నారద మహా పురాణము
మార్గశీర్ష శుక్లద్వాదశీవ్రత కథనము
ఋషులు పలికిరి: మహానుభావుడవగు సూతుడా! నీవు ఎంతో దయతో ఉత్తమము, సర్వపాప వినాశకమగు గంగ మాహాత్మ్యమును వినిపించితివి. దివ్యజ్ఞానముగల నారద మహర్షి గంగా మాహాత్మ్యమును విని సనక మహర్షిని ఏమడిగెను.
సూతమహర్షి చెప్పెను: ఓ ఋషులారా! మీరందరూ వినుడు. నారద మహర్షి దేనిని అడిగెనో, ఎట్లు పలికెనో దానిని అంతయు అట్లే చెప్పెదను, అనేక కథలతో ఇతిహాసములతో కూడిన ఉత్తమమైన గంగా మాహాత్మ్యమును వినిన నారద మహర్షి ఆదరముతో మరల నిట్లడిగెను.
నారద మహర్షి పలికెను: ఓ సనక మహర్షీ! పరమ దయాలువులైన మీ నుండి పవిత్రము పాపనాశకము, పుణ్యసారము, స్పష్టార్ధము అయిన గంగా మాహాత్మ్యమును వింటిని. తమకొరకు ఇతరుల కొఱకు ప్రయత్నము చేయుచునే సాధువులు శ్రీ మహా విష్ణువును బాగుగా సేవించెదరు. మోహము చెందిన మనసు కలవారిని పలువిధములైన ఉపదేశములతో ప్రబోధించి ప్రసన్న చిత్తులను చేతురు. శ్రీహరిని ప్రసన్నుని చేయు హరి వ్రతములను చక్కగా తెలుపుము. తనను సేవించువారికి దయాళువైన శ్రీహరి భక్తి నొసంగును. ఆ భక్తికి ముక్తి ప్రసిద్ధమైన దాసి. వ్రతములచే అర్చనలచే ధ్యానములచే తనను సేవించువారికి శ్రీహరి ముక్తి నొసంగును. భక్తులను వెంట ఉండి సేవించుటలో గల ప్రయాసను చూచి శ్రీహరి భక్తి ఎవ్వరికీ ఒసగడు. హరిని సంతోషపరచు ప్రవృత్తి రూపకర్మను నివృత్తి రూపకర్మను విష్ణుభక్తుడవైన నీవు నాకు తెలియజేయుము.
సనక మహర్షి పలికెను: ఓ మునిశ్రేష్ఠా! బాగు బాగు. నీవు మాటిమాటికి శ్రీహరి చరిత్రమును అడుగుచున్నావు కావున పురుషోత్తముని భక్తుడవు. లోకములకు ఉపకారమును చేయునని, శ్రీహరి సంతోషించి అభయమునిచ్చు వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములవలన యజ్ఞలింగుడు భగవంతుడగు జనార్దనుడు ప్రసన్నుడై ఇహపరములలో సుఖమును తపోవృద్దిని కలిగించును. ఏదో ఒక విధముగా శ్రీహరిని పూజించువారు పరమపదమును పొందెదరని మహర్షులు చెప్పుచున్నారు. మార్గశీర్ష శుద్ధ ద్వాదశి దినమున ఉపవసించి శ్రద్ధకలవాడై జలశాయియైన శ్రీహరిని చక్కగా పూజించవలయును. ప్రాతఃకాలమున దంతధావనము గావించుకొని స్నానముచేసి తెల్లని వస్త్రములను ధరించి వాక్కును నియమించి భక్తిభావముచే గంధపుష్పాక్షత ధూపదీపనైవేద్యములతో శ్రీహరిని పూజించవలయును. ఓ కేశవా! నీకు నమస్కారము అనుచు విష్ణువును పూజించవలయును. అగ్ని హోత్రమున నేతిచే నువ్వులచే నూట ఎనిమిది ఆహుతులను ఇచ్చి రాత్రిపూట సాలగ్రామ సమీపమున జాగరణము చేయవలయును. ఒక శేరుపాలతో నిర్మలుడగు శ్రీమన్నారాయణునికి స్నానము చేయించవలయును. మూడు పూటలా ధూపదీపనైవేద్య భక్ష్యభోజ్యములతో, గీత వాద్యములచే లక్ష్మీయుక్తుడగు శ్రీమన్నారాయణుని పూజించ వలయును. మరల యథాసమయమున లేచి యథోచిత కర్మలను ఆచరించి వాఙ్నియమముతో శుచి అయి పూర్వము వలెనే పూజించ వలయును. నేతితో వండిన పాయసమును కొబ్బరికాయతో దక్షిణతోపాటు “కేశవః కేశిహా దేవస్సర్వ సంపత్ప్రదాయకః పరమాన్న ప్రదానేన మమ స్యాదిష్టదాయకః” అను మంత్రముచే బ్రాహ్మణునకు భక్తితో సమర్పించ వలయును. (“సర్వసంపదలనిచ్చు దేవుడగువాడు కేశి అను రాక్షసుని సంహరించిన కేశవుడు పరమాన్నదానముచే నా ఇష్టమును పూరించుగాక” అని పై మంత్రమునకు అర్థము) తరువాత భక్తితో బ్రాహ్మణులను బంధువులను భోజనము చేయించవలయును. నారాయణుని ధ్యానించుచు వాఙ్నియమముతో తాను భోజనము చేయవలయును. ఇట్లు భక్తితో ఉత్తమమైన కేశవార్చనను చేయువాడు పౌండరీక యజ్ఞము చేసిన దానికి ఎనిమిది రెట్లు అధిక ఫలమును పొందును.
