ప్రయాగ మాహాత్మ్యము

వసుపు పలికెను: మోహినీ! వేద సమ్మతమగు ప్రయాగక్షేత్ర స్నాన విధానమును తెలిపెదను. వినుము. గంగలో ఇచట స్నానము చేసిననూ కురుక్షేత్ర సమ ఫలము కలుగును. గంగ వింధ్య సంగతయైనచో పదిరెట్లు అధిక ఫలము నిచ్చును. కాశిలో ఉత్తరవాహినియగు గంగ నూరురెట్లు అధిక ఫలము నిచ్చును. యమునా నదితో కలిసి ఉన్న గంగ కాశీ గంగ కంటె నూరురెట్లు అధిక ఫలమును ఇచ్చును. పశ్చిమ వాహిని గంగ అయినచో వేయిరెట్లు అధికఫలము నిచ్చును. పశ్చిమ వాహిని గంగా దర్శనమాత్రముననే బ్రహ్మ హత్యాది పాపములను హరించును. పశ్చిమాభి ముఖి యగు గంగ యమునతో కలిసి యున్నచో నూరు కల్పముల పాపములను నశింపచేయును. మాఘమాసమున ఇట్టి గంగ దుర్లభము. భూమండలమున గంగాయమునల సంగమ తీర్ధము అమృతముగా కీర్తించబడును. ఇట్టి తీర్ధము మాఘమాసమున దేవతలకుకూడా దుర్లభమే. ఈ భూమండలమున ఉన్న సమస్త తీర్థములు, పవిత్ర క్షేత్రములు, మాఘమాసమున మకర భాస్కరుడు ఉన్నపుడు త్రివేణిలో స్నానము చేయుటకు వచ్చును. బ్రహ్మ విష్ణు మహాదేవులు, రుద్రాదిత్య మరుద్గణ ములు, గంధర్వులు, లోకపాలకులు, యక్షకిన్నర గుహ్యకులు, అణిమాది గుణోపేతులగు తత్త్వ దర్శులు, సరస్వతి, పార్వతి, లక్ష్మి, శచి, మేధా, అదితి, రతి, సకల దేవపత్నులు నాగాంగనలు, ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమ, అప్పరోగణములు, పితృ గణములు, అందరు మాఘ మాసమున వేణీ స్నానమునకై వత్తురు. కృతయుగమున ప్రత్యక్షరూపముతో, కలియుగమున ప్రచ్ఛన్న రూపముతో వచ్చెదరు. వేణిలో దిగుచున్నపుడు పాపుల సంగదోషముతో నల్లబారిన సర్వ తీర్ధములు మాఘమాసమున ప్రయాగ మజ్జనమున శుక్ల వర్ణములగును. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘ మాసమున “గోవిన్ద, అచ్యుతా! మాధవా నా స్నానముచే నాకు యధోక్త ఫలము నిమ్ము” అను మంత్రమును ఉచ్చరించి మౌనముగా స్నానమును ఆచరించవలెను. మరల వాసుదేవుని, హరిని, కృష్ణుని మాధవుని స్మరించవలెను. సూర్యుడు మకర రాశిలో ఉండగా ఇంటిలో వేడినీరుతో స్నానముచేసినచో అరువది సంవత్సరముల ఫలము కలుగును. వెలుపలనున్న వాప్యాదులలో స్నానమాచరించిన ద్వాదశాబ్ద స్నానఫలము కలుగును. తటాకమున స్నానము ద్విగుణఫలమును, నద్యాదులందు చతుర్గుణ ఫలము, దేవఖాత స్నానము దశగుణ ఫలమును, మహానదీ స్నానము శతగుణ ఫలమును, మహానదీ సంగమ స్నానము చతుశ్శతగుణఫలము కలుగును. సూర్యుడు మకరరాశిలో నుండగా చేయు అన్ని విధముల స్నానము సహస్రగుణ ఫలమును ఇచ్చును. గంగా స్నానము, ప్రయాగ స్నానము సమాన ఫలమును