అభిషేకము

వసువు పలికెను: ఓ బ్రహ్మపుత్రీ! తరువాత యజ్ఞాంగ సంభవమగు ఇంద్రద్యుమ్న సరమను పరమ పావనమగు తీర్థమునకు వెళ్ళవలయును. అచటికి వెళ్ళి పరిశుద్ధుడై జ్ఞానియై, ఆచమనముచేసి మనసులో శ్రీహరిని ధ్యానించి విభువును సేవించి ఈ మంత్రమును జపించవలయును.

“అశ్వమేధాంగ సంభూత! తీర్థ! సర్వాఘనాశన!

స్నానం త్వయి కరోమ్యద్య పాపం హర నమోస్తు తే” అని

(ఓ అశ్వమేధయజ్ఞాంగ సంభూతా! సర్వపాపహరతీర్థరాజమా! ఇపుడు నీయందు స్నానమును చేయుచున్నాను. నా పాపమును హరించుము. నీకు నమస్కారము అని ఈ మంత్రమునకు అర్థము. ) అని ఇట్లు పలికి యథావిధిగా స్నానమాచరించి దేవతలకు, పితరులకు, ఋషులకు, ఇతరులకు తిలోదకముచే తర్పణముగావించి, మరల ఆచమనముచేసి, మౌనముగా పితరులకు పిండ ప్రదానము గావించి, పురుషోత్తముని పూజించి దశాశ్వమేధ యాగ ఫలమును పొందును. ఏడు ముందు తరములను, ఏడు తరువాతి తరములను ఉద్ధరించి దేవతలవలె కామ గతిగల విమానముచే విష్ణులోకమునకు వెళ్లును. అచట ప్రళయకాలమువరకు భోగమును అను భవించి మరల భూలోకమున జన్మించి మోక్షమును పొందును. ఇట్లు పంచ తీర్థములను పర్యటించి, ఏకాదశినాడు ఉపవసించి, జ్యేష్ఠ పూర్ణిమనాడు పురుషోత్తముని దర్శించినచో పూర్వోక్త ఫలమును పొంది శ్రీహరి లోకమున విహరించి మరల తిరిగిరాని పరమపదమును పొందును. భూమండల మునకల సమస్త తీర్థములు, నదులు, సరస్సులు, పుష్కరిణులు, తటాకములు, వాపులు, కూపములు, హ్రదములు నానానదులు, సముద్రములు జ్యేష్ఠ శుక్లదశమి నుండి ఏడు దినములు పురుషోత్తమ తీర్థమున ప్రత్యక్షమగును. కావున ఈ దినములలో ఈ తీర్థమున చేయబడు స్నానదానాదికములు దైవదర్శనములు అన్నియు అక్షయ ఫలమును ప్రసాదించును. జ్యేష్ఠ శుక్లదశమి పదిపాపములను హరించును కావున ఆ దశమిని “దశహర” అందురు. ఈ దశమినాడు బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను దర్శించుకొనువారు సర్వపాప వినిర్ముక్తులై శ్రీమహావిష్ణు లోకమును చేరెదరు. గోవిందుడగు పురుషోత్తముని ఊయలలో ఉండగా చూచినవాడు, ఇది కూడా ఫాల్గుణ పూర్ణిమనాడు చూచినచో గోవింద లోకమును చేరును. విషువ దినమున పంచతీర్థ విధానముచే బలరాముని శ్రీకృష్ణుని సుభద్రాదేవిని దర్శించి దుర్లభమగు సమస్త యజ్ఞఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకము పొందును. వైశాఖశుద్ధ తృతీయనాడు చందన భూషితుడగు శ్రీకృష్ణ భగవానుని సందర్శించినచో అచ్యుతమందిరమును చేరును. రాశినక్షత్ర యోగమును అనుసరించి మహాజ్యేష్ఠి ఏర్పడినపుడు ప్రయత్నముచేసి పురుషోత్తమునకు వెళ్ళవలెను. మహాజ్యేష్ఠినాడు శ్రీకృష్ణభగవానుని, బలరాముని, సుభద్రను సందర్శించినచో ద్వాదశ యాత్రాఫలమును పొందును. ప్రయాగలో, కురుక్షేత్రములో, నైమిశమున, పుష్కరమున, గయలో, గంగాద్వారమున కుబ్జామ్రమున, గంగాసాగర సంగమమున, కోకాముఖమున, సూకరమున, మధురయందు, మరుస్థలమున, శాలగ్రామమున, వాయుతీర్థమున, మందరమున, సింధు