పుష్యశుద్ధ ద్వాదశీ తిథినాడు చక్కగా ఉపవసించి మనోనిగ్రహముతో ‘నారాయణునకు నమస్కారము’ (నమోనారాయణాయ) అను మంత్రమును పఠించుచు శ్రీహరిని పూజించ వలయును. పాలతో స్నానము చేయించి పాయసమును అర్పించవలయును. మూడు కాలములలో అర్చన చేసి రాత్రిపూట జాగరణమును చేయవలయును. సుందరమైన గంధధూపదీప నైవేద్య పుష్పములచే గీత వాద్యములచే స్తోత్రములచే అర్చించవలయును. నేతితో చేసిన నువ్వుల పొంగలిని దక్షిణతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. “సర్వాత్మా సర్వ లోకేశః సర్వవ్యాపీ సనాతనః నారాయణః ప్రసన్నస్స్యాత్కృతశరాన్న ప్రదానతః” అను మంత్రము పఠించుచు దానముచేయుచు తరువాత బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భాంధవులతో కలిసి భుజించవలయును. ఇట్లు భక్తిచే ప్రభువు దేవుడు అగు నారాయణుని పూజించినచో ఎనిమిది అగ్నిష్టోమముల ఫలమును పొందును.
మాఘ శుద్ధ ద్వాదశీ తిథిన మొదటి వలెనే ఉపవసించి ‘నమస్తే మాధవాయ’ అని అగ్నితో ఎనిమిది నేతి ఆహుతులను ఇచ్చి, ఒక శేరుపాలతో శ్రీహరిని స్నానము చేయించ వలయును. సావధానమైన మనస్సుతో పుష్పగంధాక్షతలతో ఆర్చించవలయును. భక్తితో రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాలమున కాలకృత్యములను తీర్చుకొని మరల మాధవుని పూజించ వలయును. మంత్రపూర్వకముగా ఒక కిలో నువ్వులను బ్రాహ్మణునకు దానము ఈయవలయును. వస్త్రములను దక్షిణను ఈయవలయును. అట్లుచేసినచో అన్ని పాపములు నశించును. “మాధవ స్సర్వ భూతాత్మా సర్వకర్మఫలప్రదః తిలదానేన మహతా సర్వాన్మామాన్ర్పయచ్ఛతు” అను మంత్రముచే భక్తితో బ్రాహ్మణునకు దానమీయవలయును. (“సర్వప్రాణి స్వరూపుడగు సర్వకర్మల ఫలములనిచ్చు మాధవుడు మహాతిల దానముతో నా కోరికలను తీర్చుగాక” అని మంత్రమునకు అర్థము) తరువాత ప్రభువైన మాధవుని స్మరించుచు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. ఇట్లు తిలదాన వ్రతము చేయువారు నూరు వాజపేయ యాగముల ఫలమును పొందెదరు.