ఇచ్చును. మాఘ మాసమున గంగా స్నానమును చేయువారు నాలుగువేల యుగములు స్వర్గములో నివసింతురు. గంగాస్నానము శత గుణము, ప్రయాగ స్నానము సహస్రగుణిత ఫలమునిచ్చునని గంగాయమున సంగమమున స్నానమును నిర్దేశించిరి. భూమండలమునగల పాపసమూహ భారదాహము కొరకు ప్రజాహితమును కోరి ప్రజాపతి ప్రయాగను సృజించెను. తెలుపు, నలుపు జలము కలిగి తీర్థము స్నాన స్థానము. పాప రూప పశునాశమునకు ఈ స్థానమును బ్రహ్మ నిర్మించెను. సితాసిత జలయగు ధారను సరస్వతితో కలిగి బ్రహ్మలోక మార్గమును సృష్టికర్త ఏర్పరిచెను. మానససరోవర స్నానము జ్ఞానప్రదముకాని మోక్ష ప్రదము కాజాలదు. హిమవత్సృష్ఠ తీర్థములన్నింటిలో సర్వపాప ప్రణాశనముగా ఇంద్రలోక ప్రదమని వేదవిదులు నిర్దేశించిరి. మాఘ మాసము సర్వమాసములలో ఉత్తమము. బదరీ వనమున మోక్షప్రదము, పాపహారి, దుఃఖహారి, సర్వకామ ఫలప్రదము, నర్మదానది మాఘ మాసమున రుద్రలోక ప్రదము. సకల పాపనాశకము, సర్వలోక సుఖప్రదము. మాఘమాసమున విశాలా నది విశాలఫల ప్రదము. పాపసమూహమునకు దవాగ్ని. జన్మ నాశకము, మాఘ మాసమున గంగానది విష్ణులోక ప్రదము. మోక్ష ప్రదము. సరయు, గండకి, సింధు చంద్రభాగా, కౌశికి, తాపీ, గోదావరి, భీమా, పయోష్ణీ, కృష్ణవేణి, కావేరి, తుంగభద్ర, ఇతర సముద్రగత నదులు అన్నియూ మాఘ మాసమున స్వర్గలోక ప్రదములు.

నైమిశమున విష్ణు సారూప్యమును, పుష్కరమున బ్రహ్మసామీప్యమును, కురుక్షేత్రమున ఇంద్రలోకమును ప్రసాదించును. దేవహ్రదమున మాఘమాసము యోగసిద్ధి ఫల ప్రదము. మక రాదిత్య కాలమున ప్రభాస స్నానము రుద్ర గణత్వ ప్రదము. దేవికానదిలో మాఘస్నానము దేవ దేహమును ప్రసాదించును. గోమతీ స్నానము పునర్జన్మ హరము. హేమకూటమున, మహాకాళమున, ఓంకారమున, నీలకంఠార్బుదమున, మాఘస్నానము రుద్రలోక ప్రదము. సూర్యుడు మకరరాశిలో ఉండగా సర్వనదులు కలియును గాన అపుడు చేయు స్నానము సర్వకామప్రదము. మాఘమాసమున ప్రయాగను ధన్యులు చేరెదరు. అచట సితాసిత జలముండును గాన పునర్జన్మను హరించును. మాఘమాసము ప్రయాగలో మాకు గడువవలెనని స్వర్గమున ఉండు దేవతలు గానము చేయు చుందురు. ప్రయాగలో మాఘ స్నానమును చేయువారు మరల గర్భవేదనను పొందరు. విష్ణుసన్నిధిలో ఉందురు. పూర్వము బ్రహ్మతీర్ధవ్రత స్నానతపోయాగమాఘప్రయాగలను తలతూచెను. వాటిలో మాఘమాస ప్రయాగ అధికమాయెను. ఈ రెండిలో మాఘము ఇంకనూ శ్రేష్ఠమాయెను. గాలి, నీరు ఆకులు, ఆహారముగా తీసుకొని దేహ శోషణముచే ఉగ్ర తపములచే, చిరకాల సంచిత యోగములచే పొందుగతిని మాఘప్రయాగ స్నానమున పొందెదరు. మకర భాస్కరోదయ కాలమున