు. త్రయోదశినుండి నాలుగు దినములు సప్తమి నుండి మూడు దినములు, చతుర్థి ఈ తిధులుగల గ్రహమునకు శుభప్రదములని చెప్ప బడినవి.
రాజులకు పాణిగ్రహణమునకన్నా ముందు చేయవలసిన క్షురికాబంధనకర్మను గురించి ఇపుడు చెప్పెదను. వివాహమునకు చెప్పిన మాసములలో శుక్ల పక్షమున, గురువు, శుక్రుడు, కుజుడు, అస్తగతుడు కానపుడు తారాచంద్ర బలమున్నపుడు, ఉపనయనమునకు చెప్పబడిన తిథులలో, మంగళవారముతప్ప ఇతర వారములలో, కర్తకు నవాంశగానపుడు, అష్టమోదయవర్జితమున, అష్టమ శుద్ధి ఉండి, చంద్రుడు లగ్నముననుండి, ఆరు, ఎనిమిది, పన్నెండు స్థానములలో గ్రహములు లేనపుడు శుభ గ్రహములు, ధన, త్రికోణ, కేంద్ర స్థానములలో నుండి, ఇతర గ్రహములు మూడు, ఆరు, పదకొండు స్థానములలో ఉండగా దేవతలను పితృ దేవతలను పూజించి క్షురికా బంధనమును చేయవలయును. దేవతల సమీపమున క్షురికను చక్కగా పూజించవలయును. తరువాత లక్షణములు గల క్షురికను నడుమునకు కట్టవలయును. అయా మార్దాగ్ర విస్తార ప్రమాణముతో ఛేదించవలయును. ఆఛేదఖండములే ఆయములుగాను, ఆ విస్తారము ధ్వజపరిమాణము ఉన్నచో శత్రునాశము, ధూమపరిమాణమున్నచో మరణము, సింహపరిమాణము ఉన్నచో జయము, కుక్క పరిమాణమున్నచో రోగము, వృష పరిమాణమున్నచో ధనాభము, గర్దభ పరిమాణమున్నచో దుఃఖము, గజ పరిమాణమున్నచో మిక్కిలిప్రీతి, ధాంక్ష పరిమాణమున్నచో ధననాశము కలుగును. ఖడ్గిని పుత్రికను తన అంగుళములచే కొలువవలయును. ఎట్లు కొలచిన దానిలో ఏకాదశ పరిమితిని వదలవలయును. మిగిలిన అంగుళిలకు వరుసగా ఇట్లు ఫలముండును. పుత్రలాభము, శత్రువధ, స్త్రీ లాభము, గమనము, శుభము, అర్థహాని, అర్ధవృద్ధి, ప్రీతి, సిద్ధ, జయము, స్తుతి ఇవి ఫలములు. ధ్వజపరిమాణమో, ఉండి నష్టమైనచో మొదటిదాని వలన వ్రణము కలుగును. మధ్యభాగము సింహపరిమాణమో గజపరిమాణమో ఉండి, అంత్యభాగము శ్వానకాక పరిమాణమున్ననూ, చివర భాగము ధూమ్ర గర్ధ భాగమునము వలన వ్రణముండుట శ్రేయోదాయకము కాదు. గురువుగారి ఇంటినుండు స్వగృహమునకు వచ్చిన జితేంద్రియులగు బ్రాహ్మణులకు చిత్ర, ఉత్తర, పునర్వసు, పుష్యమి, రేవతి, శ్రవణము, అనూరాధ, రోహిణి నక్షత్రములందు, సూర్య చంద్ర బుధ గురు శుక్ర వారములందు, లగ్నాంశములందు, ప్రతిపత్తు, పర్వదినమును, రక్తదినమును, అమావాస్యను, అష్టమానుండి దినత్రయమును విడిచి, ఇతర దినములలో సమావర్తనమును ముండనమును చేయవలయును. అన్ని ఆశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమోత్తమము. ఈ గృహస్థాశ్రమమున శీలవతియగు స్త్రీయందు సుఖమును పొందగలడు. శీలవతియగు భార్య సులగ్న వశముననే లభించునుకదా. చతుర్ముఖ బ్రహ్మ చెప్పిన దానిని చక్కగా ఆలోచించి సులగ్నమును చెప్పెదను. ఒక శుభదినమున సర్వలక్షణ సంపన్నుడు సుఖాసీనుడు, జ్ఞానముకలవాడు అగు దైవజ్ఞుని భక్తితో దేవునివలే నమస్కరించి అడుగవలయును. తాంబూల ఫలపుష్పాదులను దోసిట పట్టుకొని వెళ్ళ వలయును. లగ్నమున క్రూర గ్రహమున్నను, సప్తమ స్థానమున కుజుడున్ననూ 8 సంవత్సరములలో పుణ్యదంపతుల మరణము సంభవించును. లగ్నమున చంద్రుడుండి, సప్తమ స్థానమున కుజుడున్నచో భర్తృమరణము ఎనిమిది సంవత్సరములలో సంభవించును. లగ్నమున చంద్రుడుండి, సప్తమ స్థానమున కుజుడున్నచో భర్తృమరణము ఎనిమిది సంవత్సరములలో సంభవించును. లగ్నమునుండి అయిదవ స్థానమున పాపగ్రహముండి, శత్రువుచే చూడబడి నీచగతుడైనచో వధువునకు పుత్రులు మరణింతురు. లేదా వధువు కులట అగును. 3, 5, 7, 11 కర్మ స్థానములలో చంద్రుడుండి గురువుచే చూడబడినచో దంపతులకు సంబంధమును కలిగించును. తులా కర్కటక లగ్నములలో శుక్ర చంద్రులతో కలిసియున్ననూ చూడబడుచున్ననూ అడుగువారికి కన్య లభించును. స్త్రీ లగ్నమున, ద్రేష్మాణ లగ్నమున స్త్రీ అంశమున, నవాంశమున సరి లగ్నమువచ్చి చంద్ర, శుక్రులచే చూడబడినచో అడుగువారికి కన్య లభించును. ఇట్లే స్త్రీకి పుంలగ్నమున, పుం నవాంశమున పృచ్ఛకుని లగ్నము పుంగ్రహములచే చూడబడినపుడు భర్త లభించును. కృష్ణ పక్షమున ప్రశ్న లగ్నమునుండి రాశిలో చంద్రుడు ఉండి పాపగ్రహములచే చూడబడిననూ, రంధ్రమున ఉన్ననూ సంబంధము కుదరదు. ప్రశ్నకాలమున శుభనిమిత్తములు, శుభశకునములు కలిగినచో దంపతులకు శుభము కలుగును. అశుభ నిమిత్తములు అశుభ శకునములు కలిగినచో అశుభము జరుగును. పంచాంగములచే శుద్ధిపొందిన దినమున చంద్రబలము తారాబలము ఉన్నపుడు, వివాహ నక్షత్రోదయ కాలమునకాని కులస్థులచే కన్యావరణమును చేయవలయును. ఆభరణములచే పుష్పతాంబూల ఫలగంద్రాక్షతాదులచే, శుక్లాంబరములచే గీతావాద్యములచే, విఘ్ననివృత్తినిచేయు ఆశీర్వచనములతో, కన్యాగృహమున వరుడు ప్రణవపూర్వకముగా కన్యావరణమును చేయవలయును. అపుడు కన్యతండ్రి ప్రీతిపూర్వకముగా కన్యాదానమును చేయవలయును. కుల శీల వయో రూప ధన విద్యాదులుకల వరునికి రూపవతియగు వరునికంటే చిన్నదగు కన్యను దానము చేయవలయును. గుణాశ్రయురాలు, త్రైలోక్యసుందరి, దివ్యగంధమాల్యం బరవతి, సర్వలక్షణ సంయుక్త, సర్వాభరణ భూషిత, వెలకట్టలేని మణిహారములచే దిగంతములను శోభింపచేయుచున్న, వేలకొలది విలాసినులచే రాత్రింబవళ్లు సేవించబడుచున్న కుమారి అగు శశీదేవిని చక్కగా పూజించి, పూజ ముగియగానే ఇట్లు ప్రార్థించ వలయును. “ఓ దేవేంద్రాణీ! దేవేంద్ర ప్రియభాలనీ! నీకు నమస్కారము. వివాహమున నాకు భాగ్యమును, ఆరోగ్యమును, పుత్రలాభమును ప్రసాదింపుము”. స్త్రీలకు సరియేడులో పాణిగ్రహణము శుభప్రదము. అట్లే పురుషులకు బేసి ఏడులో శుభప్రదము. ఒకవేళ విపరీతముగా జరిగినచో అనగా స్త్రీకి బేసి ఏడులో, పురుషునికి సరియేడులో వివాహమును జరిపినచో అశుభప్రదము. వివాహమునకు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసములు శుభప్రదములు. కార్తీక మార్గ శీర్ష మాసములు మధ్యమములు, ఇతర మాసములు నిందితములు, వశన నక్షత్రములలో సూర్యుడు ఆర్ద్రా నక్షత్రమున ప్రవేశించిన తరువాత వివాహము, దేవతా ప్రతిష్ఠ, ఉపనయనము చేయరాదు.
