స్థలవిశేష స్నానఫల కథనము

వసువు పలికెను: ఇక ఇపుడు అయా కాల విశేషములలో చేయు గంగా స్నాన ఫలమును చెప్పెదను. సావధానముగా వినుము. గంగానదిలో నిరంతరము మాఘ స్నానమును చేయువాడు తన గోత్రము వారితో కలిసి ఇంద్రలోకమున నివసించును. యథా విధిగా నిరంతర గంగాస్నానమును చేయువారు కల్పకోటి శతాయుతములు బ్రహ్మలోకమున నివసించును. ఆరు నెలలు ఒకపూట భోజనము చేయుచు ఉత్తరాయణ కాలమున ఒకమారు గంగా స్నానమును చేయువారు నూరు తరములను ఉద్ధరించి విష్ణులోకమును చేరును. అన్ని సంక్రమణ కాలములలో గంగా జలమున స్నానము చేయువారు ఆర్కవర్ణ విమానముతో విష్ణు మందిరమును చేరును. విషువ ఆయన సంక్రాంతులలో గంగా స్నానము విశేష ఫలప్రదము. కార్తీక మాసమున గంగా స్నానము తపస్సమ ఫలప్రదము. మేషసంక్రమణ కాలమున సూర్యోదయ కాలమున చేయు గంగాస్నానము మాఘస్నానాధిక ఫలప్రదమని బ్రహ్మాదులు చెప్పియున్నారు. అక్షయతిథిన, కార్తికమాసమున, వైశాఖ మాసమున చేయు గంగా స్నానము సంవత్సర గంగాస్నాన ఫలమును ఇచ్చును. మన్వాదికాలమున, యుగాది కాలమున గంగాస్నాన ఫలము త్రిమాస గంగాస్నాన సమమని చెప్పెదరు. శ్రవణా నక్షత్రయుక్త ద్వాదశిన, పుష్యమీ నక్షత్రయుక్త అష్టమిన, ఆర్ద్రా నక్షత్రయుక్త చతుర్దశిన గంగాస్నానము బహు దుర్లభము. మఘా నక్షత్రయుక్త పూర్ణిమన, కార్తిక మాఘ అమావాస్యలలో గంగా స్నానము సుదుర్లభము. కృష్ణపక్షాష్టమిన గంగాస్నానము సహస్ర స్నానఫలము, సర్వపర్వకాలములందు గంగాస్నానము శతగుణ ఫలప్రదము, అమావాస్యనాడు, అష్టమిన, మాఘకృష్ణ పక్షమున గంగాస్నానము విశేష ఫలప్రదము. అర్ద్రోదయపర్వము, కొద్ది తక్కువ మహోదయ పర్వము. మహోదయపర్వమున శత గుణము, అర్కోదయమున లక్షగుణము గంగాస్నానము ఫలప్రదము. సూర్య చంద్ర గ్రహణ కాలమున గంగా స్నానము మానత్రయ స్నాన ఫలప్రదము. ఫాల్గుణాషాఢ మాసములలో గంగా స్నానము కూడా మానత్రయ స్నాన ఫలప్రదము, జన్మ నక్షత్రమున గంగాస్నానము చేసిన జన్మనుండి సంపాదించిన పాపమంతయూ నశించును. మాఘ కృష్ణ చతుర్ధశిన వ్యతీపాత యోగము సుదుర్లభము. కృష్ణాష్టమిన వైదృతియోగముకూడా దుర్లభము. పూర్ణముగా మాఘ మాసము అంతయూ విధిగా గంగాస్నానమును చేయువానికి పూర్వజన్మ జ్ఞానము కలుగును. సర్వశాస్త్రార్ధ జ్ఞానము కలవాడు రోగ రహితుడగును. సంక్రాంతి కాలమున, పూర్ణిమా అమావాస్యలలో, సూర్యచంద్ర గ్రహణ కాలమున గంగాస్నానము ఆచరించినవాడు బ్రహ్మ లోకమును పొందును. చంద్రునికి లక్ష గుణములు, సూర్యునికి దశ గుణములు సామాన్యముగా చెప్పబడి ఉన్నవి. కాని గంగాతీరమున చంద్రునికి కోటి గుణములు, సూర్యునికి దశ గుణములు గ్రహణకాల ఫలముగా చెప్పబడినవి. చైత్ర