పూజాది కథనము

వసిష్ఠ మహర్షి పలికెను: అంతట మోహినీ దేవి గంగా మాహాత్మ్యమును తెలిపిన వసువు మాటలను విని తన పురోహితుని మరల ఇట్లు అడిగెను.

మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! శుభకరములగు గోదానాదులను చక్కగా వింటిని. ఇప్పుడు సాటిలేని గంగా వ్రతమును వినగోరుచున్నాను. గంగాది పూజనము, స్థాపనము, తత్పలమును సర్వజ్ఞుడవగు నీవు తెలుపుము. నిన్ను నేను శరణువేడితిని. ఇప్పుడు నేను పతిహీనను పుత్రహీనను, బంధు వర్ణితను. ఇపుడు నీవే నాకు ఉత్తమగతి ప్రదాతవు. నా తండ్రిగారి మాట మీది గౌరవముతో నిన్నే శరణు పొందిన దానను కావున నీవు నిన్ను ఆశ్రయించిన నాకు సాటిలేని గంగా మాహాత్మ్యమును దేవత ఆరాధనమును తెలుపుము. దానిని విని పాప విముక్తురాలను అగుదును.

వసిష్ఠ మహర్షి పలికెను: తేజోవంతుడగు వసువు మోహినీ వాక్యమును విని ఆమెను చక్కగా ఆదరించి వేదవిదూత్తముడిట్లు పలికెను.

వసువు పలికెను: ఓమోహినీ! నీవు లోకహితమును కోరి చక్కగా అడిగితివి. మహా పాపప్రణాశకము అగు సమస్త గంగా మాహాత్మ్యమును పూర్వము వృషధ్వజుడగు శివుడు దయచే గంగా తీరమున పార్వతీదేవి అడుగగా చెప్పెను. దేవతలు పూర్వాహ్ణమున భుజింతురు. ఋషులు మధ్యాహ్నమున, ఆపరాహ్ణమున పితరులు, రాత్రిపూట గుహ్యకాదులు భుజింతురు. కావున ఈ అన్ని వేళలను దాటి రాత్రి భోజనము ఉత్తమము, ఉపవాసముకంటే భిక్షావ్రతము ఉత్తమము. భైక్ష్యము కంటే అయాచిత వ్రతము మేలు. అయాచిత వ్రతము కంటే నక్త భోజన వ్రతము మేలు. కావున ఈ నక్త వ్రతమును ఆచరించవలెయును. హవిష్య భోజనము, స్నానము, సత్యము, ఆహార లాఘవము, అగ్నికార్యము, అధః శయ్యా ఈ ఆరింటిని నక్త భోజి ఆచరించవలయును. మాఘ మాసమున గంగా తీరమున నక్త వ్రతము నాచరించవలయును. శివాలయ పార్శ్వ భాగమున నువ్వుల అన్నమును ఘృతముతో కలిపి శివునికి నివేదన చేసి కాష్ఠ మౌనముచే భుజించుచు జిహ్వాచాపల్యమును విడువవలయును. జితేంద్రియుడై శివుని ధ్యానించుచూ, మోదుగాకు పాత్రలో భుజించ వలయును. ధర్మరాజునకు, దేవికి విడిగా ముద్దలను కల్పించవలెను. రెండు పక్షములలో చతుర్దశినాడు ఉపవసించవలెను. పూర్ణిమనాడు గంధములతో గంగాజలముతో పాలు పెరుగు నేయి తేనెలలో శివునికి స్నానము చేయించి (విడిగా) లింగ శిరోభాగమున హోమపుష్పము ఉంచవలెను. తరువాత శక్తి కొలది ఘృతపాచితములగు అపూపములను శక్తికి సమర్పించవలెను. తిలాఢకమును గ్రహించి శివలింగోపరిభాగమున ఉంచవలెను. నీలోత్పలములచే పంకజములచే సర్వేశ్వరుని పూజించవలెను. ఇవి లభించనిచో సువర్ణ పంకజములచే