భరత రాఘాఘణ  సంవాదము

సనందన మహర్షి పలికెను: రాజు ఇట్లు పరమార్ధమైన బ్రాహ్మణుని మాటలను విని వినయముచే వినమ్రుడై ఇట్లు పలికెను.

రాజు పలికెను: ఓ మహానుభావ! మీరు చెప్పిన పరమార్ధమయమైన మాటను వినిన తరువాత నా మానసిక ప్రవృత్తులు భ్రాంతి చెందుచున్నట్టుగా తోచుచున్నవి. మిగిలిన ప్రాణిజాతములలో ఈ వివేకము విజ్ఞానము కానరాదు. మీరు చూపిన విజ్ఞానము ప్రకృతికి అతీతమైనది. నేను పల్లకిని మోయుట లేదు. పల్లకి నా మీదలేదు. పల్లకిని మోయు శరీరము నాకంటే భిన్నమైనది. ప్రాణుల గుణప్రవృత్తి కర్మచే ప్రేరేపించబడును. ఇట్లు గుణములు ప్రవర్తించునపుడు నాదేది? అని మీరంటిరి. ఓ పరమార్ధ జ్ఞానము కలవాడా? మీ మాటలు నా చెవిన పడినపుడు సంపూర్ణముగా పరమార్ధము తెలియనందున నా మనసు వ్యాకులమగుచున్నది. ఈ సంశయగ్రస్తమగు సంసారమునందు హితమును కలిగించునదేది? అని కపిలమహర్షిని అడుగుటకే నేను బయలుదేరి యుంటిని. ఈ మధ్యలో మీరు పలికన మాట పరమార్ధమును తెలుసుకొనమని నా మనసును ప్రేరేపించుచున్నది. సర్వజగత్స్వరూపుడగు శ్రీమహావిష్ణువు అంశమే జగన్మోన అంశమునకు కపిల మహర్షిగా అవతరించెననని వింటిమి. ఆ భగవానుడు మాకు హితమును కూర్చు తలంపుచే ప్రత్యక్షమాయెనేమో? అని మీమాటలు సందేహమును కలిగించుచున్నవి. కావున సమస్త విజ్ఞాన జలతరంగ సముద్రమగు నీవు నా మోహము నశించుటకు ఉపయోగించు హితమును ఉపదేశించుము.

