నారద మహా పురాణము
జనక శుక ఆధ్యాత్మ తత్త్వ నిరూపణము
సనందన మహర్షి పలికెను: “అంతట జనక మహారాజు మంత్రులచే సమస్తాంతఃపుర జనముచే కూడి పురోహితుని ముందుంచుకొని శిరస్సుతో అర్ఘ్యమును తీసుకొని గురు పుత్రుని చేరెను. సర్వరత్న విభూషితమగు ఉత్తమాసనమును గురు పుత్రుడగు శుక మహర్షి కొసంగెను. ఆసనముపై కూర్చొని యున్న వ్యాసపుత్రునికి శాస్త్రవిధానముతో మొదట పాద్యమునిచ్చి తరువాత అర్ఘ్యమును గోవును సమర్పించెను. బ్రాహ్మణోత్తముడగు శుకమహర్షి మంత్రయుక్తమగు పూజను స్వీకరించి జనకమహారాజును అంతటా కుశలమునడిగెను. ఉదార స్వభావముకల జనకుడు కూడా గురు పుత్రునికి తమ క్షేమ సమాచారమును నివేదించి శుకమహర్షి అనుమతిని పొంది భూమి మీద కూర్చొనెను. తరువాత శుకమహర్షిని కుశలమడిగి రాకకు కారణమేమని విధానమును తెలిసిన జనకుడు అడిగెను.
శుకమహర్షి పలికెను: ఓ జనక మహారాజా! నీకు శుభమగుగాక! నా తండ్రి వేదవ్యాసుడు నాతో నాకంటే ముందువాడు విదేహ రాజు అగు జనకుడు మోక్ష ధర్మార్ధ కోవిదుడు. నీవు త్వరగా అతని వద్దకు వెళ్ళుము. అతను నీ సంశయములను తొలగించగలడు. ప్రవృత్తి మార్గమున నివృత్తి మార్గమున కలుగు అన్ని సందేహములను తొలగించగలడు అని చెప్పెను. అట్లు నా తండ్రి అజ్ఞ వలన నేను నిన్ను అడుగుటకు ఇచటికి వచ్చితిని. కావున ఓ ధర్మజ్ఞుడా! బ్రాహ్మణుడు ఏమి చేయవలయును? మోక్షము ఏ స్వరూపము? మోక్షమును జ్ఞానముచే సాధించవలయునా? తపస్సుచే సాధించవలయునా? ఎట్లు సాధించ వలయును?
జనక మహారాజు పలికెను: “బ్రాహ్మణుడు పుట్టినప్పటి నుండి చేయవలసిన దానిని వినుము. ఉపనయనమును చేసుకొని వేద పరాయణుడు కావలయును. గురువును సేవించుచు, తపస్సుచే బ్రహ్మ చర్మముచే కూడినవాడై, ఆశ అసూయ లేనివాడై దేవతలను, పితృ దేవతలను ఆరాధించ వలయును. జితేంద్రియుడై వేదాధ్యయనమును గావించి దక్షిణను సమర్పించి గురువాజ్ఞను పొంది ఇంటికి తిరిగిరావలయును. ఇట్లు చేరి వివాహము చేసుకొని భార్యతో నియమబద్ధ జీవితమును గడుపవలయును. ఆహితాగ్ని అయి అసూయను వదిలి శాస్త్రబద్ధముగా వ్యవహరించుచు పుత్రులను పౌత్రులను పొంది వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించ వలయును. ఆయగ్నినే న్యాయానుసారముగా పూజను సలుపుచు అతిథిప్రియుడై అన్ని అగ్నులను అత్మలో ఆవేశింపచేసుకొని ధర్మములను తెలిసినవాడై ద్వంద్వములను వీడి, వైరాగ్యము అలవరచుకొని బ్రహ్మాశ్రమమున వసించవలయును.”
శుక మహర్షి పలికెను: హృదయమున శాశ్వతమైన జ్ఞానము కలిగి విజ్ఞానము ప్రత్యక్షముకాగా అని చెప్పినచో గుర్వాశ్రమమున నివసించక జ్ఞానమును పొందలేరు కదా! ఆశ్రమమున తప్పక ఉండవలయునా? అవసరము లేదా? ఈ విషయమును మీరు చెప్పవలయును.
