నారద మహా పురాణము
ద్వాదశమాసస్థిత నవమీ వ్రత కథనము
సనాతన మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు నీకు నవమీ వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములను ఆచరించిన నరులు వాంఛితార్ధములను పొందెదరు. చైత్ర శుక్ల నవమినాడు శ్రీరామనవమీ వ్రతము చెప్పబడినది. శక్తికల భక్తుడు ఆనాడు ఉపవసించవలెను. శక్తిలేనివాడు మధ్యాహ్నోత్సవము తరువాత ఒకసారి భుజించవచ్చును. బ్రాహ్మణులను మృష్టాన్నములచే భుజింపచేసి రామునికి ప్రీతి కలిగించవలెను. గో భూ హిరణ్య తిల వస్త్రాలంకరణాదులతో విప్రులను పూజించవలెను. ఇట్లు శ్రీరామ నవమీవ్రతము ఆచరించువాడు ఇహలోకమున చేసిన పాపముల నుండి విముక్తుడై శ్రీవిష్ణులోకమును చేరును. ఈ దినమున మాతృవ్రతము కూడా చెప్పబడినది. భైరవునితో కలిసియున్న అరువది నాలుగు మంది యోగినులను స్రక్ గంధ పస్త్ర నైవేద్యములతో పూజించవలెను. ఈ రోజే భద్రకాళి యోగినులకు అందరికి అధినాయకురాలిగా అభిషేకించబడినది. కావున ఈ రోజు ఉపవసించి జితేంద్రియుడై భద్రకాళిని పూజించవలెను. ఇక వైశాఖ మాసమున రెండు పక్షములలోని నవమియందు చండికను పూజించినవాడు యథావిధిగా విమానమును అధిరోహించి దేవలోకమునుచేరి దేవతలతోకలిసి ఆనందించును. జ్యేష్ఠశుక్ల నవమి నాడు ఉపవసించి యధావిధిగా పార్వతీదేవిని పూజించి కన్యకలను, బ్రాహ్మణులను భుజింపచేసి శక్తికొలది దక్షిణనిచ్చి తాను పాలతో వరి అన్నమును భుజింపవలెను. ఈ ఉమా వ్రతమును యధావిధిగా ఆచరించినవాడు ఇహలోకమున అన్ని భోగములను అనుభవించి అంతకాలమున స్వర్గమును పొందును. ఆషాఢ మాసమున రెండు పక్షముల నవములలో రాత్రియందు ఐరావతము నధిరోహించి ఉన్న ఇంద్రుని భార్య అగు శచీదేవిని పూజించినచో దేవలోక భోగములను అనుభవించును. దివి విమానమును అధిరోహించి సంచరించుచుండును. శ్రావణ మాసమున రెండు పక్షముల నవములలో ఉపవసించి కుమారియగు చండికను గంధ పుష్ప ధూప దీప నైవేద్యములచే పూజించి కన్యకలను భుజింపచేయవలెను. ఇట్లు భక్తిచే కౌమారీ వ్రతమును ఆచరించిన వాడు విమానముతో దేవలోకమును చేరును. భాద్రపద శుద్ధ నవమి నందా అనబడును. ఈ నవమినాడు యధావిధిగా షోడవోపచారముచే దుర్గాదేవిని పూజించినవాడు అశ్వమేధ ఫలమును పొంది విష్ణు లోకమున నివసించును. ఆశ్వయుజ శుద్ధ నవమి మహానవమి అనబడును. ఈ దినమున అపరాహ్ణమున తూర్పుదిక్కున శమీపూజను చేయవలెను. తరువాత రాత్రిపూట మొదటి ఝామున ఖడ్గమును, ధనువును, శరములు, గదను, శూలమును, శక్తిని, పరిశును, చిన్నకత్తిని, చర్మమును, ఖేటకమును, ఛత్రమును, ధ్వజమును, జగమును, అశ్వమును, గోవృషమును, పుస్తకమును, తులను, దండపాశములను, శంఖచక్రములను గంధాద్యుపచారములచే పూజించి మహిషమును భద్రకాళికి సమర్పించవలెను. ఇట్లు బలినిచ్చి బ్రాహ్మణులకు పక్వాన్నమును భుజింపచేసి దక్షిణనిచ్చి తాను భుజించి వ్రత సమాప్తి కావించవలెను. ఇట్లు మానవుల దుర్గతిని నశింపచేయు దుర్గను పూజించు వాడు ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున స్వర్గమును పొందును. కార్తీక శుక్లనవమిని అక్షయ నవమి అందురు. ఈ రోజు రాగిచెట్టు మొదట చక్కగా తర్పణము చేయవలెను. దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణ గావించవలెను. స్వశాఖోక్త మంత్రములతో సూర్యునకు అర్ఘ్యప్రదానము గావించవలెను. తరువాత బ్రాహ్మణులను మృష్టాన్నములతో భుజింపచేసి దక్షిణనిచ్చి తాను భుజించి విహరించవలెను. ఇట్లు భక్తితో జపదాన ద్విజార్చనలను గావించినచో అవి యన్నియూ అనన్త ఫలప్రదములగును. మార్గశిర శుద్ధ నవమినాడు నందిని అందురు. ఈ రోజు ఉపవసించి జగదంబను పూజించవలెను. ఇట్లు చేసినవాడు అశ్వమేథ ఫలమును పొందును. పుష్య శుక్ల నవమినాడు మహామాయను భక్తితో పూజించినవాడు వాజపేయ ఫలమును పొందును. మాఘశుక్ల నవమినాడు మహానందా యనబడును. సదానందకరి అగును. ఈ దినమున స్నానము, దానము, జపము, హోమము, ఉపవాసము చేసిన అంతయు అక్షయము అగును. ఫాల్గుణ శుక్లనవమి ఆనందా యనబడును. ఈ నవమి మహాపుణ్యా సర్వపాపహర. ఉపవసించి ఆనందను పూజించ వలెను. అట్లు చేసినచో వాంఛితార్ధములను పొందును. ఇది ముమ్మాటికి నిజము. (4/118)