గృహస్థ వానప్రస్థయతి ధర్మ నిరూపణము

సనకమహర్షి పలికెను: ఓ మునిసత్తమా! ఇపుడు గృహస్థుని సదాచారమును చెప్పెదను. సదా చారము కలవానికి సర్వపాపములు నశించితీరును. సంశయించ పనిలేదు. బ్రాహ్మముహూర్తమున శయ్యనుండి లేచి ధర్మార్థకామమోక్షములకు విరుద్దము కాని జీవికను ఆలోచించవలయును. కేశములను చక్కగా ముడుచుకొనవలయును. రెండు సంధ్యలలో చెవికి యజ్ఞోపవీతములను తగిల్చుకొని ఉత్తరాభిముఖముగా మూత్రమలోత్సర్జనము చేయవలయును. రాత్రి పూట దక్షిణా ముఖముగా చేయవలయును. శిరమునకు వస్త్రమును చుట్టుకొని గడ్డితో భూమిని కప్పి చేతితో ఒక కాష్ఠమును ధరించి మౌనముగా ఉత్సర్జనము చేయవలయును. మార్గ మధ్యమున, గోష్ఠమున, నదీతీరమున, తటాక గృహసమీపమున వృక్షచ్ఛాయలో అరణ్యమున, అగ్ని సమీపమున, దేవాలయ మున, ఉద్యానమున, దున్నిన భూమిలో, నాలుగుదారుల కూడలిలో బ్రాహ్మణ గోగురు స్త్రీ సమీపమున, పొట్టుమీద, బొగ్గుల మీద, కపాలములందు, మలమూత్రవిసర్జన చేయరాదు తరువాత శౌచము కొరకు యత్నము చేయవలయును. ద్విజునకు శౌచమే మూలము. శౌచాచారవిహీనుని సర్వకర్మలు నిష్ఫలములగును. బాహ్యము అభ్యంతరము అని శౌచము రెండు విధములు. మట్టిలో నీటితో బాహ్యశుద్ధి, భావశుద్ధి అంతరము. శిశ్నమును గ్రహించి శౌచము కొరకు మట్టిని తీసుకొన వలయును. ఎలుకల తవ్విన మట్టిని, నాగలిచే దున్నిన మట్టిని, వాపీ కూపతటాకాదులు మృత్తికను తీసుకొనరాదు. పవిత్రమైన మట్టితో శౌచము నాచరించవలయును. లింగమునకు ఒకమారు, రెండు పార్శ్వములకు రెండు మార్లు మట్టితో శుద్ధి చేయవలయును. మూత్ర విసర్జనకు ఇది శౌచపద్ధతి అని పండితులు చెప్పెదరు. లింగమునకు ఒకమారు, గుదమునకు అయిదు మార్లు, పదిమార్లు వామ భాగమునకు, అట్లే ఇరుప్రక్కల పాదములను ఏడుమార్లు పదిమార్లు వామభాగమున, అట్లే ఇరుపక్కల పాదములను ఏడుమార్లు మూడుమార్లు, మట్టిచే శుద్ధిచేయవలయును. ఇది మల విసర్జన తరువాతచేయు శౌచపద్ధతి. ఇది గృహస్థునకు శౌచపద్ధతి. రెండింతలు బ్రహ్మచారికి, వానప్రస్థులకు మూడింతలు యతులకు నాలుగింతలుండును. స్వగృహమున పూర్ణశౌచమును ఆచరించవలయును. మార్గమున అర్థశౌచమును చేయవలయును. రోగాది పీడితులకు, ఆపదలో ఉన్నవారికి ఈ నియమములేదు. దుర్గంధము తొలగునంత శౌచము ఆచరించిన సరిపోవును. స్త్రీలకు అనుపనీతులకుకూడా గంధలేపక్షయమువరకే శౌచమును ఆచరించ వలయును. వ్రతమును స్వీకరించినవారు యతివలె శౌచమును చేయవలయును. విధవా స్త్రీలకుకూడా ఈ నియమము వర్తించును. ఇట్లు శౌచమును నిర్వహించి సావధానమైన మనస్సుతో తూర్పుముఖముగాకాని ఉత్తరాభి ముఖముగాకాని ఇంద్రియ నిగ్రహముతో ఆచమనమును చేయవలయును. వాసన, నురుగులేని జలమును మూడు నాలుగు మార్లు ఆచమనము చేయవలయును. అరచేతిలో రెండు మార్లు కపోలములను పెదవులను శుద్ధి చేయవలయును. అంగుష్ఠ అనామికలతో వరుసగా చక్షుశ్రోత్రములను స్పృశించవలయును. ద్విజుడు కనిష్ఠాంగుష్ఠయోగముతో నాభిని స్పృశించ వలయును. అరచేతితో వక్షస్థలమును అంగుల్యాగ్రములతోకాని భుజములను తాకవలయును. అరచేతిలోకాని అంగుల్యాగ్రములతోకాని భుజములను తాకవలయును. ఇట్లు ఆచమనముచేసినచో ద్విజుడు శుద్ధి పొందును. తరువాత బెరడుతో ఉన్న, ప్రశస్త వృక్షముయొక్క దంత కాష్ఠమును నమల వలెను.