జనక మహారాజు పలికెను: “జ్ఞానవిజ్ఞానములు లేనిచో మోక్షము లభించదు. అట్లే గురు సంబంధము లేనిచో జ్ఞానము లభించదు. ఆచార్యుడు తరింపచేయువాడు. జ్ఞానము పడవ. జ్ఞానము పొంది కృతకృత్యుడై తరింపచేయువానిని పడవను విడిచి పెట్టవలయును. లోక సంగ్రహము కొరకు, కర్మ సంగ్రహము కొరకు శుభాశుభ కర్మలను ఆచరించిన తరువాత మోక్షము లభించును. సంసారమున బహుజన్మలలో కలిగిన కారణములచే కరణములచే చరింప వలయును. పరిశుద్ధాత్ముడు ప్రథమాశ్రమముననే మోక్షమునందగలడు. అట్లు మోక్షమును పొంది, ముక్తుడై జ్ఞానియై పండితుడైన వానికి, పరముయందు అభిలాష కలవానికి మిగిలిన మూడాశ్రమములచే పనియేమి? ఎల్లపుడు రాజస తామస దోషములను విడువవలయును. సాత్త్విక మార్గమున నిలిచి ఆత్మచే ఆత్మను చూడవలయును. అన్ని ప్రాణులలో అత్మను, అన్ని ప్రాణులను ఆత్మలో చూచుచు సంబంధమును పెట్టుకొనరాదు. దృష్టాంతము జలచరమునకు జలమంటదు కదా! ఆకాశమున వాయువుపైన పక్షివలె ఉన్నచో ఈ లోకమున అనంత్యమును పొందగలడు. శీతోష్ణాది ద్వంద్వములను దాటి సంసారబంధ నిర్ముక్తుడై శుభసంగతుడై దేహమును విడుచును. ఈ విషయమున యయాతి మహారాజు పూర్వము కొన్ని గాధలను చెప్పియుండెను. వాటిని వినుము. మోక్ష శాస్త్రార్ధ విశారదులగు బ్రాహ్మణులు ఆ గాధలను ఎప్పుడూ హృదయమున ధరించుచుందురు. ఆత్మలోనే జ్యోతి ఉండును. మరియొకచోట ఉండదు. రత్నము అచటనేఉండును. ఆత్మయే రత్నము. సావధానమనస్కుడు స్వయముగా ఆత్మదర్శనమును చేయగలడు. ఎవనికి పరము భయపడదో, పరము వలన ఎవడు భయపడడో, ఎవడు కోరడో, ద్వేషించడో వాడు బ్రహ్మ యగును. అన్ని భూతములందు పాపభావమును చేయనివాడు పూర్వులు ఆచరించిన నాలుగు ఆశ్రమములను ఆచరించువాడు, ఈ క్రమముతో బహుపుణ్యకర్మలను చేయువాడు, త్రికరణ శుద్ధి కలవాడు బ్రహ్మ అగును. మోహమును కలిగించు ఈర్ష్యను విడిచి, తపస్సుచే ఆత్మను సంయోణింపచేసి కామలోభములను విడిచినవాడు బ్రహ్మత్వమును పొందును. శ్రవ్య విషయమున, దృశ్య విషయమున, సర్వ భూతముల యందు అవ్యయుని చూచుచు సమబుద్ధి కలవాడై ద్వంద్వ భావమును అతిక్రమించినవాడు బ్రహ్మ యగును. స్తుతి నిందలను సమముగా చూడగలిగిననాడు, బంగారమును ఇనుమును, సుఖదుఃఖములను, శీతోష్ణములను, అర్ధఅనర్ధములను, ప్రియాప్రియములను, జన్మమృత్యువులను సమములుగా చూడగలిగిననాడు బ్రహ్మకాగలడు. జ్ఞానియగువాడు తాబేలు తన అవయవములను బయటకుచాచి మరలలోనికి ముడుచుకొనునటుల మనసుచే ఇంద్రియములను ఉపసంహరింపచేసు కొనవలయును. చీకటి అలుముకున్న ఇంటిని