నారద మహా పురాణము
పురుషోత్తమ మాహాత్మ్యము
మోహిని పలికెను: ఓ మునిశ్రేష్ఠా! పురాతన విషయమును నేనడిగిన దానిని తెలుపుము. పూర్వము ఇంద్రద్యుమ్నుడు ఆ ప్రతిమలను ఎట్లు నిర్మించెను. శ్రీహరి ఎట్లు సంతోషించెను. దానిని అంతటిని వివరించుము. నాకు వినవలయునని చాలా కుతూహలముగా ఉన్నది.
వసువు పలికెను: సునేత్రా! పురాణము వేదసమ్మితము అగు ప్రతిమా సంభవేతిహాసమును చెప్పెదను వినుము. మహాయజ్ఞము జరుగుచుండగా ప్రాసాదము నిర్మించబడుచుండగా ఇంద్రద్నుమ్నునకు రేయింబవలు ప్రతిమల కొరకు చింత కలుగుచునే ఉండెను. ఏ ఉపాయముచే సర్వలోక విభావసుడు సర్గస్థిత్యంత కర్తయగు పురుషోత్తముని దర్శించగలను? ఇట్లు చింతావిష్ణుడగు నరేంద్రుడు రాత్రి పగలు పరుండలేదు. స్నానము లేదు. భోగాను భవము లేదు. అలంకరణ లేదు. శైలజ, ధాతుజ, దారుజ ప్రతిమలు మాత్రమే సర్వలక్షణ లక్షితములు విష్ణువునకు యోగ్యములు. ఈ మూడు విధములగు ప్రతిమలనే దేవతలు అర్చింతురు. వీటిని స్థాపించినచో ప్రభువు ప్రీతి చెందునని చింతాపరుడాయెను. పాంచరాత్ర విధానముచే పురుషోత్తముని పూజించి చింతాకులుడై స్తుతించసాగెను.
ఇంద్రద్యుమ్నుడు పలికెను: వాసుదేవా! నీకు నమస్కారము. మోక్షకారణా! నమస్కారము. సర్వలోకేశా నన్ను సంసార సాగరమునుండి కాపాడుము. నిర్మలాంశుక సంకాశా! పురుషోత్తమా! నమస్కారము సంకర్షణా! నీకు నమస్కారము. ధరణీధరా! నన్ను కాపాడుము. హోమగర్భునకు మకరధ్వజునకు నమస్కారము. రతికాంత! నీకు నమస్కారము. శంబరాంతకా! నన్ను కాపాడుము. మేఘ సంకాశా! భక్తవత్సల! అనిరుద్ధా! నమస్కారము. నన్ను కాపాడుము. వరదుడవుకమ్ము. విబుధావాస! విబుధ ప్రియ! నారాయణా నమస్కారము. శరణాగతుడను కాపాడుము. బలిశ్రేష్ఠా! లాంగలాయుధా! విబుధ శ్రేష్ఠా! కమలోద్భవా! నమస్కారము! చతుర్ముఖా! జగద్ధాత! ప్రపితామహా! నన్ను కాపాడుము. నీల మేఘాభ! దితిజాంతకా! నమస్కారము. నరసింహ! మహావీర్య! దీప్తలోచనా! నన్ను కాపాడుము. ఓ మహావరాహా! నీటిలో మునిగి యున్న భూమిని రసాతలమునుండి ఉద్ధరించినటుల నన్ను దుఃఖ సాగరము నుండి ఉద్ధరించుము. నీ అవయవ స్వరూపములు వరదలగు దేవతలను స్తుతించితిని. నీవు ఈ బల దేవాదులు పృథ గ్రూపముతో ఉంటిరి. నీ అవయవములు గరుడాదులు, దిక్పాలాదులు సాయుధులగు ఇంద్రాదులు, ఇతర దేవతలు వీరందరూ నీ భేదములు. ప్రసన్నాయతలోచనా! వీరందరిని స్తుతించితిని. నమస్కరించితిని. నాకు ధర్మకామార్ధమోక్షప్రదమగు వరము నిమ్ము. శ్రీహరీ! నీ భేదములుగా కీర్తించబడిన సంకర్షణాదులు పూజ కొరకు ఆరంభించబడినవి