నారద మహా పురాణము
పద్మపురాణాను క్రమణికా వర్ణనము
బ్రహ్మ పలికెను: ఓ పుత్రా! ఇపుడు చదువువారికి వినువారికి గొప్ప పుణ్యమును ప్రసాదించు పద్మపురాణమును చెప్పెదను వినుము. అయిదు ఇంద్రియములు గలవాడు ఆత్మ అగునట్లు పంచ ఖండములు కలది పాపనాశకమగు పద్మపురాణము. ఓ బ్రాహ్మణోత్తమా? పులస్త్య బ్రహ్మ భీష్మునకు సృష్ట్యాదిక్రమముగా నానాఖ్యానేతిహాసాదులతో ధర్మము విస్తారముగా ఈ పద్మ పురాణమున చెప్పబడినది. పుష్కర మాహాత్మ్యము, వేదపాఠాది లక్షణము, దాన ప్రశంస, వ్రత ప్రశంస, పార్వతీ కళ్యాణము, తారకాఖ్యానము, గవాది మహాత్మ్యము కాలకేయాది దైత్యవధ, గ్రహార్చనము, దానము ఇవన్నియూ సృష్టి ఖండమున మహాను భావుడగు వ్యాసమహర్షి విస్తరముగా వర్ణించియున్నాడు. తల్లిదండ్రులను పూజించవలయును అని చెప్పుటకు శివశర్మ కథను, సువ్రతుని కథను, వృత్రాసురు వధను, పృథువేనుల చరిత్రను, సునీధుని కథను, సుకలాఖ్యానమును, ధర్మాఖ్యానమును, పితృ శుశ్రూషణాఖ్యానమును, నహుష కథను, యయాతి చరితమును, గురుతీర్ధ నిరూపణమును ఆశ్చర్యములను గొలుపు పలుకథలుగల రాజ జైమిని సంవాదమును, హుండదైత్యుని వధతో కూడిన అశోక సుందరి కథను, కామోదాఖ్యానకమును, విహుండ వధను, చ్యవన కుంజల సంవాదమును, ఈ ఖండమున ఫలశ్రుతిని, సిద్ధాఖ్యానమును, సూత శౌనక సంవాదమున భూమి ఖండమున చెప్పి ఉన్నారు. సూత పుత్రునిచే ఋషులచే బ్రహ్మాండోత్పత్తి వర్ణమును, భూమిలోక సంస్థానమును, తీర్థాఖ్యానమును, నర్మదోత్పత్తి కథనమును, ఆయా తీర్థముల కథలను, కురుక్షేత్రాదులలో ఉండు తీర్థముల పుణ్యగాధలను, కాళిందీ పుణ్యకథను, కాశీమాహాత్మ్య వర్ణనమును, గయా మాహాత్మ్యమును, ప్రయాగ మాహాత్మ్యమును, వర్ణాశ్రమాను రోధముతో కర్మయోగ నిరూపణమును, వ్యాస జైమిని సంవాదమును పుణ్యకర్మ కథాన్వితముగా, సముద్ర మథనాఖ్యానమును, వ్రతాఖ్యానమును, ఊర్జపంచాహ మాహాత్మ్యమును, సర్వాపరాధములను తొలగించు స్తోత్రమును స్వర్గ ఖండమున చెప్పి ఉన్నారు.
రామ రాజ్యాభిషేచనము, రామాశ్వమేధము, అగస్త్యాది మహర్షులు వచ్చుట, పౌలస్త్యవంశ కధను చెప్పుట, అశ్వమేధోప దేశము, హయచర్య, పవిత్రములైన నానా రాజ కథలు, జగన్నాథాను వర్ణనము, సర్వపాప ప్రణాశనమగు బృందావన మాహాత్మ్యము, కృష్ణావతారమున ఉన్న శ్రీహరి యొక్క నిత్యలీలాను కథనము, మాధవ స్నాన మాహాత్మ్యము, నానా దానార్చన ఫలము, భూవరాహ సంవాదము, యమబ్రాహ్మణుల కథ, రాజదూత కథ, కృష్ణ స్తోత్ర నిరూపణము, శివ శంభు సమాయోగము, దధీచాఖ్యానకము, గొప్ప భస్మ మాహాత్మ్యము, ఉత్తమమగు శివమాహాత్మ్యము, దేవరాత సుతాఖ్యానము, పురాణజ్ఞ ప్రశంస, గౌతమాఖ్యానము, శివగీతా, కల్పాంతరమున రామకథ, భారద్వాజ ఆశ్రమస్థితి, ఇవి అన్నియు పాతాళ ఖండమున చెప్పబడి ఉన్నవి. ఈ పాతాళ ఖండమును చదివిన వారికి వినువారికి సర్వపాపనివృత్తి ద్వారా సర్వాభీష్ట ఫలమును ఇచ్చును.
శివుడు పార్వతికి చెప్పిన పర్వతాఖ్యానము, జలంధర కథ, గంగా ప్రయాగ కాశీ గయా తీర్థ క్షేత్రముల పుణ్యకథలు. అన్నాది దాన మాహాత్మ్యము, మహాద్వాదశీవ్రతము, ఇరువది నాలుగు ఏకాదశుల మాహాత్మ్యము, విష్ణు ధర్మ సమాఖ్యానము, విష్ణు నామ సహస్రము, కార్తీక వ్రత మాహాత్మము, మాఘస్నాన ఫలము, పాప నాశనములగు జంబూద్వీప తీర్థముల మాహాత్మ్యము, సాభ్రమతీ మాహాత్మ్యము, నృసింహోత్పత్తి వర్ణనము, దేవశర్మాఖ్యానము, గీతా మాహాత్మ్య వర్ణనము, భక్త్యాఖ్యానము, భక్తి మాహాత్మ్యము శ్రీమద్భాగవత మాహాత్మ్యము. బహుతీర్థ కథలతో కూడియున్న ఇంద్రప్రస్థ మాహాత్మ్యము, మంత్ర రత్నాభిధానము, త్రిపాద్విభూతి వర్ణనము, మత్స్యాద్యవతార కథలు, దివ్యమగు రామనామ శతకము, రామనామ మహాత్మ్యము, భృగుమహర్షి శ్రీ మహావిష్ణు వైభవమును పరీక్షించుట ఇవి అన్నియు సర్వపుణ్య ప్రదమగు అయిదవ ఉత్తర ఖండమున చెప్పబడి యున్నవి. ఇట్లు పంచ ఖండములచే కూడియున్న పద్మపురాణమును భక్తితో వినిన మానవోత్తముడు ఇహలోకమున అభీష్టభోగములను అనుభవించి వైష్ణవ లోకమును చేరును. ఇట్లు పద్మ పురాణమున యాభైయైదు వేలశ్లోకములు కలవు. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు, ఈ పద్మ పురాణమును వ్రాసి బంగారు పద్మములతో పురాణజ్ఞుని చక్కగా సత్కరించి ఇచ్చినవాడు సర్వదేవ నమస్కృతుడై విష్ణు లోకమునకు పోవును. ఈ పద్మ పురాణాను క్రమణిని చదివినవాడు, వినినవాడు పద్మపురాణ శ్రవణ ఫలమును పొందును. (4/93)