గంగాసంగమమగు ప్రయాగలో స్నానము చేయువారి గృహద్వారమున కుంజరకర్ణతాడిత భృంగావళి అలంకారమగును. మాఘ ప్రయాగ స్నానము రాజసూయాధ్వర సమఫలప్రదము, సర్వపాపహరము. అట్టి ప్రయాగ నేల స్తుతించరు ? నాలుగు వేదములను చదివినవారికి కలుగు ఫలము, సత్యవాది ఫలము, గంగా-యమునా సంగమస్నానమున లభించును. ఈ సంగమమున వ్రతమును స్వీకరించి స్నానమాడవలెను. ఇట్లుచేసిన రాజసూయ, అశ్వమేధముల ఫలమును పొందును. ప్రయాగ మండలము పంచయోజన విస్తీర్ణము. ఈ భూమిలో ప్రవేశించినంతనే ప్రతిపదమున అశ్వమేధ ఫలము లభించును. ఇచట మూడు కుండములుండును. వీటి మధ్యలో జాహ్నవి ఉండును. ప్రయాగతీర్ధ ప్రవేశ మాత్రముననే తత్ క్షణమే సకల పాపములు నశించును.

ఒక మాసము జితేంద్రియుడై ప్రయాగ స్నానమాచరించిన సర్వపాపములు నశించుటను బ్రహ్మ ప్రత్యక్షముగా చూచెను. పాపియైననూ శుచియై ఏకాగ్రమనస్కుడై శ్రద్ధతో ప్రయాగలో స్నానమాడినచో సర్వ పాపములు తొలగి పరమ పదమును పొందును. నైమిషము, పుష్కరము, గోతీర్ధము, సింధుసాగరము, గయా, ధేనుకము, గంగాసాగరసంగమము ఇవి, ఇతర బహుపుణ్య శిలోచ్ఛయములు, దశసహస్ర తీర్ధములు, ఇతరములగు ముప్పదికోట్ల తీర్ధములు, ఇవి అన్నియూ ప్రయాగలో ఎపుడూ నిలిచి ఉండును. ఇచట మూడు అగ్నికుండములు కలవు. వీటి మధ్యలో జాహ్నవి కలదు. ప్రయాగనుండి సర్వతీర్ధ పురస్కృతమై బయలువెడలిన యమునానది లోకత్రయ ప్రసిద్ధిని పొందినది. లోకపావనియగు యమునానది గంగతో కలిసెను. గంగాయమునల మధ్య భూభాగమున ఉన్న సకల పుణ్యక్షేత్ర తీర్థరాజములన్నియూ ప్రయాగ షోడశాంశకు సాటిరావని చెప్పిరి. ఈ భూమండలమున మూడు కోట్ల ఏబది లక్షల తీర్ధములు, ఇంకనూ అంతరిక్షమున స్వర్గమున జాహ్నవ్యంతములుగా కలవని వాయువు తెలిపెను. ఇవన్నియూ ప్రయాగలో కలియును. మరియూ కబలాశ్వతరములు రెండు, భోగవతి, వేది, వేద్యము, ప్రజాపతి, వేదములు యజ్ఞములు అన్నియూ ఆకారమును దాల్చి ప్రయాగలో ఉండును. తపోధనులగు ఋషులు ప్రజాపతిని సేవించుచుందురు. యాగములచే దేవతలను పూజింతురు. కావున ప్రయాగ కంటే పుణ్యతమమ గునది ఈ భూమండలమున మరియొకటి లేదు. ప్రయాగ ప్రభావమున అన్ని తీర్ధములను అతి శయించును. ఇచట ప్రయాగ తీర్ధమును చూచినవారు సర్వపాప వినిర్ముక్తులై పరమపదమును పొందెదరు. కావున సర్వదేవాభి రక్షితమగు ప్రయాగకు వెళ్ళి బ్రహ్మచర్యముతో ఒకమాసముండి పితరులను, దేవతలను తృప్తులను చేయవలెను. ఇట్లుచేసిన సకలాభీష్టములను పొందును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున ప్రయాగలో స్నానమాడినవాడు మరల పుట్టడు.