శుక్రుడు గురువు అస్తగతులైనపుడు, బాలలుగా ఉన్నపుడు, వృద్ధులుగా ఉన్నపుడు, గురువు సింహరాశిలో ఉన్నపుడు, సింహాంశ గతుడైనపుడు కూడా వివాహాదులను చేయరాదు. పశ్చాదుదితుడు, ప్రాగుదితుడు అగు శుక్రుడు ముప్పదిరోజులు శిశువుగా ఉండును. ఇరువది రోజులు వృద్ధుడుగా నుండును. గురువు పదిహేను రోజులు బాలుడుగా, పదిహేను రోజులు వృద్ధుడుగా ఉండును. శ్రీమన్నారాయణుని ఉత్సవము జరుగువరకు శుభ కార్యములను చేయరాదు. వాసుదేవుని ఉత్సవ సమయమున ఇతర శుభముల కొరకు చూడవలసిన అవసరమే లేదు. పుట్టిన మాసమున, జన్మ నక్షత్రమున మొదటి పుత్రునకుకాని, పుత్రికకుకాని వివాహమును చేయరాదు. పెద్దకొడుకు, పెద్దకూతురుకు పరస్పరము జ్యేష్ఠ మాసములో వివాహము జరుపరాదు. అనగా వధూవరులు ఇద్దరూ జ్యేష్ఠులుగా ఉండరాదని భావము. ఇద్దరిలో ఒకరు మాత్రమే జ్యేష్ఠులైనచో మంచిదే. ఇద్దరైన శుభప్రదముకాదు. ఉత్పాతములు ఏర్పడిన తరువాత, గ్రహణము ఏర్పడిన తరువాత ఏడు రోజులు వివాహము జరుపరాదు. మూడు దినములు అత్యంతము అశుభప్రదములు. త్రిద్యుస్పృక్, క్షయదినము, గ్రహము గ్రస్తమైనపుడు, అస్తగుడైనపుడు ముందు మూడు దినములు అత్యంతము అశుభప్రదములు, త్రిద్యుస్పృక్, క్షయదినము, గ్రహము గ్రస్తమైనపుడు, అస్తగుడైనపుడు ముందు మూడు దినములు ఉదయించిన తరువాత మూడు దినములు, గ్రహసంధిలో మూడు దినములు, నిశీధమున ఏడు దినములు, మాసమున చివరి అయిదు దినములు రిక్తతిథిని, అష్టమిని, వ్యతీపాతమును, వైదృతిని, సంపూర్ణముగా పరిఘార్థమును విడువవలయును. రేవతి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాధ, స్వాతి, మృగశిర, హస్త, మఘా, మూల నక్షత్రములలో విద్దలేనపుడు పాణిగ్రహణమును చేయవలయును. వివాహమున దంపతులకు గురు సూర్య బలము అవశ్యకము. గురు సూర్యులు బలహీనులైనచో ప్రయత్నముచే పూజ జరుపవలయును. గోచరము, వేధజము, అష్టవర్గజము, రూపజము అని ఈ బలములు ఉత్తరోత్తరము బలాధిక్యము కలవి. గోచర మార్గమువలన కలుగు బలము స్థూలబలము. మొదట చంద్రబలమును తారాబలమును చూచి, తరువాత పంచాంగ బలమును చూడవలయును. తిథి ఒక గుమము, వారము రెండు గుణములు, నక్షత్రము మూడు రెట్లు, యోగము నాలుగురెట్లు తిథ్యర్ధము అయిదురెట్లు బలము. తరువాత ముహూర్తము బలీయము తరువాత లగ్నము బలాధికము. తరువాత హోర, ద్రేష్మాణము, నవాంశము, ద్వాదశాంశము, త్రింశాంశము, ఇట్లు ఉత్తరోత్తర బలీయములు, కావున వీటినిచక్కగా చూడవలయును. శుభగ్రహములున్న, లేక వీక్షణమున్న అన్నిరాశులు శుభ ప్రదములే. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, మొదలగు అయిదు గ్రహములు ఏ రాశికి శుభులుగా ఉందురో అది శుభ ప్రదమగు లగ్నము. నలుగురు బలీయులున్ననూ శుభ ప్రదమే.
సప్తమ శుద్ధి యుండవలయును. ఏకవింశతి మహాదోషములు లేకుండవలయును. ఓ నారదా! ఏకవింశతి మహాదోషముల నామములను, రూపములను, ఫలములను సంగ్రహముగా చెప్పెదను. వినుము. పంచాంగ శుద్ధి లేకపోవుట మొదటి దోషము. ఉదయాస్త శుద్ధిహాని రెండవ దోషము. సూర్యసంక్రమణము మూడవ దోషము. పాప షడ్వర్గము, షష్ఠ భృగువు, అష్టమ కుజుడు, గండాంతము, కర్తరీ, రిష్ఫము, షష్ఠ అష్టమ స్థానగత చంద్రుడు, దంపతులకు అష్టమ లగ్నము, విషఘటీ, దుర్ముహూర్తము, వార దోషము, ఖర్జూరికము సమాంఘ్రిభం, గ్రహణము, ఉత్పాతము, క్రూర గ్రహవేధగల నక్షత్రము, క్రూర గ్రహ సంయుతము, కునవాంశ, మహాపాతము, వైదృతి అనునవి. ఇరువది యొకటి మహాదోషములు. తిథి వార నక్షత్ర యోగకరణములను పంచాంగములు అందురు. ఈ అయిదింటి శుద్ధి పంచాంగ శుద్ధి అనబడును. పంచాంగ దోషములున్న లగ్నము నిరర్ధకము. విషము కలిసిన పాలను వదిలినట్లు పంచెష్టిక లగ్నమును కూడా వదలవలయును. లగ్నము కాని లగ్నాంశముకాని ఆయా అధిపతులచే చూడబడిననూ, కూడియున్ననూ, పరస్పరాధిపతులతో చూడబడిననూ, కూడియున్ననూ, శుభగ్రహముచే కాని, మిత్రగ్రహముచేకొని చూడబడిననూ, కూడియున్ననూ వరునికి మృతి సంభవించును. ఇట్లే ఆయా అధిపతులచే సప్తమ స్థానము కాని, సప్తమాంశలుకాని, ఉదయాంశలు కాని చూడబడిననూ కూడియున్ననూ, వారిద్దరూ కలిసి లేకున్ననూ చూపులేకున్ననూ వధువునకు మరణము సంభవించును. వివాహాది శుభ కార్యములలో సూర్య సంక్రమణమునకు మొదటి పదునారు నాడికలను, తరువాతి పదునారు నాడికలను విడువవలయును. వివాహ, స్థాపనాది శుభ కార్యములలో షడ్వర్గము శుభప్రదము శ్రేష్ఠము. లగ్నము నుండి ఆరవ స్థానమున శుక్రుడున్నచో భృగు షష్ఠ దోషమని పేరు. శుక్రుడు ఆరవ స్థానమున నుండి ఉచ్చగతుడైనను, శుభగ్రహములచే కలిసియున్ననూ ఆ లగ్నమును వదిలిపెట్ట వలయును. లగ్నము నుండి అష్టమ స్థానమున నున్న కుజుడున్నచో కుజాపలుమమందురు. ఇది మహాదోషము. అష్టమస్థానమున ఉన్న కుజుడు ఉచ్చగతుడై, మూడు శుభగ్రహములచే కూడియున్నచో ఆ లగ్నమును విడువవలసిన పనిలేదు. పూర్ణ, నంద అను తిథుల సంధి నాడీద్వయమున్నచో యాత్ర, వివాహ, ఉపనయనాదులకు గండాంత దోషమనబడును. ఈ దోషము మృత్యు ప్రదము, కర్కాటక సింహములకు, తులా ధనువులకు, మీన మేషములకు ఘటికార్ధము అంతరాల కాలము గండాంతము అనబడును. ఇది కూడా మృతి ప్రదమే. ఆశ్లేషా జ్యేష్ఠా రేవతులలో షోడశాంశాధిపతులు, నక్షత్ర సంధులు, ఆ నక్షత్రములకు మొదటి నక్షత్రములు మొదటి పాదములు కూడా గండాంతము లనబడును. మూడు సంధులు చాలా ఉగ్రములు. ఈ మూడు గండాంతములు అనబడును. ఇవి మూడు విధములుగా నుండును. పాప గ్రహములు లగ్నాభి ముఖములైనను, ఋజు గతులు కలవైననూ, వక్ర గతులు కలవైననూ కర్తరి అందురు. ఈ కర్తరి దంపతుల కంఠమును ఖండించును. కర్తరీ యోగదుష్టమగు లగ్నమును విడిచిపెట్టవలయును. సౌమ్యగ్రహములచే కూడి ఉన్ననూ, సర్వగుణ సమన్వితమైననూ షష్ఠ, అష్టమ, రిష్పస్థానములలో చంద్రుడు ఉన్నచో దానిని లగ్న దోష మందురు. గురుడు కాని శుక్రుడుకాని ఉన్న లగ్నమును ప్రయత్నముచే వదలవలయును. ఉచ్చగతుడైననూ, నీచగతుడైననూ మిత్రగ్రహము శత్రురాశిలో ఉన్నచో అన్ని గుణములు కలదైనను ఆ లగ్నము దంపతులకు మరణ ప్రదము. చంద్రుడు ఇతర గ్రహములచే కలిసి ఉన్నచో సంగ్రహదోషమందురు. ఈ సంగ్రహ దోషమున్న లగ్నమున వివాహమును చేయరాదు. చంద్రుడు సూర్యునితో కలిసి ఉన్నచో దారిద్య్రము కలుగును. కుజునిచే కలిసి ఉన్నచో మరణము సంభవించును. బుధునితో కలిసి యున్నచో వ్యాధి కలుగును. గురువుచే కలిసి ఉన్నచో నిస్సంతానము, దౌర్భాగ్యము కలుగును. శుక్రునిచే కలిసియున్నచో సపత్నీపదము. అంగారకునిచే కలిసియున్నచో సన్యాసము, రాహువుచే కలిసి ఉన్నచో మూలనాశము, కేతువుతో చంద్రుడు కలిసియున్నచో నిత్య కష్టము, దారిద్య్రము కలుగును. చంద్రుడు పాప గ్రహములతో కలిసియున్నచో దంపతులకు మరణము సంభవించును. శుభగ్రహములచే చంద్రుడు కలిసియుండి ఉచ్చరాశిలో కాని మిత్రరాశిలో కాని ఉన్నచో లగ్నము దోషాయన మైననూ దంపతులకు శ్రేయోదాయక మగును. చంద్రుడు స్వోచ్చగతుడైనను, తన నక్షత్రమున నున్ననూ, మిత్ర గ్రహ క్షేత్రములలో ఉన్ననూ పాప గ్రహములతో కూడి యున్నచో దంపతులకు మరణము కలిగించును. దంపతులకు అష్టమలగ్నము, అష్టమ రాశి అయిననూ చంద్రుడు ఆ లగ్నమున ఉన్నచో దంపతులకు మృతిని కలిగించును. ఆ రాశి శుభ గ్రహములు కలదైననూ, లగ్నము శుభ గ్రహయుతమైనను ఆ లగ్నమును, లగ్నాంశమును, లగ్నాంశాధిపతి కలదానిని ప్రయత్నించి విడువవలయును. దంపతులకు ద్వాదశలగ్నమై, లగ్నతమైన రాశియైనచో దంపతులకు అర్థహాని కలుగును. కావున ఆ లగ్నాంశాధిపతిని విడిచిపెట్టవలయును. జన్మరాశ్యుదయము, జన్మలగ్నోదయము శుభ ప్రదము. ఆ రెంటికి వృద్ధి స్థానము మిక్కిలి శుభ ప్రదము. 1, 5, 3, 2, 1, 3, 3, 5, 3, 1, 7, 3, 1, 3, 1, 2, 2, 3, 3, శూన్యము, 3, 9, 1, 1, 2, 1, 3, 4, 1, ఇవి పదునాలుగు స్థానములు శూన్యము, 1, 4, 1, 6, 27, 4, 2, శూన్యము, 3, శూన్యము, 1, పూర్ణచంద్రుడు, గతచంద్రుడు, తర్కచంద్రులు, వేదపక్షములు, ఖరామములు అని అశ్వని మొదలగు నక్షత్రముల కుండును. వీటి తరువాత నుండు నాలుగు ఘటికలు విషఘటిక లనబడును. వివాహాది శుభ కార్యములలో విషనాడులను విడువవలయును. ఆదివారము మొదలగు వారములలో నిందించబడిన ముహూర్తములను ఎన్ని గుణములు కలవైనను వివాహాదులలో వదలవలయును. భాస్కరాది వారములలో ఉండు వారదోషములను కూడా సర్వగుణోపేతములైనను శుభకార్యములలో వదలవలయును.
