నారద మహా పురాణము
ప్రభాస తీర్థ మాహాత్మ్యము
మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నాకు ప్రభాస మాహాత్మ్యమును తెలుపుము. దానిని వినిన నేను నీ అనుగ్రహముతో ప్రసన్నమనస్కురాలనై ధన్యురాలనగుదురు.
వసువు పలికెను: ఓ మోహినీ! నరుల పాపములను హరించి భుక్తి ముక్తులను పుణ్యమును ప్రసాదించు ప్రభాసతీర్థ మాహాత్మ్యమును చెప్పెదను వినుము. ఈ తీర్థమున చాలా తీర్థములు కలవు. గిరిజాపతియగు విశ్వేశ్వరుడు సోమేశుడు నివసించుచుండెను. ప్రభాస తీర్థమున స్నానమాడి సోమనాధుని పూజించి ముక్తిని పొందును. ప్రభాస తీర్థకుండల విస్తీర్ణము ద్వాదశ యోజనములు. ఈ మండల మధ్య భాగమున పంచయోజన విస్తీర్ణ ప్రాంతము పీఠిక అనబడును. ఈ మధ్య భాగ మున గోచర్మ మాత్ర ప్రాంతము కైలాసమున కంటే విశిష్టమైనది. ఇచటనే పుణ్యప్రదమగు అర్మస్థలము అను తీర్థము కలదు. ఇచట సిద్ధేశ్వరాది సహస్రలింగములు కలవు. ఇచట భక్తిచే స్నానముచేసి పితరులను నరులను తృప్తిపరిచి లింగములను పూజించి రుద్రలోకమును పొందును. అట్లే సాగర తీరమున అగ్ని తీర్థము కలదు. ఇచట స్నానముచేసిన అగ్నిలోకమున చేరును. ఇచట కపర్దీశదేవుని ఉపవాసముతో పూజించిన ఇహలోకమున అభీష్టములను పొంది శివలోకమును చేరును. తరువాత కేదారేశమునకు వెళ్ళి యధావిధిగా పూజించిన ఇహలోకమున అభీష్టములను పొంది శివ లోకమును చేరును. తరువాత కేదారేశమునకు వెళ్ళి యధావిధిగా పూజించి దేవతల పూజల నంది విమానముతో స్వర్గమును పొందును. భీమేశుని, భైరవేశుని, చండేశుని, భాస్కరేశ్వరుని, అంగారేశుని, గుర్వీశుని సోమేశుని, భృగుజేశ్వరుని, శని, రాహు శిఖేశులను పదునాలుగు మందిని యథాక్రమముగా వెళ్ళవలెను. భక్తిచే విడివిడిగా వారిని పూజించి నిగ్రహానుగ్రహ సమర్థుడై శివలోకమును చేరును. సిద్ధేశ్వరాది పంచాన్య లింగములను చక్కగా పూజించిన ఇహపరములందు సిద్ధిని పొందును. వరారోహను, అజాపాలను, మంగలను, లలితేశ్వరిని, వీరిని క్రమముగా పూజించి పాపరహితు డగును. లక్ష్మీశ్వరుని, బాడవేశుని అర్వేశుని, కామకేశ్వరుని చక్కగా పూజించి లోకేశత్వమును పొందును. గౌరీ తపోవనమును చేరి గౌరీశ వరుణేశ్వరులను, ఉషేశ్వరుని పూజించి స్వర్గమును పొందును. గణేశుని కుమారేశుని, స్వాకకేశ మహేశ్వరులను, ఉత్తంకేశుని, వహ్నీశుని, గౌతముని దైత్య సూదనుని యధావిధిగా పూజించిన వారు దుర్గతిని పొందజాలరు. తరువాత చక్ర తీర్థమును చేరి యధావిధిగా స్నానమాడి గౌరీదేవిని పూజించిన అభీష్టమును పొందును. అచటనే సన్నిహిత్య తీర్థమును పొంది స్నానమాడి దేవాదులను తృప్తిపరిచి సన్నిహత్యాఫలమును పొందును. తరువాత భూతేశాది ఏకాదశ లింగములను పూజించినవారు ఇహమున ఉత్తమ భోగములను అనుభవించి అంతమున రుద్ర లోకమును చేరును. ఆదినారాయణ దేవుని చక్కగా పూజించి మోక్షమును పొందును. తరువాత చక్రధరుని చేరి యధావిధిగా పూజించి శత్రు విజయముతో ఉన్నత భోగములను పొందును. తరువాత సాంబాదిత్యుని చేరి నియమ పూర్వకముగా స్నానముచేసి రోగ రహితుడై ధనధాన్యయుతుడై ఉండును. తరువాత వంటక శోధినీ దేవిని చేరి మహిషఘ్నిని పూజించి భయరహితుడు అగును.
