జ్యోతిషమున గణితభాగ వర్ణనము

సనందన మహర్షి పలికెను: పూర్వము బ్రహ్మ చెప్పిన జ్యోతిషాంగమును చెప్పెదను. జ్యోతిషమును తెలిసిన మానవులకు ధర్మసిద్ధి లభించును. ఈ జ్యోతిష శాస్త్రము మూడు స్కంధములు గలది. నాలుగు లక్షల శ్లోకములు గలవు. గణితము, జాతకము, సంహిత అని మూడు స్కంధములు. గణిత భాగమున పరికర్మ మొదలుకొని ఆకాశ మధ్యమున ఉండు క్రియాస్ఫుటము, గ్రహానుయోగము, చంద్ర సూర్య గ్రహణము, శృంగోన్నతి ఛాయలు, పాత సాధనము చెప్పబడినది. జాతక భాగమున రాశి భేదము, గ్రహకారణములు, గర్భాధాన, జన్మఅరిష్టములు, ఆయుర్దాయము, దశాక్రమము, జీవనమున చేయు కర్మ, అష్టవర్గము, ఆకాశమునకు సంబంధించిన రాజయోగములు, చంద్ర యోగము, రాశి శీలము, దృక్ఫలము, గ్రహభావఫలము, ఆశ్రయ యోగప్రకీర్ణకములు, అనిష్ట యోగములు, స్త్రీ జన్మఫలము, నిర్యాణము, నష్టజన్మ విధానము, ద్రేష్మాణ లక్షణము చెప్పబడినవి. సంహితా భాగమున గ్రహచారము, అబ్దలక్షణము, తిథి, వాసర, నక్షత్ర, యోగ, తిధ్యర్ధ సంజ్ఞలు, ముహూర్తోప గ్రహములు సూర్య సంక్రమణము, తారా చంద్రబలములు, సర్వలగ్న ఋతువులు, గర్భాధాన, పుంసవన, సీమంత, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, మౌంజీ, క్షురికా బంధనము, సమావర్తనము, వివాహము, ప్రతిష్ఠా, గృహలక్షణములు యాత్రాగమనము, సద్యో వృష్టి, విశేషకర్మలు, ఉత్తత్తి లక్షణము అంతయూ చెప్పబడినది. దానిని నేను సంక్షేపముగా చెప్పెదను. ఒకటి, పది, శతము, సహస్రము, అయుతము, లక్ష, ప్రయుతము (పది లక్షలు), కోటి, అర్బుదము (పదికోట్లు), అబ్జము, ఖర్వము, నిఖర్వము, మహాపద్మము, శంకు, జలధి, అంత్యము, మధ్య, పరార్ధము అని సంఖ్యల సంజ్ఞలు. ఈ సంజ్ఞలు మొదటి దానికంటే తరువాత ఉన్నది పదిరెట్లని తెలియవలయును. క్రమముగా కాని ఉత్ర్కమముగా కాని సంఖ్యా యోగమును అనుసరించ వలయును. గుణము చేయబడిన దానిని గుణ్య మందురు. గుణ్యముచే ఉపాంతిమ ఆది మములను శుద్ధి చేయవలయును. హరించబడిన గుణమును భాగించుటచే చివరగా మిగిలినది ఫలమనబడును. సమమైన అంకములుగలది వర్గము అనబడును. ఈ వర్గనే ‘కృతి’యందురు. విషమమైన అంత్యము నుండి కృతిని విడదీసి మూలముగా విడిగా ఉంచవలయును. దీనిని రెట్టింపుచే భాగించగా వచ్చిన ఫలమును క్రమమును అనుసరించి మూలమున ఉంచవలయును. అపుడు దాని కృతిని విడువ వలయును. మరల మూలమును భాగించవలయును. ఇట్లు మాటిమాటికి చేసినచో వర్గమూలము ఏర్పడును. మూడంకము లతో సమముగా భాగించవలయును. ఇట్లు భాగించగా వచ్చిన దానిని ఘనమందురు. మూటిలో మొదటి దానిని