నారద మహా పురాణము
గంగామాహత్మ్యము
నారద మహర్షి పలికెను: ఓ మునిశ్రేష్ఠా! సగరవంశమున రాక్షసభావమునుండి విముక్తుడైన వాడెవడు? సగరుడెవరు? అది అంతయు నాకు వివరించుము.
సనక మహర్షి పలికెను: ఓ మునిశ్రేష్ఠా! ఉత్తమమైన గంగా మాహాత్మ్యమును వినుము. గంగా జలస్పర్శ మాత్రముననే నగర వంశము పావనమైనది. అన్ని లోకములలో ఉత్తమమైన విష్ణులోకము చేరినది. సూర్యవంశమున వృక మహారాజ పుత్రుడగు బాహువు అనువాడు ఉండెను. బాహువు ధర్మతత్పరుడై ధర్మబద్ధముగా పృథివిని అనుభవించుచుండెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, చివరికి జంతువులు కూడా తమతమ ధర్మములను ఆచరించునట్లు బాహువు పరిపాలించుటచే బాహువు సర్వప్రాణులకు ప్రభువు అయ్యెను. ఏడు ద్వీపములలో ఏడు అశ్వమేధ యాగములను చేసెను. గోవులను, భూమిని, బంగారమును, వస్త్రములను దానము చేసి బ్రాహ్మణులను తృప్తి పరిచెను. రాజనీతిచే శత్రువులను శాసించెను. ఇతరుల బాధలను తీర్చిన తనను కృతార్థునిగా తలచెను. బాహువు యొక్క రాజ్యమున సుఖముగా ఉన్న ప్రజలు సుందరులైన చందనములను దివ్యములైన భూషణములను ధరించి ఆనందముగా ఉండిరి. ఆయన రాజ్యమున దున్నకనే పండెడు భామి, పుష్పములతో ఫలములతో నిండుగా ఉన్న చెట్లు ఉండెను. సకాలమున ఇంద్రుడు భూమి మీద వర్షించెను. అధర్మము పూర్తిగా తొలగినందున ధర్మమే ప్రజలను కాపాడుచుండెను.
కొంతకాలమునకు ఒక సమయమున ఆ బాహురాజు మనసులో లోభము వలన జనించిన అసూయతో కూడిన గొప్ప అహంకారము కలిగెను. నేను ప్రజలందరికి ప్రభువును. ప్రజలందరిని కాపాడువాడను. బలవంతుడను. నేను మహాయాగములను చేసినవాడను. నాకంటే పూజించదగినవాడు ఇతరుడెవడు ఉన్నాడు? నేను వివేకము కలవాడను. ఐశ్వర్యము కలవాడను. శత్రువులను అందరిని గెలిచితిని. వేదవేదాంగ తత్త్వములను తెలిసినవాడను. నీతి శాస్త్రవిశారదుడను. నన్నెవరూ జయించలేరు. నా ఐశ్వర్యమునకు లోటులేదు. ఈ భూలోకమున నా కంటే గొప్పవాడెవడున్నాడు? అని ఇట్లు అహంకారము కలిగిన ఆ రాజులో అసూయ పుట్టెను. అసూయవలన కామము కలిగెను. ఇట్లు అహంకారము, అసూయ, కామము ఈ మూడు ఉన్నచో మానవుడు వినాశమార్గమున ప్రవేశించును. యౌవనము, ఐశ్వర్యము, అధికారము, అవివేకము. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటున్ననూ అనర్థమును కలిగించును. ఇక నాలుగున్నచో ఏమి చెప్పవలయును! లోకమునకు విరోధమును కలిగించు గొప్ప అసూయ ఆ రాజులో కలిగెను. ఈ అసూయ తన దేహమును అన్ని సంపదలను నశింపచేయును. అసూయ కలవానికి సంపద ఉన్నచో పొట్టులో (ఊకలో) పడిన అగ్నికి వాయువు తోడైనదని భావించుము. అసూయ కూడిన మనసు కలవారికి, బూటకపు ఆచారమును నటించువారికి, కఠినముగా మాటలాడువారికి ఇహమున, పరమున కూడ సుఖము ఉండదు. అసూయ కలవారికి, ఎపుడూ కఠినముగా మాట్లాడువారికి ప్రియులు, పుత్రులు, బంధువులు కూడా శత్రువులే అగుదురు. పరస్త్రీ విషయములో మనసున అభిలాష కలిగినచో ఆ అభిలాష తన సంపద్వినాశమునకు గొడ్డలి వంటిదని తెలియుము. తన మేలును చేతులారా చెడగొట్టుకొనువాడు ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ చెందును. మిత్రులకు, సంతానమునకు, గృహమునకు, క్షేత్రములకు, ధనధాన్యపశువులకు కూడా హాని కోరువాడే అసూయకలవాడగును. అసూయ కలవాని మిత్రాదులకు కూడ హాని చేకూరును.
