నారద మహా పురాణము
స్కందపురాణాను క్రమణ వర్ణనము
బ్రహ్మ పలికెను: వత్సా! ఇపుడు స్కంద పురాణమును చెప్పెదను వినుము. ఈ పురాణమున ప్రతి పదమున సాక్షాత్తుగా మహేశ్వరుడే నిండి ఉండెను. శతకోటి విస్తరమగు పురాణమున శివుని విషయమున ప్రతిపాదించినదానిని వ్యాస భగవానుడు అర్థ లక్ష శ్లోకములలో వివరించెను. ఈ స్కంద పురాణమున ఏడు ఖండములు కలవు. ఈ పురాణమున ఎనుబది ఒక వేల శ్లోకములు కలవు. సర్వపాప హరము ఈ పురాణము. ఈ పురాణమును చదివిననూ వినిననూ అతను సాక్షాత్తుగా శివుడే అగును. ఈ పురాణమున మహేశ్వర ధర్మములను సాక్షాత్తుగా షణ్ముఖుడు వివరించెను. తత్పురుష కల్పమున జరిగిన సర్వసిద్ధి విధాయకములగు వృత్తాంతములను మహేశ్వర ఖండమున వివరించెను. ఈ ఖండము సర్వపాప ప్రణాశనము. ఈ మహేశ్వర ఖండము కొద్ది తక్కువగా పన్నెండు వేల శ్లోకములు కలవు. బహుపుణ్య ప్రదము. చాలా కథలు కలది. చాలా మంచి చరితములు కలది. స్కంద మాహాత్మ్యమును సూచించునది. ఈ ఖండమున కేదార మాహాత్మ్యమున మొదట పురాణోపక్రమము చేయబడినది. తరువాత దక్షయజ్ఞకథ, శివలింగార్చన ఫలము, సముద్ర మథన వృత్తాంతము, దేవేంద్ర చరితము, పార్వతీ ఉపాఖ్యానము, పార్వతీ వివాహము, కుమారోత్పత్తి కథనము, తారకాసుర యుద్ధము, పాశుపతాఖ్యానము, చండాఖ్యానము, ద్యూత ప్రవర్తనాఖ్యానము, నారద సమాగమము చెప్పబడినవి. తరువాత కుమార మాహాత్మ్యమున పంచతీర్థ కథనము, ధర్మవర్మ నృపాఖ్యానము, నదీసాగర కీర్తనము, ఇంద్ర ప్రద్యుమ్న కథా, నాడీజంఘ కథ, మహీ ప్రాదుర్భావము, దమనక కథ, మహీసాగర సంయోగము, కుమారేశ కథా, తరువాత నానాఖ్యాన సమన్వితమగు తారకాసుర సంగరము, తారకాసురవధ, పంచలింగ నివేశనము, పుణ్యకరమగు ద్వీపాఖ్యానము, ఊర్థ్వ లోకవ్యవస్థితి, బ్రహ్మాండ స్థితిమానము, వర్కరేశకధా, మహాకాల సముద్భూతి, అద్భుతమగు మహాకాలకథా, వాసుదేవ మాహాత్మ్యము, కోటి తీర్థము, నానాతీర్థ సమాఖ్యానము, గుప్తక్షేత్రమున చెప్పబడినది. పవిత్రమగు పాండవ కథ, మహావిద్యా ప్రసాధనము, తీర్థయాత్రా సమాప్తి ఇది అంతయు అద్భుతమగు కుమార చరితము. అరుణాచల మాహాత్మ్యము, సనక బ్రహ్మసంకథా, గౌరీ తపోవిధానము, ఆయా తీర్థముల నిరూపణము, మహిషాసుర సమాఖ్యానము, అద్భుతమగు మహిషాసుర వధ, ద్రోణాచలమున శివస్థానము, నిత్యదమని చెప్పబడినవి. ఇది స్కంద పురాణమున మహేశ్వర ఖండమున చెప్పబడినది.
