కాశీ వర్ణనము

కాష్ఠీల పలికెను: ఇట్లు అడయేనుగు రూపమును ధరించిన ఆ రాక్షసి మూడు ముహూర్తముల కాలములో విశ్వేశ్వరుని నివాసమగు కాశీ నగరమును చేరెను. ఆ నగరమును చేరిన రాక్షసి భర్తతో ఇట్లు పలికెను. ఓ ప్రియా ఈ కాశీ నగరము పాపమను వృక్షమునకు గొడ్డలివంటిది. షడూర్మికాంచనమునకు ఈ నగరము దురోదరి. కర్మ అను బీజమును శమింపచేయునది. అందరికి సద్గతిని ప్రసాదించునది. ఈ నగరము మొదట విష్ణు క్షేత్రమని పురాణములు చెప్పుచున్నవి. విష్ణు క్షేత్రము కాని చోట ఎవరికీ మోక్షము కలుగదు. ఈ నగరము పూర్వము శ్రీహరి నగరము. సర్వ ప్రాణులకు మోక్షమును ప్రసాదించునది. అన్ని పాపములను నశింపచేయునది. ఒకప్పుడు శివుడు సర్వలోకకర్త తన తేజస్సుచే ప్రకాశించుచున్న పితామహుని చూచుటకు బయలుదేరెను. బ్రహ్మ లోకమునకు వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి, వేదమును వినిపించుచు బ్రహ్మముందు నిలిచెను. నాలుగు ముఖములచే నాలుగు వేదములను పఠించుచు బ్రహ్మ ముందు నిలిచెను. నాలుగు ముఖములచే నాలుగువేదములను పఠించుచున్న జగన్నాథుడగు బ్రహ్మను చూచి శంకరుడు ప్రీతి చెందెను. ఇక బ్రహ్మయొక్క అయిదవ ముఖము ప్రగల్భముగా ఉండుట చూచిన శంకరుడు క్రోధావిష్ణుడు అయ్యెను. ప్రగల్భముతోనున్న ఆ అయిదవ ముఖమును త్రిలోచనుడు కోపముచే నఖాగ్రముతో ఖండించెను. అట్లు ఛేదించబడిన బ్రహ్మ శిరస్సు శివుని వామహస్తమును అంటి ఉండెను. వదలిపెట్టలేదు. బ్రహ్మ కూడా దుఃఖితుడై శివుని చూచుచుండెను. రుద్రుడు కూడా లజ్జితుడై త్వరగా బయలుదేరెను. పలువిధములుగా ఆ శిరమును వదిలించుకొనుటకు ప్రయత్నించినను ఆ శిరము విడివడలేదు. ఈ సంఘటన చాలా ఆశ్చర్యమును కలిగించెను. చింతావ్యాకులుడై శ్రీహరిని స్మరించెను. శివుడు స్మరించిన వెంటనే శ్రీహరి ఆవిర్భవించెను. దేవదేవుడు, సర్వవ్యాపి అగు శ్రీమహావిష్ణువును చూచిన శంకరుడు తేజోహీనుడై వినయముగా శిరస్సును వంచి నమస్కరించెను. అట్లు చింతావ్యాకులుడు బ్రహ్మద్రోహి, భయాతురుడగు శివుని ఓదార్చి అతనికి సంతోషకరమగు మాటలను పలికెను. ఓ శంకరా! నీవు బ్రహ్మ శిరమును ఖండించి పాపమును ఆచరించితివి. కావున స్వయంకృతాపరాధ ఫలమును కొంతకాలము అనుభవించుము. ప్రతి ప్రాణి తాను ఆచరించిన శుభాశుభ కర్మలను అనుభవించియే తీరవలయును. నూరు జన్మలలో అయినను అనుభవించనిదే