నారద మహా పురాణము
పురుషోత్తమ క్షేత్ర యాత్రా ఫల వర్ణనము
వసువు పలికెను: ఓ బ్రహ్మపుత్రీ! ఆ మహానుభావులగు దేవతలందరు బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను స్తోత్రము చేయుదురు.
దేవతలు పలికిరి: లోకపాలా! నీకు జయము. పద్మనాభా! భూధరణా జయము. ఆదిదేవా! బహుకారణా! జయము. వాసుదేవా! సచ్చరణా! సత్కరుణా! నీకు జయము. దివ్యమానా! త్రిదశేశ్వరా! జయము. జలధిశయనా! యోగీశా! వేదధరా! జయము. విశ్వమూర్తీ! చక్రధరా! జయము. భూతనాధా! శ్రీనివాసా! యోగివరా! జయము. సూర్యనేత్రా! దేవవరాహ! జయము కైటభారీ! వేదవరా! జయము. కూర్మరూపా! యజ్ఞవరాహా కమలనాథా! శైలధరా జయము. యోగీశా! వేగధరా! విశ్వమూర్తే! చక్రధరా! భూతనాధా! ధరణీధరా! జయము. శేషశాయీ! పీతాంబరధారీ! జయము. సోమకాంతా! యోగావాసా! సుఖనివాసా! ధర్మకాంతా! మతినివాసా! జయము. గహన గేహనివాసా! యోగిగమ్యా! మఖనివాసా! జయము. వేదవేద్యా! శాంతికరా! యోగిచింత్యా! పుష్టికరా! జయము. జ్ఞానమూర్తీ! కమలాకరా! భావవేద్యా! ముక్తికరా! విమలదేహ! సత్త్వనిలయ! గణసమూహ! యజ్ఞకరా! జయము! గుణవిహీనా! మోక్షకరా! భూ హిరణ్యా! కాంతియుతా! జయము. లోకవరణా! లోకపతీ! పంకజాక్షా! సృష్టికర్తా! యోగయుతా! అతసీకుసుమ సుమ శ్యామదేహ! జయము. సముద్రానివిష్టదేహ! లక్ష్మీపంకజ భోగదేహ! భక్తిభావనా! లోకగేయా! లోకకాంతా! పరమ శాంతా! జయము. పరమసారా! చక్రధరా! భోగియుతా! నీలాంబరా! జయము. సాంఖ్యనుతా! కలుషహరా! కృష్ణా! జగన్నాధా! సంకర్షణానుజా! జయము. పద్మఫలాశాక్షా! విష్ణో! నీకు నమస్కారము అని ఇంద్రాది దేవతలు, సిద్ధ చారణ గంధర్వులు ఇతర స్వర్గవాసులు ఇట్లు స్తుతించి సంతుష్ట మనస్కులై దర్శించి స్తుతించి, నమస్కరించి వారియందే మనసు నుంచి బలరామకృష్ణ సుభద్రలను ధ్యానించుచు తమతమ స్థానములకు వెళ్ళెదరు. శత కపిలాదానముచే కలుగు ఫలము వేదికపై ఉన్న బలరామ సహిత కృష్ణ సందర్శనముచే లభించును. శతనిష్క సువర్ణ దానముచే భూమి దానము వలన కలుగు ఫలమును, కన్యాశతదానముచే కలుగు ఫలము మంచెపై నున్న శ్రీకృష్ణ సందర్శనముచే కలుగును. అన్నదానము వలన, సర్వాతిథ్యమువలన, యధావిధిగా చేసిన వృషభోత్సర్జనము వలన, వేసవిలో జలదానము వలన, తిలధేను ప్రదానమువలన, గజాశ్వరథ దానములవలన, సర్వతీర్థసేవనము వలన, సర్వవ్రతాచరణము వలన, సర్వదానముల వలన కలుగు ఫలములు అన్నియు సుభద్రాసహిత బలరామకృష్ణ సందర్శనమున కలుగును. కావున నరుడు కాని, నారి కాని మంచస్థుడగు పురుషోత్త ముని దర్శనము చేసుకొనవలెను. శ్రీకృష్ణుని స్నానశేష జలమును ప్రోక్షణ చేసుకొనినచో గొడ్డురాలు, మృత సంతానవతి, దౌర్భాగ్య పీడితులు, అందరూ పరిశుద్ధిని పొంది అభీష్టములను పొందెదరు. ఇతరములను అభిలషించరు కూడా.
