బ్రహ్మాండపురాణానుక్రమణ నిరూపణము

బ్రహ్మ పలికెను: నాయనా! పురాతనమగు బ్రహ్మాండ పురాణమును చెప్పెదను వినుము. ఈ పురాణమున పన్నెండు వేల శ్లోకములు కలవు. ఆది కల్ప కథ కలది. మొదట ప్రక్రియ, రెండవది అనుషంగము. మూడవది ఉపోద్ఘాతము. నాలుగవది ఉపసంహారము. ఇటుల ఈ పురాణమున నాలుగు పాదములు కలవు. మొదటి రెండు పాదములు పూర్వభాగము. తృతీయపాదము మధ్యమ భాగము. చతుర్థపాదము ఉత్తర భాగముగా పేర్కొనబడినవి. మొదట కృత్య సముద్దేశము. తరువాత నైమిశాఖ్యానము, హిరణ్య గర్భోత్పత్తి, లోకజ్ఞానము, మానస సృష్టి కథనము, రుద్ర ప్రసవ వర్ణనము, మహాదేవ విభూతి, ఋషిసర్గము, అగ్నుల విజయము, కాలసద్భావ వర్ణనము, ప్రియవ్రత వంశ కథ, పృథివీ అయామ విస్తారములు, భారత వర్ణనము, ఇతర వర్ష నిరూపణము, జంబూ మొదలగు సప్త ద్వీపా ఖ్యానములు, అలోక వర్ణనము, ఊర్ధలోక కథనము, గ్రహచారము, ఆదిత్య వ్యూహ కథనము, దేవగ్రహాను కీర్తనము, నీలకంఠాఖ్యానము, మహాదేవ వైభవము, అమావాస్యా కథనము, యుగతత్త్వ నిరూపణము, యజ్ఞ ప్రవర్తనము, అంత్యయుగ ద్వయకృతి, యుగ ప్రజాలక్షణము, ఋషి ప్రవర వర్ణనము, వేదవ్యసనాఖ్యానము, స్వాయంభువ నిరూపణము, శేష మన్వంతరాఖ్యానము, పృథివీదోహనము, అద్యతనమగు చాక్షుష సర్గము ఇది ద్వితీయ పాదము. ఇక మూడవదగు ఉపోద్ఘాతపాదమున, సప్తర్షి కీర్తనము, ప్రజాపతి వంశము, దేవాద్యుత్పత్తి, దేవాదులకు జయాభిలాష మరుదుత్పత్తి, కాశ్యప వంశ కథనము, ఋషి వంశ నిరూపణము, పితృకల్ప కథనము, శ్రాద్ధ కల్పము, వైవస్వత సముత్పత్తి, వైవస్వత సృష్టి, మనుపుత్ర వంశము, గాంధర్వ నిరూపణము, ఇక్ష్వాకు వంశ కథనము, మాహాత్ముడగు అత్రి వంశము, అమావసు వంశము, రజి చరితము, యయాతి చరితము, యదువంశ నిరూపణము, కార్తవీర్య చరితము, జామదగ్న్య చరితము, వృష్టి వంశ కథనము, సగర సంభవము, భార్గవ చరితము, పితృకార్యవధ, సగర చరితము, మరల భార్గవ చరితము, దేవాసుర యుద్ధకథ, కృష్ణావిర్భావము, శుక్రుడు చేసిన ఇంద్రస్తుతి, విష్ణు మాహాత్మ్య కథనము, బలివంశ నిరూపణము, కలియుగమున భవిష్యరాజ చరితము. ఇది మధ్యమ భాగము. తృతీయపాదము. ఇక ఉత్తర భాగమున ఉపసంహార పాదమున, వైవస్వత మన్వంతర కథ ! భవిష్యమను చరితము, కల్ప ప్రళయ నిర్దేశములు, కాలమానము, చతుర్దశ లోక లక్షణములు, వికర్మాచరణమున లభించు నరకముల వర్ణన, మనోమయ పురాఖ్యానము, ప్రాకృతి ప్రళయము, శైవవర్ణము, పురవర్ణనము, త్రివిధ గుణసంబంధము వలన జంతువులకు ప్రాప్తించుగతి, అనిర్దేశ్యము, అప్రతర్క్యము అగు పరమాత్మ అగు బ్రహ్మను అన్వయ వ్యతిరేకములచే వర్ణనము వర్ణించబడినది. ఇట్లు నాలుగు పాదములుకల బ్రహ్మాండ పురాణమును చెప్పితిని. ఇదియే పదునెనిమిది సారములన్నిటి కంటె సారతరము. నాలుగు లక్ష శ్లోకములుకల పురాణ భాగమును వ్యాస భగవానుడు పదునెనిమిది విధములుగా విభజించి మహానుభావులగు మునులకు ఉపదేశించెను. నానుండి వ్యాసమహర్షి, అతని నుండి మునులువిని లోకములకు ప్రకాశింపచేసిరి. ఈ మునులు అందరు ధర్మశీలులు, దీనాను గ్రహకారులు, మొదట నేను ఈ పురాణమును వసిష్ఠ మహర్షికి చెప్పితిని. వసిష్ఠ మహర్షి తన పుత్రుడగు శక్తికి, శక్తి జతుకర్ణునికి, జతుకర్ణుడు వ్యాస మహర్షికి చెప్పెను. వ్యాస మహర్షి ఈ పురాణములను ప్రమాణీకరించి ప్రవర్తింపచేసెను. ఈ పురాణములను చదివినవాడు, సావధానముతో వినినవాడు పాపములను తొలగించుకొని ఉత్తమ లోకములను పొందును. ఈ పురాణమును వ్రాసి స్వర్ణ సింహానమున ఉంచి, వస్త్రముతోకప్పి బ్రాహ్మణునకు దానము చేసినచో బ్రహ్మలోకమును పొందును. ఓ మరీచి మహర్షీ ! నీకిట్లు అష్టాదశ పురాణములను చెప్పితిని. ఇట్లు అష్టాదశ పురాణములను చెప్పువాడు వినువాడు పునర్జన్మను పొందడు. పురాణపఠన ఫలమును కోరువారు ఈ పురాణ సూత్రమును నిత్యము చదువవలెను. దాంభికునకు, పాపికి, సాధు ద్వేషికి, శఠునకు చెప్పకూడదు. శాంతునకు శమచిత్తునకు, శుశ్రూష చేయువానికి, నిర్మత్సరునకు, శుచికి సద్వైష్ణవునకు ఉపదేశించవలయును. (4/109)