ఏకార్లలాంఘ్రి తుల్యమగు లగ్నమును విడువవలయును. ఇట్టి లగ్నము శుక్ర బృహస్పతులచే కూడియున్న దైనను విషము కలిసిన పాలను విడిచినట్లు విడువవలయును. గ్రహణ నక్షత్రమును, ఉత్పాత నక్షత్రమును, మూడు ఋతువులను శుభకార్యములలో విడువవలయును. శశిభుక్తి తరువాత మిగిలిన నక్షత్రమును కూడా కాలిన కట్టెను విడిచి నట్లు విడువవలయును. శుభకార్యములందు గ్రహవిద్ధమైన నక్షత్రమును క్రూర గ్రహముల నక్షత్రమును మధ్యబిందువు కలిసిన పంచగవ్యమును విడిచినట్టు విడువవలయును. శుభగ్రహ విద్ధమైన నక్షత్రములో అశుభమైన నక్షత్రపాదమునే విడువవలయును కాని పూర్తి నక్షత్రమును విడువవలసిన అవసరము లేదు. క్రూర గ్రహములచే విద్ధయైనది, క్రూరగ్రహములు కల నక్షత్రము పూర్తిగా అశుభమే యగును. తులా మిధున కన్యాంశలు, ధనూరాశిలోని అంత్యార్ధ సంయుతములు ఈ నవాంశలు శుభప్రదములు. వృషభాంశలు వర్గోత్తమములైనచో అవి కూడా శుభప్రదములే. ఇతర నవాంశలు కునవాంశలు కావున గ్రహించరాదు. కునవాంశక లగ్నము సర్వగుణాన్వితమైనను వదలవలసినదే. మహాపాతము సంభవించిన దినమును శుభకార్యములకు విడువదగియున్నది. ఈ దినము సర్వగుణోపేతమైనను దంపతులకు మృత్యు ప్రదము కావున విడువదగినది. ఇంకను కొన్ని చెప్పని చిన్న చిన్న దోషములు ఉండును. లగ్న సమయమున మెరుపులు ఉరుములు, మంచు కురియుట, సూర్య పరివేషము, ఇంద్రచాపము, లత్తా, ఉపగ్రహపాతము, మాస దగ్ధమను తిథి, దగ్ధలగ్నము, అంధరాశి, బధిర రాశి, పంగురాశి మొదలగునవి కలవు. ఈ దోషముల విషయమున ఇపుడు నియమములను చెప్పెదను. అకాలమున మెరుపులు, ఉరుములు, మంచు కురియుట జరిగినచో శుభకార్యములను చేయరాదు. సకాలమున జరిగినచో దోషము లేదు. కేంద్రస్థానమున బృహస్పతి కాని, శుక్రుడు కాని, బుధుడు కాని ఉన్నచో సమస్త దోషములను నశింపచేయును. అడ్డముగా అయిదు రేఖలు, నిలువుగా అయిదు రేఖలు, కోణములో రెండు రెండు రేఖలు ద్వితీయమగు శంభుకోణమున కృత్తికా నక్షత్రమున చక్రమున ఉంచవలయును. ఈ చక్రమున అభిజిత్తుతో కూడిన నక్షత్రములను ఉంచ వలయును. గ్రహ విధయైన నక్షత్రమును సూర్యాదులు ముందుకాని వెనుకకాని నిత్య నక్షత్రమును తాకినచో దానిని ‘లత్త’ అందురు. అర్క ఆకృతి గుణాద్యంగ బాణాష్ట నవసంఖ్యలుగల నక్షత్రమును హస్తా నక్షత్రము నుండి అశ్లేస, మఘా, రేవతి, చిత్త, అనూరాధ, మృగశిర శ్రవణా నక్షత్రములు సంఖ్యచే నిత్య నక్షత్రమున అశ్వని నుండి పాత నక్షత్రము దుష్ట నక్షత్రము ఇవి వదలదగినవి. సౌరాష్ట్ర సాల్వదేశములలో లత్తిత నక్షత్రమును విడువవలయును. కళింగ వంగ దేశములలో పాతిత నక్షత్రము శుభప్రదము కాదు. బాహ్లిక మరు దేశాదులలో దోషములేదు. మాసదగ్ధములగు తిథులు, దగ్ధలగ్నములు మధ్యదేశమున దుష్టములు. ఇతర దేశములలో దోష ప్రదములు కావు. పంగు, అంధ, బధిర కాణ లగ్నములు, మాసశూన్యములగు రాశులు గౌడ మాలవ దేశములలో వదల దగినవి. ఇతర దేశములలో దుష్టములు కావు. దోషదుష్టమగు కాలమును చతుర్ముఖ బ్రహ్మకూడా సరి చేయజాలడు కావున స్వల్ప దోషములు అధికగుణములు కల లగ్నమును చూడవలయును. కావున ఇట్లు వివాహమునకు శుభ లగ్నమును చక్కగా పరిశీలించి నిర్ణయించవలయును. తరువాత హస్తమాత్రోన్నతముగా హస్త చతుష్టయ విస్తారముగా చతురస్రాకారముగా, నాలుగు చక్కని స్తంభములచే వామ భాగమున సన్నతరుగునట్లుగా మండపము కలదిగా, నాలుగు దిక్కులలో సోపానములు కలదిగా, తూర్పు ఉత్తర దిక్కులలో ప్రవణముగా, అరటి స్తంభములతో హంసశుకాది చిత్రములలో చిత్రించబడి, చిత్రకుంభములు తోరణములు అంకురాదులు కలిగి, శృంగార పుష్పరాశులచే, పలువర్ణములతో అలంకరించబడి, బ్రాహ్మణాశీర్వచనములు, ముత్తయిదువల ఆశీర్వచనములతో సుందరమైనది, వాదిత్ర నృత్య గీతాదులచే హృదయమును ఆనందింపచేయు శుభప్రదమైన, అగ్ని హోత్రము కలిగియున్న కళ్యాణవేదికను వధూవరులు చేరవలయును. అష్టరాశి కూటములు, నక్షత్ర గణములు, రాశులు, రాశీశులు, యోనులు, వర్ణములు, ఋతువులు పుత్ర పౌత్ర ప్రదములు. ఒకేరాశియందు వేరు నక్షత్రములున్న వధూవరులకు పాణి గ్రహణము ఉత్తమము. భిన్నరాశులైనచో మధ్యమము ఒకే నక్షత్రము ఒకే రాశి అయినచో వారికి వివాహము చేయుట ప్రాణహానిని కలిగించును. స్త్రీ నక్షత్రము నుండి మొదటి నవకమున స్త్రీ దూరమైనచో అతినిందితము రెండవ నవకమున మధ్యమము శ్రేష్ఠము. తృతీయ నవకమున నృతో శ్రేష్ఠము. పూర్వఫల్గుణి, పూర్వాభాద్ర, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, భరణి, ఆర్ద్రా నక్షత్రములు మర్త్యగణములని తెలియవలయును. ఇతర నక్షత్రములు అమర్త్య గణములు. శ్రవణము, పునర్వసు, హస్త, స్వాతీ, రేవతీ, అనూరాధ, అశ్వని, పుష్యమి, మృగశిరా నక్షత్రములు దేవగణములు. మఘ, చిత్త, విశాఖ, కృత్తిక, జ్యేష్ఠా నక్షత్రములు, ధనిష్ఠ, శతభిష, మూల, ఆశ్లేష, నక్షత్రములు రాక్షస గణములు.
దంపతుల జన్మ నక్షత్రమొకటే గణములోనిది అయినచో బహుప్రీతి కలుగును. దేవమానవ గణములైనచో మధ్యమము. దేవరాక్షస గణములైనచో దంపతులకు మృతి సంభవించును. దంపతులకు షష్ఠాష్టకములున్నచో మృత్యువు, పంచనవములైనచో సంతాన రాహిత్యము, రెండు పన్నెండు అయినచో దారిద్ర్యము, ఇతరములైనచో పరస్పరము ప్రీతి కలుగును. ఇద్దరి రాశ్యాధిపతులు ఒక్క గ్రహమే అయిననూ, మిత్రగ్రహమైననూ పాణి గ్రహణము శుభప్రదము. రెండు పన్నెండుగా ఉన్ననూ త్రికోణ స్థానమున ఉన్ననూ శుభమే. షష్ఠాష్టకము మాత్రము పనికి రాదు. అశ్వము, గజము, మేషము, సర్పము, సర్పము, మార్జాలము, మేషము, మార్జాలము, మూషకము, గోవు, మహిషము, వ్యాఘ్రము, కాలి, మృగములు, శ్వానము, వానరము, బభ్రు యుగము, వానరము, సింహము, అశ్వము, సింహము, గోవు, గజము, ఇవి అశ్వని మొదలగు నక్షత్రములకు వరుసగా యోనులు. శ్వాస, హరిణములు, బభ్రువు గజము, మేష, వానరములు, సింహ గజములు, గో వ్యాఘ్రములు, మార్థార మూషకములు, మహిషాశ్వములు, శత్రువులు. మీన వృశ్చిక, కర్కటములు, బ్రాహ్మణ జాతి. తరువాతవి క్షత్రియాదులు పురుషుని రాశికి స్త్రీ రాశి తక్కువైనచో శుభప్రదము. అశ్వినీ నక్షత్రము నుండి వరుసగా లెక్కించినపుడు కన్యా నక్షత్రము నాలుగు మూడు పాదద్వయములైనచో, కృత్తికనుండి, మృగశిరనుండి మూడు నాలుగు అయిదు పర్వలలో నాడీ గణమున చేయవలయును. అట్లు గణన చేసినచో ఏకనాడి అయినచో మృత్యు ప్రదము. పార్శ్వనాడి అయినచో అశుభము కాదు. ప్రాజాపత్యము, బ్రాహ్మము, దైవము, అను వివాహములు ఋషిప్రోక్తములు. ఈ వివాహములను విధించబడిన కాలమున చేయవలయును. ఈ నాలుగు వివాహములు సత్ఫల దాయకములు. గంధర్వ, అసుర, పైశాచ, రాక్షస వివాహము లను ఏ సమయమునందైన జరుపవచ్చును. ఉదయ నక్షత్రమునుండి ఏడవది, చతుర్థము అభిజిల్లగ్నము, గోధూళి లగ్నమున పై రెండు వివాహములు జరిపిన పుత్ర పౌత్రాభివృద్ధి జరుగును. ప్రాచ్యదేశవాసులకు గోధూళి లగ్నము ముఖ్యము. కళింగ దేశస్థులకు మాత్రము పనికి రాదు. అభిజిల్లగ్నము అన్ని దేశములలోని వారికి ముఖ్యము. సర్వదోష నివారకము. సూర్యుడు మధ్యందిన గతుడైనపుడు అభిజిన్ముహూర్త మనబడును.