బిల్వ, ఆసన, ఉత్తరేణి, వేప, మామిడి మందార వృక్షశాఖల కాష్ఠమును గ్రహించి జలముచే శుద్ధిచేసి ఈ మంత్రముచే అభిమంత్రణ చేయవలయును. “ఆయుర్బలం యశో వర్చః ప్రజా పశువసూని చ, బ్రహ్మప్రజ్ఞాం చ మేథాం చ త్వం నో దేహి వనస్పతే” అను మంత్రమును అను సంధానము చేయవలయును. (“ఓ వృక్షరాజమా! ఆయుష్యమును బలమును యశమును, తేజస్సును, పశువులను, సంతానమును, ధనములను, వేదములను, ప్రజ్ఞలను, మేథస్సును నాకు ప్రసాదింపుము,” అని అర్థము) బ్రాహ్మణుడు కనిష్ఠాంగులి పరిమితము దశాంగులు కాష్ఠమును చర్వణ చేయ వలయును. క్షత్రియుడు తొమ్మిది అంగులముల కాష్ఠమును, వైశ్యుడు ఎనిమిదంగులములు కాష్ఠ మును, శూద్రుడు, స్త్రీలు నాలుగు అంగుళములు కాష్ఠమును చర్వణ చేయవలయును. దంత కాష్ఠములు లభించనిచో పన్నెండుమార్లు గండూషములతో తృణపత్రములతో ముఖశుద్ధి చేసుకొన వలయును. దంత కాష్ఠమును వామహస్తముచే గ్రహించి వామభాగదంష్ట్రలచే చర్వణ చేయ వలయును. గోదోహ కాలము దంతములను ఘర్షణజరిపి దంతకాష్ఠమును ప్రక్షాళనముచేసి రెండుగా చీల్చ వలయును. ఆ రెండు భాగములతో నాలుకను గీచుకొని ఇంద్రియ నిగ్రహముతో ప్రక్షాళణ చేసి దూరముగ విసరివేయవలయును. మరల మొదటివలె ఆచమనమును చేయవలయును. తరువాత నద్యాదుల పవిత్రజలముతో స్నానమును చేయవలయును. తీరమును శుద్ధి చేసి దర్భలను పరచి నీటిలో ప్రవేశించవలయును. అచట జలమునకు నమస్కరించి రవి మండలము నుండి ఆ వాహనము చేసి గంధాదులతో మండలము నేర్పరచి జనార్దన దేవుని ధ్యానము చేసి మంత్రమును పుణ్య తీర్థములను స్మరించుచు స్నానమును చేయ వలయును. “గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్స న్నిధిం కురు, పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాస్సరితస్తదా ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ. అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యప; వన్తికా పురీ ద్వారావతీ జ్ఞేయ సప్తైతే మోక్షదాయికా!” అనుమంత్రములను పఠించవలయును. “ఓ గంగా! యమునా! సరస్వతీ! గోదావరీ! నర్మదా! సింధూ, కావేరీ! మీరందరు నేను స్నానము చేయు ఈ జలములో వచ్చిచేరుడు. పుష్కరాది తీర్థములు గంగాది నదులు నేను స్నానముచేయు సమయమున నా సన్నిధికి చేరుగావుత. అయోధ్యా మధురా మాయా కాశీ, కాంచీ, అవంతికా ద్వారావతి అను నీ ఊడు క్షేత్రములు పుణ్యప్రదములు” అని పై మంత్రమునకు అర్థము. తరువాత అఘమర్షణ జపము చేసి ప్రాణాయామముతో నీటిలో మునుగవలయును, స్నానాంగముగా తర్పణమును