కృష్ణమంత్ర నిరూపణము

సూత మహర్షి పలికెను: నారద మహాముని సనత్కుమార వచనమును విని ఏమడిగెనో దానిని మీకు తెలిపెదను. కార్తవీర్య కవచమును, హనుమత్కవచమును పవిత్రమగు హనుమచ్చరితమును విని నారదమహర్షి మరల ఇట్లు పలికెను.

ఓ మునిశ్రేష్ఠా! బాగు! బాగు! నీవు అతి కరుణాత్ముడవై పరమ పవిత్రమగు శివుని చరిత మును హనుమంతుని చరితమును వినిపించితివి. ఈ తంత్రమున క్రమ ప్రాప్తమును మీరు చెప్పవలసిన దానిని చెప్పుము. జ్ఞానశ్రేష్ఠా! మిమ్ములను వేరుగా అడుగవలసినది ఏమున్నది?

సనత్కుమార మహర్షి పలికెను: ఇక ఇప్పుడు భుక్తి ముక్తి ప్రదములగు కృష్ణ మంత్రములను చెప్పెదను. ఈ మంత్రములను ఉపాసించియే బ్రహ్మాది దేవతలు సృష్ట్యాదులనుచేయ సమర్ధులగుచున్నారు. "శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా” అనునది పదునెనిమిది అక్షరములుగల మంత్రమిది. అధిష్టానదేవత దుర్గ. నారదుడు ముని. గాయత్రీ ఛందస్సు. శ్రీకృష్ణ పరమాత్మ దేవత. కామ బీజము స్వాహా శక్తి చతుర్వర్గఫలప్రాప్తి కొఱకు వినియోగము. శిరస్సున ఋషిని, వక్త్రమున ఛందస్సును, హృదయమున దేవతను, గుహ్యమున బీజమును, పాదములయందు శక్తిని న్యాసము చేయవలెను. 4, 4, 4, 4 మనూద్భవములగు వర్ణములచే పంచాంగన్యాసము కావించి తత్త్వన్యాసమును చేయవలెను. హృదయము అంతిమముగా ఆది నుండి అంత్యవర్ణము వరకు, అపరాద్యములను ఆత్మ కొఱకు మత్యంతతత్త్వములను జీవాద్యములను న్యాసము చేయవలెను. జీవము, ప్రాణము, మతి, అహంకారము, మనస్సు, శబ్దము, స్పర్శ, రూప రసములు, గంధము, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, రసన, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, పాయువు, శిశ్నము, ఆకాశము, వాయువు, వహ్ని జలము, మహి, జీవము, ప్రాణము అను వాటిని సర్వాంగములందు, మత్యాది త్రయమును హృదయమున, మూర్ధ ఆస్య, హృదయ గుహ్య పాదములందు శబ్దాదికములను న్యాసమును గావించవలెను. కర్ణాది స్వస్వస్థానములందు శ్రోత్రాదీన్ద్రియములను వాగాదీన్ద్రియములను స్వస్వస్థానములందు న్యాసము గావించవలెను. మూర్ధాస్య హృదయ గుహ్య పాదములందు ఆకాశాదికములను న్యాసము చేయవలెను. హృత్పుండరీకము అర్కేందు వహ్ని బింబములను వరుసగా ద్విషట్ అష్టదశ కలా వ్యాప్తములుగా చేయవలెను. భూతాష్టాంగాక్షి పదములందున్న వర్ణములచే హృదయమున పూర్వమువలె న్యాసము చేయవలెను. ఇక ఆకాశాది స్థలములందు వాసుదేవాదికమునను అనగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, వీరిని పరమేష్ట్యాది యుతముగా అనగా పరమేష్ఠి పుమాన్ శౌచ విశ్వ నివృత్తి సర్వకములు, శ్వేతానిలాగ్ని అంబు భూమి వర్ణములచే యథాపూర్వముగా న్యాసము గావించవలెను. స్వబీజాద్యం కోపతత్త్వమును నృసింహుని వ్యాపకముచే మొదటివలె న్యాసము గావించవలెను. ఇది సర్వాంగములందు తత్త్వ న్యాసమనబడును. మకరాది అధ్యవర్ణములన్ని ఈ చంద్రభూషితములే. వాసుదేవాదికములు అన్నియు చతుర్ధీ విభక్త్యంతములుగా తెలియవలెను. తరువాత పూరకుంభక రేచకములచే ప్రాణాయామమును మూలమంత్రముచే నాలుగింటిచే కాని ఆరింటిచేకాని, రెంటిచే కాని ఆచరించవలెను. ఇచట కొందరు ఆచార్యులు ప్రాణాయామము తరువాత మరల పీఠ న్యాసమును ఆచరించి అన్యన్యాసముల ఆచరించవలెను. అని చెప్పుదురు. చెప్పబోవు విధానముచే దశ తత్త్వాదిన్యాసము గావించి, పూర్వోక్తమగు మూర్తి పంజర న్యాసమును చేయవలెను. సర్వాంగమున వ్యాపకమును కిరీట మంత్రముచే గావించి, తరువాత తారాపుట మంత్రమును మూడు విధములుగా కరములందు వ్యాపింపచేయవలెను. పంచాంగుళులయందు పంచాంగ న్యాసమును కావించవలెను. మూడు విధములుగా మూలమంత్ర ముచే మూర్ధాది పాదాంతము వ్యాపకన్యాసము గావించవలెను. ఒకసారి తారముచే వ్యాపకముగావించి మంత్రన్యాసమును చేయవలెను. శిరస్సున, లలాటమున, భ్రూమధ్యమున, కర్ణములందు, నేత్రములందు, నాసికలందు, వదనమున, కంఠమున, హృదయము నందు, నాభియందు, కటియందు, లింగమునందు, జానువులయందు, పాదములందు క్రమముగా న్యాసమును గావించవలెను. హృదంతమంత్ర వర్ణములను శిరస్సున ధ్రువన్యాసమును చేయవలెను. మరల నేత్రములందు, ఆస్యమునందు, హృదయమున గుహ్యమున, పాదములందు హృదయాంత్ర మంత్రపద పంచకమును క్రమముగా వ్యాసము చేయవలయును. మరల మున్యాది న్యాసమును గావించి పంచాంగ న్యాసము చేయవలెను. ఇక ఇపుడు పరమ రహస్యమగు సర్వన్యాసోత్త మోత్తమమును చెప్పెదను. దీనిని తెలిసిన నరుడు జీవన్ముక్తుడగును. అణిమాద్యష్ట సిద్దులకు ఈశ్వరుడగును. దీనిని ఆరంభించినవాడు కృష్ణ సాన్నిధ్యమును పొందును. తారాది వ్యాహృతులచే మంత్ర సంపుట న్యాసమును గావించవలెను. మంత్ర పుటితములగు ప్రణవాదులను తరువాత న్యాసము చేయవలెను. గాయత్రీ పుటిత మంత్రమును మాతృకా స్థలమున న్యాసము గావించవలెను. మంత్రపుటిత గాయత్రిని క్రమముగా న్యాసము గావించవలెను. మాతృకాపుటిత