నారద మహా పురాణము
పురుషోత్తమ మాహాత్మ్యము
మోహిని పలికెను: నీవు సర్వ ప్రాణులందు దయచూపుచున్నావు కావున ధన్యుడవు. ఓ బ్రాహ్మణోత్తమా? నీ ముఖ పద్మములనుండి ఉత్తమమగు కాశీ మాహాత్మ్యమును వింటిని. నీచే బోధించబడిన నేను ఇప్పుడు కృతార్థురాలనైతిని. దయగల నీవు సంసారసాగరమునుండి నన్ను ఉద్ధరించితివి. ఇపుడు శ్రీహరి క్షేత్రమాహాత్మ్యమును వినగోరుచున్నాను. హరిక్షేత్రమునకు వెళ్ళిన నరుడు కృతార్థుడగును. పురుషోత్తముడగు శ్రీహరి క్షేత్రము ముక్తి విధాయకమని పురాణములలో మునులు చెప్పుచుందురు. నేను నీకు ప్రియశిష్యురాలనేని పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమును చెప్పుడు. సాధుజనులు సర్వకాలములందు సకల లోకోపకారమునే చేయుచుందురుకదా.
వసువు పలికెను: ఓ దేవీ! ఇపుడు నీకు బ్రహ్మచెప్పిన పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమును చెప్పెదను. ఈ భూమండలమున భారతవర్షము కర్మ భూమిగా ప్రసిద్ధిగాంచినది. ఈ భారతవర్షమున దక్షిణ సముద్ర తీరమున ఉత్కలమను తీర్థము స్వర్గమోక్ష ప్రదాయకము కలదు. సముద్రమునకు ఉత్తర భాగమున విరజమండలము వరకు వ్యాపించియున్నది. ఈ ప్రదేశము పుణ్యశీలుర పవిత్ర గుణములచే అలంకరించబడి ఉన్నది. సకల పుణ్యతీర్థములు, సకల పుణ్యాయతనములు ఉత్కల తీర్థముననే చూడవలెను. సముద్రమునకు ఉత్తర తీరమున సర్వోత్తమ ప్రదేశమున పరమరహస్యమగు, మోక్ష ప్రదము పాపనాశనమగు క్షేత్రము కలదు. ఈ క్షేత్రము అంతటా వాలూకా కీర్ణము. పవిత్రము. ధర్మకామ ప్రదము. ఈ క్షేత్రము పరమ దుర్లభము. దశయోజన విస్తీర్ణము. నక్షత్రములలో చంద్రుడు, సరస్సులలో సాగరము శ్రేష్ఠమైనట్లు ఈ పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో వరిష్ఠము. వసువులలో పావకునివలె రుద్రులలో శంకరునివలె ఈ పురుషోత్తమ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము, వర్ణములలో బ్రాహ్మణునివలె, పక్షులలో వైనతేయునివలె, సేనానులలో స్కందుని వలె, సిద్ధులలో కపిలునివలె, గజేంద్రములలో ఐరావతమువలె, మహర్షులలో భృగువువలె, అశ్వములలో ఉచ్ఛైశ్శ్రవమువలె, కవులలో శుక్రునివలె, మునులలో వ్యాసునివలె, యక్షరాక్షసులలో కుబేరునివలె, ఇంద్రియములలో మనసువలె, భూతములలో భూమివలె, వృక్షములలో అశ్వత్థమువలె, వీచువాటిలో గాలివలె స్త్రీలలో అరుంధతివలె, శస్త్రములలో వజ్రాయుధమువలె అన్ని వర్ణములలో అకారమువలె, ఛందస్సులలో గాయత్రివలె, అన్ని అయవయములలో శిరస్సువలె, అన్ని విద్యలలో మోక్షవిద్యవలె, మనుష్యులలో రాజువలె, ధేనువులలో కామధేనువువలె, అన్ని ధాతువులలో సువర్ణమువలె, సర్పములలో వాసుకివలె, దైత్యులలో ప్రహ్లాదునివలె, శస్త్రధారులలో రామునివలె, ఝషములలో మకరమువలె, మృగములలో సింహమువలె, యాదసులలో వరుణుని వలె, సంయములలో యమునివలె, సముద్రములలో క్షీరసాగరమువలె, దేవర్సులలో ప్రణవమువలె, పురోహితులలో బృహస్పతివలె, కలుపువాటిలో కాలమువలె, గ్రహములలో సూర్యునివలె, మంత్రములలో ప్రణవమువలె, కృత్యములలో ధర్మకార్యమువలె, పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో శ్రేష్ఠము. ఒకసారి పురుషోత్తమ క్షేత్రమును దర్శించి, సాగరాంతమును ఒకసారి దర్శించి, ఒకసారి బ్రహ్మ విద్యను తెలుసుకొనిన మరల జన్మనుపొందడు. ఇట్లు సర్వగుణోపేతము, పరమ దుర్లభమగునది పురుషోత్తమ క్షేత్రము. ఈ క్షేత్రము జగద్వ్యాపి, విశ్వాత్మ, దేహేశుడు, పురుషోత్తముడు, జగత్కారణము, జగన్నాథుడు అన్నియూ ప్రతిష్ఠించబడినవి. బ్రహ్మ ఇంద్రుడు, రుద్రుడు, అగ్ని మొదలగు దేవతలు, ఈ క్షేత్రమున ఎల్లప్పుడూ నివసించుచున్నారు. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, పితరులు, దేవతలు, మనుష్యులు, యక్షులు, విద్యాధరులు, వ్రతపరులగు మునులు, వాలఖిల్యాది ఋషులు, కశ్యపాది ప్రజాపతులు, సుపర్ణులు, కిన్నరులు, నాగులు, ఇతర స్వర్గవాసులు, సాంగ చతుర్వేదములు, వివిధ శాస్త్రములు, ఇతిహాస పురాణములు, బహుదక్షిణలగు యజ్ఞములు, వివిధ పవిత్రనదులు, వివిధ తీర్ధములు, ఆయతనములు, సాగరములు, శైలములు ఇచటనే ఉన్నవి. ఇట్టి పుణ్యతమము, దేవర్షి పితృసేవితము, సర్వోపభోగ సహితమగు క్షేత్రమున ఎవరు నివసించరు? జగద్దేవుడు ముక్తి ప్రదుడగు పురుషోత్తముడు స్వయముగా నివసించుట కంటే క్షేత్ర మాహాత్మ్యము ఏమి కావలెయును? ఉత్కళమున ఉండు దేవ సన్నిభులగు నరులు ధన్యులు. తీర్థ రాజజలమున స్నానముచేసి పురుషోత్తముని దర్శించుచుందురు. పవిత్రమగు ఉత్కల దేశమున స్నానముచేసి పురుషోత్తమ క్షేత్రము నివసించువారు స్వర్గమున వసింతురు. కాని నరకమునకు వెళ్ళరు. ఉత్కళక్షేత్రవాసులు సుబుద్ధులు. వీరు నిత్యము సుతామ్రౌష్ఠ ప్రసన్నాయత లోచనుని, చారు భ్రూకేశముకుటుని, చారు కర్ణలతాంచితుని, చారుస్మితుని, చారుదంతుని, చారు కుండల మండితుని, సునాసుని, సుకపోలుని సులలాటుని, సులక్షణుని త్రైలోక్యానంద జనకుని, పద్మముఖుడగు శ్రీకృష్ణుని దర్శించుచుందురు. పూర్వ కాలమున కృతయుగమున ఇంద్రతుల్య పరాక్రముడగు ఇంద్రద్యుమ్నుడను మహారాజు ఉండెను. సత్యవాది, శుచి, దక్షుడు, సర్వశస్త్రధారులలో శ్రేష్ఠుడు, రూపవంతుడు, సుందరుడు, శూరుడు, దాత, భోక్త, ప్రియవాది, సమస్త యజ్ఞకర్త, బ్రాహ్మణభక్తుడు, సత్యసంగరుడు, ధనుర్వేదమున, వేదమున, శాస్త్రములలో నిపుణుడు, కార్యశీలి, నరనారీ ప్రియుడు, పున్నమ చంద్రుని వంటివాడు. సూర్యునివలె చూడశక్యము కానివాడు, చంద్రునివలె మధురుడు, విష్ణుభక్తుడు, సత్యసంపన్నుడు, జితక్రోథుడు, జితేంద్రియుడు, అధ్యాత్మ విద్యా నిరతుడు, యుయుత్సువు, ధర్మతత్పరుడు, సర్వగుణాకరుడగు ఇంద్రద్యుమ్న మహారాజు పృథ్విని పాలించుచుండెను. ఇతనికి మహావిష్ణువును ఆరాధించవలెనని కోరిక కలిగెను. దేవదేవుడగు జనార్దనుని ఎట్లారాధించవలెను? ఏ క్షేత్రమున, ఏ తీర్థమున, నదీ తీరమున లేదా ఆశ్రమమున ఆరాధించవలెను? ఇట్లు విచారించుచు మనసుచే భూమండలమును అంతటిని సమీక్షించెను. పాపాపహములగు సకల తీర్థములను గూర్చి మానసికముగా చింతించి మోక్షప్రదమని ప్రసిద్ధిగాంచిన పురుషోత్తమ క్షేత్రమునకు సబల వాహనుడై వెళ్ళి భూరి దక్షిణలతో అశ్వమేధ యాగమును ఆచరించెను. ఇట్లు యాగమును పూర్తిచేసి భూరిదక్షిణల నిచ్చి సంకర్షణుని శ్రీకృష్ణుని, సుభద్రను ప్రతిష్ఠించి, యధావిధిగా పంచ తీర్థమును ఆచరించి అనగా స్నానము, దానము, తపము, హోమము దేవతా ప్రేక్షణము ప్రతిదినము భక్తిచే పురుషోత్తము నారాధించి, దేవదేవుని అనుగ్రహము వలన మోక్షము పొందెను.