విషమమందురు. మిగిలిన రెండు సమములు అనబడును. తరువాత విషమమగు అంత్యమునుండి ఘనమును శుద్ధి చేయవలయును. ఇట్లు శుద్ధి చేయబడిన ఘనమే మూలమనబడును. ఇట్లు మూటిచే భాగించబడిన దానిని మూలముచే కలిపి, సమమైన దానిని మూలమున ఫలముగా ఉంచవలయును. దానిని కృతిచే భాగించబడగా, దానినికూడా శుద్ధి చేయవలయును. ఇట్లు విషమము నుండి ఘనమును, ఘనము నుండి ఘనమూలమును మాటి మాటికి శుద్ధిచేసి తేల్చవలయును. ఇట్లు ఒకదానిచే ఒకటి భాగించబడినపుడు, భాగాంశ ములను వేరు చేయవలయును. లవములు, లవ ఘ్నములు, హరములు, హరఘ్నములు, అని శాస్త్రార్ధ చింతకులు భాగ ప్రభాగములను తెలియవలయును. అనుబంధమున కాని అపవాహమున కాని ఒకదానికి ఎక్కువగా కాని తక్కువగా కాని ఉన్నపుడు చేతిలో ఉన్న హారభాగముచే విభజించి, హారమును స్వాంశాధిక్యముచే విభజించవలయును. తక్కువగా ఉన్నదానిచే కూడా గుణించ వలయును. గుణించునపుడు ఘనమును (మూలమును) ఋణమును గుర్తుంచుకొన వలయును. చివరలో సమముగా ఉన్న హరాంశములను కలుపవలయును. హరముకాని రాశిలో కూడా హర మును కల్పించవలయును. అంశభాగమైనపుడు భాగించబడిన హరభాగమును గుణించినచో వచ్చునది ఫలమగును. హరమును పరివర్తనముచేసి భాగించగా వచ్చు భాగమును లవమని తెలి యుము. భాగహారమున శేషమును చూపవలయును. వచ్చిన దానిని గుణించవలయును. హారాం శలలోని కృతిని, వర్గమును ఘనవిధిలో ఘనమును విడిగా చూపవలయును. పదము సిద్ధించుటకు పదమునక్రింద, అంతట శూన్యము వచ్చునట్లు భాగించవలయును. భాగమును గుణముగ, గుణ మును భాగముగా వర్గమును, మూలముగా, పదమును కృతిగా, ఋణమును శూన్యముగా శూన్య మును ఋణముగా చేసినచో రాశి తెలియును. స్వాంసము కంటే, అధికముగా కాని తక్కువగా కాని భాగము ఉన్నపుడు లవమును తక్కువగా చేసినచో వచ్చినదానిని హరమందురు. ఈ విషయ మున విలోమమున మాత్రము అంశము వికారమును చెందదు. శేషము మొదట చెప్పినట్లే చేయవలయును. ఉద్దేశించబడిన రాశి తగ్గినపుడు అంశములతో హరించబడును. అంశహారము కానిది యుతమనబడును. ఇట్లు ఇష్టమును భాగము చేయగా వచ్చిన దానితో భాగము చేయబడిన రాశిని కలుపరాదు. ఇట్లు కలుపక ఉన్నదానిని, తక్కువగా ఉన్నదానిని రెండుగా రాశులను ఏర్పరచ వలయును. రెండు రాశులలోని భేదమును, వర్గము తరువాత ఉన్నదానిని ఒకటిగా చూడవలయును. హారమైనది, అంశరహితమైనది. యుతమగును ఇష్టముచే హృతమైన దానితో భాగరాశితో కలువ “వలయును. మరొక దానితో కలిసిన యుతమును భాగరాశిని సంక్రమింపచేయవలయును. ఇతర రాశితో హృతమైన దానిని వర్గము తరువాత ఉన్నదానిని రెండును విడిగా