ఈ భూ మండలమున నున్న సకల పుణ్యములు శ్రీకృష్ణ స్నానశేషజలము యొక్క ఒక అంశతో కూడా సాటిరాజాలవు. కావున శ్రీకృష్ణ స్నాన శేషజలముచే శరీరమంతటిని ప్రోక్షణ చేసుకొనవలెను. స్నానముచేసిన శ్రీకృష్ణ భగవానుని, దక్షిణాభిముఖముగా వెళ్ళు శ్రీకృష్ణుని దర్శించిన వారు బ్రహ్మ హత్యాది పాపములనుండి విముక్తులగుదురు. భూమిని మూడు మార్లు ప్రదక్షిణము చేసినచో శాస్త్ర బోధితమగు ఫలము దక్షిణాముఖ కృష్ణ సందర్శనముచే లభించును. భూమండలమున తీర్థయాత్రల వలన కలుగు ఫలము దక్షిణాముఖముగా వెళ్ళుచున్న శ్రీకృష్ణుని సందర్శనమువలన లభించును. గంగాద్వార ముఖ, కుబ్జామ్రమున, కురుక్షేత్రమున, అర్క పర్వమున, పుష్కరాది పుణ్య తీర్థములందు స్నానమాడికందు వలన కలుగు ఫలము దక్షిణముగా వెళ్ళుచున్న శ్రీకృష్ణుని దర్శనమున కలుగును. వేద శాస్త్ర పురాణాది పఠనము వలన, భారతాది సంహితా పఠనము వలన కలుగు ఫలము దక్షిణా ముఖముగానున్న బలరామకృష్ణుని దర్శించినవారు శ్రీహరి లోకమునకు వెళ్ళెదరు. గుండిచామండపమునకు వెళ్లు సమయమున, ఫాల్గుణ పూర్ణిమనాడు, విషువమున ఒకమారు శ్రీకృష్ణ సందర్శనవలన చేసినచో శ్రీహరి లోకమును పొందును. ఎన్ని మార్లు పురుషోత్తమ యాత్రచేసిన అన్ని కల్పములు విష్ణులోకమున నివసించును. ద్వాదశ యాత్రలు పూర్ణములైనచో బలరామకృష్ణ సుభద్రలను ప్రతిష్ఠించవలయును. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినాడు సావధాన మనస్కుడై పవిత్రమగు జలాశయమునకు వెళ్ళి, ఆచమనమునుచేసి భక్తికలిగి పవిత్రుడై అచట అన్ని తీర్థములను ఆవాహనమును గావించి, నారాయణుని ధ్యానించి యధోక్తవిదిని అనుసరించి స్నానము చేయవలెను. ఇట్లు స్నానము గావించి చక్కగా దేవతలను, ఋషులను, తమ పితరులను, ఇతరులను నామ గోత్రోచ్చారణ పూర్వకముగా తర్పణము చేయవలెను. తీరమునుచేరి, నిర్మలములు ధౌతములగు వస్త్రములను ధరించి, ఆచమనము గావించి, సూర్యోపస్థానమును ఆచరించి, గాయత్రీ మంత్రమును అష్టోత్తరశతము జపించి, ఇతర సూర్య మంత్రములను మూడుమార్లు పఠించి సూర్యునికి నమస్కరించ వలెను. మూడు వర్ణములలో స్నానము జపము వేదోక్తము. స్త్రీ శూద్రులకు వేదోక్త విధివర్జితముగా స్నాన జపములు చేయవలయును. హస్త పాద ప్రక్షాళనమును గావించుకొని ఆచమనముచేసి శ్రీహరిని మొదట నేతితో, తరువాత పాలతో మధువుతో గంధోదకముతో, తీర్థ చందన జలముతో స్నానమును చేయించవలెను. తరువాత పాలతో మధువుతో గంధోదకముతో, తీర్థ చందన జలముతో స్నానమును చేయించవలెను. తరువాత శ్రేష్ఠమగు వస్త్ర యుగ్మమును కట్టించవలెను. ఇట్లు జగన్నాధుడు భక్తి ముక్తి ప్రదుడగు శ్రీహరిని చక్కగా పూజించి అగురు సంయుక్త ధూపమును దేవదేహమున అగ్రభాగమున వేయవలయును. ఘృతసమన్వితమగు గగ్గులమును దహించవలెను. తరువాత శక్తిని అనుసరించి నేతితో దీపమును వెలిగించ వలయును. మరియు పన్నెండు దీపములను వెలిగించవలెను. ఈ దీపములను గోఘృతములచే కాని నువ్వులనూనెచే కాని వెలిగించవలయును. తరువాత పాయసమును, అపూపములను, సకిలములను, మోదకములను, అరిసెలను ఇతర ఫలములను నివేదన చేయవలెను. ఇట్లు పంచోపచార ములచే పురుషోత్తముని చక్కగా పూజించి “ఓం నమః పురుషోత్తమాయ” అను మంత్రమును అష్టోత్తర శతము జపించవలయును. తరువాత దేవుని ప్రార్థించి దండవత్ప్రణామములను ఆచరించి తరువాత గురువును భక్తిచే పుష్ప, చందనాదులచే పూజించవలెను.
