నారద మహా పురాణము
ధర్మాను కథనము
ధర్మరాజు పలికెను: శివాలయమును కాని విష్ణ్వాలయమును కాని స్వయముగా నిర్మించిననూ, నిర్మింపచేసినను అతను మాతృ వంశమున పితృ వంశమున లక్షకోట్ల కులములతో మూడు కల్పములు విష్ణు లోకమున నివసించును. సందేహములేదు. మట్టితో దేవాలయమును నిర్మించిన వాడు దివ్యదేహమును ధరించి, ఉత్తమ విమానము అధిరోహించి మూడు కల్పములు విష్ణులోకమున నివసించి బ్రహ్మలోకమునకు ఏగును. అచట రెండు కల్పములు నివసించి స్వర్గమును చేరి ఒక కల్పము నివసించి తరువాత యోగుల కులమున జన్మించి దయకలవాడై వైష్ణవయోగమును అవలంబించి శాశ్వతమైన ముక్తిని పొందును. చెక్కతో దేవాలయమును నిర్మించిన వానికి రెట్టింపు ఫలితము కలుగును. ఇటుకలతో నిర్మించిన మూడు రెట్లు ఫలము కలుగును. శిలలతో నిర్మించిన నాలుగురెట్లు ఫలితము కలుగును స్ఫటికశిలలతో నిర్మించిన పదిరెట్లు అధికముగా ఫలము లభించును. రాగితో నిర్మించిన నూరురెట్లు ఫలితము, బంగారముతో నిర్మించినచో కోటిరెట్లు అధికముగా ఫలము కలుగును. దేవాలయమును కాని తటాకమును కాని గ్రామమును కాని పరిపాలించువానికి, నిర్మించు వానికన్నా నూరురెట్లు ఫలితము కలుగును. దేవాలయమున నీరుచల్లి, అలికి ముగ్గులువేసి శుశ్రూషచేయువారికి కలుగు పుణ్య ఫలమునంతయు వేతనము తీసుకొని కాని, ఇష్టముతో కాని పుణ్యకార్యములలో ప్రవర్తించువారు ఈ భూమికి ఆధారభూతులై శాశ్వతమైన విష్ణులోకమును పొందెదరు. సరస్సును నిర్మించినచో తటాకమును నిర్మించుదానిలో సగము ఫలమును పొందును. కూపమును నిర్మించినచో నాలుగవ భాగము ఫలము కలుగును. దిగుడుబావి నిర్మించినచో పద్మ సరస్సును నిర్మించిన ఫలము కలగును. కాలువ నిర్మించినచో వాటికి నూరురెట్లు ఫలము కలుగును. ధనవంతుడు రాళ్ళతో నిర్మించినను, దరిద్రుడు మట్టితో నిర్మించిననూ ఫలము సమానముగా కలుగునని బ్రహ్మ చెప్పెను.
ధనవంతుడు నగరమును, దరిద్రుడు ఒక మూర భూమిని దానము చేసినచో వారిరువురికి సమానఫలము లభించును అని వేదపండితులు చెప్పెదరు. ఫలమునిచ్చు తటాకమును ధనవంతుడు నిర్మించినను, దరిద్రుడు కూపమును తవ్వించిననూ పుణ్యము సమానముగా లభించును. పలుప్రాణులకు ఉపకరించు ఆశ్రమమును నిర్మించినవాడు మూడు తరములవరకు బ్రహ్మలోకమును పొందును. ఆ ఆశ్రమ వృక్షచ్ఛాయలో ఒక ఆవుకాని, బ్రాహ్మణుడు కాని అరక్షణము నిలిచినచో కర్త దేహాంతమున స్వర్గమును పొందును. ఆరామమును నిర్మించినవారు, దేవాలయమును నిర్మించిన వారు, తటాకమును గ్రామమును నిర్మించినవారు శ్రీహరితో సమానముగా పూజించబడుదురు. ప్రజలందరి కొఱకు కాని, దేవతల కొఱకు కాని పూలతోటను ఏర్పరచినవారు కోటికులముల వరకు ఆ తోటలో ఉన్న ఆకుల పండ్ల సంఖ్యతో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. ముళ్ళు బాధించనట్లు ఆ తోటలో ఉన్న ఆకుల పండ్ల సంఖ్యతో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. ముళ్ళు