పూజించవలెను. తేనె కలిపిన పాయసమును, ఘృతయుక్తమగు గుగ్గులమును, మృతదీపమును చందనాది విలేపనమును, మహేశ్వరునికి భక్తితో సమర్పించవలెను. అట్లే పత్రములను ఫలములను సమర్పించవలెను. సమాన రూపమగు కృష్ణ గోమిధునమును సమర్పించవలెను. మాసాంతమున ఎనిమిది మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణల నీయవలెను. ఈ మాసము బ్రహ్మచర్యమును అవలంబించి మద్య మాంసములను విడువవలెను. ఇట్లు యధావిధిగా యమనియమాది యుక్తుడై, శ్రద్ధా భక్తి పరాయణుడై ఒకమారు ఈ వ్రతము ఆచరించిన వాడు ఇహలోకమున అన్ని భోగములను పొంది అంతమున ఉత్తమ గతిని పొందును. ఇంద్రనీల ప్రతీకాశములు, శిఖిసంయుతములు, దివ్యరత్నమయములు, దివ్యభోగ సమన్వితములు అగు విమానములచే, రమ్యమగు శివపురమునకు స్వకులము వారు అందరితో కలిసివెళ్ళి, మిత్రులతో కూడావెళ్ళి బహు విధాభీప్సితములను అశేష భోగములను అనుభవించి ప్రళయ కాలము వరకుండి, తరువాత జంబూ ద్వీపపతిగా ధర్మాత్ముడుగా పుట్టును. కల్మషరహితుడై ఇచట సకల భోగములను అనుభవించును. సుందరుడు సౌభాగ్యవంతుడు, అందరిని శాసించువాడు, సర్వరోగ వినిర్ముక్తుడు అగును. అతను కూడా ఈ ఫలమును పొందును. ఇక వైశాఖ శుక్ల చతుర్దశినాడు సావధానుడై క్షీరసంయుక్తమగు శాల్యన్నమును రాత్రిపూట భుజించవలయును. మొదట పుష్పాదులచే శివుని పూజించి, అన్నమును నివేదనచేసి కాష్ఠ మౌనముతో భుజించవలయును. మొదట వటకాష్ఠముతో మౌనముగా దంతధావనమును చేయవలెను. రాత్రిపూట గంగా తీరమున శివలింగ సమీపమున పరుండవలెను. పూర్ణిమా ప్రాతఃకాలమున యధావిధిగా గంగానదిలో స్నానమాడి ఉపవాసమును సంకల్పించి, రాత్రిపూట జాగరణ చేయవలెను. శివలింగమును ఘృతముతో స్నానము చేయించి, పుష్ప గంధాదులచే ధూప దీప నైవేద్యములచే పూజించి శుభకరమగు వృషభమును శ్వేత పుష్ప వస్త్రాదులచే హరిద్రా చందనములచే అలంకరించి శివునికి నివేదన చేయవలెను. శక్తి కొలది బ్రాహ్మణులకు పాయనమును భుజింపచేయవలెను. ఇట్లు భక్తి శ్రద్ధలతో ఒకసారి రెండు వేల యుగములు ఒకపాదము తక్కువగా తపస్సు చేసిన కలుగు పుణ్యమును పొందును. హంస కుంద ప్రభాయుక్తములు చంద్ర సన్నిభములు, సుశ్వేత వృషయుక్తములు ముక్తా జాల విభూషితములు అగు విమానములతో తమ పితరులతో కలిసి ఈశ్వర మందిరమును చేరును. అంతట నీలోత్పల సుగంధులు రూపవతులగు యువతులతో పలుభోగములను అనుభవించును. తరువాత భూలోకమున రాజుగా వైరాగ్య సంపన్నుడై గంగనుపొందును. గంగయందు శ్రద్ధాభక్తులు కలవాడు కావున గంగానదిలో మరణమును పొందును. దానిచే పూర్వజన్మ జ్ఞానమును పొంది మోక్షమును పొందును.