ఇక రెండవది వైష్ణవ ఖండము. ఇప్పుడు వైష్ణవ ఖండములోని ఆఖ్యానములను వినుము. ఈ ఖండమున మొదట భూమి వారాహ సమాఖ్యానము చెప్పబడినది. ఈ సమాఖ్యానమున వేంకటాచల మాహాత్మ్యము సకల పాపనాశనము వర్ణించబడినది. లక్ష్మీదేవి యొక్క పవిత్ర కథ, శ్రీనివాస స్థితి, కులాల చరిత్ర, సువర్ణముఖరీ నది, నానాఖ్యాన సమన్వితమగు భారద్వాజ కథ, మతంగాంజన సంవాదము, పురుషోత్తమ మాహాత్మ్యము కీర్తించబడినది. మార్కండేయ చరిత్ర, అంబరీష కథ, ఇంద్రద్యుమ్న కథ, విద్యాపతికథ, జైమిని ఉపాఖ్యానము, నారదోపాఖ్యానము, నీలకంఠ సమాఖ్యానము, నరసింహోప వర్ణనము, అశ్వమేధ కథ, బ్రహ్మలోక గతి, రధయాత్రావిధి, జన్మస్థాన విధి, దక్షిణామూర్త్యు పాఖ్యానము, గుండి వ్యాఖ్యానము, రథ రక్షా విధానము, శయనోత్సవ కీర్తనము, శ్వేతో పాఖ్యానము, పృధూత్సవ నిరూపణము, డోలోత్సవము, భగవద్ర్వతము, ఉద్దాలకుని నియోగము వలన విష్ణువు యొక్క అకామిక పూజ, నానాయోగ నిరూపణలు కల యోగ సాధనము, దశావతార కథనము, స్నానాది పరికీర్తనము, పాపనాశనమగు బదరికా మాహాత్మ్యము, అగ్న్యాది తీర్థ మాహాత్మ్యము, వైనతేయ శిలాభవము, భగవద్వాస కారణము, కపాల మోచన తీర్థము, పంచధారా తీర్థము, మేరు సంస్థాపనము వర్ణించబడినది. ఇక కార్తిక మాహాత్మ్యమున మదనాలస మాహాత్మ్యము, ధూమ్రకేశ సమాఖ్యానము, కార్తీక మాసమున దిన కృత్యములు, పంచభీష్మవ్రతా ఖ్యానము భుక్తి ముక్తిదములుగా వర్ణించబడినవి. ఇక మార్గశిర మాహాత్మ్యమున స్నాన విధానము, పుండ్రాది కీర్తనము, మాలాధారణ పుణ్యకము పంచామృత స్నానము వలన కలుగు పుణ్యము. ఘంటానాదాది జన్మ ఫలము, నానా పుష్పార్చన ఫలము, తులసీదళ జప ఫలము, నైవేద్య మాహాత్మ్యము, హరివాసర కీర్తనము, అఖండైకాదశీ పుణ్యము, జాగరణ పుణ్యము, ఉత్సవ విధానము, నామ మాహాత్మ్య కీర్తనము, ధ్యానాది పుణ్య కథనము, మధురా మాహాత్మ్యము, మధురా తీర్థమాహాత్మ్యము, వన మాహాత్మ్యము, శ్రీ మద్భాగవత మాహాత్మ్యము, అంతర్లీలా ప్రకాశక మగు వజ్రశాండిల్య సంవాదము, మాఘమాసమున చేయు స్నానదాన జపోద్భవ మాహాత్మ్యము నానాకథా సమన్వితముగా పది అధ్యాయములచే చెప్పబడినది. తరువాత వైష్ణవ మాహాత్మ్యమున శయ్యా దానాది జన్య ఫలితము, జలదానాది విధులు, కామాఖ్యానము, శ్రుతదేవుని చరితము, ఆశ్చర్యకరమగు వ్యాధోపాఖ్యానము, అక్షయ తృతీయాది విశేషముల వలన కలుగు పుణ్యముల వివరములు, అయోధ్యా మాహాత్మ్యమున సురాపాప విమోక్షమను పేరుగల చక్ర బ్రహ్మ నామక తీర్థమున ధారా సహస్రకము, స్వర్గద్వారము, చంద్రహరి ధర్మ హర్యుప వర్ణనము, స్వర్ణ వృష్ట్యుపాఖ్యానము, తిలోదాసరయూ సంగమము, సీతాకుండము, గుప్తహరి సరయూ ఘర్ఘరా స్వయము, గోప్రతారము, దుగ్దోదము, గురుకుండాది పంచకము, సోమార్కాది తీర్థములు పదమూడు వర్ణించబడినవి. తరువాత గయాకూప మాహాత్మ్యము సర్వాఘ వినివర్తకముగా, మాండవ్యాశ్రమాది తీర్థములు, అజితాది మానసాది తీర్థములు చెప్పబడినవి. ఇది రెండవదియగు వైష్ణవ ఖండము వివరించబడినది.