బాధించనట్లు ఆ తోటలో ఆవరణమును నిర్మించినవారు, పూలతోటకు ప్రాకారమును నిర్మించినవారు డెబ్బది యొకటి యుగములు బ్రహ్మలోకమున నివసింతురు. తులసీ వృక్షమును నాటినవారు ఏడు కోట్లకులముల వరకు మాతృవంశమున పితృవంశమున ఉండువారితో నూరు కల్పములు నారాయణుని లోకమున నివసించును. తులసీ మూలమృత్తికతో కాని, గోపీ చందనముతో కాని, చిత్రములుకూడ మృత్తికతో కాని గంగా మృత్తికతో కాని ఊర్థ్వపుండ్రమును ధరించినవారు గంధర్వాప్సరోగణములతో కలిసి గానము చేయబడుచు విష్ణుమందిరమున ఆనందింతురు. తులసి మూలములనుండి ఎన్ని ఆకులు రాలుచుండునో అన్ని బ్రహ్మహత్యాది పాతకములు నశించును. ఒక చుళుక మాత్రము జలమును తులసీ మూలమున తడిపినచో సూర్యచంద్రులు ఉన్నంతవరకు శ్రీమహావిష్ణువుతో కలిసి ఉండును. బ్రాహ్హణులకు తులసి దళమును ఇచ్చినవారు మూడు తరముల వరకు బ్రహ్మలోకమున నివసింతురు. తులసి దళములను శాల గ్రామమును అర్పించినవారు ప్రళయకాలము వరకు విష్ణు భవనమున నివసించును. తులసీ వృక్షమునకు ముళ్ళతీగ ఆవరణముగా, ప్రాకారము చేయించినవారు ఇరువది యొక్క తరములు విష్ణులోకమున ఆనందింతురు. తులసీదళములతో శ్రీహరి పాద పద్మములను అర్చించిన వారు విష్ణు లోకమును చేరి శ్వాశ్వతముగా మరల తిరిగి రాక అచటనే నివసింతురు.
ద్వాదశీతిథియందు పూర్ణిమాతిథి యందు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో పదివేల తరములతో విష్ణులోకమున ఆనందించును. ఒక గరిటెడు పాలతో శ్రీహరిని స్నానము చేయించినచో లక్షతరములలో విష్ణులోకమున నివసించును. ద్వాదశినాడు గరిటెడు నెయ్యితో శ్రీహరిని స్నానము చేయించినచో కోటితరములలో శ్రీహరి సాయుజ్యమును పొందును. ఏకాదశీ తిథిన పంచామృతముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిలక్షల తరములతో శ్రీహరి సాయుజ్యము లభించును. ఏకాదశి, పూర్ణిమ, ద్వాదశీ తిథులలో నాళికేర జలముతో శ్రీహరిని స్నానము చేయించినచో పదిజన్మలలో చేసిన పాపములు తొలగి రెండువందల తరములలో శ్రీమహావిష్ణువుతో ఆనందించును. చెఱకురసముతో శ్రీహరిని స్నానము చేయించినచో లక్షతరములలో విష్ణులోకమున నివసించును. పుష్పోదకముతోకాని, గంధోదకముతోకాని శ్రీహరిని స్నానము చేయించినచో విష్ణులోకము లభించును. వస్త్రముచే వడపోసిన జలముచే శ్రీహరిని స్నానము చేయించినచో అన్ని పాపములు తొలగి శ్రీమహావిష్ణువుతో ఆనందించును. సూర్యసంక్రమణమున క్షీరాదులతో శ్రీహరిని స్నానము చేయించినచో ఇరువదియొక్క తరములలో శ్రీవిష్ణులోకమున నివసించును. శుద్ధచతుర్దశియందు అష్టమీ తిథియందు పూర్ణిమాతిథియందు ఏకాదశీతిథియందు, ఆదివారము నందు, ద్వాదశీ తిథియందు పంచమీతిథియందు సోమ సూర్యగ్రహణములలోను, మన్వాదియుగాది సమయమునందు, సూర్యుని అర్ధోదయమున, సూర్యుడు పుష్యమీ నక్షత్రమున ఉన్నప్పుడు, బుధుడు రోహిణీ నక్షత్రమున ఉండగా, శని రోహిణిలో, కుజుడు అశ్వినిలో, శని అశ్వనిలో, శుక్రుడు