గృహస్థ ధర్మముల నిరూపణము

సనకమహర్షి పలికెను: వేదాధ్యయనము చేయువరకు గురువునకు శుశ్రూష చేయవలయును. గురువుగారి అనుమతినిపొంది అగ్నిపరిగ్రహమును చేయవలయును. వేదములను, వేదాంగములను ధర్మశాస్త్రములను చక్కగా అధ్యయనము చేసి గురువుగారికి దక్షిణ సమర్పించి ఇల్లును చేరవలయును. తరువాత రూపలావణ్య సంపన్నురాలు గుణవతి సత్కులోద్భవ, సుశీల, ధర్మచారిణి అయిన కన్యను వివాహమాడవలయును. తల్లివంశము నుండి అయిదవ తరమునకు, తండ్రినుండి ఏడవ తరమునకు సంబంధించని కన్యను వివాహము చేసుకొనవలయును. అట్లుకానిచో గురుతల్పగత పాపము సంభవించును. (అనగా మేనత్త, మేనమామ, బావమరిది మొదలగువారి పుత్రికలను వివాహ మాడరాదని భావము). ఎపుడూ రోగముతో ఉండు కన్యను, తిరుగుడు కనులదానిని, రోగములున్న కులమున పుట్టిన దానిని అతికేశను, అకేశను, వదరుబోతును, కోపిష్ఠురాలిని, పొట్టిదానిని, చాలాపొడగరిని, విరూపిణిని, న్యూనాంగిని, అధికాంగిని, ఉన్మత్తురాలిని, కొండెములు చెప్పుదానిని వివాహమాడరాదు. స్థూలగుల్భను (లావు మడిమలు కలదానిని) పొడుగు పిక్కలు కలదానిని, పురుషాకారముతో ఉన్నదానిని, మువ్వన్నెలు కలదానిని వివాహమాడరాదు. వృథాహాస్యముఖిని, ఎపుడూ ఇతరుల ఇండల్లో ఉండుదానిని, వివాదశీలను, భ్రమించుదానిని, కఠినురాలిని, వివాహ మాడరాదు. అతిగా భుజించు దానిని, పెద్ద దంతములు కలదానిని, లావు పెదవులు కలదానిని, ఘుర్ఘుర ధ్వని కలదానిని, అతికృష్ణవర్ణను, రక్తవర్ణను, ధూర్తురాలిని వివాహమాడరాదు. ఎపుడూ ఏడ్చుస్వభావము కలదానిని, పాండుదేహము కలదానిని, కుత్సితురాలిని, కాస శ్వాస మొదలగు వ్యాధులు కలదానిని నిద్రశీలిని వివాహమాడరాదు. అనర్ధభాషిణిని, లోకద్వేషపరాయణను, పరాపవాదనిరతను, చోరస్వభావను వివాహమాడరాదు. పొడుగు ముక్కుగలదానిని, కపటశీలను శరీరమంతటా రోమములు గలదానిని, గర్వితురాలిని, బకవృత్తిని (వంచనాపరను) ఎప్పుడూ వివాహమాడరాదు. బాల్యమున తెలియక వివాహమాడినను, ప్రగల్బురాలుగా గుణరహితురాలుగా తెలిసినచో విడిచి పెట్టవలయును. భర్తవిషయమున సంతాన విషయమున సర్వదా కఠినముగా ప్రవర్తించుదానిని, పరానుకూలురాలిని సర్వదా పరిత్యాగము చేయవలయును. బ్రాహ్మము మొదలగు వివాహములు ఎనిమిది విధములు. వీటిలో మొదటివి శ్రేష్ఠములు. మొదటివి లేనపుడు తరువాతవి శ్రేష్ఠములు. బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని ఎనిమిది విధములు, బ్రాహ్మణుడు ఎప్పుడూ బ్రాహ్మవివాహమునే చేసుకొన వలయును. దైవముకాని ఆర్షమునుకాని చేసుకొవచ్చునని కొందరి మతము. ప్రాజాపత్యము మొద లగు అయిదు వివాహములు ద్విజులకు నింద్యములు. పూర్వములు వీలుకాని పక్షమున పరములను చేసుకొనవచ్చును. రెండు యజ్ఞోపవీతములను ఉత్తరీయమును, బంగారు కుండలములను, ధౌత వస్త్రద్వయమును ధరించవలయును. చందనాద్యను లేపనము చేసుకొనవలయును. కేశన ఖాది కృంతనము గావించుకొని శుచిగా ఉండవలయును. వెదురు దండమును, ఉదకముతో నిండిన కమండలమును, తలపాగాను, తెల్లని ఛత్రమును పాదుకలను, ఉపానహములను (చెప్పులను), సుగంధ పుష్పమాల్యములను ధరించవలయును. పరాన్నమును పరవాదమును పరిత్యజించ వలయును. తాను ఒక పాదముతో మరొకపాదమును కండూయనము (దురదపుట్టిన గోకుకొనుట) చేయరాదు. పూజ్యులకు, దేవాలయమునకు అపసవ్యముగా వెళ్ళరాదు. దేవార్చనలో, ఆచమనములో, స్నానములో వ్రతశ్రాద్ధాదిక్రియలలో కేశములు విరబోసుకొని ఉండరాదు. ఏకవస్త్రమును ధరించి ఉండరాదు. ఒంటెమీద ఆరోహించరాదు. శుష్కవాదమును చేయరాదు. పరస్త్రీ సంగమమును చేయరాదు. కొండెములు చెప్పరాదు. లుబ్ధత్వమును వీడవలయును. గోవుకు, రావిచెట్టుకు, అగ్నికి పర్వతమునకు అపసవ్యముగా వెళ్ళరాదు. నాలుగుదారులు కూడలికి దేవతా వృక్షమునకు, దేవా లయమునకు అపసవ్యముగా నడువరాదు. రాజునకు అపసవ్యముగా నడువరాదు. అసూయను. మాత్సర్యమును, పగటి నిద్రను వీడవలయును. ఇతరుల పాపములను తన పుణ్యమును బయలు పరచరాదు. తన పేరును నక్షత్రమును గౌరవమును రహస్యముగా ఉంచవలయును. దుర్జనులతో కలిసి ఉండరాదు. శాస్త్ర విరుద్ధమైనదానిని వినరాదు. బ్రాహ్మణుడు మధుపానమునందు, ద్యూతము నందు, గీతమునందు ఆసక్తి చూపరాదు. పచ్చి ఎముకను, ఉచ్ఛిష్టమును శూద్రుని, పతితుని, సర్పమును, శ్వాసమును (కుక్కను) స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును. చితిని, చితి కాష్ఠమును, యూపమును, చండాలుని, దేవలకు నిస్పృశించినచో సచేలస్నానమును ఆచరించ వలయును. దీపమును, మంచమును, నీడను, కేశమును, వస్త్రమును, కటోదకమును, మేకను, మార్జనధూళిని మార్జారమును స్పృశించినచో శుభములు తొలగును. చేటగాలిని, ప్రేతధూమమును శూద్రాన్న భోజనమును, శూద్రస్త్రీ సంసర్గమును, దూరమునుండియే వీడవలయును. అసత్ శాస్త్రార్ధ ములను మననము చేయరాదు. నఖకేశములను భేదనము చేయరాదు. నగ్నముగా శయనించరాదు. శిరమునకు అలమగా మిగిలిన తైలమును ఇతర శరీరాంగములకు అలమరాదు. అపరిశుద్ధుడుగా ఉన్నప్పుడు అగ్నిని గురువును దేవతలను సేవించరాదు. ఒకే వామ హస్తముతో కాని, కేవలము నోటితో కాని జలపానము చేయరాదు. గురువుగారి నీడను, ఆజ్ఞను దాటరాదు. యోగులను, బ్రాహ్మణులను, వ్రతులను, యతులను నిందించరాదు. బ్రాహ్మణుడు పరస్పర రహస్యములను ప్రకటించ రాదు. పూర్ణిమా అమావాస్యలలో ద్విజుడు యథావిధిగా యాగమును చేయవలయును. ద్విజులు ప్రాతఃకాలమున సాయంకాలమున హోమమును దేవోపాసనము చేయవలయును. ఉపాసనను పరిత్యజించినవాడు సురాపానము చేసినవానితో సముడని పండితులు భావింతురు. గృహస్థుడైన బ్రాహ్మణుడు అయనకాలమున, విషువ కాలమున యుగాది కాలములలో అమావాస్యలో పితృపక్షమున శ్రాద్ధమును చేయవలయును. మన్వాది కాలమున మృతాహమున, అష్టమతిథిన కొత్తధాన్యము ఇంటికి వచ్చినపుడు గృహస్థుడు శ్రాద్ధము ఆచరించవలయును. శ్రోత్రియులు ఇంటికి వచ్చినపుడు, చంద్రసూర్య గ్రహణములలో, పుణ్యక్షేత్రములలో, పుణ్యతీర్థములలో గృహస్థుడు శ్రాద్ధము నాచరించ వలయును. ఊర్ధ్వపుండ్రధారణచేయక చేసిన యజ్ఞదాన తపోహోమ స్వాధ్యాయ పితృ తర్పణములు వ్యర్ధమగును. ఊర్ధ్వపుండ్రమున, తులసిని కొందరు శ్రాద్ధమున అంగీకరించరు. కాని శ్రేయస్సును కోరువారు వ్యర్ధాచారములను విడువలయును. ఇట్లు ద్విజులు స్మృతి మార్గ ప్రచోదితములు సర్వకర్మ ఫలప్రదములు అయిన ధర్మములను ఆచరించవలయును. సదాచార పరులకు విష్ణువు ప్రసన్నుడగును. విష్ణువు ప్రసన్నుడైనచో సాధించరానిది ఏమున్నది? (1/26)