నారద మహా పురాణము
పుష్కర మాహాత్మ్యము
మోహిని పలికెను: ఓబ్రాహ్మణోత్తమా! అతి పుణ్యప్రదమగు ప్రభాస మాహాత్మ్యమును వింటిని. ఇపుడు పుష్కర మాహాత్మ్యమును వినగోరుచున్నాను. పుష్కరము సర్వతీర్థములకు అది తీర్థము. పరమపవిత్రము పాపనాశనము. నా తండ్రియగు బ్రహ్మకు యజ్ఞభూమి. అట్టి పుష్కర మాహాత్మ్య మును విస్తరముగా చెప్పుము.
వసువు పలికెను: శుభకరురాలా! మానవులకు అభీష్ట ప్రదము బహుతీర్థ సమన్వితమగు పుణ్యప్రద మగు పుష్కర మాహాత్మ్యమును చెప్పెదను వినుము. పుష్కర తీర్థమున విష్ణు సహితులగు ఇంద్రాది దేవతలు గణపతి కుమారస్వామి ఉందురు. రైవతుడు దివాకరుడుకూడా ఉందురు. ఇచట శివదూతి అనుదేవి ఈ క్షేత్రమునకు క్షేమమును కలిగించుచుండును. జ్యేష్ఠమాసమున పుష్కరారణ్యమున ఉండువానికి అష్టాంగ యోగ పుణ్యము లభించును. ఈ భూమండలమున ఇంతకంటే ఉత్తమమగు క్షేత్రము మరియొకటి లేదు. కావున సర్వ ప్రయత్నములలో ఈ క్షేత్రమును సేవించవలెను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనను క్షేత్రవాసులైనచో బ్రహ్మభక్తులు సకల ప్రాణులను అనుగ్రహిం చువారు అగుదురు. వీరు యోగులు వెళ్ళు బ్రహ్మలోకమునకు వెళ్ళెదరు. ఒకసారి జ్యేష్ఠ కుండమున స్నానమాడిన వారు సర్వతీర్థ స్నాన ఫలమును పొందును. పుష్కరారణ్యమును చేరి అచటనున్న ప్రాచీన సరస్వతిని మతి, స్మృతి, దయా, ప్రజ్ఞా, మేధా, బుద్ధి అను పేర్లుకల తీర్థాధకమును దర్శించుచు తీరమున ఉన్నవారు అశ్వమేధ యజ్ఞ ఫలమును పొంది స్వర్గమును చేరెదరు. ఇచట మూడు శృంగములు, మూడు ప్రస్రవణములు జ్యేష్ఠ మధ్య కనిష్ఠములీను మూడు సరస్సులు కలవు. ఇచటనే నందా అను పేరుగల సరస్వతీ తీర్థము కలదు. మొదటి సరస్సు నకు పశ్చిమ భాగమున ఒక యోజన దూరముకలదు. ఈ తీర్థమున స్నానమాడి పాలిచ్చు గోవును వేద విదుడగు బ్రాహ్మణునకు దానముచేసిన వారు అక్షయమగు బ్రహ్మలోకమును చేరెదరు. ఋషి సమూహము నివసించు కోటి తీర్థము ఇచటనే యున్నది. ఇచట స్నాన మాడి బ్రాహ్మణులను పూజించినవారు సర్వపాతక వినిర్ముక్తులగుదురు. ఇచటనే ఉన్న అగస్త్యాశ్రమమునుచేరి అగస్త్య మహర్షిని పూజించి దీర్ఘాయుష్మంతుడు భోగి అయి దేహాంతమున స్వర్గమును పొందును. ఇచటనే ఉన్న సప్తర్షి ఆశ్రమ మును చేరి స్నానమాడి భక్తిచే సప్తర్షులను పూజించిన వారు సప్తర్షిలోకమును చేరెదరు. మన్వాశ్రమ మున స్నానమాడిన వారు అంతట పూజలను పొందెదరు. గంగా వినిర్గమమున స్నానమాడి బ్రాహ్మణునకు గోదానమును ఇచ్చినవారు ఇహమున అఖిలభోగములను అనుభవించి బ్రహ్మ లోకమున నివసించును. మధ్యమ పుష్కరమున స్నానమాడి బ్రాహ్మణునకు భూదానము గావించ వలెను. ఇట్లు చేసిన విమాన శ్రేష్ఠము నధిరోహించి విష్ణులోకమును చేరును. కనిష్ఠ పుష్కరిణిలో స్నానమాడి బ్రాహ్మణునకు కాంచన దానముచేసిన ఇహమున సర్వ కామనలను పొంది అంతమున రుద్ర లోకముచేరును. తరువాత విష్ణుపదమున స్నానముచేసి బ్రాహ్మణునకు ఏదేని దానముచేసిన శ్రీవిష్ణు అనుగ్రహము వలన సకల కామనలను పొందును. తరువాత నాగతీర్థమున స్నానమాడి నాగులను పూజించి బ్రాహ్మణులకు దానము చేసిన స్వర్గమును యుగకాలము ఆనందించును. పిశాచ తీర్థమున స్నానముచేసి బ్రాహ్మణుని భుజింపచేసి పిశాచత్వమునకు దూరమై స్వర్గమును చేరును. శివదూతీ హ్రదమున స్నానముచేసి అచట శివుని పూజించి బ్రాహ్మణులను మృష్టాన్నము భుజింప చేసిన స్వర్గలోకమున విరాజిల్లును. ఆకాశ పుష్కరమున స్నానమాడి నరుడు మోక్షమును చేరును.
