ద్వాదశమాసస్థిత సప్తమీ వ్రత నిరూపణము

ఓ నారదా! ఇపుడు నేను నీకు సప్తమీ వ్రతములను చెప్పెదను వినుము. ఈ వ్రతముల ఆచరించిన మానవుడు సూర్యుని సాయుజ్యమును పొందును. చైత్ర శుక్ల సప్తమినాడు బయట స్నానము చేయవలెను. గోమయముచే అలుకబడి, గౌరవర్ణమృత్తికచే పూయబడిన స్థండిలమున అష్టదళ పద్మమును లిఖించి కర్ణికయందు సూర్యుని ఉంచి, పూర్వ పత్రమునందు ధాతువులచే చేయబడిన ఇద్దరు దేవతలను ఉంచవలెను. ఆగ్నేయ పత్రమునందు కారకములచే చేయబడిన గంధర్వులను ఉంచవలెను. దక్షిణ పత్రమునందు రాక్షస ద్వయమును ఉంచవలెను. నైఋతి దిక్పత్రమునందు ఆకృతి ద్వయము నుంచవలెను. పశ్చిమ పత్రమునందు కాద్రవేయులగు మహానాగులను ఉంచవలెను. వాయువ్య పత్రమునందు యాతు ధాన ద్వయమును, ఉత్తర పత్రమున ఋషి ద్వయమును, ఐశాన్య పత్రమునందు ఒక గృహము నుంచవలెను. ఇట్లుంచిన వాటిని గంధమాల్యానులేపనములచే, దీప ధూప నైవేద్యములచే, తాంబూల క్రమకాదులచే పూజించవలెను. ఇట్లు పూజించి, నూట ఎనిమిదిమార్లు నేతితో హోమమును చేయవలెను. సూర్యునికి ఎనిమిది, ఇతరులకు ఎనిమిది ఆహుతులను ఈయవలెను. వేదియందు నామమంత్రముచే ఈయవలెను. తరువాత పూర్ణాహుతిని ఆచరించవలెను. యధాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణను ఈయవలెను. ఇట్లు సవిధిగా ఈ వ్రతమును ఆచరించినచో సర్వసౌఖ్యములను పొందును. దేహాంతమున సూర్య మండలమును ఛేదించి పరమపదమును చేరును.

వైశాఖ శుక్ల సప్తమినాడు జహ్నుమహర్షి జాహ్నవీ నదిని కోపముచే త్రాగి మరల దక్షిణ కర్ణము నుండి విడిచెను. ఈ దినమున ప్రత్యూష కాలమున గంగానదిలో స్నానము చేసి గంగానదిని గంధపుష్పాక్షతాదులచే సర్వోపచారములచే పూజించవలెను. ఈ గంగావ్రతమున ఒకవేయి ఘటములను దానము చేయవలెను. ఈ వ్రతమును భక్తితో చేసినచో ఏడు తరములును స్వర్గమునకు చేరును. ఈ దినమున కమల వ్రతమును కూడా చెప్పిరి. ఆ విధానమును చెప్పెదను. ఒక తిలమాత్ర సువర్ణముతో కమలమును నిర్మించి వస్త్ర యుగ్మముచే కప్పిపుచ్చి, గంధ ధూపాదులచే పూజించవలెను. పద్మ హస్తునకు నమస్కారము. విశ్వధారికి నమస్కారము. దివాకరా! నీకు నమస్కారము. ప్రభాకరా! నీకు నమస్కారము. ఇట్లు దేవేశుని ప్రార్థించి సూర్యాస్తమయమున ఉదకుంభముతో స్వర్ణ కమలమును, కపిలగోవును బ్రాహ్మణునకు సమర్పించవలయును. ఆ దినము ఉపవసించి మరునాడు భుజించవలయును. భక్తితో బ్రాహ్మణులను భుజింపజేసి వ్రత సాఫల్యమును పొందును. ఈ దినముననే నింబపత్రములు (వేపాకు)చే పూజించవలెను. 