నారద మహా పురాణము
గయా మాహాత్మ్యము
వసిష్ఠ మహర్షి పలికెను: అంతట మోహిని పాపనాశినియగు గంగా మాహాత్మ్యమునువిని మరల పురోహితునితో ఇట్లు పలికెను.
మోహిని పలికెను: పూజ్యుడా! నీవు దయచే నన్ను అనుగ్రహించితివి. పాప శోధనమగు పవిత్రమగు గంగా ఆఖ్యానమును చెప్పితివి. ఈ లోకమున గయా తీర్థము ఎట్లు ప్రసిద్ధి పొందినదో వినగోరు చున్నాను. నా యందు దయయుంచి ఇప్పుడు చెప్పుము.
వసువు పలికెను: గయా తీర్థము పితృ తీర్థము. సర్వ తీర్థాత్తమముగా తలచబడుచున్నది. ఇచట దేవ దేవేశుడగు పితామహుడే స్వయముగా ఉన్నాడు. యోగమును కోరు పితరులు ఈ గాథను గానమును చేసిరి. చాలాపుత్రులను పొందవలయును. వారిలో ఒకడైనను గయకు వెళ్ళును. అశ్వమేధ యాగమును చేయును. నీల వృషభమును విడువవలయును. అట్లే గయా మాహాత్మ్యమును వినవలయును. అన్ని సారములకంటే సారతరము భుక్తిముక్తి ప్రదము అగు ఉత్తమముగు గయామాహాత్మ్యమును సంగ్రహముగా చెప్పెదను వినుము. పూర్వము గయుడను పేరుగల అసురుడు అమిత బలపరాక్రమవంతుడుగా నుండెను. సర్వ ప్రాణులను తపింపచేయు ఘోరతపమును అతడు ఆచరించెను. అతని తపస్సుచే పరితపించిన దేవతలందరు గయాసురుని సంహారమునకు శ్రీహరిని సమీపించిరి. శ్రీహరి వారికి అభయమును ఇచ్చెను. మీరందరూ శివరూపులు కండని పలికెను. గయాసురుని దేహమున శివరూపముతో ఉండుడు అనగా దేవతలు అట్లే అనిరి. ఒకప్పుడు శివపూజ కొరకు క్షీరసాగము నుండి కమలములను గొని తెచ్చి సమీప ప్రాంతమున శ్రీహరికి శయ్య ఏర్పరచెను. విష్ణుమాయా విమూఢుడగు గయాసురుడు శ్రీహరి గదిచే హతుడాయెను. అప్పటి నుండి గదాధరుడగు విష్ణువు గయలో మోక్షప్రదుడుగా చెప్పబడుచున్నాడు. అతని దేహమున శుద్ధుడగు పితామహుడు లింగరూపమున ఉండెను. విష్ణు వాహార్ధ మర్యాదగా పుణ్యక్షేత్రముగా గయ ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రమున యజ్ఞమును, శ్రాద్ధమును, పిండదానమును, స్నానాదికమును కాని చేసినచో స్వర్గమును కాని బ్రహ్మ లోకమునుకాని పొందును. నరకమును చూడడు. గయా తీర్థము ఉత్తమమని తలిచి పితామహుడు యోగమును చేసెను. బ్రాహ్మణులను, వచ్చిన ఋషులను పూజించెను. సరస్వతీ నదిని సృజించి దిగంతముల వరకు వ్యాపించి యుండెను. భక్ష్య భోజ్య ఫలాదులను, కామధేనువులను సృజించెను. గయాతీర్థము పంచ క్రోశ వ్యాప్తము. బ్రాహ్మణులకు ధనము నిచ్చెను. ధర్మ యాగమున విత్త లోభముచే ధనాధికమును గ్రహించిన బ్రాహ్మణులను బ్రహ్మశపించెను. మీ విద్య పురుష వ్యాప్తము కాదు. మీ ధనము త్రిపురుష కాలము నిలువదు. మీ విషయమున ఈ నది విరసమై పాషాణ పర్వతమయముగా ఉండును. అపుడు ఆ విప్రులు ప్రార్థించగా అచట తీర్థములను సృజించెను. గయాశ్రాద్ధమున లోకులందరుపావనులై బ్రహ్మ లోకమును చేరెదరు. మిమ్ములను పూజించినచో నేను పూజించబడుదును. బ్రహ్మ జ్ఞానము, గయా శ్రాద్ధము, గోశాలయందు మరణము, కురుక్షేత్ర నివాసము అని ముక్తి నాలుగు విధములు, సముద్రములు, అన్ని నదులు వాపీ కూపహ్రదములు అన్నియూ స్నానము చేయుటకు గయా తీర్థమునకు వెళ్ళును. బ్రహ్మహత్య, సురాపానము, స్తేయము, గుర్వంగనా గమనముఅఉ అను మహాపాతకములన్నియూ గయా శ్రాద్ధముచే నశించును. చనిపోయి సంస్కరించబడని వారు, పశువులచే హతులైనవారు, సర్పదష్టులు కూడా గయాశ్రాద్ధమున ముక్తులై స్వర్గమును పొందెదరు. గయా తీర్థమున పిండ దానముచే పొందు ఫలితమును నేను శతకోటి కల్పములలో కూడా చెప్పజాలను. ఓ మోహినీ! ఇచట ఒక పురాతనమగు ఇతిహాసము ప్రసిద్ధిగాంచినది. ఇపుడా ఇతిహాసమును చెప్పెదను. ఏకాగ్ర మనస్కురాలవై వినుము.
