భక్తివర్ణనం - మార్కండేయ చరిత్ర ఆరంభము

సనక మహర్షి పలికెను: భక్తిచే కూడినప్పుడే అన్ని ధర్మములు కోరిన ఫలములను ఈయగలవు. భక్తిచేతనే అన్నింటిని సాధించవచ్చును. భక్తిచేత శ్రీహరి సంతోషించును. భక్తిచేతనే భక్తిని ఆచరించవలయును. అన్ని పనులను భక్తితో చేయవలయును. భక్తిలేక చేసిన కార్యములు సిద్దించవు. జీవులు పనులు చేయుటకు వెలుగు కారణమైనట్లు అన్ని కార్యసిద్ధులకు భక్తి మూలకారణము. అన్ని ప్రాణులకు నీరు జీవనాధారమైనట్లు అన్ని సిద్ధులకు భక్తి మూలాధారము. భూమిని ఆధారముగా చేసుకొని అన్ని ప్రాణులు జీవించునట్లు, భక్తిని ఆశ్రయించి అన్ని కార్యములను సాధించవలయును. భక్తికలవాడే ధర్మార్థకామమోక్షములను సులభముగా పొందగలడు. భక్తిలేని దానములతో తపములతో బహుదక్షిణలను ఇచ్చు యజ్ఞములతో కూడా శ్రీహరి సంతోషించడు. భక్తిలేక మేరుపర్వతమంత బంగారురాశులను కోట్ల కొలదిగా ఇచ్చిననూ ద్రవ్యనాశము తప్ప ఫలము కలుగదు. భక్తిలేనిదే చేసిన తపస్సు శరీరశోషణే అగును. భక్తిహీనముగా అగ్నిలో ఇచ్చిన హవిస్సు బూడిదలో వేసిన హవిస్సువలె నిష్ఫలమగును. భక్తితో ఎంత చిన్న పనిచేసినను శాశ్వతమైన కీర్తిని, ప్రీతిని కలిగించును. భక్తి హీనముగా వేయి అశ్వమేధ యాగములను చేసినను, వేదవిహిత కర్మలను ఆచరించినను అవి అన్నియు నిష్ఫలములే అగును.

మానవులకు ఉత్తమమైన హరి భక్తియే కామధేనువువలె అన్ని కోరికలను ఇచ్చును. ఆ హరిభక్తి ఉండగా సంసార విషమును అజ్ఞానులు మాత్రమే త్రాగెదరు. నిస్సారమైన ఈ సంసారమున భగవద్భక్తులతో కలిసి ఉండుట, శ్రీహరి భక్తి, ఓర్పు అను ఈ మూడు మాత్రమే సారవంతములు. అసూయ కలవారు చేసెడి దానాదులు, చూపెడి భక్తి నిష్ఫలములే. వారికి శ్రీహరి చాలదూరముగా ఉండును. పరుల సేవచే పరితపించు వారికి, బూటకపు ఆచారమునందు ప్రీతి చూపువారికి, అసత్య కర్మలను ఆచరించువారికి శ్రీహరి దూరముగా ఉండును. మహాధర్మములను గూర్చి సంశయించువారికి, మహా ధర్మములు అసత్యములు అని చెప్పువారికి, ధర్మములందు భక్తిలేని వారికి శ్రీహరి దూరముగా ఉండును. వేదముచే విధించబడినది ధర్మము. వేదము సాక్షాత్తుగా నారాయణ స్వరూపము. ఆ వేదములపై భక్తిలేని వారికి శ్రీహరి దూరముగా ఉండును. ధర్మ హీనములైన దినములను గడుపువాడు లోహకారుని వద్దనుండు తోలుతిత్తి వలె ఊపిరి పీల్చుచు విడుచుచున్ననూ జీవించువాడు కాడు. ధర్మార్థ కామమోక్షములు అను సనాతన పురుషార్థముల యెడ భక్తి కలవారికి మాత్రమే సిద్ధించును. తన ఆచారములను అతిక్రమించక హరిభక్తిగల నరుడు నిత్యసూరులు చూచు శ్రీహరి భవనమునకు చేరగలడు.