కపాలీశుని కోటీశుని యధావిధిగా పూజించిన సౌభాగ్యవంతుడగును. ఇట్లు మధ్య యాత్రను ముగించవలయును. బ్రహ్మతీర్థమును చేరినవాడు సర్వదేవ పూజితుడై భుక్తి ముక్తీశుడగును. నరకేశుని చేరి సంవతరేశుని నిధీశ్వరుని బలభద్రేశ్వరుని పూజించి భుక్తిముక్తులను పొందును. గంగాగణపతిని చేరి యథావిధిగా పూజించి ఇహపరములందు వాంఛితార్థములను పొందును. తరువాత జాంబవతీ నదిని చేరి భక్తిచే స్నానమాడి సురాదులను పూజించిన కృతకృత్యుడగును. తరువాత పాండు కూపమును చేరి స్నానమాడి పాండవేశ్వరుని పూజించవలెను. ఇట్లు చేసిన స్వర్గమును చేరి నందనాదులలో విహరించును. శత మేధమును లక్ష మేధమును కోటి మేధమును క్రమముగా లింగత్రయమును పూజించి స్వర్గమున దేవతలవలె ఆనందించును. దుర్వాసాదిత్యకమును చేరి యధావిధిగా పూజించి అశ్వమేధయాగ ఫలమును పొందును. యాదవస్థలమును చేరి వర్షేశుని పూజించి ఇంద్రునిచే సత్కరించబడి వాంఛితార్థమును పొందును. హిరణ్యా సంగమమున స్నానమాడి బ్రాహ్మణునకు హేమ రథమును ఇచ్చినవారు అక్షయలోకములను పొందుదురు. తరువాత నగరార్కుని పూజించిన సూర్యలోకమును పొందును. నగరాదిత్య పార్శ్వమున బలరామకృష్ణులను సుభద్రను దర్శించి యధావిధిగా పూజించిన కృష్ణ సాయుజ్యమును పొందును. తరువాత కుమారికను చేరి యధావిధిగా పూజించి వాంఛిత కామనలను పొంది భూ మండలమును జయించును. తరువాత క్షేత్రపాలుని పూజించి సర్వ కామనలను పొందును. సరస్వతీ తీరమున నున్న బ్రహ్మేశ్వరుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మ లోకమున విరాజిల్లును. పింగలా నదిని చేరి, స్నానమాడి దేవతాదులను శ్రాద్ధాదులచే తృప్తిపరిచినవారు మరల జన్మ నందరు. సంగ మేశుని పూజించినవారు దుర్గతిని పొందరు. శంకరాదిత్యుని ఘటేశుని మహేశ్వరుని చక్కగా పూజించి సకలాభీష్టము ఆచరించి అచటి ఋషులను పూజించిన సర్వతీర్థ ఫలమును పొందును. తరువాత నందాదిత్యుని పూజించిన సర్వరోగ విముక్తుడగును. తరువాత త్రితకూపమును చేరి స్నానము ఆచరించిన స్వర్గమును చేరును. శశోపానమున స్నానమును ఆచరించిన దేవతలను చూడగలుగును. వాంఛిత కామనలను పొందును. పర్ణాదిత్యమును దర్శించుటచేత రోగవర్జితుడు భోగవంతుడు అగును. తరువాత న్యంకుమతిని చేరి అచట యథావిధిగా స్నానము ఆచరించి సిద్ధేశ్వరుని పూజించిన అణిమాది సిద్దులను పొందును. వారాహస్వామిని చూచి సంసార సాగరము నుండి విడివడును. ఛాయా లింగమును చక్కగా పూజించి సర్వపాతక వినిర్ముక్తుడగును. గుల్ఫమును దర్శించి పూజించిన నరుడు చాంద్రాయణ ఫలమును పొందును. దేవిని కనకనందను చక్కగా పూజించి ఇహమున సర్వకామనలను పొంది దేహాంతమున స్వర్గమును పొందును. కుంతీశ్వరుని పూజించిన సర్వపాతక వినిర్ముక్తుడు అగును. గంగానదిలో స్నానమాడి గంగేశ్వరుని పూజించిన త్రివిధ పాపములనుండి విముక్తుడగును. చమసోద్భేదకమున స్నానము ఆచరించి పిండదానమును ఆచరించిన గయాకోటి గుణ పుణ్యమును పొందును. తరువాత ఉత్తమమగు విదురా శ్రమమునకు వెళ్ళి త్రిగను త్రిభువనేశుని చక్కగా పూజించి సుఖమును పొందును. మంఖణేశ్వరుని పూజించినవారు సద్గతిని పొందుదురు.