కర్మ నశించదు. నేనేమి చేతును? ఎటు వెళ్ళుదును? దుఃఖితుడవగు నిన్ను చూచి, నీ దుఃఖమును చూచి నా ప్రాణములు వికలములగుచున్నవి. ఈ లోకములోని మహాపాపములు అన్నియూ బ్రహ్మహత్యతో సమములు కాజాలవు. నీవు సర్వ లోకములకు గురువువు. ధర్మమును ఉపదేశించువాడవు. అయిననూ బ్రహ్మ హత్యా పాతకముచే పరాభూతుడవై ఒక్క క్షణము కూడా నిలువజాలవు. ఈ బ్రహ్మహత్య మహాఘోరము. మత్స్యగంథము కలది. జరాతుర నాలుకను బయటికి చాచి నిన్ను పట్టుకొనుటకు నీవెంట పరుగెత్తి వచ్చుచున్నది. కావున నీవు పన్నెండు సంవత్సరములు ఒకేచోట నిలువక పాపనాశమును కోరి అంతటా తిరుగు చుండవలెను. పన్నెండు సంవత్సరములు సకల తీర్థములలో తిరుగుచు వామహస్తమును ప్రక్షాళనము చేసుకొనుచు కపాలమున భిక్షను స్వీకరించుచు ఈ దారుణమగు పాపమునుండి విముక్తుడవు అగుదువు అని ఇట్లు శ్రీహరి పలుకగా శివుడు అన్ని తీర్థములలో తిరుగుచుండెను. కపాలమును విడిపించుకొనుటకు జలములలో హస్త ప్రక్షాళనమును గావించుకొనుచు మూడు సంవత్సరములు తిరిగి బదరికాశ్రమమును చేరెను. ధర్మ పుత్రుడు దేవదేవుడగు శ్రీమహావిష్ణువు నుండి భిక్షను స్వీకరించదలచెను. ద్వారమున నిలిచి విష్ణూ నాకు భిక్షానిమ్ము అని పలికెను. అంతట నారాయణ దేవుడు ద్వారమున నిలిచి ఉన్న హరుని చూచి భిక్షను స్వీకరించమని దక్షిణహస్తమును చాచెను. అట్లు భిక్ష నిచ్చుటకు చాచిన శ్రీహరి దక్షిణ హస్తమును చూచి హరుడు త్రిశూలముచే ప్రహరించెను. అట్లు త్రిశూలముచే అయిన గాయము నుండి లోక భయంకరములగు మూడు ధారలు వెడలెను. ఆ ధారలు ప్రస్థద్వాదశహస్త ప్రమాణములు, చిత్రవర్ణములు కలవిగా ఉండెను. ఆ మూటిలో ఒక రక్త ధార మాత్రము హరుని కపాలమున పడెను. రెండవ ధార శివుని ముఖమున పడెను. మూడవది జలమున పడెను. ముందు పాపమును హరించుటకు హేతువగునది శివుని ఒక జలధార చేరినది. ఆ మూడు ధారలను శివుడు యధావిధిగా మూడు సంవత్సరములు సేవించి కొద్దిగా ప్రీతిని చెంది పుణ్యకరమగు కురుక్షేత్రమును చేరెను.