విష్ణుమాయ దేవతలచేకూడా జయించరానిది. కాని మాఘప్రయాగ స్నానమున విష్ణుమాయ కూడా దహించబడును. మాఘప్రయాగ స్నానమును ఆచరించినవారు ఆయాలోకములలో బహు భోగములను అనుభవించి శ్రీ విష్ణువులో లీనమగుదురు. మకరర్కకాలమున ప్రయాగ స్పర్శవలన కలుగు పుణ్యరాశులను చిత్రగుప్తుడు కూడా లెక్కించజాలడు. సహస్ర రాజసూయముల ఫలము, శత వాజపేయముల ఫలము మాఘప్రయాగ స్నానమున కలుగును, మాఘప్రయాగ స్నానమున కల్పారంభము నుండి బహుజన్మలలో చేసిన పాపరాశులు భస్మమగును. గంగా-యమునా సంగమము లోక ప్రసిద్ధము. దీనినే కామిక తీర్ధమందురు. ఇచట భక్తిచే స్నానముచేయువారి కోరికలన్నియూ తీరును. భోగకాములకు భోగము, రాజ్యకాములకు రాజ్యము, స్వర్గకామికి స్వర్గము, మోక్ష కామికి మోక్షము కలుగును. ఈ భూమండలమున గల కామప్రద తీర్ధములన్నియూ మాఘమున ప్రయాగలో లీనమగును. హరిద్వారమున, ప్రయాగలో, గంగా సాగర సంగమమున స్నానము చేసినవారు బ్రహ్మ విష్ణు శివలోకములను పొందెదరు. మాఘ మాసమున ప్రయాగ స్నానము చేసినవారికి పునర్జన్మ కలుగదు. సత్యవాది, జితక్రోధుడు, అహింసాశీలుడు, ధర్మానుసారి, తత్వజ్ఞుడు, గోబ్రాహ్మణ హితకారి, గంగాయమునా సంగమ స్నానమాత్రమున పాపముక్తుడగును. మనసులో చింతించిన కామనలన్నింటినీ పొందును, సూర్య గ్రహణ కాలమున కురుక్షేత్రమున స్వర్ణభార సహప్రదానమును త్రిదిన స్నానము వలన కలుగును. త్రిశత వత్సరములు యోగాభ్యాసము వలన కలుగు ఫలము, మాఘమాసమున ప్రయాగలో త్రిదినస్నానమున కలుగును. మాఘమాసమున దినత్రయము ప్రయాగస్నానమువలన కలుగు ఫలము. అశ్వమేధ సహస్రముచే కూడా లభించదు. పూర్వము కాంచనమాలిని మాఘమున త్రిదిన ప్రయాగ స్నాన ఫలమును రాక్షసున కిచ్చుటచే రాక్షసుడు పాపముక్తుడు అయ్యెను. మూడు దినములలో పాపక్షయము జరిగెను. ఇరువది ఏడు దినములు స్నానము చేయుటచే దేవత్వమును పొందెను.

పార్వతీ ప్రియసఖి కైలాసమున క్రీడించునది, ప్రయాగ స్నానమువలన పూర్వజన్మ జ్ఞానమును పొందెను. పూర్వము అవంతి దేశమున వానరాజుండెను. ఇతను నర్మదా తీర్థమునుచేరి రాజసూయ యాగమును ఆచరించెను. స్వర్ణయూప విరాజితములను పదహారశ్వములచే అశ్వమేధ యాగమును ఆచరించెను. బ్రాహ్మణులను పర్వతోపమధ్యాన రాశిని దానము చేసెను. శ్రద్ధకలవాడు, దేవతా భక్తుడు, గోదానమును, స్వర్ణ దానమును చేసినవాడుగా ఉండెను.

