భగీరథుని గంగానయనోద్యమ వర్ణనము

ధర్మరాజు పలికెను: పాప భేదములను స్థూల యాతనలను చెప్పెదను. నరకములు చాలా భయంకరములు కావున ధైర్యమును వహించి వినుము. దుష్టస్వభావములు కల పాపాత్ములు ఏ యే నరకములలో పడి యాతనలను పొందెదరో ఆ నరకములను గూర్చి చెప్పెదను. ఇవి అన్నియు భయంకర ఫలములను ఇచ్చును. తపన - వాలుకా - కుంభ మహారౌరవ - రౌరవ కుంభీపాక - నిరుచ్ఛ్వాస - కాలసూత్ర - ప్రమర్దన - అసిపత్ర వనములు, లాలాభక్షము, హిమోత్కటము, మూషావస్థ, వసామాపము, వైతరణీనది, మూత్రపానము, పురీషహ్రదము, తప్త శూలము, తప్త శిల, శాల్మలీ ద్రుమము, శోణిత కూపము, ఘోరమైన శోణితభోజనము, శ్వమాంస భోజనము, వహ్నిజ్వాలా నివేశనము, శిలావృష్టి, శస్త్రవృష్టి, వహ్నివృష్టి, క్షారోదకము, ఉష్ణతోయము తప్తాయః పిండ భక్షణము, శిరశ్శోషణము, మరుత్ప్రపతనము, పాషాణవర్షము, కృమి భోజనము, క్షారోద పానము, భ్రమణము, క్రకచ ధారణము, పురీష లేపనము, పురీష భోజనము, రేతః పానము, సర్వసంధి దాహనము, ధూమపానము, పాశబంధము, నానాశూలాను లేపనము, అంగార శయనము, ముసల మర్దనము, బహుకాష్ఠ యంత్రకషణము, ఛేదనము, పతనోత్పతనము, గదా దండాదిపీడనము, గజదంత ప్రహరణము, నానాసర్పదంశనము, నాసికా ముఖములలో శీతాంబు సేచనము, ఘోరక్షార అంబుపానము, లవణ భక్షణము, స్నాయుచ్ఛేదము, స్నాయబన్ధము, ఆస్థిచ్ఛేదము, క్షార అంబుపూర్ణరంధ్రప్రవేశము, మాంసభోజనము, పిత్తపానము, మహాఘోరమైన శ్లేష్మ భోజనము, వృక్షాగ్రపతనము, జలాన్తర్మజ్జనము, పాషాణధారాశయనము, కంటక శయనము, పిపీలికాదంశనము, వృశ్చిక పీడనము, వ్యాఘ్రపీడ, శివాపీడ, మహిష పీడనము, కర్దమ శయనము, దుర్గంధ పరిపూరణము, అర్ధశయనము, మహాతిక్త నిషేవణము, అత్యుష్ణ తైలపానము, మహాకటు నిషేవణము, కషాయోదక పానము, తప్తపాషాణ తక్షణము. అత్యుష్ణ శీతస్నానము, దశన శీర్ణనము, తప్తాయశ్శయనము, అయోభార బంధనము. ఇటువంటి యాతనలు కొన్నికోట్లు కలవు. వేల సంవత్సరములలో నేను కూడా చెప్పజాలను. ఏ పాపమునకు ఏ యాతనవచ్చునో దాని నంతనూ చెప్పెదను వినుము.