చూపవలయును. ఇవియే మూలము యుతములు అనబడును. దీనినే గజాగ్రీ, ఇష్టకృతి అందురు. ఇష్టముచే భాగింప బడినది దలితము అనబడును. ఈ రెంటిలో ఒక వర్గము దలితము రెండవది పరరూపము ఇదియే. మొదటి రూపముతో కనపట్టును. వర్గ యోగాంతరములు భిన్నముగా ఉండును. ఈ రెంటిరాశులే పరరాశి అనబడును. ఇష్టము కంటే రెట్టింపుచే హారమైనది శ్రేష్ఠ రూపము. రెండవది వర్గములుగా వ్యవహరించ బడును. ఒకటి ఇష్టవర్గకృతి, మరియొకటి ఇష్టధనము. ఇష్టధనము ఉష్టగ్రము అని ఒకరాశికే రెండు పేర్లుండును. ఈ రెండు రాశులనే వ్యక్తములందురు. ఈ గణితమే వ్యక్త గణితమందురు. గుణించబడిన మూలము యుతము కాదు. గుణించబడిన దానిలో సగభాగము పదమనబడును. గుణార్ధముగా చూచినది కూడా యుతముకాదు. వర్గముగా చేయబడినది మాత్రము గుణమనబడును. పుంరాశి లవ దృశ్యమైనపుడు భాగముకంటే తక్కువ దానిచే కలిసియుండును. ఇట్లు భాగించబడినది, మూలగుణము అను ఈ రెంటిచే వ్యక్త గణితమును సాధించవలయును. ప్రమాణము ఇచ్ఛ సమానముగా నున్నచో (సజాతీయములైనచో) ఆద్యంతములుగా నున్నచో ఫలము మధ్యమున నుండును. మొదటి హరము ఇచ్ఛను కొట్టివేయును. దీనినే ఇష్ట ఫలము అందురు. విజాతీయములైనచో విపర్యయము వలన ఫలము అనబడును.

పంచరాశ్యాదిక స్ధలములో ఫలమును విభజించు రాశులను పరస్పరముగా విభజించి రెండు పక్షములను చేసి ఎక్కువరాశిగా ఉన్న దానిని భాగహారమును చేసి తక్కువదానిచే కొట్టబడిన దానిని ఫలముగా నిర్ణయించవలయును. ఇష్టకర్మ ఘాతమునకు కలిసి ఉన్న కలాంతరము నుండి చ్యుత “మైనది మూలమగును. మాన నిఘాతమగు కాలము అతీతకాల నిఘాతమగు ఫలముచే సమ న్వయము చేయబడును. క్షేపములన్నియూ మిశ్రహతము లగును. క్షేపయోగముచే భాగించబడినవి ఫలములగును. భిన్నమైన అంశములచే విభజించ వలయును. వాటితో కలిసి ఉన్న రూపము కాలము పూర్తి చేయునది అగును. పూర్ణభాగము సమభాగమును చెందును. వ్యంకమున సమమున వర్గమున అర్ధభాగము విలీనము అగును. వ్యస్తమును పొందుచున్న ఫలము ఏ గుణవర్గమును చేరినదో చూడవలయును. వ్యేకము, వ్యేకగుణమును పొందినది, ఎక్కువరాశిచే భిన్నమైనది ఉత్తర గుణమున మానమగును. (కొలబద్ద) రెండు భుజముల కలయికచే ఏర్పడినది భుజములకు కర్ణ మగును. శ్రుతికృతుల మధ్యన ఉన్నది. భుజకోటి ద్వయమున నున్నది భుజభాగమగును. ఆ కృతి సంక్షేపమును భిన్నము చేసినది వ్యాసము అగును. ఇదియే పరిధి అనబడును. నారివ్యాసముల కలయికచే ఏర్పడిన వివరముచే ఆహతమగు మూలమునే అర్ధితమందురు. గణితములో వ్యాసము శరము అని రెండు సంజ్ఞలు ఉండును. శరము కంటే తక్కువగా ఉన్నదానికి, వ్యాసము