త్రేతాయుగమున విశాలుడను రాజు ఉండెను. అతను విశాలపురిని నిర్మించి ధన్యుడు ధైర్యవంతుడుగా రాజ్యపాలనమును గావించెను. కాని పుత్రులు లేనందున బ్రాహ్మణులను పుత్ర సంతానమునకు చేయవలసిన దానిని అడిగెను. అంతట ధైర్యముగల బ్రాహ్మణులు ఇట్లు పలికిరి. ఓ రాజా! గయకు వెళ్ళి యధావిధిగా పిండదానముచే పితరులను తృప్తిపరుచుము. అపుడు నీకు నిశ్చయముగా వీరుడు సహస్రదాత సకల క్షితీశుడగు పుత్రుడు కలుగును. బ్రాహ్మణులిట్లు పలుకగా విశాలరాజు బ్రాహ్మణులతో గయకు వెళ్ళెను. గయలో పితరులకు యధావిధిగా పిండ ప్రదానము చేయునంతలో ఆకాశము నితరక్త కృష్ణమూర్తులగు పురుషులను చూచెను. వారిని చూచి రాజు ఇదేమి? మీరెవరు? చెప్పుడు. మోహమును పొందు నాకు కుతూహలము కలుగుచున్నది. అని అడిగెను.
సితుడు పలికెను: ఓ రాజా! నా పేరు సితుడు. నీ తండ్రిని. నేను పేరుచే వర్ణముచే పనిచే స్థితుడనే. ఇతను రక్తవర్ణుడు, నా తండ్రి, హీనకర్మల నాచరించినవాడు. బ్రహ్మహత్యను చేసినవాడు. పాపకారి. ఇక మూడవవాడు నా తాత. నీకు ముత్తాత. పేరుతో వర్ణముచే కర్మలచే కృష్ణుడు. ఈ కృష్ణుడు పూర్వ జన్మలో అనేక ఋషులను చంపెను. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ ఆవీచి అను నరకమును పొందిరి. ఇతని తండ్రి కృష్ణ వర్ణుడు దీర్ఘ కాలమునుండి నరకమున నివసించుచున్నాడు. నేను మాత్రము నాసత్కర్మలచే సుదుర్లభమగు ఇంద్రాసనమును పొందియుంటిని. మంత్ర విదుడవైన నీవు గయా తీర్థమున పిండ దానమును చేయుటచే ఉత్తమతీర్థ మహిమవలన వీరిద్దరూ అవీచియను నరకము నుండి విముక్తిని పొందిరి. పితరులను పితామహులను ప్రపితామహులను ప్రీతినొందింప చేయుచున్నానని నీవువిడిచిన జలముచే నీ వాక్యముచే, మేము మువ్వురము ఒకసారి కలిసితిమి. ఈ తీర్థ ప్రభావముచే పితృ లోకమునకు వెళ్ళెదము. నీవు చేసిన పిండ ప్రదానముచే ఈ నీ పితామహులు నరకములో ఉన్ననూ శుద్ధులై వెళ్ళుచున్నారు. ఇట్టి వీరిని తీసుకొని నిన్ను చూచుటకు వచ్చితిని. ఇపుడు వెళ్ళుచున్నాను. ఈ తీర్థ ప్రభావము వలన బ్రహ్మఘ్నుడగు తండ్రిని కూడా గయా పిండదానముచే పుత్రుడు ఉద్ధరించగలుగును. ఇట్లు విశాలుని తండ్రి మాటలాడి పితామహులతో కలిసి విశాలుని ఆశీర్వదించి స్వలోకమునకు వెళ్ళెను. ఒకసారి గయకు వెళ్ళుట, ఒకసారి గయలో పిండ ప్రదానము చేయుట చాలా దుర్లభము. ఇక నిత్యము గయా గమనము, గయా పిండ ప్రదానము గురించి ఏమి చెప్పవలెను. పతితులు మరణించగా ఒక సంవత్సరము తరువాత లేదా ఆయా దేశకాల ప్రమాణములను