నారద మహా పురాణము
కాశీమాహాత్మ్యము
వసువు పలికెను: ఇక ఇప్పుడు వారాణాసిలో ఉన్న గంగానదీ మాహాత్మ్యమును భుక్తి ముక్తి ఫలప్రదమును చెప్పెదను. అవిముక్తమున చేసినదంతయు అక్షయమగును. అవిముక్తమున నివసించువాడెవ్వడూ నరకమునకు వెళ్ళడు. అవిముక్తమున చేయబడు పాపము కూడా పుణ్య మగును. మూడు లోకములలో ఉన్న సకల మోక్షప్రద తీర్థములు కాశీలో ఉన్న ఉత్తరవాహినియగు గంగను సేవించుచుండును. దశాశ్వమేధ తీర్థమున స్నానమాడి విశ్వేశ్వరుడగు శివుని దర్శించినవాడు వెంటనే పాతక రహితుడై సంసార బంధమునుండి విముక్తుడగును. గంగానది అన్ని విధములుగా పవిత్రమైనది. బ్రహ్మహత్యా పాపమును హరించునది. ఇక వారణాసిలో ఉత్తర వాహిని యగు గంగ విశేష ఫలప్రదము. ఇచ్చట వారణా, అని గంగానదుల సంగమమున స్నానమాత్రముననే సర్వపాతక వినిర్ముక్తుడగును. వారణాసిలో ఉత్తర వాహినిలో గంగానదిలో కార్తిక మాసమున కాని మాఘమాసమున కాని స్నానమాడిన మహాపాపాది పాతకములనుండి విముక్తుడగును. సమస్తలోకములలో ప్రసిద్ధిగాంచిన సకల తీర్థములు కాశీలోని గంగానదిని చేరును. ప్రతి నిత్యము అన్ని పర్వకాలములలోను ఆ తీర్థములు చేరును. మహాపాతక దోషాది దుష్టస్పర్శవలన కలుగు పాపములు కూడా ఇచట తొలగిపోవును. మానవులకే కాక పశుపక్ష్యాదుల పాపములు కూడా ఇచట నశించును. ఇతర క్షేత్రములలో శతజన్మలలో సుకృతము చేసినను మోక్షము లభించునో లేదో కాని ఇచట మాత్రము ఒక జన్మలోనే కాశీ గంగా మరణమున మహాపాతకికి కూడా మోక్షములు లభించును. ఇచటనే దర్శనదమను హ్రదము ప్రసిద్ధమైనది. ఇచట యమధర్మరాజే స్వయముగా మహాపాతకములను నశింపచేయును. ఈనది సర్వతీర్థమయి. సర్వపాపనాశిని ప్రవాహము తీరమున ఉన్న వృక్షములను కూల్చునట్లు ఈ హ్రదము మహాపాప సంఘములను కూల్చును. కిరణా, ధూతపా, పుణ్యతోయమగు సరస్వతి, గంగా, యమున అను పంచనదులు పరమ పావనములు. కావున ఈ అయిదు నదుల గల తీర్థము పంచనదమని గ్రాంచినది. ఇచట స్నానమును చేసినవాడు మరల పాంచభౌతిక దేహమును ధరించడు. ఈ పంచనద తీర్థమున స్నాన మాత్రమున మానవుడు బ్రహ్మాండ మండపమును భేదించి వెళ్ళును. కాశీలోని పంచనద తీర్థమున స్నానముచే మాఘ మాసమున ప్రయాగలో స్నానమాడిన ఫలము కలుగును. పంచనద తీర్థమున స్నానమాడి పితృ తర్పణము గావించి శ్రీహరిని పూజించినవాడు మరల జన్మనందదు. ఇచట జల తర్పణమున పితరులకు ఎన్ని తిలలిచ్చునో అన్ని సంవత్సరములు పితరులకు తృప్తికలుగును. పంచనద తీర్థమున శ్రద్ధచే శ్రాద్ధమును ఆచరించినచో వారి పితామహులు బహుయోని గతులైననూ ముక్తులౌదురు. యమలోకమున మా వంశములోని వాడొకడైననూ పంచనద మహిమను తెలుసుకొని శ్రాద్ధ విధానముతో ఇచట శ్రాద్ధమును చేయును కాశీ పంచనదమును చేరి ఎవరో మమ్ములను తరింపచేయరా” అని పితృ గణములు చెప్పుకొనుచుందురు. ఈ పంచనద తీర్థమున ఏకొంచెము దానము చేసిననూ దాని పుణ్యము కల్పక్షయమున కూడా క్షీణముకాదు. గొడ్డురాలైననూ ఒక సంవత్సరము