ఇట్లే భద్రకుడను బ్రాహ్మణుడు మూర్ఖుడై, హీనకుల సంగతితో కృషీవలుడై, అధమాచారుడు, సర్వధర్మ బహిష్కృతుడు, హలకర్మయందాసక్తి గలవాడు బంధువులచే వంచించబడి అంతటా తిరుగుచు, అదృష్టవశమున బయలుదేరి దైవవశమున జ్ఞానమును పొంది ప్రయాగ తీర్ధమునకు వచ్చెను. మహామాఘీ సందర్భమున ప్రయాగలో మూడు దినములు వెడలెను. వాసరాజు భద్రక బ్రాహ్మణుడు ఒకేసారి మృతి చెందిరి. వారిద్దరూ ఇంద్ర సమీపమున సమాన స్థానమును పొందిరి. తేజస్సు, రూపము, బలము, స్త్రీజనము, దేవయానము, విభూషణము, పారిజాతమాల, నృత్యము, గీతము అన్నియూ సమములుగా ఉండెను. ఇట్లు ప్రత్యక్షముగా మాహాత్మ్యమున చూచిన తరువాత మాఘమున ప్రయాగ స్నానము రాజసూయ సమముకాదని ఎట్లు చెప్పెదరు ? వింశతి ధనుర్విస్తీర్ణ ప్రాంతమున గంగాయమున సంగమమున మాఘమాస స్నానమున పునర్జన్మ కలుగదు. రాజసూ యమున పునర్జన్మ కలుగును. విపులమగు యమునా తీరమున కబలా, అశ్వతర అను రెండు నాగములు కలవు. ఇచట స్నాన పానములను చేసినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. ఇచటికి వెళ్లి నివసించినచో మహాదేవుని ప్రసాదమువలన దశపూర్వులను, దశాపరులను తరింపచేయును. ఇచటనే ప్రతిష్ఠాన మనుకూపము కలదు. ఇచట స్నానముచేసి పితరులను దేవతలను, తర్పణము గావించి బ్రహ్మచారియై, జితక్రోధుడై మూడు రాత్రులున్నచో సర్వపాప విశుద్ధాత్మయై అశ్వమేధ ఫలమును పొందును. ప్రతిష్ఠానమునకు ఉత్తరమున, భాగీరధికి పూర్వమున హంసప్రతపనమను తీర్ధము లోకప్రసిద్ధము. ఇచట స్నానము ఆచరించిన అశ్వమేధ ఫలమును పొందును. ప్రళయ కాలము వరకు స్వర్గమున ఉండును. ఇక వాసుకికి ఉత్తరమున భోగవతీ సమీపమున దశాశ్వమేధి కమను ఉత్తమ తీర్ధము కలదు. ఇచట స్నానము చేసిన అశ్వమేధ ఫలము లభించును. ధనాఢ్యుడు, రూపవంతుడు, దక్షుడు, దాత, ధార్మికుడు అగును. చతుర్వేదాధ్యయనపరులకు కలుగు పుణ్యము, సత్యవాదులకు కలుగు ఫలము, అహింసలో ఉండు ధర్మము దశాశ్వమేధ గమనమున కలుగును.