'ఓంకారమును' ఆదిలో చేర్చి 'ఖఖోల్కాయ' అను మంత్రముచే నింబపత్రమును భుజించవలెను. మౌనముగా భూమియందు పరుండవలెను. మరునాడు బ్రాహ్మణులను భుజింపజేసి తాను కూడా బంధువులతో కలిసి భుజించవలెను. ఈ నింబపత్ర వ్రతము నాచరించువారికి సర్వ సౌఖ్యములను ఇచ్చును. ఈ సప్తమినే శర్కరానామముతో పిలిచెదరు. అమృతమును త్రాగుచున్న సూర్యుని హస్తము నుండి అమృత బిందువులు భూమిమీద పడి శాలి ముద్దయవ ఇక్షువులుగా పుట్టినవి. చెరుకు నుండి శర్కర అమృతము వంటి చెఱకురసము స్రవించినది కావున సూర్యునకు ప్రియమగు శర్కర హవ్యకవ్య ములలో ఉపయోగింతురు. ఈ శర్కరా సప్తమీ వ్రతమును ఆచరించినచో అశ్వమేధ ఫలమును ప్రసాదించును. ఈ వ్రతము సర్వ దుఃఖములను ఉపశమింపచేయును. పుత్రసంతానమును పెంచును. ఈ సప్తమినాడు శర్కరాదానము, శర్కరా భోజనమును శ్రద్ధతో చేయవలెను. ఈ వ్రతము సూర్యునకు చాలా ప్రియము. పరమభక్తిచే ఈ వ్రతమును ఆచరించు వారికి సద్గతి లభించును. ఇక జ్యేష్ఠ శుద్ధ సప్తమినాడు రవి స్వయముగా ఇంద్రుడాయెను. యధావిధిగా ఆ ఇంద్రుని పూజించి ఇంద్రియ నిగ్రహముతో ఉపవసించినచో దేవేంద్రుని అనుగ్రహము వలన స్వర్గమును పొందును. ఆషాఢ శుక్ల సప్తమినాడు భాస్కరుడు 'వివస్వాన్' అను పేరుతో పుట్టెను. ఆ దినమున వివస్వంతుని గంధపుష్పాదులచే ప్రత్యేకముగా పూజించి చక్కగా ప్రార్ధించి సూర్య సాయుజ్యమును పొందును. శ్రావణ శుక్ల సప్తమినాడు శుభకరమగు అవ్యంగమను వ్రతమును ఆచరించవలెను. నాలుగు హస్తముల పత్తి సార్థవస్త్రములను గోపతి పూజాంతమున ప్రీతి కొఱకు దానము చేయవలెను. ఈ వ్రతము పరమ శుభప్రదము. ఈ సప్తమీ హస్తా నక్షత్రయుక్తమగుచో పాపనాశిని కాగలదు. ఈ దినమున దానము జపము, హోమము అంతయూ అక్షయమగును. భాద్రపద శుక్లసప్తమినాడు అముక్తా భరణ వ్రతముకలదు. ఈ వ్రతమున చంద్రుని శంకరుని పూజచేయవలయును. గంధాది షోడశోపచారములచే పూజించి, ప్రార్థించి, నమస్కరించి సర్వకామ సమృద్ధి కొఱకు విసర్జించవలయును. ఇదియే ఫలసప్తమి అనబడును. ఇపుడు ఈ విధానమును చెప్పెదను. నాలికేరము, వృంతాకము, నారంగము, బీజపూరకము కూష్మాండము, బృహతీ, పూగము అనుసప్త ఫలములను మహాదేవుని ముందు ఉంచవలెను. మరియొక దోరకమును సప్త గ్రంధియుక్తముగా సప్తతంతుయుతమును ఉత్తమ భక్తిచే పూజించి వామకరమున ధరించవలెను. పురుషుడైనచో దక్షిణ కరమున ధరించవలెను. వర్షపూర్తివరకు ఉంచవలెను. ఏడుగురు బ్రాహ్మణులను పాయసముతో భోజనము చేయించి విడిచి వ్రత సంపూర్తి కొరకు తాను భుజించవలెను. సప్త ఫలములను సప్త బ్రాహ్మణులకు దానము చేయవలెను. ఇట్లు ఏడు సంవత్సరములు యధావిధిగా ఉపాసించి వ్రతము నాచరించినచో మహాదేవుని సాయుజ్యమును పొందును. ఆశ్వయుజ శుక్ల సప్తమినాడు శుభ సప్తమియని తెలియుము. ఈ దినమున స్నానముచేసి పూజించి బ్రాహ్మణులచే స్వస్తి వాచనము కావించి కపిల ధేనువును పూజించి ప్రార్తించవలెను. ఓ కళ్యాణి! నేను నిన్ను దానము