నారద మహా పురాణము
ఇంద్రునికి బ్రహ్మ ఓదార్పు
బ్రహ్మపలికెను: నీవేమి ఆశ్చర్యమును చూచితివి? ఎందుకు భేదము నొందుచున్నావు? సద్గుణముల విషయమున పరితపించుట మరణాంతకమగును కదా? నరుడు శ్రీహరినామోచ్చారణముననే పదమును పొందును కదా? ఇక ఆ హరి వాసరమున ఉపవసించిన వాడు ఏల పరమపదమును చేరడు? శ్రీకృష్ణునకు చేయు ఒక్క ప్రణామమే దశాశ్వమేధ అవభృధములతో సమానము. పది అశ్వమేధములను చేసినవాడు పునర్జన్మను పొందును. శ్రీకృష్ణునకు నమస్కారమును చేసినవాడు పునర్జన్మను పొందడు. శ్రీహరినామము జిహ్వాగ్రమున కలవానికి కురుక్షేత్రముతో, కాశితో, విరజానదితో ఏమిపని? బ్రాహ్మణుడై చండాల స్త్రీని రజస్వలగా ఉన్నపుడు సంగమించిన, పాచి అన్నమును తినువాడైనను అంత్య కాలమున శ్రీహరినామమును స్మరించినచో అభక్ష్య భక్షణమువలన అగమ్యగమనము వలన కలుగు పాపములనుండి విముక్తుడై సంసార బంధములను తెంచుకొని విష్ణు సాయుజ్యమును పొందును. శ్రీహరి వాసరమున ఉపవసించినచో ఏల మోక్షమురాదు? శ్రీహరి వాసరమున శ్రీ మన్నారాయణుని చింతించుచు, గానము చేయునుకదా. భక్తి లేకున్ననూ లీలా మాత్రముగా శ్రీహరినామమును పలికిననూ, వినిననూ, గంగాజలముతో పవిత్రుడైన వానితో సముడగును. మనకు లోకములకు నాథుడు పురుషోత్తముడు. మనందరికి జన్మనిచ్చిన వాడు. అట్టి శ్రీహరి వాసరమును సేవించువానిని ఎవరు ఎట్లు శాసించగలరు? శ్రీహరి భక్తులచే నీవు చూర్ణము చేయబడలేదు. వారు దృఢముగా నిన్ను బంధించలేదు. అదియే వారు మనయెడ చూపిన గౌరవమని ఏలతెలియవు? రాజుగారి నుండి పొందు భోగములను తెలియజాలని సేవకుడు చాలా దుఃఖమును పొంది రాజభటులచే నిగ్రహించబడును. సేవకులు రాజులకు ఇష్టులైన వారు అపరాధములను చేసిననూ నిగ్రహించరాదు. ప్రభువు అనుగ్రహమువలన వారు సిద్ధపురుషులు గాన శాసించువారిని నిగ్రహింపచేతురు. అట్లే జనార్దనుని భక్తులు పాపములను చేసినంతమాత్రమున వారిని శాసించ సాహసించుట నీ బాల్యమును చాటును. ఓ యమధర్మరాజా? శివభక్తుల విష యమున, సూర్య భక్తుల విషయమున, నా భక్తుల విషయమున కానీ నీకు సాయము చేయగలను కాని శ్రీహరి భక్తుల విషయమున నేను ఏమియును చేయజాలను. దేవతలందరికి ఆదిదేవుడు పురుషోత్తముడు. కావున మధుసూదన భక్తులను నిగ్రహించుట సాధ్యముకానిపని. రెండు పక్షములలో ద్వాదశీ వ్రతమును కపటముతో ఆచరించిన వారు చేసిన అవమానమున నేను సాయము చేయ జాలను. ఓ సూర్యపుత్రా! నీకు సాయమును చేసినచో నాకు దేవఘాతకమగు అవినీతి సంక్ర మించును. బ్రహ్మ పదచ్యుతికూడా కలుగును. కావున విష్ణు భక్తులకు నేను అడ్డుపడలేను. బ్రహ్మ లోకమునకు మార్గమును చూపినది విష్ణు భక్తులే కదా? (II/6)