నారద మహా పురాణము
పురుషోత్తమ మాహాత్మ్యము
వసువు పలికెను: దేవతలను, ఋషులను, పితరులను, ఇతరులను తృప్తిపరిచి, ఆచమనము గావించి వాణ్నియమముతో హస్తమాత్రముగా చతుష్కోణము, చతుర్ద్వారము, సుందరమగు పురమును, సముద్ర తీరమున లిఖించి పురమధ్యమున అష్టపత్రము కర్ణికా సహితముగా పద్మమును లిఖించవలయును. ఇట్లు మండలమును లిఖించి ఆ మండలమున అష్టాక్షర విధానముచే అజుడు విభుడగు నారాయణుని పూజించవలయును. ఇక ఇపుడు నీకు ఉత్తమమగు కాయ శోధనమును గురించి చెప్పెదను. రక్తము రేఫ సమన్వితమగు క్షకారమును హృదయమున చింతించవలయును. జ్వలించునది త్రిశిఖము, పాప సంచయమును దహించునది, చంద్ర మండల మధ్యస్థమగు ఏకార మును శిరసున చింతించవలయును. శుక్ల వర్ణముకలది, భూమిని తడుపుచు అమృతమును వర్షించుచున్న ఏకారమును శిరమున చింతించవలయును. ఇట్లు కాయశుద్ధిచే పాపములు నశించి దివ్యదేహము కలవాడగును. తరువాత దేహమునందు ఆత్మయందు అష్టాక్షర మంత్రమును న్యాసము చేయవలయును. వామపాదమున ఆరంభించి క్రమముగా న్యాసము గావించవలయును. పంచాంగ మును, వైష్ణవమును, చతుర్వ్యూహము నుంచవలెను. తరువాత సాధకుడు మూలమంత్రముచే కరశుద్ధిని చేయవలెను. విడివిడిగా అన్ని వ్రేళ్ళయందు ఒక్కొక్క దానిని ఒక్కొక్క వర్ణముతో ఉంచవలెను. శ్యామ వర్ణముగల భూబీజమగు మకారమును దక్షిణ పాదమున నుంచవలయును. కాలరూపమగు ‘మో’కారమును వామకటియందు ఉంచవలెను. పూర్వ బీజమగు నాకారమును దక్షిణ కటియందు ఉంచవలెను. తేజో బీజమగు రాకారమును నాభి దేశమునందు ఉంచవలెను. వాయు బీజమగు య కారమును వామ స్కంధమున నుంచవలెను. ‘ణా’ కారమును దక్షిణ భుజమున నుంచవలెను. సకల లోకములుండు శిరస్సున ‘య’ కారముండును. ఓంకారమును హృదయమున నుంచి వికారమును శిరస్సున నుంచి ‘ష్ణ’ కారమును నేత్రములందు ఉంచవలెను. ‘వే’ కారము అస్త్రముగా చెప్పబడినది. శుక్లవర్ణుడగు వాసుదేవుడు లలాటమున ఉండును. రక్త వర్ణుడు వహ్ని సన్నిభుడగు సంకర్షణుడు ముఖమున ఉండును. పీత వర్ణుడగు ప్రద్యుమ్నుడు హృదయమున, అనిరుద్ధుడు మేహనేంద్రియమున, సర్వాతిగములందు సర్వశక్తి చతుర్వూహుడగు శ్రీహరి ఉండును. నాకు ముందు భాగమున శ్రీవిష్ణువు, వెనుక భాగమున కేశవుడు, దక్షిణ పార్శ్వ మున గోవిన్దుడు, వామ పార్శ్వమున మధుసూదనుడు ఉండును. ఊర్థ్వ భాగమున వైకుంఠుడు, అధోభాగమున వరాహస్వామి, అవాంతర దిశలయందు మాధవుడు ఉండును. నడుచు, నిలుచు, మేలుకున్న నన్ను నరసింహ స్వామి కాపాడును. ఇట్లు విష్ణుమయుడై, కర్మ ఆరంభించవలెను. దేహమునందున్న విధముగా దేవుని యందు అన్ని తత్త్వములను న్యాసమును చేయవలెను. సర్వ విఘ్నహరము, శుభమగు ఫకారాన్తము వరకు న్యాసము ఉద్దేశించబడినది. ఇచటనే అర్క చంద్ర వహ్ని మండలములను ధ్యానించవలెను. భువనాంతర్భాగ మున పద్మమధ్యమున విష్ణు న్యాసమును చేయవలెను. తరువాత హృదయమున ఉత్తమ జ్యోతి రూపమగు ప్రణవమును చింతించి, సనాతన జ్యోతిరూపమును కర్ణికయందు ఆసీనమైనట్టు భావించి తరువాత యథాక్రమముగా అష్టాక్షర మంత్రమును యధాక్రమముగా న్యాసమును గావించవలెను. ఇట్లు వ్యస్తముగా సమస్తముగా చేయునది ఉత్తమపూజగా పేర్కొనబడినది. తరువాత ద్వాదశాక్షర మంత్రముచే సనాతన దేవుని పూజించవలెను.