కృష్ణ త్రయోదశి వారుణ సమాయుక్తమైనచో గంగాతీరమున నున్నచో నూరు సూర్య గ్రహణనమమని చెప్పబడినది. జ్యేష్ఠ శుద్ధ దశమినాడు మంగళవారము హస్తా నక్షత్ర యుక్తమున ఈ గంగానది పర్వతమునుంచి మర్త్య లోకమునకు దిగి ఉన్నది. ఈ స్థితియే గంగానదికి ఆది దశ. కావున ఆనాడు ఈ భూలోకములో నున్న అన్ని పాపములను హరించును. ఈ దినమున స్నానము నాచరించినచో నూరు అశ్వమేధయాగముల కంటే నూరురెట్లు అధిక పుణ్యమును ప్రసాదించును. ఈ భూలోకమున నున్న మహా పాతక సంఘములు ఇతర సకల పాపముల నన్నింటినీ గోవింద ద్వాదశిని పొంది ఓ గంగాదేవీ! సంపూర్ణముగా హరించుము. పూర్ణిమా తిధిన మఘా నక్షత్రమునుండి చంద్రుడు గురువుతో కలిసియున్నచో ఆ తిథి చాలా మహత్వమును సంతరించుకొనును. ఇటువంటి మహత్తత్వము గంగా తీరమున లభించినచో నూరు సూర్య గ్రహణములతో సమానమగును. ఇక ఇపుడు ఆయా దేశ విశేషములందు గంగా స్నానఫలమును చెప్పెదను.

ఇతర పుణ్య క్షేత్రముల కంటే కురుక్షేత్రమున గంగా స్నానము దశ గుణము ఫలమును ప్రసాదించును. వింధ్య పర్వతముతో కలిసియున్న గంగానదీ స్నానము కురుక్షేత్ర స్నానమున కంటే శతగుణము అధిక ఫలప్రదము. కాశీపురిలో గంగా స్నానము వింధ్య గంగ స్నానమున కంటే శత గుణము ఫలప్రదము. ఇట్లు కురుక్షేత్ర వింధ్యకాశీ పురులలోని గంగా బహు దుర్లభము. గంగా ద్వారమున, ప్రయాగలో గంగాసాగర సంగమమున స్నానమును ఆచరించినవారు స్వర్గమును పొందెదరు. ఈ విశేష స్థలములలో మృతి చెందినచో మరల జన్మించరు. గంగా ద్వారమున కుశా వర్తమున స్నానమాచరించినచో పుణ్య ఫలమును వినుము. ఏడు రాజసూయ యాగముల ఫలము, రెండు అశ్వమేధముల ఫలము లభించును. ఈ ప్రదేశములలో మాసార్ధము నివసించినచో అరు విశ్వజి ద్యాగముల ఫలము లభించును. ఒక లక్ష గోవులను దానము చేసిన ఫలము లభించును. ఈ ప్రదేశములలో స్నానమాచరించి కాని సరోత్తమమున గోవిందుని, కనఖల క్షేత్రమున రుద్రుని దర్శించి కాని అక్షయ పుణ్యమును పొందును. సౌకర తీర్ధము మహాపుణ్యప్రదము. ఈ తీర్థముననే పూర్వము అచ్యుతుడు వరాహాకారమున ఆవిర్భవించెను. ఈ తీర్థము మహాపుణ్యప్రదము. ఈ తీర్థముననే పూర్వము అచ్యుతుడు వరాహాకారమున ఆవిర్భవించెను. ఈ తీర్థమున స్నానమును ఆచరించిన మానవుడు శతాగ్ని చిత్పుణ్యమును, రెండు జ్యోతిష్టోమ యాగముల ఫలమును, వేయి అగ్నిష్టోమ యాగముల ఫలమును పొందును. ఈ తీర్థమున ఉన్న బ్రహ్మ కుబ్జతీర్ధమున స్నానము ఆచరించినచో అఖిల వ్యాధులు నశించును. అన్ని జన్మలలో సంచితములగు సకల పాపములు హరించబడును. ఇచటనే మరియొకటి కపిల తీర్ధమని కలదు. ఇచట స్నానమాచరించిన నరునకు ఎనుబది వేల కపిల గోవుల దాన ఫలమును