బ్రాహ్మహత్యను చేయువారు, సురాపానమును చేయువారు, చౌర్యమును చేయువారు, గురుపత్నీ సంగమమును చేయువారు ఈ నలుగురు మహాపాతకులు అనబడుదురు. వీరితో సంబంధము కలవాడు అయిదవ మహాపాతకి అగును. భోజనము చేయుచున్న పంక్తిలోని అందరికీ ఒకే విధముగా వడ్డించక భేదమును చూపువారు, భగవంతునికి నివేదన చేయకనే తినువారు, ఎల్లపుడూ బ్రాహ్మణులను దూషించువారు, కఠినముగా ఆదేశము ఇచ్చువారు, వేదమును అమ్ముకొనువారు ఈ అయిదుగురు బ్రహ్మ ఘాతకులు. ధనాదికమును ఇచ్చెనని బ్రాహ్మణుని పిలిచి, తరువాత లేదనువాడు కూడా బ్రహ్మ ఘాతకుడే. స్నానము కొరకు కాని పూజించుటకు కాని వెళ్ళు బ్రాహ్మణునికి విఘ్నమును కల్పించువాడు కూడా బ్రహ్మ ఘాతకుడే. పరులను నిందించుటలో, తనను శ్లాఘించుకొనుటలో ఆసక్తి చూపువాడు, అసత్యమును పలుకుటతో ఆనందించువాడుకూడా బ్రహ్మఘాతకుడు అనబడును. ఇతరులను బాధించుటలో ఆసక్తికలవాడు. ఇతరుల దోషములనే సూచించువాడు, డాంబికాచారము కలవాడు, బ్రహ్మ ఘాతకుడే. ఎప్పుడూ ఎదుటివానినుండి పరిగ్రహించువాడు, ప్రాణులను వధించు స్వభావము కలవాడు అధర్మమును ఆమోదించువాడు బ్రహ్మ ఘాతకుడు అనబడును. ఇట్లు బ్రహ్మ హత్యతో సమానమైన పాపము బహు విధములుగా ఉండును.

సురాపానముతో సమానమగు పాపమును సంగ్రహముగా చెప్పెదను. వేశ్యా భోజనమును భుజించుట, వేశ్యలను సేవించుట, పతితులు అన్నమును తినుట సురాపానముతో సమానము. చేయుచున్న ఉపాసనను పరిత్యజించుట, దేవలుల (ఆలయాలలోని అర్చకుల) భోజనము, సురాపానముచేయు స్త్రీతో సంగమించుట సురాపానముతో సమానము. శూద్రునిచే ఆహ్వానించబడి భోజనము చేయువాడు అన్ని ధర్మముల నుండి బహిష్కరించబడి సురాపి అనబడును. శూద్రుని ఆజ్ఞచే భృత్యకర్మ చేయువానికి సురాపాన సమఫలము లభించును. ఇట్లు పలువిధములైన పాపములు సురాపాన సమములుగా చెప్పబడినవి.

ఇప్పుడు బంగారమును చౌర్యము చేసినందువలన కలుగు పాపముతో సమాన పాపములను చెప్పెదను వినుము. కందమూలములను, ఫలములను, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములను, రత్నములను అపహరించుట సువర్ణస్తేయముతో సమానము. రాగి, ఇనుము, సీసము, ఇత్తడి, నెయ్యి, తేనె మొదలగు వాటిని సుగంధద్రవ్యములను, పట్టు వస్త్రములను అపహరించుట స్వర్ణస్తేయముతో సమానము. వక్కలను, నీటిని చందనమును, ఆకురసములను అపహరించుట స్వర్ణస్తేయముతో సమానము. పితృ యజ్ఞమును వదిలిపెట్టుట, ధర్మ కార్యములను లోపింపచేయుట, యతులను నిందించుట స్వర్ణచౌర్యముతో సమానము. తినదగిన పదార్థములను, ధాన్యములను హరించుట రుద్రాక్ష హరణము స్వర్ణ చౌర్యముతో సమము. తోబుట్టువులైన అక్కచెల్లెలు మొదలగు స్త్రీల సంగమము, కొడుకు భార్యను సంగమించుట, రసజ్వలా స్త్రీ సంగమము, గురుభార్యా సంగమముతో సమానము. హీనజాతిస్త్రీని సంగమించుట, మద్యపానము చేయు స్త్రీని సంగమించుట, పరస్త్రీ గమనము, గురుదారాగమనముతో సమానము. అన్న భార్యను కలియుట, మిత్రుని భార్యను కలియుట, విధవాగమనము గురుదారాగమనముతో సమానము. కాని కాలములో పనిచేయుట, పుత్రికాసంగమము, ధర్మలోపము, శాస్త్రనింద గురు భార్యాగమనముతో సమానము. ఇటువంటివన్నీ మహాపాపములనబడును. వీటిలో ఏ ఒక్కదానిని చేసినను మహాపాపియే అగును. శాంతులైన పరమర్షులు ఈ మహాపాపములకు నిష్కృతిని (ప్రాయశ్చిత్తమును) కనుగొనిరి. ఇక ఇపుడు ప్రాయశ్చిత్తములు లేని పాపములను చెప్పెదను వినుము.