శంకరుడు త్రిపురములను నశింపచేసినట్లు అభిజిల్లగ్నము అన్ని దోషములను నశింపచేయును. పుత్రుని వివాహమును చేసిన తరువాత ఆరు నెలల వరకు పుత్రికా వివాహమును చేయరాదు. అట్లే పుత్రుని ఉపనయనమును, పుత్రికా వివాహమును ఒకేసారి జరుపరాదు. ఒక శుభకార్యమున ఇంకొక శుభకార్యము జరుపరాదు. ఒకే తండ్రి బిడ్డలకు ఆరు నెలలోపు వివాహము జరిపినచో ఆ ఇద్దరిలో ఒకరు మూడు సంవత్సరములలో భర్తను కోల్పోవును. ప్రతి వివాహము అనగా తన కూతురును ఒకరి కొడుకుకు ఇచ్చి, అతని కూతురును తన కొడుకుకు చేసుకొనుట పనికిరాదు. అట్లే ఒకే వరునికి ఇద్దరు పుత్రికలనిచ్చి వివాహముచేయరాదు. ఒకని కొడుకులకు ఒకని బిడ్డలను (ఇద్దరికి ఇద్దరిని) ఇచ్చి వివాహము చేయరాదు. అట్లే ఒకసారి ఇద్దరికి ఉపనయనము చేయరాదు. శిశువు పగలు పుట్టినచో తండ్రిని, రాత్రి పుట్టినచో తల్లిని, సంధ్యాకాలమున పుట్టినచో తనను చంపుకొనును. గండములకు అన్యధా భావము లేదు. మూలా నక్షత్రమున పుట్టిన పుత్రుడు కాని, పుత్రిక కాని మామను కన్య దానమును చేసిన వానినిచంపును. మూలా నక్షత్రమున చివరి పాదమున పుట్టినచో ఈ హాని జరుగదు. ఆశ్లేషా మొదటి పాదమున పుట్టినవాడు. జ్యేష్ఠాంత్య పాదమున పుట్టిన వాడు కూడా ఇదే చేయును. పుత్రిక మాత్రము చేయదు. పూర్వాషాఢా మూలా నక్షత్రములలో పుట్టిన బాలిక తల్లిదండ్రులకు హాని కలిగించదు. జ్యేష్ఠా నక్షత్రమున పుట్టిన బాలిక భర్త అన్నను చంపును. విశాఖ నక్షత్రమున పుట్టినది భర్త తమ్ముని చంపును. వివాహదినమునుండి అరవ, ఎనిమిదవ దినమున వధూ ప్రవేశమును జరిపిన సకల సంపదలు కలుగును. ఏడవ పదవదినమున కూడా జరుప వచ్చును. రెండు సంవత్సరముల జన్మమును, నక్షత్ర లగ్న దివసములను వదిలి, అతి శుక్రుడు ఉన్ననూ వివాహయాత్ర శుభప్రదము. ఉత్తరాయణమున దేవతాప్రతిష్ఠ సంపత్ప్రదము. గురు శుక్రుడు అస్తగులు కానపుడు దేవదైత్యప్రతిష్ఠ ఉత్తమము. చైత్ర భిన్న మాసములలో, మాఘాది పంచమాసములలో శుక్ల కృష్ణ పక్షములలో మొదటి ఎనిమిది తిథులలో చేసినచో శుభప్రదము. యే తిథికి యే దేవత అధిపతియో ఆ తిథిలో ఆ దేవతా ప్రతిష్ఠ జరుప వలయును. ద్వితీయనుండి రెండు పంచమి నుండి మూడు వరుసగా దశమి నుండి నాలుగు, విశేషించి పూర్ణిమనాడు, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢా, ఉత్తరాభాద్ర, పునర్వసు, మృగశిర, రేవతి, హస్త, చిత్త, స్వాతి, గురు నక్షత్రములలో, అశ్విని, రోహిణి, శతభిష, శ్రవణం, అనూరాధా నక్షత్రములలో, మంగళవారము తప్ప మిగిలిన వారములలో కర్తకు సూర్యుడు బలయుతుడుగా ఉన్నపుడు, చంద్ర తారా బలముండగా శుభదినమున పూర్వాహ్ణమున, శుభలగ్నమున, శుభాంశలో, కర్తకు నిధనస్థాన గత గ్రహోదయము కానపుడు అన్ని రాశులు శుభప్రదములే. కాని శుభ గ్రహములు కలవి గాని శుభగ్రహ వీక్షణము కాని ఉండవలయును. పంచాష్టకమున శుభ లగ్నమున, సప్తమ శుద్ధియున్నపుడు శుభము. చంద్ర సూర్య కుజ రాహు కేతు శనులు లగ్నమున నున్నచో మృత్యుప్రదులు. ఇతరులున్నచో ధన ధాన్య సుఖములను ప్రసాదించును. ద్వితీయ స్థానమున పాపగ్రహములు ఉన్నచో అనిష్టమును కలిగించును. సౌమ్య గ్రహములు చంద్రుడు ఉన్నచో సంపదలు ఇచ్చును. మూడవ స్థానమున అన్ని గ్రహములున్నచో పుత్ర పౌత్ర సుఖములను ఇచ్చును. చతుర్ధమున సౌమ్య గ్రహములు సుఖమును, క్రూర గ్రహములు దుఃఖము నొసంగును. పంచమమున క్రూరులు హానిని, శుభులు పుత్ర సుఖములను, షష్ఠమున శుభులు శత్రువులను పాపులు శత్రు నాశమును, సప్తమమున పాపులు వ్యాధిని, సౌమ్యులు శుభమును, అష్టమమున అన్ని గ్రహములు మృత్యువును, నవమమున పాపులు మృత్యువును, సౌమ్యులు శుభమును, దశమమున పాపులు దుఃఖమును, సౌమ్యులు చంద్రుడు సుఖమును, కీర్తిని, ఏకాదశమున అన్ని గ్రహములు బహు లాభమును, ద్వాదశమున వ్యయమును కలిగించును. అర్థహీనమైనచో కర్తను, మంత్రహీనమైనచో ఋత్విజులను, లక్షణహీనులు అయినచో స్త్రీని చంపును. కావున దేవతా ప్రతిష్ఠవంటి శత్రువు లేడు. లగ్నమున గుణములు అధికములు, దోషములు స్వల్పములున్నచో శుభప్రదము.
అట్టి లగ్నమున దేవతాప్రతిష్ఠ కర్తకు అభీష్టములను ప్రసాదించును. దేవాలయమును, గ్రామమును గృహమును మొదలగువాటిని నిర్మించుటకు ముందుగా భూమిని గంధవర్ణ రసాదులచే పరీక్షించవలయును. విప్రాశీర్వచన పూర్వకముగా మధు పుష్ప ఆమ్ల పిశిత గంధమును తెలుపు ఎరుపు ఆకుపచ్చ నలుపు వర్ణమును వరుసగా మధుర కటుక తిక్త కషాయకర రసములను కలుపుట వలన ఈశాన్య ప్రాక్ ఉత్తర ప్లవముగా ఉన్నచో మానవులకు మిక్కిలి అభివృద్ధిని కలిగించును. ఇతర దిక్కులలో ప్లవముగా (పల్లముగా) ఉన్నచో అత్యంత హానిని కలిగించును. సమముగా అరత్ని మాత్ర ప్రమాణముగా గర్తమును తవ్వి నింపవలయును. అధికముగా ఉన్నచో వృద్ధి తగ్గినచో హాని కలుగునని తెలియ వలయును. అట్లు సాయంకాలము ఆ గర్తమును జలముతో నింపవలయును. మరునాడు ఉదయము జలమున్నచో వృద్ధి, బురదయున్నచో సమఫలము, నీరు పూర్తిగా ఇంకి పోయినచో క్షయము కలుగునని తెలియవలయును. ఇట్లు చక్కగా పరీక్షించి సలక్షణమైన భూమిని నిర్ణయించి, ఆ భూమిలో దిక్కులను తెలియుటకు సమమండలమును లిఖించ వలయును. ద్వాదశాంగుళ పరిమాణముగల శంకును స్థాపించి దిగ్విభాగమును చూడవలయును. ఇట్లు క్షేత్రమును చతురస్రముగా చేసి షడ్వర్గాలచే పరిశోధించి రేఖామార్గమున ప్రాకారమును సుందరముగా నిర్మించవలయును. నాలుగు దిక్కులలో విస్తారమున్ననూ ప్రతి దిక్కులో ఎనిమిది ద్వారములు ఉండవలయును. ఆ ద్వారములకు ప్రదక్షిణ క్రమముగా ఈ ఫలములు ఉండును. హాని, దారిద్య్రము, ధనప్రాప్తి, రాజపూజ, మహాధనము, అతిచౌర్యము, అతిక్రోధము, భీతి అనునవి ఇంద్రుని దిక్కులోని ద్వారములకు ఫలములు. పుత్రహాని, శత్రువృద్ధి, లక్ష్మీప్రాప్తి, ధనాగమము, సౌభాగ్యము, అతిదౌర్భాగ్యము, దుఃఖము శోకము పశ్చిమ దిక్ఫలములు. కళత్రహాని, నిస్సత్త్వము, హాని, ధాన్యాగమము, సంపద్వృద్ధి, మాసభీతి, రోగము ఇవి చంద్ర దిక్ఫలములు. (ఉత్తరదిక్కు) ఇట్లు గృహాదులలో ద్వారములు విస్తారమునకు రెట్టింపు ఔన్నత్యముగా ఉండవలయును. ఇందులో పశ్చిమమున కాని, దక్షిణమున కాని కవాటమును ఉంచవలయును. ప్రాకారములోపల ఎనుబది యొక్క అడుగుల భూమిని ఉంచవలయును. ఆ భూమి మధ్య భాగమున తొమ్మిది అడుగుల భూమి బ్రహ్మస్థానము అనబడును. ఈ బ్రహ్మస్థానము అతినిందితము. ప్రాకారమున ముప్పది రెండంశలుండును. పిశాచాంశమున గృహారంభమును చేసినచో దుఃఖమును, శోకమును భయమును కలిగించును. దిక్కుల విదిక్కుల మధ్యనున్న రేఖలు వాస్తు పురుషుని శిరస్సులుగా నుండును. శిరముల సమూహమున్న బ్రహ్మ భాగములు పిశాచాంశలగును. అట్లే వాస్తు పురుషుని మర్మసంధులను కూడా తెలియవలయును. ఇట్లు మంచిగా ఉన్నను వాస్తుపురుషుని మర్మములు సంధులు ఇష్టప్రదములు కాజాలవు. మాఘ ఫాల్గుణ వైశాఖ, శ్రావణ, కార్తిక మాసములలో గృహ నిర్మాణమును చేసినచో పుత్ర, ఆరోగ్య ధనములుకలుగును. దిగ్భాగములలో వరుసగా అకారాది భాగములందు ఖరము, అశ్వము, సింహము, శ్వాసము, పాంశు, గజము, శశము ఇవి దిగ్వర్గముల యోనులు. తమ వర్గము నుండి అయిదవ వర్గము శత్రు స్థానము ముందు భాగమున సాధ్యవర్గమును స్థాపించవలయును. తరువాత వెనుక భాగమున సాధక వర్గమును ఉంచవలయును. దీనికి విపరీతముగా చేసినచో నాశనము జరుగును. ఋణస్థానము మధ్యమము. ధన స్థానము శుభప్రదము. సాధక నక్షత్రమున సాధనావాసమును ప్రారంభించి సాధనమునకు నాలుగు రెట్లు అధికముగా సాధ్యమును చేసి ఏడింటిచే భాగించగా శేషము సాధకునికి ధనమగును. విస్తారము ఆయామగుణముగా నుండుట గృహస్థాన మగును. కావున ధన, అధన, ఆయ, నక్షత్ర వారాంశలు సంఖ్యా క్రమమున చూడవలయును. ధనాధికము శేషమైనచో గృహము