వాయుపురాణాను క్రమణీ నిరూపణము

బ్రహ్మ పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! శివలోకమును ప్రసాదించు వాయు పురాణమును చెప్పెదను వినుము. ఈ వాయు పురాణము ఇరువది నాలుగువేల శ్లోకములు కలది. ఇచట వాయువు శ్వేత కల్ప ప్రసంగముతో ధర్మములను చెప్పెను. కావున దీనిని వాయు పురాణమందురు. ఇది రెండు భాగములు కలిగి ఉన్నది. ఈ పురాణమున సవిస్తరముగా సర్దాది లక్షణములు చెప్పబడినవి. మన్వంతరములందు వంశములు, గయాసుర వధ, మాస మాహాత్మ్యములు, మాఘమాస వైశిష్ట్యము, దానధర్మములు, రాజ ధర్మములు, భూపాతాళ దిగ్వ్యోమ చారులు నిర్ణయములు, వ్రతాదులు పూర్వ భాగమున వర్ణించబడినవి. ఇక ఉత్తర భాగమున నర్మదా తీర్థ వర్ణనము, శివ సంహితా, సర్వదేవత లకు తెలియశక్యము కాని శివుడు సర్వాత్మనా నర్మదాతీరమున ఉండుట, ఈ నర్మదా జలమే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, నిరాకార బ్రహ్మ, కైవల్యముకొఱకు శివుడు తన శరీరము నుండి నదీ రూపమగు ఒకానొక శక్తిని నర్మదా రూపముగా అవతరింపచేసెను. నర్మదానదీ ఉత్తర తీరప్రాంతమున నుండు వారు వివానుచరులు, దక్షిణ తీరమున ఉండువారు విష్ణు లోకమును చేరెదరు. ఓంకారేశ్వరము మొదలు పశ్చిమ సముద్రము వరకు ముప్పది అయిదవది రేవాసాగర సంగమము, రేవా తీర ద్వయమున సంగమములతో కలసి ఉన్నవే ప్రసిద్ధములగు తీర్థములు నాలుగు వందలు కలవు. అరువది వేల తీర్థములు, అరువది కోట్ల తీర్థములు ఇతరములు రేవా తీరమున అడగడుగున కలవు. ఇట్లు వాయువుచే కీర్తించబడిన నర్మదా చరితముకల పరమాత్మయగు శివుని సంహిత పరమ పావనమైనది. అని చెప్పబడెను. ఈ పురాణమును వ్రాసి గుడధేను సమన్వితముగా శ్రావణ పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసిన వారు పదునాలుగు ఇంద్రుల కాలము రుద్ర లోకమున నివసించెదరు. హవిస్సును మాత్రమే భుజించుచు ఈ వాయు పురాణమును నియమబద్ధముగా వినువాడు చెప్పువాడు రుద్రుడే అగును. సంశయముతో పనిలేదు. ఈ వాయు పురాణాను క్రమణిని వినిపించినవాడు, వినినవాడు సర్వపురాణ శ్రవణ ఫలమును పొందును. (4/95)