ఇవి అన్ని పాపములతో సమానమైన పాపములు. మహానరకము ఇచ్చునవి. బ్రహ్మహత్యాది పాపములకు ఏదో ఒక విధముగా నిష్కృతి లభించును. బ్రాహ్మణులను ద్వేషించు వారికి ఏ విధముగానైనను నిష్కృతి లేదు. నమ్మిన వారిని చంపిన వారికి, కృతఘ్నులకు, శూద్ర స్త్రీ సంగమమును చేయువారికి నిష్కృతి లభించదు. శూద్రాన్నముతో పుష్టిని పొందిన శరీరము గలవారికి, వేదనిందను చేయువారికి, సత్కథానిందకులకు ఇహపరములలో నిష్కృతి లేదు. గొప్ప ఆపదలో నైనను, బౌద్ధాలయ ప్రవేశము చేసిన బ్రాహ్మణునికి నూరు ప్రాయశ్చిత్తములు జరిపినను నిష్కృతి లభించదు. బౌద్ధులు వేదనిందకులు కావున పాషండులనబడుదురు. ధర్మబహిష్కృతులు కావున బ్రాహ్మణులు బౌద్ధులవైపు చూడరాదు. తెలిసియైనను తెలియకనైనను బ్రాహ్మణుడు బౌద్ధాలయమున ప్రవేశించరాదు. తెలిసి ప్రవేశించినచో నిష్కృతి లభించదు. ఇది శాస్త్ర నిశ్చయము. ఇవి చాల పెద్ద పాపములు కావున కోటి కల్పములు నరకమును అనుభవించవలయును. ప్రాయశ్చిత్తములు లేని ఇతర పాపములు చాలా కలవు. ఆ పాపములు వాటి వలన కలుగు నరకములను చెప్పెదను. వినుము.

పైన చెప్పబడిన పాపులందరిలో మహాపాపులు మాత్రము ఒక్కొక్క మహాపాపమునకు ఒక్కొక్క యుగమున నరకమున నుందురు. తరువాత భూలోకమునకు వచ్చి ఏడు జన్మలు గర్దభములుగా, తరువాత ఎప్పుడూ కొట్టబడు శరీరములుగల కుక్కలుగా పదిజన్మలు పుట్టెదరు. తరువాత నూరు సంవత్సరములు మలములో పురుగులుగా, పన్నెండు జన్మలు పాములుగా, తరువాత వేయి జన్మలు మృగాది పశువులుగా, నూరు సంవత్సరములు, స్థావరములుగా, తరువాత బల్లులుగా, తరువాత ఏడు జన్మలు చండాలురుగా, తరువాత పదునారు జన్మలు హీనజాతులైన శూద్రులుగా, తరువాత రెండు జన్మలు దరిద్రులుగా వ్యాధిపీడితులుగా ఎపుడూ ఎదుటివారినుండి తీసుకొనువారిగా పుట్టి మరల నరకమునకు వెళ్ళెదరు. అసూయ నిండినమనసు కలవారు గౌరవమను నరకమునకు వెళ్ళెదరు. ఆ గౌరవమును రెండు కల్పములుండి నూరు జన్మలు చండాలురుగా పుట్టెదరు. గోవులకు అగ్నికి బ్రాహ్మణులకు అర్పించవద్దని చెప్పినవారు నూరుజన్మలు కుక్కలుగా పుట్టి చండాలులుగా పుట్టెదరు. తరువాత మలకీటకములుగా, తరువాత మూడు జన్మలు పెద్దపులురుగా పుట్టిచివరికి మరల నరకమునకు వెళ్ళి ఇదువదియొక్క యుగములు అచట ఉందురు. పరులను నిందించువారు, కఠినముగా మాట్లాడువారు దానములకు విఘ్నమును కలిగించువారు చోరులతో సమానము, వారు రోట పడవేయబడి రోకళ్ళతో పొడి చేయబడుదురు. తరువాత బాగుగా కాల్చిన పాషాణమును మూడు సంవత్సరములు పట్టుకొని ఉండవలయును. తరువాత ఏడు సంవత్సరములు కాల సూత్రముతో చీల్చబడుదరు. ఇట్లు పరద్రవ్యములను అపహరించినవారు తాము చేసిన కర్మలను గూర్చి విచారించుచు నరకాగ్నిలో పాకము చేయబడుదురు (వారి పాపములు నరకములో పండునని భావము).