ఓ మునీంద్రా, వేదవిహితములు స్వాశ్రమోచితములైన ధర్మములను ఆచరించుచు హరిధ్యాన పరుడైనవాడు పరమపదమును పొందును. ఆచారము నుండి ధర్మము పుట్టును. ధర్మమునకు అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆశ్రమాచారముతో కూడినవాడే శ్రీహరిని పూజించగలడు. వేదములను, వేదాంగములను, వేదాంతములైన ఉపనిషత్తులను చక్కగా అధ్యయనముచేసి అవగతము చేసుకొన్ననూ, ఆచారభ్రష్టుడైనచో కర్మబహిష్కృతుడై పతితుడగును. హరిభక్తి కలవాడైనను హరిధ్యానము చేయువాడైనను తన ఆశ్రమాచారము నుండి భ్రష్టుడైనచో పతితుడు అందురు. వేదము కాని, హరి భక్తి కాని, శివభక్తి కాని ఆచార భ్రష్టుడైన మూఢుని పవిత్రుని చేయజాలదు. పుణ్యక్షేత్రములకు వెళ్ళుట, పుణ్యతీర్థములను సేవించుట, పలు విధములైన యజ్ఞములు, ఇవి అన్నియూ ఆచారమును వదిలినవానిని రక్షించజాలవు. ఆచారము వలన స్వర్గము లభించును. ఆచారము వలన సుఖము లభించును. ఆచారము వలన మోక్షము లభించును. ఆచారము వలన లభించనిదేది? అన్ని ఆచారములను అన్ని యోగములను, చివరికి హరిభక్తికి కూడా మూలము భక్తియే. కోరిన కోరికలనిచ్చు శ్రీమన్నారాయణుడు భక్తిచేతనే పూజించబడును. కావుననే అన్ని లోకములకు భక్తి, మాత అని గానము చేయబడుచున్నది. అన్ని ప్రాణులు తల్లిని ఆశ్రయించి జీవించునట్లు ధార్మికులందరూ భక్తిని ఆశ్రయించి జీవింతురు. స్వాశ్రమాచారము కలవానికి హరిభక్తి కూడా కలిగినచో అతనితో సమానుడు మూడు లోకములలోనూ మరి ఒకడు ఉండడు.

భక్తి చేతనే అన్ని కర్మలూ సిద్ధించును. కర్మలచే శ్రీహరి సంతోషించును. శ్రీహరి సంతోషించినచో జ్ఞానము కలుగును. జ్ఞానము వలన మోక్షము లభించును. భగవద్భక్తుల సంగతితో శ్రీహరిపై భక్తి కలుగును. పూర్వజన్మలలో సంపాదించిన పుణ్యమున్నపుడే భగవద్భక్తుల సంగతి లభించును. వర్ణాశ్రమాచారములయందు ఆసక్తులై భగవద్భక్తియందు ప్రీతికలవారై కామాది దోషములు లేనివారు మాత్రమే లోకమునకు మంచి మార్గమును బోధింతురు. పూర్వజన్మమున పుణ్యము చేయనివారికి సజ్జనులతో స్నేహము కలుగదు. సజ్జన స్నేహము లభించినచో పూర్వజన్మలలో పుణ్యము చేసి ఉన్నారని తెలియ వలయును. పూర్వజన్మలలో చేసిన పాపములు నశించినపుడే సజ్జన స్నేహము లభించును. లేనిచో మరియొక దానితో లభించదు. సూర్యుడు పగటిపూట మాత్రమే బయట కనపడు చీకటిని తన కిరణములతో నశింపచేయగలడు. సజ్జనులు తమ సూక్తులు అను కిరణములతో అన్నివేళలా లోపల అనగా మనసులో దాగియున్న అజ్ఞానమను చీకటినికూడా నశింప చేయుదురు. భగవద్భక్తితో పరవశము నొందు పురుషులు లోకమున చాల అరుదు. ఆ భగవద్భక్తులతో స్నేహము కలిగినవానికి శాంతి శాశ్వతముగా ఉండును.

