గంగామాహత్మ్యము

సూత మహర్షి పలికెను: భగవద్భక్తిమాహాత్మ్యమును విని సంతోషించిన నారదమహర్షి మరల జ్ఞానవిజ్ఞానసంపన్నుడైన సనకమహర్షిని ఇట్లు అడిగెను.

నారదమహర్షి పలికెను: ఓ శాస్త్రార్థపారగా! మిక్కిలి దయతో నాకు అన్ని క్షేత్రములలో ఉత్తమ క్షేత్రమును గూర్చి, అన్ని తీర్థములలో ఉత్తమ తీర్థమును గూర్చి సత్యమును చెప్పుము.

సనకమహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! పరమరహస్యము సర్వసంపదలను ప్రసాదించునది, దుస్స్వప్నములను నశింపచేయునది, పుణ్యకరము, ధర్మమును కలిగించునది, పాపములను హరించునది, శుభకరము, దుష్ట గ్రహములను నివారించునది అయిన ఈ విషయముమును లందరూ వినదగినది. అన్ని రోగములను నివారించునది, ఆయుష్యమును పెంచునది. అన్ని క్షేత్రములలో ఉత్తమక్షేత్రము, అన్ని తీర్థములలో ఉత్తమ తీర్థము గంగాయమున సంగమ స్థలమగు ప్రయాగ అని పరమర్షులందరూ చెప్పెదరు. తెలుపు నలుపు నీరుగల ఈ ప్రదేశమును, తీర్థమును, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, మనువులు పుణ్యమును కోరి సేవింతురు. విష్ణుపాదమునుండి పుట్టినది కావున గంగ పుణ్యనది. సూర్యునివలన పుట్టినది యమునానది. ఆ రెంటి కలయిక అన్ని శుభములను చేకూర్చును. తలచిన వారి తాపములను తొలగించు గంగ అన్ని నదులలో ఉత్తమమైనది. అన్ని పాపములను నశింపచేయునది. అన్ని ఉపద్రవములను హరింప చేయునది. సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూమండలమున ఉన్న అన్ని క్షేత్రములలో పరమ పవిత్రమైన క్షేత్రము ప్రయాగ క్షేత్రము. ఈ ప్రయాగ క్షేత్రముననే బ్రహ్మ యజ్ఞములతో శ్రీమన్నారాయణుని పూజించెను. అట్లే మునులందరూ పలు విధములైన యజ్ఞములను ఆచరించిరి.

ఈ భూమండలమున ఉన్న సమస్త పుణ్యతీర్థాభిషేకము గంగా బింద్వభిషేకములోని 16వ అంశతో కూడా సమానముకాదు. నూరు యోజనముల దూరములో (800ల మైళ్ళు) ఉన్నవాడుకూడా ‘గంగా’ ‘గంగా’ అని గంగా నామమునుస్మరించినచో పాపముల నుండి విడివడునన్న గంగాస్నానము చేసినవాని గూర్చి ఏమి చెప్పవలయును? విష్ణు పాదమునుండి పుట్టి, శంకరుని శిరస్సున నిల్చిన గంగానదిని దేవతలు మునులు కూడా సేవింతురు. ఇక పామరుల విషయమేమి? గంగానది యొక్క ఇసుక (మట్టి) లలాట భాగమున ధరించినచో అక్కడనే శివుని లలాటమున అర్ధచంద్రునికి క్రింది భాగమున ప్రకాశించు మూడవనేత్రముండునని తెలియుము. గంగానదిలో మునిగి స్నానము చేయుట గొప్ప పుణ్యమును ప్రసాదించును. గంగాస్నానము దేవతలకు కూడా దుర్లభము. గంగాస్నానము విష్ణు సారూప్యమును ప్రసాదించును. ఇంతకంటే ఎక్కువగా చెప్పవలసినది ఏమున్నది. గంగానదిలో స్నానము చేసినచో పాపులు కూడా అన్ని పాపములను పోనాడి మహావిమానమును అధిరోహించి పరమ పదమును పొందెదరు. గంగానదిలో స్నానము చేసినవారు వేల పితృ కులములను మాతృకులములను ఉద్ధరించి విష్ణులోకమును చేరెదరు. గంగను స్మరించినవాడు అన్ని తీర్థములలో స్నానము చేసినవాడే. అన్ని పుణ్యక్షేత్రములలో నివాసము చేసినవాడే. ఈ విషయమున సంశయముతో పనిలేదు. గంగానదిలో స్నానమాడిన వానిని దర్శించిన పాపి కూడా స్వర్గమును పొందును. గంగాజలమును తాకినవాడు దేవతలకు కూడా అధిపతి అగును. తులసీవృక్ష మూలమున ఉన్నమట్టి, బ్రాహ్మణ పాదమున ఉన్న మట్టి, గంగా నదిలోని మట్టి జనులకు అచ్చుత సారూప్యమును ప్రసాదించును.