మోహిని పలికెను: ఇట్లు శ్రేష్ఠము పావనము అగు పురుషోత్తమ క్షేత్రమున పూర్వము విష్ణు ప్రతిమ ఉండెనా? ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు సబలవాహనుడై వెడలి కృష్ణుని రాముని సుభద్రను ఎందుకు ప్రతిష్ఠించెను. ఈ విషయమున నాకు సంశయము ఆశ్చర్యము కూడా కలుగుచున్నవి. కావున దీని నంతటిని వినగోరుచున్నాను. దీని కారణమును దయచేసి తెలుపుము.
వసువు పలికెను: ఇచటి పూర్వ వృత్తాంతమును సంగ్రహముగా తెలిపెదను. పాప ప్రణాశినియగు ఈ కథను పూర్వమిచట శ్రీనివాసమును వినుము. సర్వాశ్చర్య సమన్వితమగు సుమేరు శృంగమున ఉన్న జగత్స్రస్థ అవ్యయుడగు జగన్నాథుని లోకహిత కామనచే నమస్కరించి భూమిలో నివాసమును కోరుచు మహాలక్ష్మి ఇట్లు అడిగెను. “సర్వలోకేశా? నా మదిలో ఉన్న సంశయమును తొలగించుము. మహాశ్చర్యకరము, కర్మ దుర్లభము, లోభమోహమహాగ్రహములు కలది, కామక్రోధ మహాసాగరము అగు మర్త్య లోకమున దుర్లభమగు సంసార సాగరము నుండి మానవుడు ఎట్లు విముక్తి పొందును? ఈ సంశయమును తొలగించగలవాడు నీకంటే ఇతరుడు లేడు” దేవదేవుడగు జనార్దనుడు ఈ మాటలను విని అత్యంత ప్రీతితో అమృతోపమము, సుభోపాయము, సుసాధ్యము, అయాసము మహాఫలప్రదమగు మార్గమును బోధించెను.
శ్రీహరి పలికెను: “దేవీ! సర్వతీర్థ శ్రేష్ఠము సుప్రసిద్ధమగు పురుషోత్తమమను తీర్థము కలదు. మూడు లోకములలో ఇటువంటి క్షేత్రము మరియొకటి లేదు. ఈ క్షేత్రనామకీర్తనము వలన సర్వపాతకములు నశించును. ఈ క్షేత్రమును దైత్య దానవులు నరులు తెలియలేరు. మరీచ్యాది మునిశ్రేష్ఠులు దీనిని చూపిరి. దక్షిణ సముద్రతీరమున న్యగ్రోధవృక్షము కలదు. గొప్ప ఉల్కలను వర్షించుచున్న ప్రళయ కాలమున కూడా ఈ వృక్షము నశించక అట్లే ఉండును. ఈ వట వృక్షమును చూచినంతనే బ్రహ్మహత్యా పాతకము కూడా నశించునన్న ఇక ఇతర పాముల మాటేల? ఈ వటవృక్షమునకు నమస్కారములతో ప్రదక్షిణములు చేసిన వారు సర్వపాపములు తొలగి శ్రీహరి లోకమును చేరెదరు. న్యగ్రోధ వృక్షమునకు ఉత్తర భాగమున కొద్ది దక్షిణమున కేశవ ప్రాసాదము కలదు. ఇది పరమ ధర్మమయము. ఇచట నివసించవలెను. ఇచట స్వయముగా దేవ నిర్మితమగు ప్రతిమను దర్శించి సులభముగా నాలోకమునకు వచ్చెదరు. ఒకసారి యమ ధర్మరాజు అటు వెళ్ళుచు ఆ ప్రతిమను దర్శించి నా వద్దకువచ్చి శిరసుచే నమస్కరించి ఇట్లుపలికెను. ఓదేవా, లోకనాథా! తేజోరూపా! నీకు నమస్కారము. శ్రేష్ఠుని, వరదుని, కర్తను, అక్షయుని, ప్రభువుని, విశ్వేశ్వరుని, అజుని, విష్ణుని, సర్వజ్ఞుని, అపరాజితుని, నీలోత్పలదలశ్యాముని, పుండరీక