దీపము ప్రకాశింపచేయునటుల బుద్ధి దీపముచే ఆత్మను చూడగలము. ఓ బుద్ధిమంతుడా! ఇది అంతయూ నీలో కనపడుచున్నది. ఇంకనూ తెలియవలసిన ఇతర విషయములను కూడా నీవు తెలిసియేయున్నావు. ఓ బ్రహ్మర్షీ! నీవు విషయ ములను త్యజించితివని నాకు తెలిసినది. గురువుగారి అనుగ్రహము వలన నీ శుశ్రూష వలన నీకు అంతయూ తెలిసినది. నాకు కూడా గురువుగారి అనుగ్రహము వలననే జ్ఞానము ప్రకాశించుచున్నది. ఆ దివ్య జ్ఞానముచే నీవు తెలియబడితివి. నీకు అధిక జ్ఞానము, అధికముగా గ్రహణశక్తి కలదు. నీ ఐశ్వర్యముకూడా అధికమే. కాని దానిని నీవు తెలియుటలేదు. బాల్యమువలననో, సంశయము వలననో, భయమువలననో, వ్యామోహము వలననో జ్ఞానము కలిగిననూ దానిని తెలియజాలరు. పరిశుద్ధమైన వ్యవసాయముచే, నాలాంటి వారిచే సంశయములను తొలగించుకొని హృదయ గ్రంథులను విడిచి, ఆ ఆర్తిని పొందగలరు. నీవు కూడా జ్ఞానము కలవాడవు. స్థిరబుద్ధివి. విషయలోలుడవు కావు. కావున వ్యవసాయము లేనిదే బ్రహ్మపదము లభించదు. నీకు సుఖ దుఃఖములందు విశేష బుద్ధి లేదు. వస్తువులందు, నృత్యగీతాదులయందు ఔత్సుక్యములేదు. రాగము కలుగుట లేదు. బంధువులయందు బంధము లేదు. భయములందు భయమూ లేదు. ఓ మహానుభావా! నీవు నిందాస్తుతులను సమముగా చూచువాడవని నాకు తెలిసిపోయినది. నేను ఇతర జ్ఞానులు నీవు ఉత్తమము అక్షయము అనామయమగు మార్గమును అనుసరించు వాడవని తెలిసియున్నారు. బ్రాహ్మణుడు పొందదగిన ఫలము, మోక్షార్ధము అయిన బ్రహ్మయందే యున్నావు. ఇంకనూ ఏమడుగుచున్నావు?”
సనందన మహర్షి పలికెను: “ఇట్లు శుకమహర్షి జనక మహారాజు మాటలను విని కృతాత్ముడై, దృఢనిశ్చయము గలవాడై ఆత్మచే ఆత్మనుచేరి, ఆత్మను ఆత్మచే దర్శించి, కృతకృత్యుడై, ఆనందమును పొంది, శాంతుడై, ఊరకనే ఉత్తరాభిముఖుడై వెడలిపోయెను. హిమవత్పర్వతమును చేరి, పరాశర పుత్రుడగు వ్యాస మహర్షిని చూచెను. పైలాది -బ్రాహ్మణులకు వేదమును అధ్యాపనము చేయుచున్న వ్యాస భగవానుని పాదములను, పరిశుద్ధాత్ముడు భాస్కరసమ తేజుడు, అరణీగర్భ సంభూతుడగు శుక మహర్షి సంతోషముచే గ్రహించి ఉదారబుద్ధితో జనక మహారాజుతో జరిగిన మోక్ష సంవాదము నంతను నివేదించెను. వేదకర్తయగు వ్యాసుడు దానినంతటిని విని సంతోషించిన మనసుచే పుత్రుని ఆలింగనము చేసుకొని తన ప్రక్కన కూర్చుండబెట్టెను. పైలాది బ్రాహ్మణులు వేదవ్యాస మహర్షి వలన వేదాధ్యయన మును గావించి హిమవత్పర్వతము నుండి భూ మండలమునకు చేరి యజ్ఞ ములను చేయించుచు, వేదాధ్యపనమును గావించుచుండిరి. (2/59)