బ్రాహ్మణుడు పలికెను: మరల ఏమడుగుచున్నావు? శ్రేయస్సును పరమార్ధముగా అడుగుచుంటివా? అన్ని శ్రేయస్సులు పరమార్ధములుగానే చెప్పబడుచున్నవి. దేవతా రాధనమును చేసి ధన సంపదను కోరును. పుత్రులను కోరును. రాజ్యమును కోరును. వారికవియే శ్రేయస్సులు. వివేకము కలవారికి మాత్రము పరమాత్మతో సంయోగమే శ్రేయస్సు, స్వర్గాది లోకఫలముల నిచ్చు యజ్ఞాది కర్మలు కూడా శ్రేయస్సులే. ఫలమును ఆశించక చేయునది ప్రధానమగు శ్రేయస్సు, కావున యోగ యుక్తులగు నరులు ఎల్లపుడు ఆత్మను ధ్యానించవలయును. ఇతరులు కూడా ఆత్మనే ధ్యానించవలయును. ఆత్మధ్యానమే నిజమగు శ్రేయస్సు. పరమాత్మ సంయోగమే శ్రేయస్సు. ఇట్లు కొన్నివందల వేల శ్రేయస్సులు కలవు. కాని ఇవియన్నియూ పరమార్ధములు కావు. నా మాటను వినుము. నిజముగా ధనమే పరమార్ధమగుచో ధనమును ఎందుకు విడుచుచున్నారు. కామఫలప్రాప్తి కొరకు వ్యయమెందుకు చేయుచున్నారు? పుత్రుడు పరమార్ధమైనచో అతడు కూడా ఇతరులకు ఈయబడుచున్నాడు. తీసుకొనువాడు పరమార్ధమన్నచో అతను కూడా ఇతరులకు తండ్రి అగును కదా? తండ్రి పరమార్ధమగుచో ఇతరుల కొరకేల తండ్రిని విడుచుచుంటివి? కావున ఈ జగత్తులో ఏ ఒక్కటీ నియతముగా పరమార్థమని చెప్పుటకు వీలుపడదు. సమస్త కారణములకు కార్యములను పరమార్ధముగా చెప్పబడుచున్నది. రాజ్యాది ప్రాప్తులను పరమార్ధములుగా చెప్పినచో పరమార్ధములగును. చెప్పనిచో పరమార్ధములు కాజాలవు. ఋగ్యజుస్సామములతో నిష్పన్నములగు యజ్ఞాదులు పరమార్ధములగుచో ఆ విషయమున నేను చెప్పుదానిని వినుము. కారణభూతమగు మృదాదులచే నిష్పన్నమగునది కారణము ననుసరించి మృణ్మయమగును. అట్లే నశించు స్వభావముకల సమిధలు దర్భలు పుష్పములు మొదలగు ద్రవ్యములచే చేయబడు క్రియకూడా వినాశియే యగును. పరమార్థము నాశములేనిదని పండితులు అంగీకరింతురు. నశించునది నశించు ద్రవ్యములచే ఏర్పడిన దనుట నిస్సందిగ్ధమే. అది ఫలము నిచ్చునది కాదు. కావున ఫలుమునీయని కర్మ పరమార్ధమని చెప్పవలయును. ముక్తికి సాధనమగు నదియే పరమార్ధమనినచో పరమార్ధము సాధనము కాజాలదు. ఆత్మధ్యానము మాత్రమే పరమార్ధమనబడును. ఇతరులు భేదమును కల్పింతురు కాని పరమార్ధము నకు భేదము లేదు. పరమార్ధమునకు ఆత్మకు సంయోగము మాత్రమే పరమార్ధము. మిగిలిన ద్రవ్యమును పరమార్ధమనుట మిధ్యయేయగును. పరమార్ధము ద్రవ్యమయము కాకపోవుటయే దానికి కారణము. కావున ఇవి అన్నియు శ్రేయస్సులు మాత్రమే కాని పరమార్ధములు కావు. పరమార్ధమును సంక్షేపముగా చెప్పెదను వినుము. ఒకడు, వ్యాపకుడు, సముడు, శుద్ధుడు, నిర్గుణుడు, ప్రకృతి కంటే పరుడు, జన్మవృద్ధ్యాది రహితుడు, సర్వగతుడు ఆత్మ. నామ జాత్యాదులచే సజ్జనులు తెలియుదురు. ఆత్మయే విభువు. ఆత్మయోగము కలది కాది, యుక్తము కాదు. యుక్తము కాబోదు. ఆ ఆత్మ తన, ఇతర దేహములలో ఉన్ననూ ఒక్కటే కాని భిన్నము కాదు. ఆత్మను తెలియుటే పరమార్ధము. అసత్యమును చూచువారు దీనిని తెలియజాలరు. వేణు రంధ్రముల భేదములచే షడ్జాది స్వర భేదములు ఏర్పడును. కాని అన్ని రంధ్రములలో వ్యాపించియుండు వాయువు మాత్రము ఒక్కటే. అట్లే దేహాదులు భిన్నములైనను ఆత్మ ఒక్కటే. రూపభేదము బాహ్యకర్మ ప్రవృత్తులచే ఏర్పడినది మాత్రమే. రూపాది భేదములచే దేవాది భేదములను పొందును కాని ఆచరణలో మాత్రము సమానమే. ఈ విషయమున పూర్వకాలమున జరిగినది ఋభువుచే చెప్పబడినది ఒకటి కలదు. వినుము. బ్రాహ్మణుడగు నిధాఘునకు చేసిన జ్ఞానోపదేశమది.

