నారద మహా పురాణము
అధ్యయనాది ధర్మ నిరూపణము
ఓ మునిశ్రేష్ఠా! వర్ణాశ్రమాచారవిధిని విశేషముగా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. స్వధర్మమును విడిచి పరధర్మమును ఆచరించువాడు సర్వధర్మ బహిష్కృతుడై పాషండు అగును. గర్భాధానాది సంస్కారములను కాలానుసారముగా మంత్రపూర్వకముగా ఆచరించవలయును. స్త్రీలకు మంత్రరహితముగా ఆచరించవలయును. మొదట సీమంత కర్మ నాలుగవ నెలలో చేయ వలయును. లేదా ఆరవ, ఏడవ, ఎనిమిదవ నెలలోనైననూ చేయవచ్చును. పుత్రుడు జన్మించిన వెంటనే తండ్రి సచేలస్నానమాచరించి స్వస్తి వాచక పూర్వకముగా నాందీశ్రాద్ధమును ఆచరించ వలయును. అన్నముతో శ్రాద్ధమును చేసినచో చండాలుడగును. తండ్రి వాఙ్మయముతో అతి గుర్వక్షరాన్వితముగా బేసి అక్షరములు కలదిగా నామకరణము చేయరాదు. మూడవయేట కాని, అయిదవ ఏట కాని, ఆరవ ఏటగాని, ఏడవయేటగాని, ఎనిమిదవ ఏటకాని గృహ్యమార్గమును అనుసరించి చౌలమును చేయవలయును. దైవయాగమున గర్భాధానాదికర్మలు చేయుటకు కాలాతిక్రమము జరిగినచో పాదకౄచ్ఛ్రవ్రతము ఆచరించవలయును. బ్రాహ్మణునకు గర్భాష్టమ వర్షమున కాని అష్టమవర్షమున కాని ఉపనయనము చేయవలయును. వీలుకానిచో పదునారు వర్షములలోపు చేయవచ్చును. క్షత్రియునకు గర్భైకాదశవర్షమున చేయవలయును. ఇరువది రెండు సంవత్సరముల వరకు చేయవచ్చును. ఇరువది నాలుగు వర్షముల వరకు గౌణకాలమగును. బ్రాహ్మణునకు చెప్పిన ఉపనయనకాలము అతిక్రమించినచో ద్విజుడు సావిత్రీ పతితుడగును. అతనితో ఎవ్వరూ ఎప్పుడూ సంభాషించరాదు. బ్రాహ్మణునకు ఉపనయనము చేయు సమయము అతిక్రమించినచో పన్నెండు సంవత్సరములు కృఛ్చ్ర వ్రతము నాచరించవలయును. తరువాత చాంద్రాయణ వ్రతమును ఆచరించవలయును. రెండు సంతాపన వ్రతముల నాచరించి తరువాత కర్మ ఆరంభించవలయును. అట్లు చేయనిచో పతితుడగును. కర్తకు బ్రహ్మహత్యా పాతకము లభిం చును. ఉపనయన కాలమున బ్రాహ్మణుని మొలత్రాడు ముంజతృణముతో ఏర్పరుచవలయును. క్షత్రియునకు వింటినారితో చేయవలయును. వైశ్యునకు ఆవికముతో చేయవలయును. అట్లే బ్రాహ్మణునకు జింకచర్మము, క్షత్రియునకు ఏదు చర్మము, వైశ్యనకు గొఱ్ఱెచర్మమును ధరింపచేయ వలయును. అట్లే బ్రాహ్మణునకు మోదుగు చెట్టు దండం, క్షత్రియునకు మేడిచెట్లు దండము, వైశ్యునకు మారేడుచెట్టు దండము ఉండవలయును. దండ ప్రమాణము బ్రాహ్మణునకు కేశాంతము, క్షత్రియ మునకు లలాట పర్యంతము, వైశ్యునకు నాసాగ్ర పర్యంతముండ వలయును. ఇక ఇపుడు బ్రాహ్మణా దులు ధరించవలసిన వస్త్రములను చెప్పెదను వినుము. బ్రాహ్మణునకు కాషాయ వర్ణము, క్షత్రియు నకు మాంజిష్ఠ వర్ణము, వైశ్యునకు పసుపువర్ణ వస్త్రము విహితము. ఉపనీతుడైన ద్విజుడు గురువునకు పరిచర్యను చేయుచు వేదాధ్యయన పర్యంతము గురుకులమున నివాసమును చేయవలయును. బ్రహ్మచారి ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానమాచరించి కాలాను గుణముగా గురువుగారి కొరకు సమిత్కుశ ఫలాదికములనుతేవలయును. యజ్ఞోపవీతము అజినము దండమునష్టమైనను భ్రష్టమైననూ నూతనమును మంత్రపూర్వకముగా