నారద మహా పురాణము
గోకర్ణ మాహాత్మ్యము
మోహిని పలికెను: గురువర్యా! మీరు చెప్పిన పుండరీక పురోపాఖ్యానమును వింటిని. ఇప్పుడు నాకు గోకర్ణాఖ్యానమును చెప్పుము.
వసువు పలికెను: ఓ మోహినీ! సర్వపాతక నాశనము పుణ్యప్రదము హర క్షేత్రమగు గోకర్ణము మాహాత్మ్యమును చెప్పెదను వినుము. పశ్చిమ సముద్ర తీరమున కలదు. అది ఒకటిన్నర యోజన విస్తారము కలదు. దర్శన మాత్రముననే ముక్తి ప్రదము. సగర పుత్రులు భూమిని త్రవ్వగా సాగరము పెరిగి భూమిని పెంచినది. తీర్థ క్షేత్ర కాననము ముప్పది యోజన విస్తారము కలదు. అచట అన్నియూ దేవాసుర మానవుల నిలయములే. కాని వారందరూ ఆస్థానమును వదిలి సహ్యాది పర్వతములను చేరిరి. అంతట సముద్రములో మునిగిపోయిన గోకర్ణ మహాక్షేత్రమును చింతించుచు మునివరులందరూ గోకర్ణ క్షేత్రమును ఉద్ధరించదలచి అలోచించి మహేంద్రాచలమున ఉన్న పరశురాముని దర్శించుకొనిరి. అచట పరశురామ ఆశ్రమము ప్రశాంతములగు సౌమ్య మృగములచే కూడియున్నది. అన్ని ఋతువులయందు ఆనందప్రదము. పండ్లతో పూలతో కూడియున్న చెట్లుకలది. దట్టమైన నీడగలది. సాటిలేనిది. సుగంధమును ఆనందమును కలిగించు గాలి కలది. బ్రహ్మఘోష నినాదితమగు ఆశ్రమమును సంతోషముతో ప్రవేశించిన ఋషులు మృదుకృష్ణాజినోత్తరమగు బ్రహ్మాసనమున సుఖాసీనుడు, శిష్యులచే పరివృతుడు, శాంతుడు, తపోధనుడగు పరశురాముని చూచిరి. కాలాగ్నివలె మూడు లోకములను దహించి శాంతించి తపసులో ఉన్న పరశురాముని చూచి వినయముగా నమస్కరించిరి. అట్లు వచ్చిన ఋషులను చూచిన పరశురాముడు సాదరముగా అర్ఘ్యపాద్యాదులతో పూజించెను. అతిథ్యమును చేసి ఇట్లు పలికెను. మహానుభావులారా మీకు స్వాగతము. మీరెందులకు వచ్చితిరో, నానుండి కోరదగినది ఏమున్నదో వివరించుడు. అంతట మునులు పరశురామునితో ఓ భృగుశ్రేష్ఠా! మేము గోకర్ణాశ్రమమునుండి వచ్చితిమి. సగర పుత్రులు భూమిని త్రవ్వి సముద్రమును వృద్ధి పరచగా గోకర్ణము సముద్ర జలము మునుగగా మేము అట నుండి వెడలివచ్చితిమి. మీరు తమ మహిమచే నీట మునిగిన ఆశ్రమమును నీరును దూరముగా పారదోలి ఉద్ధరించుడు అని పలికిరి. వారి మాటలు వినిన పరశురాముడు తాను ఆయుధ పరిత్యాగమును చేసితిని కదా ఎట్లని క్షణకాలము ఆలోచించెను. సాధు రక్షణము పరమ ధర్మమని నిశ్చయించి ధనుర్బాణములను గ్రహించి వారితోకలిసి బయలు దేరెను. మహేంద్ర గిరినుండి దిగి వాయువ్య దిశగా తన పర్వతమును దాటి వెడలెను. గోకర్ణవాసులతో కలిసి సాగర తీరమును చేరెను. ఒక క్షణ కాలము విశ్రమించి మేఘ గంభీర వాక్కుతో సముద్రునితో ఇట్లు పలికెను. ఓ సముద్రుడా! నేను భార్గవ రాముడను. మునులతో వచ్చితిని. మాకు నీ దర్శనము నిమ్ము. నీతో అత్యవసర కార్యము ఉన్నది. ఇట్లు పరశురాముని మాటలను వినికూడా సముద్రుడు అహంకారముతో పరశురాముని సన్నిధికి చేరలేదు. ఇట్లు పలుమార్లు పిలిచిననూ సముద్రుడు రాకపోవుటచే కోపించిన పరశురాముడు ధనుస్సును గ్రహించెను. ధనువున వహ్నిదైవమగు భార్గవాస్త్రమును సంధించి సముద్రుని ఇంకించుటకు నిశ్చయించెను. భార్గవరాముడు అస్త్రమును సంధించుటతో క్షోభను చెందిన సముద్రుడు యాదోగణ పరివృతుడై పరాశురామాస్త్ర సంతప్తుడై రామ భయముతో స్వరూనముతో వచ్చి పరశురామపాదములను పరిగ్రహించెము. అంతట అస్త్రమును ఉపసంహరించి సముద్రునితో గోకర్ణ తీర్థము కనపడునటుల జలమును ఉపసంహరించుము అని పలికెను. అంతట సముద్రుడు పరశురామాజ్ఞతో గోకర్ణమున ఉన్న జలమును ఉపసంహరించెను. పరశురాముడు కూడా గోకర్ణవాసుడగు శంకరుని చక్కగా పూజించి మహేంద్రాద్రిని చేరెను. ఆ మునులు మాత్రము అచటనే నివసించిరి. అచటనే మునులందరూ వ్రతమును స్వీకరించి తపమును ఆచరించి పునరావృత్తిరహితమగు మోక్షమును చేరిరి. ఆ క్షేత్ర ప్రభావముచే శంకరుడు భూతగణములతో దేవతలతో పార్వతీ దేవితో అత్యంత ప్రీతుడై అచటనే నిత్య నివాసము నేర్పరచుకొనెను. గోకర్ణ గత శంకర దర్శన మాత్రముననే పాపము పెనుగాలికి ఎండు టాకులవలె వెంటనే విడుచును. గోకర్ణమును సేవించవలయునను కోరిక మానవులకు సామాన్యముగా కలుగదు. గోకర్ణ క్షేత్రమున నిర్బంధముతో మరణించిన స్థావర జంగమములు కూడా వెంటనే సనాతన స్వర్గమును చేరెదరు.
గోకర్ణ తీర్థస్మరణ మాత్రముననే సకలపాపములు నశించును. ఈ గోకర్ణ క్షేత్రము సర్వతీర్థ నివాస భూతము. సర్వ క్షేత్రములందు స్నానమాడి సదాశివుని పూజించుట వలన కలుగు ఫలము గోకర్ణగత శివ దర్శనమువలన కలుగును. కామ క్రోధాది హీనులై గోకర్ణమున నివసించువారు త్వరలో సిద్ధిని పొందెదరు. జపహోమపరులై నియమమును గ్రహించిన బ్రహ్మచారులు గోకర్ణమున నివసించిన అభీష్టసిద్ధిని పొందెదరు. గోకర్ణమున ఆచరించిన దానహోమ జపాదులు పితృదేవ ద్విజార్చనములు ఇతరత్ర ఆచరించిన వాటికంటే కోటి గుణిత ఫలమును ఇచ్చును. ఇట్లు చదువువారికి వినువారికి సర్వపాప నాశకమగు గోకర్ణక్షేత్ర మాహాత్మ్యమును నీకు తెలిపితిని. (II/74)