జ్యేష్ఠ శుద్ధ దశమి హస్తా నక్షత్రయుక్తము అగుచో గంగాతీరమున నరుడు కాని వారి కాని భక్తిభావముచే రాత్రి జాగరణ కావించి, గంగను పదివిధములగు పుష్ప గంధ నైవేధ్య ఫలములను దశసంఖ్యచే దీపములను తాంబూలములను సమర్పించి పూజించ వలయును. గంగానదిలో పదిమార్లు యథావిధిగా స్నానమాడి భుజించి దశప్రస్థ ప్రమాణములగు నువ్వులను, నేయిని దశసంఖ్యచే సక్తు పిండములను, గుడపిండములను గంగా జలమున అర్పించవలెను. తరువాత సుందరమగు గంగాతీరమున బంగారముచే కాని వెండిచే కాని, పద్మస్వస్తిక చిహ్నములుకల పూర్ణ కుంభముపైన ఉన్న, వస్త్రప్రర్దామములు కుంభమునకు కంఠభాగమున చుట్టి ఉండగా గంగాదేవి ప్రతిమను నిర్మించి స్థాపించి పూజించవలయును. స్వర్ణాదులు లభించనిచో మృదాదులచే చేయవచ్చును. అది కూడా లభించనిచో పిండిచే వ్రాయవలెను. చతుర్భుజములు కలది, సునేత్ర, చంద్రాయుత సమప్రభ, చామరములచే వీయబడునది, శ్వేతచ్ఛత్రోప శోభిత, సుప్రసన్న, వీరద, కరుణార్ద్రాంతరంగ, సుధాప్లావిత భూపృష్ఠ, దేవాదులచే సంస్తూయమాన, దివ్యరత్నపరీత, దివ్యమాల్యాను లేపన, అగు గంగాదేవిని నిర్మించి స్థాపించి, జలమున ధ్యానించి, ప్రతిమను పూజించవలయును. చెప్పబోవు మంత్రముచే విశేష పూజ గావించవలెను. ప్రతిమను పంచామృతముతో స్నానమును చేయించవలెను. ప్రతిమా అగ్ర భాగమున భూమిని గోమయముతో అలుకవలెను. నారాయణుని, మహేశుని బ్రహ్మను భాస్కరుని, భగీరధ రాజును, హిమవత్పర్వతమును, గంధ పుష్పాదులచే యధా శక్తిగా పూజించవలెను. పదిమంది బ్రాహ్మణులకు దశ ప్రస్థ పరిమాణ తిలలను దానము కావించవలెను. దశ ప్రస్థ యవలను గవ్యముచే కలిపి దానము గావించవలెను. మత్స్యకచ్ఛప మండూక మకరాది జలచరములను స్వర్ణముచే కాని రజితముచే కాని నిర్మించి, స్వర్ణ రజతములు లభించనిచో పిష్టముచే నిర్మించి కుసుమాదులచే పూజించి గంగలో పడవేయవలెను. మొదట మంత్రవిత్తై మంత్రముచే విభవమున్నచో రథ యాత్రను జరుపవలెను. గంగా ప్రతిమను ఉత్తరాభిముఖముగా రథారూఢను చేసి తిప్పవలయును. రధారూఢయగు గంగా దర్శనము పాపులకు దుర్లభము. దుర్గా రధయాత్ర వలెనే గంగా రధయాత్రను చేయవలెను. ఇట్లు యధావిధిగా విత్తలోభమును విడిచి చేయువాడు ఈ చెప్పబోవు పది పాపములనుండి విముక్తుడగును. ఈయని వాటిని గ్రహించుట, అ విధాన హింస, పరదారాబిగమనము, అనునవి మూడు కాయిక పాపములు. కఠినముగా మాటలాడుట, అసత్య భాషణము, చాడీలు చెప్పుట, అసంబద్ధ ప్రలాపములు అను నాలుగు వాచిక పాపములు, పర ద్రవ్యములందు ధ్యానము, మనసుచే అనిష్ట