అహంకారము, అసూయగల బాహునకు హైహయ వంశమువారు, తాల జంఘ రాజులు శత్రువులుగా ఏర్పడిరి. శ్రీహరి అనుకూలుడుగా ఉన్నవానికి సౌభాగ్యము పెరుగును. శ్రీహరి విముఖుడైనచో సౌభాగ్యము క్షీణించును. శ్రీమన్నారాయణుని కరుణా కటాక్ష వీక్షణమున్నంత వరకే పుత్రపౌత్రధనధాన్యగృహాదిసంపదలు నిలుచును. మూర్ఖులు, మూగవారు, గుడ్డివారు, చెవిటివారు, బుద్ధిహీనులు కూడా శ్రీనివాసుని కటాక్షము సోకినచో శూరులు, వివేకవంతులు కొనియాడ దగినవారు అగుదురు. అసూయాద్వేషములు పుట్టిన వాని సౌభాగ్యము క్షీణించిపోవును. జంతువులను ద్వేషించినచో విశేషముగా క్షయమగును. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ద్వేషించువానికి అన్ని శ్రేయస్సులు నశించును. అసూయను పెంచుకొనిన వానికి శ్రీమహావిష్ణువు విముఖుడగును. అతని ధనము, ధాన్యము, సంపదలు, భూమి నశించును. ఇది నిశ్చయము. అహంకారము వివేకమును నశింపచేయును. వివేకము నశించిన వారికి ఆపదలు సంభవించును. కావున అహంకారమును విడువ వలయును. అహంకారము ఉన్నవానికి త్వరగా నాశము కలుగును. కావున అసూయనిండిన బాహురాజునకు శత్రువులతో ఒకనెల రోజులు ఘోరముగా యుద్ధము జరిగెను. హైహయలు, తాళజంఘలు బాహురాజును యుద్ధమున ఓడించిరి.
అట్లు శత్రువులచే పరాజితుడైన ఆ బాహువు గర్భవతియైన తన భార్యతో అరణ్యమునకు వెళ్ళెను. అచట ఒక సరస్సును చూచి సంతోషించెను. అసూయ నిండియున్న మనసుగల ఆ బాహు మహారాజు మనోగత భావమును ఆ సరస్సు వద్ద ఉన్న పక్షులు చూచి ఆకుల మాటున దాగియుండి - “ఇది చాలా కష్టము. ఇచటికి ఒక భయంకర రూపము వచ్చినది. త్వరగా మీ మీ నివాసములకు వెళ్ళుడు” అని పలికినవి. ఇది చాలా గొప్ప చిత్రము. ఆ బాహుమహారాజు తన భార్యలతో సరస్సున స్నానమాడి, సంతోషముతో నీరుత్రాగి ఆనందమునిచ్చు చెట్టునీడను చేరెను. ఆ బాహుమహారాజు అరణ్యమునకు వెళ్ళుచున్నపుడు, అతనిచే పరిపాలించబడిన ప్రజలు అతని దుర్గుణములను లెక్కించుచు ‘వ్యర్థము’, ‘వ్యర్థము’ అని నిందించిరి. ఎవరైనను మానవుడు గుణవంతుడుగా నున్నపుడు అందరూ కీర్తింతురు. కాని అతడే దుర్గుణమును అలవరచుకొనిన ఎన్ని సంపదలున్ననూ జనులు నిందింతురు. ఈ లోకమున అపకీర్తితో సాటియైన మృత్యువు మఱయొకటిలేదు. బాహుమహారాజు అరణ్యమునకు వెళ్ళగానే అతని రాజ్యములోని ప్రజలు గ్రీష్మర్తువు గడిచినప్పుడు సంతోషించినట్లు సంతోషించిరి. ఓ బ్రాహ్మణోత్తమా! ఇట్లు బాహుమహారాజు అందరిచే పలువిధములుగా నిందించబడి చచ్చినవానివలె అడవిలో ఉండెను. లోకమున తాను సంపాదించిన కీర్తిని తన పనులచే