ద్వాదశమాసస్థిత పౌర్ణమాస్య అమావాస్యా వ్రత కథనము

సనాతన మహర్షి పలికెను: ఓ నారదా!  ఇపుడు పూర్ణిమా వ్రతములను అమావాస్యా వ్రతములను చెప్పెదను. ఈ వ్రతములను ఆచరించు స్త్రీ పురుషులు సుఖ సంపదలను పొందెదరు. చైత్ర పూర్ణిమ మన్వాదిగా ప్రసిద్ధిచెంది ఉన్నది. ఈనాడు చంద్రుని ప్రీతి కొరకు సాన్నోదక కుంభమును దానము చేయవలయును. వైశాఖ పూర్ణిమనాడు దానము ప్రశస్తము. బ్రాహ్మణునకు దానముచేసిన దంతయూ లభించును. ఈనాడు ధర్మరాజు వ్రతము చెప్పబడినది. వైశాఖ పూర్ణిమనాడు ధర్మరాజు ప్రీతికొరకు శృతాన్నమును ఉదకుంభమును విప్రునికి దానము కావించవలెను. ఇట్లు చేసిన గోదాన ఫలము లభించును. డెక్కలు, కొమ్ములు ఉన్న కృష్ణాజినమును దానమును చేయవలెను. కృష్ణా జినమును, తిలలతో కప్పి వస్త్రములను బంగారమును బ్రాహ్మణునకు దానము గావించవలెను. సర్వ శాస్త్రజ్ఞునికి యధావిధిగా సత్కార పూర్వకముగా కృష్ణాజిన దానమును గావించినచో సప్తద్వీప భూమిప్రదమగును. ఆచంద్ర తారార్కముగా విష్ణులోకమున ఆనందించును. పవిత్ర జలములతో నిండిన కలశములను బంగారముతో కలిపి బ్రాహ్మణోత్తములకు దానమును గావించినచో జీవితాంతము దుఃఖించడు. ఇక జ్యేష్ఠ పూర్ణిమనాడు వటసావిత్రి వ్రతము చెప్పబడినది. ఉపవాసముతో స్త్రీ అమృతోపములగు జలముచే వటవృక్షమును తడుపవలెను. సూత్రముతో చుట్టి నూట ఎనిమిది ప్రదక్షణములను చేయవలెను. తరువాత పతివ్రతా శిరోమణి అగు సావిత్రిని ప్రార్థించవలెను. జగత్పూజ్యురాలా జగన్మాతా సావిత్రీ! పతిదేవతా నన్ను భర్తతో సర్వదా కలిపి ఉంచుము. నీకు నమస్కారము. ఇట్లు ప్రార్థించి మరునాడు ముత్తయిదువులను భుజింపచేసి తాను భుజించినచో సౌభాగ్యవంతురాలు అగును. ఆషాఢ పూర్ణిమనాడు గోపద్మవ్రతము చెప్పబడినది. చతుర్భుజుడు, మహాకాయుడు జాంబూనద సమప్రభుడు శంఖచక్రగదా పద్మరమా గరుడ శోభితుడు, మునులచే, దేవతలచే, యక్ష గంధర్వ కిన్నరులచే సేవించబడువాడు అగు శ్రీహరిని పురుష సూక్తముతో స్నానము చేయించి, గంధాద్యుపచారములచే పూజించవలెను. ఆచార్యుని ప్రీతిచే వస్త్ర భూషణాది దానముచే సంతోషింపచేయవలెను. ఇతర బ్రాహ్మణులను మిష్టపక్వాన్నము లచే భుజింపచేయవలెను. ఇట్లు వ్రతమును ఆచరించి శ్రీహరి అనుగ్రహమున వలన ఇహపరములలో సకలాభీష్టములను పొందును. ఈ దినమున కోకిలా వ్రతము కూడా చెప్పబడినది. ఇప్పుడు ఆ విధానమును చెప్పెదను వినుము. పూర్ణిమనాడు ప్రారంభించి బహిర్భాగమున జలములో స్నానముగావించి శ్రావణ మాసములో పూర్ణిమ వరకు గౌరీ రూపములోనున్న కోకిలను స్వర్ణపక్షను, రక్తనేత్రను, ప్రవాళముఖ పంకజను, కస్తూరీ వర్ణసంయుక్తను, నందన