అనుసరించి గయా కూపమున స్వబంధువులచే తర్పణాదులు చేయబడును. ప్రేతరాజు వణిజుని గూర్చి స్వముక్తి కొరకు ఇట్లు పలికెను. నీవు గయా తీర్థమును చూచి స్నానమాడి శుచివై నా పేరుతో పిండప్రదానమును చేయుము. గయలో పిండ ప్రదానము చేయుటవలన నేను సులభముగా ప్రేత భావమును విడిచి దాతలు పొందు లోకమును పొందగలు గును. ఇట్లు ప్రేతరాజు వణిజునితో పలికి అనుచరులతో తన పేర్లను రహస్యముగా స్పష్టముగా తెలిపెను. వణిజుడు ఆ మాటలను విని గయా తీర్థమునకు వెళ్ళెను. అచట యధాక్రమముగా ప్రేతలకు పాంసు నిర్వాపణమును చేసెను. పితృపురస్సరముగా వసుదానమును చేసెను. మహాబుద్ధియగు ఇతను యధావిధిగా తిలలు లేకనే తనకు ఇతరులకు కూడా పిండ నిర్వాపణమును చేసెను. ఇట్లు పిండ ప్రదానమును చేయగా వణిజులు ప్రేత భావము నుండి విముక్తులై బ్రాహ్మణత్వమును పొంది బ్రహ్మ లోకమునకు వెళ్ళిరి. పాయసము, ఖడ్గ మృగమాంసము కృష్ణ మృగము లోహము పితరులకు సమర్పించిన అనన్యము నిచ్చును. గయలో చేసిన శ్రాద్ధము, జపము, హోమము, తపస్సు పుత్రులచే చేయబడినవి పితరులకు ఆనన్త్యమును ప్రసాదించును. నరకభయ పీడితులకు పితరులు పుత్రులు గయకు వెళ్ళి మమ్ములను తరింపజేతురని కోరుచుందురు. గయలో ధర్మ పృష్ఠమున సదస్సులు బ్రాహ్మణులు పితరులను తరింపజేతురు. గయా శీర్షమున అక్షయ వటమున పితరులకు ఇచ్చినది అక్షయమగును. బ్రహ్మారణ్యము, ధర్మపృష్ఠము, ధేనుకారణ్యము ఈ క్షేత్రములను దర్శించి పితరులు అర్చించి ఇరువది తరములను ఉద్ధరించును. మహాకల్ప కాలమున చేసిన పాపముకూడా గయను చేరి నశించును. గో క్షేత్రమున, గృహవటమున చేసిన శ్రాద్ధము మహాఫలమును ప్రసాదించును. ఇచటనే మతంగ పదమున్నది. ఇది ధర్మ సర్వస్వముగా ప్రసిద్ధిచెందినది. ఇచటనున్న పవిత్రమును పంకజ వనమును పుణ్యాత్ములు సేవింతురు. ఇచట పాండువు ప్రవేశించుటయే సర్వనిదర్శనము. తృతీయ పాదమున నిక్షీర మండలమున మహా ప్రదమున కౌశికిలో చేసిన శ్రాద్ధము మహాఫల ప్రదము. మహాదేవుడు ముండపృష్ఠమున పాదము నుంచెను. ఆయాతీర్థములలో బహువర్ష కాలము దుర్లభమగు తపస్సు ఆచరించెను. ఇచట కొద్ది కాలము తపము చేసిననూ పాము కుబుసమును విడిచినట్లు పాపమును విడుచును. ఇచటనే కనకందయను ప్రసిద్ధి క్షేత్రముకలదు. ఇట స్నానము ముండపృష్ఠమునకు ఉత్తరముదే వర్షిగణ సేవితలు చేసిన శరీరముగా స్వర్గములో చేరెదరు. ఇచట చేసిన శ్రాద్ధము అక్షయ ఫలప్రదము. నిక్షీర మండలమున మూడు దినములు స్నానమాడి, మానస సరోవరమున స్నానమాడి ఇచట శ్రాద్ధమును ఆచరించవలయును.