ధరించవలయును. భ్రష్టమైనదానిని జలమున పడవేయ వలయును. బ్రహ్మచారి భిక్షాన్నముచే మాత్రమే జీవికను గడుపవలయును. ఇంద్రియ నిగ్రహముతో బ్రహ్మచారి శ్రోత్రియుని ఇంటనుండియే భిక్షాన్నగ్రహణము చేయవలయును. బ్రాహ్మణుడు భిక్షచేయునపుడు, మొదట భవచ్ఛబ్దమును ప్రయోగించవలయును. క్షత్రియుడు మధ్యన భవచ్చబ్దమును ప్రయోగించవలయును. వైశ్యుడు చివర భవచ్ఛబ్దము నుపయోగించ వలయును. అనగా బ్రాహ్మణుడు “భవతి! భిక్షాందేహి మాతః” అని, క్షత్రియుడు “భిక్షాం భవతి దేహి మాతః” అని, వైశ్యుడు “భిక్షాం దేహి భవతి మాతః” అని ప్రయోగించ వలయును. బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహముతో ప్రతిదినము ప్రాతఃకాలము సాయంకాలము అగ్ని కార్యమును బ్రహ్మయజ్ఞమును చేయవలయును. తర్పణము చేయవలయును. అగ్ని కార్యమును వదిలినవాడు పతితుడే అగును, బ్రహ్మయజ్ఞమును చేయనివాడు బ్రహ్మహత్య చేసినవాడు అగును. గురుశుశ్రూష తరువాత దేవతాది అర్చనను చేయవలయును. బ్రహ్మచారి ప్రతి నిత్యము భిక్షాన్నమునే భుజించవలయును కాని ఒకే ఇంటి భోజనమును చేయరాదు. ఉత్తమ విప్రుల ఇంటినుండి భిక్షను తెచ్చి ఇంద్రియ జయముతో భిక్షను గురువునకు నివేదించి గురువు ఆజ్ఞచే మౌనముగా తాను భోజనము చేయవలయును.
మద్యమును, స్త్రీలను, మాంసమును, లవణమును, తాంబూలమును, దంతధావన మును, ఉచ్ఛిష్ట భోజనమును, పగలు నిద్రించుటను, బ్రహ్మచారి విడువలయును. ఛత్రమును, పాదులకును, గంధమును, పూలమాలలను, సుగంధద్రవ్యాను లేపనమును, జలకేళిని, నృత్యగీత వాద్యములను విడువలయును. పరివారమును, ఉపలాపమును, అధిక ప్రలాపమును, కాటుకను, నాస్తిక జనసంబంధమును, శూద్రజన సంగతిని విడువవలయును. వృద్ధుల విషయమున యథావిధిగా అభివాదమును చేయవలయును. జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు తపోవృద్ధులు అని వృద్ధులు మూడు విధములుగా ఉందురు. వేదశాస్త్రోపదేశముచే ఆధ్యాత్మికాది దుఃఖములను నివారించు గురువునకు మొదట అభివాదము చేయవలయును. బ్రాహ్మణుడు అభివాదమును చేయునపుడు ‘అసావహం’ (ఈ నేను) అని చెప్పవలయును. బ్రాహ్మణుడు క్షత్రియాదులకు ఎట్టి స్థితిలోనైనను అభివాదనము చేయరాదు. నాస్తికునికి, భిన్నమర్యాదునికి, కృతఘ్నునికి, గ్రామయాజకునికి, చోరునికి, కపటికి, ఎపుడూ నమస్కరించరాదు. పాషండునికి పతితునికి, వ్రాత్యునికి, జ్యోతిష్కునికి, పాతకునికి నమస్కరించరాదు. ఉన్మత్తునికి శరునికి ధూర్తునికి పరెగెత్తువానికి, అపవిత్రునికి, నూనె తలకంటు కొనినవానికి, జపముచేయుచున్నవానికి నమస్కరించరాదు. వివాదశీలికి, చందునికి, వాంతి చేసుకొనినవానికి, నీటిమధ్యలో ఉన్నవానికి, భిక్షాన్నమును ధరించినవానికి, పడుకొని ఉన్నవానికి నమస్కరించరాదు. భర్తను చంపినదానికి, రజస్వలకు, జారురాలికి, ప్రసవించినదానికి, పురిటిలో ఉన్నదానికి, గర్భపాతమును చేసుకొన్నదానికి, కృతఘ్నురాలికి, చండికి నమస్కరించరాదు. సభలో, యజ్ఞశాలలో, దేవాలయములో ప్రత్యేకించి ఏ ఒక్కరికో చేసిన నమస్కారము పూర్వమున చేసుకొన్న