వృద్ధిప్రదము. ఋణాధికము శేషమైనచో శుభప్రదముకాదు. విషమాయము శుభమును, సమయము నిర్ధనమును కలిగించును. మూడవ నక్షత్రమున ధనక్షయము, అయిదవ నక్షత్రమున అధిక క్షయము, ఏడవ నక్షత్రమున ఆత్మక్షయము, కర్తృ నక్షత్రమునుండి జరిగియే తీరును. రెండు పన్నెండు నిర్ధనమును, త్రికోణము సంతాన రాహిత్యమును, 6 - 8 మృత్యువును ప్రసాదించును. ఇతర రాశులు శుభప్రదములు. ఆది మంగళ వారాంశలు అగ్ని భయమును కలిగించును. ఇతర గ్రహాంశలు వారాంశలు సర్వకామార్ధ సిద్ధి ప్రదములు. శ్రావణాది మాసములలో మూడు మూడులలో యథాక్రమముగా పూర్వాధికము శిరస్సు వామ పార్శ్వేశునికి అప్రదక్షిణముగా చరనామముచే వాస్తు పురుషుడు మహోదరునిగా చరించుచుండును. వాస్తు పురుషుడు ఏ దిఙ్ముఖుడుగా ఉండునో గృహమును ఆ దిఙ్ముఖముగా నిర్మించవలయును. ప్రతికూల దిఙ్ముఖముగా నిర్మించినచో రోగ శోక భయములను కలిగించును. వాస్తు పురుషుడు బలీయుడైనచో ఈ దోషములేదు. ఈటికను స్వర్ణ రేణువును, ధాన్య శైవల సంయుతముగా గృహ మధ్యమమున హస్తమాత్ర ప్రమాణముగల గర్తమున వ్యాసము కొరకు ఉంచవలయును. వస్త్వాయామ దలమును నాభియందురు. దానికంటే అంగుళ త్రయాధిక భాగము కుక్షి అగును. ఆ కుక్షిలో శంకునుంచవలయును. ఇట్లు చేసినచో పుత్రపౌత్ర వృద్ధి కలుగును. 24, 23, 16, 12 అంగుళములు కుక్షి ఉండుట బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యముల ప్రమాణము. శంకున స్వర్ణవస్త్రాదులచే అలంకరించి, ఖదిర, అర్జున, శాలవృక్షముల నుండి చేసిన దానిని, యుగ యంత్రమును సిద్ధముచేసి, రక్తచందన, పాలాశ, రక్తశాల, విశాలములనుండి పుట్టిన దానిని శంకువును మూడు భాగములుగా విభజించి, మొదటి భాగమును చతురస్రాకారముగా, రెండవ భాగమును అష్టాస్రముగా, తృతీయ భాగమును మన్వస్రముగా నిర్మించవలయును. మృదువుగా మంత్రణముగా ఉండవలయును. ఇట్లు శంకును లక్షణ సంయుక్తముగా సిద్ధముచేసి శుభదినమున షడ్వర్గశుద్ధి సూత్రముచే చుట్టబడిన ధరణీ తలమున మృదు, ధ్రువ, క్షిప్ర, నక్షత్రములలో రిక్త అమావర్ణిత దినమున సూర్య కుజ చర భిన్నమగు లగ్నమున పాపగ్రహములు అష్టమస్థానమున లేనపుడు, సప్తమ శుద్ధిని చూచి, శుభలగ్నమున, శుభాంశమున శుభగ్రహ వీక్షణము ఉన్నపుడు, లేదా శుభగ్రహములతో కూడియున్నపుడు శంకు న్యాసమును చేయవలయును. పుణ్యాహ ఘోషములతో, వాదిత్రములతో, పవిత్రులగు పుణ్యాంగనలతో స్వతికేంద్ర త్రికోణ స్థానములందు శుభగ్రహములుండగా 3, 6, 11 స్థానములలో ఇతర గ్రహములు ఉండగా లగ్నాంతాష్టారి చంద్రునిచే, దైవజ్ఞులను అర్చించి, ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశ్శాల, సప్తశాల, దశశాలలుగా నిర్మించవలయును. ఈ శాలలు మరల షడ్విధములు. ధ్రువము, ధాన్యము, జయము, నందము, ఖరము, కాంతము, మనోరమము, సుముఖము, దుర్ముఖము, క్రూరము, శత్రువు, స్వర్ణప్రదము, క్షయము. ఆక్రందము, విపులము, విజయము అని పదునారు పేర్లు గృహముల కుండును. గృహముల విస్తార భేదములచే ఈ పేర్లతో లెక్కించ వలయును. గురువుకు క్రిందుగా లఘువును ఉంచవలయును. ముందు ఊర్ధ్వముగా నుంచ వలయును. తరువాత గురువులతో పూరించవలయును. లఘు పదమున అళిందమును చేయ వలయును. గృహద్వారము నుండి ప్రదక్షిణముగా పూర్వాదులందున్న అళిందములందు షోడశ గృహభేదము లేర్పడును. తూర్పున స్నానాగారము, ఆగ్నేయమున పాకశాల, పశ్చిమమున భోజనశాల, వాయవ్యమున ధాన్యశాల, దక్షిణమున శయనాగారము, నైఋతిలో శాస్త్రాగారము, ఉత్తరమున దేవాగారము, ఈశాన్యమున క్షీర మందిరము ఉండవలయును. శయ్యా మూత్రాస్త్ర శాలలు భోజనాల యములు ఉండుట శుభావహము. ధాన్య, స్త్రీ భోగ, ధన, శృంగారశాలలు ఈశాన్యాది క్రమముగా నిర్మించుట శుభప్రదము. ఈ శాలలో ఆయాదిక్కులలో ఆంగూశస్త్రములను ఉంచవలయును. ధ్వజము, ధూమ్రము, సింహము, శునకము, సారమేయము ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది పూర్వాది దిక్పాలకులు, జమ్మి, మేడి, మామిడి, వేప, తుహి, విభీతకము, కంటక వృక్షములు, దుగ్ధ వృక్షములు, రాగి, వెలగ చెట్లు ఆగస్తి, సిందువాల వృక్షములు, చింతచెట్లు ఇంట్లో ఉండరాదు. పశ్చిమ దక్షిణములలో పిత్తవాక్ రజోదేహుడుగా నుండును. గృహ పాదములు, గృహ స్తంభములు సమములుగా నుండవలయును. విషమములుగా నుండరాదు. ఎక్కువ ఎత్తు, ఎక్కువవంపుకాక గోడ యథేష్టముగా ఉండవలయును. గృహములమీది గృహములు కూడా ఇట్లే ఉండవలయును.
గృహములు మొదలగు వాటికి గృహ శ్రావము క్రమముగా అష్టవిధములు చెప్ప బడినవి. పాంచాలమానము, వైదేహమానము, కౌరవమానము, కుజనమానము, మాగధ మానము, శూర సేనమానము, గాంధారమానము, అవంతికామానము అని. చతుర్భాగ విస్తారము ఉన్నతముగ ఉన్నది పాంచాలమానమనబడును. ఉత్తరోత్తర వృద్ధిగా నుండు నవి వైదేహాది మానములగును. పాంచాలమానము సర్వసాధారణము. బ్రాహ్మణులకు అవంతిమానము, క్షత్రియులకు గాంధారమానము, వైశ్యులకు కుజనమానము, ఆశ్రయణీయము. బ్రాహ్మణాదులకు యథోత్తరముగా, యథోక్తముగా జలస్త్యాణ్యములను ద్విత్రి భూమిక గృహములకు, ఉష్ట్రకుంజరశాలలకు ధ్వజాయము గజయామములు చెప్పబడినవి. ద్వార శయ్యాభోజనశాలల ఆయామములు ధ్వజసింహ వృష ధ్వజాయామములు విధించబడినవి. నూతన గృహప్రవేశ సమయమున చేయవలసిన వాస్తుపూజా విధానమును చెప్పెదను వినుము. గృహ మధ్యమున బియ్యము మీద ఇరువది ఒకటి అడుగల కొలతతో హస్త మాత్రముగా పూర్వ భాగమున పది ఉత్తర భాగమున పది రేఖను గీయవలయును. అయిదు తరువాత చెప్పబోవు ఇరువది నాలుగు మంది దేవతలను లిఖించవలయును. బాహ్య భాగమున ఈశాన్యకోణము నుండి 32 మంది దేవతలు వీరు. శివుడు, పర్జన్యుడు, జయన్తుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, మృగము, ఆకాశము, వాయువు, పూష, నైఋతి, గృహక్షతుడు, దండధరుడు, గాంధర్వుడు, భృగు, ఆజకుడు, మృగుడు, పితృ, గణాధీశుడు, దైవారికుడు, సోముడు, సూర్యుడు, అదితి, దితి. ఉశనాది కోణమునుండి ఉండు నలుగురు దేవతలు వేరు. అపుడు, సావిత్రుడు, జయుడు, రుద్రుడు అనువారలు. తూర్పు మొదలుకొని ఏకాంతరులు చుట్టూ బ్రహ్మలుందురు. అర్యమా, సవిత, వివస్వాన్ వసుధాధిపుడు. మిత్రుడు, రాజయక్ష్మ, పృథ్వీధరుడు, ఆపపతి అష్టమము. ఇట్లు 45 మంది దేవతలు. ఆప, ఆపవత్స, పర్జన్య, అగ్ని, దితి, అని ఇది ఒక దిగ్వర్గము ఇట్లు అన్ని కోణములలో సంపూర్ణముగా ఉండును. ఈమధ్యలో బాహ్యులు ఇరువదిమంది ద్విపాదులు. అర్యమా, వివస్వాన్, మిత్రుడు, పృధ్వీధరుడు అని బ్రహ్మ చుట్టు నాలుగు దిక్కులలో నలుగురు త్రిపాదులు. బ్రహ్మను కూడా ఒకటి, రెండు మూడు పాదములు కలవానినిగా పూజించ వలయును. వాస్తును తెలిసినవాడు వాస్తుమంత్రముచే దూర్వాదధ్య క్షతాదులచే, బ్రహ్మమంత్రముచే కాని, శ్వేతవస్త్రయుగ్మమును ఇప్పించవలయును. క్రమముగా ఆవాహనాది సర్వోపచారములను చేసి, త్రివిధాన్నమును నైవేద్యముచేసి, వాద్యములచే చక్కగా పూజించవలయును. తరువాత తాంబూలమును సమర్పించి వాస్తుపురుషుని ప్రార్థించవలయును. “ఓ వాస్తుపురుషా! నీకు నమస్కారము. నీవు భూశయ్యా నిరతుడవు. నా గృహమును ధనధాన్య సమృద్ధముగా చేయుము” ఇట్లు యథాశక్తిగా ప్రార్థించి అర్చకునికి దక్షిణ నీయవలయును. తరువాత శక్తిననుసరించి బ్రాహ్మణులకు భోజన తాంబూల దక్షిణలను సమర్పించవలయును. ఇట్లు తన శక్తిమేరకు విధిగా చక్కగా వాస్తు పూజను చేయువాడు ఆరోగ్యమును పుత్ర లాభమును ధన ధాన్యములను పొందగలడు. ఇట్లు వాస్తు పూజను ఆచరించక నూతన గృహప్రవేశమును చేసినచో రోగములను బహువిధ కష్టములను పొందును. ఎప్పుడూ సంకటముల పాలగుచుండును. తలుపులేని, ఆచ్ఛాదనము లేని, పూజచేయని, భోజనము పెట్టని కొత్త ఇంటిలోనికి ప్రవేశించకూడదు. అట్లు ప్రవేశించినచో ఆపదల పాలగును.
