సుమతి భూపకథా వర్ణనము

నారద మహర్షి పలికెను: సర్వధర్మములను, సర్వశాస్త్రార్ధములను చక్కగా నెరిగిన మహానుభావా! ధ్వజారోపణము అన్ని కర్మలలో ఉత్తమమని చెప్పి ఏంటివి. సుమతి అను మహారాజు ధ్వజారోపణమును చేసెనని చెప్పియుంటివి. ఆ సుమతి చరిత్రను నాకు విస్తరముగా తెలియజేయుము.

సనక మహర్షి పలికెను: పురాతమైన ఈ ఇతిహాసమును సావధానముగా వినుము. సర్వపాప ప్రణాశనమగు ఈ ఇతిహాసమును నాకు బ్రహ్మ స్వయముగా తెలిపెను. పూర్వకాలమున కృతి “యుగమున సోమవంశమున సుమతి అను మహారాజు ఉండెను. ఈ మహారాజు సర్వసంపత్సమృద్ధి కలిగి సప్తద్వీపములకు ఏకైక నాయకుడగు చక్రవర్తి ధర్మాత్ముడు. సత్యసంపన్నుడు, పవిత్రవంశ్యుడు, అతిథిప్రియుడు. సర్వలక్షణ సంపన్నుడు. సర్వసంపద్విభూషితుడు. సర్వకాలములలో హరికథను సేవించువాడు. హరిపూజా పరాయణుడు, హరిభక్తులను సేవించువాడు. అహంకారరహితుడు. పూజ్యులను పూజించు శీలము కలవాడు. సమదర్శి, గుణవంతుడు, సర్వభూతహితుడు, శాంతుడు, కృతజ్ఞుడు, కీర్తిమంతుడు. సుమతి మహారాజు భార్య మహానుభావురాలు, సర్వలక్షణవతి. పతివ్రత, పతిప్రాణ సత్యమతి అను పేరుగలది. ఆ దంపతులు నిత్యము హరి పూజాపరాయణులు. పూర్వజన్మ జ్ఞానము కల మహానుభావులు, సత్యమును తెలిసినవారు, సత్పరాయణులు. నిత్యము జలాన్నదాన నిరతులు. తటాకారామాదులను అసంఖ్యాకములుగా త్రవ్వించిరి. సత్యమతి కూడా నిత్యము పవిత్రురాలై విష్ణ్వాలయమున అతి సంతుష్టయై మనోజ్ఞముగా నాట్యము చేయుచు మృదు మధురముగా మాటలాడునది. ఆ మహారాజు ప్రతి ద్వాదశీ తిథియందు సుందరము విశాలము అగు ధ్వజమును ఆలయమున ప్రతిష్ఠించుచుండెను. ఇట్లు నిత్యము హరిపూజారతుడైన సుమతి మహా రాజును ధర్మపరాయణుడని సత్యమతియను అతని ధర్మపత్నిని కూడా దేవతలు కూడా స్తుతించు చుండిరి.

ఆ దంపతులు ధర్మకోవిదులుగా మూడు లోకములలో ప్రసిద్ధులగుట ఎఱింగి, విభాండక మహర్షి అతడిని చూడగోరి. చాలామంది శిష్యులతో కలిసి అచటికి చేరెను. విభాండక మహర్షి వచ్చుచున్నారని వినిన సుమతి మహారాజు భార్యతో విస్తృతముగా పూజా సామాగ్రితో ఎదురేగెను. అతిథి మర్యాద చేసి శాంతముగా సింహాసనముపై కూర్చుండపెట్టి శాంతునిగా ఉన్న విభాండక మహర్షిని క్రింది ఆసనమున కూర్చొనియున్న సుమతి మహారాజు చేతులు జోడించి ఇట్లు పలికెను.

మహారాజు పలికెను: ఓ పూజ్యుడా! మీ రాకచే నేను కృతకృత్యుడను అయితిని. సత్పురుషులు రాక సుఖావహమని సత్పురుషులు కొనియాడుచుందురు. మహానుభావుల ప్రేమ ఉన్న ప్రదేశముననే అన్ని సంపదలు తేజస్సు, కీర్తి, ధనము పుత్రులు ఉందురని పండితులు చెప్పుదురు. మహాత్ముల పాదజలమును, పాదధూళిని శిరస్సున దాల్చినవాడు అన్ని పుణ్యతీర్థములలో స్నానమాడిన పుణ్యాత్ముడగును. సంశయముతో పనిలేదు. నా ద్వారా పుత్రధనాది సంపదలనన్నిటిని మీకు అర్పించుచున్నాను. ఓ బ్రాహ్మణోత్తమా! మీకేమి ప్రియమును చేయవలయునో నన్ను ఆజ్ఞాపింపుము అని ఇట్లు పలుకుచు వినయముతో వంగియున్న మహారాజును చూచి విభాండక మహర్షి ప్రీతితో చేతితో తాకుచు మిగుల సంతోషముచే ఇట్లు బదులు పలికెను.