ఇచ్చి సూర్యునకు అర్ఘ్యమునీయవలయును. తరువాత సూర్యుని ధ్యానము చేసి జలము నుండి బయటకు వెడలి శుభ్రమైన వస్త్రమును ధరించి మరియొక వస్త్రమును పైన కప్పుకొని దర్భాసనమున కూర్చుండి సంధ్యావందనము ఆచరించవలయును. ఈశానాభిముఖముగా ఉండి గాయత్రిచే ఆచమనము చేసి “ఋతం” ఇత్యాదిమంత్రమును పఠించి మరల ఆచమనమును చేయవలయును. తరువాత జలమును తను చుట్టూ తిప్పి ప్రోక్షణచేసి ప్రణవాంతమున సంకల్పముచేసి ఋషి ఛందస్సులను దేవతలను స్మరించవలయును. భూరాది సప్తవ్యాహృతులతో శిరమును ప్రోక్షించి విడిగా అంగన్యాసకర న్యాసములను చేయవలయును. తారస్వరముతో భూః అని ఉచ్చరించి శిరమున, భువః అని శిఖలో, స్వః అనికవచమున, భూర్భువః అని నేత్రములలో భూర్భువః స్వః అని ‘అస్త్రాయ ఫట్’ అని దిక్కులలో తాలత్రయ న్యాసమును చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున పద్మాసనమున ఉన్న సంధ్యను ఆవాహన చేయవలయును. “ఆగచ్ఛ వరదే దేవి త్ర్యక్షరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసాం మాతర్బహ్మయెనే నమోస్తుతే” అను మంత్రముతో ధ్యానము చేయవలయును. “అక్షర త్రయాత్మకమగు బ్రహ్మవాదినీ! వరదాత్రి! ఛందోమాతా! బ్రహ్మయోనీ! గాయత్రీ! ఇచ్చటికి రమ్ము నీకు నమస్కారము అని పై మంత్రమున కర్థము) మధ్యాహ్నకాలమున వృషభవాహనారూఢను శుక్లాంబర ధారిణిని రుద్రవాదిని రుద్ర యోనియగు సావిత్రిని అవాహనచేయవలయును. సాయం కాలము గరుడారూఢ పీతాంబర ధారిణి విష్ణువాదిని విష్ణుయోని అగు సరస్వతిని ఆవాహన చేయవలయును. సప్త వ్యాహృతులను తారస్థాయిలో త్రిపదను ఉచ్చరింపవలయును. శిరమున శిఖాపూరణముచేసి కుంభక రేచకమును ఆచరించవలయును. ప్రాణాయామమున వామ మధ్య భాగమున క్రమముగా వాయువును నియ మించవలయును. తరువాత రెండుమార్లు ఆచమనము చేసి ప్రాతఃకాలమున “సూర్యశ్చ మామన్యుశ్చ” అను మంత్రముతో, మధ్యాహ్నమున “ఆపః పునంతు పృథివీం” అను మంత్రముతో సాయం కాలము “అగ్నిశ్చ మామన్యశ్చ” అను మంత్రముతో ధ్యానము చేసి ఆచమనము చేయ వలయును. ‘అపో హి ష్ఠా మయో’ ఇత్యాది మంత్రత్రయముచే మార్జన చేయవలయును.’ సుమిత్రయాన! అను మంత్రముచే నాసా భాగమును స్పృశించిన జలముచే ద్విషద్వర్గమును సముత్సారణచేసి ‘ద్రుపదాదివ’ అను మంత్రముచే శిరమున జలము ప్రోక్షణ చేయ వలయును. “ఋతం చ సత్యం” అను మంత్రముచే అఘమర్షణ జపము చేయవలయును. అంతశ్చరసి అను మంత్రముచే ఒకమారు జలపానము చేయవలయును. తరువాత సూర్యునికి యథావిధిగా గంధ పుష్పములను జలాంజలిని సమర్పించి లేచినిలబడి