పాయత్యుత్తర తీరమున, ప్రయాగకు దక్షిణ భాగమున ఋణమోచనకమను తీర్ధము కలదు. ఇచట స్నానముచేసి ఒకరాత్రి ఉన్నవారు ఋణవిముక్తులగురుదు. స్వర్గలోకమును పొంది అమరత్వమును పొందెదరు. మూడు పూటలా ఒకమారు స్నానము చేయుచు నిరాహారియై మూడు నెలలున్నచో విశ్వాసఘాతక పాపమునుండి శుద్ది పొందును. ఈ తీర్ధమును కీర్తించుట వలన పుణ్యమును పొందును. దర్శించి శుభములను బడయును. స్నానము పానము చేసి ఏడు తరములను పావనము చేయును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున సూర్యోదయమున కంటె స్నానము చేయనిచో ఎట్లు పాప విముక్తి కలుగును ? ఎట్లు స్వర్గమును పొందును. ప్రయాగలో వపనము, గయలో పిండదానము, కురుక్షేత్రమున దానము, కాశిలో దేహత్యాగము చేయవలసిన పనులు. ప్రయాగలో ముండనము చేసుకొన్నవానికి గయా పిండదానముతో కాశీ మరణముతో కురుక్షేత్ర దానముతో పనిలేదు. పదినెలల తరువాత మరల తీర్ధమునకు వెళ్ళిననూ ముండనమును ఉపవాసమును ప్రయత్నముచే ఆచరించవలను. ప్రయాగకు వెళ్ళిన స్త్రీలకు ముండన విధి ఇట్లు చెప్పబడినది. అన్ని కేశములను ఒకచోచేర్చి రెండంగుళములను ఛేదించవలయును. మానవులకు కేశాంత్య భాగమును ఆశ్రయించి సర్వ పాపములు ఉండును. కావున తీర్ధస్నానకాలమున కేశాంత్య భాగములను ఛేదించవలయును. పుష్యమాఘ మాసములలో అమావాస్య అర్కపాత శ్రవణములతో కలిసి వచ్చెనేని అర్ధోదయమని తెలియవతలెను. ఈ అర్ధోదయము శతసూర్య పర్వల కంటె అధికము. కొద్దిగా న్యూనమైనచో మహోదయము అనబడును. మాఘ శుక్ల సప్తమినాడు అరుణోదయ వేళయందు ప్రయాగలో ఉన్నవారికి వేయి సూర్యగ్రహణములతో సమానము. అయనకాలమున కోటి పుణ్యము, విషువమున లక్షగుణము, షడశీతియందు సహస్ర ఫలము. ఇట్లే విష్ణు పదులలో కూడా ఫలము కలుగును. ప్రయాగలో విభవానుసారముగా దానము చేయవలెను. దానముచే తీర్ధఫలము పెరుగును. గంగా-యమునా సంగమమున గోదానమును గావించిన స్వర్ణ దానము, మణి ముక్తాది దానములను గావించిననూ, పాటల గోవును కాని కపిల గోవునుకాని స్వర్ణశృంగిని రాప్య ఖురను, ఏలకంఠిని పయస్వినిని సవత్సను శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు యధావిధిగా దానము గావించవలెను. శుక్లాం బరధరుడు, శాంతుడు, ధర్మజ్ఞుడు, వేదపారగుడు అగువానికి గోవునీయవలెయును. అట్లే మహార్హము లగు వస్త్రములను అభరణములను బహువిధ రత్నములను దానము చేయవలెను. ఆ గోవునకు వత్సమునకున్న రోమ కూపముల సంఖ్యను అనుసరించి అన్ని వేల సంవత్సరములు స్వర్గమున నివసించును. అతను పుట్టిన ప్రదేశముననే ఆ గోవుకూడా పుట్టును. దాత తన సుకృతవశమున నరకమును చూడడు. ఉత్తరకురు దేశములను పొంది అక్షయ కాలము భోగములను అనుభవించును. వందలవేల ఆవుల కంటే ఒకపాలిచ్చు ఆవును దానము చేయవలెను. పుత్రులను భార్యలను భృత్యులను ఒక గోవే తరింపచేయును. కావుననే అన్ని దానములలో గోదానము విశిష్టము దుర్గమము. విషమము ఘోరము అగు మహాపాతక సంక్రమమున గోవే రక్షించును. కావున గో దానమును చేయవలెను. తీర్ధమున పుణ్యాయతనములందు ప్రతి గృహమును వర్ణించి బ్రాహ్మణుడు అప్రమత్తునిగా ఉండవలెను. స్వకార్యమున కాని పితృ కార్యమున కాని దేవతారాధనలో కాని ప్రతిగ్రహధనానుభవము వరకు ఆ తీర్ధయాత్ర విఫలమగును. గంగా-యమున మధ్యలో కన్యా దానమును చేసినవాడు నరకమును చూడజాలదు. ఉత్తరకురు దేశములకు వెళ్ళి అక్షయకాలము భోగానుభవమును పొందును. ధార్మికులు రూపసంయుతులు అగు భార్యా పుత్రులను పొందును. అధశ్శిరమునుంచి ఊర్ధ్వబాహులై అచటి యజ్ఞ ధూమమును పానము చేయవలెను. లక్ష సంవత్సర ములు స్వర్గమున నివసించును. స్వర్గమునుండి దిగివచ్చి అగ్నిహోత్రిగా పుట్టి విపుల భోగములను అనుభవించి మరల ఈ తీర్ధమును చేరును.