మృగశిరలో, రేవతిలో బుధుడు, అనూరాధలో, సూర్యుడు శ్రవణములో, చంద్రుడు శ్రవణములో, బృహస్పతి హస్తలో ఉన్నప్పుడు, బుధాష్టమియందు, బుధాషాఢలో, ఇతర పుణ్యదినములలో శాంతి కలిగి వాఙ్ఞియమముతో శ్రీహరిని పాలతో స్నానము చేయించ వలయును. నేయితో, తేనెతో, పెరుగుతో అయినను స్నానము చేయించినచో అన్ని యజ్ఞములు ఆచరించిన ఫలమునుపొంది, అన్ని పాపములనుండి విముక్తిని పొంది ఇరువది ఒకటి తరములలో విష్ణుపురమున నివసించి అచటనే జ్ఞానమును పొంది పాపములనుండి విముక్తిని పొంది ఇరువది ఒకటి తరములతో విష్ణుపురమున నివసించి అచటనే జ్ఞానమును పొంది యోగులకు కూడా దుర్లభము పునరావృత్తిరహితమైన మోక్షమును పొందును.
కృష్ణపక్ష చతుర్దశీ తిథియందు సోమవారమునాడు శివుని పాలతో అభిషేకము చేసినచో శివసాయుజ్యమును పొందును. అష్టమీతిథియందు కాని, సోమవారమునాడు కాని నాళికేర జలముచే శివాభిషేకము చేసిననూ, శివసాయుజ్యమును పొందును. శుక్లపక్ష చతుర్దశినాడు, అష్టమినాడు నేతితోకాని తేనేతో కాని శివాభిషేకము చేసినచో శివసామ్యమును పొందును. నువ్వుల నూనెతో శివుని కాని, విష్ణువును కాని అభిషేకము చేసినచో ఏడు తరములతో శివవిష్ణు సారూప్యమును పొందును. చెరుకురసముతో శివుని స్నానము చేయించినచో ఏడు తరములతో శివలోకమున ఒక కల్పము నివసించును. ఉత్థాన ద్వాదశినాడు పాలతో కాని నేతితో కాని అభిషేకము చేసినచో పదివేల జన్మలలో చేసిన పాపములనుండి విముక్తుడై కోటి తరములలో శివసామ్యమును పొందును. ఏకాదశి తిథినాడు గంధపుష్పములతో శ్రీవిష్ణువును ఆరాధించి పదివేల జన్మలలోని పాపముల నుండి విముక్తుడై, శ్రీవిష్ణుపదమును పొందును. పద్మములతో శివుని కాని శ్రీమహావిష్ణువును కాని పూజించినచో కోటితరములతో విష్ణు భవనమును చేరును. శ్రీహరిని మొగలి పుష్పములతో, శివుని ఉమ్మెంత పూవులతో రాత్రిపూట పూజించినచో పాపములు నశించి శ్రీవిష్ణునగరమున ఒక యుగమున నివసించును. సంపెంగ పూలతో శ్రీహరిని, జిల్లేడు పూలతో శంకరుని పూజించి హరి, శివ సాలోక్యములను పొందును. శంకరునికి కాని విష్ణువునకు కాని నేతితో సాంబ్రాణి ధూపమును వేసినచో అన్ని పాపముల నుండి విముక్తుడు అగును. నువ్వుల నూనెతో దీపమును శ్రీమహావిష్ణువునకుకాని, శంకరునికికాని అర్పించినచో అన్ని కోరికలు తీరును. శంకరునికికాని, శ్రీమహావిష్ణువునకుకాని నేతితో దీపము పెట్టినచో అన్ని పాపముల నుండి విముక్తుడై గంగా స్నానఫలమును పొందును. గ్రామ్యములైన ఏ నూనెలతో అయినను శ్రీమహావిష్ణువునకు, శివునికి దీపమును వెలిగించినచో అన్ని పాపముల నుండి విముక్తుడై సర్వైశ్వర్యములతో కూడి విష్ణు శివ సాలోక్యములను పొందును. అత్యంతము ఇష్టమైన భోజనమును విష్ణువునకు కాని శివునికి కాని అర్పించి విష్ణులోకమును శివలోకమును చేరును. అత్యంతము ఇష్టమైన వస్తువును బ్రాహ్మణునకు దానము చేసినచో పునారావృత్తి రహితమైన వైకుంఠమును చేరును.