వనోత్పన్నను, చూతచంపక వృక్షస్థితను, కలగీతనినాదినిని, కోకిలారూపధారిణియగు పార్వతీదేవిని ధ్యానించవలయును. పటమున వర్ణములో లిఖించిన దానిని ప్రతిదినము గంధాదులతో పూజించవలెను. తరువాత వ్రతాంతమున బంగారు ప్రతిమను కాని తిలపిష్టమయ ప్రతిమనుకాని స్వర్ణ దక్షిణతోపాటు బ్రాహ్మ ణునికి మంత్రముతో దానము చేయవలెను. ఓ చైత్ర రధోత్సన్నా కోకిలా. హరవల్లభా!  దేవీ!  నిన్ను చక్కగా పూజించి బ్రాహ్మణునికిచ్చితిని. నాకు సర్వ సౌభాగ్యముల నిమ్ము. ఒక బ్రాహ్మణునికాని, ముప్పదిమంది ముత్తయిదువలనుకాని, ఒక ముత్తయిదువును కాని భుజింపచేయవలెను. శక్తి కొలది వస్త్రములను దక్షిణలనిచ్చి పంపవలెను. ఇట్లు వ్రతమును ఆచరించు స్త్రీ ఏడు జన్మలలో సుఖ సౌభాగ్యములను పొందును.

ఇక శ్రావణ పూర్ణిమనాడు వేదోపాకరణము చెప్పబడినది. యజుర్వేదమంత్రములచే దేవర్షి పితృతర్పణము చేయవలయును. స్వశాఖోక్త విధానముగా ఋషిపూజ గావించ వలయును. ఋగ్వేదులు చతుర్దశినాడు, సామవేదమువారు భాద్రపద మాసమున చేయవలెను. అట్లే యథావిధిగా రక్షావిధానము కూడా చేయవలెను. ఆవాలు అక్షతలు పేలాలు ధరించవలెను. రక్తాంశుకమున తెల్లనివి. పత్తితో తీయబడిన దారమును నీటిలో చక్కగా శుభ్రపరిచి కాంస్యకలశమున ధరించి, గంధాదులతో చక్కగా పూజించి దేవతా సమూహమును పూజించి, విష్ణ్వాదులను ప్రార్థించి బ్రాహ్మణ హస్తమునుండి తన ముంజేతికి కట్టుకొనవలెను. తరువాత బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి వేదాధ్యయన మును చేయవలెను. సప్తర్షులను విడిచి బ్రహ్మ సూత్రమును ధరించవలెను. ఈ బ్రహ్మ సూత్రమును కొత్తగా నిర్మించి కుంకుమాదులచే అలంకరించి, శక్తికొలది బ్రాహ్మణులను భుజింపచేసి తాను ఏక భుక్తముగా ఉండవలెను. ఇట్లు వార్షికమగు నీవైదిక కర్మను ఆచరించినచో సంవత్సరమంతయు మరిచిన కర్మ, విధిహీనమగు కర్మ, అసలే చేయని కర్మ ఆచరించినట్లు అగును. భాద్రపద పూర్ణిమ నాడు ఉమా మహేశ్వర వ్రతము ఆచరించవలెను. ఏకభుక్తముగా నుండి శివుని శ్రద్ధగా పూజించి చేతులు జోడించి రేపు వ్రతమును చేసెదనని ప్రార్థించవలెను. రాత్రిపూట దేవుని సమీపమున నిదురించి స్వీకరించవలెను. రాత్రిపూట దేవుని సమీపమున నిదురించి నాలుగవ ఝామున లేచి నిత్యకృత్యములను నెరవేర్చి భస్మమును రుద్రాక్షలను ధరించి పలువిధములగు నుపచారములతో సుగంధాదులతో, బిల్వపత్రములతో ధూప దీప నైవేద్యములతో శంకరుని చక్కగా పూజించి ప్రదోషము వరకు ఉపవసించి, చంద్రోయ కాలమున మరల పూజించి, అచటనే జాగరణమును చేయవలెను. ఇట్లు ఏమరుపాటులేక పదిహేను సంవత్సరములు వ్రతమును ఆచరించి ఉద్యాపనమును యథా విధిగా