నారద మహా పురాణము
భృగుభరద్వాజ సంవాదము
భరద్వాజ మహర్షి పలికెను: ఈ లోకముకాక పరలోకము కలదని వినబడుచున్నది కాని కనపడుట లేదు. ఆ పరలోకమును గూర్చి తెలియగోరుచున్నాను. మీరు తెలియ జేయుడు.
భృగు మహర్షి పలికెను: పవిత్రము సర్వ సుగుణయుక్తమగు హిమవత్పర్వతమునకు ఉత్తర భాగమున పుణ్యము క్షేమకరము, కామ్యప్రదమగునది పరలోకమని చెప్పబడును. అ పరలోకమున పాపకర్మరహితులు, పవిత్రులు అత్యంత పరిశుద్ధులు, లోభమోహములను పరిత్యజించినవారు, ఉపద్రవ రహితులగు మానవులు నివసింతురు. ఆ ప్రదేశము స్వర్గదృశము. అచట అన్ని శుభ గుణములు ఉండును. అచట సకాలమున మాత్రమే మృత్యువు ప్రాప్తించును. అచట వ్యాధి స్పర్శ ఉండదు. పరదారల యందు లోభముండదు. అచట జనమంతయు స్వదారనిరతులుగా ఉందురు. ఇతరులెవ్వరూ వధించబడరు. ద్రవ్యకాంక్ష ఉండదు, అధర్మమే ఉండదు, సందేహములు ఉండవు. చేసిన పనులకు ప్రత్యక్షఫలమును అనుభవించబడును. అచటి జనులందరు వాహన ఆసన భోజన భవనాది భోగములు కలిగియుందురు. అన్ని కోరికలు తీర్చుకొనువారు, కొందరు హేమాభరణ భూషితులు ఉందురు. కొందరు మాత్రము ప్రాణధారణ మాత్రమునే చేతురు. మరికొందరు చాలా ప్రయాసచే ప్రాణధారణ చేయుదురు.
ఈ లోకమున కొందరు ధర్మపరులు, కొందరు అధర్మపరులుగా ఉందురు. కొందరు సుఖితులు కొందరు దుఃఖితులు, కొందరు ధనవంతులు, కొందరు నిర్ధనులు ఉందురు. ఈ లోకమున శ్రమ, భయము, మోహము, తీవ్రమైన ఆకలి ఉండును. అర్థవిషయమున లోభముచే అజ్ఞానులు మోహ పరవశులగుదురు. ఈ రెండు లోకములను గూర్చి తెలిసిన ప్రాజ్ఞుడు పాపములను అంటడు, అపకారము, చౌర్యము, అపవాదము, అసూయ, పరోపఘాతము, హింస, లోభము అనృతము వీటిని సేవించువారి తపస్సు క్షీణించును. వీటిని ఆచరించని వారి తపస్సు వృద్ధి చెందును. ఈ లోకమున ధర్మాధర్మ కర్మల చింత పలు విధములుగా ఉండును. ఇది కర్మభూమి. ఈ లోకమున శుభాశుభ కర్మలనాచరించి శుభ కర్మలకు శుభ ఫలితమును, అశుభ కర్మలకు, అశుభ ఫలములను పొందును. ఈ లోకమున ప్రజాపతి దేవతలు ఋషులు పూర్వమున యాగములను తపమును ఆచరించి బ్రహ్మ లోకమును చేరిరి. ఈ పృథివి యొక్క ఉత్తర భాగము శుభము సర్వ పుణ్యమయము. ఇక్కడ పుణ్యమును చేసినవారు అక్కడ పుట్టెదరు. పాపమును చేసినవారు పశు పక్ష్యాదులలో జన్మింతురు. మరికొందరు అల్పాయుష్యము కలవారు ఈ లోకముననే నశింతురు. ఇచట ఒకరినొకరు భక్షించుచు, లోభమోహయుక్తులై ఇచటనే తిరుగుచుందురు. ఉత్తర భాగమునకు వెళ్ళజాలరు. నియతులై బ్రహ్మచర్యముతో గురువులను సేవించు బుద్ధిమంతులు అన్నిలోకముల మార్గములను తెలియుదురు. ఇట్లు బ్రహ్మనిర్మితమైన ధర్మమును సంక్షేపముగా నీకు తెలిపితిని. లోకముయొక్క ధర్మా ధర్మములను తెలిసినవాడు బుద్ధిమంతుడు అనబడును.