గర్భస్థ శిశువును చంపినవాడు సువర్ణమును దానము చేసినచో ఆ పాపము తొలగి పరిశుద్ధుడగును. అన్నదానముతో జలదానముతో సమానమైన దానము ఇదివరకు లేదు. ఇకముందు ఉండబోదు. అన్నదానము చేసినవాడు ప్రాణదానము చేసినవానితో సమానుడు. ప్రాణదానము చేసినవాడు అన్ని దానములు చేసినవానితో సమానుడు. కావున అన్నదానము చేసినవాడు సర్వదానములు చేసిన వాని ఫలితమును పొందును. అన్నదానమును చేసినవాడు తన పదివేల మంది వంశస్థులతో బ్రహ్మలోకమును చేరును. మరల తిరిగి రాడని శాస్త్రములు నిశ్చయించినవి. జలదానము వెంటనే తృప్తి కలిగించునట్టిది కావున అన్నదానము కంటే జలదానము ఉత్తమమని బ్రాహ్మవాదులు నిర్దేశించిరి. మహాపాతకములతో కూడియున్నను ఉపపాతకములతో కూడియున్ననూ జలదానము చేసినవాడు విముక్తుడగునని బ్రహ్మ చెప్పెను. శరీరము అన్నము వల్లనే పుట్టును. ప్రాణములు కూడా అన్నము వల్లనే కలుగును. కావున అన్నదానము చేసినవాడు ప్రాణదానము చేసిన వాడే అగును. అన్నదానము వెంటనే తృప్తి కలిగించునది. అన్ని కోరికలను తీర్చునది. కావున ఈ భూలోకమున అన్నదానముతో సమానమైన దానము మరి ఒకటిలేదు. అన్నదానము చేసిన వారి కులములో పుట్టిన వారు వేయి తరముల వరకు నరకమును చూడరు. కావున అన్నదానము చేసినవాడు సర్వశ్రేష్ఠుడు. అతిథికి పాదప్రక్షాళనము చేసినవాడు గంగాస్నానముతో పాటు అన్ని పుణ్యతీర్థములలో స్నానము చేసిన ఫలము పొందును. బ్రాహ్మణులకు తైల అభ్యంగనమును చేయించినవాడు గంగలో నూట ఎనిమిది స్నానములు చేసినవాడగును. వ్యాధిగ్రస్తులైన బ్రాహ్మణులను ప్రేమతో రక్షించువాడు కోటితరములతో బ్రహ్మలోకమున నివసించును. పేదవానిని కాని రోగిని కాని రక్షించువానికి విష్ణువు ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. రోగముతో ఉన్న వానిని మనసుతో వాక్కుతో కర్మతో త్రికరణ శుద్ధిగా రక్షించువాడు అన్ని పాపముల నుండి విముక్తుడై అన్ని కోరికలను నెరవేర్చుకొనును.
