నారద మహా పురాణము
తిథి విచారము
వసిష్ఠ మహర్షి పలికెను: ఈ విషయమును ఉద్దేశించి నైమిశారణ్య వాసులగు మునులు మహామతి వ్యాస శిష్యుడగు సూత మహర్షి నడిగిరి. ఇట్లు ఏకాదశీ వివరము నడుగగా ఏకాదశీ మాహాత్మ్యమును ఉపవాసవిధిని చెప్పసాగెను. ఇట్లు నూతమహర్షిచెప్పిన సర్వపాప రాశి నాశకమగు చక్రి మాహాత్మ్య మును విని మరల ఇట్లడిగిరి. మహానుభావా! నీవు అష్టాదశ పురాణములను తెలియుదువు. వ్యాసానుగ్రహమున మహాభారతమును కూడా తెలియుదువు. కావున పురాణములలో, స్మృతులలో శతకోటి విస్తరముగు రామాయణమునందు కూడా నీకు తెలియనిది ఏదియులేదు. మా మనసున ఒక సంశయము కలదు. దానిని నీవు యధార్ధముగా విస్తరముగా తొలగించదగుదువు. ఏకాదశి తిధి చివర ఉపవసించవలయునా, మొదట ఉపవసించ వలయునా? పైత్ర్యమున నీకు తెలియనిది లేదు. కావున తెలుపుము.
సౌతి పలికెను: దేవతలకు తిధి ప్రాంతము ప్రియము. కావున ప్రాంతమున ఉపవాసము ప్రీతి వర్ధనము పితరులకు తిథిమూలము ప్రియమని కాలజ్ఞులు చెప్పిరి. కావున ఫలమును కోరువారు ఎల్లప్పుడు తిథి ప్రాంతమున ఉపవసించవలెను. ఓ బ్రాహ్మణోత్తములారా? సప్తమిని ఎపుడూ పూర్వవిద్ధనే ఆచరించవలెను. అమావాస్య పూర్ణిమలు పితరులకు సాంవత్సర దినము కావున పితృ తృప్తి కొరకు మూలమున ఆచరించవలెను. ద్వితీయ అష్టమి పూర్వవిద్ధను ఆచరించరాదు. ధర్మకామార్ధములను కోరువారు షష్ఠీ ఏకాదశిని పూర్వ విద్దలను వదిలిపెట్టవలయును. మిగిలిన వాటిని పూర్వ విజ్ఞలనే ఆచరించవలెను. వీటిని పూర్వ విద్దలను వదిలినచో నరకమును పొందును. హాని కలుగును. దౌర్భాగ్యమును పొందును. ఈ విషయమును నేను వ్యాసుని వలన వింటిని. సూర్యోదయ కాలమున ఏతిధి కొంచెము ఉన్ననూ పూర్వ విద్ధగా ఎరుగవలెయును. పారణమున, మరణమున మానవులకు తాత్కాలిక తిధినే గ్రహించవలెను. పితరులకు అస్తమయ వేళలో నిస్పర్శ పూర్ణయందురు. ఇచట ఉదయ కాలమున నుండి తిధిని గ్రహించరాదు. దైవకార్యములందు ఉదయ తిధిని గ్రహించవలెను. ప్రతిదినము దైవజ్ఞ చింతకుని వలన తిధిని పరిశీలించవలెను. తిధికి సూర్యచంద్రులు ప్రమాణము. సూర్యచంద్ర చారమును తెలియుటచే కాలజ్ఞులు కాలమును తెలియుదురు. పూర్వతిధి సంగదోషమున్నచో పూజకు యోగ్యములు కాజాలవు. తెలిసిన వారు నాలుగు ఝాములను వదిలెదరు. ఇక ఇపుడు స్నానపూజా విధి క్రమమును చెప్పెదను. పగలు శుద్ధిలేనిచో రాత్రి చేయవలెను. పగలు చేయవలసిన దంతయూ సాయంకాలమే చేయవలెను. ఉపవసించునరులు ఈ విధిని అనుసరించవలెను అని నేను చెప్పుచున్నాను. అరుణోదయ వేళలో ద్వాదశి స్వల్పముగా ఉన్ననూ దానహోమ స్నానార్చన క్రియలను ఆచరించవలెయును. త్రయోదశి శుద్ధమైనపుడు పారణచేయుట అనన్త ఫలప్రదము. శతయజ్ఞాధిక ఫలమును మానవుడు పొంద గలగును. కావున ప్రత్యూష కాలమున స్నానము నాచరించ వలెయును. ద్వాదశీ దినమున చూడ వలసిన పనిలేకనే పితృ తర్పణములను ఆచరించవలెను. ద్వాదశిని లంఘించినచో మహాహాని కలుగును. స్నానము చేయని సరస్వతివలె స్నాతకములేని విద్యవలె ధర్మమును హరించును. దినోదయమును క్షయముకాని వృద్ధికాని కలిగినచో ద్వాదశిని ఉపవసించుట పుణ్యావహము. ద్వాదశిపూర్వ విద్ధ అయినచో విడువవలెను.