చోరులకు ఇతరుల ద్రవ్యముల జాడను తెలిపి చౌర్యమును చేయుటకు సహకరించిన వారికి కలుగు నరకమును చెప్పెదను వినుము. వేయి యుగములు బాగుగా కాల్చిన ఉక్కుముద్దను తినుచుందురు. బాగుగా కాల్చిన ఇనుప పట్టకారులతో నాలుకను బయటకులాగుచుందురు. తరువాత సగము కల్పము మహాఘోరమైన నరకములో ఊపిరి పీల్చక పడియుందురు. ఇక ఇప్పుడు పర స్త్రీ సంగమమునందు ఆశ కలవారికి కలుగు నరక యాతనలను తెలిపెదను. బాగుగా కాల్చబడిన రాగి శరీరముకల స్త్రీలు కాల్చబడిన రాగి ఆభరణములను ధరించి ఇదివరకు వీరు కోరిన స్త్రీల వంటి రూపములతో వచ్చి బలవంతముగా రమించెదరు. ఆ స్త్రీలను చూచి భయముతో పారిపోవుచున్న పురుషుని బలాత్కారముచే పట్టుకొని పురుషుడు చేసిన పాపకార్యములను స్త్రీ సంగమములను చెప్పుచు నరకములలోనికి తీసుకొని వెళ్ళి బలవంతముగా రమించెదరు. అట్లే భర్తను వదిలి పరపురుషునితో రమించిన స్త్రీలను నరకములో బాగుగా కాల్చిన ఉక్కు శరీరములు కల పురుషులు బాగుగా కాల్చిన ఉక్కు శయ్యమీద బలవంతముగా పడవేసి బలవంతులు కావున చాలాకాలము రమింతురు. అట్లు చాలా కాలము రమించివిడిచిన తరువాత అ స్త్రీలు అగ్నివలె మండుచున్న ఉక్కు స్తంభమును ఆలింగనము చేసుకొని వేయి సంవత్సరములుందురు. తరువాత కారము నీటితో స్నానము చేయుచు కారము నీరు త్రాగుచుందురు. తరువాత నూరు సంవత్సరములు అన్ని నరక యాతనలను అనుభవించెదరు. బ్రాహ్మణుని, ఆవును, ఉత్తమరాజగు క్షత్రియుని చంపు వారు అయిదు కల్పములు అన్ని నరకయాతనలను అనుభవించెదరు. మహాత్ములనిందను ఆదరముతో వినువారి చెవులలో బాగుగా కాల్చిన ఇనుప మేకులను నాటెదరు. తరువాత ఆ కర్ణ రంధ్రములలో బాగుగా కాగి మసలుచున్న నూనెను నింపెదరు. తరువాత కుంభీపాక నరకమునకు కొనిపోయెదరు. శ్రీహరియందుగాని శంకరునియందు కాని విముఖులైన నాస్తికులు కోటి సంవత్సరములు ఉప్పునే తినుచుందురు. తరువాత బాగాగా కాలి ఉన్న ఇసుకకల గౌరవమునందు ఒక కల్పకాలము యాతనలను అనుభవించి ఇతర యాతనలను కూడా ఇట్లే అనుభవించెదరు.

