మోహినీ చరితము

మోహిని పలికెను: ఓ దేవతలారా! ఏకాదశితో సమానమగు పావనము మరొకటి లేదు. ఏకా దశిచే మహాపాపులుకూడా పవిత్రులై శ్రీహరిలోకమును చేరెదరు. కావున ఏకాదశీ సమీపమున నాకు స్థానము ఉచితమని తోచుచున్నది. ఆలోచించుడు.

దేవతలు పలికిరి: ఏకాదశి నిశీథ కాలమున విద్ధ అయినచో దేవతలకు, సూర్యోదయ కాలవేధ సురలకు అని శ్రీహరియే కల్పించెను. త్రయోదశిపారణ ఉపవాసమును నశింపచేయును. వైష్ణవాగమమున ఎనిమిది మహాద్వాదశులని చెప్పబడినవి. ఎనిమిది ద్వాదశులు ఏకాదశీ భిన్నములుగా వైష్ణవులచే ఉపవసించబడును. మహాత్ములగు విష్ణు భక్తులకు రెండుపక్షములలో యథావిధిగా ఏకాదశీ వ్రతము భిన్నముగా త్రిదానాత్మకముగ ఉండును. ప్రాతః కాలము సాయంకాలము భోజనము చేయరాదు. యధాక్రమముగా పూర్వాహ్ణాపరాహ్ణములలో విసర్జించవలయును. ఏకాదశి విద్ధ అయినచో మరునాడు ఉపవసించవలెను. ద్వాదశినాడు నిర్జలముగా ఉపవసించవలెను. ఉపవసించ శక్తి లేనివారు జలమును, శాకమును, ఫలమును, పాలను, శ్రీహరి నైవేద్యమును కాని తన ఆహారములో నాలుగవ భాగమును భుజించవచ్చును. సూర్యోదయ కాలమున విద్ధ అయినచో స్మార్తులు ఏకాదశిని విడిచెదరు. నిష్కాములు మధ్యరాత్రి విద్ధను విడిచెదరు. అన్ని లోకములలో దశమి యమధర్మ రాజు తిధి అని తెలియుచున్నది. దశమీ ప్రాంతమున నీవు ఉండవలెను. దీనితో దేవకార్యముకూడా సిద్ధించును. సూర్య చంద్రులతో తిరుగుచు దశమీ ప్రాంతమున నివసించుము. నీ పాపనాశమునకై సర్వ తీర్ధములలో సంచరించుము. అరుణోదయము నుండి సూర్యోదయమగువరకు సంచరించుము. ఆ మధ్యలో వ్రతమున చేరి ఏకాదశీ ఫలమును పొందుము. దశమీ విద్ధయగు ఏకాదశిన వ్రతము ఆచరించువాడు నీకు ఉపకారకుడగును. ఈనాడు అరుణోదయ కాలము ముహూర్త ద్వయ పరిమితమని తెలియుము. రాత్రికి పగలుకు పదిహేను ముహూర్తలుండును. త్రైరాశిక విధానమును అనుసరించి రాత్రింబవళ్ళు హ్రస్వములు దీర్ఘములు అగును. పదమూడవ ముహుర్తము తరువాత రాత్రిపూట వచ్చును. అపుడు ఉపవసించువారి పుణ్యమును నీవు పొందెదవు. స్వస్థురాలవుకమ్ము. యముని స్థాపించుటకు వైకుంఠ ధ్వంసమునకు పాషండవృద్ధి కొఱకు, పాపమును పెంచుటకు నీకు ప్రతూష సమయ సమీప ప్రాంతమును ఇచ్చుచున్నాము. ఈ లోకమున దశమీ విద్ధయగు ఏకాదశినాడు వ్రతమును ఆచరించువారి పుణ్యము నీకు లభించును. ఆ ఫలమును నీవు అనుభవించుము. ప్రసన్నురాలవు కమ్ము. బ్రహ్మాదులు ఇట్లు చెప్పగా మోహినీ మిక్కిలి సంతోషించెను. తన పాపరిహారమునకు తీర్థ సేవనము చేయుటచే తన జీవితము కృతార్ధమగునని తలచెను. దేహము భస్మావశేషమైననూ దేవ కార్యమును సాధించితిని. చైతన్యము మాత్రము ఉండి వాయు రూపముగానుండి కూడా రాజు చేసిన మార్గమును తుడిచి వేసితిని. నేను సంతోషముతో పలికిన మాటను ఆచరించితిని. ఇట్లు విచారించి బ్రాహ్మణులను పురోహితుని నమస్కరించి సూర్య విహీనమగు దశమీ ప్రాంతకాలమున జనమోహనము కొరకు నివసించెను. కృచ్ఛ్రాంతరూపముగా దినమున భుజించువారికి ప్రకృష్ణ రూపముగా నరకమును ప్రసాదించును. దశమీ ప్రాంతమున నున్న మోహినిని చూచిన యమధర్మరాజు