ఓ రాజా! నీవు చెప్పినదంతయూ నీ వంశమునకు తగియున్నది. వినయము కలవారందరు బహు శ్రేయస్సులను పొందగలరు. ధర్మార్ధ కామమోక్షములు వినయము వల్లనే లభించును. మహాత్ములకు దుర్లభమైనదేది? మంచి మార్గమును అవలంబించిన నీ విషయమున ప్రీతుడనైతిని. శ్రీహరిని సంతోషింప చేయు పూజలు చాలా ఉన్నవి. వాటిలో నీవెప్పుడూ ధ్వజారోపణమునే ఎందుకు చేయుచున్నావు? నీ భార్య పరమ సాధ్వీమణి, ఎప్పుడూ స్వామి మందిరమున నృత్యమును చేయుచున్నది. ఎందుకిట్లు చేయుచున్నారో నాకు ఉన్నది ఉన్నట్లు తెలుపుము.

మహారాజు పలికెను: పూజ్యుడా! మీరడిగిన దానిని చెప్పెదను. మా చరిత్రము లోకముల కాశ్చర్యావహము. ఓ మహానుభావా! నేను పూర్వము మాలిని యను పేరుగల శూద్రుడనై యుంటిని. ఎపుడూ చెడుదారిలో నడచుచు అందరికీ కీడు చేయుచు, కొండెములను చెప్పుచు, ధర్మమును ద్వేషించుచు, దేవ ద్రవ్యములను అపహరించుచు, గో బ్రాహ్మణులను వధించుచు, చౌర్యము చేయుచు, అన్ని ప్రాణులను వధించుటయందు ఆసక్తినిచూపుచు, ఎపుడూ కఠినముగా మాట్లాడుచు, పాపాత్ముడనై, వేశ్యాలోలుడనై, పెద్దల మాటలను లెక్కించక చాలాకాలము ఉంటిని. బంధువులందరూ వెలివేయగా దుఃఖముతో అరణ్యమునకు చేరితిని. అరణ్యములో మృగ మాంసమును భక్షించుచు బాటసారులను దోచుచు ఒంటరిగా బహు దుఃఖముతో చాలాకాలముంటిని. ఒకప్పుడు ఎండవేడికి తపించి ఆకలి దప్పులు పీడించగా తిరుగుచు నిర్జనారణ్యమున శిథిలమైయున్న ఒక విష్ణ్వాలయమును చూచితిని. ఆ సరస్సున నీరుత్రాగి తీరమున విశ్రమించి అలసట తీర్చుకుంటిని. రాలిపడి యున్న పండ్లను భక్షించి ఆకలిని తీర్చుకొంటిని. ఆ జీర్ణ విష్ణ్వాలయమున నివాసము ఏర్పరచు కొంటిని. జీర్ణమైనవాటిని, పగిలిన గోడలను మరల సంధానము చేసితిని. కట్టెలు ఆకులు తీగలచే చక్కగా గృహమును నిర్మించితిని. నా సౌకర్యము కొఱకు అచట భూమిని చక్కగా అలికితిని. అచట వ్యాధవృత్తిని స్వీకరించి చాలా మృగములను చంపుచు ఆ మాంసముతో కాలము గడుపుచు, ఇరువది సంవత్సరములుంటిని. అపుడు వింధ్య దేశమున పుట్టిన ఈ సాధ్వి వచ్చినది. కోకిల అనుపేరుగల ఈమె నిషాదవంశమున పుట్టి యుండెను. బంధువర్గము విడువగా, శిథిలదేహయై దుఃఖించుచు ఆకలి దప్పి వేడిమిచే ఆర్తురాలై తాను చేసిన పాపమును గూర్చి ఆలోచించుచు నిర్జ నారణ్యమున తిరుగుచు దైవయోగమున అచటకొచ్చినది. బయట గ్రీష్మతాపముచే, అంతరంగమున పాపముచే పీడించబడుచు వచ్చెను. ఇట్లు దుఃఖముచే బాధపడుచున్న ఈమెను చూచి నాలో దయ కలిగెను. నీరును పండ్లను మాంసము నిచ్చితిని. నేనిచ్చిన వాటిని తిని, ఆకలి దప్పులు అలసట తీరిన ఈమెను గత వృత్తాంతము నడిగితిని.