పరమేష్ఠియగు బ్రహ్మకుఋభువను పుత్రుడు కలడు. సహజముగా ఋభువు తత్త్వార్ధ జ్ఞానము కలవాడు. ఆ ఋభువునకు పులస్త్యతనయుడగు నిదాఘుడను వాడు శిష్యుడుగా ఉండెను. ఋభువు పరమానందముతో సమస్త విజ్ఞానమును బోధించెను. ఇట్లు తత్త్వ జ్ఞానము కలిగిన నిదాఘునకు అద్వైత వాసన కలుగలేదని ఋభువు ఊహించెను. జ్ఞానమును పొందని నిదాఘుడు తన తండ్రి వసించు నాగరమను పురమునకు వెళ్ళి నివసించెను. ఆ పురము దేవికానదీ తీరమున నుండెను. సర్వసంపత్సమృద్ధము, అతి సుందరము సుందరోపవనయుతము. ఆ నగరమున యోగజ్ఞుడగు నిదాఘుడు నివసించు చుండెను. దివ్యములగు వేయి సంవత్సరములు గడిచిన తరువాత తన శిష్యుడగు నిదాఘుని చూచుటకు ఋభువు వెడలెను. నిదాఘుడు వైశ్యదేవమును పూర్తిగావించిన పిదప ద్వారదేశమున ఋభుని చూచి లేచి ఎదురేగి స్వాగతము పలికి లోనికి తీసుకొని వచ్చి పాదప్రక్షాళనము చేసి అసనమున కూర్చుండబెట్టి భుజించుడని పలికెను.

ఋభువు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! మీ గృహమున ఏమి తినవలయునో చెప్పుము. ఈ కుత్సితాన్నమునందు నాకు ప్రీతిలేదు.

నిదాఘుడు పలికెను: సత్తుపిండి, యవలు వ్రీహులచే చేయబడిన పదార్ధములు అపూపములు నా ఇంటిలో సమృద్ధిగా నున్నవి. వాటిలో మీకు నచ్చిన వాటిని భుజించుడు.

ఋభువు పలికెను: ఇది అన్నియూ కదన్నములే. నాకు మిృష్టాన్నము నిమ్ము, భక్ష్యములను పాయసములను, చెరుకు రసములను ఇమ్ము.

నిదాఘుడు పలికెను: ఓ శాలినీ! మన ఇంటిలో ఉన్న ఉత్తమ పదార్ధములతో రుచికరమైన ఉత్తమాన్నమును సిద్దము చేయుము అని భార్యతో పలుకగా నిదాఘుని భార్య రుచికరమైన ఆహారమును సిద్ధముచేసెను. ఋభుడు ఆ ఆహారమును భుజించెను. అపుడు నిదాఘుడు వినయముతో వినమ్రుడై ఋభునితో ఇట్లు పలికెను.

నిదాఘుడు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! మీరు కోరిన రుచికరమైన ఆహారముతో మీకు తృప్తి పుష్టి కలిగినవా? మీ మనసుకు స్వస్ధత చేకూరినదా? మీరు ఎక్కడ నివసించుచున్నారు? ఎచటికి బయలుదేరుచున్నారు? ఎచటి నుండి వచ్చుచున్నారు? దయచేసి తెలుపుడు.

ఋభువు పలికెను: “ఆకలిగొన్నవాడు అన్నమును భుజించినచో తృప్తి కలుగును. నాకు ఆకలి లేదు. తృప్తిలేదు. నన్నేల అడుగుచున్నావు? అగ్నిచే పార్ధివము దహించబడగా ఆకలి కలుగును. దానిని పార్ధివక్షుత్ అందురు. శరీరములోని నీరు తరిగినచో దప్పికయగును. మనసు అడిగిన దానితో జీవునకు సంబంధములేదు. మీ నివాసమెక్కడ? మీరెక్కడికి వెళ్ళుచున్నారు? ఎక్కడినుండి వచ్చుచున్నారు? అని నీవడిగితివి. ఈ మాట విషయమున నేను చెప్పుదానిని తెలియుము. జీవుడు ఆకాశమువలె అంతటా వ్యాపించి ఉండును. కావున ఎక్కడ, ఎచటినుండి? ఎచటికి? అను ప్రశ్నలకు అర్ధము ఎట్లుండును? జీవుడనగు నేను వెళ్ళువాడను కాను, వచ్చువాడను కాను. ఒకే ప్రదేశమున ఉండువాడను కాను. నీవు కాని ఇతరులు కాని ఇంతే. నీవు నీవు కావు, నేను నేను కాను, ఇతరులు ఇతరులు కారు. రుచికరమైన ఆహారమును కోరినది జిహ్వ. రుచిని తెలుపునదికూడా జిహ్మయే. ఆ జిహ్వ ఏమి చెప్పునో వినుము. రుచికరమైనది నిజముగా రుచించినచో ఉద్వేగమును కలిగించును. రుచి లేనిది రుచి కలిగించును. రుచి కలిగిన ఉద్వేగము కలుగును. ఆదిమధ్యావసానములలో అన్నము రుచికారణమగునా? మట్టితో నిర్మించిన ఇంటిని మరల మట్టిచే చక్కగా పైపూత పూసినచో స్థిరముగా ఉండును. అట్లే పార్థివమైన ఈ దేహము పార్ధివ పరమాణువులచే దృఢమగును. యవలు, గోధుమలు, పెసలు, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, బెల్లము, ఫలములు ఇవి అన్నియు పార్ధివ పరమాణు సంఘాతములే. దీనిని తెలుసుకొని ఇష్టమో అనిష్టమో ఆలోచించుము. అట్లాలోచించినచో మనశ్శాంతి కలుగును. అపుడు ముక్తికి ప్రయత్నించవలయును. ఇట్లు ఋభువు పలికిన పరమార్ధయుక్తమగు వచనమును వినిన నిదాఘుడు ప్రణామములను ఆచరించి ఇట్లు పలికెను. “ఓ మహానుభావా? ప్రసన్నుడవు కమ్ము! మీరు నాకు హితమును కూర్చుటకే వచ్చి ఉంటిరి. ఓ బ్రాహ్మణోత్తమా? మీరు పలికిన మాటలను విని నా మోహము తొలగినది.