సంతోషముచే విప్పారిన మోముకలవాడై ఇట్లు పలికెను. ఓ చారునేత్రి! నీవు మరల ఈ లోకమున నా ప్రతిష్ఠను నిలిపితివి. రుక్మాంగదుని మత్తేభముపై నున్న పటహమును ఛేదించగలిగితివి. కార్యము దృష్టముగాన జనులందరూ విశ్వసింతురు. కావున సూర్యోదయ కాలమును స్పృశించు దశమీ ఎపుడూ నిందితమే. స్పర్శలేని ఉదయము నరులను మోహింపచేయును. పావు భాగము ఉన్ననూ అదృశ్యరూపముగా నున్న ప్రియయోగభుక్తిని విడిచి ఉంటివి. కావున నిజముగా నిన్ను మోహిని అని జనులు పిలుచు చున్నారంటే నీపేరు సార్థకమే. సమస్త జనమును మోహింప చేసినా పటమున వ్రాయించుచున్నావు అని ఇట్లు యమధర్మరాజు పలికి ఆ బ్రహ్మ పుత్రికకు నమస్కరించి సంతోషించెను. దేవతలతో కలిసి చిత్రగుప్తునిచేత పట్టుకొని తన లోకమునకు వెళ్ళెను. ఇట్లు దేవతలందరూ వెళ్ళిన తరువాత మోహిని సురాసురనాయకుడగు బ్రహ్మను సమీపించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ తండ్రీ! ఈ పురోహితుడు చాలా భయంకరుడు. ఇతని కోపముచే నా శరీరము దగ్ధమాయెను. మరల శరీరమును దాల్చునట్లు చేయుము. దశమీ ప్రాంతమున నిలిచి నేను జగత్తును మోహింపచేసితిని. పూర్వము రాజు యముని గెలిచెను. నేను నీ ప్రభావముతో యముడు విజయి ఆయెను. నేను మరల దేహమును ధరించునట్లు నీవు చేయవలయును. పురోహితుని శాంతింపచేయుము. లోకకర్తయగు బ్రహ్మ మోహినీ వాక్యమును విని పుత్రిక కొరకు మరల పురోహితుని ఓదార్చసాగెను. ఓ బ్రాహ్మణా! నేను నీకు ఈ మోహినికి సర్వలోకమునకు హితము కలుగుటకు చెప్పు మాటను వినుము. నీ కోపముచే ఈ మోహిని భస్మమైనది. మరల శరీరమును యాచించుచున్నది. కావున అనుమతినిమ్ము. నా పుత్రిక నీకుకూడా గౌరవింపదగినదే. ఇపుడు దుర్గతిని చెందుచున్నది. నేను నీవు ఆమెను కాపాడవలయును. ఆమె దీక్షతో దేవకార్యమును ఆచరించినది. నీవు పరిశుద్ధ భావముచే అనుమతిం చినచో నేను ఈమెకు మరల దేహమును కల్పించెదను. కాని హరి వాసరమును ద్వేషించి పాపమును ఆచరించినది కావున ఈమె పరిశుద్ధికి ఉపాయమును ఆలోచించుము. బ్రహ్మ మాటలను వినిన పురోహితుడు పరిశుద్ధాంతఃకరణముతో మోహినికి దేహ కల్పమునకు అనుమతించెను. బ్రాహ్మణ వాక్యమును వినిన లోక పితామహుడగు బ్రహ్మ కమండలు జలమును మోహినీ దేహభస్మముపై చల్లెను. ఇట్లు కమండలు జలమును చల్లిన వెంటనే మోహిని దేహమును దాల్చెను. తండ్రియగు బ్రహ్మకు నమస్కరించి పురోహితుని పాదములను పట్టుకొనెను. అంతట రుక్మాంగద పురోహితుడగు వసువు మోహినితో ఇట్లు పలికెను.

వసువు పలికెను: ఓ మోహినీ! బ్రహ్మవాక్యము వలన నేను కోపమును విడిచితిని. తీర్థస్నానాది కర్మలచే నీకు గతిని కల్పించెదను. అని పలికి బ్రహ్మను పంపివేసెను. ఇట్లు మోహినిని పురోహితుని సంతోషింపచేసి బ్రహ్మ తమస్సునకు దూరముగా ఉన్న తనలోకమునకు ఆవ్యక్త మార్గముచే వెళ్ళెను. రుక్మాంగద పురోహితుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడగు వసువు మోహినిని అనుగ్రహించవలయునని తలచి హృదయమున ఆలోచించుచు ముహూర్త కాలము ధ్యానించి గతి కారణమును తెలుసుకొనెను. (II/37)