ఫాల్గుణ శుద్ధ ద్వాదశినాడు ఉపవాసము చేసి ‘గోవిందాయ నమస్తుభ్యం’ అని శ్రీహరిని పూజించవలయును. నేతితో కలిసిన నువ్వులతో అగ్నిలో నూట ఎనిమిది ఆహుతులను ఇచ్చి ఒక శేరు పాలతో గోవిందుని స్నానము చేయించవలయును. మూడు వేళలా పూజించి రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతఃకాల కృత్యములను ముగించి మరల గోవిందుని పూజించవలయును. వస్త్రములను దక్షిణను నాలుగు శేర్ల ధాన్యమును బ్రాహ్మణునకు దానమీయవలయును “నమో గోవింద సర్వేశ గోపికా జనవల్లభ అనేన ధాన్యదానేన ప్రీతో భవ జగద్గురో” అను మంత్రముచే దానమీయవలయును. (“ఓ గోవిందా! గోపికా జనవల్లభా! నీకు నమస్కారము. ఓ జగద్గురూ! ఈ ధాన్యదానముచే సంప్రీతుడవు కమ్ము” అని మంత్రమునకు అర్థము). ఇట్లు చక్కగా వ్రతమును ఆచరించి సంపూర్ణ గోమేధయాగఫలమును పొందును.
చైత్రశుద్ధ ద్వాదశీ తిథినాడు ఉపవసించి ‘నమోస్తు విష్ణవే తుభ్యం’ అని మొదటి వలెనే అర్చించవలయును. ఒక శేరు పాలతో తన శక్తికి తగినట్లుగా పాలచే అభిషేకము చేయించవలయును. అట్లే ఆదరముతో శేరు నేయితో అభిషేకము చేయవలయును. మూడు వేళలా పూజించి రాత్రి జాగరణము చేయవలయును. తరువాత ప్రాతః కాలమున లేచి కాలకృత్యములను ముగించు కొని తేనె నేయి నువ్వులతో నూట ఎనిమిది ఆహుతులను ఇచ్చి హోమము చేసి నాలుగు శేర్ల బియ్యమును దక్షిణతో బ్రాహ్మణునకు దానమీయ వలయును. “ప్రాణరూపీ మహావిష్ణుః ప్రాణ దస్సర్వవల్లభః తండులాడక దానేన ప్రీయతాం మే జనార్దనః” అను మంత్రముచే దానమీయ వలయును. (“ప్రాణరూపుడు, ప్రాణమును ఇచ్చువాడు అందరికి ప్రియిడగు జనార్దనుడు నాలుగు శేర్ల తండుల దానముచే ప్రీతి చెందుగాక” అని ఈ మంత్రమునకు అర్థము). ఇట్లు భక్తిచే ఆచరించిన నరుడు అన్ని పాపములనుండి విడివడి అత్యగ్నిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలమును పొందును.
వైశాఖ శుద్ధ ద్వాదశీ తిథిన ఉపవాసము చేసి మధుసూదనుని ముప్పదిరెండు సేర్ల పాలతో అభిషేకము చేసి, భక్తితో జాగరణముచేసి మూడు వేళలా పూజించవలయును. ‘నమస్తే మధుహంత్రే’ అనుచు నూట ఎనిమిది మార్లు నేతితో హోమము చేయవలయును. ఇట్లు భక్తిచే చేసినచో అన్ని పాపములు తొలగి ఎనిమిది అశ్వమేధ యాగముల ఫలమును పొందును. జ్యేష్ఠ శుద్ధద్వాదశినాడు ఉపవాసమును చేసి నాలుగు శేర్ల పాలతో త్రివిక్రమునికి అభిషేకము చేసి భక్తితో పూజించిన ‘నమః త్రివిక్రమాయ’ అనుచు పాయసముతో నూట ఎనిమిది మార్లు హోమము చేసి రాత్రిపూట జాగరణము చేసి మరల పూజించవలయును. బ్రాహ్మణునకు దక్షిణతో ఇరువది అపూపములను దానము చేయవలయును. ‘దేవ దేవ జగన్నాధ! ప్రసీద పరమేశ్వర! ఉపాయనం చ సంగృహ్య మహాభీష్టప్రదో భవ’ అను మంత్రముచే దానమీము ఈయవలయును. తరువాత శక్తికొలది బ్రాహ్మణులకు భోజనము పెట్టి వాఙ్నియమముతో తాను భోజనమును చేయవలయును. ఇట్లు ఉత్తమమైన త్రివిక్రమ వ్రతమును ఆచరించువాడు అన్ని పాపములను పోనాడి ఎనిమిది నరమేధముల ఫలమును పొందును.
