ద్వాదశమాసస్థిత త్రయోదశీవ్రత కథనము

సనాతనమహర్షి పలికెను: ఇక ఇప్పుడు నీకు త్రయోదశీ వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములను ఆచరించిన వారు సౌభాగ్య వంతులు అయ్యెదరు. చైత్రశుద్ధ త్రయోదశినాడు చందనముచే నిర్మించిన మదనుని శ్రద్ధగా పూజించి చామరలచే వీచవలెను. అపుడు కదలిన కలిగిన మన్మధుడు పుత్రులను పౌత్రులను పెంపొందించును. ఈనాడు అనంగపూజకూడా విధించబడినది. దానిని తెలియుము. ఫలకమున సిందూర రజనీరాగములచే అనంగుని లిఖించవలెను. రదీదేవియందు ప్రీతికలవానిని, మృదుస్వభావుడు, పుష్పచాపేషు ధారి అగు కామదేవుని, వసన్తుని, హయగ్రీవుని, శంకరుని, మధ్యాహ్నకాలమున గంధమాల్యా భరణ వస్త్రాదులచే నానావిధ భక్ష్యములచే ఈ మంత్రమును చదువుచు పూజించవలెను. నమో మారాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణాం నమః క్షోభకరాయవై” అని అనగా మారునకు కామదేవునకు, కామదేవ స్వరూపునకు, బ్రహ్మ విష్ణు ఇంద్రుల మనసును క్షోభింపచేయువానికి నమస్కారము అని ఈ మంత్రమునకు అర్థము. తరువాత కామదేవుని ముందు ఒక గృహస్థును మన్మధునిగా భావించి భక్తితో వస్త్రమాల్యా విభూషణాదులచే పూజించవలెను. బ్రాహ్మణ దంపతులను కూడా గంధ వస్త్రాది భూషణములచే పూజించవలెను. ఇట్లు ప్రతి సంవత్సరమున వసంతకాలమున ఈ వ్రతమును ఆచరించిన వాడు సంతోషముతో పుష్టితో ఉండును. లేదా ఒక సంవత్సర కాలము ప్రతిమాసమున మన్మధుని పన్నెండు నామములతో పూజించవలెను. మదనుని, హృద్భవుని, కాముని, మన్మధుని, రతిప్రియుని, అనంగుని, కందర్పుని, మకర ధ్వజుని, కుసుమాయుధుని, మనోభవుని, విషమేఘని, మాలతీప్రియుని మఖాది క్రమముతో పూజించవలెను. ఇచట అజాదానముకూడా చెప్పబడినది. నదియందు యధావిధిగా స్నానము నాచరించి దరిద్రుడు బహుకుటుంబియగు బ్రాహ్మణునకు పాలనిచ్చు మేకలను దానము చేయవలెను. ఈ అజాదానము చేసిన వారికి పునర్జన్మ ఉండదు. ఒక వేళ ఈ త్రయోదశి శనివారమున వచ్చినచో దానిని మహావారుణి యందురు. ఈనాడు గంగాస్నానము చేసినచో కోటి సూర్య గ్రహణముల కంటే విశిష్టము. చైత్ర శుక్ల త్రయోదశినాడు శుభయోగము, శతభిషా నక్షత్రము, శనివారము, కామదేవుడు ఇట్లు కలియుట మహామహాచిత్రయోదశీ యనబడును. ఈ త్రయోదశి కోటికులములకు ముక్తిని ప్రసాదించును. ఇక వైశాఖశుక్ల త్రయోదశినాడు కామదేవ వ్రతము చెప్పబడినది. ఈనాడు ఉపవసించి, గంధాదులతో కామదేవుని పూజించవలెను. తరువాత ప్రతిమాసమున శుద్ధ త్రయోదశినాడు ఇట్లే వ్రతము ఆచరించవలెయును. సంవత్సరాన్తమున అలంకరించిన గోవును బ్రాహ్మణునకు సత్కారపూర్వకముగా వ్రతపరిపూర్తికి దానమును కావించవలెను. జ్యేష్ఠ శుక్ల త్రయోదశినాడు దౌర్భాగ్యశమన వ్రతము ఆచరించవలెను. ఈనాడు నదీజలమున స్నానమాడి పరిశుద్ధ ప్రదేశమున మొలచియున్న శ్వేతమందారమును, జిల్లేడును, ఎఱ్ఱగన్నేరును, ఆకాశమున సూర్యుని చూచి పూజించి ఈ మంత్రముతో ప్రార్థించవలెను. మందారమా కరవీరమా అర్కమా మీరు భాస్కరాంశతో పుట్టినవారు కావున మాచే పూజించబడి మా దౌర్భాగ్యమును నశింపచేయుడు. మీకు నమస్కారము అని ప్రతి సంవత్సరము ఈ మూడు వృక్షములను పూజించు వారి దౌర్భాగ్యము నశించును. ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు ఏకభుక్తము నాచరించి, యధాశక్తి బంగారముతో కాని, వెండితో కాని, మట్టితో కాని పార్వతీపరమేశ్వర రూపములను నిర్మించి, దేవాలయమున కాని, గోష్ఠమున కాని, బ్రాహ్మణ గృహమునకాని దేవమంత్రముచే ప్రతిష్ఠించి, అయిదు దినములు ఏక భుక్తముతో పూజించవలయును. మూడవ దినమున ప్రాతః కాలమున స్నానమును గావించి పార్వతీ పరమేశ్వరులను పూజించి, వేదవేదాంగజ్ఞుడగు బ్రాహ్మణునకు సమర్పించవలెను. ఇట్లు అయిదు సంవత్సరములు ప్రతివర్షము చేయవలయును. అంతమున ధేనుయుగ్మముతో ఆ ప్రతిమలను దానము చేయవలెను. ఈ వ్రతమును ఆచరించిన నరుడు లేదా నారి ఏడు జన్మలవరకు దాంపత్య విచ్ఛేదమును పొందరు.

శ్రావణ శుక్ల త్రయెదశినాడు స్త్రీలకు వైధవ్యమును వారించునది, సంతానార్థము అగు రతికామ వ్రతమును ఆచరించవలెను. కన్యకాని, నారీకాని ఆనాడు ఉపవసించి, రాగితోకాని, మట్టితోకాని, బంగారముతోకాని, వెండితోకాని, రతీమన్మధులను నిర్మించి గందాధులతో చక్కగా పూజించవలెను. తరువాత చతుర్దశినాడు బ్రాహ్మణ దంపతులను సత్కరించి పూజించి భోజనము చేయించి దక్షిణలతో ఆ ప్రతిమలను వారికి దానము చేయవలెను. ఇట్లు పదునాలుగు సంవత్సరములు ఈ వ్రతము నాచరించి వ్రతపూర్తికొరకు ధేను యుగ్మమును దానము చేయవలెను. భాద్ర శుక్ల త్రయోదశినాడు గోత్రిరాత్ర వ్రతము నాచరించవలెను. బంగారముతోకాని, వెండితోకాని లక్ష్మీ నారాయణుల ప్రతిమలను చేసి, అష్టదలమండలమున పీఠమున నుంచి వస్త్రములతో కప్పి గంధాదులతో పూజించవలెను. తరువాత నీరాజనము నిచ్చి స్నానోదక ఘటమును దానము చేయవలెను. ఇట్లు దినత్రయమున ఆచరించి వ్రతాంతమున మాసము పూజించి, చక్కగా అర్థమును సంపాదించి మంత్రముతో దానమును చేయవలెను. మహా సముద్రమున మధ్య మాసమున పంచ గోవులు పుట్టినవి. వాటిలో మధ్య ధేనువగు నందాకు నమస్కారము. తరువాత ప్రదక్షిణము చేసి మంత్రముతో బ్రాహ్మణునకు దానము గావించవలయును. నా ముందు గోవులుండును. నా వెనుక గోవులుండనీ, నా రెండు ప్రక్కల గోవులుండనీ, గోవుల మధ్యన నేనున్నాను. అను అర్థముకల మంత్రమును పఠించవలెను. తరువాత బ్రాహ్మణ దంపతులను చక్కగా భుజింపచేసి పూజించవలెను. తరువాత సత్కరించి లక్ష్మీనారాయణ ప్రతిమను సమర్పించవలెను. ఈ గోత్రిరాత్ర వ్రతము ఆచరించినచో సహస్రాశ్వమేధ యాగముల ఫలితము, నూరు రాజసూయ యాగముల ఫలము కలుగును.