గంగానది, తులసి, స్థిరమైన విష్ణుభక్తి మానవులకు మిక్కిలి దుర్లభములు. అట్లే ధర్మమును బోధించు వానియందు భక్తి కలుగుట కూడా దుర్లభమే. సద్ధర్మమును బోధించువాని పాదధూళిని, గంగనుండి వచ్చిన మృత్తికను, తులసిమాల మృత్తికను భక్తితో శిరసున దాల్చినవాడు విష్ణులోకముననే అగును. “నేనెపుడు గంగానదికి వెళ్లెదను? ఎపుడు గంగానదిని చూచెదను” అని మనసులో పరితపించువాడు కూడా విష్ణులోకమును చేరును. గంగా మాహాత్మ్యమును కొన్ని వందల సంవత్సరములు శ్రీమహావిష్ణువునకు కూడా చెప్ప శక్యముకాదు. ఇక ఇతరులేమి చెప్పగలరు? ఈ మాయ ప్రపంచము నంతటిని మోహింప చేయుచున్నది. ఎంత ఆశ్చర్యము. గంగానామమున్ననూ లోకులు నరకమునకు వెళ్ళుట ఎంత ఆశ్చర్యము! గంగానామము, తులసీ నామము, హరికథలను చెప్పువారి యందు భక్తి సంసార దుఃఖమును సమూలముగా తొలగించును. ‘గంగా’ అను రెండక్షరములను ఒక్కమారు పలికినను అన్ని పాపములు తొలగి విష్ణులోకమును పొందును. గంగానదిలో మూడు యోజనములు పయనించినవాడు అన్ని పాపములను పోనాడి సూర్యలోకమును చేరును. పరమపవిత్రమైన ఈ గంగానదిని మేషతులామకర రాశులలో సూర్యుడున్నప్పుడు సేవించినచో సమస్త జగత్తును పావనము చేయును. గోదావరి, భీమరథీ, కృష్ణ, రేవ, సరస్వతి, తుంగభద్ర, కావేరి, కాళింది, బాహుద, వేత్రవతి. తామ్రపర్ణి సరయూ మొదలగు పుణ్యతీర్థములన్నింటిలో ప్రధానమైనది గంగానది.