కంటే శర గుణము కంటే అవతలనున్నది పదమనబడును. రెంటిచే విభజించబడునది జీవము. శరహృతమగు యుతమున జీవార్థముగా పేర్కొనబడును. వ్యాసభాగము అష్టవిధముగా భిన్నమగునని గణిత కోవిదులు చెప్పెదరు. ధనువుకంటే తక్కువదానిచే హతమగునది పరిధి అనబడును. పరిధిని విభజించినచో ప్రదాఙ్లమగును. నాలుగవ భాగమగు శరాంశముచే అర్థము చేయబడిన భాగము నాలుగు రెట్లు ఉండును. వ్యాసముచే విభజించబడిన దానిని మరల విభాగము చేయబడిన అది కాశమగును. దీనినే స్ఫుటము అందురు. జ్యా భాగముచే శరభాగముచే విభజించబడినది వృత్త వర్గమగును. నాలుగింటిచే విభజించబడిన వృత్తవర్గము, నాలుగింటిచే విభజించబడినది వ్యాస మగును. ఈ వ్యాసమే ‘జ్యా’ భాగమును హరించును. లబ్ధముకంటే తక్కువగా నున్న వృత్తవర్గమున ఏడుచే కాని రెంటిచే కాని వెలగట్టినది పతితమగుచో ధనువగును. స్ధులమధ్య భాగమును పొందిన దానిని వేధచేసినచో వృత్తాంక శేషభాగమగును. వృత్తం గాంశముయొక్క కృతిచే విద్ధయైనది. కరమితమగును. వారి వ్యాసహతమగునది మరల దీర్ఘనేదాంగు లఘ్నమగును. మూడు మార్లు ఒకటిచే భాగించబడినది, మూడుచే భాగించ బడినది ద్రోణమునుండి వారివరకుండు మానమగును. వైశాల్యము, పొడుగుగా ఉన్న వాటిని అంగుళములచే నాడులచే విభజించవలయును. ఆరింటిచే, ఏడింటిచే, నాలుగింటిచే విభజించబడినవి ధాన్యమున ద్రోణాదిమానము పరిగణించబడును. ఎత్తు, వెడల్పు, పొడుగును అంగులములచే కొలవవలయును. పరస్పరము ఒకదానితో వేరొక దానిని కలిపి విభజించవలయును. ఒకటితో, తొమ్మిదితో, పన్నెండుతో విభజించినచో ద్రోణాది మాన మేర్పడును. వెడల్పు మొదలగువాటిని అంగుళాదులతో లెక్కించ వలయును. పరస్పరము కొట్టివేయ బడినచో మాన నిర్ధారణజరుగును. అయిదింటిచే, ఎనిమిదింటిచే, అయిదింటిచే విభా గము చేయగా లభించినది ద్రోణామానముగా నిర్దేశించవలయును. దీప, శకుంతల ఛిద్రములచే కొట్టివేయబడినచో శంకువగును. నరభాగము కంటే తగ్గిన భాగము దీపశిఖము కంటే ఎక్కువ భాగములచే విభజించబడినది ఆకాశ భాగమగును. శంకువునందు నరదీప అఘ ఛిద్రములచే కొట్టి వేయబడినవాటిచే దీపోచ్చ భాగమును నరాన్వితమగును. విశంకు దీప భాగములకంటే ఉన్నతమగునది గుణచ్ఛాయ శంకుచే ఉద్ధృతమగును. దీపశంకుమధ్యలోనున్నది ఛాయాగ్ర వివరమును కొట్టివేయును. మానాంతరముచే కొలువబడు భూమి సరాహతమగును. ప్రభచే పొందబడినది దీపశిఖ కంటే ఉచ్చ అగును. ఇదియే రాశిత్రయమగును. ఇది సంక్షేపముగా గణితకర్మ చెప్పబడినది. ఎక్కువ విస్తరముగా కాకుండా గ్రహమధ్య భాగము మొదలగు దానిని చెప్పెదను.