త్రిపురమగు త్రిలింగమును పూజించిన యెడల పాప విముక్తుడగును. షండ తీర్థమును చేరి స్నానమాడి స్వర్ణ దానమును చేసినవాడు సర్వపాప విశుద్ధుడై శివలోకమును చేరును. సూర్య, ప్రాచీ తీర్థమున స్నానమాడిన పాపరహితుడై భోగవంతుడగును. త్రిలోచన తీర్థమున స్నానమాడిన వారు రుద్రలోకమును చేరెదరు. దేవికా తీర్థమున ఉమాకాంతుని చక్కగా పూజించిన ఇహమున సకలాభీష్టములను పొంది అంతమున స్వర్గమును పొందును. భూ ద్వారమును పూజించినవారు వాంఛితార్థములను పొందెదరు. శూలస్థానమున వాల్మీకికి నమస్కరించినవారు కవలలగుదురు. చ్యవనార్కుని పూజించినవారు ధనధాన్యాన్వితులు అగుదురు. బాలార్కుని పూజించినవారు విద్యా వంతులు ధనవంతులగుదురు. కుబేర స్థానమున స్నానమాడి నిధిని పొందును. ఋషితోయనదిలో స్నానమాడి శుచియైనవాడు స్వర్ణ దానమును చేసినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. సంగా లేశ్వరుని పూజించిన రుద్రలోకమును విహరించును. నారదాదిత్యుని పూజించిన త్రికాల జ్ఞానమును పొందును. తరువాత శ్రీమన్నారాయణుని పూజించి మోక్షమును పొందును. తరువాత తప్తకుండో దకమున స్నానమాడి మూల చండీశుని పూజించినవారు సర్వపాప వినిర్ముక్తులై వాంఛితార్థమును పొందెదరు. చతుర్వక్త్రుడగు వినాయకుని పూజించిన కామితములను పొందును. కంబలేశ్వరుని పూజించి ధన ధాన్య సమృద్ధులను పొందును. గోపాలస్వామిని పూజించిన వారు గోవులను ధన మును పొందును. బకుల స్వామిని పూజించిన సద్గతిని పొందును. మరుద్దేవిని పూజించినవారు సర్వకామ ఫలములను పొందును. క్షేమాదిత్యుని పూజించుట వలన క్షామము సిద్ధార్థములు సత్య, ములు కలవాడు అగును. ఉన్నతాఖ్యుడగు విఘ్న రాజును పూజించినవారు విఘ్నములను పొందరు. జలస్వామిని కాలమేఘుని పూజించిన సర్వసిద్ధులను ప్రసాదింతురు. రుక్మిణిని పూజించిన వాంఛితార్థ ములను ప్రసాదించును. దూర్వానేశుని పింగేశుని పూజించినచో పాపవిముక్తులగుదురు. శంఖావర్త మున స్నానమాడిన సర్వసిద్ధేశ్వరుడగును. మోక్షతీర్థమున స్నానమాడిన సంసార సాగరమునుండి ముక్తులగుదురు. గోష్టదస్నానమున సర్వసౌఖ్యములను పొందును. నారాయణ గృహమునకు వెళ్ళిన వారు మరల దుఃఖించరు. జాలేశ్వరార్చనవలన అభీష్ట సిద్ధులు లభించును. హుంకార కూపమున స్నానమాడిన గర్భవాసమును పొందడు చండీశ్వరుని పూజించిన సర్వతీర్థ ఫలము లభించును. ఆకాశపురగతుడగు విఘ్నేశుని పూజించి విఘ్నములను పొందడు. కలాకుండమున స్నానమాడిన వాడు మోక్షమును పొందును. కపిలేశుని పూజించిన కపిలా గో సమూహమును పొందును. జరద్దవేశ్వరుని పూజించినవారు జరపీడితులు కారు. నలేశ్వరుని అర్చించినవారు భోగవంతులు. కర్కోటేశుని అర్చించినవారు ధనవంతులు అగుదురు. హాటకేశ్వరుని పూజించుట వలన సర్వ కామనలు ఫలించును. నారదేశుని పూజించినవారు హరిహరులందు భక్తిని పొందెదరు. మంత్ర విభూషణాదేవిని పూజించినవారు స్వర్గవాసార్హులు అగుదురు. దుర్గాకూట గణపతిని పూజించిన వారు సుఖవంతులగుదురు. కౌరవేశ్వరుని పూజించిన వారు ధనధాన్యయుతులు అగుదురు.