బ్రాహ్మణుడు పలికెను: ద్వాదశినాడు పూర్వ సంభవము ప్రాప్తించినచో అపుడు ఉపవాసము నెట్లు చేయవలయును? ఉపవాసము చేయవలసిన దినము పూర్వ విద్ద అయి మరునాడు ఏకాదశి స్వల్పముగా కూడా లేనపుడు ఎట్లు ఉపవాసమును చేయవలయునో చెప్పుము.
సౌతి పలికెను: ద్వాదశినాడు పూర్వతిధిరానిచో అపుడు మరునాడు ఉపవసించవలయును. బ్రాహ్మణు లలో భేదమున్నపుడు బహ్వాగమ విరోధములున్నపుడు ద్వాదశినాడు ఉపవసించి త్రయోదశి పారణ చేయవలెను. శుక్ల కృష్ణపక్షములలో ఏకాదశి విద్ధయైనపుడు, శ్రవణా నక్షత్రము వచ్చినపుడు ద్వాదశినాడు ఉపవసించవలెను. శాస్త్రీయానుసారము నేనీ నిర్ణయమును చెప్పితిని. ఇంకనూ మీరేమి వినదలచితిరో చెప్పుడు.
ఋషులు పలికిరి: ఓ సూతపుత్రా! ఉన్నది ఉన్నట్టు రవి సంక్రమణము మొదలగు యుగాది విధిని తెలుపుము. నీకు తెలియని దేదియునూ లేదు కదా!
సౌతి పలికెను: శుక్లపక్షమున రెండు కృష్ణపక్షమున రెండు యుగాదులున్నవి. శుక్ల పక్షమున పూర్వాహమున కృష్ణ పక్షమున అపరాష్ట్రమున గ్రహించవలయును. దిన భాగమును అనుసరించి అయనము నిర్ణయించబడును. సంక్రమణము షోడశ ఫలాత్మకము. పూర్వక మున దక్షిణ భాగము, వ్యతీతమున ఉత్తర భాగము సమ్మతము. విషువ మధ్య కాలమున అక్షయా అనబడును. విప్రులు చక్కగాతిధిని తెలుసుకొని సంవత్సరమును చెప్పవలెను. తిథిని లెలుసుకొని ఉపవసించవలెను లేనిచో నరకమును పొందును. పూర్వవిద్ధ తిథి అందు ఉపవసించినచో ధర్మచ్ఛేదము, సంతతి వినాశము సంపద్ధరణము జరుగును. ఏకాదశికి ఒకపలయైనను దశమీవేధ ఉన్నచో సురాబిందుస్పర్శగల గంగాజలమునువలె విడువవలెను. కుక్క తాకిన పంచగవ్యమునువలె దశమి విద్ధయగు ఏకాదశిని విడువవలెను. పూర్వవిద్ధయగు ఏకాదశిని శ్రీకృష్ణుడు మహాత్ముల సంతోషము కొరకు రాక్షసులకిచ్చెను. అకాలమున నిచ్చిన ధనము, అపాత్రులకిచ్చిన ధనము, కోపించిన వారిచే చేయబడుదానము, అసత్కార పూర్వకముగా నిచ్చిన దానమువలె రాక్షసులకిచ్చిన దానము పూర్వవిద్ధి తిధియందు చేయబడిన దానము, ఉచ్ఛిష్టునిచే చేయబడిన దానము, పతితులకిచ్చన దానము, స్త్రీజిత్తుల కిచ్చిన దానము, జలవర్జిత దానము, ఇచ్చిన తరువాత చెప్పుకొనిన దానము అసురుల కిచ్చిన దానము వంటిది. కావున విద్ధయగు ఏకాదశి తిధిన ఉపవసించరాదు. వృషలీపతి శ్రాద్ధము పూర్వపుణ్యమును హరించినట్లు దశమివిద్ధ అగు ఏకాదశి తిధిన చేయు దానము జపము హోమము స్నానము హరిపూజ సూర్యోదయమున చీకటివలె హరించబడును. వృద్ధుడగు పతిని యౌవన గర్వితయగు స్త్రీలు విడుచునట్లు దశమి విద్ధయగు ఏకాదశిని పండితులు విడిచెదరు. ధర్మవృద్ధి కొరకు తిధ్యంతరమును గ్రహింతురు. (II/2)