నాలుగు ఆకాశ సంఖ్యగల వత్సరములు నాలుగుసముద్ర సంఖ్యగల వత్సరములు యుగ మానము. దానిలో దంశాశములగు నాలుగు కలిసినపుడు కృతయుగము ఒక పాదమగును. మూడు దశాంశములు త్రేతాయుగము రెండవ పాదమగును. రెండు దశాంశములు ద్వాపర యుగము మూడవపాదమగును. ఒక దశాంశము కలియుగము నాలుగవ పాదమగును. డెబ్బదియొక్క యుగ ములు ఒక మనువు కాలము. బ్రహ్మకు ఒకపూటలో పదునలుగురు మనువులు ఉందురు. బ్రహ్మరాత్రి కూడా అంతయే కాలము ఉండును. బ్రహ్మకాలమును అయిదు భాగములుగా విభజించి అయిదవ భాగముచే ఖచరాయనమును చేయవలయును. ఇట్లు యుగాది నుండి చేయవలయును. ఒక యుగ మున సూర్య బుధ శుక్రుల కాలము యుగకాలముతో సమానము. శని గురు శుక్రులకాలము భగణ పూర్వకాలముగా గుర్తించవలయును. చంద్రునికి 5,77,346 సంవత్సరముల కాలముగా తెలియవలయును. కుజునకు 2,26,835 సంవత్సరములు కాలము. బుధునకు 17,63,160 సంవత్సరము. బృహస్పతికి 6,84,281 సంవత్సరముల కాలము. శిత శీఘ్రకాలము 7,12,239 సంవత్సరముల కాలము. శనికి వేరొక కాలము 1,46,561 సంవత్సరముల కాలము. ఉచ్చ చంద్రునికి 4,18, 204 సంవత్సరముల కాలము. వామపాత కాలము 4,42,241 సంవత్సరములు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకదినముగా భూలోకమున పరిగణింతురు. ఒక యుగమున 1,57,27,828 సంవత్సరములుండును. అధిమాసముల సంఖ్య 15,24,346 సంవత్స రములుగా ఉండును. తిధి క్షయ కాలము 25,18,221 సంవత్సరకాలము ఉండును. విమాసములు 18,41,111 సంవత్సరముల కాలముండును. మాసముల కాలము 15,44,336 సంవత్సరముల కాలముగా ఉండును. సూర్యశనుల సంయోగకాలము 487 కల్పములుగా నుండును. కుజునకు 214, బుధకాలము 468, బృహస్పతికి 110, శుక్రునకు 560, శనిమందగతికి 54, లేదా పాతమునకు అని కూడా చెప్పవచ్చును. 142 కుజపాతమునకు, బుధునకు 488, బృహస్పతికి 171, శుక్రునకు 914, శని పాతమునకు 662 భగణములు, వర్తమానయుగమున పాత వత్సరములే భగణ నామముచే వ్యవహరించబడుచున్నవి. గడిచిన మధు శుక్లా మాసములచే మాసమానము ఏర్పడును. సూర్యాది గ్రహములకు విడిగా మాననామము వ్యవహారమునకలదు. ఇపుడు అధిమాసములతో కలిసి యున్న మాసములను దినములుగా విభజించి, దినములతో కూడిన వాటిని రెట్టింపు చేసినచో చంద్రవాసరము లొచ్చును. రాత్రిలేని పగలును మాత్రమే లెక్కించి, అర్ధరాత్రి కాలమును కలిపి సావనమానము చేసినచో అర్మాది దినములు మాసములు, సంవత్సరములు కల్పించ వచ్చును. మిగిలినదానిని ఏడుతో భాగించినచో సూర్యాది వాసరములు వచ్చును. ఆయా వాసరములకు సూర్యాదులే అధిపతులు. మాసమును మొదలుకొని దినసంఖ్య వరకు లెక్కించిన దానిని రెంటితో భాగించి ఏడు కంటే ఎక్కువగా మిగిలిన సంఖ్యకు అధిపతియైన వారు మాసాధిపతి అని, మూటితో భాగించినపుడు ఏడు కంటే ఎక్కువగా వచ్చిన శేష సంఖ్యాధి పతియే సంవత్సరాధిపతిగా తెలియవలయును. కువాసరములతో కలిసిన దానిని భగణముతో రెట్టింపు చేసినచో దినరాశి వచ్చును. సగముగా విభజించినపుడు వచ్చిన సంఖ్యకు భగణాది నుండి లెక్కింగా అధిపతియగు గ్రహము తెలియును. ఇట్లు పూర్వపాపులుగా అశీఘ్రులుగా, మందు లుగా చెప్పబడిన గ్రహములకు విలోమగతి ఏర్పడినపుడు, పాతమని చక్రగతిని బట్టి తెలియ వల యును. ఎనిమిదొందల యోజనములు భూకర్ణములుగా చెప్పబడినవి. ఒక వర్గముకంటే రెండో వర్గము రెట్టింపుగా ఉండును. ఆ వర్గము కంటే పదిరెట్లుగా ఉన్నది, భూపరిధి అగును. లంబము, జ్యాఘ్నము, స్వజీవాప్తముగా ఉన్న స్ఫుటమగునది భూపరిధి. ఈ భూపరిధితో దేశాంతర భాగములను రెట్టింపుచేసి గ్రహభుక్తిచే విభజించినపుడు కలాదులు తెలియును. ఆ ఫలములను గ్రహముల నుండి శోధించి తెలియవలయును. తమ ప్రాంతము నుండి రేఖకు పశ్చిమదిశగా గీసి ఆ స్ధానమును సంఖ్యను వేయవలయును. రాక్షస, అతప, దేవ నివాస, పర్వత మధ్యభాగముల నుండి సూత్రమున అనుసరించు ఆరోహణ అవరోహణలను చూచుచు దగ్గరగా నున్న సరో ప్రాంతమును గుర్తించి, వారప్రవృత్తికి స్ధానమైన వాక్ప్రాంత మున క్షయభాగమునలోని సగము కంటే ఎక్కువ భాగమును ఉంచవలయును. ఆ దేశాంతర నాడులచే పశ్చిమభాగమున తక్కువగా నిర్దేశించవలయును. ఇష్టనాడీ గుణములు కలది భుక్తి అగును. ఈ భుక్తిని ఆరు సంఖ్యచే భాగించిన కలాదికమగును. పూర్తిగా పోయినపుడు శోధించవలయును. అట్లే యోగము చేయవలయును. ఇట్లు చేసినపుడు వచ్చునది తాత్కాలిక గ్రహము. భక్త చక్ర లిప్తాంశముగలది అంతియగును. దక్షిణోత్త రముగా నున్నది అంశ మగును. చంద్రుడు తన పాతముచే సంక్రాంత్యంతము వరకు విక్షేపము చేయబడును. దానికి రెట్టింపుగా బృహస్పతి, మూడురెట్లు కుజుడు ఉండును. బుధ శుక్ర శనులు పాతములచే నాలుగు రెట్లు విక్షేపము చేయబడుదురు. రాశి లిప్తాష్టమ భాగము మొదట జ్యార్ధమనబడును. దానికంటే రెంటితో భాగించగా మిగిలిన దానికంటే తక్కువగా ఉన్నది కలిసి రెండవ జ్యార్ధమగును. మొదటి దానివలెనే క్రమముగా భాగముచే లభించిన శేషభాగములను లభించిన దానికంటే తక్కువగానున్న భాగములను కలిపినచో ఖండకములగును. ఇవి మొత్తము ఇరువది నాలుగు జ్యార్థ పిండములు ఉండును. క్రమమముగా అన్నిటికంటే పరమైనది అపక్రమజ్యార్ధము 1607గా తేలును. దీనికి మూడు రెట్లుగా గుణజ్యా అగును. చాపమును క్రాంతి అందురు. గ్రహమును చక్కగా మందత్వమును, ఉచ్చత్వమును, శీఘ్రత్వాదుల నుండి శోధించి మిగిలిన దానిని కంద పదముగా పేర్కొనవలయును. దీని నుండి భుజము, జ్యా, కోటి భాగములను ఏర్పరచవలయును. గతమునుండి భుజ జ్యా భాగములను విషమముగా, గమ్యమునుండి కోటి పదములో నుండును. గమ్యమునుండి వచ్చిన భుజ జ్యా భాగము సమకుని, దానిని అనుసరించి వచ్చునది కోటిజ్యా అగును. తత్త్వయమలచే విభజించబడిన లిప్తలు జ్యాపిండమున లభింపచేయును. దీనినే గతమందురు. గత గమ్యములలోని బేధా భ్యాసమును తత్త్వ జ్ఞానము కలవారు విభజించగలరు. అట్లు విభజించగా వచ్చిన ఫలమును గతము అనుసంజ్ఞకల జ్యాపిండమున కలుపవలయును. ఇట్లు క్రమజ్యానిధి అగును. ఇట్లే ఉత్ర్కమ జ్యావిధి కూడా గతము అనబడును. జ్యా భాగమును శుద్ధిచేసి మిగిలిన దానిని తత్త్వముతో భాగించగా వచ్చినది వివరోద్ధృతమగును. సంఖ్యాతత్త్వము యొక్క అంశులతో సంవర్గ్యములతో కలిసిన దానిని ధనువు అందురు. సూర్యుని మంద పరిధి అంశములు మనవులు. చంద్రునికి ఇట్లుండును. యుగ్మాంతమున, విషమాంతమున నలిప్త భాగమే ఆ రెంటికి భేదము. యుగ్మాంతమున 49,12,33,413 గా భాగములు ఏర్పడును.