దేవునకు గురువునకు భేదము లేదు. తరువాత ఉపరిభాగమున దేవునకు మండపమును నిర్మించవలెను. ఇచట విశాలముగా నానాపుష్పములచే విచిత్ర మండలము నేర్పరచవలెను. అవధార ణము గావించి రాత్రి జాగరణము చేయవలెను. రాత్రి పూట వాసుదేవ కథను కాని గీతములను కాని వినుచుండవలెను. దేవుని ధ్యానించుచు కీర్తించుచు స్తుతించుచు ఆరాత్రిని గడుపవలెను. తరువాత స్వచ్ఛమగు ప్రభాత కాలమున ద్వాదశినాడు వేదపారగులగు పన్నెండు మంది బ్రాహ్మణు లను వ్రతస్నాతులను నిమస్త్రణ చేయవలెను. వీరు ఇతిహాస పురాణజ్ఞులు, శ్రోత్రియులు, జితేంద్రియులు కావలెను. యధావిధిగా స్నానమాచరించి ధౌత వస్త్రములను ధరించి జితేంద్రియుడై భక్తిచే అచటనున్న పురుషోత్తముని పూర్వమువలె స్నానము చేయించవలయును. గంధపుష్ప ఉపాహా రములచే ధూప నైవేద్యములచే, బహువిధోపచారములచే, ప్రదక్షిణ నమస్కారములు చేయించవలెను. గంధపుష్ప ఉపహారములచే ధూపనైవేద్యములచే వివిధోపచారములచే, ప్రదక్షిణ నమస్కారములచే జపస్తోత్ర నమస్కారములచే, మనోహర గీతవాద్యములచే చక్కగా పూజించి, తరువాత బ్రాహ్మణులను పూజించవలెను. బ్రాహ్మణులకు పన్నెండు గోవులను బంగారమును, ఛత్రమును, పాదరక్షలను కాంస్య పాత్రను భక్తిచే అర్పించి, వారిని పాయస పూర్వకముగా భుజింపచేయవలెను. పక్వాన్నము, భక్ష్య భోజ్యములు, శర్కరాన్వితమగు గుడము భోజనమును అర్పించవలెను. భుజించి తృప్తి చెందిన బ్రాహ్మణులను స్వస్థమానసులను ద్వాదశ ఉదకుంభములను గ్రహింపచేసి మోదకములను అర్పించవలెను. యధాశక్తి దక్షిణలను అర్పించవలయును. సువర్ణ వస్త్ర గోధాన్యములను ఇతర ద్రవ్యములను సమర్పించి చక్కగా పూజించి నమస్కరించి ఈ మంత్రమును పఠించవలెను.