మూలమంత్రమును న్యాసమును చేయవలెను. మూలమంత్ర పుటిత మాతృకను వ్యాసమును చేయవలెను. తృచమును మాతృకా వర్ణములను పూర్వము ఆయా స్థలములందు వ్యాసము చేయరాదు. ఇట్లు చేయు వ్యాసమే న్యాసషట్కము అనబడును. ఈ ఉత్తమ వ్యాసముచే కృష్ణసముడగును. వ్యాసపుటితమును చూచి సిద్ధ గంధర్వ కిన్నరులు దేవతలు కూడా నమస్కరింతురు. ఇక మానవుల విషయమేమి చెప్పవలెను. తరువాత సుదర్శన మంత్రముచే దిగ్బంధనమును చేయవలెను. సర్వాభీష్ట ప్రదాయకుడగు దేవుని హృదయమున ధ్యానించు చుండవలెను. వికసించిన పూలచే వంగియున్న కొమ్మలుగలచెట్లచే, శోభించు పూలగుత్తుల రాశులుగల తీగలచే చుట్టబడియున్న, పరాగము రాలి పడుచుండుటచే పరిమళవంతములుగా చేయబడిన దిగ్భాగములు గల చల్లని బృందావనమును స్మరించవలెను. వికసించిన కొత్త పద్మములనుండి జారుచున్న మకరందముగలవి, మకరందమునందలి ఆశచే ధ్వనించుచున్న తుమ్మెదల సమూహములుగల, నెమళ్ళు, కోకిలలు, చిలుకలు, పావురముల సమూహములచే ధ్వనించబడుచున్న, నర్తించుచున్న నెమళ్ళ గుంపులుగల యమునానదీ తరంగ కల్లోలముచే అంతటా ఎగిరిపడుచున్న నీటి బిందువులచే, మకరందము నిండియున్న వికసించిన పద్మముల సమూహముల పరాగధూసరితములు శుభప్రదములగు వాటిచే మన్మధుని ఉద్దీపించాడు గోపికా సుందరులు మృదు వస్త్రములను కదల్చు వాయువులచే ఎల్లప్పుడు సేవించబడు, మనోహరమగు కల్పవృక్షమును స్మరించవలెను. ఆ వృక్షము క్రింద స్వర్ణ వేదికయందు ఉత్తమమగు రత్నపీఠము, రత్నఖచిత పీఠమునందు అరుణ కమలమును స్మరించవలెను. ఆ యష్టదల పద్మమునందు మధ్యన ఉన్న ముకుందుని స్మరించ వలెను. వికసించిన కలువలవలె మనోహరుడు నెమలి పింఛమును అలంకారముగా ధరించినవాడు, పీతాంబరధారి, చంద్రముఖుడు, పద్మపత్రాయ తాక్షుడు, వేణువును ఊదువాడు అగు శ్రీకృష్ణుని స్మరించవలయును. ఇట్లు ధ్యానముచేసి మొదట ఇరువది వేలు జపించవలెను. దశాంశమును రక్తపద్మములచే హోమము గావించవలెను. అరుణ కమలములతో హోమమును గావించి సర్వ సిద్ధేశ్వరుడగును. పూర్వోక్త వైష్ణ వపీఠమున మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, దానియందు గోపీజన మనోహరుని ఆవాహన చేసి పూజించవలెను. ముఖమున నున్న వేణువును పూజించి, వనమాలను, కౌస్తుభమును శ్రీవత్సమును హృదయమున పూజించి, పుష్పాంజలిని సమర్పించవలెను. తరువాత శుక్ల చందనపంకిలమగు శ్వేత తులసిని, రక్తచందనాంకిత మగు రక్తతులసిని, దక్షిణ భాగమున వామభాగమున సుర్వేశ్వరుని ధ్యానించుచు అర్పించవలెను. తులసీద్వయమును, పద్మద్వయమును, హయమార ద్వయమును, సర్వ పుష్పములను సర్వాంగములందు అర్పించవలెను. దక్షిణ భాగమున వాసుదేవునివలె నిత్యానురక్త రజోగుణమూర్తి యగు రుక్మిణిని పూజించి ఆవరణార్చన చేయవలెను. దామసుదాములను, వసుదాముని, కింకిణిని పూజించవలెను. పూర్వాది దిక్కులందు చతుర్ధ్యంతములగు దామాదులను ధ్రువాదికములుగా, ఆగ్నేయ, నైఋతి, వాయవ్య, ఈశాన్య కోణములందు హృదయాదికములను దిక్కులందు అస్త్రములను చక్కగా పూజించి పత్రములందు మహిషులను పూజించవలెను. రుక్మిణి, సత్యభామ, నాగ్నజితి, సువింద, మిత్రవింద, లక్ష్మణ, జాంబవతి, సుశీల అను వారలను శోభించునట్టి సుందరాభరణ భూషితలనుగా పూజించవలెను. తరువాత దళాగ్రములందు వసుదేవుని, దేవకిని, నందగోపుని, యశోదను, బలభద్రుని, సుభద్రను, గోపాలకులను, గోవిందునియందు బద్ధమైన బుద్ధి కనులు గల గోపికలను, జ్ఞానముద్రా అభయ ముద్రలను కరములందు ధరించి పీతపాండురులగు తలి దండ్రులను, దివ్యభూషణాంబర లేపమాల్య ధారులనుగా చరువును పాయస పూర్ణపాత్రను ధరించి యున్న తల్లులను, అరుణ శ్యామల వర్నములుగల హారమణి కుండల మండితులను, శంఖమువలె చంద్రునివలె ధవళకర్ణుడగు బలరాముడు ముసలమును లాంగలమును ధరించువాడు, మద్య ప్రియుడు, నీలాంబరి హలధారి, ఏకకుండలుడు, ఇక కలలు శ్యామల, భద్రా, సుభద్ర, భద్ర భూషణ, వరాభయ యుతలు, పీతాంబరధారిణులు, ఆరూఢయౌవనులు, వేణువీణా హేమయష్టి శంఖ శృంగాది పాణులు, వివిధ ప్రాభృతాన్నవరాంబుజులగు గోపాలురు గోపికలను పూజించవలెను. వెలుపల మందరాద్రిని, కల్పవృక్షములను పూజించవలెను. మందారము, సంతానకము, పారి జాతకము, కల్పవృక్షము, హరిచందనము అనునవి వృక్షములు. మధ్యభాగమున, దిక్కులందు పూజించవలెను. మందారము, సంతానము. పారిజాతకము, కల్పవృక్షము, హరిచందనము అనునవి వృక్షములు. మధ్యభాగమున, దిక్కులందు పూజించి వెలుపల శక్రాదులను పూజించవలెను. కృష్ణాష్టకములతో వారి అస్త్రములను పూజించవలెను. కృష్ణుని, వాసుదేవుని, దేవకీ నందకుని, నారాయణుని, యదు శ్రేష్ఠుని, వార్ణ్షేయుని, ధర్మపాలకుని, అసురాక్రాంత భూభారహారిని పూజించవలెను. ఈ ఆవరణలతో శ్రీకృష్ణుని పూజ చేయవలెను. సంసార సాగరమును తరించుటకు, సర్వాభీష్ట ప్రాప్తికి ఇట్లు శ్రీకృష్ణ భగవానుని పూజలచే మంత్రసిద్ధిని పొందవలెను.