బ్రాహ్మణులను కోపదృష్టిచే చూచిన నరాధములు వేలకొలది కాల్చిన సూదులచే కన్నులలో పొడువబడుదురు. తరువాత కారపు నీటి ధారలచే చల్లబడుదురు. తరువాత వారి దేహములను గడ్డపారలచే త్రవ్వెదరు. విశ్వాసఘాతకులు, మర్యాదను భంగపరచువారు, ఇతరులు అన్నమును ఆశించువారు, తమ మాంసమును తామే భుజిస్తూ, కుక్కలచే భుజించబడుచు ప్రతినరకమున ఒక్క సంవత్సరము చొప్పున నివసించెదరు. ఇతరులనుండి దానము గ్రహించుటయందు ఆసక్తి కలవారు, నక్షత్రములను పఠించువారు దేవతల అన్నమును భుజించువారు కల్పమువరకు ఈ యాతనలలో దుఃఖముతో పాపావిష్ణులు భోగరతులూ అగుచు నరకమును అనుభవించెదరు. కామ సూత్రమను యాతనలచే పీడించబడుచు, కాగిన తైలములో ముంపబడుదురు. తరువాత కారపునీటితో స్నానము మలమూత్ర సేవనము చేతురు. తరువాత భూలోకమున మ్లేచ్ఛ జాతులలో పుట్టెదరు. ఇతరులను బాధించువారు వైతరణీ నదిని చేరెదరు. దేవపితృ బ్రహ్మయజ్ఞాది పంచమహా యజ్ఞములను విడిచినవారు లాలా భక్షమను నరకమును పొందెదరు. ఉపాసనను పరిత్యజించిన వారు రౌరవ నరకమును పొందెదరు. బ్రాహ్మణ సమూహముల నుండి పన్నును తీసుకొనువారు. సూర్యచంద్రులు ఉండువరకు ఈ నరకములలో యాతనలను పొందెదరు. గ్రామములలో ఎక్కువ పన్నును గ్రహించురాజు వేయితరములు అయిదు కల్పములు నరకమును అనుభవించును. బ్రాహ్మణుల నుండి పన్నును తీసుకొనుటను ఆమోదించినవాడు వేయి బ్రహ్మహత్యలను చేసిన వానితో సమానము. నాలుగు యుగములు మహాఘోరమైన కాలసూత్రమను నరకమున నివసించును. భగినీ పుత్రవధువు మొదలగు స్త్రీల యందు, శూద్రాది స్త్రీలయందు, పశువులందు వీర్యమును ఉంచినవాడు మహాపాపి అగును. అతను నరకమున రేతో భోజనమును చేయును. ఏడు దివ్య వర్షములు వసామాపమను నరకమును పొంది అన్ని లోకములలో నిందించబడుచు రేతో భోజనమును చేయుచుండును. ఉపవాస దినమున దంత ధావనమును చేయువాడు నాలుగు యుగములు వ్యాఘ్ర పక్షమను నరకమును పొందును. స్వకర్మలను పరిత్యజించువారు పాషండులు అనబడుదురు. పాషండులతో కలిసి ఉండువారు కూడా వారితో పాటు వేల కోట్ల కల్పములలో క్రమముగా నరకములను పొందెదరు. దేవ ద్రవ్యములను గురుద్రవ్యములను అపహరించువారు బ్రహ్మహత్య చేసిన వారితో సమానముగా నరకమును అనుభవించెదరు. అనాధల ధనమును అపహరించువారు, అనాధలను ద్వేషించువారు కోటి కల్పములు నరకమున నివసింతురు. స్త్రీల సమీపమున, శూద్రుల సమీపమున వేదాధ్యయనమును చేయువారు క్రింద తల, పైన పాదములతో తలక్రిందులుగా రెండు స్తంభముల మధ్యన వేలాడుచుందురు. బ్రహ్మ ఉండునంత వరకు ధూమపానము చేయుచు గడుపుచుందురు.