కురుక్షేత్రమును చేరిన హరుడు స్థాణువై అచటనే పడెను. మూడు సంవత్సరములు బ్రహ్మ హ్రదజలమున క్రుంకులిడెను. అచట మూడు సంవత్సరములు గడుపగా కపాలమున సగభాగము విడిచెను. సర్వ గుహాశయుడగు శ్రీహరిని చాలాకాలము స్తుతించెను. అట్లు స్తుతించబడిన శ్రీహరి శివునికి వరమునిచ్చెను. ఓ శివా చాలా తీర్ధములను పర్యటించి ఇక్కడి నుండి కాశీ నగరమునకు వెళ్ళుము. అంతట శ్రీహరికి నమస్కరించి చాలా మార్లు ప్రదక్షిణములను ఆచరించి తీర్ధయాత్రలను పర్యటించుచు అవిముక్తపురిని (కాశీ నగరమును) చేరెను. కాశీనగర సీమను ప్రవేశించుచు వెనుక తిరిగి చూచెను. అచట తన వెనుక బ్రహ్మహత్య రాక పోవుటను చూచెను. సీమకు అవతల నిలిచి ఉండుటను గమనించెను. అప్పుడు ఇది వైష్ణవ క్షేత్రము పాపనాశనము అని తెలిసి సర్వవంద్యుడగు మాధవుని శ్రద్ధతో స్తుతించెను. ఓ జగదీశా! నాథా! విష్ణూ! జగదానంద నిధాన! వేదవేద్యా! మధుమధన! నృసింహా! పీతాంబరధారీ! గరుడవాహనా! మాధవా, ఆదిదేవా గోప నాయక! రమేశ! రాధాపతీ! దేవేశ! సకల కామపూర! కృష్ణ! జయము జయము. సురవర! వరుణ సాగరా! ఆర్తినాశక! పుండరీకాక్ష! అధిపతీ! విభో! పరేశ! యదుకుల తిలక! సాగర వాస! శౌరీ! పర్వతోద్ధార దక్ష! ధనుర్ధారీ! కలికలుషాపహరణ! పద్మపాద! గృణద! ఆత్మప్రద! కూర్మ! వామనా! వరాహా! నరసింహ పరశురామా! యజ్ఞరూపా! కాలాశిత వస్త్రధారీ! బుద్ధిరూపా కల్కీ! భవభయహరణ! భక్తవశ్య! గోపాలక! ప్రణతోద్ధారక! పుణ్యకీర్తి నామ! భూభారహరణ! దేవపూజ్య! ప్రకృతీశ! జగన్నివాస! రామ! గుణగణ విలసచ్చరాచరేశ! త్రిగుణాతీత! సనాతన! అగ్రపూజ్య! నిజజన పరిరక్షిత! అంతకరిపూ! కమలపాద! సుందర! పద్మనాభ! కమలకర! కుశేశయాధి వాస ప్రియ! కామానన! త్రిగుణాధీశ! త్రిమూర్తి వరదా! పాపహరణా! రఘునాథ! దురితాపహరణ! త్రిగుణవ్యాప్త జగత్! త్రికాలదక్ష! దనుజకుల వినాశనైక కర్మ! అనఘారూఢ! ఫణేశ! కంసనాశా! సూర్యచంద్ర నేత్ర! ప్రగల్భ చేష్ట! ద్వాంత హరణ! నవజలదశ్యామదేహా! లక్ష్మీనాథా! యజ్ఞరూపా యజ్ఞధర! మాతృబద్ధ దామ! నవనీత ప్రియ! గోపీజన ప్రియ! అఘ, బక, వృషకేశి, పూతనాంతక! త్రిశిరోవాలి దశాస్యభేదక! నరకపుర వినాశన! బాణబాహుచ్ఛేదక! త్రిపురారిపూజ్య, సుదామమిత్ర! సంసారతారణ! అహిత్ర పాదపద్మ! ప్రకటైశ్వర్య! పురాణ పురుష! ఆజానుబాహు బహుజన్మ పుణ్య ప్రాప్య! మంగళార్హ! శ్రుతివేద్య! శ్రుతిధామ! శాంత! శుద్ధ! వరద! వరేణ్య! నీ పాద పద్మములను శరణు పొందితిని. పాప పీడితుడను అగు నన్ను కాపాడుము. నాకు సద్గతిని ప్రసాదించువారు నీకంటే ఇతరులు లేరు. నా ప్రార్థనచే ప్రసన్నుడవు కమ్ము! అని ఇట్లు దేవదేవుడగు శంకరుడు భక్తిచే స్తుతించగా భక్తవత్సలుడగు శ్రీనాధుడు వెంటనే అచట ఆవిర్భవించెను.