ఆచరించవలెను. ఉమామహేశ్వరుల సువర్ణ ప్రతిమలను ఏర్పరిచి, పంచామృతములతో శుద్ధ జలములతో స్నానముచేయించి, షోడశోపచారములచే పూజించి, పదిహేను మంది బ్రాహ్మణు లకు మృష్టాన్నములతో భుజింపచేసి దక్షిణలో ఒక్కొక్క కలశమునిచ్చి, ప్రతిమలున్న కలశమును గురువునకు దానమీయవలెను. ఇట్లు ఉమామహేశ్వర వ్రతమును ఆచరించిన భూలోకమున సర్వసంపన్నిధిగా ప్రసిద్ధునిగా పుట్టును. ఈనాడే శక్రవత్రము కూడా చెప్పబడినది. ప్రొద్దున స్నాన మాడి సురనాయకుని గంధాద్యుపచారములతో, నైవేద్య రాశులతో పూజించి, నియంత్రిత బ్రాహ్మణు లను యధావిధిగా భుజింపచేసి, వచ్చిన ఇతరులను దీనులను, అనాధలను భుజింపచేయవలెయును. ఇట్లు ప్రతి వర్షము శక్ర వ్రతమును చేయవలెయును. ధాన్య నిష్పత్తిని కోరు రాజుకాని ఇతరులు కాని ఈ వ్రతమును చేయవచ్చును.

ఆశ్వయుజ శుద్ధపూర్ణిమనాడు కోజాగర వ్రతమును ఆచరించవలెయును. యథా విధిగా స్నానము గావించి ఉపవసించి, జితేంద్రియుడై, తామ్ర కలశమున సువర్ణలక్ష్మీ ప్రతిమను ఉంచి, లేదా మృణ్మయ కలశమున కాని, వస్త్ర సహితముగా ఉంచి ఉపచారములతో వేరువేరుగా పూజించి సాయంకాలమున చంద్రోదయ కాలమున బంగారు లేదా వెండి, లేదా మట్టి పాత్రలలో నేయి నింపి దీపములను ఉంచవలెను. ఒక లక్ష కాని, యాభైవేలు కాని, వేయి కాని, నూరు కాని వెలిగించవలెను. నేయి శర్కరలతో చాలా పాయసమును వండి చాలాపాత్రలలో ఉంచి, చంద్ర కాంతిలో నుంచి ఒక ఝాము రాత్రి తరువాత దానిని లక్ష్మికి నివేదించవలెను. తరువాత పాయసముతో బ్రాహ్మణులను భుజింపచేసి వారితో కలిసి నృత్యగీతమంగళ వాద్యములతో ఆ రాత్రి జాగరణచేసి, అరుణోదయ కాలమున స్నానముచేసి స్వర్ణప్రతిమను గురువునకు సమర్పించవలెను. ఈనాటిరాత్రి కరాంబుజయగు మహాలక్ష్మీదేవి ఈ భూమండలమున ఈ రాత్రి జాగరణచేసి నన్ను పూజించు వానికి సంపదల నిచ్చెదనని తిరుగుచుండును. ఇట్లు ప్రతి వర్షము లక్ష్మీ సంతోషప్రదమగు ఈ వ్రతమును ఆచరించువారికి ఇహపరములలో సమృద్ధిని ప్రసాదించును. కార్తిక పూర్ణిమనాడు విప్రత్వసిద్ధికి సర్వశత్రు జయమునకు కార్తిక దర్శన వ్రతము ఆచరించ వలెయును. ఈనాడే దీపదానముతో త్రిపురోత్సవము ఆచరించవలెను. ఈ వ్రతమును సాయంకాల మున చేసిన సర్వప్రాణి సుఖావహము. కీటకములు, పక్షులు, మశకములు వృక్షములు, జల చరములు, స్థలచరములు ఈ కార్తిక దీపమును చూచినచో మరల ఈ భూమిపై పుట్టవు. మోక్షమును పొందును. ఈనాడు చంద్రోదయ కాలమున షట్కృత్తికలను పూజించవలయును. కార్తికేయుడు, ఖడ్గ, వరుణుడు, హుతాశనుడు, వీరిని గంధ పుష్ప ధూప దీప నైవేద్యములచే, పరమాన్నములచే, దేవతలను చక్కగా పూజించి, ఇంటి బయట దీపమును ఉంచవలెయును. దీపమునకు