సాగరమున, పిండారకమున, చిత్రకూటమున, ప్రభాసమున, కనఖలమున, శంభో ద్ధారమున, ద్వారకయందు, బదరికాశ్రమమున, లోహకూటమున, అశ్వ తీర్థమున, సర్వపాప ప్రమోచనమున, కర్దమాలమున, కోటి తీర్థమున, అమరసంకటమున, లోలా ర్కమున, జంబుమార్గమున, సోమ తీర్థమున, పృధూదకమున, ఉత్పలావర్దకమున, పృధుతుంగమున, కబ్జకమున, ఏకామ్రకమున, కేదారమున, కాశి అందు, విరజాతీర్థమున, కాలంజరమున, గోకర్ణమున, శ్రీశైలమున, గంధమాదనమున, మహేన్ద్రమలయ విన్య్థపర్వతములందు, పారియాత్రము నందు, హిమాలయమునందు, సహ్యశుక్తి మద్గోమతి అరుద పర్వతములందు, గంగ అందు, యమునానదియందు, సారస్వతము నందు, గోమతి యందు సప్త బ్రహ్మపుత్ర తీర్థములందు, గోదావరీ, భీమరధీ, తుంగభద్రా, నర్మదా, తాపీ, పయోష్ణీ, కావేరీ, శిప్రా, చర్మణ్వతీ, వితస్తా, చంద్రభాగా, శతద్రు, బాహుదా, ఋషికుల్యా, మరుద్వృధా, విపాశా, దృషద్వతీ, సరయూ, నాకగంగ, గండకీ, కౌశికీ, కరతోయా, త్రిస్రోతా, మధువాహిని, వైతరణీ ఇతర నదులు ఇవన్నియూ క్షేత్ర తీర్థములు శ్రీకృష్ణ సందర్శనమునకుసమము కాజాలవు. సూర్యగ్రహణ సమయమున స్నానదానముల వలన కలుగు ఫలము మహాజ్యేష్ఠి నాడు శ్రీకృష్ణ సందర్శనముచే లభించును. అందువలన సర్వాభీష్ట ఫలమును కోరువారు మహాజ్యేష్ఠినాడు సర్వ ప్రయత్నములతో పురుషోత్తమునకు వెళ్ళవలెను. పురుషోత్తమమున బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను చూచినవారు నూరుకులములను ఉద్ధరించి శ్రీ విష్ణు లోకమును చేరెదరు. విష్ణులోకమున ప్రళయకాలము వరకు సకల భోగములను అనుభవించి పుణ్యక్షయమున భూలోకమునకు వచ్చి చతుర్వేదములు తెలిసిన బ్రాహ్మణునిగా పుట్టును. స్వధర్మ నిరుతుడు, శాస్త్రుడు, కృష్ణభక్తుడు, జితేంద్రియుడుగా ఉండును. శ్రీ విష్ణుభక్తి యోగమున మోక్షమును పొందును. జ్యేష్ఠ పౌర్ణమినాడు జ్యేష్ఠా నక్షత్రమైనచో సాగర స్నానము ప్రశస్తము. సాగరమున సర్వతీర్థమయ కూపము. సజలము, పరిశుద్ధము. సాగరమున భోగవతి కూడా ప్రత్యక్షమగును. కావున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు హైమాది కలశములచే జలమును తీసుకొని బలరామ శ్రీకృష్ణ సుభద్రలకు అభిషేకము కొరకు చక్కని వేదిక సిద్ధముచేసి, పతాకములతో అలంకరించి, సుదృఢ ముగా, సుఖసంచారముగా ఏర్పరచి, వస్త్రములతో పుష్పములతో అలంకరించి విశాలముగా సిద్ధ ముగా ఏర్పరిచి, ధూపమును అర్పించి రామకృష్ణుల స్నానము కొఱకు, పీతాంబరధారి ముక్తాహార భూషితుడుగు శ్రీకృష్ణ భగవానుని నీలాంబరధారియగు బలరాముని, నానావిధ వాద్యములచే జయమంగళనాదములచే వేదికయందు ప్రతిష్ఠించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులచే కొన్ని వేలమంది స్త్రీ పురుషులచే పరివృతులై గృహస్థులు, స్నాతకులు, యతులు, బ్రహ్మ చారులు వేదిక యందున్న బలరామకృష్ణులను స్నానము చేయించెదరు.