“సర్వవ్యాపీ జగన్నాథః శంఖ చక్రగదాధరః
అనాది నిధనోదేవః ప్రీయతాం పురుషోత్తమః”
అని సర్వవ్యాపకుడు, జగన్నాధుడు, శంఖ చక్రగదాధరుడు, అనాది నిధనుడుగు పురుషోత్త ముడు ప్రీతి చెందుగాక అని ఇట్లు ఉచ్చరించి బ్రాహ్మణులకు మూడు మార్లు ప్రదక్షిణమును ఆచ రించి శిరసుచే నమస్కరించి ఆచార్య సహితునిగా వారిని విసర్జించవలెను. బ్రాహ్మణుల వెంట సీమ వరకు వెళ్ళవలెను. వెంటవెళ్ళి నమస్కరించి తిరిగి వచ్చి స్వజనులతో బంధువులతో కలిసి భుజించవలెను. ఇట్లు చక్కగా ఆచరించిన పురుషులు స్త్రీలు సహస్రాశ్వమేధముల ఫలమును, శతరాజసూయ యాగముల ఫలమును పొందును. అతీతములను నూటిని రాబోవు నూరు మంది పురుషులను ఉద్ధరించి, దివ్యరూపధరుడై, అవ్యయుడై, సర్వలక్షణ సంపన్నుడై, సర్వాలంకార భూషితుడై సర్వకామ సమృద్ధుడై రూపగుణ యౌవనములతో అంతట గంధర్వాప్సరసలచే స్తుతించ బడుచు, కామగతిగల స్థిరమగు అర్కవర్ణముగల విమానముచే పతాకధ్వజయుతముగా శతసూర్య, కాంతి యుతముగా పది దిక్కులను ప్రకాశింపచేయుచు శ్రమరహితుడై ఆకాశమున యువకునిగా మహాబలునిగా ధీమంతునిగా విష్ణులోకమునకు వెళ్ళును. విష్ణులోకమున నూరు కల్పముల కాలము యధేష్ట భోగములను అనుభవించును. మునివరులచే స్తుతించబడుచు శ్రమరహితుడై ఉండును. శ్రీహరి శంఖచక్రగదాధరుడై నాలుగు భుజములతో ఉండునట్లు ఇతను కూడా చతుర్భుజరూపమును ధరించి సంతోషముతో ఇష్టభోగములను అనుభవించి చాలాకాలము విహరించి, తరువాత అఖిల కామప్రదమగు బ్రహ్మలోకమును చేరును. ఈ బ్రహ్మలోకము సిద్ధులచే విద్యాధరులచే దేవతలచే కిన్నరులచే శోభితమై ఉండును. బ్రహ్మలోకమున తొంబది కల్పములు భోగములను అనుభవించి దేవతలచే సేవించబడు సుఖప్రదమగు రుద్రలోకమునకు వచ్చును. ఇచట కూడా సిద్ధులు విద్యా ధరులు దైత్యులు దానవులు ప్రకాశించుచుందురు. రుద్రలోకమున ఎనుబది కల్పములు భోగములను అనుభవించి తరువాత సర్వభోగసమన్వితమగు గోలోకమునకు వెళ్ళును. ఈ గోలోకము సురసిద్ధ అప్సరసలచే శోభితము సుమనోహరము. ఇచట డెబ్బది కల్పములు భోగములను అనుభవించి ప్రాజాపత్యలోకమును చేరును. ఇచట అరువది కల్పములు భోగములను అనుభవించి సర్వాశ్చర్య సమన్వితమగు ఇంద్రలోకమునకు వచ్చును. ఇచట ఏబది కల్పములు భోగములను అనుభవించి విమానాలంకృతములగు అమరగృహములను చేరును. ఈ గృహములలో నలుబది కల్పములు సుదుర్టభములగు భోగములను అనుభవించి సర్వాశ్చర్య సమన్వితమగు నక్షత్ర లోకమును చేరును. ఇచట ముప్పది కల్పములు యధేష్ట భోగములను అనుభవించి చంద్ర లోకమును చేరును. ఇచటనే సర్వదేవతలచే అలంకరించబడు చంద్రుడు ఉండును. ఇచట ఇరువది కల్పములు సుదుర్లభములగు భోగములను అనుభవించి సురపూజితమగు ఆదిత్యలోకమును చేరును. ఇచట పది కల్పములు భోగములను అనుభవించి గంధర్వలోకమును చేరును. ఇచట యధాసుఖముగా ఒక కల్పము భోగములను అనుభవించి మరల భూలోకమున రాజుగా పుట్టును. ధార్మికుడు, చక్రవర్తి, మహాబల పరాక్రమములు కలవాడు స్వరగుణాలంకృతుడుగా ఉండును. ధర్మబద్ధముగా రాజ్య పరిపాలనము గావించి నదక్షిణముగా యజ్ఞములచే శ్రీహరిని సేవించి అంతమున మోక్షప్రదము శివకరమగు యోగిలోకమునకు వెళ్ళి ఇచట ప్రళయకాలము వరకు ఉత్తమ భోగములను అనుభవించి మరల భూలోకమున కొచ్చి యోగుల కులమున ఉత్తమమగు విష్ణు భక్తుల వంశమున దుర్లభము సాధు సమ్మతమగు వంశమున నాలుగు వేదములు తెలిసిన బ్రాహ్మణోత్తమునిగా బ్రహ్మ యజ్ఞపరునిగా పుట్టును. తరువాత వైష్ణవయోగమును చేరి కైవల్యమగు మోక్షమును పొందును. ఇట్లు పురుషోత్తమ తీర్థయాత్రా ఫలమును, మానవులకు భుక్తిముక్తి ప్రదమగు దానిని విపులముగా వివరించితిని. ఇంకనూ ఏమి వినదలచితివో తెలుపుము. (II/61)