శుకేతిహాస నిరూపణము

నారద మహర్షి పలికెను: ఓ మహామతీ! అనూచాన ప్రసంగముతో సంపూర్ణముగా అన్ని వేదాంగములకు సంక్షిప్తముగా విస్తారముగా మీనుండి వింటిని. ఇపుడు విస్తరముగా శుకోత్పత్తిని తెలియ జేయుము.

సనందన మహర్షి పలికెను: పూర్వము మేరు పర్వత శిఖరమున కర్ణికారవనమున మహాదేవుడగు శంకరుడు భౌమములచే భూతగణములచే కూడినవాడై విహరించెను. అచట హిమవత్పుత్రియగు పార్వతి కూడ యుండెను. ఆ ప్రాంతముననే యోగధర్మ పరాయణుడగు వేదవ్యాస మహాముని యోగముచే ఆత్మలో ప్రవేశించి దివ్యమైన తపస్సును ఆచరించెను. పుత్రుని కొరకు ధారణచే తపస్సు నాచరించెను. అగ్నితో, భూమితో, వాయువుతో, ఆకాశముతో సమాన తేజోశాలియగు పుత్రుడు కావలయునను సంకల్పముచే ఇంద్రియ నిగ్రహము లేనివారు పొందలేని అభిలాషను సంకల్పించుకొని, ఉత్తమమగు తపస్సులో నుండి శంకరుని ప్రార్థించెను. నూరు సంవత్సరములు వాయువును ఆహారముగా తీసుకొనుచు తపస్సును ఆచరించెను. బహురూపుడు ఉమాపతియగు శంకరుని ఆరాధించుచుండెను. అచట బ్రహ్మర్షులు, అందరు దేవర్షులు లోకపాలులు, సాధ్యులు, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, సూర్య చంద్రులు, విశ్వావసువు, గంధర్వులు, సిద్ధులు, అప్సరోగణములు ఉండిరి. అచటనే మహాదేవుడగు రుద్రుడు సమస్త దేవర్షులచే సంకులము, సుందరము అయిన కర్ణికా రవనమున, కర్ణికారమాలను ధరించి శరదృతువున చంద్రునివలె ప్రకాశించుచుండెను. అదే వనమున వ్యాసమహర్షి పుత్రుని కోరి పరమయోగమును ఆచరించుచుండెను. అట్లు తపమును ఆచరించుచున్న వ్యాసుని దేహవర్ణము తరగలేదు. శ్రమ కలుగలేదు. అట్లు వ్యాసమహర్షి ఉండగలుగుట మూడు లోకములకు ఆశ్చర్యమును కలిగించెను. మిక్కిలి తేజోవంతుడగు వ్యాసమహర్షి జటలు అగ్ని శిఖలవలె ప్రకాశించుచు కనపడుచుండెను. ఇట్టి ఉత్తమ తపస్సుచే భక్తిచే మహేశ్వరుడు ప్రసన్నుడై మనసులో వ్యాస మహర్షిని అనుగ్రహించ వలయునని సంకల్పించి అతని ముందునకు ఏగి చిరునవ్వులను చిందించుచు ఇట్లుపలికెను. అగ్ని వాయువు భూమి జలము ఆకాశములవలె పరిశుద్ధుడగు పుత్రుడు నీకు కలుగును. అతని భావమును అనుభవించుచు, అతనియందే మనసు కలవాడవై, తాదాత్మ్యముచే అతని ఆశ్రయము వలన, ఆ పుత్రుని తేజస్సుచే మూడు లోకములలో గొప్ప కీర్తిని పొందగలవు.