చేయుచున్నాను. సూర్యభగవానుడు సంతోషించుగావు. నీవు ధర్మ సంభవవు కావున సకల జగత్తును కాపాడుము. ఇట్లు పలికి వేదజ్ఞునకు దక్షిణతో గోవును దానము గావించి, నమస్కరించి తాను పంచగవ్య ప్రాశనముచేసి చేసి వ్రతమును పూర్తిచేసి మరునాడు బ్రాహ్మణులను భుజింపచేసి, బ్రాహ్మణ శేషాన్నమును తాను భుజించవలెను. ఇట్లు శ్రద్ధతో వ్రతము నాచరించినచో భుక్తిని ముక్తిని పొందును. ఇక కార్తీక శుక్ల సప్తమినాడు శాకా సప్తమీ వ్రతము నాచరించవలెను. ఈ దినమున సప్తశాకములను స్వర్ణకమలములను ఏడుగురు బ్రాహ్మణులకు దానముచేసి తాను శాకాహారమును తీసుకొనవలెను. మరునాడు బ్రాహ్మణులను భుజింపచేసి వారికి దక్షిణలనిచ్చి వారిని విడిచి తాను బంధువులతో కలిసి భోజనముచేసి వ్రతమును పూర్తి చేయవలెను. మార్గశీర్ష శుక్ల సప్తమినాడు మిత్ర వ్రతము నాచరించవలెను. శ్రీమహావిష్ణువుయొక్క దక్షిణ నేత్రము కశ్యపునకు అదితియందు మిత్రుడను పేరుతో దివాకరుడు పుట్టెను. కావున ఈ తిధి అందు యధావిధిగా మిత్రుని పూజించవలెను. మధురాదులతో ఏడుగురు బ్రాహ్మణులను భుజింపచేసి సువర్ణ దక్షిణను ఇచ్చి విసర్జించి తాను భుజించవలెను. ఈ వ్రతమును యథావిధిగా ఆచరించిన సూర్యలోకమును చేరును. బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సును పొందును. శూద్రుడు సత్కులమున జన్మను పొందును. పుష్య శుక్ల సప్తమినాడు అభయ వ్రతమును ఆచరించవలెను. ఉపవసించి మూడు పూటలా భానువును పూజించి, కీరములతో తడిపిన ప్రస్థ సమ్మితముగా మోదకమును బ్రాహ్మణున కిచ్చి మరొక ఏడెనిమిది మంది బ్రాహ్మణులను భుజింపచేసి భూమిని కాని సువర్ణమును కాని దక్షిణగా ఇచ్చి తాను భుజించవలెను. ఈ అభయ వ్రతము అందరికి అభయ ప్రదముగా పేర్కొనబడినది. ఈ దినముననే కొందరు మార్తండ వ్రతమును చెప్పెదరు. రెండు వ్రతములకు ఒకే దేవత కావున ఈ రెండు ఒకటే అని పండితులు చెప్పుచుందురు. మాఘ బహుళ సప్తమినాడు సర్వాప్తి వ్రతము చెప్పబడినది. ఆ దినమున ఉపవసించి ఆదిత్యుని, అంబికను సువర్ణగంధ పుష్పాదులచే పూజించి, రాత్రి పూట జాగరణచేసి మరునాడు బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణను నారికేళమును వారికి ప్రదానముచేసి, గురువునకు సువర్ణరవి బింబమును దక్షిణతో ప్రదానముచేసి, చక్కగా ప్రార్ధించి విడిచిపెట్టి తాను భుజించవలెను. ఇది సర్వాప్తిద వ్రతము. ఈ వ్రతము ప్రభావము వలన సర్వా భీష్టములు సిద్ధించును. మాఘ శుక్ల సప్తమినాడు అచలావ్రతము చెప్పబడినది. ఈ దినము సర్వ పాప హరమగు త్రిలోచన జయంతి. ఈ దినము రథసప్తమి కూడా. ఈ సప్తమి చక్రవర్తిత్వ ప్రదాయిని. ఈ సప్తమినాడు బంగారు అశ్వములతో కూడియున్న రథమున ఉన్న సువర్ణ సూర్య ప్రతిమను భక్తి