సేతు మాహాత్మ్యము

మోహిని పలికెను: బ్రాహ్మణోత్తమా! బాగు! బాగు! మానవులకు పాపములను హరించి పుణ్యమును పెంపొందించు రామాయణమును వినిపించితిరి. ఇక ఇపుడు ఉత్తమమగు సేతుమాహాత్మ్యమును వినగోరుచున్నాను.

వసువు పలికెను: ఓ మోహినీ! ఉత్తమమగు సేతుమాహాత్మ్యమును చెప్పెదను వినుము. సేతువును దర్శించిన వారు సంసార సాగరమునుండి విముక్తులు అగుదురు. రామేశ్వరుడు నివసించియున్న సేతు సందర్శనము పరమ పుణ్యప్రదము. రామేశ్వరుని దర్శన మాత్రముననే అమరత్వము లభించును. నియత మనస్కుడై రామేశ్వరుని పూజించినవారు సర్వ కామనలను పొందెదరు. ఇచటనే పాపనాశనమగు చక్ర తీర్థము కూడా కలదు. ఇచట ఆచరించిన స్నానదానజపహోమాదులు అనన్త్యమును ప్రసాదించును. తాళ తీర్థమును చేరి నియతమనస్కుడై స్నానమాడిన వాడు ఉత్తమ జన్మను పొంది, స్వర్గమున దేవతల వలె ఆనందించును. తరువాత పాప వినాశనమను తీర్థమును తీర్థమును చేరి స్నానమాడిన వారు స్వర్గమున అనందించెదరు. తరువాత సీతాకుండమును చేరి చక్కగా స్నానమాచరించి పితరులను దేవతలను తృప్తిపరిచి సర్వ కామనలను పొందగలడు. మంగళ తీర్థమునుచేరి స్నానమాడినవారు పాపవిముక్తులు అగుదురు. అమరవాపిలో స్నానమాడిన వారు అమృతత్వమును పొందెదరు. లక్ష్మణ తీర్థమునస్నానమాడినవారు యోగగతిని పొందెదరు. జటాతీర్థమున స్నానమాడినవారు రోగరహితులు అగుదురు. హనుమత్కుండమున స్నానమాడిన వారు అజేయులగుదురు. అగస్త్య తీర్థమున స్నానమాడినవారు పుత్రవంతులు ధనవంతులు అయ్యెదరు. రామకుండమున స్నానమాడి రామసాలోక్యమును పొందెదరు. లక్ష్మీ తీర్థాభిషేకముతో లక్ష్మీవంతుడు రూపవంతుడు అగును. అగ్ని తీర్ధమున స్నానమాడి సర్వకిల్బిష వినిర్ముక్తుడగును. శివతీర్థమున స్నానముచే శివలోకమును చేరును. శంఖతీర్థమున స్నానమాడిన వాడు దుర్గతిని పొందడు. యమునానది తీర్థములందు స్నానమాడిన స్వర్గమును పొందును. కోటి తీర్థమున స్నానమాడి సర్వతీర్థ ఫలమును పొందును. సాధ్యామృతమున స్నానమాడి సాధ్యసాలోక్యమును పొందును. సర్వతీర్థమున స్నానమాడి సకలాభీష్టములను పొందును. ధనుష్కోటిలో యధావిధిగా స్నానమాడిన బంధ విముక్తుడగును. క్షీరకుండమున స్నానమాడినవారు ఉన్నత భోగములను అనుభవించును. కపి తీర్థమున స్నానమాడినవారు విజాతిని పొందజాలరు. గాయత్రీ తీర్థమున, సరస్వతీ తీర్థమున స్నానమాడినవారు కిల్బిష విముక్తులగుదురు. ఋణమోచన తీర్థాదులందు స్నానమాడినవారు ఋణవిముక్తులగుదురు. ఇది సేతు తీర్థముల మాహాత్మ్యమును నీకు చెప్పితిని. దీనిని వినువారు చదువువారు సర్వపాప వినిర్ముక్తు లయ్యెదరు. (II/76)