శ్రీకృష్ణ భగవానుని త్రికాల పూజనమును ఇప్పుడు చెప్పెదను. ఈ పూజనము సర్వార్ధ సిద్ధి ప్రదము. సంపద్యుక్తమైన ఉద్యానమున హేమభూరత్నమండపమున శోభించు కల్పవృక్ష అధోభాగమున నున్న రత్నాబ్జ పీఠమున ఉన్నవాడు ఇంద్రనీలమణి ప్రభాభాసితాంగుడు, గుడమువలె స్నిగ్ధములైన అలకలు గలవాడు శిశువుగా నున్నవాడు కదలుచున్న బంగారు కుండలములచే భాసించు గండ స్థలములు గలవాడు. చిరునవ్వు తొణికిసలాడు ముఖారవిందము గలవాడు. సుందరుడు, ప్రకాశించు పరిశుద్ధమైన రత్నములు పొదిగిన కనక సూత్రము మొలత్రాడుగా కలవాడు, పీతాంబరధారి, స్వర్ణాభరణ భూషితుడు మనోహరములైన పుండరీకములు గలవాడు సుందర నఖ శోభితుడు, చక్కగా ధూసరితమగు ఉరస్థ్సలమున గోధూలిచే బాగుగా అలదినవాడు, సుపుష్టాంగుడు, స్వర్ణకాంతిలో ప్రకాశించువాడు, కటిస్థలమున జఘాంత యుగ్మముగా క్వణత్కింకిణీ జాలదామ బద్ధుడు, నవ్వుచున్నవాడు, వికసించిన బంధుజీవ పుష్పముల కాంతిగల పాదపాదాబ్జముల ఉదార కాంతిచే ప్రకాశించువాడు. దక్షిణకరమున పాయసాన్నమును, వామకరమున అపుడే తీసిన వెన్నను ధరించినవాడు, శోభించు గోప గోపీ గోబృందమధ్యమున ఉండువాడు, ఇంద్రాది దేవతలచే పూజించబడు పాదపద్మములు గలవాడు, భూమికి భారభూతులైన పూతనాది రాక్షస గణమును సంహరించిన వాడు అయిన శ్రీకృష్ణభగవానుని ధ్యానించి స్థిరమగు మనస్సుచే పూర్వమువలె అర్చించవలెను. పెరుగుతో బెల్లముతో నైవేద్యమును సమర్పించి ఒకవేయి జపించవలయును. శోభించు గోపగోపీగోబృందమధ్య స్థితుడు సాంద్ర మేఘప్రభుడు సుందరాంగుడు, నెమలి పింఛములను శిరమున భూషణముగా ధరించినవాడు, పుండరీకాయతాక్షుడు, పూర్ణ చంద్రాననుడు, చలత్కుండ లోల్లాని గండస్థల శ్రీభారుడు, సుందర మందహాసము గలవాడు, సునాసుడు, పీతాంబరధారి, దివ్యభూషణభూషితుడు, ధ్వనించు కింకిణీ జాలమత్తాను లేపుడు, మ్రోగుచున్న వేణువును కరమున ధరించువాడు, వామకరమున శంఖమును దండమును ధరించువాడు, దక్షిణ హస్తమున అభీప్రదముద్రను ధరించువానిని అర్చించవలెను. ఇట్లు ధ్యానించి విష్ణుభక్తుడు కృష్ణుని పూజించవలెను. అపూప పాయ సాన్నాదులచే నైవేద్యమును కల్పించవలెను. నేయి కలిపిన పాల అన్నముతో 'అష్టోత్తర శతమును హోమమును చేయవలెను. ఆయా దిక్కులందు బలినిచ్చి ఆచమనము నీయవలెను. మంత్రమును అష్టోత్తర సహస్రము జపించవలెను. ఇట్లు మధ్యాహ్నమున పూజించ వలెను. అట్లు పూజించిన వానిని దేవతలందరు నమస్కరింతురు. లోక ప్రియుడగును. మేధ ఆయుష్యము, సంపద, కాంతి గలవాడై పుత్ర పౌత్రులచే వృద్ధి చెందును. ఇక తృతీయ కాలపూజా విషయమున కాల భేదము చెప్పబడినది. కొందరు సాయంకాలము, మరికొందరు రాత్రి అని చెప్పియున్నారు. దశాక్షర మంత్రమును రాత్రి అష్టాదశాక్షర మంత్రమును సాయంకాలమున ద్వారకా నగరియందు చిత్రోద్యానోప శోభితమున, అష్టాదశ సహస్ర వనములచే శోభించు దానియందు, హంససారస సంకీర్ణ కమలోత్పలశాలులగు పవిత్ర జలములుకల సరస్సులచే కూడియున్న భవనోత్తమమున ఉదయించు సూర్యకాంతిగల శ్రీమణి మండలమున స్వర్ణ పద్మాసనా సీనుడు త్రైలోక్యమోహనుడు, ఆత్మతత్త్వ నిర్నయము కొఱకుముని బృందముచే కూడియున్నవాడు, ఆ మునులకు స్వధామమును ఉపదేశించువాడు, వికసించిన కలువల వంటిమేనివన్నె కలవాడు, పద్మపత్రాయతేక్షణుడు, స్థిగ్ధుడు, కుంతల సంభిన్నకిరీట వనమాలలు కలవాడు, చారు ప్రసన్న వదనుడు, స్ఫురన్మకరకుండలుడు, శ్రీవత్సవక్షుడు, భ్రాజత్కౌస్తుభుడు, సుమనోహరుడు, కాశ్మీరకపిశోరస్కుడు, పీతకౌశేయవస్త్రుడు, హారకేయూర కటకకటి సూత్రాలంకృతుడు భూభారమును హరించినవాడు, ఆనందమనస్కుడు, శంఖచక్రగదాపద్మములచే శోభించు చతుర్భుజములు కలవాడు, అగు శ్రీకృష్ణుని ధ్యానించి పూజించవలయును. తరువాత అంగములచే ప్రథమావరణ పూజను చేయవలెను. మూడవ ఆవరణమున నారదుని, పర్వతుని, జిష్ణువును. నిశధుద్ధ వదారుకులను, విష్వక్సేనుని, శైనేయుని, దిగగ్రభాగమున గరుడుని వజ్రాదులచే లోకపాలురను పూజించవలయును. ఇట్లు విధి విధానముగా పూజించి పాయసమును నివేదన చేయవలెను. ఖండమిశ్ర దుగ్ధ బుద్ధిచే జలమును తర్పణగావించి, పురుషోత్తముని భావించుచు, ఎనిమిది నూర్లు జపించవలెను. అన్ని పూజలందు హోమమును మధ్యాహ్నము చేయవలెను. లేదా అసనాదిగా అర్ఘ్య పర్యంతము చేసి స్తుతించి నమస్కరించవలెను. తరువాత సమర్ధాత్మను ఉద్వాసనచేసి తన హృదయ సరసీరుహమున ఉంచి, తన్మయుడై మరల ఆత్మ నర్చించవలెను. ఇట్లు ప్రతి నిత్యము సాయంకాలమున వాసుదేవుని అర్చించువాడు అన్ని కోరికలను పొంది అంతమున పరమపదమును పొందును. రాత్రివేళ అయినచో మదనాక్రాంతచిత్తుడు, నందనందనుడు, రాసలీలా పరిశ్రాంతుడు, గోపీ మండల మధ్యగతుడు, వికసించిన కుందకహ్లార మల్లికా కుసుమములనుండి వచ్చిన పరాగముచే కప్పబడినవాడు, మందమారుతములచే చల్లగా చేయబడిన, వికసించిన కొత్తకలువలనుండి జారుచున్న మకరంద మధ్యమున తిరుగుచున్న మదించిన తుమ్మెదల లలితగానముగల, వికసించిన మల్లెలు కల, చంద్రుని రణములచే శోభించు దిగంతములుగల, మన్మధుని ఉద్ధీపింపచేయు కాళిలిందీ పులినాంగణమున చిరునవ్వు ముఖముతో ఉన్నవాడు, మాటి మాటికి వేణు వాదనము చేయువాడు, లోపల నీరుగలదగుటచే శోభించు కొత్త మేఘముల కాంతిగలవాడు, పద్మాయత నేత్రుడు, బింబాధరుడు, సుందరుడు, నెమలి పింఛములను శిరమున అలంకరించుకొని, కొప్పున పూలమాలలు కట్టుకొని యున్నవాడు, ప్రకాశించు కుందముల రత్నకాంతిచే ప్రకాశించు