ఇక ఇప్పుడు బ్రహ్మఖండ వృత్తాంతమును వినుము. ఈ ఖండము అఖండ పుణ్యప్రదము. ఇచట సేతు మాహాత్మ్యమున క్షణమున కలుగు స్నాన ఫలము. గాలవ తపస్సు. రాక్షస చరిత్రము, చక్రతీర్థాది మాహాత్మ్యము దేవీపత్తన సంయుత్తముగా వర్ణించబడినది. బేతాళ తీర్థ మహిమా, పాప నాశాది తీర్థ మాహాత్మ్యము, మంగళాద్రి మాహాత్మ్యము, బ్రహ్మకుండాది వర్ణనము, హనుమత్కుండ మాహాత్మ్యము, అగస్త్య తీర్థ జన్యఫలము, రామతీర్థాది కథనము, లక్ష్మీ తీర్థ నిరూపణము, శంఖాది తీర్థమాహాత్మ్యము, సాధ్యామృతాది జన్యముగా, ధనుష్కోట్యాది మాహాత్మ్యము, క్షీర కుండాది జన్య ఫలము. గాయత్ర్యాది తీర్థ మాహాత్మ్యము ఇచట వర్ణించబడినది. రామనాధ మాహాత్మ్యము, తత్త్వజ్ఞానోపదేశము, యాత్రా విధాన కథనమున సేతుయాత్రా ముక్తి ప్రదమని, ధర్మారణ్య మాహాత్మ్యము చెప్పబడినది. ఈ మాహాత్మ్యముననే స్థాణవు స్కందునకు తత్త్వోపదేశము చేయును. ధర్మారణ్య సంభవము, తత్పుణ్య పరికీర్తనము, కర్మసిద్ధి సమాఖ్యానము, ఋషివంశ నిరూపణము, అప్సరస్తీర్థ ముఖ్యవర్ణనము, మాహాత్మ్యము, వర్ణాశ్రమ తత్త్వ నిరూపణము. దివస్థ్సాన విభాగము, శుభకరమగు బకులార్క కథ, ఛత్రానందా, శాంతా, శ్రీమాతా, మతంగినీ, పుణ్యదాక్షేత్రమున దేవీ నివాసము, ఇంద్రేశ్వరాది మాహాత్మ్యము, ద్వారకాది నిరూపణము, లోహాసుర సమాఖ్యానము గంగాకూప నిరూపణము, శ్రీరామ చరితము, సత్య మందిర వర్ణనము, జీర్ణోద్ధార కథనము, ఆసన ప్రతిపాదనము, జాతి భేద కథనము, స్మృతి ధర్మ నిరూపణము చేయబడినది. తరువాత నానాఖ్యానములతో వైష్ణవ ధర్మములు చెప్పబడినవి. తరువాత పరమ పవిత్రమగు చాతుర్మాస్యమున సర్వధర్మ నిరూపణము చేయబడినది. దానప్రశంసా, వ్రత మహిత, తపః పూజాదికముల ఛిత్ర కథనము; తపః పూజావృత్తి భేదకథనము, శాలగ్రామ నిరూపణము, భారక వధోపాయము, వృక్షాల మహిమ, విష్ణువునకు శాపము, వృక్షత్వము పార్వత్యనుతపము, హరతాండవము, నృత్యము, రామనామ నిరూపణము, హరునకు లింగపతనము, బైజవన కథ, పార్వతీ జన్మ చరితము, అత్యాశ్చర్యకరమగు తారకాసురవథ, ప్రణవైశ్వర్య కథనము, తారకా చరితము, దక్షయజ్ఞ సమాప్తి, ద్వాదశాక్షర భూషణము, జ్ఞానయోగ సమాఖ్యానము, ద్వాదశాక్షరి మహిమ, మానవులకు శుభములను ప్రసాదించు శ్రవణాది పుణ్య కథనము వర్ణించబడినది. తరువాత బ్రహ్మోత్తర భాగమున అద్భుతమగు శివ మాహాత్మ్యము, పంచాక్షర మహిమ, గోకర్ణమహిమ, శివరాత్రి మహిమ, ప్రదోష వ్రత కీర్తనము, సోమవార వ్రతము, సీమంతినీ కథానకము, భద్రాయూత్పత్తి కథనము, సదాచార నిరూపణము, శివవర్మ సముద్దేశము, భద్రాయు వివాహ వర్ణనము, భద్రాయు మహిమ, భస్మ మాహాత్మ్య కీర్తనము, శబరా ఖ్యానము, ఉమా మహేశ్వర వ్రతము, రుద్రాక్ష మాహాత్మ్యము, పవిత్రమగు రుద్రాధ్యాయ మాహాత్మ్యము, శ్రవణాదికముల పావనత్వము వర్ణించబడినది. ఇట్లు నీకు బ్రహ్మఖండము వివరించబడినది.