భరద్వాజ మహర్షి పలికెను: పురుషుని విషయమున అధ్యాత్మమని చెప్పబడుచున్నది కదా! అధ్యాత్మమనగా నేమి? దానిని అంతయూ విశదముగా తెలుపుము.
భృగు మహర్షి పలికెను: ఓ బ్రహ్మర్షీ! నీవు అడుగుచున్న అధ్యాత్మమును చక్కగా వివరించెదను. ఆ అధ్యాత్మమే శ్రేయస్కరము, సుఖప్రదము. అధ్యాత్మము సృష్టి ప్రళయములచే కూడి ఉండునది. ఆచార్యులచే ప్రదర్శించబడినది. అధ్యాత్మ జ్ఞానము కలవాడు లోకమున ప్రీతిని సౌఖ్యమును పొందును. ఫలము లభించును, సర్వభూతపాత మేర్పడును. పృథివి వాయువు, ఆకాశము, జలము, అగ్ని అని పంచ మహాభూతములు. ఈ భూతములు అన్ని ప్రాణుల పుట్టుకకు నాశమునకు మూలములు. ప్రాణులు దేని నుండి పుట్టునో దానిలో లయమగును. సాగరమున పుట్టిన ప్రాణులు భూతములలో లయమగును. తాబేలు తన అవయవములను బయటకు సారించి మరల తనలోనికి ఉపసంహరించుకొనునట్లు పంచ భూతములు ప్రాణులను బయలుపరిచి మరల తనలో ఉపసంహ రించుకొనును. ఇట్లే సర్వభూతాత్మకుడు తననుండి భూతములను సృష్టిచేసి మరల తనలో లీనము చేసుకొనును. పంచమహాభూతములే అన్ని ప్రాణులలో ప్రాణిత్వమును ఏర్పరచును. ప్రాణులలోని భూతత్వమును జీవుడు చూడజాలదు. శబ్దము శ్రోత్రము ఇంద్రియములు అను ఈ మూడు ఆకా శమునుండి పుట్టినవి. స్పర్శ చేష్ట త్వగింద్రియము ఈ మూడు వాయువునుండి పుట్టినవి. రూపము, చక్షువు, పాకము ఈ మూడు తేజోమయములు. రసము, క్లేదము జిహ్వ ఈ మూడు జలగుణములు. వాసన గల వస్తువు, ఘ్రాణేంద్రియము, శరీరము ఈ మూడు భూమి గుణములు. మహాభూతములు అయిదు. ఆరవది మనసు. ఈ సముదాయమునకు ఇంద్రియములు మనస్సు అని వ్యవహారము. ఏడవది బుద్ధి, క్షేత్రజ్ఞుడు ఎనిమిదవవాడు. శ్రోత్రేంద్రియము వినుటకు, త్వగింద్రియము స్పృశిం చుటకు, రసమును గ్రహించుటకు రసనేంద్రియము, గంధమును గ్రహించుటకు నాసిక, నేత్రము చూచుటకు, మనసు సంశయించుటకు ఏర్పడినవి. బుద్ధి నిశ్చయించును. క్షేత్రజ్ఞుడు సాక్షివలె ఉండును. ఊర్ధ్వ భాగమును అధోభాగమును కూడా చూచును. ఈ విభువు చేతనే సమస్త ప్రపంచము వ్యాప్తమైనది. పురుషులు సమగ్రములుగా ఇంద్రియములను తెలియవలయును. రజస్సత్త్వ తమో భావములుకూడా ఇంద్రియాశిత్రములే. ఈవిధముల భూతముల సృష్టిని మూలమును నరుడు తెలిసి, జాగ్రత్తగా సమీక్షించి శాంతిని పొందవలయును. గుణములచే బుద్ధి నశించును. బుద్ధివలననే ఇంద్రియములు కూడా నశించును. మనసుతో కలిసి భూతములు ఆరు. బుద్ధిలేనిచో గుణము లెట్లుండును. కావున ఈ స్థావర జంగమాత్మకమగు విశ్వ మంతయు బుద్ధిమయమే. బుద్ధినుండే పుట్టును. బుద్ధియందేలయమగును. బుద్ధియే నిర్దేశించును. చూచుదానిని నేత్రమని, వినుదానిని శ్రోత్రమని, వాసన చూచుదానిని ఘ్రాణమని, రుచి చూచుదానిని రసనమని, స్పృశించు దానిని త్వక్ అని యందురు. బుద్ధియే ఒకేసారి ఇన్ని వికారములను పొందును. బుద్ధియే మనోరూపమున కోరికలను ప్రకటించును. అన్నిటికి అధిష్ఠానము బుద్ధి. బుద్ధికంటే విడిగా అయిదు అర్థములుండును. ఈ అర్థములనే ఇంద్రియములందురు. ఈ ఇంద్రియములను బుద్ధి అదృశ్యముగా అధిష్ఠించి ఉండును. పురుషునిలో ఉండు బుద్ధి భాత్రమయమున ఉండును. ఒకప్పుడు ప్రీతిని