నారద మహా పురాణము
తీర్థయాత్రా వర్ణనము
వసువు పలికెను: ఆ పీఠమునకు వాయవ్య దిగ్భాగమున సగరునిచే చతుర్ముఖ లింగము స్థాపించబడినది. సాగర సంగమమునకు వాయుకోణమున భద్రదేహ సరస్సు కలదు. ఈ సరస్సు గోక్షీరముచే ఏర్పడినది. సర్వ పాతక నాశనము. ఈ భద్రహ్రదమున స్నానమాచరించిన సహస్రకపిల గోదాన ఫలము కలుగును. పూర్ణిమరోజున పూర్వాభాద్ర నక్షత్రము కలిగినచో అది చాలా పుణ్యతమ కాలము. ఈనాడు స్నానమాచరించిన అశ్వమేధ ఫలము కలుగును. ఇచట భీష్మచండిక అను దేవి ప్రసిద్ధి చెందినది. శ్మశానమున భీష్మచండికను పూజించినవాడు దుర్గతిని పొందడు. అంతకేశ్వరునకు పూర్వభాగమున సర్వేశ్వరునకు దక్షిణ భాగమున మాతలీశ్వరునకు ఉత్తరమున కృత్తివాసేశ్వరుడు కలడు. కృత్తివాస క్షేత్రమున కృత్తివాసేశ్వరుని దర్శించి, అతనిని చక్కగా పూజించి ఒకే జన్మలో ఉత్తమగతిని పొందును. పూర్వజన్మకృత పాపము తపస్సుతో కూడా నశించదు. కాని కృత్తివాసేశ్వరలింగ దర్శనము వలన నశించును. కృతయుగమున త్ర్యంబక నామమున, త్రేతాయుగమున కృత్తివాసుడని, ద్వాపరమున మహేశ్వరుడని, కలియుగమున హస్తిపాలేశ్వరుడని గానము చేయబడును. కృత్తివాసేశ్వరుని పలుమార్లు దర్శించవలెను. శాశ్వతము అమృత ప్రదమగు తారక జ్ఞానమును కోరినచో దర్శనము అవశక్యకము. దేవదేవుని దర్శనము వలన బ్రహ్మఘ్నుడు కూడా ముక్తిని పొందును. దేవదేవుని స్పృశించిన, పూజించిన సర్వయజ్ఞ ఫలము లభించును. సనాతనుడగు ఈ పరదేవుని శ్రద్ధచే అర్చించినవాడు, విశేషించి ఫాల్గుణ బహుళచతుర్దశినాడు సావధానులై పత్ర పుష్ప ఫలములచే భక్ష్యములచే క్షీర దధి, మృత జలములచే శివలింగమును తర్పణచేసి పూజించినవారు, దుండుకార నమస్కారములతో, నృత్యగీతములతో, అనేక విధ ముఖ్య వాద్యములచే, స్తోత్రములచే, మంత్రములచే సేవించి ఉత్తమభక్తిచే ఒకరాత్రి ఉపవసించినవారు, పూజించినవారు పరమస్థానమును పొందెదరు. చైత్ర అమావాస్యనాడు పరమేశ్వరుని అర్చించువారు కుబేరుని చేరి కుబేరునివలె విహరించును. వైశాఖ చతుర్దశినాడు భక్తియుతుడై శివుని పూజించినచో వైశాఖ లోకమునుచేరి కుబేరునివలె విహరించును. వైశాఖ చతుర్దశినాడు భక్తియుతుడై శివుని పూజించినచో వైశాఖ లోకమునుచేరి విశాఖునికి సేవకుడగును. జ్యేష్ఠ చతుర్దశినాడు శ్రద్ధతో హరుని పూజించినవారు ప్రళయ కాలమువరకు స్వర్గమున నివసించును. ఆషాఢ చతుర్దశినాడు భక్తితో శివుని పూజించువాడు సూర్యలోకమును పొంది యధేచ్ఛగా క్రీడించును. శ్రావణ చతుర్దశినాడు ఉద్భవించిన కామ లింగమును పూజించినవాడు వరుణ లోకమునుచేరి అప్సరసలతో క్రీడించును. భాద్రపద మాసమున శంకరుని వివిధ ఫలపుష్పములచే పూజించి ఇంద్ర లోకమును పొందును. భాద్రపద బహుళ చతుర్దశినాడు ఈశ్వరుని పూజించి పితృలోకమును పొంది వారితో విహరించును. కార్తిక మాసమున మహేశ్వరుని పూజించి చంద్రలోకమును చేరి యధేచ్ఛగా విహరించును. మార్గశీర్ష బహుళ పక్షమున పినాకిని పూజించి విష్ణులోకమును పొంది అనంత కాలము క్రీడించును. పుష్యమాసమున సంతోషముతో స్థాణువును పూజించి నిబ్రుతి లోకమును చేరి నైఋతులతో విహరించును మాఘ మాసమున పుష్పమూల ఫలములచే శివుని పూజించి శివలోకమును చేరును. సంసార సాగరమును వీడును. శంకరలోకమును కోరువారు ప్రయత్న పూర్వకముగా కృత్తివాసేశ్వరుని పూజించవలెను. అవిముక్తమున నివసించవలెను. వ్యాసేశుని పశ్చిమ భాగమున నున్న ఘంటాకర్ణ హ్రదమున స్నానమాడి వ్యాసేశుని దర్శించువారు ఎక్కడ మృతి చెందిననూ వారాణసీమృతి ఫలము లభించును. దండఖాతమున స్నానమాడి స్వపితరులకు తర్పణము గావించి నరకమున నున్న వారు కూడా పితృలోకమును చేరెదరు. పిశాచత్వమును పొందిన పాపకర్ములు కూడా పిండప్రదానముచే దేహోద్ధరణము జరుగును. దండఖాత దర్శనముచే కృతకృత్యుడు అగును. ఇచటనే లోకసుఖ ప్రదయగు లలితాదేవి కలదు. అచటనుండి లలితా దేవిని పూజించిన వారికి ఆ దేవి వివిధ భోగములను ఇచ్చును. దీపములచే ఆమె ముందు జాగరణమును చేసినవారికి ఆమె అక్షయ లోకములను ప్రసాదించును. ఆలయమును నిర్మించువారికి, మార్జనము చేసిన వారికి అష్టసహస్ర సువర్ణముల ఫలము లభించును. లలితాదేవిని ఉద్దేశించి వేద పారగులగు బ్రాహ్మణులను భుజింపచేసిన వారికి కలుగు పుణ్య ఫలమును చెప్పెదను వినుము.
ఒక కల్పకాలము దుర్గాలోకమున నివసించి మరల భూలోకమునకు వచ్చును. నరునిగా కాని నారిగా కాని పుట్టును. సర్వభోగ సమన్వితముగా ధనధాన్య యుక్తముగా పుట్టును. మహా కులములో పుట్టును. సౌభాగ్యము సౌందర్యము రూప యౌవనములు కలిగి సర్వ సౌఖ్యములను పొందెదరు. విద్యుత్సంపాత చంచలమగు దుర్లభమగు మానుష్యమును పొందినవారు లలితాదేవిని పూజించినచో మరల పుట్టరు. భూ ప్రదక్షిణము వలన కలుగు ఫలము వారాణినిలో లలితాదర్శనము వలన కలుగును. ప్రతిమాసమున చతుర్ధినాడు తత్కాలముగా ఉపవసించి లలితాదేవిని పూజించి జాగరణము చేయవలెను. ఇట్లు చేసినవానికి సకలసమృద్ధి కలుగును. లోకత్రయముచే పూజించ బడును. సర్వసిద్ధి ప్రదుడగు నలకూబర కేశుని చక్కగా పూజించినవాడు కృతకృత్యుడు అగును. నలకూబర కేశునికి దక్షిణ భాగమును మణికర్ణి కలదు. మణికర్ణి అగ్రభాగమును సర్వపాప ప్రణాశక మగు తీర్ధముకలదు. కుండమధ్యనున్న మణికర్ణిశ్వరదేవుని దర్శించి నమస్కరించి చక్కగా పూజించినవారు మరల గర్భవాసమును అనుభవించరు. ఇచటికి దక్షిణ భాగమును గంగయందు స్థాపించబడియున్న పరుడగు గంగేశ్వరుని చక్కగా పూజించి సురలోకమును పొందును. వారాణసిలో మరియొక ఆయతనము కలదు. ఇచట దేవదేవుని రుచిర స్థానము కలదు. అంతరిక్షమున నుండు రాక్షసులు శివలింగమును తీసుకొని వేగముగ వెళ్ళుచుండగా ఈ ప్రదేశమును చేరగానే దేవదేవుడు ఆలోచించెను. నాకు అవిముక్త క్షేత్రములతో వియోగము సంభవించరాదని తలచెను. ఈ విషయమును దేవదేవుడు విచారించుచుండగా అచట కుక్కుట శబ్దము వినవచ్చెను. ఆ శబ్దమును