ఇక ఇపుడు నాలుగవదగు కాశీ ఖండము వర్ణించబడినది. ఈ ఖండము సర్వోత్తమము. ఈ ఖండమున వింధ్య నారద సంవాదము వర్ణించబడినది. సత్యలోక ప్రభావము అగస్త్యాశ్రమమునకు దేవతా గమనము పతివ్రతా చరిత్రము, తీర్థయాత్రా ప్రశంస, తరువాత సప్తపురి అను పేరుగల సంయమినీ నిరూపణము, బుధ ఇంద్రాగ్నుల ప్రశంస, శివకర్మ లోకాప్తి, అగ్ని సంభవము, క్రవ్యాదవరుణ సంభవము, గంధవతీ అలకాపురీ వర్ణనము, పార్వతీ పుట్టుక, చంద్రార్క బుధలోకముల వర్ణనము, కుజ గురు సూర్య భూలోకముల వర్ణనము, బ్రహ్మలోకము, విష్ణులోకము, ధ్రువలోకము, తపోలోకముల వర్ణనము, పరమ పవిత్రమగు ధ్రువలోక కథ, సత్యలోక నిరీక్షణము, స్కందాగస్త్య సంభాషణము, మణికర్ణ సముద్భవము, గంగా ప్రభావము, గంగా నామ సహస్రకము, వారాణసీ ప్రశంసా, భైరవావిర్భావము, దండపాణి జ్ఞావా పుల ఉద్భవము, తరువాత కలావత్యాఖ్యానము, సదాచార నిరూపణము, బ్రహ్మచారి సమాఖ్యానము, తరువాత స్త్రీ లక్షణములు, కృతకృత్య నిర్ణయము, అవిముక్తేశ వర్ణనము, గృహస్థ ధర్మములు యోగినీ ధర్మములు, కాల జ్ఞానము, పవిత్రమగు దివోదాస కథ, కాశికా వర్ణనము, భూలోకమున మాయాగణపతి సముద్భవము, విష్ణుమాయా ప్రపంచము, దివోదాస విమోక్షణము, పంచనదోత్పత్తి, బిందుమాధవ సంభవము, వైష్ణవ తీర్థమను పేరుగల కాశికకు శివుడు వచ్చుట, జైగీషవ్య సంవాదము, మహేశ్వరునకు జ్యేష్ఠశ నామము, క్షేత్రాఖ్యానము, కందుకేశ వ్యాఘ్రేశ్వర సముద్భవము, శైలేశోత్పత్తి, రత్నేశ్వర్యుత్పత్తి, కృత్తివాసోత్పత్తి, దేవతాధిష్ఠానము, దుర్గాసుర పరాక్రమము, దుర్గావిజయము, ఓంకారేశ్వర వర్ణనము, ఓంకార మాహాత్మ్యము, త్రిలోచనోత్పత్తి, కేదారమను పేరుగల విష్ణు భుజోద్భవమగు ధర్మేశ కథ, వీరేశ్వర సమాఖ్యానము, గంగా మాహాత్మ్య కీర్తనము, విశ్వకర్మేశ మహిమా, దక్షయజ్ఞోద్భవము, సతీశ అమృతేశాదుల భుజ స్తంభము, పరాశరమునందు క్షేత్ర తీర్థ కదంబము, ముక్తి మండప సంకథా, విశ్వేశ్వరుని వైభవము, తరువాత యాత్రా పరిక్రమము, నిర్ణంచబడినవి. ఇట్లు నాలుగవదగు కాశీ ఖండము నిరూపించబడినది. ఇక అయిదవది యగు అవంతీ ఖండమును వినుము.
మహాకాల వనాఖ్యానము, బ్రహ్మ శీర్షచ్ఛేదము, ప్రాయశ్చిత్తవిధి, అగ్ని సముద్భవము, దేవతాగమనము, దేవదీక్ష, నానాపాతక నాశనమగు శివస్తోత్రము, కపాలమోచనాఖ్యానము. మహాకాలవనస్థితి, సర్వపాప ప్రణాశనమగు కనఖలేశ తీర్థము, అప్సర కుండము, పావనప్రదమగు రుద్ర సరోవర్ణనము, కుండవేశ తీర్థము. విద్యాఘ్ర తీర్థము, మర్కటేశ్వర తీర్థము, స్వర్గద్వార తీర్థము, చతుస్సింధు తీర్థము, శంకర వాపికా తీర్థము, పాప ప్రణాశనమగు శంకరాంక తీర్థము, గంధతీర్థము, దశాశ్వమేధికా తీర్థము, అనంశ తీర్థము, హరిసిద్ధిదము, పిశాచకాది యాత్ర, హను మత్కవచ తీర్థము, ఈశ్వర తీర్థము. మహాకాళేశయాత్ర, వాల్మీకేశ్వర తీర్థము, శుక్ర పంచకము, కుశస్థలీ ప్రదక్షిణలు, అక్రూర తీర్థము, ఏకపాద తీర్థము, చంద్రార్క వైభవము, కరభేశ తీర్థము, బటుకేశాది తీర్థములు, మార్కండేశ తీర్థము, యజ్ఞవాపి, సోమేశ తీర్థము, కరకాంతక తీర్థము, కేదారేశ్వర రామేశ సౌభాగ్యేశ నరార్కక క్షేత్రములు, కేశవార్య తీర్థము, శక్తి