మాత్రమే. నిన్ను ఆశ్రయించి ఉండునవి మాత్రమే. పరమార్థమున నీకే భేదములు లేవు. నీ బహువిధ రూపములు ఉపచారము మాత్రమే. అద్వైతముగా ఉన్న నిన్ను ద్వైతముగా ఎట్లు చెప్పగలరు? శ్రీహరీ! నీవు ఒకడివే సర్వవ్యాపకుడవు. చిత్స్వభావుడవు. నిరంజనుడవు. నీరూపము పరమము. భావాభావ వివర్జితము. నిక్షేపము. నిర్లేలము. సూక్ష్మము. కూటస్థము. అచలము ధ్రువము. సర్వోపాధి వినిర్ముక్తము. సత్తామాత్రముగా వ్యవస్థితము. ఈ విషయము దేవునికే తెలియును. నేనెట్లు తెలియుదును? ఇక నీ మరియొక రూపము పీతాంబరము, చతుర్భుజము, శంఖ చక్రగదాపాణి, మకుటాంగద ధారి, శ్రీవత్సవక్షసము, వనమాలావిభూషితము. ఈ నీ రూపమును నిన్ను ఆశ్రయించిన వారు దేవతలు పూజింతురు. హే దేవా! సర్వసుర శ్రేష్ఠా! భక్తాభయ వరప్రద! చారు పద్మాక్ష! విషయసాగరమున మునిగి ఉన్న నన్ను కాపాడుము. నిన్ను తప్ప నేనెవరిని శరణు పొందగలను? కావున నాయెడ ప్రసన్నుడవు కమ్ము. జరచే వ్యాధి శతములచే కూడియుండి, నానాదుఃఖములచే పీడితుడనై హర్ష శోకాన్వితుడనై కర్మపాశయంత్రితుడనై రౌద్రము మహాఘోరమగు సంసార సాగరమున పడియుంటిని. ఈ సాగరము విషయ జలములు గలిగి దాటరానిది. రాగద్వేష సమాకులము. ఇంద్రియములను సుడి గుండములచే గంభీరము. తృష్ణా శోకము అను తరంగములచే సంకులము. నిరాశ్రయము. నిరాలంబము, నిస్సారము. అత్యంత చంచలము. మాయచే మోహితుడనై ఈ సాగరమున భ్రమించుచున్నాను. నానాజాతి సహస్రములలో పుట్టుచుంటిని. నేను కొన్నివేల జన్మలను పొందితిని. ఈ సంసారమున బహువిధానుభూతులను పొందితిని. సాంగ వేదములను బహువిధ శాస్త్రములను చదివితిని. ఇతిహాస పురాణములను చదివితిని. అనేక శిల్ప శాస్త్రములను అధ్యయనము చేసితిని. సంతోషములను, దుఃఖములను చాలా చవిచూచితిని. చాలా క్షయములను, వృద్ధులను, ఉదయములను పొందితిని. భార్యామిత్ర బంధు వియోగములు సంగమములు సంభవించినవి. చాలామంది తండ్రులను తల్లులను చూచితిని. బంధువులను సోదరులను, జ్ఞాతులను పొందితిని. మలమూత్ర భూయిష్టమగు స్త్రీల దేహమున నివసించితిని. గర్భవాసమున మహాదుఃఖమును అనుభవించితిని. గుప్త మార్గముగల యమాల యమున యాతనాకులమగు నరకమున నానాయాతనలను అనుభవించితిని. క్రిములుగా, కీటకములుగా, వృక్షములుగా, యేనుగులుగా, అశ్వములుగా, మృగములుగా, పక్షులుగా, మహిషములుగా, గోవులుగా, ఇతర వనచరములుగా, బ్రాహ్మణులుగా, శూద్రులుగా, ధనవంతులుగా, క్షత్రియులుగా, దరిద్రులుగా, తపస్వులుగా, రాజులుగా రాజ భృత్యులుగా, ఇతర దేహులుగా వారి వారి ఇండ్లలో పుట్టితిని. చాలామంది