రాజులు మొదలగువారు చేయు యాత్రలు ఫలప్రదమగుటకేమి చేయవలయునో చెప్పెదను. పుట్టుక తెలిసిన వారి విషయమున అనగా జన్మ తిథి వార నక్షత్రములు తెలిసిన వారి విషయమున చెప్పెదను. జన్మతిథ్యాదులు తెలియని వారికి ఘుణాక్షరముల వలె ఫలముండును. అటువంటివారికి ప్రశ్న కాలము, నిమిత్తము మొదలగు వాటిచే ఫలోదయమగును. షష్ఠి, అష్టమి, ద్వాదశి, రిక్త, అమావాస్య, పూర్ణిమ, శుద్ధ పాడ్యమి ఈ తిథులలో ప్రయాణము చేయుట నిర్ధనమును క్షయమును కలిగించును. అనూరాధ, పునర్వసు, మృగశిర, హస్త, రేవతి, అశ్వని, శ్రవణము, పుష్యమి, ధనిష్ఠ నక్షత్రములలో, ఏడు వరకు అయిదు మూడు మొదలగు వాటి యందు ప్రయాణముచేసిన అభీష్ట ఫలము సిద్ధించును. శని సోమ వారములలో తూర్పు దిక్కునకు, గురువారము దక్షిణమునకు, ఆది శుక్ర వారములలో పశ్చిమమునకు, మంగళ బుధ వారములలో ఉత్తరమునకు ప్రయాణము చేయరాదు. జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రోహిణి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రములు తూర్పు దిశకు శూలలు. అనూరాధ, హస్త, పుష్యమి, అశ్వనీ నక్షత్రములు పూర్వాది దిక్కులకు క్రమముగా దిగ్ద్వార నక్షత్రములు. కృత్తికా నక్షత్రమునుండి ఏడింటి చొప్పున లెక్కించుచు ఏడు ద్వార నక్షత్రములుగా తెలియవలయును. పరిఘను దాటవలయును. ఆగ్నేయ వాయవ్య దిక్కులకు పరిఘలో వెళ్ళరాదు. ఇట్లే విదిక్కుల విషయమున కూడా తెలియవలయును. మేషాది రాశులు మరల మరల దిగాశ్రయములు అగును. దిగధిపతి లలాటమున నుండగా ప్రయాణముచేసినవాడు తిరిగిరాడు. ప్రయాణ లగ్నమున భాస్కరుడు ఉండగా తూర్పు దిక్కునకు వెళ్లువానికి లలాటమున నుండును.
పదకొండు, పన్నెండు స్థానములలో ఉండు శుక్రుడు ఆగ్నేయ దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నమునుండి పదియవ స్థానమున ఉన్న కుజుడు దక్షిణ దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. తొమ్మిది ఎనిమిది స్థానములలో నుండు రాహువు నైఋతి దిశకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నమునుండి ఏడింటనుండు శని పశ్చి దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి అయిదు, ఆరు స్థానములలో నుండు చంద్రుడు వాయవ్యదిశకు వెళ్ళు వానికి లలాటమున ఉండును. రెండు మూడు స్థానములలో నుండు గురువు ఈశాన్య దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. బ్రతుకు మీద ఆశగలవాడు లలాటమును పరిత్యజించి వెళ్ళవలయును. యాత్రాలగ్న సమీవర్తిగాకాని, విలోమగతునిగా కాని గ్రహమున్నపుడు యాత్రచేయు రాజునకు కార్యభంగమును కలిగించును. ఇట్లే ఆవర్గయైనను విలగ్నుడైనను ఇదే ఫలితము కలుగును. ఉత్తరాయణ దక్షిణాయనములలో యాత్ర అనుకూలము. శుభప్రదము అనగా సూర్య చంద్రాయనములలో వెళ్ళుటయని భావము. అట్లు కానిచో దివారాత్రులలో యాత్ర చేయవలయును. అట్లు కానిచో యాత్ర చేయువానికి మరణము సంభవించును. శుక్ర మూఢమున వెళ్ళినచో కార్యహాని సంభవించును. ప్రతి శుక్రునిలో పరాజయము కలుగును. ప్రతి శుక్రుని వలన కలుగు దోషమును ఏ గ్రహములు తొలగించలేవు.
వాసిష్ఠ కాశ్యప, ఆత్రేయ, భరద్వాజ, గౌతమ గోత్రముల వారికి ప్రతిశుక్ర దోషము లేదు. ఒకేగ్రామమున వివాహమున, కరువులో, రాజవిరోధమున, బ్రాహ్మణ క్షోభ కలిగినపుడు, రాజులకు క్షోభ యేర్పడినపుడు ప్రతి శుక్రదోషము లేదు. శుక్రుడు నీచస్థాన గతుడైనను, శత్రు క్షేత్రమున నున్ననూ, వక్రగతుడైనను యాత్రచేయువానికి కార్యభంగ మును కలిగించును. ఉచ్చగతుడైనచో జయమును కలిగించును. తన లగ్నమునకు అష్టమ స్థానగతుడైనను, ఇష్టరాశి గతుడైనను శత్రురాశి నుండి అష్టమ స్థానగతుడైనను, వాటి అధిపతి రాశిలో నున్ననూ యాత్ర చేయువానికి మరణము సంభవించును. జన్మేశుడు, అష్టమ లగ్నేశుడు పరస్పరము మిత్రులుగా ఉన్నచో జన్మరాశికి అష్టమ రాశివలన కలుగు దోషములు నశించును. క్రూర గ్రహములచే చూడబడిననూ, కూడబడియున్ననూ, ద్వి స్వభావము కలదైనను కార్య భంగమును కలిగించును. స్థిరోదయమున యానము పనికిరాదు. శుభగ్రహములు కలిసియున్ననూ, చూపు కలిగి ఉన్ననూ ఇదియే ఫలితము. అంత్య నక్షత్రము నుండి అయిదు నక్షత్రములలో తృణకాష్ఠ సంగ్రహము, దక్షిణ దిగ్గమనము, శయ్య, గృహరక్షణను చేయరాదు. జన్మోదయమున, జన్మనక్షత్రమున, ఈ రెంటి అధిపతుల రాశిలో నక్షత్రములో కాని ఆ రెంటివలన, ఆ రెంటిలో సూర్యుడు ఇంద్రుడు ఉన్నపుడు యాత్ర చేసినవారి శత్రువు మరణించును. శీర్షోదయము లగ్నత మైనపుడు, దిర్లగ్నము లగ్నగతమైనపుడు కాని శుబవర్గము లగ్నమైనపుడు కాని యాత్ర చేయువారి శత్రువులు నశింతురు. శత్రు జన్మోదయమున జన్మరాశికి నిధనోదయమైనప్పుడు ఈ రెంటి అధిపతులుండు రాశిలో యాత్రచేయువారి శత్రువులు నశింతురు. మీన లగ్నమున వక్రమార్గము ఉన్నపుడు యాత్ర చేయువానికి మీనాంశలో ఉన్ననూ కుంభలగ్నము, కుంభాంశము యాత్రకు నింద్యములగును. జలయోనికి జలలగ్నము, జలాంశము శుభావహము. ధన్వికోశము మూర్తి వాహనము మంత్ర సంజ్ఞకమగును. శత్రుమార్గము వారి ఆయువు మనోవ్యాపార సంజ్ఞను పొందును. ఉదయము నుండి ప్రాప్తి అప్రాప్తి అని ద్వాదశ భావములు ఉండును. క్రూరములు అప్తిమార్గమును నశింపచేయును. సూర్యుడు కుజుడు భావములను నశింపచేయును. శుభ గ్రహములు వ్యాపారహానిని చేయజాలరు.
శుక్రుడు అస్తమును పోషించడు. చంద్రుడు లగ్నమును ఆరవస్థానమును చంద్రుడు పోషించడు. దక్షిన దిక్కు తప్ప ఇతర దిక్కులకు వెళ్ళువారికి ఈ నియమము వర్తించును. అభిజిత్ క్షణయోగము సకలాభీష్ట సిద్ధిని కలిగించును. పంచాంగ శుద్ధిరహితముగా నున్న దివసమున కూడా అఖిజిద్యోగము ఫలప్రదమగును. యాత్రాయోగములు విచిత్రములుగా నుండును. ఇప్పుడు ఆయోగములను చెప్పెదను. రాజులకు యాగలగ్నము వలన, బ్రాహ్మణునికి నక్షత్రమువలన, ఇతరులకు ముహూర్త బలము వలన, చోరులకు శకునములవలన పలసిద్ధికలుగును. శుక్రుడు బుధుడు బృహస్పతి ఈ ముగ్గురిలో ఒకడు కేంద్రమున కాని త్రికోణమున కాని ఉన్నచో యోగమనబడును. ఇద్దరున్నచో తిధి యోగమనబడును. ముగ్గురున్నచో యోగాధియోగమనబడును. యోగమున యాత్ర చేయువానికి క్షేమము, తిధియోగమున చేయువానికి జయము, యోగాధి యోగమున చేయువానికి క్షేమము, విజయము, ధనము, సంపదలు కలుగును. చంద్రుడు శని, సూర్యుడు 10, 6, 1 స్థానములలో నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజుకు విజయలక్ష్మి సిద్ధించును. శుక్రుడు, సూర్యుడు, బుధుడు, శని, కుజుడు లగ్న, అధ్వ, అస్త, త్రి, శత్రు స్థానములలో నున్నపుడు వెళ్ళినరాజు ముందు శత్రు సైన్యము అగ్నిలోలక్కవలె తరిగిపోవును. గురువు లగ్నమున నుండి, రెండు, పదకొండు స్థానములలో ఇతర గ్రహములు ఉండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రుసైన్యమును నశింపచేయును. శుక్రుడు లగ్నమున, సూర్యుడు ఏకాదశ స్థానమున చంద్రుడు బంధుస్థానమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రుసైన్యమును సింహము ఏనుగుల గుంపును చంపునట్లు చంపును. లగ్నము స్వోచ్చమైనపుడు చంద్రుడు స్వోచ్చగతుడు, లేదా లాభగతుడైనపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు కృష్ణుడు పూతనను చంపినట్లు శత్రు సైన్యమును నశింపచేయును. శుభగ్రహములు త్రికోణ కేంద్రగతులై, పాపగ్రహములు మూడు ఆరు పదకొండు స్థానములలో ఉన్నపుడు యుద్ధమునకు వెళ్ళినపుడు అభిసారిక వెంటపడునట్లు అపజయము కలుగును.