నారదమహర్షి పలికెను: భగవద్భక్తులు ఎట్లుందురు? వారేమి పని చేసెదరు? వారికే లోకము లభించును? ఈ విషయమంతయు వివరముగా చెప్పుము. దేవదేవుడు చక్రాయుధధారియగు శ్రీమన్నారాయణునకు నీవు పరమభక్తుడవు. ఈ విషయమును నీవు తప్ప ఇతరులు చెప్పలేరు.

సనక మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! పరమ రహస్యమైన మార్కండేయుని చరిత్రను వినుము. యోగనిద్రనుండి మేల్కొనిన జగన్నాథుడు మార్కండేయునితో చెప్పిన మాటలను కూడా వినుము. ఈ శ్రీమహావిష్ణువు సనాతనుడు; దేవదేవుడు; పరంజ్యోతి స్వరూపుడు. జగత్స్వరూపుడు; జగత్తును సృష్టించినవాడు. శివ, బ్రహ్మ స్వరూపములతో ఉండువాడు. యుగాంతమున రుద్ర రూపముతో బ్రహ్మాండమును ఆరగించును. అపుడు స్థావరజంగమములు నశించి ఈ ప్రపంచ మంతయు సముద్రముగా ఉండును. ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే మిగిలియుండి మఱ్ఱి ఆకుపై పరుండి ఉండును. లెక్కలేని బ్రహ్మాదులు శరీరమునందలి రోమకూపములందు నివాస మేర్పరచుకొని స్వామిని అలంకరించి ఉందురు. కాలిబొటనవేలు కొననుండి బయలదేరిన గంగానది యొక్క చల్లని నీటితో పవిత్రము చేయుచు సూక్ష్మములకంటే సూక్ష్మరూపుడై బ్రహ్మాండమును మింగి మఱ్ఱి ఆకుపై పరుండి ఉండును. శ్రీమన్నారాయణుడు మాత్రమే సర్వశక్తి సమన్వితుడుగా ఉండును. శ్రీమన్నారాయణుడు ఉన్న ఆస్థానమున మహానుభావుడు నారాయణ భక్తుడు అయిన మార్కండేయ మహర్షి ఉండి పరమేశ్వరుని లీలలను చూచుచుండెను.

ఋషులు పలికిరి: ఓ సూతమహర్షీ! అ ప్రళయకాలమున స్థావర జంగములు అన్నియు నశించగా కేవలము శ్రీమన్నారాయణుడు మాత్రమే మిగిలి ఉండెనని మొదట విని ఉంటిమి. ఈ ప్రపంచమంతయు జలమయమై ఉండగా స్థావరజంగమాత్మకమైన ప్రపంచమంతటిని మింగిన శ్రీమన్నారాయణుడు మార్కండేయుని ఎందుకు మిగిలించెను? ఈ విషయమును తెలుసుకొన వలయునని మాకు చాల కుతూహలముగా ఉన్నది. శ్రీమన్నారాయణుని కీర్తి అను అమృతమును పానము చేయుటలో అలసట ఎవరికి కలుగును?

సూతమహర్షి పలికెను: మహానుభావుడగు మృకండువు అను పేరుగల సుప్రసిద్దుడు ఉండెను. ఆ మృకండువు సత్యసంధుడు; జితేంద్రియుడు. ఓర్పుగలవాడు. అన్ని ప్రాణులను తనవలె చూచుచు సంసార విషయ భోగములందు ఆశ లేనివాడై అన్ని ప్రాణుల హితమును కోరుచు అంతరింద్రియ నిగ్రహము కలవాడై శాలగ్రామమను మహాతీర్థమున పదివేల సంవత్సరములు సనాతనుడైన సగుణబ్రహ్మను గూర్చి నిరాహారుడై, తపస్సు చేసెను. అతని తపస్సును చూచి ఇంద్రాది దేవతలు శంకించి, ఆర్తినాశనుడగు శ్రీమన్నారాయణుని శరణు వేడిరి. దేవతలందరు పాలసముద్రపు ఆవలి తీరమును చేరి జగద్గురువు పద్మనాభుడు దేవదేవుడగు శ్రీమన్నారాయణుని స్తోత్రము చేసిరి.