రాజులకు దాస్యమును చేసితిని. దరిద్రత్వమును, ఈశ్వరత్వమును, స్వామిత్వమును కూడా పొందితిని. నేను చాలా మందిని చంపితిని. చాలామందిచే చచ్చితిని. ఇతరులు నాకిచ్చిరి. ఇతరులకు నేనిచ్చితిని. తల్లి, తండ్రి, మిత్రులు, భార్యమొదలగు వారి కొరకు సంతోషించితిని. చాలామార్లు రోదించితిని. దేవతిర్యఙ్మనుష్య స్థావర జంగమములన్నిటిలో నేను పుట్టని స్థానము లేదు. నేను ఎపుడు నరకములో ఉందునో, ఎపుడు స్వర్గములో ఉందునో, ఎపుడు మనుష్య లోకములో నుందునో, ఎపుడు తిర్యగ్జన్మ నందుదునో, జలయంత్రము లందు, చక్రము నందు, గోతులలో, బంధనములలో నుంటినో, క్రింద పడవేయబడితినో ఊర్థ్వ భాగమునకు వెళ్ళి తినో, మధ్యలో నుంటినో, ఇట్లు కర్మలతా పాశమును ఆశ్రయించి యుంటిని. ఇట్లు మహా భయంకరము, శరీరమును గగుర్పొడుచు ఈ సంసార చక్రమున చాలాకాలమునుండి తిరుగుచున్నాను. ఎచటా అంతము కనపడుట లేదు. నేను వ్యాకుల మనస్సుతో ఏమి చేయుచున్నానో తెలియలేకున్నాను. శోకముచే ఆశచే అభిభూతుడనై కాందిశీకుడను విచేతనుడనైతిని. ఇప్పుడు వ్యాకులుడనై నిన్ను శరణు వేడితిని. కావున సంసార సాగరమగ్నుడను దుఃఖితుడనగు నన్ను కాపాడుము. నన్ను భక్తునిగా తలచితివేని నాయందు దయతలచుము. నీవు తప్ప నా గురించి విచారించు వారు లేరు. నిన్ను ప్రభువుగా పొందిన నాకు భయము లేదు. జీవితమున మరణమున యోగక్షేమములందు నాకు సంశయమే కలుగదు. నిన్ను యథావిధిగా పూజించనివారికి సంసార బంధనము నుండి సద్గతి ఎట్లు లభించును? వారి కులము శీలము విద్య జీవితములచే ఏమి ప్రయోజనము? జగద్ధాతనగు నీయందు భక్తిలేని వారి జీవితము వ్యర్థము. అసురప్రకృతిని అవలంబించి నిన్ను నిందించువారు మాటిమాటికి పుట్టుచు ఘోర నరకముల పాలగుదురు. వారికి నరక సముద్రమునుండి నిష్కృతి లభించదు. చెడు నడవడి కలవారై నిన్ను దూషించువారు నరాధములు. కర్మానుసారముగా నా పుట్టుక కలుగు ప్రతిచోట నీయందు అక్షతమగు భక్తి అన్నివేళలా ఉండనిమ్ము. నిన్ను పూజించిన దైత్యులు మానవులు పరమ సిద్ధిని పొందిరి. కావున నిన్నెవరు పూజించ కుందురు? ప్రకృత్య తీతుడవగు నిన్ను బ్రహ్మాదులుకూడా స్తుతించజాలరు. అయిననూ నేను అజ్ఞానముచే నిన్ను స్తుతించు నాయందు దయ కలదేని నా అపరాధమును క్షమించుము. సాధువులు తప్పు చేసిన వారినికూడా క్షమింతురు. కావున నాయందు ప్రసన్నుడవు కమ్ము. నా భక్తిచే నాయందు స్నేహమును చూపుము. భక్తి భావముచే నేను స్తుతించుచుంటిని నా స్తోత్రము సమగ్రము కానిమ్ము. ఓ వాసుదేవా నీకు నమస్కారము. (II/53)