భేదము, స్వర్ణసార ముఖములు, ఓంకారేశాది తీర్థములు, అంధక శ్రుతికీర్తనము, కాలారణ్యమున లింగసంఖ్య, స్వర్ణ శృంగనామము. కుశస్థలీ, అవంతి, ఉజ్జయినీ నామములు, పద్మావతీ, కుముద్వతి అమరావతి నామములు, విశాలా ప్రతిశాకల్పాభిధానము. జ్వర శాంతికము, శివనామాదిక ఫలము, నాగోద్గీతా శివస్తుతి, హిరణ్యాక్ష వధాఖ్యానము, సుందరకుండ తీర్థము, నీలగంగా పుష్కర తీర్థము, వింధ్య వాసన తీర్థము, పురుషోత్తమ తీర్థము, సర్వపాప నాశకము, గోమతీ తీర్థము, వామనకుండము, విష్ణునామసహస్రకము, వీరేశ్వర సరస్సు, కాలభైరవ తీర్థము, నాగపంచమి మహిమ, నృసింహ జయంతి, కుటుంబేశ్వర యాత్ర, దేవసాధక కీర్తనము, కర్కరాజ తీర్థము, విఘోశాది సురోహనము, రుద్రకుండాది బహుతీర్థ నిరూపణము, పవిత్రమగు అష్టతీర్థయాత్ర, రేవా మాహాత్మ్యము, ధర్మరాజ వైరాగ్యము, మార్కండేయ సమాగమము, ప్రాగ్రీయాను భవాఖ్యానము, అమృతా పరికీర్తనము, నర్మదానదికి ప్రతి కల్పమున నుండునామ భేదములు. ఋషులు చేసిన నర్మదా తీర్థము, కాళరాత్రి కథ, మహాదేవస్తుతి, పృథక్కల్ప కథా, విశల్యాఖ్యానము, జాలేశ్వర కథా, గౌరీవ్రత సమాఖ్యానము, త్రిపుర వాహము, దేహపాత విధానము, కావేరీ సంగమము, దారు తీర్థము, బ్రహ్మవర్తము, ఈశ్వరకథ, అగ్ని తీర్థము, రవి తీర్థము, మేఘనాదాది దారుక తీర్థము, దేవతీర్థము, నర్మదేశ తీర్థము, కపిలతీర్థకము కరంజక తీర్థము, కుండలేశ తీర్థము, పిప్పలాద తీర్థము, విమలేశ తీర్థము, శూలభితీర్థము, శచీహరణాఖ్యానము, అభ్రక వధ, శూలభేదోద్భవము, పృధగ్విధ దాన ధర్మములు, దీర్గ తపసుని అఖ్యానము, ఋష్యశృంగ కథ, చిత్రసేనా కథ, కాశిరాజ్య లక్షణము, దేవశిలా క్యానము, శబరీ తీర్థ కద, పవిత్రమగు వ్యాధాఖ్యానము. పుష్కరిణీ తీర్థము, అర్క తీర్థము, ఆమ్రేశ్వర తీర్థము, శక్ర తీర్థము, కరోటి తీర్థము, కుమారేశ తీర్థము, అగస్త్యేశ తీర్థము, ఆనందేశ తీర్థము, మాతృజ తీర్థము, లోకేశము, ధనదేశము, మంగలేశము, కామజము, నాగేశము, గోపారము, గౌతమ తీర్థము, శంఖచూడకము, నారదేశము, నందికేశము, వారుణేశ్వర తీర్థము, దధిస్కందాది తీర్థములు, హనుమంతేశ్వర తీర్థము, రామేశ్వరాది తీర్థములు, సోమేశము, పింగళేశ్వర తీర్థము, ఋణమోక్షము, కపిలేశము, పూతికేశ తీర్థకము, జలేశయము, చండార్కము, యమతీర్థము, కాల్హోడీశము, వనాది తీర్థములు, నారాయణ తీర్థము, కోటీశ తీర్థము, వ్యాస తీర్థము, ప్రభాస తీర్థము, నాగేశ తీర్థము, సంకర్షణ తీర్థము, ప్రశ్రయేశ తీర్థము, పవిత్రమగు ఐరండీ సంగమము, సువర్ణశిల తీర్థము, కరంజ తీర్థము, కామహతీర్థము, భాండీరము, రోహిణీ భవము, చక్రతీర్థము, ధౌత పాపము, స్కంధ తీర్ధము, అంగీరస తీర్థము, కోటీ తీర్థము, అయోన్యాఖ్యము, అంగార తీర్థము, త్రిలోచనము, ఐంద్రేశము, కంబుకేశము, సోమేశము, కోమనము, నర్మదా తీర్థము, అర్కతీర్థము, ఆగ్నేయ తీర్థము, భార్గవేశ్వర తీర్థము, బ్రాహ్మము, దైవము, మార్గేశము, ఆదివారాహము, కేవవ తీర్థము, రామేశము, సిద్ధేశము, అహల్యా తీర్థము, కంకటేశ్వరము శాక్ర తీర్థము, సౌమ్య తీర్థము, నాదేశము, తోయేశము, రుక్మిణీభవము, యోజనేశము, వరాహేశము, ద్వాదశీ తీర్థము, శివతీర్థము, సిద్ధేశము, మంగలేశము, లింగతీర్థము, వారాహ తీర్థము, కుండేశ తీర్థము, శ్వేత వారాహతీర్థము, గర్భావేశము, రవీశ్వరము, శుక్లాది తీర్థములు, హుండార స్వామి తీర్థములు, సంగమేశ తీర్థము, నహుషేశ తీర్థము, మోక్షణ తీర్థము, పంచగోపక తీర్థము, నాగశాప తీర్థము, సిద్ధేశ తీర్థము, మార్కండ తీర్థము, అక్రూర తీర్థము, కామోద తీర్థము, శూలారోప తీర్థము, మాండవ్యము, గోపకేశ్వరము, కపిలేశము, పింగలేశ తీర్థము, భూతేశ తీర్థము, పాపనాశకమగు కేదారేశ తీర్థము, కలకేశము, జాలేశము, శాలగ్రామ తీర్థము, వరాహ తీర్థము, చంద్ర ప్రభాస తీర్థము, ఆదిత్య తీర్థము, శ్రీపతి తీర్థము, హంసక తీర్థము, మూల్యస్థానము, శూలేశము, ఉగ్ర తీర్థము, చిత్రదైవ తీర్థము, శిఖేశ తీర్థము, కోటి తీర్థము, దశకన్య తీర్థము, సువర్ణ తీర్థము, ఋణ మోక్ష తీర్థము, భారభూతి తీర్థము. పుంఖా తీర్థము, ముండి తీర్థము, డిండిమ తీర్థము, ఆమలేశ తీర్థము, కపాలేశ తీర్థము, శృంగ తీర్థము, ఐరండీభవ తీర్థము, కోటి తీర్థము, లోటణేశము, తరువాత ఫలస్తుతి. దృమి జంగల మాహాత్మ్యమున, రోహితాశ్వ కధా, ధుంధుమార సమాఖ్యానము, ధుంధుమార వధోపాయము, ధుంధుమార వథ, చింత్రవహోద్భవము. చిత్రవహమహమీ. చండీశ ప్రభావము. రతీశ్వరము, కేదారేశము, లక్ష తీర్థము, విష్ణుపదీ భవము, ముఖారము, చ్యవనాంధాస్యము, బ్రహ్మసరస్సు, చక్రసరస్సు, లితా సరస్సు, బహుగోమయ తీర్థము, రుద్రావర్తము, మార్కండ తీర్థము, పాప ప్రణాశన తీర్థము, శ్రవణేశ తీర్థము, శుద్ధ పట తీర్థము, దేవాంధుప్రేత తీర్థము, జిహ్వాద తీర్థసంభవము, శివోద్భేదము, ఫలస్తుతి విస్తృతముగా వర్ణించబడినది. ఇది అవంతీ ఖండము. వినువారికి సర్వపాపములను నశింపచేయును.
ఇక ఇపుడు ఆరవదగు నాగర ఖండమును చెప్పెదను. ఈ ఖండమున లింగోత్పత్తి సమాఖ్యానము, శుభకరమగు హరిశ్చంద్రకథ, విశ్వామిత్ర మాహాత్మ్యము, త్రిశంకు స్వర్గము, హాటకేశ్వర మాహాత్మ్యమున వృత్రాసుర వధ, నాగబిల శంఖతీర్థ అచలేశ్వర వర్ణనము, అత్యంత చమత్కారమును కలిగించు చమత్కార పురాఖ్యానము, గయా శీర్షము, బాలశాఖ్యము, వాలమండము, మృగాహ్వయము, విష్ణుపాదము, గోకర్ణము, యుగరూపము, సమాశ్రయము, సిద్ధేశ్వరము, నాగ సరస్సు, సప్తర్షి చరిత్రము, అగస్త్య చరిత్రము, భ్రూణనర్తము, నలేశము, భైష్మము, వైడురము, అర్కకము, శారమిష్ఠము, సోమనాధము, దౌర్గము, అతర్జలేశ్వరము, జామదగ్న్య వధాఖ్యానము, నైఃక్షత్రియ కధానకము, రామహ్రదము, నాగపురము, షడ్లింగము, యజ్ఞభూమి, ముండీరాది త్రికము, అర్కము, సతీ పరిణయము, రుద్ర శీర్షము, యాగేశము, వాలఖిల్యము, గారుడము, లక్ష్మీశాపము, సప్తవింశసోమ ప్రాసాదము, అంబాబద్ధము, పాండుకము, అగ్నేయము, బ్రహ్మకుండకము, గోముఖము, లోహముష్టి, అజాపాలేశ్వరీ శానైశ్చర్యము, రాజవాపీ, రామేశము, లక్ష్మణేశ్వరము, కుశేశము, లవేశము, సర్వోత్తమోత్తమ లింగము, అష్టషష్టి సమాఖ్యానము, దమయంతీ త్రిజాతకము, రేవతీ తీర్థము, భక్తికా తీర్థము, క్షేమంకరీ, కేదారము, శుక్ల తీర్థము కారకము, సత్యసంధేశ్వరాఖ్యానము, కర్ణోత్పలకథ, అటేశ్వరము, యాజ్ఞవల్క్యము, గౌర్యము, గాణేశ్వరము, వాస్తు