దేవతలు పలికిరి: క్షయము, అంతములేని ఓ నారాయణా! శరణు వేడినవారిని రక్షించువాడా! మృకండు మహర్షిచేయు తపస్సుచే భయపడి నిన్నుశరణుకోరిన మమ్ములను కాపాడుము. దేవతలకు, అధిదేవతలకు ప్రభువువు నీవే! నీవే శంఖగది ఆయుధములను ధరించి ఉందువు. నీకు జయమగు గాక! బ్రహ్మాండమునకు కారణభూతుడవు, లోక స్వరూపుడవు అయిన నీకు జయము. ఓ దేవదేవేశా! ఓ లోకపావనా! నీకు నమస్కారము. లోకనాథుడవు లోకసాక్షివి అయిన నీకు నమస్కారము. కేశి, మధు మొదలగు రాక్షసులను చంపినవాడవు పరమాత్మవు అయిన నీకు నమస్కారము. చైతన్య స్వరూపుడవు, భూమ్యాకాశాది పంచభూత స్వరూపుడవైన నీకు నమస్కారము. అందరిలో జ్యేష్ఠుడవు, పరిశుద్ధుడవు, నిర్గుణుడవు అయినను గుణాత్మకుడవైన నీకు నమస్కారము. రూప రహితుడవు, మంచి రూపము గలవాడవు, అనేక రూపములుకల వాడవు అయిన నీకు నమస్కారము. బ్రాహ్మణులయందు ప్రీతి గలవాడవు. గోవులకు బ్రాహ్మణులకు హితమును చేయువాడవు, జగత్తునకు హితమును కలిగించువాడవు అయిన కృష్ణుడవైన నీకు నమస్కారము. హిరణ్యగర్భుడవు, బ్రహ్మాది దేవతారూపుడవు, సూర్యాది దేవతారూపుడవు, హవ్యమును కవ్యమును భుజించువాడవు అయిన నీకు నమస్కారము. నిత్యుడవు. అందరిచే నమస్కరించబడువాడవు, ఎప్పుడూ ఆనంద స్వరూపుడవు అయిన నీకు నమస్కారము. తలచినవారి ఆర్తిని నశింపచేయు నీకు మాటిమాటికి నమస్కారము.