అట్లే సమస్త తీర్థములు మోదకములచే పుష్పమిశ్రములచే విడివిడిగా స్నానము చేయించెదరు. తరువాత, పటహఘోషములచే భేరీమురజ ధ్వనులచే కాహలములచే, తాలశబ్ధములచే మృదంగ ఝర్ఘరములచే, ఇతరములగు బహువిధ వాద్యములచే ఘంటానాద మిశ్రితముగా, స్త్రీల మంగళ శబ్దములచే మనోహరములగు స్తుతిశబ్దములచే, జలశబ్దములచే, స్తోత్రములచే వీణావేణు నినాదము లచే సాగర ఘోషములవలె గొప్ప శబ్దము వినవచ్చును. మునుల వేదఘోషలచే మస్త్ర ఘోషలచే, నానాస్తోత్ర నాదములచే పవిత్రములగు సామగానములచే, పీతరక్తాంశుకములను ధరించిన శ్యామా వదాత వేశ్యలు రత్నదండములు గల చామరములచే వీచుచుందురు. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, దేవగంధర్వ కిన్నరులు, చారణులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వే దేవతలు, మరుద్గణములు, కపాలులు, ఇతరులు పురుషోత్తముని స్తుతించుచుందురు. దేవ దేవేశా! పురాణ పురుషోత్తమా ? నీకు నమస్కారము. సృష్టిస్థితి లయకారక! లోకనాధ! గత్పతీజ! నేను త్రైలోక్య రక్షకుడు బ్రాహ్మణ ప్రియుడు, మోక్ష కారణము, సర్వకామ ఫలప్రదుడగు అదిదేవునికి నమస్కరించుచున్నాను. ఇట్లు దేవతలు బలరాముని, శ్రీకృష్ణుని సుభద్రను కూడా ఆకాశమునుండి స్తుతించెదరు. దేవతలు గంధర్వులు గానము చేతురు. అప్సరసలు నృత్యము చేతురు. దేవవాద్యములు మోగును. చల్లగాలులు వీచును. ఆకాశ గోచరములగు మేఘములు పుష్పవర్షమును కురియును. మునులు, సిద్ధచారణులు జయశబ్దములను చేతురు. ఇంద్రాదిదేవతలు, ఋషులు, పితరులు, ప్రజాపతులు, నాగులు, ఇతర స్వర్గవాసులు మంగళ సంభారములచే విధిమంత్ర పురస్కృతముగా అభిషేక ద్రవ్యమును గ్రహించి, మహావీరులగు ఇంద్ర ఉపేంద్రులు, సూర్యచంద్రులు, ధాత, విధాత, అగ్ని, వాయువులు, పూష, భగ అర్యమ త్వష్ట, వివస్వాన్, అంశుమంతుడు, రుద్రులు, అశ్వినీ దేవతలు, వరుణు రుద్రవసువు ఆదిత్య వాలఖిల్య మరీచి పుత్రులచే, భృగు అంగిరసులచే సర్వవిద్యా విశారదులచే కూడి పితామహుడు పులస్త్యుడు మహాతపస్వియగు పులహుడు, అంగిరసుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, భృగువు, క్రతువు, హరుడు, ప్రచేతన, మనువు, దక్షప్రజాపతి, ఋతువులు గ్రహములు, నక్షత్రములు, బ్రాహ్మణోత్తములు, ఆకారమును ధరించిన నదులు, సనాతన దేవతలు సుభద్రములగు హ్రదములు, బహువిధ తీర్థములు, భూమి ఆకాశము, దిక్కులు, వృక్షరాజములు, దేవమాతయగు ఆదితి, హ్రీ, శ్రీ స్వాహా, సరస్వతి, పార్వతి, శచీదేవి, సినీవాలి, సానుమతి, కుహు, రాకాధిషణా, ఇతర దేవ పత్న్యులు, పర్వతరాజగు హిమవంతుడు, నాగరాజు వామన గజరాజు, పారియాత్ర వింధ్య మేరు పర్వతములు, ఐరావతము కలలు, కాష్ఠలు, మాసము, పక్షము, రాత్రి, పగలు, సంవత్సరములు, హయ శ్రేష్ఠమగు ఉచ్చైశ్ర్శ్వము, అరుణుడు, గరుడుడు, లతలు, ఓషధులు, ధర్మదేవతలు అందరూ అన్ని దిక్కుల నుండి రాగలరు. కాలము, యముడు, మృత్యువు, యమభటులు, ఇంకనూ చెప్పబడని ఇతర దేవతా గణములు దేవాభిషేకము కొరకు వచ్చెదరు. దివ్యసంభారములను, బంగారు కలశములలో పవిత్రములగు సారస్వత తోయములను తీసుకొని, ఆకాశగంగా జలములలో మంచి పుష్పములను కలిపి రామునితో కలిసియున్న శ్రీకృష్ణభగవానుని స్నానము చేయించెదరు. ఆకాశమున దేవతా విమానములు తిరుగుచుండును. ఈ విమానము అత్యున్నతములు, దివ్యములు, కామగమనము కలవి, స్థిరములు, దివ్యరత్న విచిత్రతములు, అప్సరోగణ సేవితములు గీతవాద్య పతాకములచే అంతటా అలంక రించబడియుండును. ఇట్టి విమానములలో నుండి దేవతాగణములు బలరామకృష్ణ సుభద్రలను స్నానము చేయించెదరు. (II/60)