నీటిలో కాని, దేవాలయమున కాని దేహమలమును విడిచినవారు అతి భయంకరమైన భ్రూణహత్యా సమమైన పాపమును పొందెదరు. దేవాలయమున దంతములను ఎముకలను కేశములను, గోళ్ళను వదిలినవారు, తినగా మిగిలిన దానిని జలమున వదిలిన వారు ప్రాసములతో పొడువబడుచు, నాగళ్ళచే చీల్చబడుచు ఆర్తనాదములు చేయుచు, చాలా వేడితో మసలుచున్న నూనెలో బాగుగా గోలించబడుదురు. అట్లు దుఃఖముచే బాగుగా తపించినవారు ఇతర కరకముల లోనికి పంపబడుదురు. బ్రాహ్మణుని చంపినవారు, గంధపు కట్టెను నరికినవారు సూర్యచంద్రులుండు వరకు ఘోర నరకమున నివసింతురు. బ్రాహ్మణ ధనమును అపహరించుట ఇహపరములలో దుఃఖమునే కలిగించును. ఇహలోకమున సంపదలను నశింపచేయును. పరమున నరకమును కలిగించును. అసత్యపు సాక్ష్యమును చెప్పువారు ఒక కల్పకాలము అన్ని నరక యాతనలను పొందెదరు. ఇహలోకమున పుత్రులు పౌత్రులు నశింతురు. పరలోకమున రౌరవనరకమును ఇతర నరకములను కూడా అనుభవింతురు. అతి కాముకులు, అబద్ధమును మాటలాడువారు చాలా ఘోరమైన నరకమునుపొందెదరు. వారి నోట్లో పాములవంటి జలగలను నింపెదరు. అట్లు అరువదివేల సంవత్సరములు అనుభవించిన తరువాత కారపునీటిని చల్లెదరు. వ్యర్ధముగా మాంసమును భుజించువారు కారపు బురదలో పడెదరు. తరువాత కాలితో కొట్టబడినట్లుగా యేనుగులచే పడవేయబడుదురు. దాని తరువాత భూలోకమున అంగవికలులుగా జన్మించెదరు. ఋతుకాలమున తన భార్యను సంగమించనివారు ఘోరమైన గౌరవ నరకమును పొందురు. బ్రహ్మహత్యా పాపమును కూడా పొందురు. సమర్ధుడై ఉండి కూడా అత్యాచారములను చేయువారిని వారించనివారు కూడా ఆ పాపమును పొందెదరు. వారిద్దరు నరకమును పొందెదరు. పాపాత్ముల పాపములను లెక్కించుచు ఇతరులకు చెప్పువారు, వారు చెప్పిన పాపములన్నచో వారితో సమానముగా పాపము గలవారిగాను, అసత్యమైనచో రెట్టింపు పాపము గలవారిగా అగుదురు. పాపములేని వానియందు పాపము ఆరోపించి చెప్పినచో సూర్యచంద్రులు, నక్షత్రములు ఉండు వరకు మహాఘోర నరకమును పొందెదరు. పాపులను నిందిచినచో వారి పాపము సగము తొలగును. వ్రతమును ప్రారంభించి పూర్తి చేయక వదిలినచో అసిపత్రమను నరకమున యాతనలను అనుభవించి, భూలోకమున వికలాంగులుగా జన్మించెదరు. ఇతరులు చేయువ్రతములకు విఘ్నములను కల్పించువారు మిక్కిలి దుఃఖమును కలిగించు, భయంకరమైన శ్లేష్మ భోజనమను నరకమును పొందెదరు. న్యాయమునందు, ధర్మశిక్షలో పక్షపాతమును చూపువారికి పదివేల ప్రాయశ్చిత్తముల ఆచరించినను నిష్కృతి లభించదు. తినకూడని దానిని తినినవారు మలభోజ్యము అను నరకమును పొంది, పిదప చండాలురుగా పుట్టి గోమాంసమును భుజించువారు అగుదురు.