ఆషాడ శుక్ల ద్వాదశినాడు ఇంద్రియ జయముతో ఉపవాసము చేసి నాలుగు శేర్ల పాలతో వామనమూర్తికి అభిషేకము చేయవలయును. ‘నమస్తే వామనాయ’ అని నూట ఎనిమిది మార్లు నేతితో గరకతో హోమము చేయవలయును. ఇట్లు హోమము చేసిన పిదప జాగరణ చేసి వామనుని పూజించవలయును. వామనమూర్తిని పూజించు బ్రాహ్మణునకు భక్తితో నారికేళము దక్షిణలతో పెరుగన్నమును ప్రదానము చేయవలయును. ‘వామనో వృద్ధిదో హోతా ద్రవ్యస్థో వామన స్సదా. వామనస్తారకోఽస్మాచ్చ వామనాయ నమో నమః’ అను మంత్రముతో దధ్యన్న ప్రదానము గావించవలయును. (“వామనుడు వృద్ధినిచ్చు వాడు. వామనుడే హోత, వామనుడెపుడూ ద్రవ్యములో ఉండును. వామనుడు మనలను తరింపచేయును. వామనునకు నమస్కారము” అని ఈ మంత్రమున కర్థము.) తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనమొసంగ వలయును. ఇట్లు వ్రతమాచరించిన వారు నూరు అగ్నిష్టోమ యాగములుచేసిన ఫలమును పొందును.
శ్రావణశుద్ధ ద్వాదశినాడు ఉపవసించి వ్రతమును స్వీకరించి తేనె కలిపిన పాలతో శ్రీధరునికి అభిషేకము చేయవలయును. ధూపదీపగంధాదులతో ‘నమోఽస్తు శ్రీధరాయ’ అనుచు పూజించ వలయును. నేయి కలిపిన పెరుగుతో నూటఎనిమిది మార్లు హోమమును చేయవలయును. రాత్రిపూట జాగరణ చేసి మరల శ్రీధరుని పూజించవలయును. నాలుగు శేర్ల పాలను బ్రాహ్మణునకు దానమీయవలయును. బంగారు కుండలములను, వస్త్రములను, దక్షిణను ఈయవలయును. “క్షీరాబ్ధి శాయిన్! దేవేశ! రమాకాంత! జగత్పతే! క్షీరదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః” అను మంత్రముచే దానము చేయవలయును. (“పాలసముద్రములో శయనించువాడా! దేవేశా! రమాకాన్త! జగత్పతీ! అన్ని ఆనందములనిచ్చి నీవు క్షీరదానముచే సుప్రీతుడవుకమ్ము” అని అర్థము.) ఈ వ్రతమును ఆచరించువాడు ఆనందమునిచ్చు బ్రాహ్మణులకు శక్తికొలది భోజనము నొసంగ వలయును. ఇట్లు చేసిన వారు వేయి అశ్వమేధ యాగముల ఫలమును పొందును.
భాద్రపద శుద్ధ ద్వాదశినాడు చక్కగా ఉపవసించి జగద్గురువైన హృషీకేశుని ముప్పది రెండు శేర్లపాలతో అభిషేకించవలయును. ‘హృషీకేశ నమస్తుభ్యం’ అని చక్కగా పూజించ వలయును. తేనె కలిపిన పొంగలితో నూట ఎనిమిదిమార్లు హోమమును చేయవలయును. రాత్రిపూట జాగరణము చేసి మరల పూజించి ఆత్మజ్ఞానముగల బ్రాహ్మణునకు ఆరుశేర్ల గోధుమలను దక్షిణను, శక్తికొలది బంగారమును దానము చేయవలయును. “హృషీకేశ నమస్తుభ్యం సర్వలోకైక హేతవే మహ్యం సర్వసుఖం దేహి గోధూమస్య ప్రదానతః” అను మంత్రముచే దానము చేయవలయును. (“అన్ని లోకములకు ముఖ్యకారణ భూతుడవైన ఓ హృషీకేశా! నీకు నమస్కారము. గోధూమ దానముతో నాకు అన్ని సుఖముల నిమ్ము” అని మంత్రమునకు అర్థము.) భక్తితో బ్రాహ్మణులకు భోజనమొసగి వాఙ్నియమముతో తాను కూడా భూజించవలయును. ఇట్లు చేసినచో అన్ని పాపములు తొలిగి బ్రహ్మమేధ ఫలమును పొందును.