పొందును, ఒకప్పుడు చింతించును. కేవలము సుఖముతోను, కేవలము దుఃఖముతోను ఎప్పుడూ ఉండదు. ఇట్లు మానవుల మనసులో మూడు భావములతో ఉండు భావాత్మకమైన బుద్ధి భావత్రయమును దాటి ఉండదు. నదీపతియగు సముద్రము చెలియలికట్టను అతిక్రమించనట్లు, ఇట్లు భావాతీతము కాని బుద్ధి భావములతో కలిసి మనసులో ఉండును. ఇట్లుండు మనసు తన భావమును అనుసరించి ఉండును. ఆ బుద్ధియే అన్ని ఇంద్రియములను ప్రవర్తింపచేయును. ప్రీతిసత్వము, శోకము రజస్సు, క్రోధము తమము. ఈ లోకములో ఉన్న అన్ని భావములు ఈ మూడింలోనే అంతర్భవించును. ఇట్లు బుద్ధిగతములగు భావనలన్నింటిని నీకు వివరించితిని. బుద్ధిమంతుడగువాడు అన్ని ఇంద్రియ ములను జయించవలయును. సర్వకాలములందు సత్వరజస్తమస్సులు ప్రాణులను ఆశ్రయించి యుండును. మూడు విధములగు వేదనలు కూడా అన్ని ప్రాణులలో నుండును అ వేదనలే సాత్వికి రాజనీ తామసీ అని పిలువబడును. సుఖస్పర్శము సత్వగుణము. దుఃఖ స్పర్శ రజో గుణము. ఈ రెండు తమోగుణముతో కలిసి వ్యవహారమును పొందును. ప్రీతియుక్తమైన భావన శరీరమున కాని మనసున కాని ఉన్నచో దానిని సాత్వికీ భావనగా తెలియుము. దుఃఖ సంయుక్తమగు భావన కలిగినచో మనసునకు అప్రీతికరమైనచో దానిని రాజసీభావనగా తెలియుము. మోహ యుక్తము అస్పష్టము, తెలియరానిది ఊహించరానిదిగా భావన ఏర్పడినచో దానిని తామనీ భావనగా తెలియుము. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, శాంతచిత్తత అనునవి సాత్విక గుణములు. అసంతోషము, పరితాపము, శోకము, లోభము, అసహనము అనునవి రజోగుణములు. అవ మానము, మోహము, ప్రమాదము, నిద్ర, సోమరితనము అనునవి తామస గుణములు. ఇతరులను దూషించుట, చిత్తచాంచల్యము అవిశ్వాసముతో ప్రార్థించుట (యాచించుట) కూడా తామస గుణ ములు. మనసును తన వశములో ఉంచుకొనిన వాడు సుఖమును పొందగలడు. సూక్ష్మములైన బుద్ధి క్షేత్ర క్షేత్రజ్ఞులకున్న భేదమిది. ఒకటి గుణములను సృజించును మరొకటి సృజించదు. దోమ సాలె పురుగు వీటికి దృష్టాంతములు. ఒకదానికొకటిగా వేరుగా ఉండును. రెండు కలిసి ఉండును. ప్రకృతి కంటే విడిగా నుండును. ఎప్పుడూ కలిసియేయుండును. చేప, జలము కలిసియే ఉండును కాని ఆ రెండు ఒకటిగా ఉండవు, వేరుగా ఉండును. గుణములు ఆత్మను తెలియ జాలవు. ఆత్మ అన్ని గుణములను తెలియును. ఆత్మయే గుణములను సృజించును దర్శించును. బుద్ధిమంతులు ఇంద్రియములను దీపముగా ఉపయోగించుకొందురు. చేష్టారహితములచే జ్ఞాన ములు లేని వాటిచే ప్రకాశరూపుడు పరమాత్మ. సత్వము గుణములను సృజించును. క్షేత్రజ్ఞుడు. దర్శించును. సత్వక్షేత్రజ్ఞుల సంయోగము మాత్రము నిశ్చితము. సత్యమునకు క్షేత్రజ్ఞునకు ఆశ్రయమేదీ ఉండదు. సత్వము మనసును సృజించునుకాని గుణములను సృజించదు. గుణముల యొక్క పగ్గములను మనసుచే నిగ్రహించినచో ఘటమున ఉన్న దీపము వలె ఆత్మ ప్రకాశించును. ప్రకృతి సంబంధములగు కర్మలను విడిచి నిత్యము ఆత్మయందు రమించుముని ఉత్తమగతిని పొందును. నీటిలో తిరుగు పక్షికినీరు అంటనట్లు కృతప్రజ్ఞుడు భూతములలో తిరుగుచు భూతములను అంటడు. ఇదియే స్వభావము. మానవుడు తన బుద్ధిచే విహరించవలయును.