స్వస్తి కాంజలిని సమర్పించవలయును. యథాక్రమముగా మూడు కాలములలో ఊర్ధ్వ బాహువుగా అధోబాహువుగా “ఉదుత్యం”; “చిత్రం” అను మంత్రములను జపించ వలయును. తరువాత సూర్య మంత్రములను శైవ మంత్రములను, విష్ణు మంత్రములను, ఇతర మంత్రములనుజపించి సూర్యతేజమును ‘తేజోఽసి’ (‘గాయత్ర్యసి’అను మంత్రములచే ప్రార్థన చేయవలయును. తరువాత బ్రహ్మాంగములను మూడుమార్లు ఆవృత్తి చేసుకొని ఆధ్యాత్మికలగు మూడు శక్తులను ఇట్లు ధ్యానము చేయవలయును. మొదట బ్రహ్మాణి చతురానగా అక్షవలయా చేతులతో కలశమును, సుక్రువములను ధరించునది, బాలచంద్రకాంతిగల ముఖము కలది. ఋక్స్వరూపిణి బాలికా రూపమును ధరించినది హంసారోహణ సమయమున కాల అందెలఖణ్ ఖణ్ ధ్వని చేయుచుండునది, వివిధాభరణములచే భూషించబడునది అయిన గాయత్రి మాచే ధ్యానించబడినదై సంపత్స మృద్ధిని కలిగించుగావుత. మధ్యాహ్నకాలమున రుద్రాణి, నవయౌవన, త్రినయన వ్యాఘ్ర చర్మాంబర ధారిణి ఖట్వాంగత్రిశిఖాక్ష సూత్రవలయ విద్యుత్ప్రకాశము కల జటాకలాపము లచే ప్రకాశించు దేహము గలదై, బాలేందుమౌలి తెల్లని దేహకాంతి గలది, వృషభవాహన యజుస్స్వరూపిణి అగు సావిత్రి మాకు అభయమును, సంపదను కలిగించు గావుత. సాయంకాలమున భగవతి, పీతాంబరాలంకృత, శ్యామదేహ, వృద్ధభావ భాసిత తనుకాంతి గలది, వైష్ణవి, గరుడవాహనస్థి, మణినూపురాంగదగ్రైవేయాది భూషణకాంతి శోభిత, హస్తములందు శంఖ చక్రగదా పద్మములను ధరించినది అయిన సరస్వతి మాకు సంపద నిచ్చు గావుత. ఇట్లు ప్రాతఃకాల, మధ్యాహ్న, సాయం కాలములలో భక్తితో ధ్యానము చేయవలయును. సాయం కాలమున నిలిచి చేయవలయును. ఇట్లు త్రిపదయగు గాయత్రిని సహస్ర పర్యాయములు జపించుట ఉత్తమము. శత పర్యాయములు మధ్యమము. దశపర్యాయములు అధమము. బ్రహ్మచారి ప్రతి గాయత్రీ జపమును మొదట ఓం భూః భువః అను మూడు వ్యాహృతులను అద్యంతరములలో సంపుటీ కరణము చేయవలయును. గృహస్థునకు సంపుటీకరణముతో పనిలేదు. అనగా అదిలో మాత్రమే చేయవలయును. ఇట్లు యథాశక్తి గాయత్రీ జపమును చేసి సూర్యునికి సమర్పించి గాయత్రికి సూర్యునికి అంజలి ద్వయమును అర్పించవలయును. తరువాత ‘ఉత్తరే శిఖరే’ అను మంత్రముచే గాయత్రిని “బ్రహ్మరుద్రవిష్ణువులచే అనుజ్ఞాతవై సాగరముగా వెళ్ళుము” అని విసర్జించవలయును. దిక్కులకు దిగ్దేవతలకు చేతులు జోడించి నమస్కరించి ప్రాతఃకాలము నుండి చేయవలసిన పనులను ఆచరించవలయును. గృహస్థుడు ప్రాతఃకాల మధ్యాహ్నములలో స్నానము ఆచరించవలయును. వానప్రస్థుడు యతి మూడువేళలా స్నానము ఆచరించవలయును.