అట్లు ఆవిర్భవించిన శ్రీహరిని చూచి హరుడు దండవత్ప్రణామమును ఆచరించెను. మరల లేచి చేతులు జోడించి నమస్కరించెను. ఇట్లు నమస్కరించుచున్న భూత నాయకునితో హృషీకేశుడిట్లు పలికెను. నీ స్తోత్రమునకు సంతోషించితిని. ఏమి వరము కావలయునో కోరుకొనుము. ఇచ్చెదను అనగా ఆ శ్రీహరి వాక్యమును వినిన భూతేశుడు బ్రహ్మహత్యచే పీడించబడుచు భక్తి ప్రదాయకుడగు శ్రీహరితో ఇట్లు పలికెను. చక్రగదాధరా! నీ క్షేత్రమున నివాసమును చేయగోరుచున్నాను. బ్రహ్మ హత్య నీ క్షేత్రసీమకు అవతల ఉన్నది. గరుడధ్వజా! నాకు క్షేత్ర దానమును గావించి దయచూపుము. నేను ఇటునుండి మరలి వెళ్ళినచో బ్రహ్మహత్య మరల నా వెంటపడును. నీ క్షేత్రమున నేను నివసించినచో ఈ మూడు లోకములలో పూజలను అందగలను అని ఇట్లు పలికి వృషధ్వజుడు ఊరక ఉండెను. రమాప్రియుడు అట్లే అని అంగీకరించెను. అప్పటినుండి ఈ కాశీపురము శివక్షేత్రము అనబడుచున్నది. కాని ఇది పూర్వము విష్ణుక్షేత్రమని విద్వాంసులు తెలియుదురు. దయార్ద్ర హృదయుడగు మాధవుని నేత్రములనుండి నీరు వెడలివచ్చెను. ఆ జలము బిందు సరస్సుగా మారెను. మాధవుని ఆజ్ఞచే అచ్చట వృషధ్వజుడు స్నానము గావించెను. ఆ బిందు సరస్సులో స్నానమాడినంతనే శంకరునిచేత నుండి కపాలము వీడిపడెను.

కావున ఆ తీర్థమునకు కపాలమోచన తీర్థమని ప్రసిద్ధి కలిగెను. ఈ సరస్సుకు బిందుమాధవ సరస్సు అని కూడా పేరుకలదు. శ్రీహరి శంకరునికి తన క్షేత్రమునిచ్చి వెడలెను. శంకరుడుకూడా భక్తి భావముచే అచట నిలిచెను. ఇచటనున్న శంకరుని బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానములలో ఉండియే ఎల్లవేళలా చూచుచుందురు. ఇచట శంకరుడు పదివేల సూర్యులతో సమమగు కాంతి గలవాడు, దిగంబర నిషేవితుడు, తనను సేవించుటలో శూలియే విఘ్నములను కలిగించుచుండెను. ఇట్లు విఘ్నములు కలుగగా శివార్చకులు శ్రీహరిని స్తుతించి విఘ్నములను తొలగించుకొందురు. ఇచట శివుని కాశీ నగరమును ధ్యానించుచు అన్ని లోకములు నిలిచినవి. శివుని ధ్యానించు శైవులందరూ చింతలేని వారైరి జరామృత్యురహితులై శివలోకమును చేరెదరు. ఇహలోకమున కూడా బహుపుణ్యయుతులై రోగహీనులై నివసించెదరు. యజ్ఞశేషమును భుజించుచుందురు. బుద్ధియుతులు అగుదురు.

ఈ కాశీ క్షేత్రమున స్నానము, జపము, దైవపూజ, దానము కూడా విధించబడలేదు. ఇచట మరణించుట ఒకటే ప్రశంసించబడినది. ఈ కాశీ నగరమున మరణించినవారు కృతకృత్యులు అగుదురు. అట్టి కాశీ నగరమును చేరితిమి. భోగులకు కూడా మోక్షమును ప్రసాదించునన్న ఇక వ్రతధారుల విషయము చెప్పనేల? ఈ రాజకుమారిని కాశీనాధుని మందిరమున ఉంచుము. ఈ రాజకుమారిని దుష్టుడగు రాక్షసుడు విడదీసెను. నియమాన్వితయగు ఈ కుమారిని తన భోగము కొఱకు తీసుకొని వచ్చెను. ఇది కాశీ క్షేత్ర మాహాత్మ్యము. నీకు సవిస్తరముగా వివరించితిని. ఇచట శుభాశుభ కర్మలు అన్నియూ నశించును. భూత భవ్య భవిష్య కర్తలు జ్ఞానాజ్ఞాన కృతములగు కర్మలు కూడా నశించును. ఈ కాశీ నగరమును శ్రీహరి కర్మ నాశమునకు నిర్మించెను. ఈ కాశీ నగరమున మరణించిన వారు అనంతము ఉగ్రమగు దుఃఖమును యమయాతనలను అనుభవించరు. (II/29)