పదాఖ్యానము, అజా గృహకధానకము, సౌభాగ్యాంధు, శూలేశము, ధర్మరాజు కధానకము, మిష్టాన్నదేశ్వరాఖ్యానము, గాణపత్య త్రయము, జాబాలి చరితము, మకరేశ కథా, కాలేశ్వర్యంధకాఖ్యానము, అప్సరస కుండము పుష్యాదిత్యము, రోహితాశ్వము, నాగరోత్పత్తి కీర్తనము, భార్గవ చరితము, వైశ్యామిత్రము, సారస్వతము, పైప్పలాదము, కంసారీశము, పైండకము, బ్రహ్మయజ్ఞ చరిత్ర, సావిత్రాఖ్యానము, రైవతము, భార్త యజ్ఞము, ముఖ్యతీర్థ నిరీక్షణము, కౌరవము, హాటకేశాఖ్యము, ప్రభాస క్షేత్ర త్రయము, పౌష్కర, నైమిశ, ధర్మములను అరణ్యత్రయము, వారాణాసీ, ద్వారక అవంతి అను పురీత్రయము, బృందావన, ఖాండవ, అద్వైత నామక అరణ్యత్రయము, కల్ప, శాల, నంది అను గ్రామ త్రయము, అసి శుక్ల పితృనామక తీర్థ త్రయము, శ్రీ అర్బుద రైవత నామక పర్వత త్రయము, గంగా నర్మదా సరస్వతీ అనునదీ త్రితయము అనునవి. పైన చెప్పిన త్రికములలో ఒక్కొక్క త్రికము సార్థకోటి త్రయఫలముగా కీర్తించబడినది. కూషికా శంఖ తీర్థము, అమరకము, బాలమండకము, హాటకేశ క్షేత్రము అనుక్షేత్ర చతుష్టయము క్షేత్ర ఫలప్రదముగా చెప్పబడినది. సాంబాదిత్యము, శ్రాద్ధ కల్పము, యౌధిష్ఠిరము, అంధకము, జలశాయి చతుర్మాసము, అశూన్య శయన వ్రతము, మంకణేశము, శివరాత్రి, తులాపురుష దానకము, పృధ్వీదానము, వానకేశము, కపాలమోచనేశ్వరము, పాప పిండము, మాసలైంగము, యుగమానాది కీర్తనము, నివేశము, శాకంభరీ, ఏకాదశ రుద్ర కీర్తనము దాన మాహాత్మ్య కథనము, ద్వాదశాదిత్య కీర్తనము ఇవి అన్నియు సవిస్తరముగా నిరూపించబడినవి. ఇట్లు నీకు నాగర ఖండమును వర్ణించితిని. ఇక ఇపుడు ప్రభాస ఖండమును చెప్పెదను వినుము.
ఈ ప్రభాస ఖండమున విశ్వేశుడు వర్ణించబడెను. పుణ్యప్రదమగు అర్కస్థలము, సిద్ధేశ్వరాది కాఖ్యానము, ఇచట విడిగా చెప్పబడినవి. అగ్ని తీర్థము, కపర్దేశము, కేదారేశము, భీమ, భైరవ, చండీశ, భాస్కరేందు కుజేశ్వరులు, బుధ, గురు, శుక్ర, శని శిఖాశులు హర విగ్రహులుగా, ఇతరులగు సిద్ధేశ్వరాది పంచ రుద్రులై, ఇచట వ్యవస్థితులైరి. వరారోహా, అజాపాలా, మంగళా, లలితేశ్వరీ, లక్ష్మీశుడు, వాడవేశుడు, ఉర్వీశుడు, కామేశ్వరుడు, గౌరీశ, వరుణేశ, దుర్వాసేశ, గణేశ్వర, కుమారేశ, చండకల్ప శకులీశ్వర నామక క్షేత్రములు వర్ణించబడినవి. తరువాత కోటీశ బాల బ్రహ్మాది సత్కథ చెప్పబడినది. నరకేశ సంవర్తేశ నిధీశ్వర కథలు, బలభద్రేశ్వర, గంగాగణపతి కథలు, జాంబవతీ నదీ కథ, పాండుకూప కథ, శతమేధ, లక్షమేధ, కోటిమేథ కథలు, దుర్వాస అర్కఘట స్థాన హిరణ్యాసంగమ కథ, నగరార్క, కృష్ణ సంకర్షణ సముద్రముల కథ, కుమారీ క్షేత్రపాల బ్రహ్మేశ కథలు వేరువేరుగా, పింగలా సంగమేశ కథ శంకరార్క ఘటేశుల కథలు, ఋషి తీర్థ నందార్క ఇతర కూప కీర్తనము, సోపాన పర్ణార్కన్వయ మతీ కథలు, వారాహ స్వామి వృత్తాంతము, ఛాయాలింగ గుల్ఫకథలు కనక నందాకథ, కుంతీ గంగేశుల కథ, చమసోద్భేద విదుర త్రిలోకేశ కథలు, మంకణేశ త్రైపురేశ షండతీర్థ కథలు, సూర్య ప్రాచీత్రీక్ష్ణ ఉమానాథ కథలు, భూద్ధార శూలస్థల కథ, చ్యవనార్కేశ కథలు, అజాపాలేశ, బాలార్క కుబేరస్థలజా కథలు, ఋషితోయ కథ, సంగాలేశ్వర కీర్తనము, నారదాదిత్య