భావముతో పూజించినవారు ఇహలోకమున అన్ని భోగములను అనుభవించి అంతమున శివసాలోక్యమును పొందెదరు. ఈ సప్తమినే భాస్కరీ సప్తమి అందురు. ఇది కోట భాస్వద్గ్రహోపమ. ఈ దినమున అరుణోదయ వేళయందు స్నానము చేయవలెను. జిల్లేడు రేగిచెట్ల ఏడేడు దళములను శిరమున ఉంచుకొని స్నానముచేసినచో ఏడు జన్మల పాపములు నశించును. ఈ దినమున స్వయముగా సూర్యభగవానుడే పుత్ర ప్రదవ్రతమును చెప్పెను. మాఘ శుక్ల సప్తమినాడు నన్ను యధావిధిగా పూజించినవానికి అతని పూజచే సంతోషించిన నేను పుత్రునిగా జన్మింతును. కావున ఇంద్రియములను జయించి పగలు రాత్రి ఉపవసించి మరునాడు చక్కగా పూజించి, హోమము నాచరించి బ్రాహ్మణులకు దధ్యోదనముతో, పాలతో, పాయసముతో భోజనము పెట్టవలెను. ఈ విధానముచే పుత్ర సప్తమీ వ్రతము నాచరించిన వారికి ఆరోగ్యవంతుడు దీర్ఘాయువు సజ్జనుడగు పుత్రుడు కలుగును. ఇక ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు అర్కపుట వ్రతమును ఆచరించవలెను. అర్కపత్రములచే సూర్యునికి హోమమును చేయవలెను. అర్కపత్రములను భుజించవలెను. ఎప్పుడూ అర్క నామమును జపించవలెను. ఇదియే అర్కపుట వ్రతము. ఈ వ్రతము ధన ప్రదము, పుత్ర ప్రదము సర్వపాప ప్రణాశనము, త్రివర్గ ప్రదము అని చెప్పబడినది. ఇట్లే మరికొందరు ఇచట యజ్ఞ వ్రతమును చెప్పిరి. ఈ దినమున యధావిధిగా హోమమును ఆచరించవలెను. అన్ని నెలలలోని అన్ని సప్తములలో భాస్కరా రాధనము సర్వకామప్రదముగా చెప్పబడినది. (4/116)

ద్వాదశమాస అష్టమీ వ్రత కథనము

సనాతన మహర్షి పలికెను: చైత్ర శుద్ధ అష్టమినాడు భవానీదేవి పుట్టినది. ఆ రోజు నూరు ప్రదక్షిణములనుచేసి యాత్రా మహోత్సవమును చేయవలెను. జగదంబా దర్శనము నరులకు సర్వానంద ప్రదము. ఇచటనే అశోక కలికా ప్రాశనము చెప్పబడినది. పునర్వసూనక్షత్ర యుక్తమగు చైత్రశుద్ధ అష్టమినాడు ఎనిమిది అశోక కళికలపానము చేసినవారు ఎపుడూ దుఃఖమును పొందరు. దేవీ పూజా విధానమున దీనినే మహాష్టమి అందురు. వైశాఖ శుద్ధ అష్టమినాడు ఉపవసించి, నీటిలో స్నానముచేసి, అపరాజితాదేవిని మాంసీ బాలక జలముచే స్నానమును చేయించి, గంధాదులచే పూజించి శర్కరామయముగా నైవేద్యమును సమర్పించి, నవమి నాడు కన్యకలను భుజింపచేయవలెను. ఇట్లు ఆచరించినచో దేవీ అనుగ్రహముతో జ్యోతిర్మయ విమానములో సూర్యునివలె ప్రకాశించుచు లోకములలో విహరించును. జ్యేష్ఠ బహుళ అష్టమినాడు దేవీ అనుగ్రహముతో జ్యోతిర్మయ విమానములో సూర్యునివలె ప్రకాశించుచు లోకములో విహరించును. జ్యేష్ఠ బహుళ అష్టమినాడు దేవిని పూజించువాడు గంధర్వ అప్సరోగణములతో విమానమున సంచరించును. ఆషాఢ శుక్ల అష్టమినాడు రాత్రి జలముతో స్నానముచేసి, దేవిని కూడా అదే జలముతో స్నానము చేయించి