చింతనము, అసత్యాభి నివేశము అనునవి మూడు మానస పాపములు. కోటి జన్మలలో ఏర్పడిన ఈ దశ విధములగు పాపములచే విముక్తుడు అగు నని బ్రహ్మవాక్యము. ఈ మంత్రముచే పూజించబడిన గంగాదేవి పది పూర్వ తరములను, పది ఉత్తర తరములను, ఇతరములగు పది తరములను ఇట్లు ముప్పది పితరులను తరింపచేయును. “ఓం నమో దశహరాయై నారాయణ్యై గంగాయై నమః” అని మంత్రము, దశవిధ పాపములను హరించి నారాయణియగు గంగకు నమస్కారము అని అర్ధము. ఈ మంత్రమును ఆ దినము రాత్రింబవళ్ళు అయిదు వేలు జపించవలెను. దశధర్మఫలము లభించును. సంసార సాగరమునుండి దశపూర్వులను, దశపరపితరులను తరింపచేయును. చెప్పబోవు ఈ స్తోత్రమును యధావిధిగా గ్రహించి ఆ దినమున గంగాగ్ర భాగమున జపించి విష్ణు పూజను చేయవలయును. శివ రూపురాలికి, గంగాదేవికి, శివదకు నమస్కారము, విష్ణు రూపిణియగు గంగకు నమస్కారము. సర్వదేవ స్వరూపిణికి, ఔషధమూర్తికి, అందరికి అన్ని వ్యాధులకు ఔషధరూపురాలికి నమస్కారము, స్థాణు జంగమ సంభూత విషహారిణికి, సంసార విషనాశినికి, జీవన స్వరూపురాలికి నమస్కారము. తాపత్రయ నివారిణికి, ప్రాణేశ్వరికి, శాంతి స్వరూపిణికి, సంతాపహారిణికి, సర్వమూర్తికి నమస్కారము. సర్వ సంశుద్ధకారిణికి పాపవిముక్తికి నమస్కారము. భుక్తి ముక్తి ప్రదాయినికి, భోగవతికి, స్వర్గ ప్రదకు, మందాకినికి నమస్కారము. త్రైలోక్య స్వరూపురాలికి, త్రిదశకు, శుక్ల సంస్థకు, క్షేమవతికి నమస్కారము. త్రిదశాసన సంస్థకు, తేజోవతికి, మందకు, లింగధారిణికి, నారాయణికి నమస్కారము. విశ్వమిత్రకు, రేవతికి, బృహతికి, లోకధాత్రికి నమస్కారము. విశ్వముఖ్యకు, నందినికి, పృధివికి, శివామృతకు, విరజకు నమస్కారము. పరావరగతాద్యకు, తారకు, సర్వసంస్థకు అభిన్నకు నమ స్కారము. శాంతకు, ప్రతిష్ఠకు, వరదకు, ఉగ్ర, ముఖజల్పకు, సంజీవినికి, బ్రహ్మగకు, బ్రహ్మదకు, దురితఘ్నికి నమస్కారము. ప్రణతార్తి ప్రభంజనికి, జగన్మాతకు, విలుషకు, దుర్గహంత్రికి, దక్షకు నమస్కారము. సర్వాపత్ప్రతి పక్షకు, మంగళకు, పరాపరురాలకు, పరమ మోక్షప్రదాత్రికి నమస్కారము. గంగ నా ముందు భాగమున, పార్శ్వములందు సర్వదిశలందు ఉండుగాక, నా ఉనికి నీయందే ఉండుగాత. ఆదిమధ్యాంతములందు భూమియందు నీవుంటివి. నీవే మూల ప్రకృతివి. నీవే నారాయణ ప్రభువు. నీవే పరమాత్మవు. నీవే శివునివి. నీకు నమస్కారము. ఇట్లు ఈ స్తోత్రమును భక్తి పరుడై ప్రతినిత్యము పఠించువానికి, వినువానికి వినిపించువానికి కాయిక వాచిక మానస భావములగు దశవిధ పాపములనుండి విముక్తుడగును. రోగి రోగముల నుండి, ఆపన్నుడు ఆపదల నుండి విముక్తుడు అగును. శత్రువులనుండి, బంధనములనుండి, భయములనుండి విముక్తుడు అగును. సర్వకామనలను పొందును. అంతమున బ్రహ్మలో లీనమగును. ఈ స్తోత్రమును లిఖించి ఇంటిలో పూజించబడినచో అగ్ని చోర భయములు పాపభయములు ఉండవు. ఈ దశమినాడు ఈ స్తోత్రమును గంగా జలమున నిలిచి పదిమార్లు జపించినచో దరిద్రుడు, అసమర్థుడుకూడా గంగా పూజను గావించినవాడు ఆ ఫలమును పొందును. కావున పూర్వోక్త విధానముచే చెప్పబడిన ఫలితము లభించును. గంగ గౌరి వంటిది. కావున గౌరీ పూజనమున చెప్పబడిన విధియే గంగా పూజనమున అనుసరించవలెను. శివుడెట్లో విష్ణువట్లే. విష్ణువెట్లో పార్వతి అట్లు. పార్వతివలె గంగ. ఈ విషయమున భేదములేదు. హరిహరులకు గంగా గౌరులకు, లక్ష్మీ పార్వతులకు భేదమును చూచువాడు, చెప్పువాడు మూఢబుద్ధియే

ఉత్తరాయణమున, శుక్ల పక్షమున, భూమి మీద, పగలు, గంగయందు హృదయమున జనార్దనుని ఉంచుకొని ధన్యులు మాత్రమే దేహమును విడుతురు. ఓ బ్రహ్మపుత్రీ! గంగయందు ప్రాణములను విడిచిన నరులు దేవతలచే స్తుతించబడుచు విష్ణు లోకమునకు వెళ్ళెదరు. గంగానది యందు దప్పితోకాని నిరాహారముతోకాని మరణించువారు పునర్జన్మ నందరు. బ్రహ్మ సాయుజ్యమును పొందెదరు. సాత్విక బుద్ధిగల వానికి, యోగయుక్తునికి లభించుగతి గంగలో ప్రాణములను విడిచిన వానికి లభించును. ఉపవాసముచే గంగా తీరమున మృతి చెందినవాడు పితరులతో పరలోకమును పొందును. గంగానదిలో ప్రాణములను విడువదలిచిన వాడు పూర్వజన్మలను విడిచిన వాడగును. పూర్వమృతులను విడిచిన వాడగును. చాలాకాలము గడిచిపోవును. ఇచట రెండు యోజనముల దూరము సమీపము సమానమే. తెలిసి, తెలియక, కోరీ, కోరకనైనను గంగ యందు మరణించిన వాడు స్వర్గమును మోక్షమును పొందును. ప్రాణములు పోవుచుండగా గంగను తలచిన వాడు, లేదా తాకినవాడు పాపశీలుడైనను ఉత్తమగతిని పొందును. గంగకు వెళ్ళి శరీరమును విడిచినవారు దేవసములు అగుదురు. కావున అన్నిటిని విడిచి ముక్తి కొరకు శరీరపాతము వరకు గంగను సేవించవలెను. అంతరిక్షమునకాని, క్షితియందు కాని, జలమునందు కాని గంగా సంబంధముండగా మరణించినవాడు బ్రహ్మ విష్ణు శివులచే పూజించబడు అక్షయపదమును పొందును. ధర్మిష్టుడు శిష్ట సమ్మతుడు ప్రాణ ప్రయాణ సమయమున మనసున గంగను ధ్యానించిన పరమగతిని పొందును. ఎచట మృతి చెందిననూ మరణకాలమున గంగను భక్తిచే స్మరించువాడు శివలోకమును కాని విష్ణు లోకమును కాని పొందును. అతి కర్కశమగు