ఆశ్వయుజ శుక్ల ద్వాదశినాడు ఉపవసించి పాలతో పద్మనాభునికి అభిషేకమును చేయవలయును. ‘నమస్తే పద్మనాభాయ’ అనుచు శక్తికొలది తిలలుధ్యానము, యవలు నేయితో హోమము చేసి యథావిధిగా పూజించవలయును. రాత్రి జాగరణచేసి మరల పూజించవలయును. బ్రాహ్మణునకు తేనె పావుశేరును దక్షిణతో ఈయవలయును. ‘పద్మనాభ నమస్తుభ్యం సర్వలోకపితా మహాఃమధుదానేన సుప్రీతో భవ సర్వసుఖప్రదః’ అని దానము చేయవలయును. (“అందరికి పితామహుడవైన ఓ పద్మనాభా! నీకు నమస్కారము. అన్ని ఆనందములను ప్రసాదించుస్వామీ ఈ మధుదానముతో సుప్రీతుడవు కమ్ము” అని మంత్రమునకు అర్థము.) ఇట్లు పద్మనాభ వ్రతమును చేయు బుద్ధిమంతుడు వేయి బ్రహ్మ మేధముల ఫలమును పొందును.
కార్తీక శుక్ల ద్వాదశీ తిథిన జితేంద్రియుడై ఉపవాసము చేసి నాలుగు శేర్ల పాలచేకాని, పెరుగుచే కాని, నేయిచే కాని “నమో దామోదరాయ” అనుచు దామోదరునికి అభిషేకము చేయవలయును. భక్తిచే తేనె నేయి కలిపిన నువ్వులచే నూట ఎనిమిది మార్లు హోమమును చేయవలయును. మూడు వేళలా పూజించి రాత్రి జాగరణ చేయవలయును. ప్రాతః కాలమున సుందరమైన పద్మములచే పూజించవలయును. మరల నేయి కలిపిన నువ్వులచే నూట ఎనిమిదిమార్లు హోమమును చేయవలయును. భక్తితో బ్రాహ్మణునకు పంచ భక్ష్యములతో కూడిన అన్నమును ఈయవలయును. “దామోదర! జగన్నాథ! సర్వకారణ కారణ! త్రాహి మాం కృపయాదేవ శరణాగత పాలక” అను మంత్రముచే కుటుంబి, శ్రోత్రియుడు అగు బ్రాహ్మణునకు దక్షిణతో దానమును చేయవలయును. సర్వకారణములకు కారణ భూతుడవైన ఓ జగన్నాథా! దామోదరా! శరణాగత రక్షక! నన్ను దయతో కాపాడుము అని పై మంత్రమునకు అర్థము. పిదప బ్రాహ్మణులను భుజింపచేయవల ఇట్లు వ్రతమును ముగించి బంధువులతో కలిసి భోజనముచేయవలయును. ఇట్లు చేసినచో వేయి అశ్వమేధ యాగములకు రెట్టింపు ఫలము లభించును. ఇట్లు ఒక సంవత్సరము ద్వాదశీవ్రతము నాచరించినవారు పరమ పదమును పొందెదరు. భక్తిచే ఒకటి రెండు నెలలు చేసిన వారు కూడా ఆయా ఫలములను పొంది అంతరమున శ్రీహరి లోకమును చేరెదరు.