సర్వగతుడైన శ్రీమహావిష్ణువు జగత్తునంతటిని వ్యాపించియుండునట్లు ఈ జగత్తును అంతటిని వ్యాపించియున్న గంగ అన్ని పాపములను నశింపచేయును. జగత్తును ధరించు గంగానది స్నాన పానాదులతో జగత్తును పావనముచేయును. కావున పావనమైన గంగను ఎందుకు సేవించరు? వారణాసి అన్ని తీర్థములలో ఉత్తమతీర్థము, అన్ని క్షేత్రములలో ఉత్తమ క్షేత్రము. దేవతలందరిచే సేవించబడునది. చెవులున్నవారందరి చెవులలో కాశీనామమును చాలామార్లు విన్న చెవులే చాల శాస్త్రములను విన్న చెవులగును. కాశీనామమును నిశ్చల మనస్సుతో స్మరించువారు అన్ని పాపములను త్రోసి శివలోకమును చేరెదరు. నూరు యోజనముల దూరమున ఉన్నవాడు కూడా భక్తితో కాశీనామమును స్మరించినచో బహుపాతకములున్నవాడైనను నాశములేని లోకమును చేరును. ప్రాణములు పోవు సమయమున కాశీ నామమును స్మరించువాడు పాపములను నశింపచేసుకొని శివలోకమును చేరును. కాశీ స్మరణము వలన వచ్చిన పుణ్యమును స్వర్గమున అనుభవించి తరువాత పృథివికి చక్రవర్తి అయి కాశిని చేరి ముక్తిని పొందును. వారాణాసీ గుణములను ఏమని చెప్ప వలయును. కాశీనామమున తలచిననూ ధర్మార్థకామమోక్షలు అను పురుషార్థ చతుష్టయము అందు బాటులో ఉండును. ఇంతటి మహిమగల వారాణాసి కంటే గంగా యమునా సంగము ఉత్తమమైనది. ఈ సంగమమును చూచినంతనే ఉత్తమ గతిని పొందెదరు.

మకర సంక్రమణ కాలమున గంగానదిలో ఏ ప్రాంతమున స్నానము చేసినను, గంగా జలపానము చేసిననూ స్వర్గము లభించును. ఎల్లప్పుడు గంగను ధరించుచున్నందుననే శంకరుడు లోకమునకు శుభములను కలిగించగలుగుచున్నాడు. లింగ రూపమును ధరించి గంగాభిషేకము చేయుచున్నాడు. అటువంటి గంగా మాహాత్మ్యమును ఎట్లు వర్ణించగలము. లింగమే హరి రూపమును ధరించును. హరియే లింగరూపమును ధరించును. ఈ రెండు రూపములకు ఏ మాత్రము భేదము లేదు. భేదమును చెప్పువాడు దుష్టబుద్ధియే. హరి శంకర నామములతో ఉండెడు దేవులు ఆద్యంతములు లేనివారే. అజ్ఞాన సముద్రమున మునిగిన పాపులు వారిద్దరికి భేదమును చెప్పెదరు. జగదీశ్వరుడు, అన్ని కారణములకు కారణమైన ఆదిదేవుడైన ప్రభువే యుగాంతకాలమున రుద్ర రూపముతో ఈ జగత్తును సంహరింప చేయును. ఆ రుద్రుడే మరల విష్ణు రూపముతో సమస్త ప్రపంచమును కాపాడును. బ్రహ్మ రూపమున ప్రపంచమును సృష్టించును. దీనిని హరుడే స్వయముగ సంహరించును. హరిహరులలో బ్రహ్మలో భేదమును చూచువాడు, చెప్పువాడు నరకమును పొందును. హరిని హరుని బ్రహ్మను ఏకరూపముగా చూచువాడు పరమానందమును పొందునని శాస్త్ర నిర్ణయము. అదిలేనివాడు సర్వజ్ఞుడు జగత్తును సృష్టించువాడు, ప్రభువు అయిన పరమాత్మలో లింగరూపియైన జనార్దనుడు అంతర్లీనముగా ఉన్నవాడే.