లభించును. గంగాద్వారమున, కుశావర్తమున, బిల్వ క్షేత్రమున, నీల పర్వతమున, కనఖల తీర్ధమున స్నానమును ఆచరించిన సకల పాపములు నశించి స్వర్గమును చేరును. సర్వతీర్ధోత్తమ తీర్ధమగునది. పవిత్ర తీర్థమున స్నానమాచరించినచో రెండు విశ్వజిద్యాగముల ఫలము లభించును. దీని తరువాత వేణీరాజ్య తీర్థము కలదు. ఇచట గంగానదితో సరయూనది అక్కాచెళ్లెళ్ళవలె కలిసి ఉన్నది. శ్రీహరి దక్షిణ పాదమునుండి పుట్టినది గంగానది. వామపాదమునుండి పుట్టినది సరయూనది. ఇదియే మానస సరోవర సంజాత. ఈ తీర్థమున రుద్రుని పూజించిన రుద్రత్వమును, విష్ణువును పూజించిన విష్ణుత్వమును పొందును. ఈ తీర్థమున స్నానము వలన అయిదు అశ్వమేధ యాగము ఫలము లభించును. తరువాత గాండవతీర్థము కలదు. ఇచటనే గంగానదితో గండకీ నది కలిసియున్నది. ఇచట స్నానము సహస్ర గోదానసమము. తరువాత రామతీర్థము వైకుంఠమునకు సమీపమున ఉన్నది. సోమ తీర్థమున నకులముని నివసించును. ఈముని చక్కగా శివుని పూజించి ధ్యానించుచు గణత్వము పొందెను. గంగోత్తర వాహినియగు చంపక తీర్థము కలదు. ఈ తీర్థము మణికర్ణికతో సమము. మహాపాతక నాశనము. తరువాత కలశ తీర్థము కలదు. ఇచటనే అగస్త్య మహర్షి కలశమునుండి ఉద్భవించెను. ఇచటనే అగస్త్యుడు రుద్రుని పూజించి మహర్షి ఆయెను. తరువాత మహాపుణ్యకరమగు సోమద్వీప తీర్థము వారాణసీసమము కలదు. ఇచటనే చంద్రుడు రుద్రుని పూజించి రుద్రుని శిరమున అధిష్ఠించెను. విశ్వామిత్రుని ప్రియసోదరియగు కౌశికి నది గంగతో కలిసిన తీర్థమున స్నానము నాచరించినవాడు ఇంద్రునికి ప్రియాతిథి అగును. మహాతీర్థమగు జహ్నుపదమున స్నానము నాచరించినవాడు ఇరువది యొకటి తరములను తరింపచేయును. తరువాత అదితి తీర్థము కలదు. ఇచటనే అదితి కశ్యపమహర్షి వలన శ్రీహరిని పొందెను. ఇచట స్నానమును ఆచరించిన మహాఫలము లభించును. తరువాత శిలోచ్ఛయమను మహా తీర్థము కలదు. ఇచటనే తపమాచరించిన మానవులు ఈ తీర్థ మహిమవలన తృణాదులతో పాటు స్వర్గమును చేరెదరు. తరువాత ఇంద్రాణీ తీర్థముగలదు. ఇచటనే శచీదేవి తపమునుచేసి ఇంద్రునిపతిగా పొందెను. ఈ తీర్థమును ప్రయాగతుల్యముగా సేవించవలెను. తరువాత స్నాతక తీర్థము కలదు. ఇచట క్షత్రియుడగు విశ్వామిత్రుడు ఈ తీర్థమును సేవించుచు తపమును ఆచరించి బ్రహ్మర్షిత్వమును పొందెను. తరువాత ప్రద్యుమ్నతీర్థము. ఇది మహా ప్రసిద్ధము. ఇచ్చటనే శ్రీహరికి ప్రద్యుమ్నుడను పుత్రుడు కలిగెను. ఇచట స్నానము మహోదయ ప్రదము. తరువాత దక్ష ప్రయాగ తీర్థము కలదు. ఇచటనే గంగ నుండి యమున విడివడినది. ఇచట స్నానము నాచరించినచో ప్రయాగ స్నానమువలె అక్షయ పుణ్యము లభించును. (II/40)