సుకృతమును నశింపచేయును శ్రాద్ధమును, వ్రతమును, దానమును దేవతార్చనను, యజ్ఞమును, తర్పణమును చేయువారికి నమస్కరించరాదు. అభివాదము చేసినపుడు ప్రత్యభివాదము చేయనివారికి అభివాదము చేయరాదు. ప్రత్యభివాదమును చేయనివాడు శూద్రతుల్యుడు. పాదప్రక్షాళనమును చేసుకొని ఆచమనముచేసి గురువుగారికి అభిముఖముగా ఉండి గురువు పాదములను గ్రహించి వివేకము కలవాడై అధ్యయనము చేయవలయును. అష్టమియందు, చతుర్దశియందు, ప్రతిపత్తు నందు, పూర్ణిమ తిథియందు మహాభరణీ నక్షత్రమునందు శ్రావణ ద్వాదశియందు, భాద్రపద బహుళ ద్వితీయనాడు, మాఘశుద్ధ సప్తమినాడు, ఆశ్వయుజ శుద్ధనవమినాడు, సూర్యగ్రహణమున, శ్రోత్రియులు గృహమునకు వచ్చినపుడు బ్రాహ్మణుడు బంధించబడినపుడు, కలహములు పెరిగి నపుడు, సంధ్యా సమయమున, మేఘగర్జన కాలమున, అకాల వర్షమున, ఉల్కాపాతము ఆశని పాతము జరిగినపుడు, విప్రుడు అవమానించబడినపుడు మన్వాది కాలమునందు నాలుగు యుగముల ఆది కాలమునందు కర్మ ఫలమున ఆసక్తిగల బ్రాహ్మణుడు అధ్యయనము చేయరాదు వైశాఖశుద్ధ తదియ (అక్షయ తృతీయ) భాద్రపద కృష్ణ త్రయోదశి, కార్తీక శుక్ల నవమి (అక్షయనవమి) మాఘ పూర్ణిమ ఈ నాలుగు యుగాదులుగా తెలియును. ఈ కాలమున దానము చేసినచో అక్షయ ఫలము లభించును.
మన్వాది కాలమును చెప్పెదను సావధానముగా వినుము. అశ్వయుజ శుద్ధనవమి, కార్తిక శుద్ధద్వాదశి, చైత్రశుద్ధ తృతీయ, భాద్రపదశుద్ధ తృతీయ అషాడ శుక్ల దశమి, మాఘశుద్ధ సప్తమీ, శ్రావణ బహుళ అష్టమి, ఆషాడ పూర్ణిమ, ఫాల్గుణ అమావాస్య, పుష్యశుద్ధ ఏకాదశి, కార్తిక, ఫాల్గుణ చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వాదులుగా ప్రసిద్ధి పొందినవి. ఈ కాలమున దానము చేసిన అక్షయ ఫలము లభించును. మన్వాది కాలమున, యుగాది కాలమున శ్రాద్ధము చేయవలయును. శ్రాద్ధమున నిమంత్రణ చేసినపుడు, సూర్యచంద్ర గ్రహణములలోను, ఉత్తరాయణ దక్షిణాయన కాలములోను భూకంపనమున గల గ్రహణమున, మేఘచ్ఛిన్నదినమున అధ్యయనము చేయరాదు. ఈ అనధ్యయన దినములలో అధ్యయనముచేయు మూఢులకు సంతానమును, ప్రజ్ఞను, కీర్తిని, సంపదను, ఆయుష్యమును, బలమును, ఆరోగ్యమును యముడు స్వయముగా హరించును. అనధ్యయ నమున వేదాధ్యయనము చేయువానిని బ్రహ్మఘాతకునిగా పేర్కొనెదరు. అట్టివానితో మాట్లాడరాదు, కలిసి ఉండరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగిన పుత్రునికి, భర్త మరణించిన తరువాత జారుని వలన కలిగిన పుత్రునికి కాని, వారి పుత్రులకు కాని, ఉపనయనము చేయవచ్చునని కొందరు పండితులు చెప్పుచున్నారు. వేదాధ్యయనము జరుపక ఇతర విద్యలలో పరిశ్రమచేయువాడు శూద్ర తుల్యుడు, నరకమునకు ప్రియమైన అతిథిగా తెలియుము. వేదాధ్యయనమును చేయని విప్రుడు ఆచారమునందు శ్రద్ధ చూపినను ఆచారఫలమును పొందజాలడు. శూద్రతుల్యుడగును. వైదికము లగు నిత్యనైమిత్తిక కామ్యకర్మలచే అధ్యయనము చేయనివానికి నిష్ఫలములు అగును. శబ్ద బ్రహ్మ మయుడు విష్ణువు. వేదము సాక్షాతు శ్రీహరియే కావున వేదాధ్యాయియగు విప్రుడు సర్వకామములను పొందును. (1/25)