గంగామాహాత్మ్య వర్ణనము

వసిష్ఠ మహర్షి పలికెను: వసువు శుద్ధిపొందదలచిన మోహినిని సర్వలోక హితమునుకోరి మృదువుగా ఇట్లు పలికెను.

వసువు పలికెను: ఓమోహినీ వేరు వేరుగా తీర్థ లక్షణములను చెప్పెదను వినుము. ఇవి తెలిసినంతనే పాపులకు ఉత్తమగతి లభించును. భూలోకమున అన్ని తీర్థములలో శ్రేష్ఠ మైనది గంగాతీర్థము. గంగతో సమానమగు పాపనాశక తీర్థము మరియొకటి లేదు. ఆ మాటను వినిన మోహిని గంగా స్నానము చేయదలచి వసువుతో ఇట్లు పలికెను.

మోహిని పలికెను: ఓ బ్రాహ్మణ శ్రేష్టా! సర్వపురాణ సమ్మతమగు ఉత్తమగంగా మాహాత్మ్యమును ఇప్పుడు చెప్పుము. పాపనాశకమగు గంగా మాహాత్మ్యమును విని నీతో కలిసి పాపనాశినిలో స్నానము చేయుటకు వెళ్ళెదను. ఆ మోహినీ వాక్యమును వినిన సర్వ పురాణవిదుడగు వసువు పాపనాశకమగు గంగా మాహాత్మ్యమును చెప్పసాగెను.

వసువు పలికెను: గంగానదీ సమీపమున ఉన్నవి మాత్రమే దేశములు, జనపదములు, పర్వతములు ఆశ్రమములు అనబడును. గంగా సేవనముచే లభించు సద్గతి తపస్సుచే, బ్రహ్మచర్యముచే, యజ్ఞము లచే, త్యాగముచే లభించదు. యౌవనమున పాపకర్మలను చేసినవారు కూడా వృద్ధాప్యమున గంగను సేవించినచో ఉత్తమ గతిని పొందెదరు. వేయియుగములు ఒంటికాలుపై నిలిచి తపమును చేసిన వాడు ఒక మాసము గంగను సేవించినవాడు సమాన ఫలమును పొందును. పదివేల యుగములు తలక్రిందులుగా తపస్సు చేసినవాడు యధేచ్ఛగా గంగయందు నిలిచినవాని కంటే తక్కువ స్థితిలో ఉండును. దుఃఖోపహత చేతస్కులగు ఉత్తమ గతిని అన్వేషించు సమస్త ప్రాణులకు గంగను మించిన గతి లేదు. ప్రకృష్టములు ఘోరములగు పాపములను ఆచరించిన, అపవిత్రమగు నరకము నకు వెళ్ళు ప్రాణులకు గంగనుమించిన గతిలేదు. ప్రకృష్టములు ఘోరములగు పాపముల నాచ రించిన, అపవిత్రమగు నరకమునకు వెళ్ళు పరమ పాపులను కూడా సహించి నిరోధించి గంగ తరింపచేయును. గంగను ఎప్పుడూ వెళ్ళి సేవించువారు మునులతో ఇంద్రాది దేవతలతో సమానులు. అంధులను జడులను ద్రవ్యహీనులను కూడా విశ్వరూప బృహతి యను గంగ పావనము చేయును. ఇంద్రాది దేవతలచేత మునులచేత మానవులచేత తమ సమృద్ధి కొఱకు సర్వ కాలములందు సేవించబడుచున్నది. పక్షాదియందు, కృష్ణపక్షమున అమావాస్యనుండి వెనుకకు పదిదినములు గంగ భూమియందు సన్నిహితముగా ఉండును. శుక్ల ప్రతిపత్తు నుండి పది దినములు పాతాళమునకు సన్నిహితముగా నుండును. శుద్ధ ఏకాదశి నుండి పది దినములు అనగా బహుళ పంచమి వఱకు స్వర్గమునకు సన్ని హితముగా నుండును. కృతయుగమున అన్ని తీర్థములు పావనములే. త్రేతా యుగమున పుష్కర తీర్థము, ద్వాపరయుగమున కురుక్షేత్రము, కలియుగమున గంగాతీర్థము విశిష్ఠము. కలియుగమున అన్ని తీర్థములు తమతమ శక్తులను గంగలో నిక్షేపించును. గంగ మాత్రము ఎచటా నిక్షేపించదు. గంగాజల కణమును తాకిన వాయువును స్పృశించిననూ పాప శీలులగు నరులు కూడా ఉత్తమ గతిని పొందెదరు. సర్వగతుడు జ్ఞానస్వరూపుడు అగు జనార్ధనుడే ద్రవరూపమున గంగా జలముగా నిలిచెను. ఈ విషయమున సంశయముతో పనిలేదు. బ్రహ్మహత్య చేసినవాడు, గురుహంతకుడు, గోహంతకుడు, చోరుడు, గురుతల్పగతుడు గంగా జలముచే పావనులు అగుదురు. ఇచట విచారించవలసిన పనిలేదు.