ప్రయాగ నుండి ప్రతిష్ఠానము వరకు వాసుకి హృదమునుండి బహుమూలక నాగము వరకు కబలాశ్వతర నాగములు ఉండును. ఇంతవరకు ప్రజాపతి క్షేత్రమని లోకత్రయ ప్రసిద్ధము. ఈ క్షేత్రమున స్నానమాచరించి స్వర్గమునకు చేరెదరు. ఇచట మరణించినవారు మరల పుట్టరు. వేద వచనమువలన కాని, లోకవచనమువలన కాని ప్రయాగ మరణ విషయమున బుద్ధిని తొలగించ రాదు. ప్రయాగ యందు పదివేల తీర్ధములు అరువదికోట్ల తీర్థములు సన్నిహితములుగా లభించును. బాధితుడు, దీనుడు కోపించినవాడు కాని గంగాయమునా సంగమమును చేరి ప్రాణ పరిత్యాగము గావించి నచో దీప్తకాంచన వర్ణములు సూర్యకాంతి సన్నిభములు అగు విమానములతో గంధర్వాప్స రసల మధ్యన స్వర్గమున ఆనందించును. అభీష్టకామనలను పొందును. నిదురించిన వాడు గీత వాద్యనాదములచే మేలుకొనును. పుట్టుకను కోరువరకు స్వర్గములోనే నివసించును. కర్మక్షయమున స్వర్గ పరిభ్రష్టుడై హిరణ్యరత్న సంపూర్ణ కులమున పుట్టును. పూర్వసుకృతమును స్మరించుచు విష్ణు లోకమును చేరును. ఇచట వట మూలమును చేరి ప్రాణ పరిత్యాగమును చేయువాడు సర్వ లోకములను అతిక్రమించి రుద్రలోకమును పొందును. అచట రుద్రుని ఆశ్రయించి ద్వాదశాదిత్యు లను తపింపచేయును. జగత్తును వెడలి వచ్చిన ద్వాదశాదిత్యులు వటమూలమున దహించబడును.

ప్రజాపతి పురస్కృతుడగు శ్రీహరి వటపత్రమున పాదాంగుష్టమును పానము చేయుచు ఉండును. విపులము హంసపాండురము అటు ఉర్వశీపులినమున ప్రాణములను విడుచువాడు అరువది యారువేల సంవత్సరములు పితరులతో కలిసి స్వర్గలోకమున నివసించును. దేవలోకమున ఊర్వశిని చూచినపుడు దేవ ఋషి గంధర్వులచే పూజించబడును. కర్మక్షయమున స్వర్గ భ్రష్టుడై ఇచటికొచ్చి ఊర్వశీతుల్యులగు యువతులను నూరు మందిని పొందును. నారీ సహస్రమునకు భర్తయగును. పదివేల గ్రామములకు భోక్త శాస్త్ర అగును. ఇతను నిదురించినచో కాంచీనూపుర శబ్దములచే మేలుకొనును. విపుల భోగములను అనుభవించి మరల అదే తీర్థమును చేరును. నిత్యము శుక్లాంబర ధరుడు, నియమబద్ధుడు, జితేంద్రియుడు, ఒకపూట మాత్రమే భుజించుచు ఒక మాసము భోగపతి అగును. సువర్ణాలంకృతులగు నారీ శతమును పొందును. సముద్రాంత పృథివిలో మహాభోగపతి అగును. ధనధాన్య సమాయుక్తుడు దాతగా విపుల భోగములను అనుభవించి మరల క్షేత్రమును స్మరించును. కోటి తీర్థమున మరణించినవారు వేయి కోట్ల వర్షములు స్వర్గములో ఉందురు. తరువాత ఇటకొచ్చి సువర్ణమణి ముక్తా భూయిష్ఠ కులమున పుట్టును. ఇష్టముండికాని, లేకకాని గంగలో మరణించినవాడు స్వర్గమునుచేరును. నరకమును చూడడు. హంసయుక్త విమానమున విహరించును. అప్సరోగణ మధ్యన నిదురించి మేల్కొనును. స్వర్గము నుండి ఇటకొచ్చి పరిశుద్దులు శ్రీమంతులగు యోగుల కులములో జన్మను పొందును.