సుపర్ణేశుని భైరవిని పూజించినవారు సుఖవంతులు అగుదురు. భల్లతీర్థమున స్నానమాడిన వారు సర్వకిల్బిష ముక్తులగుదురు. కర్తమూలమున స్నానమాడిన వారు పాతక వినిర్ముక్తుడగును. గుప్త సోమేశ్వరుని పూజించినవారు దుఃఖములను పొందరు. బహుస్వర్ణేశ్వరుని దర్శించినవారు స్వర్గమును పొందెదరు. శృంగేశ్వరార్చకులు దుఃఖములను పొందరు. నారాయణ తీర్థమున స్నానమాడినవారు మోక్షమును పొందెదరు. మార్కండేశ్వరుని పూజించినవారు దీర్ఘాయుష్యమును పొందును. కోటీ ప్రదమున స్నానమాడి కోటీశ్వరుని పూజించినచో సుఖములను పొందును. సిద్దస్థానమున స్నానమాడి అచటి అసంఖ్యా లింగములను పూజించి సిద్ధులగుదురు. దామోదర గృహమును దర్శించి ఉత్తమ సుఖమును పొందును. ప్రభాసనాభిస్థానమున వస్త్రా పథమున నున్న శివుని పూజించినవారు సాక్షాత్తు శివ సముడగును. వస్త్రాపధ క్షేత్రమున దామోదరము, స్వర్ణరేఖ, బ్రహ్మ కుండము రైవతమున, ఉజ్జయంతమున కుంతీశము, మహాప్రభుడగు భీమేశుడు మృగీకుండము అనునవి కలవు. క్రమముగా వీటి యందు స్నానమాడి యత్నముతో దేవతలను పూజించి పితరులకు జలతర్పణ గావించిన యెడల సర్వతీర్థ ఫలములను పొందును. దున్నాబిలమున స్నానమాడినవారు భోగములను అనుభవించి స్వర్గమును చేరును. గంగేశ్వరుని పూజించిన గంగాస్నాన ఫలమును పొందును. రైవతకాద్రిలో చాలా తీర్థములు కలవు. వాటియందు స్నానమాడి బ్రహ్మవిష్ణుమహేశ్వరు లను ఇంద్రాది లోకపాలకులను పూజించిన భుక్తిని ముక్తిని పొందును. ఇవి ముఖ్యములగు తీర్థములు. అవాంతర తీర్థములు అనేకములు కలవు. వాటిని అన్నింటిని చెప్పజాలము. ఒక్కొక్క తీర్థమునకు చాలా విస్తర కథలుకలవు. కావున పుణ్యప్రదమగు ప్రభాసమాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. మూడు లోకములలో ప్రభాస సమమగు తీర్థము మరియొకటి లేదు. ఇచట స్నానమాడిన వారు స్వర్గవాసులతో పోటీ పడుదురు. ప్రభాస మాహాత్మ్యమును వ్రాసి గృహమున ఉంచుకొనిన భూతచోర సర్పాది భయములు కలుగవు. ఈ ప్రభాస మాహాత్మ్యమును వినిన వారు వినిపించిన వారు కూడా సద్గతిని పొందెదరు. (II/70)