రోగపీడితులకు బాటసారులకు ఒకమారు స్నానము విహితము. తరువాత దర్భపాణియై బ్రహ్మయజ్ఞమును చేయవలయును. పగలు చేయవలసిన కర్మలను ప్రమాదవశమున చేయజాలనిచో రాత్రి మొదటి ఝాములో యథాక్రమముగా ఆచరించవలయును. ఆపదలేని సమయమున కూడా ధూర్తబుద్ధియై సంధ్యోపాసన చేయనివాడు సర్వధర్మబహిష్కృతుడై పాషండుడు అగునని తెలియుము. కపటయుక్తులతో సంధ్యాదికర్మలను విసర్జించినవాడు మహాపాతకులలో శ్రేష్ఠుడగును. సంధ్యాది కర్మలను వదిలి సంభాషించువారు సూర్యచంద్రతారకలుండువరకు నరకమున నివసింతురు. తరువాత దేవతార్చన సలిపి యథావిధిగా వైశ్వదేవమును చేయవలయును. ఆ సమయమున అచట ఉన్న అతిథిని చక్కగా అన్నాదులతో పూజించవలయును. అభ్యాగతుల విషయమున మృదు మధురముగా మాటలాడవలయును. జలాన్న కందమూలాది దానములచే, గృహదానముచే పూజించ వలయును. అతిథి నిరాశచెంది ఇంటినుండి వెడలినచో తన పాపమును గృహస్థునకు ఇచ్చి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును. గోత్రనామములు తెలియనివాడు, మరియొక గ్రామము నుండి వచ్చినవాడు, అతిథి అని పండితులు చెప్పెదరు. అట్టి అతిథిని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజించవలయును, తన గ్రామమున నుండువాని నొకని, శ్రోత్రియుని, విష్ణుతత్పరుని ప్రతిదినము పితరులను ఉద్దేశించి అన్నాదులచే తృప్తిపరచవలయును. పంచ యజ్ఞములను పరిత్యజించినవాడు బ్రహ్మ ఘాతుకుడని పండితులు చెప్పుదురు. కావున ప్రయత్నముచే పంచయజ్ఞములను ఆచరించవలయును. దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, బ్రహ్మ యజ్ఞము అనునవి పంచయజ్ఞములు. భృత్యమిత్రాదులతోకూడి తాను మౌనముగా భుజించ వలయును, ద్విజులకు భోజనము ఈయవలయును. తినదగినవారిని ఎవ్వరినీ విడువక అందరికీ భోజనము ఉంచవలయును. ఆసనమున పాదముల నుంచి తినువానిని, అర్థ వస్త్రమును ధరించి తినువానిని, నోటి నుండి వెలుపలికి వచ్చినదానిని తినువానిని సురాపి (మద్యపానము చేసినవాడు) అందురు. సగము తిని వదిలిన మోదకములను ఫలములను మరల తినినవాడు, సాక్షాత్తుగా లవణమును తినువాడు గోమాంసాశనము చేసినవానితోతుల్యుడు. జలపానము చేయునపుడు ఆచమనము చేయునపుడు పదార్థములను తిను నపుడు ధ్వనిచేయరాదు. అట్లు చేసినచో నరకమును పొందును. విహితమైన అన్నముచే నిందించక తినవలయును. మౌనముగా భుజించవలయును. మొదట ‘అమృతోపస్తరణ మసి’ అని జలమును స్వీకరించవలయును. భోజన అంతమున ‘అమృతాపి ధానమసి’ అను మంత్రముతో ఒకసారిజలమును పానము చేయవలయును. ప్రాణాహుతులనిచ్చి ఆచమనము చేసి భోజనముచేయవలయును. భోజనము తరువాత ఆచమనముచేసి శాస్త్రచింతన చేయ వలయును. రాత్రిపూటకూడా యథాశక్తిగా అసనశయన భోజనాదులను ఆచరించవలయును. ఇట్లు గృహస్థుడు ప్రతిదినము సదాచారపరుడు కావలయును. సదాచార పరిత్యాగము చేసినవాడు ప్రాయశ్చిత్తి అగును.

