కామోదాఖ్యానము

మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా ఇపుడు నాకు కామోదా మాహాత్మ్యమును చెప్పుము. నీ నోటి నుండి విని నేను కృతార్థురాలనై శాంతిని పొందెదను.

వసువు పలికెను: ఓ మోహినీ! కామోదాఖ్యానమును చెప్పెదను వినుము. దీనిని వినిన సర్వపాప వినిర్ముక్తుడగును. గంగా తీరమున కామోద అను నగరము కలదు. శ్రీహరి ప్రియురాళ్ళగు కామోదలు దేవతలతో కలిసి ఇచటనే నివసింతురు. దేవదానవులు కలిసి క్షీరసాగర మధనము గావించినపుడు కన్యారత్న చతుష్టయమున కామోదకూడా ఉద్భవించెను. మొదటిది రమా, రెండవది వారుణి, మూడవది కామోదా నాలుగవది వర. వీరిలో ముగ్గురు కన్యలు శ్రీ మహావిష్ణువును పొందిరి. శ్రీమహావిష్ణువు అజ్ఞచే వారుణిని అసురులు పొందిరి. అప్పటినుండి లక్ష్మీదేవి శ్రీవిష్ణు వక్షస్థలమున ఉండెను. ఈమె సపత్ని రహితముగా విష్ణుపత్ని అయ్యెను. జరుగబోవు కార్యమును తెలిసిన దేవతలు శ్రీమహావిష్ణ్వాజ్ఞుచే కామోదా అను నగరమును నిర్మించి, అచట కామోదా దేవిని ప్రతిష్ఠించి పూజించుచుండిరి. కామోదాదేవి మాత్రము ఎల్లపుడు విష్ణు సంయోగమును కోరుచు ఇచటనే ఉండి, భావముతో విష్ణు భార్యాత్వమును పొంది ధ్యానపరాయణు రాలాయెను. సర్వగతుడు భావగ మ్యుడగు శ్రీ మహావిష్ణువు ఈమె సమీపముననే ఉండెను. ఇచట శ్రీ మహావిష్ణువు దేవదానవముని మానవులకు అదృశ్య దేహునిగా ధ్యానమాత్ర గోచరునిగా ఉండెను. ఇచట దేవతలు మునులుకూడా శ్రీహరిని ధ్యానముచేతనే చూతురు. మహానుభావురాలగు కామోదా నవ్వినపుడు సంతోషాతిరేక యుక్తురాలైనపుడు కనుల నుండి నీటి బిందువులు పడును. గంగలో పడిన ఆనందాశ్రువులు కామోదములను పద్మములగును. ఇవి పసుపుపచ్చగా సుగంధము కలవిగా ఉండును. అదృష్టవశ మున ఈ పద్మములను పొందినవారు ఈ పద్మములతో శివుని పూజించవలయును. అతను వాంఛిత కామములను పొందునని పరమేశ్వరాజ్ఞ. కామోదాదేవికి దుఃఖము కలిగినపుడు దుఃఖా శ్రువులు గంగలోపడి గంధ రహితములగు పద్మములు పుట్టును. ఈ పద్మములతో శంకరుని పూజించినచో పూర్వ పాపమోహితుడై సకల దుఃఖములను పొందును.

గంగా ద్వారమునకు ఉపరి భాగమున దశయోజన దూరమున నున్న కామోద తీర్థమున ఒక సంవత్సరము ద్వాదశాక్షర మంత్రమును జపించవలయును. వర్షాంతమున చైత్ర ద్వాదశినాడు వసంత శోభను చూచి కామోదా దేవి సంతోషముతో నవ్వును. అపుడు ఆ పద్మములను పొందగలడు. మరియొక విధముగా పొందజాలడు. ఇచట విష్ణు భక్తిపరాయణుడై కామోదపురమును ధ్యానము చేసి స్నానమాడినచో శ్రీహరి ప్రియుడగును. దేవతలకు పితరులకుకూడా ప్రీతిపాత్రుడగును. ఇచట పన్నెండు సంవత్సరములు ఉండి జపపరాయణుడైనచో ప్రత్యక్షముగా కామోదాదేవిని దర్శించగలడు. ఈ తీర్థమున శుచియై స్నానము చేసినచో తలచిన కోరికలను పొందగలడు. ఈ తీర్థము పరమోత్తమము. భాగ్యవశమున మాత్రమే లభించును. మంచు కరిగినపుడు మాత్రమే కనిపించును. అపుడైనను చాలా కష్టముచే వెళ్ళదగిన వికటస్థలమునకలదు. ఇట్లు కామశుభకరమగు కామోదాఖ్యానమును తెలిపితిని. ఈ అఖ్యానమును భక్తిచే వినినవారుకూడా పాప విముక్తులు అగుదురు. (II/68)