సమీపమున చతరస్రగర్తమును మనోహరముగా చతుర్దశాంగుల ప్రమాణముగా ఏర్పరిచి, చందనజలముచే తడిపి, అవుపాలతో నింపి, దానిలో బంగారమును, ముత్యముల కన్నులతో ఉన్న, సర్వాంగ సుందర మగు మత్స్యమును దానిలో "మహామత్స్యయ నమః" అను మంత్రమును ఉచ్చరించుచు ఉండవలెను. ఓ బ్రాహ్మణోత్తమా? నేను క్షీరసాగర దానమును చేయుచున్నాను. ఈ దాన ప్రభావము వలన హరి సన్నిధిలో అనందింతును. ఈనాడు వృషోత్సర్గమును చేసి, రాత్రిపూట వ్రతము నాచరించినచో రుద్రలోకమును పొందును. ఈ విషయమున ఆలోచించవలసిన పనిలేదు. ఇక మార్గశీర్ష పూర్ణిమ నాడు బంగారముతోపాటు ఆడక లవణమును శాంతుడగు బ్రాహ్మణునకు సర్వకామ సమృద్ధి కొరకు దానము చేయవలెను. పూర్వ కాలమున లక్ష్మీదేవి ఈ జగత్తును విడిచెను. అపుడు శ్రీహరి, ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు ఈ అయిదుగురు పుష్యయుక్త పూర్ణిమనాడు జగత్తును ప్రయత్న పూర్వకముగా సౌభాగ్యోత్సవ కేళీవిలాసములతో అలంకరించిరి కావున పుష్యయుక్త పూర్ణిమనాడు సర్వ సౌభాగ్య సమృద్ధి కొరకు, తన శరీరమును ఎఱ్ఱని అవాల రసముతో చక్కగా అలది, సర్వౌషధి జలములచే చక్కగా స్నానముచేసి నూతన వస్త్రములను ధరించ వలెను. మంగళ ద్రవ్యమును తాకి, నమస్కరించి, తరువాత శ్రీహరి, ఇంద్ర, శుక్ర, చంద్ర, బృహస్పతులను గంధాద్యు పచారములచే పూజించి, హోమమును చేసి, పాయసాన్నము లచే బ్రాహ్మణులను తృప్తిపరచవలెను. ఇట్లు లక్ష్మీ ప్రీతివర్థకమగు వ్రతమును ఆచరించి దారిద్య్ర నాశమును కలిగించి ఇహపరములలో ఆనందించును.

మాఘ పూర్ణిమనాడు నువ్వులను, పత్తిని, గొంగడిని, రత్నములను, కంచుకములను, ఉష్ణీషములను, పాదరక్షలను, ధనమును, బ్రాహ్మణునకు దానము చేయవలెను. విత్తానుసారముగా దానముచేసినచో స్వర్గమున ఆనందించును. ఈనాడు విధిపూర్వకముగా శంకరుని పూజించినవారు అశ్వమేధ యాగ ఫలమును పొంది విష్ణు లోకమున ఆనందించును. ఫాల్గుణ పూర్ణిమనాడు హోలికా పూజను ఆచరించవలెను. సర్వవిధ కాష్ఠము లను, రాళ్ళను, ఒకచోట ప్రోగుచేసి అచట అగ్నిని యధావిధిగా రక్షోఘ్న మంత్రములచే హోమము చేసి "అసృక్పాభయసంత్రస్తైః కృత్వా హోం తామలిబాలిశైః, అతస్త్వాం పూజ యిష్యామి భూతే భూతి ప్రదాభవ" అను మంత్రముచే అగ్నిని జ్వలింపచేసి కాష్ఠములను పడవేసి ప్రదక్షిణము చేసి, గీతవాదితధ్వనులచే ఉత్సవమును జరుపవలెను. ఈ హాలికాయను రాక్షసి ప్రహ్లాదునకు భయమును కలిగించినది కావున ఆ రాక్షసిని కాష్ఠాదులచే ఉత్సవమును జరుపవలెను. ఈ హాలికాయను రాక్షసి పక్షాంతరమున కామదాహ మందురు. లోకమున స్థితి బహువిధము కదా! పక్షాంతరమున రెండు విడివిడిగా దేవతలు కలరు.