బ్రాహ్మణునకు గృహదానము చేసిన వానికి శ్రీహరి ప్రసన్నుడై తన లోకమునిచ్చును. వేదాధ్యయనపరుడైన బ్రాహ్మణునకు పాలిచ్చు ఆవును దానము చేసినవాడు ఇతరులకు దుర్లభమైన బ్రహ్మలోకమున కేగును. తన వద్ద లేనిచో ఇతరుల నుండి తీసుకొని అయినను పాలిచ్చు ఆవును బ్రాహ్మణునకు దానము చేసిన వానికి కలుగు పుణ్యఫలమును నేను చెప్పజాలను. వేదములు తెలిసిన బ్రాహ్మణునికి కపిలగోవును దానము చేసినవాడు అన్ని పాపములనుండి విముక్తుడై స్వయముగా రుద్రుడే అగును. వేదములు చక్కగా తెలిసిన బ్రాహ్మణునికి ప్రసవించుచున్న అవును దానముచేసిన వానికి కలుగు ఫలమును నూరు సంవత్సరములలో కూడా లెక్కించలేరు. సంపూర్ణముగా ఉత్తమ దక్షిణలిచ్చు అన్ని యాగములు, ప్రాణభయముతో ఉన్న ప్రాణి ప్రాణములను కాపాడుట ఈ రెంటి వలన కలగు ఫలితము ప్రసవించు ఆవును దానము చేసిన వానికి కలుగును. భయముతో వణుకుచున్న బ్రాహ్మణుని రక్షించిన వానికి సర్వతీర్థస్నానఫలము, సర్వయజ్ఞ దీక్షాఫలము కలుగును. వస్త్రదానముచేసిన వానికి రుద్రలోకము, కన్యాదానముచేసిన వానికి బ్రహ్మలోకము కలుగును. బంగారము నిచ్చినవాడు విష్ణు లోకమును పొందును. అలంకరించిన కన్యను అధ్యాత్మ జ్ఞానము కలవానికి దానము చేసినవాడు నూరు తరములతో బ్రహ్మ లోకమున కేగును. కార్తీక పూర్ణిమనాడు, అషాఢ పూర్ణిమనాడు శివుని ప్రీతి కొఱకు వృషభమును విడిచినవాడు ఏడు జన్మల పాపముల నుండి విముక్తుడై రుద్ర రూపమును పొంది, డెబ్బది తరములలో రుద్రునితో కలిసి ఆనందించును. శివలింగ చిహ్నమును చిత్రించి మహిషమును వదలిన వానికి యాతనా లోకము (నరకము) కలుగదు. తాంబూల దానము చేసిన వానికి శ్రీహరి ప్రసన్నుడై ఆయుష్యమును కీర్తిని సంపదను ఇచ్చును. పాలు పెరుగు నెయ్యి తేనెలను దానము చేయువారు పదివేల దివ్య వర్షములు స్వర్గమున నివసింతురు. చెరుకును దానము చేయువారు బ్రహ్మ లోకమును చేరుదురు. గంధమును పుణ్య ఫలమును దానము చేయువారు బ్రహ్మ లోకమును చేరుదురు. బెల్లమును చెరకు రసమును దానము చేయువారు క్షీరసాగరమునకేగెదరు.
రాజు భటులకు మంచినీరిచ్చిన వారు సూర్య లోకమును పొందుదురు. విద్యాదానము చేసినవారు హరి సాయుజ్యమును పొందెదరు. విద్యాదానము, భూదానము, గోదానము పరమోత్తమములు. కావున నరకమును తప్పించును. అన్ని దానములలో విద్యాదానము విశిష్ఠమైనది. విద్యాదానముతో విష్ణు సాయుజ్యమును పొందవచ్చును. వంట చెరకును దానము చేసినచో ఉపపాతకముల నుండి విముక్తి లభించును. శాలగ్రామశిలాదానము మహాదాన మని చెప్పబడుచున్నది. కావున శాలగ్రామదానమును చేసిన వారు మోక్షమును పొందెదరు. లింగదానమును చేసిన వారు కోటిబ్రహ్మాండములను దానము చేసిన వారికంటే రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామ దానమును చేసినవారు లింగదానమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. శాలగ్రామ శిలారూపమున ఉండునది శ్రీమహావిష్ణువేనని ప్రసిద్ధి కలదు. కావున ఇంటిలో దానముచేసినవారు గంగా స్నానఫలమును