మాటలతో బ్రాహ్మణులను అవమానించినవారు బ్రహ్మహత్యాపాపమును పొంది అన్ని నరకయాతనలనుఅనుభవించి పదిజన్మలు చండాలులుగా పుట్టుదురు. బ్రాహ్మణునకిచ్చు దానమునకు విఘ్నమును కల్పించువారు బ్రహ్మహత్య చేసినవారు చేయవలసిన ప్రాయశ్చిత్తమును ఆచరించవలయును. ఇతరుల ధనమును అపహరించి మరొకరికి దానము చేసినచో, అపహరించినవారు నరకమును పొందుదురు. ఆ ధనము ఎవరిదో వారికి దానఫలము లభించును. ఇచ్చెదనని మాట ఇచ్చి ఈయని వారు లాలాభక్షమను నరకమును పొందురు. యతులను నిందించువారు శిలామాత్రమను నరకమును పొందురు. ఉద్యానవనములను నరకువారు ఇరువది యొక్క యుగములు శ్వభోజనమను నరకమును అనుభవించి, వరసగా అన్ని యాతనలను అనుభవించెదరు. దేవాలయములను తటాకములను పూలతోటలను ధ్వంసము చేయువారు అన్ని యాతనలను వేరు వేరుగా అనుభవించి ఇరువది యొక్క కల్పములు మలములో క్రిములుగా ఉండి, నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గ్రామములను ధ్వంసమును చేయువారు, దగ్ధముగావించువారు పొందెడు పాపమును, నరకములను నా జీవితకాలము అంతటిలోనూ చెప్పజాలను. ఉచ్ఛిష్టమును భుజించువారు మిత్రద్రోహులు సూర్యచంద్రు లుండువరకు తీవ్రయాతనలను పొందెదరు. పితృదేవయజ్ఞములను విచ్ఛిన్నమును చేసినవారు, వేదమార్గముల నుండి బహిష్కృతులైన వారు పాషండులు అనబడెదరు. వారికి అన్ని యాతనలు సంప్రాప్తించును. ఓ రాజా! ఇట్లు పాపకర్మలను ఆచరించు వారికి చాలా విధములైన యాతనలు కలుగును. ఆ పాపములను యాతనలను లెక్కించు శక్తి నాకు లేదు. పాపములను యాతనలను ధర్మములను లెక్కించుటకు శ్రీ మహావిష్ణువు తప్ప ఇతరులు సమర్ధులు కారు. ఈ పాపములు అన్నింటికి ధర్మశాస్త్ర విధానమును అనుసరించి ప్రాయశ్చిత్తములను ఆచరించినచో పాపరాశి నశించును. ఈ ప్రాయశ్చిత్తములను అన్నింటిని శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఆచరించవలయును.

ఎక్కువ తక్కువలుగా చేసిన కర్మలును, పరిపూర్ణములుగా చేసినవి, గంగా తులసి, సత్సంగము, హరికీర్తనము, అసూయ లేకయుండుట, అహింస అనునవి. ఇవి అన్ని పాపములను హరింప చేయును. శ్రీ మహావిష్ణువునకు సమర్పించిన కర్మలు సఫలములు అగును. శ్రీమహావిష్ణువునకు అర్పించక చేసిన కర్మలు బూడిదలో అర్పించిన హోమ ద్రవ్యముల వంటివి. మోక్షసాధనములైన నిత్యనైమిత్తిక కామ్య కర్మలు, ఇతర కర్మలు విష్ణువునకు అర్పించినచో సాత్త్వికములు సఫలములు అగును. మానవులకు అన్ని పాపములను నశింపచేయునది ఉత్తమమైనది హరిభక్తియొక్కటే. పాపారణ్యములకు దావాగ్నియైన ఆ హరి భక్తి పదివిధములని తెలియుము. సాత్త్వికములు రాజసములు తామసములుగా భక్తి ప్రభేదములుండును. ఇతరుల వినాశము కొఱకు శ్రీహరిని భజించినచో దుష్ట స్వభావము కలది కావున ఈ భక్తి అధమ తామసభక్తి అనబడును. తనకు నచ్చిన పురుషునితో రమించు స్త్రీ, తన భర్తను పూజించునట్లు జగన్నాథుడైన నారాయణుని కపటముతో పూజించినచో ఆ భక్తి మధ్యమ తామసభక్తి అనబడును. దేవతలను పూజించువారిని జూచి మాత్సర్యముతో శ్రీహరిని అర్చించినచో ఆ భక్తి ఉత్తమ తామసభక్తి అనబడును. ధనధాన్యాదికములను కోరుచు