యథావిధిగా పూజించవలెను. తరువాత శుద్ధ జలముచే స్నానము చేయించి చందనమును అలది శర్కరోపేత నైవేద్యమును సమర్పించి ఆచమనము నీయవలెను. తరువాత బ్రాహ్మణులను భుజింపచేసి స్వర్ణ దక్షిణలనిచ్చి వారిని విడిచి మౌనముగా తాను భుజించవలెను. ఈ వ్రతమును ఆచరించినవాడు దేవీ లోకమును పొందును. శ్రావణ శుక్లాష్టమినాడు యధావిధిగా దేవిని పూజించి, పాలతో స్నానము చేయించి, మిష్టాన్నమును నైవేద్యము సమర్పించవలెను. మరునాడు బ్రాహ్మణులను భుజింపచేసి తాను భుజించి ఈ వ్రతమును సమాప్తి చేయవలెను. ఈ వ్రతము సంతానమును వృద్ధి చేయును. శ్రావణ బహులాష్టమినాడు దశాఫలము చెప్పబడినది. ఉపవాసమును సంకల్పించి, స్నానముచేసి, నిత్యకర్మల నాచరించి పది కృష్ణతులసీ దళములతో పూజించవలెను. కృష్ణ, విష్ణు, అనన్త, గోవిన్ద, గరుడధ్వజ, దామోదర, హృషీకేశ, పద్మనాభ, హరి, ప్రభు అను నామములతో శ్రీకృష్ణ భగవానుని పూజించవలెను. తరువాత ప్రదక్షిణ నమస్కారములను చేయవలెను. ఈ వ్రతమును ఇట్లు పది దినములు చేయవలెను. ఇది అన్ని వ్రతములలో ఉత్తమ వ్రతము. ఆది మధ్యాంతములలో విధిననుసరించి హోమమును చేయవలెను. కృష్ణ మంత్రముతో చరువుతో అష్టోత్తర శతము హోమమును గావించవలెను. హోమాంతమున యధావిధిగా ఆచార్యుని పూజించవలెను. సువర్ణ తామ్ర మృణ్మయవేణు పాత్రలలో ఏదో ఒక పాత్రలో సువర్ణముతో చేసిన తులసీదళమును, బంగారు ప్రతిమనుకూడా చేయించి యధావిధిగా పూజించి, ప్రతిమనుపాత్రలో నుంచి ఆచార్యునకు సమర్పించ వలెను. వస్త్రాలంకార భూషిత, సవత్సయగు గోవును దానము చేయవలెను. పదిదినములు శ్రీకృష్ణునకు పది పూరీలను అర్పించవలెను. ఆ పూరీలను విధిజ్ఞునకు దానము చేయవలెను. లేదా తాను భుజించవలెను. శక్తి ననుసరించి శయ్యా దానమును కావించవలెను. పదవ రోజున స్వర్ణ మూర్తిని సదక్షిణగా గురువునకు అర్పించవలెను. వ్రతాంతమున పదిమంది బ్రాహ్మణులకు ప్రత్యేకముగా పది పది పూరీలను ఈయవలెను. ఇట్లు పది సంవత్సరములు ఉత్తమోత్తమమగు ఈ వ్రతమును ఆచరించి ఉపవసించి సర్వకామ సమన్వితుడగును. అంతకాలమున శ్రీకృష్ణసాయుజ్యమును పొందును. ఇదియే శ్రీకృష్ణజన్మాష్టమి. ఈ అష్టమి నరులకు పాపహరము. ఈ జన్మదినమున ఉపవాసముతో సప్త జన్మకృత పాపములు నశించును. ఉపవాసము చేయువాడు పరిశుద్ధ నదీ జలములో తిలలతో స్నానము గావించి పరిశుద్ధ ప్రదేశమున మండలమును ఏర్పరిచి మండల మధ్యమున తామ్రపాత్రను కాని మృణ్మయ పాత్రను కాని (కలశమును) స్థాపించి, ఆ కలశముపై పాత్ర నుంచి బంగారు ప్రతిమను రెండు వస్త్రములతో కప్పి, పాద్యాద్యుప చారములచే భక్తిచే పూజించవలెను. దేవకీదేవిని, వసుదేవుని యశోదాదేవిని, నందుని, వ్రేపల్లెను, గోపాలులను, గోపికలను, గోవులను అన్ని