హరింపచేసుకొనెను. అపకీర్తితో సాటియగు మృత్యువు మరి యొకటి ఉండదు. కోపముతో సాటివచ్చు శత్రువు మరియొకడు ఉండడు. ఇతరులను నిందించుటతో సమానమైన పాపము మరియొకటి లేదు. మోహముతో సమానమైన మద్యము ఇంకొకటిలేదు. అసూయతో సాటివచ్చు అపకీర్తి, కామముతో సాటియైన అగ్ని, రాగముతో సమానమైన పాశము, సంగముతో సాటివచ్చు విషము మరియొకటిలేదు. అత్యంతదుఃఖముతో బాహువు ఇట్లు విలపించి మానసిక పరితాపము వలన శరీరము జీర్ణించి వృద్ధత్వమును పొందెను.
చాలాకాలము గడచిన తరువాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై ఔర్వమహర్షి ఆశ్రమ సమీపమున మరణించెను. గర్భవతిగానున్న బాహువు చిన్నభార్య చాలా కాలము పలు విధములుగా విలపించి సహగమనము చేయుటకు నిశ్చయించుకొనెను. ఎండుకట్టెలను తీసుకొనివచ్చి చితిని పేర్చి మిక్కిలి దుఃఖముతో భర్తదేహమును చితిపై పరుండబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్ధపడెను. ఇంతలో జ్ఞాని, తేజోనిధి అయిన ఔర్వమహర్షి తన దివ్యసమాధిచే దీనినంతటిని తెలుసుకొనెను. అసూయలేని మహానుభావులైన మునీశ్వరులు త్రికాలజ్ఞులు, కావున జ్ఞాననేత్రముతో భూతభవిష్యద్వర్తమానములను తెలియుదురు. తపస్సులచే తేజోరాశి పుణ్యమూర్తి అయిన ఔర్వమహర్షి బాహుమహా రాజుయొక్క ప్రియురాలున్న ప్రదేశమునకు వచ్చెను. ఔర్వమహర్షి చితిమీదికి చేరుటకు సిద్ధముగా ఉన్న బాహుభార్యను చూచి ధర్మమూలములైన కొన్ని మాటలను ఔర్వమహర్షి ఇట్లు చెప్పెను.
“ఓ మహారాజపత్నీ! సాధ్వీ! ఇంత సాహసమును చేయకుము. నీ గర్భములో శత్రుసంహారము చేయువాడైన చక్రవర్తి ఉన్నాడు. బాలపుత్రులుగల స్త్రీ, గర్భవతి, రజస్వలకాని స్త్రీ, రజస్వలగా ఉన్న స్త్రీ సహగమనము చేయరాదు. బ్రహ్మహత్యాదిపాపములు చేయువానికి, కపటికి, నిందించువానికి ప్రాయశ్చిత్తమున్నది కాని గర్భస్థ శిశువును హత్యచేసినవారికి నిష్కృతిలేదు. నాస్తికునికి, కృతఘ్నునికి, ధర్మమును ఉపేక్షించువానికి, విశ్యాసఘాతకునికి నిష్కృతిలేదు. కావున ఈ మహాపాపమును నీవు చేయతగవు. ఇపుడు నీకు కలిగిన దుఃఖము తొలిగిపోవును. ఇట్లు ఔర్వ మహాముని మాటలను వినిన ఆ సాధ్వి ఆ ముని అనుగ్రహమున్నదని విశ్వసించి భర్తపాదములను పట్టుకొని మిక్కిలి దుఃఖముతో విలపించెను. సర్వశాస్త్రార్థములను తెలిసిన ఔర్వమహర్షి కూడా ఆమెతో మరల ఇట్లనెను. “ఓ రాజపుత్రీ! నీవు రోదించకుము. ముందు సంపదలను పొందగలవు. కన్నీరును విడవకుము. సజ్జనులు మొదటచేయవలసిన పని ప్రేతదహనము. కావున దుఃఖమును విడిచి ఇపుడు ఉచితమైన పనిని