శ్రీహరిని ఉత్తమమైన శ్రద్ధచే శ్రీహరిని పూజించినచో మధ్యమ రాజసభక్తి అగును. సాలోక్య సాయుజ్యములను కోరుచు శ్రీహరిని పూజించినచో ఉత్తమరాజన భక్తియగును. ఇది శ్రీహరికి ప్రీతిని కలిగించును. శ్రీహరిని సేవించినచో మధ్యమసాత్త్విక భక్తియగును. హరిని పూజించుట నా కర్తవ్యము అను బుద్ధితో దాసుని వలె శ్రీహరిని పూజించినచో అన్ని భక్తులలో ఉత్తమైనది, ఉత్తమ సాత్త్విక భక్తి అగును. శ్రీహరి మహిమను ఏ కొంచెమైనను గొప్ప సంతోషముతో ప్రీతికలవాడై తన్మయత్వముతో స్తుతించినచో ఉత్తమోత్తమమైన భక్తి అగును. నేనే విష్ణువును. ఈ జగత్తంతయు నాలోనే నిలిచియున్నది అని జగత్తు అంతటిని విష్ణుమయముగా చూడగలవాడు ఉత్తమోత్తముడగును. ఇట్లు పది విధములుగా నుండు భక్తి సంసారమును నశింపచేయును. ఈ పదివిధములలోను సాత్త్వికభక్తి అన్ని కోరికలను ప్రసాదించును. కావున ఓ మహారాజా! సంసారమును గెలువలయునని కోరువారు తమ కర్మలకు విరోధము కాకుండా శ్రీహరియందు భక్తిని చేయవలయును. స్వధర్మమును వదిలి భక్తిని మాత్రమే చేయువాని విషయమున శ్రీహరి సంతోషించడు. ఆచారముతో మాత్రమే శ్రీహరి సంతోషించును. అన్ని ఆగమములలోను మొదటిది ఆచారమని నిర్ణయించబడినది. ఆచారమునుండే ధర్మము పుట్టును. ధర్మమునకు శ్రీహరి ప్రభువు. కావున స్వధర్మమునకు భంగకరము కాని విధముగా శ్రీహరి భక్తిని ఆచరించవలయును. సదాచారము లేనివారికి ధర్మములు సుఖము నీయజాలవు. స్వధర్మాచరణములేని భక్తి లేనిదానితో సమానమే. నీవు అడిగిన దానినంతటిని చెప్పితిని. కావున ధర్మపరుడవై జనార్దనుని పూజించుము. సూక్ష్మరూపుడైన శ్రీమన్నారాయణుని పూజించి ఆనందమును పొందగలవు. శివుడే శ్రీహరి, శ్రీహరియే శివుడు. ఇద్దరిలో భేదమును చూచు ఖలుడు కోటి నరకములను పొందును. కావున శ్రీహరిని కాని శివుని కాని సమానముగా భావించి పూజించుము. భేదమును చూచువాడు ఇహపరములలో దుఃఖమును పొందును.

ఓ రాజా! సుబుద్ధీ! నేను నీ వద్దకు వచ్చిన కారణమును చెప్పెదను. సావధానముగా వినుము. నీ పితామహులు ఆత్మహత్యా పాపమును చేసి కపిలమహర్షి కోపముచే దహించబడి నరకమున ఉన్నారు. ఓ మహానుభావా! గంగను తీసుకొని వచ్చి నీ పితామహులను ఉద్ధరించుము. గంగ అన్ని పాపములను నశింపచేయును. కేశములు, అస్థులు, నఖములు, దంతములు, చివరికి బూడిద అయిననూ గంగాజలముచే స్పృశించబడినచో శ్రీ విష్ణులోకమును చేర్చును. అస్థులను కాని భస్మమును కాని గంగలో పడవేసినచో అతను అన్ని పాపములనుండి విముక్తుడై శ్రీహరి భవనమునుచేరును. గంగా బిందు అభిషేకము వలన నేను నీకు తెలిపిన పాపములన్నియూ నశించును.”

సనక మహర్షి పలికెను: ఓ మునిశ్రేష్ఠా! మహారాజగు భగీరథునితో యమధర్మరాజు ఇట్లు చెప్పి వెంటనే అంతర్ధానము చెందెను. సర్వశాస్త్రార్ధకోవిదుడు మహాప్రాజ్ఞుడు అగు భగీరథమహారాజు మంత్రులయందు రాజ్యభారమును ఉంచి అరణ్యమునకు వెళ్ళెను. హిమవత్పర్వతమునకు వెళ్ళి అచట నరనారాయణాశ్రమమునకు పశ్చిమమున పదునారు యోజనముల దూరమున మంచుతో కప్ప బడియున్న శృంగమున తపస్సు చేసి మూడు లోకములలో పావనమైన గంగను తెప్పించెను. (1/15)