ఇట్లు దేవతలు చేయు స్తోత్రమును విని భగవంతుడగు లక్ష్మీపతి శంఖ చక్రగాదాదులను ధరించినవాడై వారికి ప్రత్యక్షమాయెను. వికసించిన పద్మములవలె విశాలమైన నేత్రములు గల వానిని, కోటి సూర్యులతో సమానమైన కాంతిగలవానిని, అన్ని అలంకారములు కలవానిని శ్రీవత్సము అను పుట్టుమచ్చ వక్షస్థ్సలమున కలవానిని, పీతాంబరధారిని సువర్ణయజ్ఞోపవీతమును ధరించి ఉన్నవానిని, సౌమ్యుని మునులచే స్తోత్రము చేయబడుచున్నవానిని, ద్వారపాలక శ్రేష్ఠులతో కూడి యున్న వానిని, శ్రీమన్నారాయణుని చూచి స్వామితేజస్సుచే తమ తేజస్సు మందగించగా ఆనందముతో సాష్టాంగముగా భూమి మీదపడి నమస్కరించిరి. అపుడు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడవై దేవతలకు ప్రీతి కలిగించుచు మేఘగంభీరనాదముతో ఇంద్రాది దేవతలతో ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: “ఓ దేవతలారా! మృకండుమహర్షి చేయు తపస్సు వలన మీ మనసులో కలిగిన భయమును నేనెరుగుదును. అ మృకండుమహర్షి సజ్జనులలో శ్రేష్ఠుడు. కావున మిమ్ములను బాధింపడు. సజ్జనులు సంపదలొచ్చిననూ, ఆపదలొచ్చినను ఎప్పుడూ కలలో కూడా ఇతరులను బాధించరు. సంసార విషయములు అను శత్రువులు ఎప్పుడూ బాధించుచున్ననూ, తనరక్షను తాను ఏర్పరచు కొనని సజ్జనుడు ఇతరుల ఎట్లు బాధించును? తాపత్రయములచే బాధించబడు ఉత్తమ మానవుడు ఇతరుల ఎట్లు బాధించగలడు? ఎప్పుడూ కామాదులు కలిగినవాడై కర్మచే, మనసుచే, మాటలచే అన్ని వేళలా ఇతరులను బాధించువాడు మూర్ఖుడు అనబడును. ఓ సజ్జనులారా! లోకమునకు హితము చేయుచు, మాత్సర్యములేని మానవుని నిశ్శంకుడు అని సజ్జనులు ఈ లోకమున, పరలోకమున చెప్పెదరు. సశంకుడు ఎప్పుడూ ధుఃఖము కలిగియే ఉండును. నిశ్శంకుడు సుఖమునే పొందును. కావున స్వస్థమనస్కులై మీ గృహములకు వెళ్ళుడు. మృకండు మహర్షి మిమ్ములను బాధించడు. నేను మీకు రక్షకుడను. కావున మీరు కోరిన విధముగా విహరించుడు అని నల్ల అవిసెపూవువన్నె గల శ్రీమన్నారాయణుడు వారికి వరము నిచ్చి దేవతలందరూ చూచుచుండగనే అక్కడనే అంతర్ధానమాయెను. సంతోషము నిండిన మనస్సు గలవారై దేవతలు కూడా వచ్చిన దారినే స్వర్గమునకు వెళ్ళిరి.

శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షి చేసిన తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమాయెను. రూపరహితుడు, పరబ్రహ్మ, స్వయప్రకాశుడు, ప్రకృతి సంబంధము అంటనివాడు నల్ల అవిశపూవు వంటి శరీర ఛాయ గలవాడు పీతాంబరధారి, దివ్యాయుధములను ధరించినవాడు అచ్యుతుడు అయిన శ్రీమన్నారాయణుని చూచి అతడు ఆశ్చర్యము నొందెను. ధ్యానములో నుండి కనులు తెరిచి ప్రసన్నమైన ముఖముతో శాంతుడు, ప్రపంచమును తనలో ధరించువాడు, ప్రపంచమును ప్రకాశింపచేయు తేజోమూర్తి, అయిన శ్రీహరిని ఎదురుగా చూచెను. స్వామిని చూచిన ఆనందముతో నిలువెల్లా పులకలురాగా ఆనందాశ్రువులు కనులనిండగా సనాతనుడు దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణునికి దండవత్ప్రణామము లాచరించెను. ఆనందాశ్రుజలముచే శ్రీమన్నారాయణుని పాదములను కడుగుచు తలపై దోసిలి ఒగ్గి స్తోత్రము చేయ నారంభించెను.