వినిన రాక్షసులు భీతిచెందినవారై ప్రభాత సమయమున అచటనే లింగమును విడిచి పారిపోయిరి. రాక్షసులు వెళ్ళిపోగా శివలింగము అచటనే యుండెను. అతిరుచిరము స్వచ్ఛము అగు స్థానమున దేవదేవుడు స్వయంప్రభువు అవిముక్త క్షేత్రమున ఉండుటచేఆ క్షేత్రము అవిముక్తతర మాయెను. అపుడు దేవదేవునికి దేవతలు 'అవిముక్త' అని పుణ్యాక్షరూఢ్యమగు నామమును పెట్టిరి. ఈ నామము స్థావర జంగమములకు మోక్షప్రదము. ఇచట మరణించినవారికి వెంటనే ముక్తిని ప్రసాదించును. ఇచటనే కుక్కుటములు కూడా ఉండును. ఇప్పటికి ఇచట కుక్కుటములు పుణ్యాత్ములచే పూజించబడు చుండును. కోరి అవిముక్తమును ఆశ్రయించినవానికి కల్పకోటి శతములలోకూడా పునర్జన్మ కలుగదు. ఇచట దేవదేవుని దక్షిణ భాగమున నున్న వాపీ జలమును పానముచేసినవారికి కూడా పునరావృత్తి ఉండదు. ఇచట పురుషుని హృదయమున ఉన్న లింగత్రయ జలమును పానముచేసిన వారు కృతార్ధులు అగుదురు. వారికి తారక జ్ఞానము కలుగును. వాపీ జలమున స్నానమాడి దండకేశ్వరుని దర్శించి తరువాత అవిముక్త దర్శనమును చేసుకొనిన వానికి క్షణకాలమున కైవల్యము లభించును. ఇచట బ్రాహ్మణుడు ఒకమారు సంద్యోపాసన కావించినచో అరువది అయిదు సంవత్సరములు సంధ్యోపాసన చేసినవాడగును. వారాణసీ పురమును, అవిముక్తక శ్మశానమును, అవిముక్తేశ్వరుని దర్శించినవాడు గణపతి యగును. ఇచట అవిముక్తేశ్వర లింగమును దర్శించిన మానవుడు వెంటనే పాపములచే, రోగములచే, పశుపాశములచే విముక్తుడగును. అవిముక్త క్షేత్రాగ్ర భాగమున పశ్చాన్ముఖముగా నున్న లింగమును, ఆ అవిముక్తమును, లక్షణేశ్వరుని దర్శించినంతనే నరుడు జ్ఞాని అగును. ఇచటికి ఉత్తరమున చతుర్ముఖ లింగము కలదు. ఈ లింగమునకు చతుర్ధేశ్వరుడని పేరు. ఈ నామము పాపమును భయమును తొలగించును. వారాణసీయను క్షేత్రము భూ లోకమున ప్రాణులకు ముక్తిని ప్రసాదించునది. ఇక ఇచటి అవిముక్తేశ్వరము జీవన్ముక్తముగా పేరుగాంచినది. ఎచటనున్న వాడైనను దర్శనమాత్రమున గణపతి అగును. ఇచట ప్రాణములను విడిచిన వారు ఆత్యంతిక ముక్తిని పొందెదరు. ఈ అభ్యంతర క్షేత్రమున ప్రథమా వరణము కలదు. ద్వితీయా వరణమున ప్రాగ్దిశలో మణికర్ణికా తీర్ధముకలదు. ఇచట ఏడు కోట్ల లింగములు కలవు. ఈ లింగములను దర్శించినంతనే యజ్ఞఫలము పొందును. ఇవి సిద్ధ లింగములు. ఇట్లే పవిత్రములగు కూపములు, హ్రదములు, వాపులు, నదులు, కుండములు, చాలా కలవు. వీటియందు సావధానుడై స్నానమాచరించువాడు, లింగములను స్పృశించువాడు మరల సంసారమున ప్రవేశించ జాలడు. పృథివియందు అంతరిక్షమునందుగల అన్ని తీర్ధములలో కొన్ని ముఖ్య తీర్ధములను నీకు తెలిపితిని. పాపనాశినియగు తీర్ధయాత్రను చెప్పితిని. ఈ తీర్ధయాత్రను చేసినవారు చూచినవారు ముక్తిని పొందెదరు. అవిముక్త తీర్ధము మధ్యమావరణ మనబడును. దీనినే కంటకము అందురు. ఇదియే మృత్యుకాలమున అమృత ప్రదమని ప్రసిద్ధిగాంచినది. (II/49)