కలతలకు కుందక సంపదలకు సంతోషించక మాత్సర్యము విడిచి అన్నిటిలో సముడై భావ యుక్తమగు మనసుతో గుణములను సృజించును. సాలెపురుగు తాను సూత్రములను సృజించుటను పోలికగా తెలియును. సాలెపురుగు సృజించిన సూత్రములు నశించినవి. మరల సృజించబడవు. నశించినవి మరల లభించవు. ప్రత్యక్షముచే పరోక్షమును అనుమానముచే గ్రహించబడును. ఇట్లు కొందరు నిశ్చయించిరి. ఇతరులు నివృత్తిని నిశ్చయించిరి. ఈ రెండు మతములను ఆలోచించి బుద్ధికి తోచినట్లు నిశ్చయించ వలయును. ఇట్లు బుద్ధి చింతామయమైన హృదయ గ్రంధిని ధృడముగా విచ్ఛేదమును చేసుకొని సంశయములు భిన్నములు కాగా ఆనందముగా ఉండవలయును. నదిని చేరి మానవులు మలినమును తొలగించుకొనునట్లు హృదయ గ్రంథి భేదముచే శుద్ధిని పొందెదరు. తీరమును తెలిసినవారు పరితపించక మహానదిని దాటగలిగినట్లు తత్వజ్ఞుడు పరితపించడు. ఇట్లు ఉత్తమజ్ఞానము, కైవల్యము అనబడు అధ్యాత్మమును తెలిసియుందురు. ఇట్లు భూతముల గమనాగమనములను తెలిసి బుద్ధిచే నిశ్చయించి శాంతిని పొంద వలయును. ఇట్లు త్రివర్గమును తెలిసి, జ్ఞానముచే బంధమును విడిచి, తెలియవలసిన దానిని అన్వేషించి తత్త్వదర్శియై ఉత్సుకుడు కాక ఉండవలయును. ఇంద్రియవిభాగముచే ఆత్మదర్శనము చేయజాలడు. దీనిని తెలిసినవాడు మాత్రమే బుద్ధుడగును. ఈ విషయమును తెలిసిన బుద్ధిమంతులు కృతకృత్యులౌదురు. తెలియనివారికి కలుగు భయము తెలిసిన వారికి కలుగదు. దేనికైనను ఇంతకన్ననూ అధికమైన గతి యుండదు. గుణములున్నచో అసమానత్వము లభించును. సంగము లేక అన్వేషించువాడు పురాకృతమును దహింప చేయును. అట్టివానికి ప్రియము అప్రియము రెండు ఉండవు. ఈ లోకము ఆయువును గూర్తి అసూయ చెందును. అట్లు చేయువానికి ఆయువు అసూయనే కలిగించును. ఈ విషయమున జ్ఞాని విచారించడు. అజ్ఞానికి ప్రతిక్షణమున భయము కలుగును.
భరద్వాజ మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! అధ్యాత్మపదమును సిద్ధించుటకు ధ్యానయోగమును తెలుపుము. అధ్యాత్మ జ్ఞానముచే తాపత్రయ విముక్తుడు అగును.