గండస్థలము కలవాడు, కాంచీ నూపురహార కంకణలసత్కేయూర భూషాన్వితుడు, గోపీద్వయమధ్యగతుడు, వన్యప్రసూనస్రజుడు, పరస్పరము పట్టుకొనిన గోపికాభుజ బంధమున ఉన్నవాడు, రాసక్రీడాలోలుపుడు, మనసిజాక్రాంతుడగు ముకుందుని సేవించవలెను. వివిధ శ్రుతిభిన్నమనోజ్ఞతరస్వర సప్తక మూర్ఛన తానగణములచే భ్రమించువాడు, ఉదారమణిస్ఫుటమండన సింజిత చారుతనువు, పరస్పరము పట్టుకొనిన గోపికాకరములచే కల్పించిన రాసవిహారవిధిలో ఈ శరీరముచే బహువిధములుగా చేయబడిన దివ్యతనువు కలవాడు. అగు శ్రీకృష్ణుని ఇట్లు ధ్యానించి పూజించవలయును. తరువాత అంగములచే ప్రథమావరణ పూజను కావించవలెను. కేశవుడు కీర్తి మొదలుగాగల షోడశ మిథునములను పూజించవలెను. తరువాత ఇంద్రాదులను వజ్రాదులను పూజించవలెను. పృధు, సువృత్తము, మసృణము వితస్తి మాత్రోన్నతమగు శంకును భూమియందు ప్రతిష్ఠించి, దానిని పాదములచే అక్రమించి పరస్పరము హస్తములను పట్టుకొని భ్రమించుట రాసగోష్ఠి అందురు. ఇట్లు పూజించి ఖండశర్కర నేయి కలిపిన పాలచే నైవేద్యమును సమర్పించి, 16 చషకములను అర్పించవలెను. శర్కర కలిపిన పాయసమును, క్రమముగా మిథునములందు అర్పించవలెను. మిగిలిన దానిని పూర్వమువలె ఆచరించి సహస్రము జపించవలెను. స్తుతించి, నమస్కరించి, పూజాశేషమును ముగించవలెను. ఇట్లు కృష్ణుని పూజించినవాడు సర్వసమృద్ధులను పొందును. అణిమాద్యష్ట సిద్ధులకు అధిపతియగును. ఈ లోకమున పలు భోగములను అనుభవించి, అంతమున విష్ణుపదమును చేరును. ఇట్లు పూజాదులచే మంత్రము సిద్ధించిన పిదప కామ్యములను సాధించు కొనవలెను. మూడు కాలములందు ఇరువది ఎనిమిది మార్లు పూజించవలెను. స్వకాలవిహితములగు పరివారములను కూడా తృప్తిపరచవలెను. ప్రాతఃకాలమున బెల్లమునకలిపిన పెరుగుచే, మధ్యాహ్నము పాలచే, సాయంకాలము వెన్నకలిపిన పాలచే తృప్తిపరచవలెను. ఖండశర్కర కలిపిన పాలతో నివేదన కావించవలెను. ఆయా నామములను ద్వితీయాంతములుగా పలికి చివర 'తర్పయామి' అను పదమును కూర్చవలెను. చివర పూజాశేషమును ముగించవలెను. ఆ ప్రసాద జలముచే తనను ప్రోక్షించుకొని, ఆ జలమును త్రాగవలెను. దానితో తృప్తి చెంది, భగవానుని ఉద్వాసన గావించి, తన్మయుడై మంత్రమును జపించవలెను.

ఇక ఇపుడు కామ్య కర్మలందు తర్పణములందు ఉపయోగించవలసిన ద్రవ్యములను చెప్పెదను. ఆ విధానములలో ఏదో ఒక దానిని అనుసరించవలెను. పాయసము, పెరుగుతో చేసిన పదార్ధము, నెయ్యి, గుడాన్నము, నువ్వుల అన్నము, పాలు, పెరుగు, అరటిపండు, రేగి, అల్లనేరేడు, మేడి, అపూపములు, మోదకములు, పేలాలు, అటుకులు, వెన్న, ఈ పదునారు పదార్ధములను బ్రహ్మాదులు చెప్పియున్నారు. పేలాల తరువాత అటుకులు సమర్పించి ఖండశర్కరను డెబ్బది నాలుగు మార్లు ప్రొద్దున తర్పణమును చేయవలెను. కృష్ణ స్థానమును ధ్యానమునుచేసి నలుబది రోజులలో ఇష్టమును పొందును. గోరువెచ్చని పాలచే, వెన్నను, పెరుగును, పాలు కలిపిన పదార్ధము, నేయి, మత్స్యాండములు, తేనె, కీలాలము ఈ తొమ్మిది పదార్ధములచే పూజించవలెను. ఇట్లు పన్నెండు మార్లు ఒక్కొక్కదానిచే పూజించి నూట ఎనిమిది మార్లు తర్పణమును చేయు విష్ణుభక్తుడు పూర్వోక్త ఫలమును పొందును. ఇంకను ఏమి చెప్పవలెను. ఈ తర్పణము సర్వాభీష్ట ప్రదము. ఖండశర్కర కలిపి గోరువెచ్చని పాలు అను బుద్ధిచే జలమును కృష్ణునికి తర్పణము చేయుచు గ్రామమున వెళ్ళినచో పరివారముతో కూడా ధనవస్త్రములను, భోజనమును పొందగలడు. ఎన్నిమార్లు తర్పణము చేసినచో అన్నిమార్లు మంత్రమును జపించవలెను. తర్పణముచే అఖిల కార్యములను సాధించుకొనవలెను. ఇక ఇపుడు సాధకుల హితము కొఱకు కామ్యహోమమును చెప్పెదను. తరుగని సంపద కొఱకు మారెడు పుష్పములతో హోమమును చేయవలెను. ఘృతాన్న సమృద్ధికొఱకు నేయి కలిపిన అన్నముచే హోమమును చేయవలెను. వన్య పుష్పములచే హోమమును చేసినచో బ్రాహ్మణులు వశమగుదురు. జాతి పుష్పముచే క్షత్రియులు, నల్ల పూలచే వైశ్యులు, నీలోత్పలములచే శూద్రులు, లవణములచే అందరు, పద్మములచే యువతులు వశమగుదురు. గోశాలయందు నేయి కలిపిన పాయసముచే హోమము గావించినచో గోపాలకృష్ణుడు గోవులకు శాంతిని కలిగించును. శిక్షావేషధరుడు, కింకిణీ జాలశోభితుడగు కృష్ణుని ధ్యానించి పాలభావనే శుభ జలములచే తర్పణమును గావించవలెను. ఇట్లు చేసినచో ప్రీతిచెందిన కృష్ణభగవానుడు ధన ధాన్య పుత్ర కీర్తులను ప్రసాదించును. బ్రహ్మవృక్షసమిధలచే కాని, దర్భలచే కాని, తిలతండులములచే కాని త్రిధు మిశ్రములచే పదివేలు హోమమును గావించవలెను. ఇట్లు చేసిన బ్రాహ్మణులు వశులగుదురు. రాజవృక్షపుష్పములచే హోమమును గావించిన క్షత్రియులు, కురండ కుసుమములచే చేసిన వైశ్యులు, పాటల కుసుమములచే శూద్రులు వశులగుదురు. శ్వేతరక్త పద్మములచే చంపకములచే, పాటలములచే క్రమముగా పదివేలు హోమము గావించినచో ఉత్తమాంగనలు వశులగుదురు. త్రిమధు మిశ్రితములగు హయారి కుసుమములచే ప్రతినిత్యము నిశీధకాలమున ఎనిమిది దినములు హోమము గావించినచో వరాంగనలు వశమగుదురు. పాలు, పెరుగు, తేనె కలిపిన ఆవాలచే ఒకనెల రాత్రిపూట ముప్పది వేలు హోమమును గావించినచో ఇంద్రుడుకూడా వశుడగును. వల్లవీవస్త్రములను హరించి నీప వృక్షమును ఆరోహించిన కృష్ణుని స్మరించుచు, రాత్రిపూట ఒకవేయి పదకొండు రోజులు జపించినచో ఊర్వశిని కూడా బలముతో ఆకర్షించవచ్చును. ఇంకనూ ఏమి చెప్పవలెను. ఈ మంత్రము సర్వవశ్యకారి.