ఋభువు పలికెను: నేను ఋభుడను వాడను, నీ ఆచార్యుడను. నీకు జ్ఞానమును ప్రసాదించుటకు ఇటకొచ్చితిని. నీకు చక్కని పరమార్ధమును సులభముగా బోధించెదను. ఈ జగత్తంతయూ ఒకటే. భిన్నము కాదు. ఈ ప్రపంచ మంతయూ పరమాత్మ అగు వాసుదేవుని స్వరూపమే.

బ్రాహ్మణుడు పలికెను: నిదాఘుడు అట్లే అని పలికి పరమభక్తితో పూజించగా పూజను స్వీకరించి సంతృప్తితో వెడలిపోయెను. మరల వేయి సంవత్సరములు గడిచిన పిదప నిదాఘునకు జ్ఞానమును ఇచ్చుటకు అదే నగరమునకు వచ్చెను. నగరము వెలపల ఋభువు మునిగా ఉన్న నిదాఘుని చూచెను. మహాసైన్యముతో రాజు నగరములోనికి ప్రవేశించుచుండగా జన సమ్మర్దములేని ఏకాంత ప్రాంతమున దూరముగా ఉన్న వానిని ఆకలి దప్పులచే శుష్క గాత్రునిగా అరణ్యమునుండి సమిధలను దర్భలను తెచ్చుచున్న నిదాఘుని చూచెను. అట్లు నిదాఘుని చూచిన ఋభువు నిదాఘుని సమీపించి అభివాదము చేసి నీవిట్లేకాంతమున ఎందుకుంటివి? అని అడిగెను.

నిదాఘుడు పలికెను: “ఓ బ్రాహ్మణోత్తమా! ఈ జనాధిపుడు నగరమును ప్రవేశించు చున్నపుడు చాలా జనసమూహమున్నది. కావున నేనిచట ఉంటిని.”

ఋభువు పలికెను: ఇక్కడున్న వారిలో రాజెవరు? ఇతరులెవరు? నీవు బాగా తెలిసిన వాడవు. కావున నాకు తెలుపుము.

నిదాఘుడు పలికెను: పర్వత శిఖరము వలె ఎత్తుగానున్న గజేంద్రుని అధిరోహించి ఉన్న వాడు రాజు. అతని చుట్టూ ఉన్నవారు ఇతర జనులు.

ఋభువు పలికెను: నేను మాత్రము గజమును రాజును ఒకేమారు ఒకే విధముగా చూచుచున్నాను. నీవు మాత్రము విడిగా గుర్తించుచున్నావు. కావున ఓ మహానుభావా! ఈ గజరాజులకు ఉన్న భేదమును తెలుపుము. ఎవరు గజమో ఎవరు రాజో చెప్పుము!

