నారద మహా పురాణము
క్షేత్రప్రమాణాది నిరూపణము
మోహిని పలికెను: కృపాలూ! ధర్మజ్ఞ! వసూ! బహువిదుడవగు నీవు ప్రయాగ తీర్థరాజ మాహాత్మ్యమును తెలిపితివి. ఇక ఇపుడు సర్వతీర్ధములలో పావనము, శుభప్రదము, ముఖ్యము అగు కురుక్షేత్ర మాహాత్మ్యమును తెలుపుము.
వసువు పలికెను: మోహినీ! ఇపుడు పుణ్యప్రదమగు కురుక్షేత్ర మాహాత్మ్యమును చెప్పెదను. వినుము. ఇచటికి వెళ్ళి స్నానము చేసినవాడు సర్వపాప వినిర్ముక్తుడగును. ఇచట అనేక తీర్ధములను మునీశ్వరులు సేవించిరి. ఇప్పుడు నీకు ఆ తీర్ధములను ముక్తిప్రదములను చెప్పెదను వినుము. గయా శ్రాద్ధమును బ్రహ్మ జ్ఞానము గోగ్రహమున మరణము, కురుక్షేత్రమున నివాసము ముక్తిప్రదములని చెప్పబడినవి. సరస్వతీ దృషద్వతీనదుల మధ్య భాగము బ్రహ్మవర్త మనబడును. దూరమున ఉండు వాడుకూడా కురుక్షేత్రమునకు వెళ్ళెదను, నివసించెదను అని ఎల్ల కాలము స్మరించువాడు కూడా పాప విముక్తుడగును. ఇచట సరస్వతీ తీరమున నివసించువారు బ్రహ్మ జ్ఞానమును పొందును. ఈ కురుక్షేత్రమును దేవతలు ఋషులు సిద్ధులు సేవించుచుందురు. ఈ కురుక్షేత్రమును సేవించుట వలన తనలో బ్రహ్మను దర్శించగలడు.
మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! కురుక్షేత్రము సర్వతీర్ధాధిక మెట్లు అయినదో నాకు విస్తరముగా తెలుపుము. నిన్ను శరణుపొందితిని.
వసువు పలికెను: శుభప్రదురాలా! మహాఫలప్రదము మానవుల పాపమును దహింపచేయునది బ్రహ్మకు ప్రియమగునది అగు కురుక్షేత్ర మెట్లేర్పడినదో చెప్పెదను వినుము. ఇచట మొదట పవిత్రమగు బ్రహ్మ సరస్సు ఏర్పడినది. తరువాత రామహ్రదము ఏర్పడినది. ఇప్పుడు కురుక్షేత్రము ఏర్పడినది. మొదట బ్రహ్మచే నిర్మించిన సరస్సు సన్నిహితముగా ఉన్నది. ఇపుడే బ్రహ్మవేదికకు మధ్యలో ఉన్నది. సృష్టి చేయగోరిన బ్రహ్మ ఇచట తపమును చేసెను. స్థితిని కోరు విష్ణువు కూడా ఇచటనే తపమును ఆచరించెను. ఈ సరస్సున ప్రవేశించుటవలననే శంకరునకు స్థాణుత్వమేర్పడినది. పితృవధముచే పరితపించిన పరశు రాముడు బ్రాహ్మణ ద్వేషులగు క్షత్రియులను వధించి ఇచటనే రక్తపు మడుగులను ఏర్పరిచెను. ఆ రక్తముతో పితరులకు తర్పణమునిచ్చి ఇచటనే తపమును ఆచరించెను. అప్పటి నుండి ఇది పాప నాశకము రామ తీర్థముగా ఖ్యాతి గాంచినది. ఇచటనే మార్కండేయ మహర్షి పరమ తపమును ఆచరించెను. ప్లక్ష జాతయగు సరస్వతి వచ్చిన ప్రతి ప్రదేశమును మార్కండేయ మహర్షి స్తుతించెను. సన్నిహితము అగు సరస్సునుండి పశ్చిమదిశకు బయలు దేరినది. అపుడు ఈ సరస్వతిని కురువు క్షేత్రము ఉన్నంతవరకు ఆకర్షించెను. ఈ క్షేత్రము పంచయోజన విస్తీర్ణము. దయా సత్య క్షమలకు పుట్టిల్లు. స్యమంత పంచకమునే కురుక్షేత్ర మనిరి. ఇచట స్నానమును చేసిన వారు అక్షయ పుణ్యమును పొందును. మరణించిన వారు విమానము నధిరోహించి బ్రహ్మ లోకమును చేరెదరు. ఇచట ఆచరించిన ఉపవాసము, దానము, జపము, హోమము, దేవతార్చనము అక్షయత్వమును పొందును. బ్రహ్మ వేదియందు కురుక్షేత్రము నందు మరణించినవారికి పతన భయముండదు. దేవతలు, ఋషులు సిద్ధులు ఈ సరస్సును సేవించు కోరికతో నుండు ప్రదేశమును రంతుక క్షేత్ర మందురు. పూర్వము ఈ క్షేత్రమును కాపాడుటకు శ్రీ మహావిష్ణువు యక్ష సుచంద్ర సూర్య వాసుకి, శంఖుకర్ణక విద్యాధర సుకేశులను రాక్షసులను స్థాపించెను. వీరందరు ధనుర్బాణ ధరులై భృత్యులతో కలిసి కురుక్షేత్రమును కాపాడుచు పాపులను వారించుచుందురు. రంతుక క్షేత్రమును చేరి పలుమార్లు క్షమాపణను వేడి సరస్వతిలో స్నానమాడి యక్షుని దర్శించి నమస్కరించి పుష్ప ధూపదీప నైవేద్యములను సమర్పించి ఈ వాక్యమును పలుకవలయును. ఓ యక్షేంద్రా నీ అనుగ్రహమువలన వనములను నదులను తీర్ధములను పరిభ్ర మించు నాకు విఘ్నము కలుగకుండుగాక. అపి ఇట్లు ప్రార్థించి చక్కగా యాత్రను ఆరించవలెను. వనములను తీర్ధములను, నదులను కురుక్షేత్ర పుణ్యతీర్ధములను పర్యటించువాడు. ఇహలోకమున పరలోకమున న్యూనత్వమును పొందజాలడు. (II/64)