చేయుము. పండితుడైనను, మూర్ఖుడైనను, దరిద్రుడైనను, శ్రీమంతుడైనను, మంచివానియందు, చెడువాని యందును మృత్యువు ఒక్కతీరుగానే ప్రవర్తించును. నగరమున కాని అరణ్యమున కాని మృత్యువు ఒకేతీరుగా వచ్చును. ఈ విషయమున దైవము ప్రబలము. పూర్వజన్మలో చేసిన కర్మనే ఈ లోకమున అనుభవింతురు. ఏదో సాకును చెప్పు మానవులు ఎట్లు భావించిననూ ఈ విషయమున దైవమే కారణము. గర్భములో కాని, బాల్యమున కాని, యౌవనమున గాని, వార్థక్యమున కాని ప్రాణులు మృత్యువశులు కావలసినదే. కర్మవశమున ఉన్న ప్రాణులను గోవిందుడే కాపాడును. గోవిందుడే సంహరించును. నిమిత్త మాత్రమైన ప్రాణులపై అజ్ఞానులు నిందలు వేతురు. కావున దుఃఖమును విడిచి స్వస్థురాలవు కమ్ము. భర్తకు అంత్యక్రియలను చేసి వివేకముతో స్థిరముగా నుండుము. ఈ శరీరము వేలకొలది వ్యాధులకు దుఃఖములకు నిలయము. కర్మపాశముతో నియమించబడి సుఖముగా తోచుచు బహుదుఃఖములను కలిగించును” అని ఇట్లు ఓదార్చి ఆ సాధ్వితో అంత్యక్రియలను చేయించెను. దుఃఖమును విడిచిన ఆ సాధ్వి ఔర్వమహర్షికి నమస్కరించి ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! సత్పురుషులు ఇతరుల హితము కొఱకు మాత్రమే తాము ఫలములను ఆశించెదరు. చెట్లు తమ అనుభవము కొఱకు పండ్లను కలిగియుండునా? ఇతరుల దుఃఖమును తెలుసుకొని మంచిమాటలతో ఓదార్చువాడే ఇతరుల హితమును చేయువాడు కావున అతనే విష్ణు స్వరూపుడు. ఇతరుల దుఃఖమును చూచి దుఃఖించువాడు, ఇతరుల ఆనందమును చూచి ఆనందించువాడే జగన్నాథుడు. నరరూపమును ధరించిన శ్రీహరియే. సత్పురుషులు అభ్యసించిన శాస్త్రములు ఇతరుల దుఃఖమును తొలగించుట కొఱకే. అందరి దుఃఖములను నశింపచేయుటకే అని సత్పురుషులు చెప్పుచుందురు. సత్పురుషులు తిరుగాడుచోట దుఃఖము బాధించదు. సూర్యుడున్నచో చీకటెట్లుండును? ఇట్లు పలుకుచు ఆ బాహుమహారాజు యొక్క చిన్నభార్య తన భర్తకు అంత్యక్రియలను ఆ సరస్సు తీరమున ముని చెప్పిన విధముగా పూర్తిచేసెను. ముని అక్కడ ఉండగనే బాహుమహారాజు చితా మధ్యమునుండి దివ్యరూపముతో బయలువెడలి ఇంద్రునివలె ఉత్తమ విమానమును అధిరోహించి ఔర్వమహర్షికి నమస్కరించి పరమధామమును చేరెను. మహాపాతకములు చేసిన వారైననూ ఉపపాతకములు చేసిన వారైనను మహాత్ముల చూపు సోకినచో పరమ పదమును చేరెదరు. మృతుని దేహమును కాని, భస్మము కాని, చివరికి ధూమము కాని పుణ్యాత్ముడు చూచినచో ఉత్తమగతిని పొందును. ఇట్లు భర్తకు అంత్యక్రియలను పూర్తి చేసి సపత్నితో కలిసి ఔర్వమహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ మహర్షిని సేవించుచుండెను. (1/7)