నిదాఘుడు పలికెను: “ఓ బ్రాహ్మణా! క్రింద ఉన్నది గజము పైన ఉన్నవాడు రాజు. ఈ ఇద్దరి కున్న వాహ్యవాహక సంబంధమును తెలియని వారెవరు?”

ఋభువు పలికెను: ఓ బ్రాహ్మణా నాకు తెలియునట్లు తెలుపుము. అధోభాగమనగా నేమి? ఊర్ద్వ భాగమనగా నేమి? ఈ విభాగమును తెలుపుము.

బ్రాహ్మణుడు పలికెను: ఈ మాటను వినిన వెంటనే ఋభువును అధిరోహించి నీవడిగిన దానిని చెప్పెదను వినుము. రాజువలె నేను పైన ఉంటిని. ఏనుగు వలె నీవు క్రిందనుంటివి. ఇప్పుడు ఈ దృష్టాంతముతో తెలియుము.

ఋభువు పలికెను: నీవు రాజువలె నేను ఏనుగువలె ఉన్నచో మొదట నీవెవరు? నేనెవరో తెలుపుము.

బ్రాహ్మణుడు పలికెను: ఋభువు మాటలను వినిన నిదాఘుడు త్వరపడి వెంటనే క్రిందికి దిగి, పాదములపైబడి ప్రణమిల్లి మీరు మా ఆచార్యులగు ఋభువులు, ఇతరులకు ఇట్లు అద్వైత సంస్కారముగల మనసుండదు. కావున నేను మిమ్ములను ఆచార్యులనుగా గుర్తించితిని అని పలికెను.

ఋభువు పలికెను: నీవు మొదట చేసిన సేవలవలన నీకు ఉపదేశించుటకు గురు స్నేహముచే ఋభువు నిదాఘుని చేరెను. ఓ మహామతీ! పరమార్ధసారభూతమైన అద్వైతమును సమగ్రముగా సంక్షేపముగా నీకుపదేశించితిని.

బ్రాహ్మణుడు పలికెను: అని ఇట్లు గురువగు ఋభువు నిదాఘుని గూర్చి పలికి అద్వైతవిద్యను బోధించెను. ఆ ఉపదేశముచే నిదాఘుడు కూడా అద్వైత పరుడాయెను. అప్పుడు తనను ఇతర ప్రాణులను అభేదముగా చూడగలిగెను. అట్లు అద్వైత జ్ఞానముచే కొంత కాలమునకు నిదాఘుడు బ్రహ్మ స్వరూపమున లీనమై ముక్తిని పొందెను. అట్లే నీవు కూడా ధర్మజ్ఞుడవై శత్రుమిత్రులలో సమ భావము కలవాడవై ఆత్మ సర్వగతము ఏకము అని తెలియుము. ఒకటే ఆకాశము, నలుపు తెలుపు భేదముచే ఎట్లు కనపడుచున్నదో, అట్లే భాంత్రదృష్టి గలవారికి ఒకే ఆత్మ భిన్నముగా కనపడును. ఈ లోకమున ఉన్న దంతయూ ఒకే ఆత్మ. అత్మకంటే భిన్నమైనది మరియొకటి లేదు. అదియే అచ్యుత నామము. ఆ అచ్యుతుడే నేను, నీవు, ఈ సమస్త ప్రపంచము. ఆ పరమాత్మ భేదమోహ శూన్యముగా ఉండును.

సనందన మహర్షి పలికెను: ఇట్లు బ్రాహ్మణుని ఉపదేశమును పొందిన ఆ రాజశ్రేష్ఠుడు పరమార్ధదృష్టికలవాడై భేదదృష్టిని విడిచెను. అ బ్రాహ్మణుడు కూడా పూర్వజన్మజ్ఞానముచే ఆ జన్మ లోనే మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా! ఇట్లు ఈ పరమార్ధమగు ఆధ్యాత్మ జ్ఞానమును నీకు ఉపదేశించితిని. ఈ జ్ఞానము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు వినువారందరికి మోక్షమును ప్రసాదించును. నీవడిగినట్లు నేను చెప్పితిని. ఇదియే పరిశుద్ధమగు బ్రహ్మజ్ఞానము. ఇంకనూ ఏమి చెప్ప వలయునో అడుగుము. (2/49)