మహానుభావుడు సత్యవతీ సుతుడగు వ్యాసమహర్షి ఇట్లు శంకరుని వలన తపస్సుచే వరమును పొంది, అగ్నిని చేయ సంకల్పించి అరణిని మధించసాగెను. అంతలో తన తేజస్సుచే ఉజ్జ్వలమగు రూపమును ధరించియున్న ఘృతాచియను అప్సరసను వేదవ్యాస మహర్షి అచట చూచెను. అట్లు వ్యాస మహర్షి ఘృతాచిని చూచి వెంటనే కామమోహితుడాయెను. ఇట్లు వ్యాస మహర్షిని కామ సంవిగ్న మనస్కుని చేసి లోకోత్తర సౌందర్యవతియగు ఘృతాచి చిలుక రూపముతో వ్యాసమహర్షిని సమీపించెను. లోకోత్తర సౌందర్యవతి యగు ఘృతాచిని చూచిన వ్యాస మహర్షి శరీరమంతట మన్మథ భావము నిండగా, మనోవ్యాకులతను గొప్ప ధైర్యముచే నిగ్రహించుకొనుచు, జారిన మనసును నిగ్రహించలేక, జరుగవలసినది జరుగవలయును కావున ఘృతాచీ సౌందర్యముచే హరించబడిన మనస్సును యత్నముచే నిగ్రహించుకొనిననూ దీనిని చేయ సంకల్పించుటచే ఆయరణిలోనే వ్యాస మహర్షి వీర్యము స్రవించెను. ఆ వీర్యమును మధించగా ఆయరణియందే మహాతపస్వి యగు శుకుడు జన్మించెను. ఈ శుకుడు పరమర్షి మహాయోగి అరణీ గర్భమున జన్మించెను. చక్కగా ప్రజ్వలించు అగ్ని హవ్యమును స్వీకరించి తేజస్సుచే ప్రకాశించునట్లు తన తేజస్సుచే జ్వలింపచేయుచున్నట్లు శుకమహర్షి ప్రకాశించుచుండెను. సాటిలేని రూపమును, వర్ణమును ఆశ్చర్యకరముగా ధరించుచు వెలుగొందుచుండెను. అట్టి శుకుని నదులలో కెల్ల ఉత్తమ నదియగు గంగానది మేరు శిఖరమున రూపుదాల్చి స్వయముగా వచ్చి తన జలముచే స్నానము చేయించెను. అంతరిక్షమునుండి శుకుని కొరకు కృష్ణాజినము భూమిమీద పడెను. గంధర్వులు గానమును చేసిరి. అప్సరసలు నాట్యము చేసిరి. దేవదుందు భులు గొప్పధ్వనికలపై మోగినవి. గంధర్వుడుగు విశ్వావసువు, తుంబురు నారదులు, హాహా హూహూ గంధర్వులు శుకజన్మను స్తోత్రము చేసిరి. అచటికి ఇంద్రుడు మొదలగు లోకపాలకులు వచ్చిరి. దేవతలు దేవర్షులు బ్రహ్మర్షులు కూడా వచ్చిరి. వాయువు దివ్యములైన సర్వవిధ పుష్పములను వర్షించెను. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు సంతోషించెను.

మహాత్ముడగు శంకరుడు మిక్కిలి ప్రీతిచే పార్వతీదేవితో కలిసి గొప్పతేజస్సు కలవాడై వ్యాస మహర్షి పుత్రునికి పుట్టిన వెంటనే ఉపనయనము గావించెను. దేవాధిపతియగు ఇంద్రుడు దివ్యము ఆశ్చర్యమును గొలుపు కమండలమును శుకునికిచ్చిరి. దేవతలు వస్త్రముల నిచ్చిరి. హంసలు, చక్రవాకములు, సారసములు, చిలుకలు ఇతర పక్షులు శుకునికి ప్రదక్షిణమును గావించిరి. ఇట్లు అరణి సంభవుడగు శుక మహర్షి దివ్యమగు జన్మను పొంది, ఉపనయనము గావించుకొని బ్రహ్మచర్య వ్రతము నవలంబించి అచటనే ఉండెను. శుకమహర్షి పుట్టిన వెంటనే సాంగములు సరహస్యములగు వేదములు తండ్రియగు వేదవ్యాసుని పొందినట్లు శుక మహర్షిని వచ్చి చేరినవి. అపుడు శుక మహర్షి ధర్మమును పరిశీలించి వేదవేదాంగ భాష్య జ్ఞానము కలవాడైనను బృహస్పతిని గురువుగా వరించెను. అట్లు బృహస్పతి దగ్గర సాంగములు సరహస్యములగు వేదములను అభ్యసించి, సమగ్రేతి హాసమును, సర్వ శాస్త్రములను అధ్యయనముచేసి గురువుగారికి దక్షినను సమర్పించి ఆశ్రమమునకు తిరిగి వచ్చి, సావధాన మనస్కుడై ఉగ్రమైన తపస్సు చేయనారంభించెను. అట్లు తపస్సుచేయుచున్న శుక మహర్షి బాల్యములో ఉన్ననూ దేవతలకు, ఋషులకు సంప్రదించదగిన వాడాయెను. జ్ఞానముచే, తపస్సుచే వారికంటే అధికుడాయెను. అయినను శుక మహర్షి బుద్ధి ఆశ్రమమున ఆనందించ లేకపోయెను. గృహస్థాశ్రమము మొదలుకొనియున్న మూడు ఆశ్రమములో మోక్ష ధర్మమును గూర్చి ఆలోచించుచున్న శుకమహర్షి మోక్షమును ధ్యానించుచు తండ్రిని సమీపించెను.