అపుడు ఈమె తన వృత్తాంతమును అంతటిని నాకు నివేదించెను. “ఓ మహామునీ! దానిని వినుము. నేను నిషాద కులమున పుట్టితిని, నాపేరు అవకోకిల. నా తండ్రి పేరు దారుకుడు. వింధ్యపర్వత ప్రాంతమున నా నివాసము. ఎపుడు పరద్రవ్యములను అపహరించుచు, కొండెములు చెప్పుచు, నచ్చిన పురుషునితో విహరించుచు బ్రతుకును సాగించుచుంటిని అని నన్ను బంధువులు అందరు వెలివేసిరి. ఇట్లు లోకనిందితనైన నన్ను కొంత కాలము భర్త పోషించెను. దైవ వశమున నా భర్త నన్నిచటనే వదిలి తాను యమలోకమును చేరెను. నిర్జనమైన అరణ్యమున ఒంటరిగా దుఃఖముతో తిరుగుచు దైవ వశమున నీ సమీపమునకు చేరితిని. నీచే బ్రతికించబడితిని” అని ఇట్లు ఆమె తన చరితము నంతను నాకు నివేదించెను.

తరువాత మేము ఇద్దరమూ దాంపత్య భావముతో మాంసమును ఫలములను ఆహారముగా తీసుకొనుచు పది సంవత్సరములు ఉంటిమి. ఒకపుడు బాగుగా మద్యము సేవించుట వలన మదించినవారమై ఆ రాత్రి దేవాలయమున మాంసభోజనముచే సంతోషించి, వడలును, వస్త్రములను మరిచి మోహముతో నృత్యమును చేసితిమి. ఇంతలో మా ఇద్దరికీ ఒకేసారి ప్రారబ్ధకర్మభోగము పరిసమాప్తమైనది. అపుడు భయంకరులైన యమదూతలు పాశహస్తులై నృత్యముచే ఆనందించుచున్న మమ్ములను ఘోరమైన యమయాతనలకు గొనిపోవవచ్చిరి. అంతలో దేవాలయమును పరిశుభ్ర ముగా ఉంచుటచే సంతోషించిన శ్రీ మహావిష్ణువు స్వభక్తులను కాపాడు శీలము కలవాడగుటచే, తన దూతలను పంపెను. దేవదేవుని దూతలు శంఖచక్రగదాదులను ధరించి చతుర్భుజులై వేయి సూర్యుల వెలుగు కలవారై కిరీట కుండలాది అభరణములను ధరించినవారై, హరములను వన మాలను ధరించి, తమ కాంతులచే దిక్కులను వెలిగింపచేయుచు, పాశహస్తులు దంష్ట్రులు భయంకరులై మా ఇద్దరిని తీసుకొనిపోవ యత్నించు యమ దూతలతో ఇట్లు పలికిరి.

ఓ క్రూరులారా! దురాచారులారా! వివేక హీనులారా! ఈ దంపతులు హరికి ప్రీతిపాత్రలు. కావున పాపరహితులు. వీరిని విడువుడు. మూడు లోకములలో అన్ని సంపదలకు మూలకారణము వివేకము. పాపరహితుని పాపిగా తలచువాడు పురుషాధముడు. పాపిని పాపరహితునిగా తలచువాడు అధమాధముడు.

యమదూతలు పలికిరి: “మీరు నిజమునే పలికితిరి. కాని వీరు పరమపావులు. పాపులను యమధర్మరాజు దండించవలయును. కావున వీరిని మేము తీసుకొని పోగలము. వేద విహితమే ధర్మము. తద్విపరీతము అధర్మము. ఇదియే ధర్మాధర్మ వివేకము. కావున వీరిని తీసుకొని పోవు చున్నాము.” గొప్ప తేజస్సు గల విష్ణుదూతలు ఈ మాటలను విని మిక్కిలి కోపించినవారై, అధర్మమును ధర్మముగా భావించు యమ దూతలను గూర్చి ఇట్లు పలికిరి.