పొందురు. రత్నములతోకూడిన బంగారమును దానముచేయుట మహాదానము కావున ఆ దానమును చేసినవారు భోగమును మోక్షమును పొందెదరు. మాణిక్య దానముతో మోక్షమును పొందుదురు. వజ్రదానముతో ధ్రువలోకమును పొందవచ్చును. పగడమును దానము చేసినచో స్వర్గమును, వాహనమును దానము చేసినచో రుద్రలోకమును, ముత్యములను దానము చేసినచో చంద్రలోకమును, వైడూర్యదానమున రుద్రలోకమును పొందెదరు. పుష్పరాగ దానముతో ఇహపరములలో సుఖమును పొందెదరు. అశ్వదానమున అశ్వలోకమును, గజదానమున సర్వకామములను పొందుదురు. వాహనమును దానము చేసినచో దివ్యవిమానమును అధిరోహించి స్వర్గమును పొందుదురు. గేదెను దానము చేసిన వారు అపమృత్యువును జయింతురు. గోవులకు తృణము నొసగిన వారికి రుద్రలోకము లభించును. లవణ దానముచే వరుణ లోకమును పొందెదరు. తమ తమ ఆశ్రమాచారములలో ఉండువారు అన్ని ప్రాణుల హితమును కోరువారు, డంబాచారములు లేనివారు, అసూయ తొలగినవారు బ్రహ్మలోకమును పొందెదరు. ఇతరులకు మంచిని ఉపదేశించువారు, రాగములేనివారు, మాత్సర్యము తొలగినవారు, శ్రీహరి పాదములను అర్చించు వారు శ్రీహరి లోకమును పొందెదరు. సజ్జనులతో కలిసి ఉండవలయునని అభిలషించువారు, సత్కర్మలను చేయువారు ఇతరులపై అపవాదు వేయనివారు శ్రీహరి మందిరమును పొందెదరు. బ్రాహ్మణులకు, గోవులకు ఎప్పుడూ హితమునే చేయువారు, పరస్త్రీ సంగమమును కోరని వారు యమలోకమును చూడరు. ఇంద్రియ జయము, ఆహారజయము కలవారు, గోవుల విషయమున క్షమాపరులు సౌశీల్యము కలవారు, బ్రాహ్మణుల విషయమున క్షమాశీలురు శ్రీహరి లోకమును చేరెదరు. అగ్నిని, గురువులను, భర్తను సేవించువారలు సంసారమున పడరు. ఎపుడూ దైవార్చనను, కోరువారు హరినామ సంకీర్తనమును చేయువారు, ఎవరినుండి దేనిని గ్రహించనివారు పరమ పదమును పొందెదరు. దిక్కులేని బ్రాహ్మణ శవమును దహనము చేసిన వారికి వేయి అశ్వమేధయాగముల ఫలము లభించును.
పూజలులేని లింగమును పత్రములతో పుష్ఫములతో ఫలములతో జలముతో పూజించినవారు దివ్య విమానమును అధిరోహించి గంధర్వాప్సరోగణములచే స్తుతించబడుచు శివసాన్నిధ్యమును చేరెదరని బ్రహ్మ చెప్పియుండెను. చారెడు నీటితో శివలింగమునకు అభిషేకమును చేసిన వారికి లక్ష అశ్వమేధయాగముల ఫలము లభించి తీరును. సంశయముతో పనిలేదు. పూజలులేని శివలింగమును పుష్పములతో పూజించిన వారికి పదివేల అశ్వమేధయాగముల ఫలితము లభించును. భక్ష్యభోజ్యఫలములతో పూజలు లేని శివలింగమును పూజించినవారికి పునారావృత్తిరహితమైన శివలోకము లభించును. పూజలులేని శ్రీహరిని జలముతో పూజించిననూ విష్ణు సాలోక్యమును పొందును. దేవాలయమున మార్జనము చేసినచో ధూళి రేణువుల సంఖ్యగల సంవత్సరములు విష్ణు లోకమున నివసించును. భిన్నమైన స్ఫటిక లింగమును సంధానము చేసినవారు నూరు జన్మల పాపములనుండి విముక్తుడు అగును. దేవాలయమున గో చర్మమాత్రమైనను భూమిని నీటితో చల్లి తడిపినచో స్వర్గమును పొందును. దేవాలయమున గంధోదకమును చల్లినచో తడిసిన ధూళి కణముల సంఖ్యగల సంవత్సరములు దేవలోకమున