ఇక ఇప్పుడు పరమ రహస్యము మోక్షప్రదమగు దానిని చెప్పెదను. తన హృదయ పద్మమున ప్రభువు, దేవకీనందనుడు, కుందేందు గౌరుడు, పద్మాక్షుడు, శంఖచక్రగదా పద్మములను ధరించిన వాడు. నవనళినమాలచే శోభించువాడు, మునీంద్రవేద్యుడు, కణికముని లసద్దివ్యభూషాభిరాముడు, దివ్యాంగాలేపభాసుడు, సకల భయహరుడు, పీతాంబరధారి, మురారి, స్ఫుట హృదయ సరోజాసనాసీనుడు, ఆద్యుడు, సాంద్రాంభోదచ్ఛవి అయిన కృష్ణుని ధ్యానించి పన్నెండు లక్షలు జపించవలెను. పన్నెండు వేల సమిధలచే హోమమును గావించవలెను. క్షీర వృక్షసముద్భవములచే కాని, తేనె, నెయ్యి, శర్కరచేకాని, పాయసము చేకాని, హెూమము గావించవలెను. ఇట్లు లోకేశ్వరారాధ్యుడగు కృష్ణుని తన హృదయ పద్మమున ధ్యానించుచు ప్రతిదినము మూడు వేలు జపించవలెను. సాయంకాలమున చెప్పబడిన రీతిగా పూజించి, పూర్వోక్త విధిగా హోమమును గావించి తద్గత మనస్కుడై యుండవలెను. ఇట్లు ప్రతిదినము గోపాలకృష్ణుని పూజించు విద్వాంసుడు సంసార సాగరమును దాటి పరమపదమును చేరును. అనలపుట పురము యొక్క మధ్యభాగమున, బాహ్యకోణములందు, కర్ణికయందు సాధ్యయుక్తుడగు మన్మథుని లిఖించవలెను. కేశరములందు వివరగత షడర్జ ద్విట్ లను లిఖించవలెను. శక్తి శ్రీపూర్వకములగు ద్వినవలిపి గల మంత్రాక్షరములను, దలముల మధ్యలో వర్ణములను, మంత్రము యొక్క దశాక్షరములను ఒక్కొక్కటిగా పద్మమున వ్రాయవలెను. భూసద్మ నాభి వృతముగా కాల్చినసూచిచే గోరోజనముచే లిఖించి హిరణ్యరచితమగు పట్టమున గులికీకృతమగు గోపాల యంత్రము అఖిలాభీష్టప్రదమని చెప్పబడినది. ఈ యంత్రమును సంయాతసిక్తముగా చేసి చక్కగా జపించి మహానుభావులు ధరించినచో జగత్త్రయమును వశము చేయుటలో సమర్థము. రక్షణ, కీర్తి, పుత్రులు, భూమి, ధనము, ధ్యానము, సంపద, సౌభాగ్యములను కోరువారు ఎల్లవేళలా ఈ యంత్రమును ధరించవలెను. “చక్రీష్ట్యాయ నమః" అనునది షడక్షర మంత్రము. సర్వసిద్ధి ప్రదము శాంతిందువహ్న్యాఢ్యమగు క్రోడము మాయ బీజముగా చెప్పబడినది. ఈ మంత్రము గోవిందవహ్ని చంద్రాఢ్యము. శ్రీబీజము. వీటిచే అష్దవశక్లిపి అయినచో ఇరువది అక్షరముల మంత్రమగును. శాలగ్రామమునందు కాని, మణియందుకాని, యంత్రమునకాని, మండలమునకాని, ప్రతిమలందు కాని హరి పూజ చేయవలెను కాని కేవల భూమియందు చేయరాదు. ఇట్లు కృష్ణుని పూజించువాడు ఉత్తమగతిని పొందును. ఇరువది వర్ణములు మంత్రమునకు బ్రహ్మముని, గాయత్రీ ఛందస్సు. కృష్ణుడు దేవత కామబీజము. ద్విఠము శక్తి 3, 4, 4 4 4, 2 వర్ణములచే షడంగ న్యాసమును గావించవలెను. మూలమంత్రముచే వ్యాపకము నాచరించవలెను. ఆ మూలము మునుపుటితము కావలెను. సావధానముగా ఆయా స్థానములందు మాతృకా వర్ణములను న్యాసము గావించవలెను. దశతత్త్వ న్యాసముగావించి మూలముచే వ్యాపకము గావించవలెను. దేవతాభావసిద్ధి కొఱకు మన్త్రన్యాసమును చేయవలెను. శీర్షమున, లలాటమున, భ్రూమధ్యమున, నేత్రములందు, కర్ణములందు, నాసికలందు, వక్త్రమునందు, చిబుకమున, కంఠమున, బాహమూలమున, హృదయమున, ఉదరమున, నాభిదేశమున, లింగమున, మూల సరోరుహమున, కటియందు, జానువులందు, జంఘలందు, గుల్ఫములందు, పాదములందు, క్రమముగా మంత్రవర్ణములను హృదంతముగా వ్యాసము గావించినచో సృష్టిన్యాసము అనబడును. హృదయమున, ఉదరమున, నాభియందు, లింగమున, మూల సరోరుహమున, కటియందు, జానువు లందు, జంఘలందు, గుల్ఫములందు, పాదములందు శిరస్సున, కపోలమున, భ్రూమధ్యమున, నేత్ర కర్ణ నాసికా వదన చిబుక కంఠ బాహుమూలములందు నమోంత మంత్ర వర్ణములను క్రమముగా న్యాసమును గావించినచో స్థితిన్యాసము అనబడును. పాద గుల్పజంఘజానుకటి మూల ధ్వజనాభి జఠర హృదయబాహు మూల కంఠచిబుకవదన నాసికా కర్ణనేత్ర భ్రూమధ్య నిటల విరస్సులలో క్రమముగా మంత్రాక్షర వ్యాసము గావించినచో సంహార న్యాసము అనబడును. మరల సృష్టి స్థితి వ్యాసములను గావించి పూర్వమువలె మూర్తి పంజరనామ న్యాసమును గావించవలెను. మరల షడంగన్యాసమును గావించి హృదయపద్మమున శ్రీకృష్ణపరమాత్మను ధ్యానించవలెను. ద్వారకానగరమున సమస్రార్కభాస్వరములగు భవనరాజములచే మహాకల్ప వృక్షములచే కూడియున్న మణి మండపమున జ్వలద్రత్నమయ స్తంభ ద్వారతోరణ కుడ్యములుగల, పుల్ల ప్రఫుల్ల సచ్చిత్ర వితానాలంబిమౌక్తికమగు, పద్మరాగస్ధలీరాజద్రత్న సంఘముల మధ్యన, అనారతగలద్రత్న ధారాధ్యమగు దేవతావృక్షము క్రింద రత్న ప్రదీప రాజులచే దిగంతములు ప్రకాశించుచుండగా ఉద్యదాదిత్య సంకాశమణి సింహాసనాం బుజమున ద్రుతహాటక సన్నిభుడై కూర్చొనియున్న అచ్యుతుని ధ్యానించవలయును. ఆ యచ్యుతుడు ఏకకాలమున ఉదయించిన సూర్యచంద్ర విద్యుత్కోటులతో సమకాంతి గలవాడు. సర్వాంగసుందరుడు, సౌమ్యుడు, సర్వాభరణ భూషితుడు, పీతాంబరధారి, శంఖ చక్ర గదా పద్మములచే శోభించు హస్తములు కలవాడు. ఎడతెగక ప్రకాశించు రత్నధారలతో నిండిన కలశమును స్పృశించుచు వామ పాదపద్మాగ్రముచే పల్లవకాంతిని హరించుచు, దక్షిణవామ భాగములలో మిత్రవింద సులక్ష్మణాలు రత్ననది నుండి రత్నపూర్ణఘటములను తీసి ఇచ్చుచుండగా, వారికి జాంబవతి సుశీలలు రత్నఘటములను అందించుచుండగా, వెలుపల పదునారువేల ప్రియ భార్యలు చుట్టుముట్టియుండగా, ఆ వెలుపల ఇష్టనిధులు ధనములచే భూమిని నింపుచుండగా, వారి వెలుపల యాదవులందరు, పూర్వమువలె స్వరాదులుండగా యున్న కృష్ణ పరమాత్మను ధ్యానించి అయిదు లక్షలు జపించవలెను. దశాంశమును అరుణకమలములచే హోమము గావించి పూర్వోక్త పీఠమున పూజించవలెను. గంధముచే అలికి అష్టదళ పద్మమును లిఖించవలెను. కర్ణిక యందు షట్కోణమును లిఖించి అచట సాధ్యయుతముగా మన్మధుని లిఖించవలెను. మిగిలిన పదిహేడక్షరములచే స్వరవేష్టనమున మాలామంత్రమును లిఖించవలెను. ఇట్లు ఆరుగా వ్రాసి తద్భాహ్యభాగమున మాతృకాక్షరములచే వేష్టనమును గావించవలెను. బాహ్యభాగమున భూబింబమును లిఖించవలెను. దిక్కులలో విదిక్కులలో శ్రీమాయలను భూగ్రహము చతురస్రముగా అష్టవజ్ర విభూషితముగా ఉండవలెను. ఈ యంత్రమును హాటకాది పట్టములందు లిఖించి సంస్కరించి ధరించువారిని దేవతలు కూడా పూజింతురు.

"వామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నోఽనగః ప్రచోదయాత్” అనునది స్మరగాయత్రి. ఈ స్మరగాయత్రిని గోపాలమంత్రమునకు మొదట జపించినచో జనరంజకమగును. "శ్రీకామమదేవాయ సర్వజన ప్రియాయ సర్వజనసమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల సర్వజనస్య హృదయం మమ వశం కురుకురు" అనునది నలుబది యెనిమిది అక్షరములు గల మదన మంత్రము. జపమునకు ఆదియందు స్మర బీజాదిగా చేసినచో జగత్త్రయము వశమగును. పీఠమును మొదటివలె అర్చించి మూలముచే మూర్తి సంకల్పించి అచట అచ్యుతుని వ్యాసక్రమముగా అసనాది విభూషాంతముగా పూజించవలెను. సృష్టి స్థితి షడంగములను, కిరీటమును, కుండల ద్వయమును, శంఖచక్రగద పద్మములను, మాలను, శ్రీవత్స కౌస్తుభములను, గంధపుష్పములచే పూజించి షట్కోణములందు షడంగములను దిగ్దలములందు క్రమముగా పూజించవలెను. కోణములందు వాసుదేవాధికములను, శాంత్యాదికమును, పత్రాగ్రములందు అష్టమహిషులను పూజించవలెను. తరువాత పదునారువేల ప్రియురాళ్ళను పూజించవలెను. ఇంద్రనీల ముకుందులను, కరాలానన్ద కచ్ఛపులను, శంఖపద్మములను, అష్టనిధులను, క్రమముగా పూజించవలెను. ఆ బయట లోకపాలు రను, వజ్రాదులను పూజించవలెను. ఇట్లు సప్తావరణములలో కృష్ణుని పూజించి దధి ఖంఢాజ్య మిశ్రమగు క్షీరాన్నముచే ప్రీతుని చేయవలెను. దివ్యోపచారమును ఇచ్చి, స్తుతించి, నమస్కరించి పరివార గణములతో స్వహృదయమున ఉద్వాసన గావించవలెను. ఆత్మన్యాసము గావించి, చక్కగా పూజించి తన్మయుడై విహరించవలెను. వింశత్యక్షర మంత్రమునకు రత్నాభిషేక ధ్యాన పూజలను గావించవలెను. ఇట్లు మంత్రమును ఉపాసించువాడు సమృద్ధిని పొందగలడు. జపహోమార్చన ధ్యానములచే ఈ మంత్రమును జపించువానిల్లు ఎపుడూ రత్నసువర్ణ ధనధాన్యములచే నిండియుండును. సర్వసస్య సమాకులమగు పృథివి అతని హస్తగతమగును. పుత్రమిత్రాదులచే సుసంపన్నుడై అంతమున పరమపదమును పొందును. గోవిందుని అగ్నిహోత్రమున్న తుండల సహిత శుక్ల పుష్పములచే పూజించి నేయి కలిపిన వాటిచే పదివేలు హోమమును గావించి, ఆ భస్మమును శిరమున ధరించవలెను. ఇట్లు చేసినచో అతనికి అన్నాది సమృద్ధి కలుగును. అతని వంశమున స్త్రీలందరు సుఖ సంపదలు కలిగియుందురు. త్రిమధు మిశ్రితములగు రక్తాంభోజములచే లక్షహోమమును గావించవలెను. అట్లు చేసినచో అతని సంపదముందు ఇంద్రైశ్వర్యముకూడా అల్పముగా తోచును. త్రిమధు మిశ్రితములగు శుక్లపుష్పములచే ప్రతి నిత్యము ఒక నెల హోమము గావించినచో రాజపురోహితుడగును. ఇటువంటి ప్రయోగములను ఈ మంత్రముచే సాధించవచ్చును.

