నారద మహా పురాణము
సంక్షిప్త ఛందోవర్ణనము
సనందన మహర్షి పలికెను: ఓ నారద మహామునీ! ఛందస్సు వైదికము, లౌకికము అని రెండు విధములు. ఈ రెండు విధముల ఛందస్సు మాత్రా, వర్ణము అను భేదముచే మరల రెండు విధములు. ఛందశ్శాస్త్ర విశారదులు మగణము, యగణము, రగణము, సగణము, తగణము, జగణము, భగణము, నగణము అని ఎనిమిది గణములు. గురువు లఘువులు ఛంద శాస్త్రమునకు కారణములు అనిచెప్పిరి. మూడు గురువులు కలది మగణము. ఆది లఘువు యగణము, మధ్య లఘువు రగణము, అంత్య గురువు సగణము, అంత్య లఘువు తగణము, మధ్య గురువు జగణము, ఆది గురువు భగణము, మూడు లఘువులు కలది నగణము. ఒక్కొక్క గణమున మూడు వర్ణములుండును. నాలుగు లఘువులుకల గణములు అయిదున్నవి అర్యాది సమ్మతములు. సంయోగముకాని, విసర్గలుకాని, అనుస్వారము కాని లఘువు తరువాత ఉన్నచో ఆ లఘువు దీర్ఘమగును. దీర్ఘము గురువు. ‘ల’ అనగా లఘువు. శ్లోకములోని నాలుగవ భాగమును పాదమందురు. విచ్ఛేదమును యతి అందురు. వృత్తములు సమము, అర్థ సమము, విషమము అని మూడు విధములు. నాలుగు పాదములు ఒకే లక్షణముతో నున్నయెడల సమవృత్త మందురు. మొదటి మూడవ పాదములు, రెండవ నాలుగవ పాదములు ఒకే విధముగా నున్నచో అర్థసమము అందురు. ప్రతిపాదము వేరువేరు లక్షణములు కలిగియున్నచో విషమవృత్తమందురు. ఒక అక్షరము నుండి మొదలిడి ఒక్కొక్క అక్షరమును పెంచుచు ఇరువది ఆరు అక్షరముల వరకు పాదములు విడివిడిగా ఉండును. తరువాత చండవృష్టి మొదలగు దండకములు చెప్పబడినవి. ఇపుడు వరుసగా ఆ ఛందస్సు పేర్లను చెప్పెదను వినుము. ఉక్త, అత్యుక్తా, మధ్యా, ప్రతిష్ఠా, సుప్రతిష్ఠ, గాయత్రీ, ఉష్టిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతీ, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్ట, అత్యష్టా, ధృతి, విధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంస్కృతి, అతికృతి, ఉత్కృతి అని ఛందస్సులకు సంజ్ఞలు ప్రస్తారమును బట్టి భేదమును పొందినవి. అన్ని గురువులు కల పాదమును తీసుకొని మొదటి నుండి గురువు క్రింద లఘువును నుంచవలయును. పైన చేసినట్లే ముందు కూడా మొదటి వలె నుంచవలయును. దీనినే ప్రస్తారమందురు. ఈ ప్రస్తారము అన్ని లఘువులు వచ్చేవరకు చేయవలయును. ప్రసాతరమున గురువునకు ‘S’ చిహ్నము ఉండును. లఘువునకు 1 చిహ్న ముండును. నష్టా౦కార్ధ సమమున లఘువు ఉండును. విషమమున అదియే ఊర్ధ్వగమగును. ఉద్దిష్టమున మొదటినుండి రెట్టింపుగా అంకములను తీసుకొని లఘువులలో ఉన్నవాటిని కలిపి, ఆ రెంటిని ఒకటిచేసి సంఖ్యను చెప్పవలయును అని ప్రాచీనజ్ఞులు చెప్పెదరు. ఉత్తరాధరములుగా ఉన్న, వృత్తముల నుండి పుట్టిన వర్ణములను ఒకటి మొదలుకొని వరుసగా ఒక్కొక్కదాని ఉపరిభాగమున ఉంచవలయును. చివరిదాని సమీపమున ఆపవలయును. పై నుండి ఒక్కొక్క దానిని విడిచి పెట్టవలయును. పై భాగమున మొదటి గురువునుండి ఒకటి రెండు మొదలగు లఘు క్రియలను చేయ వలయును. అనగా లఘువు గురువులను ఉంచవలయును. లగ క్రియాంక సందోహమును కలిపినచో సంఖ్య అగును. ఉద్దిష్టాంకము కాని, సమాహారము కాని, సైకము కాని ఈ క్రియను కలిగించును. సంఖ్యయే ద్విగుణము, ఏ కోణము అగును. అని సత్పురుషులు ఛందో మార్గమును బోధించిరి ఇట్లు కొంచెము ఛందస్సుల లక్షణమును చెప్పితిని. ప్రస్తారమున చెప్పబడిన భేదములకు అంతములేదని చెప్పబడినది. (2/57)