దిక్కులందు పూజించవలెను. తరువాత నీరాజనము నిచ్చి, క్షమాపణను వేడి, భక్తితో నమస్కరించి, అర్థరాత్రి వరకట్లే ఉండవలెను అపుడు మరల శ్రీకృష్ణుని స్నానము చేయించవలెను. మొదట పంచామృతముతో, మరల శుద్ధ జలముతో స్నానము చేయించి గంధాదులచే పూజించవలెను. వోమ, జీలకర్ర, శొంఠి, కలకండ నేతితో కలిపి వెండి పాత్రలో నివేదన చేయవలెను. మరల నీరాజనము నిచ్చి, దశావతార రూపుని ధ్యానించుచు ఉదయించుచున్న చంద్రునికి అర్ఘ్యము నీయవలెను. అపుడు శ్రీకృష్ణ భగవానుడు క్షమాపణ వేడి మిగిలిన రాత్రిని గడుపవలెను. పౌరాణిక స్తోత్ర పాఠములతో గీత వాద్యములతో రాత్రి గడుపవలెను. మరునాడు ప్రాతఃకాలమున బ్రాహ్మణోత్తములను మధురాన్నములతో భుజింప చేయవలెను. సంతోషముతో వారికి దక్షిణలను ఇచ్చి విసర్జించవలెను. తరువాత స్వర్ణ ధేనుధరయగు శ్రీకృష్ణ స్వర్ణ ప్రతిమను దక్షిణతో గురువునకు అర్పించి విడిచి తాను భుజించవలెను. ఇట్లు దారా అపత్య సుహృత్ భృత్యులతో కలిసి భుజించి వ్రతమును ముగించిన మానవుడు, అంతకాలమున ఉత్తమ విమానమును అధిరోహించి గోలోకమును చేరును. ఈ జగత్త్రయమున ఇటువంటి వ్రతము ఇంకొకటి లేదు. ఈ వ్రతమును ఆచరించినవానికి కోటి ఏకాదశీ వ్రత ఫలము లభించును.

భాద్రపద శుక్లాష్టమినాడు రాధావ్రతమును చేయవలెను. పూర్వమువలె బంగారముతో రాధికా ప్రతిమను చేయించి కలశముపైన ఉంచి, మధ్యాహ్నమున పూజించి ఏకభుక్తముగా ఉండవలెను. శక్తియున్నచో మొత్తము ఉపవాసము చేయవచ్చును. మరునాడు యథావిధిగా ముత్త యిదువులను భుజింపచేసి ప్రతిమను గురువునకు అర్పించవలెను. తానుకూడా భుజించి వ్రత సమాప్తి గావించవలెను. యథావిధిగా ఈ వ్రతమును ఆచరించినవాడు గోలోకమున రాధా పరికరమున నివసించును. ఈ తిథిన దుర్వాష్టమీ వ్రతము కూడా చెప్పబడినది వినుము. పరిశుద్ధ ప్రదేశమున మొలిచిన గరికయందు శివలింగమును స్థాపించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములచే భక్తి భావముతో పూజించి దధ్యక్షత ఫలాదులను అర్పించి, పూజాంతమున సావధానముతో మంత్రములతో అర్ఘ్య ప్రదానము చేయవలెను. ఓదూర్వా! నీవు అమృత జన్మవు. సురాసురు నమస్కృతవు. నాకు సౌభాగ్యమును సంతానమును అజరామరముగా ప్రసాదించుము అని ప్రార్థించి ప్రదక్షిణము గావించి బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలనిచ్చి, తాను భుజించి ఇంటికి వెళ్ళవలెను. ప్రశస్తములు, సుగంధములు మధురములగు ఫలములను భుజింపవలెను. ఇటుల దూర్వాష్టమీ పరమ పవిత్రము, పాపహరము. నాలుగు వర్ణముల వారికి, విశేషించి స్త్రీలకు ఫలప్రదము. మోహముతో యధావిధిగా దూర్వను (గరికను) పూజించని స్త్రీ మూడు జన్మలు వైధవ్యమును పొందును. ఈ అష్టమి జ్యేష్ఠా నక్షత్ర