గంగా-యమునల మధ్యన పిడకలు అగ్నిలో దహించబడవలయును. అట్లు దహించబడు వాడు హీనాంగుడు రోగయుక్తుడు కారాదు. పంచేంద్రియుడు కావలయును. అట్టి వాని శరీరమున గల రోమకూపములు ఎన్ని యుండునో అన్నివేల వర్షములు స్వర్గ లోకమున నివసించును. స్వర్గమునుండి తిరిగి వచ్చి జంబూద్వీపపతి అగును. ఇచట విపుల భోగములను అనుభవించి మరల ఆ తీర్థమును చేరును. ఇచట తన దేహమును ఖండించి పక్షులకు వేసినవాడు లక్ష సంవత్సరములు చంద్ర లోకమున నివసించును. ఆటనుండి ఇటకువచ్చి ధార్మికుడగు రాజగును. గుణవంతుడు, రూపవంతుడు, విద్యా వంతుడు, ప్రియవాక్కు గలవాడు, పరిశుద్ధుడుగా ఉండి. విపుల భోగములను అనుభవించి మరల ఈ తీర్థమునకు చేరును. పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమున అనశనవ్రతముతో మరణించినవారు గడిచిన ఏడుతరములను, రాబోవు పదునాలుగు తరములను తరింపచేసి తానుకూడా తరించును. యమునా దక్షిణ తటమున అగ్ని తీర్థము కలదు. ధర్మరాజ నరక తీర్ధము పశ్చిమ భాగమున కలదు. ఇచట స్నానముచేసిన వారు స్వర్గమునుపొందెదరు. మరణించినవారు మరల పుట్టరు. యమునా నదికి ఉత్తర తీరమున పాప హరములగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్థములను చాలా మంది మునులు సేవించియుండిరి. ఈ తీర్థములలో స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వీటిలో మరణించినవారు మరల జన్మను పొందరు. గంగా-యమునా నదులు రెండు సమాన ఫలములను ఇచ్చునవిగా ప్రసిద్ధిని పొందినవి. జ్యేష్ఠ భావనతో గంగ అంతట పూజించబడును. సర్వరత్నములను బ్రాహ్మణులకు దానము చేసిన వారికి కూడా యోగము లభించునో లేదో కాని ప్రయాగలో మరణించినవారికి మాత్రము అన్నియూ లభించును. దేశములో ఉండి కాని, అరణ్యములో ఉండి కాని, విదేశములలో లేదా గృహములో ఉండు వాడైనను ప్రయాగను స్మరించుచు ప్రాణములను విడిచినచో హిరణ్మయ భూ ప్రాంతముకల బ్రహ్మలోకమును పొందును. అచట సర్వకామ ఫలములుగల వృక్షములు ఉండును. ఋషులుందురు. స్త్రీ సహస్ర పరివేష్టితమగు శుభకరమగు మందాకినీ తటమున సిద్ధులతో గంధర్వులతో కలిసి క్రీడించును. అచటి నుండి మరల ఇటకొచ్చి జంబూద్వీపపతి అగును. ధర్మా త్ముడు, గుణసంపన్నుడుగా ఉండి, మరల ఆ తీర్థమును పొందును. ఇట్లు నీకు సమగ్రముగా సుఖప్రదము, మోక్షప్రదమగు ప్రయాగ మాహాత్మ్యమును తెలిపితిని. ఇంకనూ ఏమి వినదలచితివో చెప్పుము. (II/63)