పంచనదమున స్నానమాడి మంగలగౌరిని పూజించినచో పుత్రవతి అగును. పంచనద జలమును వస్త్రముచే శోధించి స్నానము చేయించిన మహాఫలమును పొందును. అష్టోత్తర శతసంఖ్య కల పంచామృత కలశములచే తోలితమగు బిందు సరస్సు పాంచనదత్వమును పొందెను. ఇచట పంచకూర్చ మాత్ర జలపానము చేసిన శుద్ధిని పొందెదరు. పంచనదీ తీర్థ బిందువును శ్రద్ధగా ప్రాశనము చేసిన శుద్ధిని పొందెదరు. పంచనద జలముచే స్నానమాడిన వారికి నూరు రాజసూయాశ్వమేధ యాగముల ఫలము కలుగును. రాజసూయాశ్వమేథ యాగములు సర్వసాధకములు మాత్రమే. బ్రహ్మలోకము వరమన్న సకల బంధవిముక్త పంచనద జలస్నానమున కలుగును. ఆకాశగంగా స్నానము కూడా ఇట్టి ఫలమును ఈయజాలదు. పంచనద జలాభిషేకము అనన్య సాధ్యవరప్రదము. నూరు సంవత్సరములు తపము ఆచరించిన కలుగు ఫలము కార్తిక మాసమున పంచనదతీర్థ స్నానమున లభించును. జీవిత కాలము ఇష్టాపూర్త ధర్మములను ఆచరించిన కలుగు ఫలముకంటే అధిక ఫలము పంచనద జలముచే కలుగును. ఈ భూమండలమున ధూత పాప తీర్థ సదృశమగు తీర్థములేదు. ఈ తీర్థమున ఒక మారు స్నానము చేయుటచే జన్మ త్రయార్జిత పాపము నశించును. కృత యుగమున ధర్మ నదము, త్రేతా యుగమున ధూత పాతకము, ద్వాపర యుగమున బిందు తీర్థము, కలియుగమున పంచనదము పావనములు. బిందు తీర్థమున కృషలోన్మితమగు కాంచనమును దానము చేసిన వానికి దారిద్ర్యము దుఃఖము కలుగదు. ఈ బిందు తీర్థమున గోభూతిలహిరణ్య అశ్వవాసోన్న స్థాన భూషణాదులను ఏ కొంచెము దానము చేసినచో అక్షయ ఫలము నిచ్చును. పావనమగు ధర్మనదీ తీర్థమున జ్వలితాగ్నిలో ఒక ఆహూతి నిచ్చిననూ కోటి హోమ ఫలమును పొందును. పంచనద తీర్థమహిమను చతుర్వర్గ ప్రాణులలో ఏ ఒక్కరూ వర్ణించ జాలరు. ఇట్లు నీకు కాశీ మాహాత్మ్యమును తెలిపితిని. నరులకు సుఖప్రదము, మోక్షప్రదము, మహాపాతక నాశనము. బ్రహ్మఘ్నుడు, మధుపాయి, స్వర్ణచోరుడు, గరుతల్పగతుడు, మహాపాతక యుక్తుడు ఉపపాతక యుక్తుడైనను అవిముక్త మాహాత్మ్య శ్రవణముచే శుద్ధిని పొందును. ఈ మాహాత్మ్యమును వినుటచే బ్రాహ్మణుడు వేదపారగుడగును. క్షత్రియుడు యుద్ధమున జయించును. వైశ్యుడు ధనపతియగును. శూద్రుడు విష్ణుభక్త సంగతిని పొందును. ఈ మాహాత్మ్యమును చదువుటచే వినుటచే సర్వయజ్ఞ పుణ్యము, సర్వతీర్థ ఫలము పొందును. విద్యార్థి విద్యను, ధనార్థి ధనమును, భార్యార్థిభార్యను, పుత్రార్థి పుత్రులను పొందును. ఇట్లు నీకు నేను అవిముక్త మాహాత్మ్యమును చెప్పితిని. ఈ మాహాత్మ్యమును విష్ణు భక్తునకు కాని, శివభక్తి రతునకుగాని జగజ్జననీ భక్తునకు కాని సూర్యభక్తునకు వినాయక భక్తునకు, గురువును భక్తిచే సేవించువానికి మాత్రమే చెప్పవలయును. ఇట్లు పదేశించిన అవిముక్త తీర్థ స్నానఫలము లభించును. ఈ మాహాత్మ్యమును శఠునకు, నిందకునకు, గో విప్ర గురువులను ద్వేషించువారికి, గురు ద్రోహమును చేయువారికి, అసూయకలవారికి ఉపదేశించినచో మృత్యువును పొందును. (II/51)