భృగుమహర్షి పలికెను: నీకు నాలుగు విధములుగానున్న జ్ఞానయోగమును చెప్పెదను. ఈ జ్ఞానయోగమును తెలిసిన మహర్షులు సిద్ధిని పొందెదరు. జ్ఞానతృప్తులగు నిర్వాణమును చెందిన మనసుగలవారై మహర్షులు యోగులు ధ్యానమును చక్కగా అనుష్టింతురు. సంసార దోషము నుండి ముక్తులై మరల జన్మించరు. జన్మదోషములను క్షీణించినవారై స్వభావమున ఉందురు. నిర్ద్వంద్వులై నిత్యసత్త్వస్థులై ముక్తులై పరిగ్రహశూన్యులై మనశ్శాంతికరములైన అసంగాదులను అలవరచుకొని క్లిష్టమగు మనసును ఏకాగ్రముగా ధరించవలయును. మౌనముచే కాష్ఠమువలె ఆసీనుడై ఇంద్రియ సమూహమును ఒకచోట చేర్చవలయును. చెవులతో శబ్దమును వినరాదు. త్వగింద్రియముచే స్పర్శను తెలియరాదు. కంటితో చూడరాదు. నాలుకతో రుచిని తెలియరాదు. నాసికతో వాసన చూడరాదు. తత్త్వజ్ఞుడు ధ్యానముతో అన్నింటిని పరిత్యజించవలయును. నిగ్రహ ముచే పంచేంద్రియములను పెడదారిపట్టించు శబ్దాదివిషయములందు కోరికను వీడవలయును. తరువాత పంచేంద్రియములను మనసున సంగ్రహించి భ్రాంతమగు మనసును మనసుచే సంధా నమును చేయవలయును. అంతట తిరుగునది ఆధార రహితము పంచద్వారము బలాబల సంయుక్తము అయిన మనసును ధ్యాన పథమున సంధానము చేయవలయును. ఇంద్రియములను మనసున ఒకటిగా సంధానము చేయుటయే నేను చెప్పిన మొదటి ధ్యానమార్గము. తరువాత ఇంద్రియములను మనసును ఆత్మసంస్థమును చేయవలయును. అపుడు మేఘమున సముద్రాంతమున మెరయు మెరుపువలె స్ఫురించును. ఆకు మీద నున్న జలబిందువు అంతటా లోలమై చంచలమై యుండునో అట్లే ఇతని మనసు ధ్యాన మార్గమున నుండును. సావధానము చేసిన మనసు క్షణకాలము ఏకాగ్రముగా ఉండును. మరల ఆకాశమున వాయువువలె భ్రాంతమగును. నిర్వేదము లేనివాడై, క్లేశము లేనివాడై, సోమరితనమును విడిచి మాత్సర్యము లేనివాడై ధ్యాన యోగమును తెలిసి ధ్యానముచే మనసును సంధానమును చేయవలయును. అట్లు చేసినచో విచా రము, వితర్కము, వివేకము కలుగును. సమాధియుక్తుడగు మునికి మొదటిది ధ్యానము. కష్టపడియైనను మనస్సమాధానమును కూర్చుకొనవలయును. ముని నిర్వేదమును పొందరాదు. ఆత్మ హితమును సంపాదించవలయును. ధూళి భస్మము, పేడ వీటి రాశులను నీటితో తడిపినచో చెదిరిపోక ముద్దగా మారును. తరువాత ఎండి మరల పొడిగా మారి చెదిరిపోవును అట్లే మొదట ఇంద్రియపంచకమును ధ్యానముచే ముద్దగా చేసి సమాధిచే ఎండబెట్టి ఏకాగ్రతచే పొడిచేసి జ్ఞానముచే పారద్రోలవలయును. ఇట్లు క్రమముగా ఇంద్రియ సంహారమును చేసినచో శమించును. ఇట్లు మెల్లగా మనసును ఇంద్రియ పంచకమును మొదట ధ్యాన మార్గమున నిలిపిన, నిత్య యోగముతో శమించును. ఇట్లు నియతాత్మయగు వానికి పురుషకారముతో కాని దైవముచే కాని సుఖము కలు గదు. ఆత్మనియమముచే మాత్రమే ఆనందమును పొందగలడు. ఆ అనందముచే కూడి ధ్యాన మొనరించును. ఇట్లు యోగులు నిర్వాణమును చెందెదరు.
సనంద మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! ఇట్లు భృగుమహర్షి భరద్వాజమహర్షికి ఉపదేశించగా పరమధర్మాత్ముడగు భరద్వాజ మహర్షి ఆశ్చర్యమును చెందినవాడై భృగుమహర్షిని చక్కగా పూజించెను. ఓ జ్ఞానియగు నారదా! ఇట్లు నీవడిగిన జగదుత్పత్తి క్రమమును సంపూర్ణముగా వివరించితిని. ఇంకను ఏమి వినగోరెదవో తెలుపుము. (2/44)