ఇక ఇపుడు సర్వసిద్ధి ప్రదమగు దశాక్షరమంత్ర రాజమును చెప్పెదను. సద్వాన్విత స్మృతి సాక్షిలోహితము జనవల్లభ అగ్ని ప్రియాంత పవనము ఇది దశాక్షర మంత్రము. ఈ మంత్రమునకు నారదముని. విరాట్ఛందస్సు. కృష్ణపరమాత్మ దేవత. కామబీజము, స్వాహాశక్తి చక్రము, విచక్రము, సుచక్రము, త్రైలోక్య రక్షణ చక్రము. అసురాంతక చక్రము. ఈ పదములను చతుర్ధ్యంతములుగా ఠద్వయాంతములుగా మంత్రమునకు పంచాంగ వ్యాసమును చేయవలెను. తరువాత తారాపుట మంత్రమును చేతులలో మూడు మార్లు వ్యాప్తిచేసి ఇందు సహిత హృదంత మంత్రాక్షరములను ప్రణవాంతరితముగా న్యాసము చేయవలెను. దక్షిణాంగుష్ఠము నుండి వామాంగుష్ఠము వరకు అంగులిపర్వలందు చేయబడునది సృష్టిన్యాసముగా చెప్పబడినది. ఇపుడు స్థితి న్యాసమును చెప్పెదను. వామకనిష్ఠాదిగా కనిష్ఠాతముగా చేయునది స్థితి న్యాసము. దక్షిణాంగుష్ఠము నుండి వామాంగుష్ఠాతము అంగులి పర్వములలో చేయవలెను. ఇదియే సంహృతి న్యాసము. ఈ న్యాసము దోషసమూహ నాశకముగా చెప్పబడినది. సృష్టి వ్యాసము విద్యా ప్రదము కావున పరిశుద్ధ చిత్తులగు బ్రహ్మచారులకు యోగ్యమైనది. స్థితి వ్యాసము గృహస్థులకు, సంహారన్యాసము, మునీంద్రులకు విరక్తులకు ఉపయోగించును. మరల స్థితిక్రమముగా మంత్రాక్షరములను అంగుళులందు న్యాసమును చేయవలెను. మరల మొదట చెప్పిన చక్రములచే కరములందు పంచాంగన్యాసము చేయవలెను. తరువాత మూలపుటితములగు సబిందుకములైన మాతృకాక్షరములను మాతృకాన్యాస స్థానములందు న్యాసము కావించవలెను. తరువాత తారాపుటమగు మూలమును వ్యాపకముగా న్యాసము చేయవలెను. సంహార సృష్టి భేదములచే దశతత్త్వములను వ్యాసమును కావించవలెను. నమోంతమగు మూల మంత్రాక్షరములగు పదములను ఆత్మన్యాసము గావించవలెను. మత్యంత తత్త్వములు పృథివ్యాదులు క్రమముగా పృథివి, జలము, వహ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహతత్త్వము. ప్రకృతి, పురుషుడు, పరుడు అను వాటిని మస్తక నేత్ర శ్రోత్ర నాసికా వదన హృదయ నాభిలింగ జాను పాదములందు న్యాసము చేయవలెను హృదంతములు ప్రణవాంతరితములగు మంత్రాక్షరములను న్యాసము చేయవలెను. దీనిని సృష్టి వ్యాసము అందురు. ఇక స్థితి వ్యాసమును వినుము, హృదయ నాభి ధ్వజజాను పాద మస్తక నేత్ర కర్ణ నాసికా వదనములందు క్రమముగా న్యాసము చేయుట స్థితి న్యాసము అనబడును. పాదజాను లింగ నాభి హృదయముఖ నాసికా కర్ణ నేత్ర మూర్ధలందు చేయు న్యాసము సంహార వ్యాసమందురు. సృష్టి వ్యాసము వరకు బ్రహ్మచారులకు, స్థిత్యంతము గృహస్థులకు, సంహారాంతము యతులకు విధించబడినది. బ్రహ్మచారులకు నాలుగు విధములుగా, గృహస్థులకు అయిదు విధములుగా, యతులకు మూడు విధములుగా చెప్పబడినది. కొందరు గృహస్థులు విరక్తులుగా ఉన్నపుడు సంహారాంతముగా చెప్పియున్నారు. తరువాత ఇష్టాప్తి కొరకు విభూతి పంజర వ్యాసమును చేయవలెను. మంత్రములకు దశా వృత్తిమయమగు ఈ న్యాసము కృష్ణ సన్నిధిని చేర్చును. ఆధార ధ్వజ నాభి హృదయ కంఠ ముఖ శయ ఊరు కంధర నాభి కుక్షి హృదయ స్తన పార్శ్వ శ్రోత్ర మస్తక వదన మస్తక నేత్ర కర్ణ నాసాపుట కపోల దక్షిణ దోర్మూల సంధ్యగ్ర గుళి శిరస్సులందు, పూర్వాది దిక్కులందు, స్వకలలందు, బాహుసక్ధి, శిరోనేత్ర, ఆస్య, కంట హృదయ, జఠర, మూలాధార, లింగజాను, పాద, శ్రోత్ర, గండ, భూజ, వక్షోజ, పార్శ్వ లింగములందు న్యాసము గావించవలెను. మరల ఊరు జాను జంఘ పాదములందు క్రమముగా న్యాసము చేయవలెను. ఇదియే విభూతి పంజరన్యాసము. సర్వార్ధ సిద్ధి ప్రదము ఈ న్యాసముచే కృష్ణ స్వరూపుడగును.

మొదట చెప్పిన మూర్తి పంజప న్యాసమును చేయవలెను. తరువాత వ్యాస శ్రేష్ఠములగు పంచాంగ దశాంగ న్యాసములను చేయవలెను. హృదయ మూర్ధ శిఖా సర్వాంగ దిక్పార్శ్వ కటి పృష్ఠములందు న్యాసము చేయవలెను. మరల సావధాన మనస్కుడై చక్రములచే పంచాంగ న్యాసము కావించవలెను. ఇట్లే అష్ఠాదశాక్షర మంత్రమునకు చెప్పబడిన మరియొక న్యాసమును చేయవలెను. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకము నాచరించవలెను. అట్లే సాథకోత్తముడు వేణు బిల్వాది ముద్రలను చూపవలెను. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలెను. అంగుష్ఠ రహితములగు అంగుళులు చక్కగా ఉన్నచో హృదయ ముద్ర అగును. అధోంగుష్ఠముగా ఉన్న ముష్ఠిని శిఖాముద్ర అందురు. కరాంగులులు చాచి యుంచినచో కవచముద్ర అగును. నారాచముష్టిచే బాహు యుగ్మమును ధరించి అంగుష్ఠ తర్జనులచే ధ్వని వచ్చునపుడు అర్థముగా విముక్తాంగులు కలది అస్త్రముద్ర అగును. ఈ ముద్రలో తర్జని మధ్యమములు అక్షి స్థానమున ఉండును. వామకరాం గుష్ఠము ఓష్ఠమున లగ్నమై కనిష్ఠిక దక్షిణాంగుష్ఠ సక్తమై, దక్షిణ కనిష్ఠిక చాచియుండి, తర్జని మధ్యమములు కొంచెము ముడిచిచాచినచో వేణు ముద్ర అగును. ఇది అతి రహస్యమైనది. శ్రీహరికి మిక్కిలి ప్రీతికరమైనది. మాలాశ్రీ వత్సకౌస్తుభములు సిద్ధములు కావున ఆ ముద్రలను చెప్పుటలేదు. సముద్రమగు వామాంగుష్ఠమును దక్షిణకరాంగుష్ఠముచే బద్ధమై దక్షిణవామాంగుళులచే అగ్రభాగమును పీడించి, స్వహృదయ పద్మమున గాడబద్ధమై కామబీజమును స్థాపించవలెను. ఇట్లు చేసినచో దీనిని బిల్వముద్ర అందురు. ఇది అతి రహస్యము సకల సుఖకరము. ఇట్లు ముద్రాజ్ఞానముచే కాయికవాచిక మానసిక పాపములన్నియూ నశించును. ఇట్లు ఈ మంత్రమునకు ధ్యానము, జపము, త్రికాల పూజనము చేయవలెను. దశాక్షర అష్ఠాదశాక్షర మంత్రములకు అన్నింటికి ఒకే క్రమము చెప్ప బడినది. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును.