కేశములు తెల్లబడుట, శరీరము ముడతలు పడుట మొదలగు దోషములను శరీరమున జూచిన వెంటనే భార్యను పుత్రులకప్పగించికాని, వెంటతీసుకొనికాని వనమునకు వెళ్ళవలయును. వనమున మూడు వేళలా స్నానము చేయవలయును. నఖములను, జటలను, మీసములను, గడ్డములను ధరించి ఉండవలయును. క్రింద పరుండవలయును. బ్రహ్మచర్యమును పాటించ వలయును. పంచ యజ్ఞములను ఆచరించ వలయును. ప్రతి నిత్యము ఫల మూలమును భుజించుచు స్వాధ్యాయ నిరతుడు కావలయును. సర్వప్రాణులయందు దయకలవాడై నారాయణ పరాయణుడు కావలయును. గ్రామములోని పూవులను పండ్లను గ్రహించరాదు. ఎనిమిది ముద్దలు మాత్రమే అన్నమును తినవలయును. రాత్రిపూట భోజనము చేయరాదు. వానప్రస్థాశ్రమమువాని తైలమును పూర్తిగా విడువవలయును. సంగమును, నిద్రను, సోమరి తనమును పరిత్యజించ వలయును. శంఖచక్రగదాపాణియగు నారాయణుని స్మరించుచుండవలయును. తపము నాచరించుచుండ వలయును. చాంద్రాయణాది వ్రతములను ఆచరించవలయును. శీతాతపాది బాధలను సహించ వలయును. అగ్ని పరిచర్య చేయుచుండవలయును. అన్ని వస్తువుల విషయమున మనసులో వైరాగ్యము కలిగిన పిమ్మటనే సన్యసించవలయును. లేనిచో పతితుడగును. శంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, వేదాంతాభ్యాస నిరతుడు కావలయును. సుఖదుఃఖాది ద్వంద్వరహితుడుగా అహంకార మమకారరహితుడుగా సర్వదా ఉండవలయును. ద్విజుడుగ యతి నగ్నుడుగా కాని జీర్ణ కౌపీనుడుగా కాని ఉండవలయును. మానావమానములో, శత్రుమిత్రులలో సముడుగా ఉండవలయును. గ్రామమున ఒకరాత్రి, నగరమున మూడు రాత్రులు ఉండవలయును. నిత్యము భిక్షాన్నముతో జీవికను గడుపవలయును. ఒక ఇంటి అన్నము తినరాదు. నిందితుడు కాని ద్విజు నింట్లో అగ్నిని చల్లార్చిన తరువాత, భోజన సమయము కానివేళ, వివాదములు లేనిచోట యతి భిక్షాటనమును చేయవలయును. త్రికాలమున స్నానమును చేయవలయును. నారాయణ పరాయ ణుడు కావలయును. నిత్యము ప్రణవమును జపించవలయును. ఇంద్రియ జయము కలిగియుండవలయును. యతి ఒకే ఇంట అన్నమును కోరినచో తినినచో పదివేల ప్రాయశ్చిత్తములు చేసిననూ నిష్కృతి లభించదు. యతి లోభముచే శరీర పోషణ పరుడైనచో చండాలసముడుగను. వర్ణాశ్రమ ధర్మపరుల నిందకు పాత్రుడగును. ఎపుడూ ఆత్మానంద మగ్నుడై వికారరహితుడు అద్వితీయుడు, నిర్మలము, శాంతుడు, మాయాతీతుడు, మాత్సర్య రహితుడు, అన్యముఖుడు, పరిపూర్ణుడు, సదానైక విగ్రహుడు, జ్ఞానస్వరూపుడు, నిర్మలుడు పరభ్యోస్వరూపుడు, సనాతనుడుగా ఆద్యంతరహితుడు జగచ్చైతన్య కారణుడు నిర్గుణుడు పరాత్పరుడు పరముడు అయిన పరమాత్మయగు నారాయణుని ధ్యానించ వలయును. ఉపనిషద్వాక్యములను పఠించవలయును. వేదాంతర్థ చింతన చేయ వలయును. జితేంద్రియుడై సహస్రశీర్షుడగు నారాయణ దేవుని ధ్యానము చేయవలయును. ఇట్లు మాత్సర్యమును వీడి ధ్యానపరుడైనచో సనాతనుడు పరంజ్యోతి అగు పరమానంద స్వరూపమును పొందును. ఇట్లు ఆశ్రమాచారములను యథాక్రమముగా ఆచరించిన మరల తిరిగి రాని పరమపదమును పొందుదురు. వర్ణాశ్రమాచారపరులు సర్వపాప విర్జితులై నారాయణపరులై శ్రీ మహావిష్ణు నిలయమైన పరమపదమును పొందెదరు. (1/27)