శివుని జటాజూటము నుండి బయలు వెడలి పాపులను సగరపుత్రులను తడిపి స్వర్గమున చేర్చెను. ఎన్ని అస్థులు గంగలో ఉండునో అన్ని వేల యేండ్లు స్వర్గ లోకమున నివసించును. గంగా జలమున అస్థులను పడవేసిన నాటి నుండి అతను స్వర్గమున నివసించును. గంగా జలమున అస్థులున్నవాడు మరల బ్రహ్మలోకము నుండి ఇటకు రాబోడు. మరణించిన పది రోజులలోపు గంగలోన అస్థులను కలిపినచో గంగా మరణ ఫలము లభించును. స్నానముచేసి అస్థులను పంచ గవ్యములచే స్నానము చేయించి, హిరణ్యమధు, ఆజ్యతిలలతో కలిపి అని పిండమును హస్త పుటమున నిడుకొని దక్షిణ దిక్కును చూచుచు ధర్మరాజునకు నమస్కారమని పలుకుచు జలమున ప్రవేశించి అతడు ప్రీతిచెందుగాత అని గంగలో వేయవలెను. తరువాత స్నానమును ఆచరించి తీర్థమును అక్షయ వటమును దర్శించి దక్షిణలచిన్చినచో నరకమున ఉన్న వానికి స్వర్గమున ఉనికి కలుగును. ప్రవాహమునుండి నాలుగు హస్తముల ప్రమాణ ప్రదేశమున నారాయణ మూర్తియే ఉండును. ఇచట జలమును గ్రహించరాదు. భాద్రశుక్ల చతుర్దశినాడు జలము ఆక్రమించు ప్రాంతము వరకు గర్భమనబడును. దూర ప్రాంతము అంతయే తీరమనబడును. నూట యాభై హస్తముల ప్రమాణ ప్రాంతము గర్భము, తరువాతది తీరమనబడును. ఇది శ్రుతి స్మృతులలో చెప్పబడిన కొందరి మతము. తీరము నుండి రెండు క్రోసుల దూరము క్షేత్రమనబడును. తీరమును విడిచి క్షేత్రమున నివసించవలెను. తీరమున నివసించరాదు. రెండు తటముల నుండి ఒక యోజన విస్తార ప్రాంతము క్షేత్రసీమ యనబడును. సమస్త పాపములు గంగాసీమను దాట జాలవు. గంగాసీమను చూచిన పాపములు సింహమును చూచిన క్షుద్రమృగములవలె పలాయనమును పాటించును. గంగా ప్రాంతమున రామశంభు తపోవనమున్న ప్రదేశము మూడు యోజనముల ప్రాంతము సిద్ధ క్షేత్రమనబడును. పుణ్యకాలములందు, ఆయతనములందు సర్వ నిమిత్తము లందు తీర్థము గ్రహించరాదు. పుణ్యములందు ఆయతనములందు తీర్థము లందు గ్రహించువాని తీర్థము నిష్పలమగును. గంగా విక్రయణమున విష్ణు విక్రయణము అగును. జనార్ధన విక్రయణమున మూడు లోకములు విక్రయించినట్లగును. గంగాతీర సముద్భవమగు మృత్తికను తలదాల్చినవాడు సూర్య రూపమును ధరించును. గంగాతీర ధూళిని పరిచి పిండ ప్రదానము గావించినచో పితరులను స్వర్గమునకు చేర్చును. ఓ భద్రురాలా నీకు ఈ గంగా మాహాత్మ్యమును చెప్పితిని. ఈ మాహాత్మ్యమును చదివిననూ వినిననూ నరుడు విష్ణు లోకమును పొందును. ఈ గంగా మాహాత్మ్యమును ప్రతిదినము భక్తిచే శ్రద్ధచే విష్ణు లోకమునుకాని, శివలోకమునుకాని కోరువారు జపించవలెను. (II/43)