ఉద్దండబాహువై దోర్దండముచే గోవర్ధన పర్వతమును ధరించినవాడు, మరియొక హస్తముచే ధరించిన వేణువునందు మోము చేర్చినవాడు అగు శ్రీకృష్ణుని ధ్యానించుచు మంత్రము జపించి గొడుగు లేకనే వెళ్ళవచ్చును. వర్షముగాలిపిడుగుల నుండి అతనికి భయము కలుగదు. వ్యర్థములగు మేఘసమూహములను చూచి తీసుకొని వెళ్ళునట్లు ఇంద్రుడు చేసిన శ్రీకృష్ణుని స్మరించుచు పదివేల కోణములచే హోమమును చేసినయెడల అనావృష్టి ఏర్పడును. యమునానదీ తీరమున మజ్జన స్నానాదులచే క్రీడించుచున్న, యమునానదీ శీకరములను చల్లుచున్న ప్రియురాళ్ళచే కూడియున్న శ్రీకృష్ణపరమాత్మను ధ్యానించుచు పాలు కల్పిన నీటి తర్పణములచే కాని, హోమముచే కాని పదివేలు చేసినచో అకాలమున కూడా ఆ మహావృష్టి సంభవించును. విస్ఫోటక జ్వరాదులచే దాహమోహాదులచే ఆర్తుడైనవాడు ఈ కృష్ణునిస్మరించుచు జపమును చేసినచో శాంతి కలుగును. లేదా గరుడారూఢుని ప్రద్యుమ్న బలరామ సహితుని, నిజ జ్వరముచే తపించబడుచు స్తోత్రము చేయబడిన అచ్యుతుని ధ్యానించి మంత్రమును జపించినచో జ్వరము కలవాడు జ్వరవిముక్తుడగును. ఇట్లు ధ్యానముచేసి అగ్నియందు చెప్పబడిన చతురంగుళములగు అమృతాఖండములచే హోమము కావించినచో జ్వరశాంతి కలుగును. బాణముల వలన కలుగు భీష్ముని చాపమును హరించు కృష్ణుని ధ్యానించుచు జ్వరార్తుని చేతితో తాకినచో జ్వరశాంతి కలుగును. సాందీపునికి పుత్రుని ఇచ్చుచున్న కృష్ణుని ధ్యానించి పదివేలు హోమము కావించవలెను. అట్లు చేసినచో అపమృత్యువు నశించును. బ్రాహ్మణునకు చనిపోయిన పుత్రులను అర్పించిన అర్జునునితో కూడియున్న శ్రీకృష్ణుని ధ్యానించి లక్ష జపించినచో పుత్ర పౌత్రాదివృద్ధి కలుగును. మధురములగు పుత్రజీవఫలములచే ఆ సమిధలచే వృద్ధి పొందిన అగ్నియందు హోమము గావించినచో దీర్ఘాయుష్మంతులగు పుత్రులు కలిగెదరు. రాత్రియందు పాలు కలచెట్ల ద్రవముచే నిండిన కలశమును పూజించి ప్రాతః కాలమున పదివేలు జపించి ఆ జలముచే పన్నెండు దినములు స్త్రీని అభిషేకించినచో గొడ్రాలు కూడా దీర్ఘాయుష్మంతులగు పుత్రులను పొందును. ప్రాతఃకాలము వాచంయమ అశ్వత్థ పత్రముల దొప్పలోని జలమును అష్టోత్తర శతముచే మంత్రించి పుత్రులను కోరు స్త్రీ ఒక మాసము త్రాగినచో గొడ్రాలు కూడా సర్వ లక్షణ సంపన్నుడగు పుత్రుని పొందును. కాశిరాజుచే పంపబడిన కృత్యను జయించి అతని నగరమునే దహింపచేసిన హరిని భావించుచు, నూనె కలిపిన ఆవాలచే ఏడు దినములు హోమము గావించినచో కృత్యను ప్రయోగించిన వానినే కృత్య నశింపచేయును. రేగి చెట్లుగల దివ్య ఆశ్రమమున ఉండి ఘంటాకర్ణుని శరీరమును స్పృశించుచున్న శ్రీకృష్ణుని ధ్యానించి, త్రిమధుర మిశ్రితములగు తిలలచే లక్ష జపించినచో మహాపాపములు కలవాడైననూ పవిత్రుడగును. ద్యూతా సక్తులగు రుక్మి బలరాములను ద్వేషించుచున్న శ్రీహరిని స్మరించుచు గోమయగులికలచే నిత్యము వేయి చొప్పున ఏడు దినములు హోమము గావించినచో శత్రువులు పరస్పరము ద్వేషించు కొందురు. పారిపోవు శత్రువుల వెంటబడి గరుడారూఢుడై అగ్ని ముఖులగు శరములను వర్షించు శ్రీకృష్ణుని ధ్యానించుచు ఏడు వేలు జపించినచో ఏడు దినములలో శత్రువులకు ఉచ్చాటనము జరుగును. ఆవు దూడ నెత్తి వెల పండ్లను హరించు కృష్ణుని ధ్యానించుచు పదివేలు జపించినచో శత్రూచ్చాటనము వెంటనే జరుగును. సింహాసనము నుండి పడవేసి కంసుని వధించి కంసుని శరీరమును లాగుచున్న కృష్ణుని ద్యానించుచు మంత్రమును జపించి శత్రు జన్మ నక్షత్ర వృక్ష సమిధలచే రాత్రి పూట పదివేలు జపించినచో ఉగ్రుడగు శత్రువుకూడా నశించును. లేదా వేపనూనె కలిపిన అక్షవృక్ష సమిధలచే రాత్రియందు పదివేలు హోమముగావించినచో త్వరలో శత్రునాశము సంభవించును. శ్మశానమున ఏరండతైల మిశ్రితములగు కార్పాసముచే కాని అస్థులచే హోమమును గావించినచో శత్రునాశము కలుగును. మారణకర్మ ప్రశస్తముకాదు. ఒకవేళ చేసినచో మనశ్శాంతి కొఱకు సావధాన మనస్కుడై పదివేలు హోమము కావించవలెను. లేదా పాయసముచే హోమమును చేయవలెను. పారిజాతహరుడగు కృష్ణుని ధ్యానించుచు లక్ష జపించవలెను. అట్లుచేసినవారికి అంతట జయమే కలుగును. పరాజయము కలుగదు. రథము మీద నుండి వ్యాఖ్యా ముద్రకరుడై పార్ధునకు గీతను ఉపదేశించుచున్న కృష్ణుని ధ్యానించుచు తేనె కలిపిన మోదుగు పూవులచే లక్ష హోమమును చేసినచో సకల విద్యా నిష్ణాతుడగును. రాష్ట్ర పుర గ్రామ వస్తువుల రక్షను, ఆత్మ రక్షణను భానుకోటి సమప్రభుడు, విశ్వరూపధరుడు, చామీకర ప్రభుడు, అగ్నిష్టోమాత్మకుడు అర్కాగ్ని ద్యోతితాస్యాంఘ్రి పంకజుడు, దివ్య భూషణుడు, నానాయుధ ధరుడు, విశ్వాకాశావశుడగు కృష్ణుని ధ్యానించుచు లక్ష జపించవలెను. ప్రాతః కాలమున ఎఱ్ఱని అడవి పూలచే కృష్ణుని పూజించి దినమధ్యోక్త విధిచే అష్టోత్తర శతము జపించినచో బ్రాహ్మణులు వశులగుదురు. జాతి పుష్పములచే పూజించినచో క్షత్రియులు, క్రీడారతుడగు కృష్ణుని ధ్యానించుచు ఎఱ్ఱని అశ్వారి పుష్పములచే పూజించినచో వైశ్యులు, నీలోత్పలములచే పూజించినచో శూద్రులు వశులగుదురు. గీత నృత్య రతుడగు కృష్ణుని ధ్యానించుచు నేయి కలిపిన తెల్లని పూవులచే, తండులములచే ఏడు దినములు ప్రతిదినము హోమము గావించి, ఆ భస్మమును ఫాల భాగమున, శిరస్సున ధరించినచో స్త్రీ వశ మగును. స్త్రీ చేసినచో పురుషుడు వశమగును. తాంబూలము, పుష్పము, అంజనము, వస్త్రము, చందనము, ఈ వస్తువులను వేయి మంత్ర జపము కావించి ఏ నరునికి ఇచ్చిన ఆ నరుడు సపుత్ర పశుబాంధవుడుగా వశమగును. గోపికా సహితుడై బృందావనమున నున్న కృష్ణుని ధ్యానించుచు ఉత్తరేణి సమిధలచే హోమము గావించినచో జనులు వశమగుదురు. సద్గురువు నుండి దీక్షను పొంది ఈవిధిచే కృష్ణుని పూజించినచో అష్టసిద్ధీశ్వరుడు అగును. అతనిని చూచినంతనే ప్రతివాదులు తేజోహీనులు అగుదురు. వక్త్రమున సరస్వతి, గృహమున సభాసదులుందురు. ఇహమున పలు భోగములను అనుభవించి అంతమున విష్ణు పదమును చేరును. (3/80)