ఓ అశోకవృక్షమా! నీవు పూర్వము లోకోపకారమునకు శంకరునిచే సృజించబడితివి. కావున ఓ శివప్రియా! నాయెడ ప్రసన్నము కమ్ము అని అర్థముగల శ్లోకమును పఠించవలెను. తరువాత మూడవ దినమున ఆ వృక్షమున శివుని యథావిధిగా పూజించి బ్రాహ్మణుని భుజింపచేసి దానము ఈయవలెను. ఈ వ్రతమును ఆచరించు స్త్రీ వైధవ్యమును పొందదు. పుత్ర పౌత్రాదులతో విలసిల్లును. పతికి ప్రీతిపాత్రురాలగును. కార్తీక బహుళ త్రయోదశినాడు తైలదీపమును వెలిగించి శ్రద్ధగా పూజించి గృహద్వారమున బయట నాకు యమధర్మరాజు ప్రీతిచెందుగాక అని ఉంచవలెను. ఇట్లు చేసినచో యమపీడ కలుగదు. కార్తిక శుద్ధ త్రయోదశినాడు ఏక భుక్తముగా, ప్రదోష కాలమున మరల స్నానమాడి మౌనముతో, సావధానుడై వేయిదీపములను కాని నూరు దీపములు కాని వెలిగించవలెను. లేదా శివునికి ముప్పది రెండు దీపములతో మాలను చేయవలెను. దీపములను నేతితో ఉంచవలెయును. గంధాదులతో, ఫలములతో, నానావిధ నైవేద్యములతో శివుని చక్కగా పూజించవలెను. తరువాత శివుని శత నామములతో స్తోత్రము చేయవలెను. ఇపుడు సర్వాభీష్ట ప్రదములగు శివ నామములను చెప్పెదను. రుద్రునకు, భీమునకు, నీలకంఠునకు, వేధకు నమస్కారము. కపర్దికి, సురేశునకు, వ్యోమకేశునకు నమస్కారము. వృషధ్వజునకు, సోమునకు, సోమనాధునకు నమస్కారము. దిగంబరునకు, భృంగునకు, ఉమాకాంతునకు, వర్థికి, తపోమయు నకు, వ్యాప్తునకు శిపివిష్ణునకు నమస్కారము. వ్యాళప్రియునకు, వ్యాళునకు, వ్యాళపతికి నమస్కారము. మహీధరునకు, వ్యోమునకు, పశుపతికి నమస్కారము. త్రిపురఘ్నునకు, సింహమునకు, శార్దూలునకు, ఋషభునకు, మితునకు, మితనాధునకు, సిద్ధునకు, పరమేష్ఠికి, వేదగీతునకు, గుప్తునకు, వేదగుహ్యునకు నమస్కారము. జగత్ప్రతిష్ఠునకు, వ్యోమరూపునకు నమస్కారము. కళ్యాణునకు, విశిష్టునకు, శిష్టునకు, పరమాత్మకు, గజకృతిధరునకు, అంధకాసురఛేదికి, నీలలోహితునకు, శుక్లునకు, చండముండ ప్రియునకు, భక్తిప్రియునకు, దేవునకు, యజ్ఞాంతునకు, అవ్యయునకు నమస్కారము. మహేశునకు, మహాదేవునకు, హరునక్రుతి నేత్రునకు, త్రివేదునకు వేదాంగునకు నమస్కారము. అర్థునకు, అర్థస్వరూపునకు, పరమార్థునకు నమస్కారము. విశ్వరూపునకు, విశ్వునకు, విశ్వనాధునకు నమస్కారము. శంకరునకు, కాలునకు, కాలావయవ రూపికి, అరూపునకు, విరూపునకు, సూక్ష్మ సూక్ష్మనకు నమస్కారము. శ్మశానవాసికి, కృత్తివాసునకు, శశాంకశేఖరునకు, రుద్రభూమి శ్రితునకు, దుర్గునకు, దుర్గపారునకు దుర్గావయవసాక్షికి, లింగరూపునకు లింగునకు, లింగపతికి నమస్కారము. ప్రభావరూపునకు, ప్రభావార్థునకు కారణకారణునకు, మృత్యుంజయునకు, ఆత్మభవ స్వరూపికి, త్ర్యంబకునకు, శితికంఠనకు, భర్తునకు, గౌరీయజునకు, మంగళ హేతువునకు నమస్కారము. ఈ శతనామములు శంకరుని గుణములను కీర్తించుటయే. ఈ నామశతమును పఠించి, ప్రదిక్షణము చేసి స్వగృహమున ఇహలోకమున సకల భోగములను అనుభవించి, అంతమున శివలోకమును చేరును.

