నారద మహా పురాణము
విష్ణు పురాణాను క్రమణీ నిరూపణము
శ్రీ బ్రహ్మ పలికెను: ఓ పుత్రా! ఇరువది మూడువేల శ్లోకములు కలిగి, మహా పాతక నాశకమగు, గొప్ప విష్ణు పురాణమును గూర్చి చెప్పెదను వినుము. ఈ పురాణమున మొదటి భాగమున పరాశర మహర్షి ఆరు అంశములను నిర్దేశించెను. వాటిలో మొదటి యంశమున పరాశర మహర్షిమైత్రేయు నకు ఆదికారణ సర్గమును, దేవాది సంభవమును, సముద్ర మథనాఖ్యానమును, దక్షాది వంశ వర్ణనమును, ధ్రువ చరితమును, పృథు చరితమును, ప్రాచేత సచరితమును, ప్రహ్లాద కథను, విడివిడిగా రాజ్యాధికారములను చెప్పెను.
ప్రియవ్రత వంశ చరితము, ద్వీప వర్ష నిరూపణము, పాతాళ నరకాఖ్యానము, సప్తసర్గ నిరూపణము, సూర్యాది వార కథనము విడివిడిగా లక్షణములు, భరత చరితము ముక్తి మార్గ నిదర్శనము, నిదాఘ ఋభు సంవాదము, ద్వితీయాంశమున చెప్పబడి ఉన్నవి.
మన్వంతర సమాఖ్యానము, వేదవ్యాస అవతారము, నరకోద్ధారక కర్మ నగర ఔర్వ సంవాదమున సర్వధర్మ నిరూపణము, శ్రాద్ధ కల్పము, వర్ణాశ్రమ నిబంధనము, సదాచారము, మాయా మోహకథా సర్వపాప ప్రణాశనమగు మూడవ అంశమున చెప్పబడినది. పవిత్రమగు సూర్యవంశ కథ, సోమవంశాను కీర్తనము, నానా రాజ కథాన్వితముగా చతుర్ధాంశమున చెప్పబడినవి. కృష్ణావతార సంప్రశ్నము, గోకులీయకథ, బాల్యమున పూతనావధ, కౌమారమున అఘాసురాది వధ, కైశోరమున కంసవధ, మధురాచరితము, యౌవనమున ద్వారకలోని లీలలు, సర్వదైత్యవధ, వేరు వేరు వివాహములు, ఈ ద్వారకలో ఉండి యోగేశ్వరేశ్వరుడు జగన్నాథుడు అగు శ్రీకృష్ణునిచే శత్రు సంహారమును చేసి భూభార హరణము చేయుట, అష్టావక్రుని కథ, ఇవి అయిదవ అంశమున చెప్పబడినవి.
కలియుగ చరిత్రము ప్రళయచాతుర్విధ్యము. బ్రహ్మజ్ఞాన సముద్దేశమును ఖాండిక్యునకు కేశిధ్వజుడు చెప్పుట ఆరవ అంశమున చెప్పబడినది.
ఇక రెండవ భాగమున శౌనకాదులు అడుగగా సూత మహర్షి విష్ణు ధర్మోత్తరములు అను పేరుగల పవిత్రములగు నానాధర్మ కథలను, వ్రతాది నియమములను, ధర్మశాస్త్రమును, అర్థశాస్త్రమును, వేదాంతమును, జ్యోతిష్యమును, ప్రకరణానుసారముగా, వంశాఖ్యానములను, స్తోత్రములను, మంత్రములను, సర్వ లోకోపకారకములగు నానా విద్యలను, చెప్పెను. ఇదియే సర్వశాస్త్రార్ధ సంగ్రహమగు విష్ణు పురాణము. ఇచటనే వ్యాస మహర్షి వారాహ కల్పవృత్తాంతమును చెప్పెను. ఈ విష్ణు పురాణమును భక్తితో చదివినవాడు, ఆదరముతో వినినవాడు, ఇహలోకమున భోగములను అనుభవించి విష్ణు లోకమును పొందెదరు. ఆషాఢ పూర్ణిమా తిధి యందు ఈ విష్ణు పురాణమును ఘృత ధేను సహితముగా పురాణార్థములు తెలిసియున్న విష్ణు భక్తునకు దానము చేసినచో సూర్యకాంతి గల విమానముచే విష్ణు లోకమును చేరును. ఈ విష్ణు పురాణాను క్రమణిని చెప్పిననూ వినిననూ విష్ణు పురాణ శ్రవణ ఫలమును పొందును. (4/94)