ఆకాశస్థుని ధ్యానము చేయుచు అపోహిష్ఠాది మంత్రములచే పుష్కరారణ్యమున స్నానమాడిన వారు శాశ్వతపదమును చేరును. కార్తిక మాసమున పూర్ణిమనాడు కృత్తికా నక్షత్రమున వచ్చిన మహాతిథి అనబడును. అనాడు ఆకాశ పుష్కరమున స్నానము విశేష ఫలప్రదము. కార్తిక పూర్ణిమనాడు భరణీ నక్షత్రము వచ్చినచో మధ్యమ పుష్కరిణిలో స్నానమాడినవారికి ఆకాశ పుష్కర ఫలము లభించును. కార్తిక పూర్ణిమనాడు రోహిణీ నక్షత్రము వచ్చినచో కనిష్ఠ సరస్సున స్నానమాడిన, ఆకాశ పుష్కర స్నాన ఫలము కలుగును. సూర్య గురు సమాగమమున చంద్ర శని సమాగమమున కుజ చంద్రయోగమున ఆకాశ పుష్కర స్నానము సకల ఫల ప్రదము. విశాఖా నక్షత్రమున సూర్యుడు, కృత్తికా నక్షత్రమున చంద్రుడున్నపుడు, ఆకాశ పుష్కరిణిలో స్నానమాడినచో స్వర్గమును చేరును. అంతరిక్షము నుండి అవతరించిన ఈ బ్రహ్మ పుష్కరిణిలో స్నానమాడిన వారికి సనాతన లోకములు కలుగును. పుష్కరారణ్యమున గల సరస్వతీ నదిలో పంచసరస్సులు మునులచే ఏర్పరచబడినవి. ఇట్లే దేవతాయతనములు కూడా ఏర్పడినవి. వీటన్నిటిలో సరస్వతీ ధర్మహేతువని తెలియుము. ఇచట స్వర్ణ భూ గోదానములు మహాఫలప్రదములు. ఇచట ధాన్యమును కాని తిలలనుకాని బ్రాహ్మణునకు దానము గావించిన వారికి ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున ఉత్తమగతిని చెందెదరు. గంగా-సరస్వతీ సంగమమున స్నానమాడి బ్రాహ్మణులను పూజించినవారు ఇహమున ఈప్సిత భోగములను అనుభవించి పరమున ఉత్తమ గతిని పొందుదురు. అవియోగాభిధా వాపియందు స్నానమాడి యథావిధిగా పిండ ప్రదానము గావించినవారు పితరులను తరింపచేతురు. ఇట్లే సౌభాగ్య మాపమున స్నానమాడి పూర్వజులకు తర్పణము గావించి అతుల సౌభాగ్యమును పొంది అంతమున సద్గతిని పొందును. మర్యాదా పర్వతమున స్నానమాడి స్పృశించి పూజించిన వాంఛితార్థములను సంపూర్ణ యాత్రా ఫలమును పొందును. అజగంధ శివుని చేరి యధావిధిగా పూజించిన ఇహమున వాంఛితార్థములను పొంది పరమున సద్గతిని పొందును. సరోదక్షిణ భాగమున పర్వత పరితలమున ఉన్న సావిత్రిని పూజించిన వాడు వేదవిదుడగును. ఇచట వరాహస్వామి, నృసింహస్వామి, బ్రహ్మ, శ్రీహరి, శివ, సూర్య, చంద్ర, గుహ పార్వతీ, అగ్ని తీర్థములు కలవు. వీటి అందు విడివిడిగా స్నానమాడి విప్రులకు దానముల నిచ్చిన ఉత్తమ గతిని పొందెదరు. పుష్కరస్నానము దుర్లభము. పుష్కరమున తపము దుర్లభము. పుష్కరమున దానము దుర్లభము. పుష్కర నివాసము దుర్లభము. శతయోజన దూరమున ఉన్నవారు కూడా స్నానకాలమున పుష్కరమును స్మరించినచో పుష్కర స్నానఫలము లభించును. మంకణాది తపస్సిద్ధులు కూడా సంతోషముతో పుష్కరమును సేవింతురు. పుష్కర స్నాతులు ఎచటకు వెళ్ళిననూ కామితార్థ సిద్ధిని పొందెదరు. పుష్కరనామమును పలికిననూ పుష్కరస్నానజన్య ఫలము లభించును. పుష్కర స్నాన మాహాత్మ్యమును వినినవారుకూడా పుష్కర స్నానఫలమును పొంది స్వర్గమున దేవతలవలె ఆనందించును. (II/71)