తండ్రికి నమస్కరించి, శ్రేయస్సును కోరి వినయముతో, మోక్షధర్మములలో కుశలులైన మీరు నా మనస్సునకు శాంతి ఎట్లు కలుగునో చెప్పుడు అని పలికెను. పుత్రుడగు శుక మహర్షి మాటలను వినిన వ్యాస మహర్షి అతనితో ఇట్లు పలికెను. “మోక్ష ధర్మములను, ఇతరములైన వివిధ ధర్మములను అధ్యయనము చేయుము.” అని అట్లు తండ్రి ఆజ్ఞతో తండ్రినుండి బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడగు శుకమహర్షి మోక్ష ధర్మములను ఇతర ధర్మములను గ్రహించెను. అట్లే సమగ్రముగా యోగ శాస్త్రమును, కాపిల శాస్త్రమును గ్రహించెను. ఇట్లు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న, బ్రహ్మతుల్య పరాక్రముడైన శుక మహర్షిని మోక్షశాస్త్ర విశారదునిగా వ్యాసమహర్షి తలచెను. అపుడు వ్యాసవ మహర్షి పుత్రుని గూర్చి మిధిలేశ్వరుడగు జనకుని వద్దకు వెళ్ళుము. జనక మహారాజు నీకు సమగ్రముగా మోక్షార్ధమును బోధించగలడు. గర్వించక మానవునిగా నడిచి వెళ్ళుము. నీ ప్రభావముచే అంతరిక్ష గమనమున వెళ్ళకుము. అర్జవముతో వెళ్ళుము. క్షణకాల సుఖము కొరకు ఆశ పడరాదు. విశేషములను నీవు చూడరాదు. విశేషములు తమంత తాముగా వచ్చి చేరును. పూజించ దగిన జనక మహారాజు విషయమున అహంకారమును చూపరాదు. అతని భవనమున కొంత కాలమున్నచో అతను నీ సంశయములను తొలగించగలడు. జనక మహారాజు ధర్మకుశలుడు. మోక్ష శాస్త్ర విశారదుడు. అతను చెప్పి దానిని చెప్పినట్లుగా ఆచరించుము. ఇట్లు తండ్రి చెప్పగా తండ్రి అనుమతిని పొంది మిధిలాధిపతియైన జనకుని వద్దకు వెళ్ళెను. అంతరిక్ష మార్గమున సముద్రములతో చుట్టబడియున్న భూమిని దాటగల శక్తి ఉన్ననూ పాదములతో నడుచుచు, పర్వతములనుదాటి భారత వర్షమునుచేరి, సమృద్ధము లగు వివిధ దేశముల నతిక్రమించి, విదేహ దేశమును చేరి జనకుని భవనమునకు చేరెను. రాజ ద్వారమును చేరగా ద్వారపాలకులు ఆపిరి. శుక్రమహర్షి రాజద్వారము ముందే ఆకలి దప్పులు లేనివాడై, ఎండలో శ్రమ నెరుగనివాడై, ధ్యానయుక్తుడై, నిలిచియుండెను. అచట నున్న ద్వార పాలకులలో ఒకడు, సూర్యుడు ఆకాశ మధ్యమున ప్రకాశించునట్లు దివ్య తేజోయుక్తుడగు శుకుడు నిలిచియుండుట చూచి, న్యాయబద్ధముగా పూజించి, నమస్కరించి చేతులు జోడించి అంజలి బద్ధుడై రాజభవనమున ప్రవేశింప జేసెను. అచట రాజభవనములో రెండవ కక్ష్యలో అంతఃపుర భవనము చైత్ర రథముతో సాటివచ్చునది, జలశాలలు, క్రీడాశాలలతో చక్కగా విభజింపబడి, సుందరము, పూలచెట్లు కలదియగు భవనమును చూపి, ఆసనమున కూర్చుండబెట్టి జనకమహారాజునకు నివేదించెను. జనకమహారాజు శుకుడు వచ్చుట తెలిసి, శుకుని అభిప్రాయమును తెలియ గోరి శుకమహర్షి పరిచర్య కొఱకు వారకాంతలను నియమించెను. సుందరమగు కేశ పాశములు గలవారు, అందమైన శ్రోణీభరము కలవారు, ప్రియదర్శనులగు వారకాంతలు సూక్ష్మములగు రక్తవస్త్రములను ధరించి మేలిమి బంగారు నగలను ధరించి, సంలాప అలాపములందు కుశలులు కావున ఎదుటివారి భావమును గ్రహించువారు, అన్నిటిలో నిపుణులగు యాబది మంది వారకాంతలు శుకమహర్షిని సమీపించి అర్ఘ్యపాద్యాది కములను సమర్పించిరి. దేశ కాలోచితమగు చక్కని భోజనముచే తృప్తి కలిగించిరి. భోజముచేసిన తరువాత శుకమహర్షి సుందరమైన పురోద్యానమునకు కొనిపోయి ఒక్కొక్క దానిని చూపిరి. ఆడుచు, పాడుచు, నవ్వుచు స్వభావమును తెలిసిన వారకాంతలు ఉదార సత్వుడగు శుకుని సేవించసాగిరి. జితక్రోధుడు జితేంద్రియుడగు అరణీ గర్భసంభూతుడు పరిశుద్ధమగు మనస్సుతో ఎప్పుడూ ధ్యానములోనే ఉండి సంతోషించక, కోపించక ఉండెను. పాదప్రక్షాళనమును గావించుకొని శుకమహర్షి సంధ్యా వందనము ఆచరించెను. మోక్షార్ధమును ధ్యానించుచు పవిత్రమైన ఆసనమును కూర్చొనెను. పూర్వారాత్రిలో ధ్యానపరాయణుడై, మధ్య రాత్రమున నిద్రను రప్పించుకొనెను. ప్రొద్దుననే లేచి శౌచమును ముగించుకొని స్త్రీలతో కలిసి ఉండియు ధ్యానమునే పొందెను. ఈ విధానముతో అచటనే ఆ పగలురాత్రి గడిపెను. (2/58)