క్షేత్రస్థమగు జలము, ఉద్దృతమగు జలము శీతమైనను ఉష్ణమైననూ గంగాజలమైనచో మరణము వరకు చేసియున్న పాపములను హరించివేయును. పర్యుషితమగు జలమును వర్జించ వలెను. పర్యుషిత దళమును వర్జించవలెను. కాని గంగా జలమును, తులసీ దళమును వర్జించ వలసిన పనిలేదు. వేరు పర్వతగుణములను, సువర్ణ గుణములను, సర్వరత్న గుణములను, పాషాణ సంఖ్య, ఉదకసంఖ్య, గంగాజలగుణ సంఖ్య చెప్పశక్యముకానిది. సకల తీర్థయాత్రా విధి నాచరించనివారు కూడా గంగా జలసేవన మాహాత్మ్యమున ఉత్తమ గతిని పొందగలుగును. చింతా మణి గుణములకంటే భక్తులకు వాంఛితార్థమును ప్రసాదించు గంగా జలబిందువులు విశిష్ఠములు. భక్తిచే గండూషమాత్ర గంగాజల సేవనము కామధేనువు సృజించు దివ్యభోగములను అనుభవించ గలుగును. శాలగ్రామ శిలయందు గంగాజలమును ప్రోక్షించినవాడు తీవ్రమగు అజ్ఞానమును హరించి ఉదయకాల సూర్యునివలె ప్రకాశించును. మనోవాక్కాయ పాపములు చేసినవాడు కూడా గంగా జలమును దర్శించినచో పావనత్వమును పొందును. గంగా జలాభిషిక్తమగు భిక్షను భుజించిన వాడు పాము కుబుసమును విడుచునట్లు పాపములను విడుచును. హిమాలయ వింధ్య పర్వతములంతటి పాపరాశులు కూడా గంగా జలముచే విష్ణు భక్తిచే ఆపదలు తొలగునట్లు తొలగిపోవును. భక్తితో స్నానమునకై నరులు గంగా జలమున ప్రవేశించినంతనే బ్రహ్మహత్యాది పాపములు హాహా అనుచు పారిపోవును. నిత్యము గంగాతీరమున నివసించవలయును. గంగాజలమును పానము చేయవలెను. ఇట్లు చేసిన మానవుడు పూర్వజన్మ సంచిత పాపముల నుండి కూడా విముక్తుడగును. నిత్యము గంగనాశ్రయించి నివసించు వాడు దేవతలకు, మానవులకు, మహర్షులకుకూడా పూజించ దగినవాడు. అష్టాంగయోగముతో, తపములచే, యాగములచే ప్రయోజనము లేదు. గంగా తీర వాసమే విశిష్ట ఫలప్రదము. కాలహరణమును చేయు బహు యజ్ఞములచే, తపస్సులచే, ధనార్పణలచే ఏమి ప్రయోజనము. సర్వమోక్ష ప్రదయగు గంగ సులభసేవ్యముగా ఉన్నది కదా. యజ్ఞ యమని యమ దాన సన్యాసములచే కూడా గంగాసేవ ఫలము లభించజాలము. రాహుగ్రస్త సూర్యగ్రహణ కాలమున ప్రభాస తీర్థమున గోసహస్రదానము చేసిన లభించు ఫలము గంగాసేవనముచే లభిం చును. మోక్షమును కోరువాడు అన్యోపాయములను విడిచి గంగాతీరమున ఆనందముగా ఉండ వలెను. ఆ గంగాతీరమే మోక్ష భాజనము. విశేషించి వారాణసీలో ఉన్న గంగ సద్యో మోక్ష ప్రదము. ప్రతిమాసమున చతుర్దశినాడు అష్టమినాడు యావజ్జీవము గంగా తీరవాసము సిద్ధిని ప్రసాదించును. ఎల్లప్పుడు కృచ్ఛ్ర వ్రతములను ఆచరించి పొందు