గురుడు, సూర్యుడు, చంద్రుడు లగ్న శత్రు రంధ్ర స్థానములలో ఉండగా యుద్ధము నకు వెళ్ళిన రాజుముందు రిపుసైన్యము దుర్జనమైత్రివలె స్థిరముగా ఉండజాలదు. శని కుజులు మూడు ఆరు పదకొండు స్థానములలో నుండి బలయుతులైనపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజునకు శత్రుసైన్యము అధీనమగును. గురువు ఉచ్చగతునిగా లగ్నమున ఉన్నపుడు చంద్రుడు లాభస్థానగతుడై ఉండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు శంకరుడు త్రిపురాసురుని సంహరించినట్లు శత్రు సంహారమును గావించును. శుక్రుడు మస్తకోదయ గతుడై గురువు లగ్నమున లేదా లాభస్థానమున ఉన్నప్పుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు కుమారస్వామి తారకాసురుని సంహరించినట్లు శత్రువులను సంహరించును. గురువు లగ్నమున, శుక్రుడు కేంద్రమున కాని త్రికోణమున కాని యున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు అగ్నిహోత్రుడు వనమును దహించునట్లు శత్రుసైన్యమును దహింపచేయును. బుధుడు లగ్నమున నుండి, శుభగ్రహము కేంద్రమున ఉండి, నక్షత్రము ఉపకులమున నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజులు వేసవికాలములో సూర్యుడు నీటి మడుగులను ఎండజేసినట్లు శత్రు సైన్యమును శుష్కింపచేయును. శుభగ్రహములు త్రికోణమునకాని కేంద్రమునకాని యుండి లాభస్థానమున చంద్రుడుకాని సూర్యుడుకాని ఉన్నపుడు యుద్దమునకు వెళ్ళిన రాజు సూర్యుడు చీకటిని హరింపచేసినట్లు శత్రువులను హరింపచేయును. శుభగ్రహము స్వక్షేత్రమునకాని, కేంద్రమునకాని, త్రికోణలాభ స్థానములలోకాని ఉన్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు అగ్నిహోత్రము దూదిని నశింపజేసినట్లు శత్రు సైన్యమును నశింపచేయును. చంద్రుడు స్వస్థానమున, గురువు కేంద్రమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు పంచాక్షరీ మంత్రము పాపములను హరింపచేయునట్లు శత్రువులను హరింపచేయును. శుక్రుడు వర్గోత్తమగతుడై, ఒక గ్రహము లగ్నములో నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు హరిస్మరణము పాపములను నశింపచేయునట్లు శత్రు సైన్యమును నశింపచేయును. శుభగ్రహము కేంద్రమునకాని త్రికోణమునకాని ఉండి చంద్రుడు వర్గోత్తమున నున్నపుడు యుద్ధమునకు బయలుదేరిన రాజు ఇంద్రుడు పర్వతములను కూల్చినట్లు శత్రువులను కూల్చును, గురువు మిత్రరాశి గతుడై, శుక్రుడు కేంద్రమున కాని త్రికోణమునకాని ఉన్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు గరుడుడు సర్పములను సంహరించునట్లు శత్రువులను సంహరించును. శుభగ్రహము కేంద్ర త్రికోణ స్థానగతుడై వర్గోత్తమమున నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు గంగ పాపములను హరించునట్లు శత్రువులను హరించును. ఇట్లు రాజులు రాజయోగములలో శత్రు సంహారమునకు వెళ్ళినచో వారికోపాగ్ని శత్రు స్త్రీల కన్నీటిచే శాంతించును. బలక్షయ పక్ష దశమి మాసములలో విజయయనబడును. ఈ విజయయోగమున యుద్ధమునకు వెళ్ళిన రాజునకు విజయముకాని శత్రువులతో సంధికాని జరుగును. పరాజయము మాత్రము సంభవించదు. నిమిత్త శకునాదులవలన ముఖ్యమగు మనోదయము కలుగును. కావున బుద్ధిమంతులు ప్రయత్నముచే ఫలసిద్ధిని కలిగించు మనోదయమును సాధించెదరు. ఉత్సవము, ఉపనయనము, వివాహము, ప్రతిష్ఠా అశౌచము, సూతకము ముగియకుండగా బ్రతుకగోరువాడు యాత్రకు బయలుదేరకూడదు. మహిషమువలన యుద్ధ సమయమున, కళత్ర కలహమున, కలత్ర ఋతు సమయమున, కట్టుకున్న వస్త్రము జారినపుడు, కోపము ఉన్నపుడు, దుర్భాష లాడుచున్నపుడు రాజు యుద్ధమునకు బయలుదేరరాదు. నేతి అన్నమును, తిలపిష్టాన్నమును, మత్స్యాన్నమును, నేతిపాయనమును, తూర్పు మొదలగు దిక్కులలో వరుసగా భుజించి యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రువులను జయించును. సజ్జికను పరమాన్నమును, కాంజికమును, నీరు, పెరుగు, పాలు, తిలాన్నమును, ఆదివారము నుండి ఏడు వారములలో క్రమము అనుసరించి భుజించవలయును. ఉలువలు, తిలాన్నము, పెరుగు, తేనె, నెయ్యి, పాలు, మృగమాంసము, దానిసారము, పాయనము, పక్షి, మృగము కుందేటి మాంసము, షాష్టిక్యము, ప్రియంగు అపూపములు, చిత్రాండజ ఫలము, కూర్మము, ఏదు, ఉడుము, శాశ్వకము, హవిస్సు, కృసరాన్నము, పెసరపప్పు కలిపిన అన్నము, యవపిష్టము మత్స్యాన్నము, విచిత్రాన్నము, పెరుగన్నము వీటిని అశ్వినీ నక్షత్రము నుండి ఇరువది ఏడు నక్షత్రములలో వరుసలో తిని రాజు రథ గజాశ్వపాదాలు దళములను తీసుకొని యుద్ధమునకు వెళ్ళినచో శత్రువులను జయించగలుగును. అగ్నిహోత్రుని నువ్వులతో హోమముగావించి, దిక్పాలకులను పూజించి దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించి, వారి ఆశీర్వాదమును పొంది యుద్ధమునకు వెళ్ళ వలయును. యే యే దేవతలకు యే యే వర్ణముగల వస్త్రములు గంధాదులచే, ఆయా మంత్రములచే యధావిధిగా పూజించవలయును. వజ్రాయుధమును ధరించి స్వర్ణవర్ణము కలిగి శచీదేవితో విరాజిల్లుచు, ఐరావతమును అధిరోహించియున్న ఇంద్రుని, సప్తహస్తుడు, సప్తజిహ్వుడు, షణ్ముఖుడు, మేషవాహనుడు, స్వాహాప్రియుడు, రక్తవర్ణుడు, స్రుక్స్రువా యుధుడు అగు అగ్నిని, దండాయుధుడు, లోహితాక్షుడు, మహిష వాహనుడు, శ్యామలా సహితుడు, రక్త వర్ణములచే ఊర్ధ్వముఖుడు, శుభకరుడు యముని, ఖడ్గచర్మధరుడు, నీలుడు, నరవాహుడు ఊర్ధ్వకేశుడు, విరూపాక్షుడు, దీర్ఘగ్రీవుడు, ప్రభువు అయిన నిఋతిని, నాగపాశధరుడు, పీతవర్ణుడు, మకరవాహనుడు, కాళికానాథుడు, రత్నాభరణ భూషితుడు అగు వరుణుని, ప్రాణుల ప్రాణరూపమగువాడు, ద్విబాహువు, దండపాణి, కృష్ణమృగా రూఢుడు, అంజనీపతియగు వాయువును పూజించవలయును. అశ్వారూఢుడు కుంభపాణి, ద్విబాహువు, స్వర్ణవర్ణుడు, చిత్రలేఖేశుడు, యక్షగంధర్వ నాయకుడు అగు కుబేరుని, పినాకి, వృషారూఢుడు, గౌరీపతి, సర్వోత్తముడు, శ్వేతవర్ణుడు, చంద్రమౌళి, నాగయజ్ఞోప వీతుడు అగు శంకరుని యాత్రకు బయలుదేరు రాజులు స్వయముగా పూజించవలయును. ఛత్రధ్వజ శస్త్రాస్త్రవాహనములచే నిగమనమును చేయవలయును. తమ స్థానము నుండి నిర్గమ స్థానము రెండు వందల దండప్రమాణ దూరము ఉండవలయును. బయలుదేరిన వాడు నలుబది కాని పన్నెండు కాని వెళ్ళవలయును. అరేడు దినములు ఒకే చోట ఉండరాదు. అయిదు దినములకన్నా ఎక్కువవున్నచో మరల శుభలగ్నమును చూచుకొని బయలు దేరవలయును. అకాలమున మెరుపులు ఉరుములు వర్షములు సంభవించినచో భౌమ దివ్యాకాశ ఉత్పాతములు సంభవించినచో ఏడు దినములు బయలుదేరరాదు. రత్న కుడ్యముల, జంబుకముల కాకుల, కపోతముల అరుపులు వినినచో వామగతి, పీత, కారభరధ్వాజ పక్షుల దక్షిణగతి చాపమును వదలి చతుష్పాత్తు వామభాగమున వెళ్ళినచో శుభప్రదము, కృష్ణ వర్ణమును వదిలి ప్రయాణమున తొండ చూచినచో, వరాహము, కుందేలు, ఉడుము, సర్పకీర్తనము శుభము. కపి భల్లూకములు కనులు మూసుకొని వచ్చిన అరిష్టము, కొమయూర, మేషము ముంగిస, పిట్ట, పావురములు శుభములు యాత్రలో చూచిన శుభము. ప్రవేశమున చూచినచో వ్యత్యయము జరుగును.
రోదన వర్జితమైన శవమును చూచినచో యాత్రాసిద్ధి కలుగును. ప్రవేశ సమయమున రోదన సహితమగు శవము శవప్రదము, పతితులు, నపుంసకులు, జటిలులు, మత్తులు, వాంతము, ఔషధాదులు, తలస్నానమును చేసినవారు. వస్త్రములు, ఎముకలు, చర్మము, అంగారములు, దారుణరోగులు, గుడము, పత్తి, లవణము, శత్రువులు ప్రశ్నలు, తృణము, సర్పములు, గొడ్రాలు, కుంజము, కషాయధారులు, వెంట్రుకలు విరబోసుకొనినవారు ఆకలి గొన్నవారు నగ్నులు ప్రయాణ సమయమున చూడబడినచో కార్యసిద్ధి జరుగును. మండుచున్న అగ్ని ఉత్తమాశ్వములు, సింహాసనము, పౌరస్త్రీలు, గంధ పుష్పాక్షతములు, ఛత్రచామర ఆందోళికలు, భక్ష్యములు, ఇక్షువు, ఫలములు, మృతాన్నము, మధువు, అజ్యము, దధి గోదయము, మద్య మాంస సుధా ధౌతవస్త్ర శంఖ వృషభ ధ్వజములు, పుణ్యస్త్రీ పుణ్యకలశ రత్న భృంగార గోద్విజులు, భేరీమృదంగ పటహ ఘంటా వీణా నాదములు, వేదమంగళ ఘోషలు ప్రయాణ సమయమున కలిగినచో కార్యసిద్ధి ప్రదాయకములు.