మృకండు మహర్షి పలికెను: పరమాత్మ రూపుడు పరేశుడు, మూల ప్రకృతి మహ దహంకారములకంటే పరముగా ఉండువాడు, పారములేనివారికి పారమైనవాడు, పరులను అనుసరించువాడు, పరులకంటే పరులనుకూడా తరింపచేయువాడు అయిన శ్రీమన్నారాయణునకు నమస్కారము. నామము జాతి మొదలగు భేదములు లేనివాడు, శబ్దస్పర్శ రూప రసగంధాదుల దోషములులేనివాడు, పలురూపములతో ఉన్ననూ ఏ సంబంధమూ అంటనివాడు, పరమేశ్వరుడు, స్తుతిపాత్రుడు అగు శ్రీమన్నారాయణునికి నమస్కారము. వేదాంతములతో తెలియబడువాడు, పురాణపురుషుడు, బ్రహ్మ మొదలు సమస్త ప్రపంచస్వరూపములతో ఉండువాడు, సాటిలేనివాడు, భక్తజనులను అనుగ్రహించువాడు, ఆదిదేవుడు సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని సేవించెదను. అన్ని దోషములు తొలగినవారు, ధ్యానమునందే ఉండువారు, ఆశను వదలినవారు, మోహము తొలగినవారు మాత్రమే చూడగలుగు పరమ పవిత్రుడు సంసారనివర్తకుడు అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాను. తలచు వారి ఆర్తిని తొలగించువాడు, శరణువేడిన వారిని కాపాడువాడు జగత్తుచే సేవించబడువాడు, జగత్తు నివాసముగా గలవాడు, దయాలవాలుడు, పరేశుడు అయిన శ్రీమహా విష్ణువునకు నమస్కరించుచున్నాను.

శంఖచక్రగదాధరుడైన శ్రీమహావిష్ణువు మృకండుమహర్షి చేసిన స్తోత్రముచే మిక్కిలి సంతోషించెను. తన పొడవైన నాలుగు చేతులతో మృకండు మహర్షిని ఆలింగనము చేసుకొని మిక్కిలి సంతోషముతో ఓ! సువ్రత! వరమును కోరుము. పాపరహితుడవైన నీవు చేసిన తపస్సుచే స్తోత్రముచే నేను సంతోషించితిని. కావున నీ మనసులో కోరిన వరమును అడుగుము అని పలికెను.

మృకండుమహర్షి పలికెను: ఓ దేవదేవా! జగన్నాథా! పుణ్యము లేని వారలకు నీ దర్శనము దుర్లభమని శాస్త్రములు చెప్పుటచే, నీ దర్శనమును పొందిన నేను కృతార్థుడను అయితిని. ఈ విషయమున ఏ మాత్రము సంశయములేదు. బ్రహ్మ మొదలగు దేవతలు, యోగులు, వ్రతములను ఆచరించువారు, ధర్మాత్ములు, దీక్షితులు, కోరికలు ఉడిగినవారు, మాత్సర్యము తొలగినవారు చూడలేని పరంధాముని చూడగలుగుచున్నాను. ఇంతకంటే ఏ వరమును కోరెదను. ఓ జగద్గురూ! జనార్దనా! ఈ దర్శనము చేతనే కృతార్థతనందితిని. మహాపాపాత్ములు కూడా నీనామస్మరణ మాత్రమున పరమ పదమును పొందెదరు అన్న నీ దర్శనము పొందిన వారి విషయము ఏమి చెప్పవలయును?

శ్రీమన్నారాయణభగవానుడు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీవు సత్యమునే పలికితివి. ఓ పండితా! నీ విషయమున ప్రీతి నొందితిని. నా దర్శనమెప్పుడూ వ్యర్థము కాదు. శ్రీమహావిష్ణువు భక్తకుటుంబి అని జ్ఞానులు చెప్పుచుందురు. ఆ మాటనే పాటించెదను. నా భక్తులు అబద్ధము ఆడకూడదు కదా! కావున నీ తపస్సుకు సంతోషించిన నేను నీకు పుత్రుడుగా జన్మించెదను. అన్ని గుణములు కలవాడుగా, చిరంజీవిగా, చక్కని రూపము కలవాడుగా పుట్టెదను. నేను ఏ కులములో పుట్టెదనో ఆ కులము మోక్షమును పొందును. నేను సంతోషించిన తరువాత ఈ మూడు లోకములలో సాధింపరానిది, లేనిది ఏముండును? దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుడు ఇల్లు పలికి ఆ మృకండు మహర్షి చూచుచుండగా అక్కడే అంతర్థానమాయెను. మృకండు మహర్షికూడా తన తపస్సు నుండి విరమించెను. (1/4)