ఇట్లు హృదయావధారణ తరువాత కర్ణికయందు బహిర్భాగమున ఉంచవలెను. చతుర్భుజుని మహాసత్త్వుని సూర్యకోటి సమప్రభుని ధ్యానించి మహా యోగమును క్రమముగా ఆవాహన చేయవలెను. మీన రూపధారి, నరసింహ స్వామి, వామనుడు, వీరందరు నాకు నారాయణుని అగ్రభాగమున రావలెను. నీకు సుమేరువు పాదపాఠము, పద్మకల్పితమగు ఆసనము. సర్వతత్త్వ హితము కొరకు మధుసూదనా నీవు ఉండుము. ఓ సనాతనా! పద్మనాభా! నీ పాదములకు పాద్యమును, కమలపత్రాక్షా! మధుసూదనా! శ్రీవిష్ణూ! బ్రహ్మాదులచే కల్పించబడిన పాద్యమును నాచేత స్వీకరించుము. ఓ పురుషోత్తమా ? భక్తిచే నివేదించు అర్ఘ్యమును గహించుము. సర్వపాపహారి, శుభప్రదము అగు మందాకినీ జలమును నాచే భక్తిపూర్వకముగా నివేదించబడు అచమనీయమును స్వీకరించుము. నీవే జలము. నీవే పృథివి. నీవే అగ్నివి. నీవే వాయువు. లోకాచారము ననుసరించి జలముచే స్నానము చేయించుచున్నాను. దేవతంతు సమాయుక్తములు, యజ్ఞవర్ణ సమన్వితములు స్వర్ణ వర్ణ ప్రభలు అగు వస్త్రములను స్వీకరించుము. నాకు నీ శరీరము తెలియదు. చేష్ఠ తెలియదు. నేను నివేదించు గ్రంథమును స్వీకరించి లేపనము చేసుకొనుము. ఋగ్యజు స్సామ మంత్రములచే బ్రహ్మచేత్రి వృతమగు, సావిత్రీ గ్రంథి సంయుక్తమగు ఉపవీతమును నీకర్పించుచున్నాను. దివ్యరత్న సమాయుక్తములు, వహ్ని బాను సమప్రభలు అగు అలంకార ములు నీ అవయవములను అలంకరించును. సూర్య చంద్రుల మెరుపు అగ్నుల జ్యోతి నీస్వరూపమగు జ్యోతిదీపమును స్వీకరిం చుము, వనస్పతి రనము, దివ్యము, గంధాడ్యము, సురభియగు ధూపమును నేను అర్పించు వానిని స్వీకరించుము. షడ్రన సమన్వితము స్వాదుయగు నాచే సమర్పించబడు చతుర్విధాన్న మును నైవేద్యముగా స్వీకరించుము. పూర్వ దళమున వాసుదేవుని, దక్షిణదళమున సంకర్షణుని, పశ్చిమమున ప్రద్యుమ్నుని, ఉత్తరమున అనిరుద్ధుని న్యాసము గావించవలెను. ఆగ్నేయమున వరాహస్వామిని నైఋతి దిక్కున నరసింహుని వాయవ్యమున మాధవుని, ఈశాన్యమున త్రివిక్రముని న్యాసము చేయవలయును. అష్టాక్షర మంత్రమునకు చుట్టూ గరుడ న్యాసము గావించవలెను. వామ పార్శ్వమున చక్రమును, దక్షిణ పార్శ్వమున శంఖమును, దేవునకు దక్షిణమున మహాగదను వామ భాగమున శార్జధనువును న్యాసము గావించవలెను. దక్షిణమున అమ్ముల పొదను, వామ భాగమున ఖడ్గము ఉంచవలెను. దక్షినమున శ్రీని, ఉత్తరమున పుష్ఠిని ముందు వనమాలను, తరువాత శ్రీవత్స కౌస్తుభములను ఉంచవలెను. పూర్వాది చతుర్దిశల యందు హృదయాది న్యాసము గావించవలెను. తరువాత మూలలందు దేవదేవుని అస్త్రన్యాసమును గావించవలెను. ఇంద్రుని, అగ్నిని, యముని, నైఋతిని, వరుణుని, వాయువును, కుబేరుని, ఈశుని బ్రహ్మతో అనన్తుని ఊర్ధ్వాధో భాగములందు ఆయా మంత్రములచే పూజించవలెను. ఇట్లు మండలస్థుడగు జనార్దనుని పూజించి, పూజలనందిన శ్రీహరిని దర్శించిన వారు శ్రీహరిలో ప్రవేశించెదరు. ఈ విధానము ననుసరించి మండలస్థుడగు జనార్దనుని ఒకమారు పూజించిననూ అభిమత కామనలను పొందును. జన్మమృత్యు జరాభయములను విడిచి శ్రీవిష్ణు పదమును పొందును. సర్వకాలములందు భక్తిచే ఏమరుపాటులేక నారాయణుని స్మరించువానికి నివాసమునకు శ్వేత ద్వీపము లభించును. ఓంకారాది సమాయుక్తమగు తదీయ నమస్కారము నామ సహితము సర్వతత్త్వములను మంత్రముగా చెప్పబడును. ఈ విధానముతోనే గంధపుష్పాదులను నివేదించవలెను. ఒక్కొక్కరికి యధోద్దిష్టముగా యధాక్రమముగా ఆచరించవలెను. యధోక్త క్రమముగా ముద్రలను ప్రదర్శించవలెను. మూల మంత్రముచే జపమును చేయవలెను. అష్టావింశతికాని, అష్టకాని, అష్టోత్తర శతమును కాని జపించవలెను. కామ్యకర్మలందు యధోక్తమును యధాశక్తి సావధానముగా జపించవలెను. పద్మము, శంఖము, శ్రీవత్సము, గద, గరుడము, చక్రము, ఖడ్గము, శార్జము అను ఎనిమిది ముద్రలు చెప్ప బడినవి. ఓ పురాణ పురుషోత్తమా! పరమ స్థానమునకు వెళ్ళుము. నీ స్థానమున బ్రహ్మాదిదేవతలు కూడా తెలియరు. మంత పూర్వకముగా యధోక్త విధిగా అర్చనము తెలియనివారు ఇచట మూలమంత్రముచే అచ్యుతుని పూజింతురు. (II/57)