యుక్తమగుచునో దానిని జ్యేష్ఠాష్టమీ యందురు. ఆ దినమున పూజించినచో పాపములను నశింపచేయును. ఈ అష్టమిన ప్రారంభించి పదునారు వారములు మహాలక్ష్మీ వ్రతము సర్వసంపద్వివర్ధకముగా చెప్పబడినది. ఓ మహాలక్ష్మీ! నేను నీయందు భక్తి గలవాడనై మహాలక్ష్మీ వ్రతమును చేయుదును. ఆ వ్రతము నీ అనుగ్రహముచే నిర్విఘ్నముగా సమాప్తి చెందనిమ్ము అని ఇట్లు ప్రార్థించి దక్షిణకరమున కంకణమును ధరించవలెను. ఈ కంకణమునకు పదునారు ముడులు ఉండవలయును. పదునారు దారములు ఉండవలెను. తరువాత ప్రతిదినము మహాలక్ష్మీ దేవిని గంధాదులచే పూజించవలెను. కృష్ణాష్టమీ వ్రతమును ఆచరించుచు ఉద్యాపనము జరుగు వరకు సర్వతోభద్ర మండలమున వస్త్రమండపమును ఏర్పరచి, కలశమును ప్రతిష్ఠింపచేసి దీపమును వెలిగించి చేతినుండి కంకణమును తీసి కలశ అధో భాగమున ఉంచి మహాలక్ష్మీ స్వరూపముతో నాలుగు బంగారు ప్రతిమలను చేయించి పంచామృతములచే జలముచే స్నానమును చేయించవలెను. తరువాత షోడశోపచారములచే యధావిధిగా పూజించి రాత్రి గీతవాద్యధ్వనులచే జాగరముచేసి మధ్యరాత్రమున చంద్రోదయ కాలమున శ్రీ ఖండాది ద్రవ్యములచే యధావిధిగా చంద్రమండల సంస్థితయగు మహాలక్ష్మికి అర్ఘ్య ప్రధానము గావించవలెను. అట్లే చంద్రునకు ఈయవలెను. క్షీరసాగర సంభూతా? మహాలక్ష్మీ సహోదర, పీయూష ధామ! రోహిణీ సహితుడవై నా అర్ఘ్యమును స్వీకరించుము! క్షీరసాగర సంజాత! కమలా! కమలాలయ! విష్ణు వక్షస్థల వాసిని! నా కోరికలను అన్నింటిని ఇమ్ము, ఏకనాథే! జగన్నాథే! జమదగ్ని ప్రియే! అవ్యయే. ఓ రేణుకా! పరశురామ మాతా! నన్ను కాడుము. నాకు శుభమును కలిగించుము అని ఈ మంత్రములచే మహాలక్ష్మిని ప్రార్థించి శ్రోత్రియ స్త్రీలను చక్కగా గంధపుష్పకజ్జలయావ కాదులచే పూజించి, బిల్వ పద్మ కషాయనములచే అగ్ని హోత్రమున హోమము గావించి, అవి లభించినచో నేతితో చేసి బ్రాహ్మణ గృహముల నుండి తెచ్చిన సమిధలను, నువ్వులను, సర్వరోగ శాంతి కొఱకు, మృత్యుంజయునకు చందనమును తాళ పత్రమును పుష్పమాలను, అక్షతలను, గరికను, కౌనుంభ సూత్రమును, మారేడు పండును. భక్ష్యములను ప్రత్యేకించి పదునారుగా కొత్తచాటలో ఉంచి, మరియొక చాటతో కప్పి మంత్రముతో దానము చేయవలెను. క్షీరసాగర సంభూత లక్ష్మీదేవి చంద్ర సహోదరి విష్ణుప్రియ ఈ వ్రతముచే సంతోషించు గావుత. అ నాలుగు ప్రతిమలను శ్రోత్రియులకు సమర్పించవలెను. తరువాత నలుగురు బ్రాహ్మణులను పదునారుమంది ముత్తయిదువులను మృష్టాన్నమును భుజింపచేసి దక్షిణలనిచ్చి విడువవలెను. నియమమును ముగించి ఇష్టులతో కలిసి భుజించవలెను. ఈ మహాలక్ష్మీ వ్రతమును యథా విధిగా ఆచరించి ఇహమున సకల భోగములను అనుభవించి అంతమున చాలాకాలము లక్ష్మీలోకము నందు నివసించును.