నివసించును. మట్టితో కాని, రంగు రంగుల ధాతువులచే కాని దేవాలయమును అలికినచో కోటి తరములను ఉద్ధరించి విష్ణు సామ్యమును పొందెదరు. దేవాలయమున ముగ్గులు దిద్దినచో, స్వస్తి కాదులను చిత్రించినచో వారికి లభించెడు పుణ్యము అనంతము. దేవాలయమున దీపము నుంచిన వాని పుణ్యమును నూరు సంవత్సరములలో కూడా లెక్కించలేము. విష్ణువునకు కాని, శంకరునకు కాని అఖండదీపమునుంచిన వారికి ప్రతిక్షణము అశ్వమేధయాగము చేసిన ఫలములభించును. పూజించిన శంకరునికాని, విష్ణువునుకాని చూచి నమస్కరించిన వారు శ్రీవిష్ణులోకమును చేరి మహావిష్ణువుతో కలిసి ఆనందింతురు. దేవికి ఒక ప్రదక్షిణమును, సూర్యునికి ఏడు ప్రదక్షిణములును, వినాయకునికి మూడు ప్రదక్షిణములు, విష్ణువునకు నాలుగు ప్రదక్షిణములను చేసి వారివారి లోకములను చేరి లక్ష యుగములు ఆనందింతురు. భక్తి భావముతో విష్ణువునకు, గోవునకు, బ్రాహ్మణులకు ప్రదక్షిణములను చేసిన వారికి అశ్వమేధయాగ ఫలము లభించును. కాశీలోని మహేశ్వర లింగమును పూజించి నమస్కరించినవారికి కర్మ, సంసారము ఉండదు. యథావిధిగా సవ్యముగా శివునికి ప్రదక్షిణము చేసినవారు శివుని అనుగ్రహము వలన స్వర్గమునుండి పతనమును పొందరు.
నిర్మలుడు జగన్నాథుడు అయిన నారాయణుని స్తోత్రములతో స్తుతించి మనసున కోరిన కోరికలను అన్నింటిని పొందగలడు. దేవాలయమున భక్తిగలవాడై నృత్యమును కాని, గానమును కాని చేసినచో రుద్రలోకమును పొందును. దేవాలయమున వాద్యములను మ్రోగించినవారు హంస వాహనము అధిరోహించి బ్రహ్మ లోకమును చేరెదరు. దేవాలయమున కరతాళ ధ్వనిచేయువారు అన్ని పాపములనుండి విముక్తిని పొంది విమానమును అధిరోహించి దేవలోకమున పదివేల యుగములు ఉందురు. దేవాలయమున ఘంటానాదమును చేసినవారికి కలుగు పుణ్యమును స్వయముగా శివుడు కూడా చెప్పజాలడు. దేవాలయమున భేరీ మృదంగపటహ మురజ డిండిమములతో దేవాధీశుని సంతోషింపచేసిన వారు దేవతా స్త్రీ గణములతో కూడి అన్ని కోరికలను నెరవేర్చుకొని స్వర్గలోకమును చేరి అయిదు కల్పములు ఆనందింతురు. దేవాలయమున శంఖ నాదమును చేసినవారు అన్ని పాపముల నుండి విముక్తిని పొంది విష్ణువుతో కూడి ఆనందింతురు. విష్ణుమందిరమున కంచుతాళములు ధ్వని చేసినవారు అన్ని పాపములనుండి విముక్తిపొంది విష్ణులోకమును చేరుదురు. శ్రీమహావిష్ణువు సర్వదర్శి; జ్ఞానరూపుడు; నిరంజనుడు. అతడు సంతోషించినచో పరిపూర్ణముగా సర్వ ధర్మఫలములను ప్రసాదించును. దేవదేవుడైన శ్రీమన్నారాయణుని స్మరించినచో, సర్వకర్మలు సఫలములగును. పరమాత్మ జగన్నాథుడు అగు శ్రీమన్నారాయణుడు సర్వకర్మల ఫలములనిచ్చువాడు. సత్కర్మలను చేయువారు నిత్యము స్మరింతురు. శ్రీహరి అందరి ఆర్తిని తొలగించును. శ్రీమహావిష్ణువును ఉద్దేశించి చేసినదేదైనను అనంత్యమును ప్రసాదించును. ధర్మములు, ధర్మఫలములు, కర్మలు, కర్మ ఫలములు, కర్మఫలభోక్త, కార్యము, కరణములు అన్నియూ శ్రీమహావిష్ణువే. శ్రీమహావిష్ణువు కంటే భిన్నమైనదేదీ మరియొకటిలేదు. (1/13)