విష్ణు దూతలు పలికిరి: “ధర్మ పరీక్షకుల సభను అధర్మము స్పృశించుచున్నది. ఇది చాలా గొప్ప ఆపద. చక్కని వివేకము లేకపోవుటయే అన్ని ఆపదలకు మూలము. మీరు చక్కగా విచారించ లేకపోవుట వలననే, నరక లోకమున కొలువుదీరితిరి. మరల ఇప్పుడుకూడా పాపములను చేయుటకు పూనుకొందురేల? తాము చేసిన కర్మలు క్షయమగువరకు మహాపాపులు ఘోరమైన నరకమున ఉందురు. మీరు సూర్యచంద్రులుండు వరకు నరకముననే ఉండవలయును. ఇది వరకు చేసిన పాపములకు నిష్కృతిని కనుగొనకనే మరల పాపములను ఎందుకు చేయుచున్నారు? వేదవిహితమై నదే ధర్మము అను మాట ముమ్మాటికి నిజము. సంశయములేదు. కాని ఈ దంపతులు చేసిన ధర్మములను చెప్పెదము వినుడు. హరిని సేవించుటలో ఆసక్తులైన వీరు అన్ని పాపములనుండి విముక్తులయిరి. కావున శ్రీహరియే వీరిని కాచుచుండెను. కావున ఆలసించక విడువుడు. ఈమె హరి మందిరమున నృత్యము చేసెను. ఇతడు ధ్వజారోపణము చేసెను. ఈ రెండు పుణ్య కార్యములను అంతకాలమున విష్ణు మందిరమున చేసిరి. కావున వీరి పాపములు నశించినవి. అంతకాలమున శ్రీహరి నామమును ఒకసారి వినిననూ పలికిననూ పరమపదమును పొందుదురు. ఇక సేవించిన వారి విషయమున ఏమి చెప్పవలయును? మహాపాతకములు ఉపపాతకములు కలవారైనను, అంతకాలమున శ్రీకృష్ణుని సేవించినవారు పరమపదమును పొందెదరు. యతులను విష్ణు భక్తులను సేవించువారు పాపులైనను పరమపదమును పొందెదరు. ఒక ముహూర్తకాలము కాని సగము ముహూర్తకాలము కాని శ్రీహరి మందిరమున నివసించినచో పరమపదమును పొందుదురన్న, ముప్పది రెండు సంవత్సరములున్న వారి విషయమున ఏమి చెప్పవలయును. ఈ దంపతులు దేవాలయమును ఊడ్చిరి, అలికిరి, శిథిలమైన వాటిని మరల సంధానము చేసిరి. నీరు చల్లిరి. దీపమును పెట్టిరి. ఇట్టి వీరు నరకయాతనను ఎట్లు అనుభవింతురు?” విష్ణు దూతలు ఇట్లుపలికి మా పాశములను తెంపి విమానమున కూర్చుండబెట్టి విష్ణు పదమునకు చేర్చిరి. అచట శ్రీహరి సామీప్యమును పొంది చాలా దివ్యవర్షములు సకల భోగముల ననుభవించి మరల భూలోకమునకు చేరితిమి. హరిసేవా ప్రసాదము వలన ఇచట కూడా సాటిలేని సంపదలను పొందితిమి. ఇచ్చ లేకనే చేసిన హరిసేవ వలననే దేవతలకు కూడా దుర్లభమగు నిట్టి ఫలమును పొందితిమి. ఇచ్చతో భక్తి భావముతో విశ్వేశుడైన శ్రీహరిని సేవించి ఉత్తమ శ్రేయస్సును పొందగలమని నిరూపించ బడియున్నది. మన వశములో లేక మత్తులో నుండి చేసిన కర్మలకే ఇంతటి గొప్ప ఫలము లభించినది కదా! ఇక శ్రద్ధచే చేసినచో ఏమి చెప్పవలయును. ఇట్లు సుమతి చెప్పిన వృత్తాంతమును విని విభాండక మహర్షి ఆ దంపతులను ప్రశంసించి తన తపోవనమునకు వెళ్ళెను. కావున ఓదేవర్షీ! దేవదేవుడగు చక్రిసేవ అందరికి కామధేనువు వంటిది. హరిని పూజించువారికి శ్రీహరియే సర్వకామార్థ ఫలప్రదమగు శ్రేయస్సును ప్రసాదించును. ఇట్లు అన్ని పాపములను తొలగించి అన్ని పుణ్యములను కలిగించు ఈ కథను చదివిన వారు, వినిన వారు కూడా పరమపదమును పొందెదరు అనెను. (1/20)