ఈ అష్టమినే అశోకాష్టమి అనికూడా అందురు. ఈనాడు అశోకపూజను గావించ వలెయును. ఏక భుక్తముగా ఉండవలెను. స్త్రీ ఈ అశోక వ్రతము ఆచరించినచో దుఃఖ రహిత అగును. ఇక ఆశ్వయుజ శుద్ధాష్టమీ మహాష్టమి అని చెప్పబడినది. ఈనాడు సర్వోపచారములతో దుర్గాపూజ చేయవలెను. ఉపవాసమును కాని, ఏకభుక్తమును కాని మహాష్టమినాడుండి అంతట విభవమునుపొంది దేవతలవలె ఆనందించును. కార్తీక బహుళాష్టమినాడు కరక వ్రతమును ఆచరించవలెను. ఈవ్రతమున పార్వతీ సహితుడగు పరమేశ్వరుని శ్రద్ధతో పూజించవలెను. చంద్రోదయ కాలమున అర్ఘ్య ప్రదానమును చేయవలెను. కార్తీక శుద్ధాష్టమినాడు గోపాష్టమి అనబడును. సర్వగుణోపేతుడగు పుత్రుని, వివిధ సుఖములను కోరువారు ఈ అష్టమినాడు గోపూజ గోగ్రాసము, గోప్రదక్షిణము, గవానుగమనము, గోదానమును చేయవలెను. మార్గశీర్ష కృష్ణామినాడు అనఘ అనఘుడు అనుజంటను దర్భలతో నిర్మించి బహుపుత్ర సమన్వితముగా చేసి, శుభ ప్రదేశమున గోమయముతో అలికి, స్థాపించి గంధ పుష్పాద్యుపచారములతో పూజించవలెను. బ్రాహ్మణ దంపతులను భుజింపచేసి దక్షిణనిచ్చి విడువవలెను. ఈ వ్రతమును స్త్రీకాని పురుషుడుకాని యధావిధిగా ఆచరించి సలక్షణములుగల పుత్రుని పొందును. మార్గశీర్ష శుద్ధాష్టమిన కాలభైరవుని సన్నిధిలో ఉపవసించి, జాగరణచేసి మహా పాపముల నుండి విముక్తుడగును. మానవ జన్మలో చేసిన అశుభమంతయూ కాలభైరవ దర్శనమున నశించును. ఇక పుష్య శుక్లాష్టమినాడు అష్టక శ్రాద్ధము పితృదేవతలకు తృప్తిని కలిగించును. కులసంతాన వృద్ధికరము. ఇదే దినమున భక్తిచే శివుని పూజించి ఏకభుక్తముతో భుక్తి ముక్తులను పొందును. మాఘ కృష్ణాష్టమిన భద్రకాళిని పూజించవలెను. ఈ భద్రకాళి శత్రుసమూహనాశని, సర్వకామప్రదాయిని. ఇక మాఘ శుద్ధాష్టమి నాడు భీష్మునికి తర్పణ మీయవలెను. పరాజయమును పొందడు, అవిచ్ఛిన్న సంతతిని పొందును. ఫాల్గుణ బహుళాష్టమీనాడు భీప్రాదేవిని పూజించవలెను. సర్వకామసమృద్ధి కొరకు వ్రతపరుడు కావలెను. ఫాల్గుణ శుద్ధాష్టమిన శివుని పార్వతిని గంధాదులతో చక్కగా పూజించి సర్వసిద్ధేశ్వరుడగును. ఫాల్గుణ బహుళాష్టమిన సప్తమినాడు వండిన పక్వాన్నములతో శీతలాదేవిని పూజించవలెను. ఓ శీతలాదేవీ! నీవు జగన్మాతవు. నీవు జగత్పితవు. నీవు జగద్ధాత్రివి. కావున నీకు నమస్కారము. రాసభవాహనారూఢ దిగంబర, మార్జనీ కలశోపేత, విస్ఫోటక వినాశిని యగు శీతలాదేవికి నమస్కారము. నీటిలో నిలచి శీతలా శీతలా అను జపము చేయువారికి శీతలాదేవి విస్ఫోటకములను శాంతింపచేయును. ఇట్లు శీతలా మంత్రములచే జపించువారికి సంవత్సర మంతయు శీతలాను గ్రహము వలన శాంతి కలుగును. అన్ని మాసములలోని రెండు పక్షములలోని అష్టమీ దినమున పార్వతీ పరమేశ్వరులను పూజించి వాంఛితార్ధములను పొందును. (4/117)