ఉత్తర మానసమునకు వెళ్ళి సాటిలేని సిద్ధిని పొందును. ఈ ఉత్తర మానసమున యధాశక్తిగా యధా బలముగా శ్రాద్ధమును ఆచరించినవాడు దివ్య కామనలను మోక్షో పాయములను పొంద గలుగును. తరువాత బ్రహ్మవశ్యోప శోభితమగు బ్రహ్మ సరస్సునకు వెళ్ళవలయును. రాత్రి గడిచిన వెంటనే బ్రహ్మ లోకమును పొందును. ఈ సరస్సున బ్రహ్మ యూపమును కల్పించెను. ఈ యూపమునకు ప్రదక్షిణము గావించినచో వాజపేయ యాగఫలమును పొందును. తరువాత లోకవిశ్రుత మగు ధేనుకమునకు వెళ్ళవలయును. ఇచట ఒకరాత్రి ఉండి తిలధేను దానము గావించవలెను. సర్వపాప వినిర్ముక్తుడై చంద్రలోకమును పొందును. ఇచట ఒక అద్భుతమగు నిదర్శనము ఇప్పటికీ కానవచ్చుచున్నది. ఈ పర్వతమున కపిల గోవు దూడతో తిరుగుచుండును. ఈ పర్వతము దూడతో తిరుగుచున్న కపిలా గోపదములు కనపడుచుండును. దూడతో నున్న కపిలా గోపదములను పూజించిన మానవులు తాము చేసిన అశుభ కర్మలను నశింపచేసుకుందురు. తరువాత దేవస్థానమగు గృధ్ర వటమునకు వెళ్ళవలెను. ఇచట వృషధ్వజుని దర్శించి భస్మస్నానమును ఆచరించవలెను. ఇచట బ్రాహ్మణులు ద్వాదశవర్ష వ్రతమును ఆచరించవలెను. ఇతర వర్ణములవారికి దర్శన మాత్రముననే సర్వపాపములు నశించును. తరువాత గీతనాదితమగు ఉద్యత పర్వతమునకు వెళ్ళవలెను. ఇచట ఒకమారు సంద్యోపాసన చేసిన ద్వాదశవర్ష సంధ్యోపాసన చేసినట్లు అగును. ఇచటనే యోని ద్వారము కలదు. ఇచటచేరి మానవుడు జన్మ సంకటమునుండి విముక్తుడగును. గయా తీర్థమున శుక్ల కృష్ణ పక్షములు నివసించినవాడు ఏడు తరములను తరింపచేయును. తరువాత మహాఫలప్రదమగు ధర్మపృష్ఠమునకు వెళ్ళవలెను. ఇచట సాక్షాత్తు పితృలోకపాలకుడగు ధర్మరాజు ఉండును. ఇచట యమధర్మరాజును దర్శించినవాడు అశ్వమేధ ఫలమును పొందును. ఇచటనే బహుమూల ఫలాన్వితమగు ఫల్గు తీర్థము ప్రసిద్ధము. ఇచటనే కౌశికానది ఉన్నది. ఇచట చేసిన శ్రాద్ధము అక్షయ ఫలప్రదము. తరువాత ధర్మజ్ఞునిచే రక్షించబడు మహీధరమునకు వెళ్ళవలెను. పుణ్యకారి రాజర్షి అను గయుడు ఉపయోగించిన క్షేత్రమిది. ఇచటనే గయశిరమను సరస్సుకలదు. ఇదియే పవిత్రమగు మహానది. బ్రహ్మ సరోవరమను తీర్థము మహాపుణ్యము. సకలర్షిసేవితము. ఇచటనే అగస్త్యమహర్షి యముని వద్దకు వెళ్ళెను. ఇచట సనాతనుడగు ధర్మరాజు నివసించును. ఇచట అన్ని నదులు ఉద్ధరించును. ఇచట ఎల్లవేళలా పినాకపాణియగు మహాదేవుడు వసించుచుండును. ఇచటనే లోక ప్రసిద్ధమగు అక్షయవటము కలదు. ఇచట గయాసురుడు యజ్ఞమును గావించెను. గయయజ్ఞములలోనిది సురక్షితముగా ఉండెను. ముండపృష్ఠము, గయారేవతమను దేవపర్వతము, క్రౌంచపాదము వీటిని దర్శించిన వారు పాపవిముక్తులు అగుదురు. శివనదిలో శివకరుని, గయయందు గదాధరుని, అంతట పరమాత్మను దర్శించిన పాపసంఘము నుండి విముక్తుడగును. వారణాశిలో విశాలాక్షి, ప్రయాగయందు లలిత, గయయందు మంగళ, కృతశౌచమున సింహికా ప్రసిద్ధులు. గయలో నివసించి చేయు దానమంతయూ అంత్య ఫలప్రద మగును. ఇతని సుకృతముచే పితరులు సంతోషింతురు. గయకు వెళ్ళి అన్నదానము చేయువారితో పితరులు నిజముగా పుత్రవంతులు అగుదురు. (II/44)