కాశీ విశ్వేశ్వర లింగమును జ్యోతిర్లింగమందురు. ఆ జ్యోతిర్లింగమును దర్శించిన వారు పరంజ్యోతిని చేరెదరు. మూడులోకములను పవిత్రముచేయు కాశీని ప్రదక్షిణము చేసినవారు ఏడు ద్వీపములతో, సముద్రములతో, పర్వతములతో కూడియున్న భూమిని ప్రదక్షిణము చేసిన వారు అగుదురు. ధాతురూపము, మృద్రూపము, పాషాణరూపము, చిత్ర రూపము అయిన శివుని ప్రతిమలు, విష్ణువు ప్రతిమలు పరమపావనములు. ఆ ప్రతిమలలో శ్రీహరి సన్నిహితముగా ఉండును. తులసీతోటలోను, పద్మములతోటలోను పురాణ పఠనము జరుగుచోట శ్రీహరి సన్నిహితుడై ఉండును. పురాణసంహితను చెప్పువారు సాక్షాత్తు శ్రీహరియే అని అనబడుదురు. పురాణమును చెప్పు వారి యందు, భక్తి నిలుపువారికి ప్రతి నిత్యము గంగాస్నానము చేసిన ఫలితము లభించును. పురాణ శ్రవణము నందలి భక్తి గంగా స్నానముతో సమము. పురాణమును చెప్పువారి యందున్న భక్తి ప్రయాగతో సమానము. సంసారసాగరములో మునిగియున్న జగత్తును పురాణ ధర్మములను చెప్పుచు ఉద్ధరించువారు సాక్షాత్తు శ్రీహరియే అని కీర్తించబడుదురు. గంగతో సాటివచ్చు తీర్థము లేదు. తల్లితో సాటివచ్చు గురువు లేడు. విష్ణువుతో సాటివచ్చు దైవము లేదు. గురువును మించిన తత్వము లేదు. నక్షత్రములలో చంద్రునివలె వర్ణములలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. నదులలో సముద్రమువలె గంగానది ఉత్తమమైనది. శాంతితో సాటివచ్చు బంధువు, సత్యమునుమించిన తపస్సు, మోక్షమునుమించిన ప్రయోజనము గంగతోసాటివచ్చునది లేదు.

గంగానామము పరమ పవిత్రమైనది. పాపారణ్యమునకు దావాగ్నివంటిది. సంసారము అను వ్యాధిని హరించగలది. కావున కష్ట ప్రయత్నముతో అయినను సేవించ తగినది. గాయత్రీ గంగ అను ఈ రెండును సర్వపాపములను హరించగలవి. ఈ రెంటియందు భక్తి లేనివానిని పతితునిగా తెలియుము. గాయత్రి ఛందోమాత, గంగ లోకమాత. ఈ రెండు సర్వ పాపములను నశింపచేయును. గాయత్రి ప్రసన్నమైనచో గంగ ప్రసన్నమగును. ఈ రెండు విష్ణుశక్తితో కూడి ఉండును. కావున అన్ని కోరికలను తీర్చును. ఈ రెండు ధర్మార్థకామములు అను ఫలములను ఇచ్చును. ఇవి అన్ని లోకములను అనుగ్రహించుటయందు ప్రవర్తించుచున్నవి. గాయత్రి జాహ్నవి అను ఈ రెండును నరులకు పరమ దుర్లభములు. ఇట్లే సాత్త్వికమైన విష్ణుభక్తి, తులసీ భక్తికూడా దుర్లభములే. మహనుభావురాలైన గంగను స్మరించినచో పాపములను నశింపచేయును. దర్శించినచో హరిలోకము లభించును. గంగాజలమును పానము చేసినచో విష్ణుసారూప్యమును ప్రసాదించును. గంగానదిలో స్నానము చేసినవాడు విష్ణు లోకమును పొందును. జగత్తును ధరించువాడు, సనాతనుడు వాసుదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు గంగాస్నానము చేయువారు కోరిన పురుషార్థములను ఇచ్చును. గంగాజలబిందువును శిరసున దరించినవాడు అన్ని పాపములను పోరాడి పరమపదమును చేరును. గంగాజలబిందువును సేవించినందువలననే సగర వంశమున పుట్టిన సౌదాసుడు రాక్షస భావమును విడిచి మోక్షమును పొందెను. (1/6)