ఇక ఇపుడు అమావాస్యా వ్రతమును చెప్పెదను. ఈ వ్రతము పితృ దేవతలకు అత్యంత ప్రీతి పాత్రము. చైత్ర వైశాఖ అమావాస్యలలో పిత్రర్చనము, విత్తానుసారముగా, పార్వణ విధానముతో శ్రాద్ధమును జరిపి, ద్విజ భోజనమును, గోదానము సర్వ మాసములందు అమావాస్యలలో బహుపుణ్య ప్రదము. జ్యేష్ఠామావాస్యనాడు సావిత్రీ వ్రతము చెప్పబడినది. ఆషాఢ శ్రావణం భాద్రపద మాసములలో అమావాస్య అందు పితృశ్రాద్ధము, దానము, హోమము, దేవతాపూజలు అక్షయ ఫలములను ఒసంగును. భాద్రపద అమావాస్య అందు అపరాహమున తిలక్షేత్రమున పెరిగిన దర్భలను బ్రహ్మ మంత్రముచే మంత్రించి, హుంపట్లచే ఛేదించి, అన్ని వేళలో అన్నికార్యములలో ఉపయోగించవలెయును. ఆశ్వయుజ అమావాస్యనాడు విశేషముగా పితృ శ్రాద్ధమును, పితృ తర్పణ మును చేయవలెను. గంగా జలమున గయా స్థలమున చేసినచో మోక్ష ప్రదము. కార్తీకమావాస్య నాడు దేవాలయములలో గృహములలో, నదీ ఆరామ తటాకములలో చైత్యగోష్ఠా పణములలో దీపదానము, లక్ష్మీ పూజ స్వర్ణ రాప్యములతో చేయుట, జయ పరాజయములలో దూత్యము ఆ సంవత్సర ఫలమును సూచించును. గోవులను శృంగాదులను అలంకరించి, యవన అన్నాది దానములచే నమస్కార ప్రదక్షిణలచే చక్కగా పూజించవలెను. మార్గశీర్షామావాస్యనాడు శ్రాద్ధములచే బ్రాహ్మణ భోజనములచే, బ్రహ్మచర్యాది నియమములచే జపహోమార్చనాదులచే పితృపూజను గావించవలెను. పుష్యమాఘ అమావాస్యనాడు పితృ శ్రాద్ధము అధికఫలము నిచ్చును. కర్ఱపాతార్క యుక్తమగుచో గయాదులలో చేయవలెను. ఫాల్గునామావాస్యనాడు కేవల శ్రాద్ధము అధిక ఫలమునిచ్చును. కర్ఱపాతార్కయుక్త మగుచో గయాదులలో చేయవలెను. ఫాల్గుణ మావాస్య నాడు కేవల శ్రాద్ధము, బ్రాహ్మణ భోజనము సర్వదాన ఫలము నొసంగును. అమావాస్య సోమవారమున వచ్చిన అధిక ఫలప్రదము. ఇట్లు నీకు సంక్షేపముగా తిథి కార్యములను వివరించితిని. ప్రతి తిథియందు ఇంకనూ విశేషములు కలవు. అవి ఇతర పురాణములలో వివరించబడినవి. (4/124)