నిభేక్షణుని, సర్వగతుని, నిర్గుణుని, శాంతుని, జగద్ధాతను, అవ్యయుని, సర్వలోక విధాతను, లోకనాధుని, సుఖావహుని, పురాణ పురుషుని, వేద్యుని, వ్యక్తావ్యక్తుని, సనాతనుని, పురాణస్రష్ఠను, లోక తీర్థుని, జగద్గురువును, శ్రీవత్సవక్షుని, వనమాలా విభూషితుని, పీతవస్త్రుని, చతుర్భాహుని, శంఖచక్ర గదాధరుని, హారకేయూర సంయుక్తుని, మకుటాం గద ధారిని, సర్వలక్షణ సంయుక్తుని, సర్వేంద్రియ వివర్జితుని, కూటస్థుని, అచలుని, సూక్ష్ముని, జ్యోతిరూపుని, సనాతనుని, భావాభావ వినిర్ముక్తుని, వ్యాపిని, ప్రకృతిపరుని, జగన్నాథుని, సుఖప్రదుడగు ప్రభువునకు నమస్కరించుచున్నాను. ఇట్లు పూర్వము యమధర్మ రాజు వటవృక్ష సమీపమున నానావిధ స్తోత్రములచే నమస్కరించెను. ఇట్లు స్తుతించి చేతులు జోడించి నమస్కరించు యమధర్మరాజును స్తోత్రకారణము అడిగితిని. ఓవైవస్వతా? మహాబాహో నీవు సర్వదేవమయుడవు. నీవెందుకిట్లు స్తుతించితివో సంక్షేపముగా తెలుపుము”
యమధర్మరాజు పలికెను: “పురుషోత్తమ తీర్థముగా ప్రఖ్యాతి గాంచిన ఈ పుణ్యాయతనమును ఇంద్రనీల మయమగు ప్రతిమ సృజించబడినది. ఆ ప్రతిమను నిశ్చల భావముచే దర్శించినవారు కామనారహితులై శాశ్వత లోకమును చేరుచున్నారు. కావున నా కర్తవ్యమును నేను చేయ జాలకున్నాను. కావున నాయందు దయతలచి ప్రతిమను ఉపసంహరించుకొనుము” యముని వాక్యమును విని నేనిట్లు పలికితిని. ఓ యమధర్మరాజా! ఈ ప్రతిమను సైకతముచే కప్పివేతును. అని అప్పుడంతట వల్లులచే ఆ ప్రతిమను కప్పిపుచ్చితిని. అచట మానవులు ఈ ప్రతిమను చూడ జాలరు. బంగారు వన్నెగల లతలచే ప్రతిమను కప్పి యముని పంపివేసెను. ఇట్లు ప్రసిద్ధిగాంచిన పురుషోత్తమ క్షేత్రమున ఇంద్రనీలమయ ప్రతిమను దాచినతరువాత జరిగిన వృత్తాంతమును దేవదేవుడగు జనార్దనుడు వివరించెను. ఇంద్రద్యుమ్నుడు వెళ్ళుట, క్షేత్ర సందర్శనము, క్షేత్ర వర్ణనము క్షేత్ర మాహాత్మ్యము బలదేవ కృష్ణ సుభద్రా దర్శనము, నరసింహ దర్శనము, వ్యష్టి సంకీర్తనము, అనంత వాసుదేవ దర్శనము, గుణకీర్తనము, శ్వేత మాధవ మాహాత్మ్యము స్వర్గద్వార వర్ణనము సముద్ర దర్శనము, స్నానము, తర్పణము, సముద్రస్నాన మాహాత్మ్యము ఇంద్రద్యుమ్నుడు ఆచరించిన పంచతీర్థ ఫలము, మహాజ్యేష్టీ విశేషము, కృష్ణ బలరాముల స్నానము, సర్వయాత్రా ఫలము, విష్ణు లోక వర్ణనము క్షేత్ర వర్ణనము దీనినంతటిని పూర్వము మహాలక్ష్మీదేవికి పురుషోత్తముడు వివరించెను. (II/52)