ఇట్లు ఒక సంవత్సరము ద్వాదశీ వ్రతమునాచరించి ఉద్యాపనము చేయవలయును. మార్గశీర్ష శుక్ల ద్వాదశినాడు ప్రాతః కాలమున దంత ధావనమును చేసుకొని ఆచారానుగుణముగా స్నానము చేసి తెల్లని వస్త్రములను పుష్పమాలలను ధరించి, తెల్లని గంధమును పూసుకొని సుందరముగా నాలుగు మూలలతో మండపమును చేయించవలయును. ఘంటాచామరములతో, కింకిణీ ధ్వనులతో, ఛత్రచామర పతాకములతో, పుష్పమాలలతో అలంకరించి తెల్లని వస్త్రమును పైన కప్పవలయును. చుట్టూ దీపమాలతో అలంకరింప చేయవలయును. ఆ మండప మధ్య భాగమున సర్వతో భద్రముద్రను చక్కగా అలంకారముతో చిత్రించవలయును. సర్వతోభద్ర ముద్ర మీద జల పూరితములైన పన్నెండు కలశములను ఉంచవలయును. చక్కగా శోధించిన తెల్లని వస్త్రముచే అన్ని కలశములను కప్పవలయును. ఆ కలశములలో పంచరత్నములను ఉంచవలయును. బంగారముచే కాని, వెండిచే కాని, రాగిచే కాని లక్ష్మీనారాయణ ప్రతిమను భక్తితో చేయించ వలయును. ఆ ప్రతిమను కలశము మీద నుంచవలయును. ప్రతిమను చేయగల అవకాశములేనిచో ప్రతిమా మూల్యమును కలశముపై నుంచవలయును. శక్తిని అనుసరించి బంగారమును కూడా ఉంచవచ్చును. బుద్ధిమంతుడైనవాడు ఏ వ్రతమునందైన విత్తలోభమును వదిలిపెట్టవలయును. విత్తలోభమును చూపినచో ఆయుర్ధనసంపదులు క్షయమునొందగలవు. భక్తికలవాడై వికారరహితుడు శేషశాయి అయిన నారాయణుని పంచామృతముచే స్నానమును చేయించవలయును. కేశవాది నామములచే ఉపచారములను చేయవలయును. పురాణ శ్రవణాదులను చేయుచు రాత్రి జాగరణమును చేయవలయును. ఉపవాసముచే జితేంద్రియుడు జితనిద్రుడు కావలయును. సంపదకు అనుగుణముగా మూడుపూటలా శ్రీహరిని పూజించవలయును. ప్రాతఃకాలమున లేచి ప్రాతః కాల కృత్యములను ముగించుకొని బ్రాహ్మణులతో వ్యాహృతులచే వేయి తిలాహుతులను ఈయవలయును. తరువాత క్రమముగా గంధపుష్పాదులచే శ్రీమన్నారాయణుని పూజించ వలయును. శ్రీమన్నారాయణుని ముందు కూర్చొని పురాణ శ్రవణమును చేయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులకు నేయితో కలిపిన పది అపూపములను, పాయసమును, పెరుగన్నమును దక్షిణచే నీయవలయును. “దేవదేవ జగన్నాథ భక్తానుగ్రహ విగ్రహ గృహాణోపాయనం కృష్ణ సర్వాభీష్టప్రదో భవ” అను మంత్రముచే ఉపాయనమును దానము చేయలయును. (“దేవదేవా! జగన్నాథా! భక్తులను అను గ్రహించుటకు శరీరమును ధరించినవాడా! ఈ ఉపాయనమును స్వీకరించి నా అభీష్టములన్నింటిని తీర్చుము” అని మంత్రమునకు అర్థము.) భూమిపై మోకాళ్ళనుంచి వినయముతో వంగి, చేతులు జోడించి ప్రార్థించవలయును. సురరాజరాజా! జగన్నివాసా! నీకు నమస్కారము. నా వ్రతమును సంపూర్ణముగా ఫలవంతమును చేయుము. ఓ పురుషోత్తమా! నీకు నమస్కారము. ఇట్లు పురుషోత్తమదేవుని చక్కగా ప్రార్థించవలయును. మహాలక్ష్మీ సమేతునికి అర్ఘ్యము నీయవలయును. క్షీరసాగరనివాస! లక్ష్మీపతి! నీకు నమస్కారము. లక్ష్మీసహితుడవై అర్ఘ్యమును స్వీకరించుము. అచ్యుతుని స్మరణమాత్రమున తపోయజ్ఞ క్రియాదులలో న్యూనము పూర్ణమగును. కావున అచ్యుతునకు నమస్కారము. ఇట్లు విజ్ఞాపన చేసి దక్షిణాసహితముగా లక్ష్మీనారాయణ ప్రతిమను ఆచార్యునకు దానముగా ఈయవలయును. తరువాత బ్రాహ్మణులకు భోజనము పెట్టి, శక్తిని అనుసరించి దక్షిణను ఈయవలయును. బంధుజనులతోకూడి మౌనముగా తాను భుజించవలయును. విద్వజ్జనులతో కలిసి సాయంకాలము వరకు విష్ణుకథలను వినవలయును. ఇట్లు ద్వాదశీ వ్రతమును చేయు మనుజుడు ఇహపరములలో అన్ని కోరికలను సంపూర్ణముగా పొందును. ఇరువది ఒకతరములతో అన్ని పాపముల నుండి విముక్తుడై, వెళ్ళిన తరువాత శోకించని విష్ణు భవనమునకు వెళ్ళును. ఇట్లు ఈ ద్వాదశీ వ్రతమును వినినవారు చెప్పినవారుకూడా వాజపేయ యాగ ఫలమును పొందురు (1/17)