ఫలము, సదా చాంద్రాయణమును ఆచరించువాడు పొందు ఫలము జాహ్నవీ తీరవాసమున పొందగలుగును. సగము దినము గంగా సేవాపరుడైనవాడు పొందు ఫలమును నూరు యాగములను ఆచరించువాడు కూడా పొందజాలడు. సర్వయజ్ఞ తపోదాన యోగ స్వాధ్యాయకర్మలచే పొందు ఫలమును గంగా తీరనివాసి పొందకలుగును. సత్యవచనమున, నైష్ఠిక బ్రహ్మచర్యమున, నిత్యాగ్ని హోత్రులకు లభించు పుణ్యము గంగాతీర నివాసులకు లభించును. మాతృపితృదారలను కోటికులమును అనంతముగా గంగాభక్తి సంసార సాగరము నుండి తరింపచేయును. సంతోషము పరమైశ్వర్యము, తత్త్వజ్ఞానము, వినయము, ఆచార సంపత్తి గంగా భక్తునికి సమకూరును. గంగాజలమును పానము చేసినవాడు కృతకృత్యుడగును. నరుడు మృతుడైనను గంగాభక్తుడు గంగాపరుడుగనే ఉండవలెను. భక్తిచే గంగా జలమును పానము చేసినవాడు, గంగాజలమును స్పృశించువాడు సులభముగా మోక్షోపాయమును తెలియును. గంగాజలముచే సర్వకార్యముల ఆనాచరించువాడు సర్వయజ్ఞ దీక్షితుడు, ప్రతి నిత్యము సోమపానము చేసినవాడగును. సూర్యచంద్రాదులు ఇంద్రాదిదేవతలు అమృతమును పానము చేసినట్లు గంగా జలపానమును చేసిన వారు దేవమును విడిచి, శివుని సన్నిధిలో ఆనందింతురు. భక్తిచే కన్యాదానమును, భూదానమును, అన్నదానమును, గోదానమును, స్వర్ణ దానాదులను, రధాశ్వగజ దానములను చేసినవారికి కలుగు పుణ్యమునకు నూరురెట్లు చులుకమాత్ర గంగాజల ప్రాశనముతో కలుగును. సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించిన వారికి కలుగు ఫలమున కంటే అధిక ఫలము గంగా జలపానము వలన కలుగును. గండూషమాత్ర గంగా జలపానముచే అశ్వమేధ యాగఫలము లభించును. ఇష్టపూర్వకముగా గంగా జలపానము చేసిన వారికి మోక్షము కరతలా మలకముగా నుండును. మూడు మాసములు సరస్వతీతోయము, ఏడుమాసములు యమునాజలము పది మాసములతో నర్మదా జలమును సంవత్సరము గంగా జలమును సేవించవలెను. మరణించిన వారికి శాస్త్రవిధిని అనుసరించి తర్పణమును చేయువారి అస్థులను గంగా తోయమున కలిపినచో ఉత్తమగతులు లభించును. కాయశోధనమును చేయు సహస్ర చాంద్రాయణ వ్రతములను ఆచరించిన వారికంటే యధేష్ఠముగా గంగా జలపానమును చేసిన వాడు విశేష ఫలమును పొందును. గంగను దర్శించినవాడు, స్తుతించినవాడు, గంగా స్నానము చేసినవాడు, భక్తిచే గంగా జలమును పానము చేసినవాడు, స్వర్గమును, పవిత్రజ్ఞానమును, ఉత్తమ యోగమును, మోక్షమును పొందును. గోమూత్ర యావకాహారము కంటే సూర్యకిరణ పరితప్తమగు గంగాజలపానము విశేషఫలము నిచ్చును. (11/38)