ప్రయాణము చేయువాడు మొదట విరుద్ధ శకునములను చూచినచో ఇష్ట దేవతా స్మరణము చేయవలయును. ద్వితీయమున చూచినచో బ్రాహ్మణ పూజను చేయవలయును. తుమ్ము ఏ దిక్కు నుండి వినవచ్చినను శుభముకాదు. గోవు తుమ్మినచో మృత్యు ప్రదము. బాలులు, వృద్ధులు, రోగులు, పిసినారులు తుమ్మినచో ఫలభంగము జరుగును. పరస్త్రీలను బ్రాహ్మణ దేవధనమును స్పృశించరాదు. శత్రుపురమును ప్రవేశించి నిరాయుధులను స్త్రీలను తప్ప గజాశ్వయోధులను సంహరించవచ్చును. నూతన గృహ ప్రవేశమును ఉత్తరాయణమున చేయవలయును. మొదటిరోజు వాస్తు పూజను, బలిక్రియలను చేయవలయును. మాఘ ఫాల్గుణ వైశాఖ జ్యేష్ఠ మాసములు శుభప్రదములు. సౌమ్య కార్తిక మాసములు గృహ ప్రవేశమునకు మధ్యమములు. జ్యేష్ఠ, పుష్యమి, రేవతి, శతభిష, చిత్త, అనూరాధ, స్థిర నక్షత్రములలో ప్రవేశము శుభప్రదము. గురు శుక్రులు కనపడుచున్నపుడు ప్రవేశము చేయవలయును. అది మంగళ వారములు తప్ప ఇతర వారములలో రిక్త అమాభిన్న తిధులలో పగలు కాని రాత్రికాని ప్రవేశము శుభప్రదము. చంద్ర తారాబలము లున్న శుభ దినమున పూర్వాహమున, స్థిరలగ్నమున స్థిరాంశమున సప్తమశుద్ధి ఉన్నపుడు, శుభగ్రహములు కేంద్ర త్రికోణ గతులైనపుడు ఇతర గ్రహములు 3, 11, 6 స్థానములలో ఉన్నపుడు, చంద్రుడు లగ్నము, ద్వాదశమున, అష్టమ షష్ఠ స్థానములలో లేనపుడు కర్తకు జన్మరాశి లగ్నమైనపుడు, ఆ రెండు వృద్ధిలో ఉన్నపుడు ప్రవేశ లగ్నమైనచో వృద్ధి కలుగును. ఇతర లగ్నమున దుఃఖ దారిద్య్రములు కలుగును. వివిధ మంగళ వాద్యములచే గృహమును సుందరముగా అలంకరించవలయును. సూర్యుని వామభాగమున నుంచి, భృంగారమును ముందు ఉంచుకొని చంద్రుడు వర్షా ప్రవేశమున, జలరాశిగతుడు అయినపుడు కేంద్రమున నున్నపుడు, శుక్ల పక్షమున అయినచో శుభగ్రహ వీక్షణము ఉన్నచో అతివృష్ఠి కలుగును. వర్షకాలమున పాపదృష్టి ఉన్నచో అల్పవృష్టి కలుగును. చంద్రుడు శుక్రునితో కలిసియుండి ఇతర గుణములన్నియూ ఇట్లే యున్నచో, వర్షాకాలమున చంద్రుడు శుక్రుడున్న రాశినుండి సప్తమ స్థానమున ఉన్నచో శుభదృష్ఠి ఉండగా, శని నుండి త్రికోణమున కాని సప్తమ స్థానమునకాని ఉన్నచో, వృద్ది కారకుడు అగుచో, శుక్రుడు బుధసమీపవర్తి అయినచో సద్యోవృష్టి ప్రదుడగును. బుధ శుక్రుల మధ్యన సూర్యుడు ఉన్నచో వృష్టి నాశమేర్పడును. శుక్రుడు మఘాది పంచకమున ఉన్నను, స్వాతి త్రయమున ఉన్ననూ విపరీత వృష్టిని, అతివృష్టిని కలిగించును. సూర్యునికి ముందుకాని వెనుక కాని గ్రహములు సమీపమున ఉన్నచో ప్రతిలోమగతి లేనపుడు వర్షమును కురిపింతురు. వామ భాగమున ఉన్న శుక్రుడు దక్షిణదిశగా వెళ్ళుచున్నపుడు వృష్టికారకుడగును. ఉదయాస్తమయములలో సూర్యుడు ఆర్ద్రా ప్రవేశమును చేసినచో వృష్టి కలుగును. సంధ్యాసమయమున ఆర్ద్రా ప్రవేశమైనచో సస్యవృద్ధియగును. రాత్రి ప్రవేశించినచో నరులకు సర్వసంపదలు కలుగును. కొద్దిగా వర్షించును. ధరలు పెరుగును. ఆర్ద్రోదయము ఉన్న భిన్నమయినచో అవృష్టి సస్యసంపదలు కలుగును. చంద్రుడుకాని, గురువుకాని, బుధుడుకాని, శుక్రుడుకాని కేంద్ర గతుడగుచో వృష్టి నాశము కలుగును. సూర్యుడు పూర్వాషాఢలో చేరినపుడు మేఘ పరివేష్టితుడై ఆర్ద్ర నుండి మూలా నక్షత్రము వరకు ప్రతిదినము ప్రత్యక్షముగా వర్షమును కలిగించును. రేవతిలో ఉండగా వర్షము కురియును. పది నక్షత్రములలో వృష్టి ఉండదు. సింహమున కుజుడు ఖిన్నుడైనచో వర్షము కురియును. కర్కటమున ఖిన్నుడు కానున్న కురియును. కన్యోదయమున ప్రభిన్నమగుచో సర్వకాలవృష్టి యుండును. ఉత్తరాభాద్రలో పూర్వసస్యము, రేవతిలో పరసస్యము, భరణిలో సర్వ సస్యములు వృద్ధిచెందును. అశ్వినిలో సస్యనాశము ఏర్పడును. శుక్రుడు గురువునకు సప్తమరాశిలో నుండి ప్రత్యక్ గమనమును చేసినచో ప్రావృట్కాల బలము లేకున్ననూ అతివృష్టి మిన్నగా కలుగును. చంద్రుడు ఏడవ నక్షత్రము వరకు పరివేషగతుడు అగుచో మెరుపులు ఉరుములు కలిగి అనావృష్టి కలుగును. మేఘములు పశ్చిమ భాగమున వంగి ఖసప్తకమునకు ఉపరిభాగమున ఉన్నచో, దక్షిణ స్థలములుగా పతనమగుచో త్వరలో వర్షించును. లోహ సంయుతమున మార్జాలములు గోళ్ళతో భూమిని గీయునపుడు, నడుచుదారిలో సేతవు కట్టవలసినంత వర్షమేర్పడును. చీమలు బారు విడినపుడు ఎక్కువ మిడుతలున్నప్పుడు, సర్పములు చెట్లెక్కునపుడు దుర్యృష్టి కలుగును. ఉదయాస్తమయ కాలమున చంద్రుడుకాని సూర్యుడుకాని వివర్ణుడైనచో మధువర్ణు డైనను అతివాయువు, అతివర్షము సంభవించును.
తూర్పు ముఖముగా నున్న కూర్మము యొక్క నవాంగముల యందు ఈ భూమిని నవఖండములుగా విభజించి మండలములుగా ఏర్పరిచిరి. అంతర్వేదములు పాంచాలములు ఆ కూర్మమునకు నాభిమండలము. ప్రాచ్యమాగధ లాటదేశములు కూర్మమునకు ముఖమండలము. స్త్రీ కలింగ కిరాత దేశములు బాహుమండలము. అవంతి ద్రావిడ భిల్ల దేశములు ఒక పార్శ్వమండలము. సింధు, కాశి, మహారాష్ట్ర, సౌరాష్ట్రములు పుచ్ఛ మండలము. పులింద, చీన, యవన, గుర్జర దేశములు పాదమండలములు. కురు కాశ్మీర, మాద్రేయ మత్స్య దేశములు రెండవ పార్శ్వ మండలము. ఖసాంగ, బంగ బాహ్లీక కాంభోజ దేశములు పాణిమండలము. ఇట్లు నాభి మొదలుకొని ఉన్న నవాంగములలో ఒక్కొక్క అవయవమునందు కృత్తికనుండి మూడు మూడు నక్షత్రములను ఉంచవలయును. ఈ కూర్మాంగములందే దేవతలు నృత్యమును చేతురు. పడుదురు. జ్వలించుచుందురు. మాటి మాటికి రోదనము చేతురు గానము చేతురు స్వేదమును కలిగియుందురు నవ్వుదురు నిప్పులను కక్కుచుందురు, ధూమమును కక్కుచుందురు. స్నేహమును, రక్తమును, పాలను, నీటిని కక్కుచుందురు అధోముఖులుగా నుందురు. ఒక స్థానము నుండి మరియొక స్థానమునకు వెళ్ళెదరు. ఇటువంటి వికారములు దేవతా ప్రతిమలలో కూడా కనిపించు చుండును. గంధర్వ నగరమును, పగలు నక్షత్రములను చూచుట, మహోల్కాపతనము, కాష్ఠ, తృణ, రక్తముల వర్షము, గాంధర్వము, దేహదిగ్ధూమము రాత్రి పగలు భూమికంపము అగ్నిలేనపుడు కూడా నిప్పు రవ్వలు కలుగుట, కట్టెలు లేకుండా అగ్నిమండుట, రాత్రి ఇన్ద్ర చాపము కనపడుట, శిఖరములందు తెల్లకాకులు కనపడుట, గో, గజ, అశ్వ, ఉష్ట్రముల శరీరములనుండి స్ఫులింగములు వచ్చుట, రెండు, మూడుతలలు కల జంతువులు పుట్టుట, ప్రాతఃకాల సూర్యుడు నాలుగు దిక్కుల నుండి ఒకేసారి కనపడుట, నక్కలు ఊరిలో ఉండుట, ఆకాశమున కేతువులు కనపడుట, రాత్రిపూట కాకుల కలకలము, పగలు పావురముల కలకలము, అకాలమున పూచిన పండినచెట్లు కనపడుట, ఇవి యన్నియు మహూత్పాత సూచకములు.
కావున బుద్ధిమంతులు అకాలమున కనపడిన పూలను పండ్లను వెంటనే కోయవలయును. ఈ ఉత్పాతములు నాశసూచకములు కొన్ని మృత్యు ప్రదములు. కొన్ని శత్రువులవలన భయమును కలిగించునవి. మధ్యనుండి అయినచో భయము, యశస్సు మృత్యువు, క్షయము, కీర్తి, సుఖము, దుఃఖము, ఐశ్వర్యము, ధనహాని ఈ ఫలములు పుట్టను తేనె కప్పి ఉన్నచో కలుగును. కావున ఈ అన్ని ఉత్పాతముల విషయమున కల్పోక్త విధిచే ప్రయత్నముతో శాంతిని జరుపవలయును. ఓ బ్రాహ్మణోత్తమా! నీకు ఇట్లు సంగ్రహముగా జ్యోతిషాంగమును బోధించితిని. ఇక ఇప్పుడు సాటిలేని మహిమగల ఛందశాస్త్రమును చెప్పెదను. (2/56)