మార్గ శుక్ల త్రయోదశినాడు త్రికాలములలోకాని, ఏకకాలములోకాని శివసంగమ సంభవుడగు మన్మథుని గంధాద్యుపచారములచే యధావిధిగా పూజించి బ్రాహ్మణ దంపతులను ఘటము నందుకాని, మంగళ పట్టణమునందుకాని భుజింపచేయవలెను. తరువాత దక్షిణ నిచ్చి తాను ఏక భుక్తము ఆచరించవలెను. ఇట్లు యధావిధిగా వ్రతము ఆచరించినచో మహాదేవాను గ్రహమువలన భూలోకమున సౌభాగ్యవంతునిగా పుట్టును. పుష్యశుక్ల త్రయోదశినాడు అచ్యుతడగు శ్రీహరిని చక్కగా పూజించి సర్వసిద్ధి కొరకు బ్రాహ్మణోత్తమునకు ఘృతపాత్రను దానము చేయవలెను. మాఘశుక్ల త్రయోదశినాడు ప్రారంభించి మూడు దినములు మాఘ స్నానవ్రతము నానాకామ ఫలప్రదము. మాఘ మాసమున ప్రయాగలలో మూడు దినములు స్నానమును ఆచరించు వానికి కలుగు ఫలము అశ్వమేధ సహస్రము వలనకూడా కలుగదు. ప్రయాగలో స్నానము, జపము, హోమము, దానము ఇవి అక్షయ ఫలప్రదములు. ఫాల్గుణ శుద్ధత్రయోదశినాడు ఉపవసించి జగ న్నాధుని నమస్కరించి ధనద వ్రతమును ఆచరించవలెను. పట్టణమున వర్ణములచే లిఖించిన మహారాజగు యక్షపతిని భక్తి భావముతో గంధాద్యుపచారములచే పూజించవలెను. ఇట్లు ప్రతిమాసమున శుక్ల త్రయోదశినాడు చక్కగా పూజించి ఏకభుక్తము నాచరించవలెను. వ్రతాంతమున సువర్ణ ధనపతిని నిర్మించి సువర్ణ నిధులను కూర్చి, పంచామృత స్నానము మొదలగు షోడశోప చారములచే బహువిధ నైవేద్యములచే భక్తితో పూజింపవలెను. తరువాత గోవును వస్త్ర గ్రంధాలం కారముతో చక్కగా అలంకరించి, దూడతో వేదవిదునకు దానమును గావించవలెను. పన్నెండు మందిని కాని, పదమూడు మందినికాని బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనుచ్చి, గురువును వస్త్రాదులతో చక్కగా పూజించి, బ్రాహ్మణులకు నమస్కరించి విడిచి తాను బంధువులతో సావధానుడై భుజింపవలెను. ఇట్లు వ్రతమును ఆచరించినవాడు ధన హీనుడైనను విభవమునుపొంది మరో కుబేరునివలే భూలోకమున ఆనందించును. (4/122)