కథనము, నారాయణ నిరూపణము, తప్తకుండ మాహాత్మ్యము, మూల చండీశ వర్ణనము, చతుర్వక్త్ర గణాధ్యక్ష కులబేంశ్వర కథ, గోపాలస్వామి వకులస్వామి కథ, మరుత్తుల కథ, క్షేమార్కోన్నత విఘ్నేశ జలస్వామి కథా, కాలమేఘ రుక్మిణీ, దుర్వాసేశ్వర, భద్ర, శంఖావర్త, మోక్షతీర్థ, గోప్పదాచ్యుత పద్మ, జాలేశ్వర, హుంకారేశ్వర చండీశుల కథలు, ఆశాపురస్థ విఘ్నేశ కలాకుండ కథ, కపిలేశ కథా, జరద్గవ శివకథ, నలకర్కోటేశ్వరుల కథ, హాటకేశ్వర కథ, నారదేశ యంత్రభూష దుర్గకూట గణేశ కథలు, సుపర్ణా ఇలా భైరవీ భల్ల తీర్థ భవకథా, కర్దమాల కీర్తనము, గుప్త సోమేశ్వర కథ, బహు స్వర్ణేశ, శృంగేశ కోటీశ్వర కధ, మార్కండేశ్వర, కోటీశ, దామోదర గృహోత్కధా, స్వర్ణరేఖా, బ్రహ్మకుండ కుంతీ భీమేశ్వర కథ, మృగీకుండ సర్వస్వకథ, వస్త్రా పథ క్షేత్ర కథా, దుర్గాభిల్లేశ గంగేశ రైవత కథ, అర్బుదేశ్వర కథ, అచలేశ్వర కీర్తనము, నాగతీర్థ కథ, వసిష్ఠాశ్రమ వర్ణనము, భద్రకర్ణ మాహాత్మ్యము, త్రినేత్ర మాహాత్మ్యము, కేదార మాహాత్మ్యము, తీర్థాగమన కీర్తనము, కోటీశ్వర రూపతీర్థ హృషీకేశ కథలు, సిద్ధేశ శుక్రేశ్వర మణి కర్ణీశ కీర్తనము, పంగుతీర్థ యమతీర్థ వారాహతీర్థ వర్ణనము, చంద్ర ప్రభాస, పిండోద శ్రీమాతా శుక్ల తీర్థజ కథా, కాత్యాయనీ మాహాత్మ్యము, పిండారక మాహాత్మ్యము, కనఖల కథ, చక్రమానుష తీర్థ, కపిల తీర్థ అగ్నితీర్థ కథా, రక్తానుబంధజు కథ, గణేశ పార్థేశ్వర యాత్ర యందు ఉజ్జ్వల కథ, చండీస్థాన, నాగోద్భవ, శివకుండ, మహేశ కథలు, కామేశ్వర కథ, మార్కండే యోత్పత్తి కథ, ఉద్దాలకేశ సిద్ధేశ గత తీర్థకథ, శ్రీదేవఖాతోత్పత్తి, వ్యాస గౌతమ తీర్థముల కథ, కుల సంతార మాహాత్మ్యము రామకోటి తీర్థమాహాత్మ్యము, చంద్రోద్భే దేశాన శృంగ బ్రహ్మస్థా నోద్భవము, త్రిపుష్కర, రుద్రహ్రద గుహేశ్వర కథలు, అవిముక్త మాహాత్మ్యము, ఉమామహేశ్వరుల కథ, మహౌజా ప్రభావము, జంబూతీర్థ వర్ణనము, గంగాధర మిశ్రక కథ, ఫలస్తుతి, ద్వారకా మాహాత్మ్యమున చంద్రశర్మ కధా, జాగరాద్యర్చణాది వ్రతములు, ఏకాదశీ వ్రతము, మహాద్వాదశీ వ్రతము, ప్రహ్లాదర్షి సమాగమము, దుర్వాసుని ఉపాఖ్యానము, యాత్రోపక్రమ కీర్తనము, గోమత్యుత్పత్తి కథనము. గోమతీస్నాన జన్యఫలము, చక్రతీర్థ మాహాత్మ్యము, గోమతీ సముద్ర సంగమము, సనకాది హ్రదాఖ్యానము, నృగతీర్థకధా, గోప్రచారకధా, గోపికలు ద్వారకకు వచ్చుట, గోపీసరస్స మాఖ్యానము, బ్రహ్మతీర్థాది కీర్తనము, పంచనద్యాగ మాఖ్యానము, నానాఖ్యాన శివలింగ గదా తీర్థ కృష్ణపూజాది కీర్తనము, త్రివిక్రమ మూర్త్యాఖ్యకథ, దుర్వాస కృష్ణసంకథ, కుశదైత్యవధ, ఉచ్చార విశేషార్చన జన్యఫలము, గోమతియందు, ద్వారకయందు, తీర్థాగమన కీర్తనము, కృష్ణమందిర సంప్రేక్ష, ద్వారవత్య భిషేచనము. తీర్థావాసకథా, ద్వారకాపుణ్య కీర్తనము, ఇవి అన్నియు సవిస్తరముగా వర్ణించబడినవి. ఇదియే ఏడవదియగు ప్రాభాసిక ఖండము. ఈ ఖండమున సర్వోత్తమ కథలు శివ మాహాత్మ్యము వర్ణించబడినవి. ఈ స్కాంద పురాణమును వ్రాసి మాఘ పూర్ణిమనాడు హేమశూల సమన్వితముగా బ్రాహ్మణుని సత్కరించి దానము చేసినచో అతను శివ లోకమున ఆనందమును పొందును. (4/104)