కుజాదులకు అయుగ్మాంతమున అయిదున్నరలో లెక్కించవలయును. 412,62,71,146 గా సంఖ్యలు తెలియవలయును. ఓజాంతమున 72,22,232 సంఖ్యలు తెలియవలయును. గ్రహముల శీఘ్రకర్మలను 47,261 సంఖ్యలు తెలుపును. ఓజో యుగ్మాంతర గుణములు భుజ, జ్యా, త్రిజ్యలతో ఉద్ధరించబడును. యుగ్మవృత్తమున్నచో ధనమును అప్పుచేయువాడగును. ఓజము కంటే తక్కువగా ఉన్నను, ఎక్కువగా ఉన్నను స్ఫుటఫలితము తెలియును. ఓజగుణమును భుజ, కోటి, జ్యా భాగములలో భగణాంశములతో విభజించినపుడు భుజ జ్యా ఫలము ధనువైనపుడు మందగతియని, లిప్తాదికములు ఫలముగా తెలియును. కేంద్రమున శైఘ్ర్యకోటి ఫలము, మకరాదు లలో ఉన్నచో ధనము ఫలమని చెప్పబడినది. త్రిజీవ భాగమును శోధించినపుడు కర్కాదులలో అయినచో కోటిజము ఫలమగును. భుజ భాగ ఫలవర్గము ఐక్యమైనచో మూలమగు కర్ణము చలమనబడును. త్రిజ్యాభ్యస్తమే భుజఫలము. ఇదియే ఫల భాగ కర్ణముతో విభజించబడును. విభాగము చేసినపుడు లబ్ధమైన భాగముయొక్క చాపమే లిప్తాదులను తెలుపును. దీని ఫలము శైఘ్ర్యాదికమని తెలియుము. ఇట్లు కుజాదులకు చతుర్ధకర్మలో మాంద్యము కర్మగా నుండును. సూర్యునిలో ఒకటి, కుజాదులకిపుడు చెప్పెదను. శీఘ్రత, మాంద్యము, మరల మాంద్యము శీఘ్రత ఇట్లు వరుసగా నాలుగు సంభవించును. అన్ని గ్రహములకు మేషాని కేంద్రములందు మాంద్య శీఘ్ర కర్మలలో లిప్తాదుల ఫలము ధనముగా తెలియుము. తులాదులలో నైనచో ఫలము ఋణము. సూర్యభుజ ఫలమును రెట్టించినచో, గ్రహభుక్తితో విభజించబడి భచక్ర కలినాదులతో కలిసిన లిప్తలను సూర్యగ్రహమునందువలె చూడ వలయును. మందకర్మలో గ్రహమువలె గ్రహభక్తమును ఫలముగా చేయవలయు. అట్లు చేసినపుడు కర్కాదులొచ్చినచో ధనమని, మకరాదులొచ్చినచో ఋణమని తెలియ వలయును. భుజ భాగము జ్యా భాగము తరువాత గుణభుక్తి చతురులైన వారిచే ఉద్ధరించబడినపుడు స్వమందపరిధిచే క్షుణ్ణమై భగణాంశములచే ఉద్ధరించబడిన కలలు మందస్ఫుటములుగా చేయబడిన భుక్తి శీఘ్ర ఉచ్చ భుక్తిచే శోధించబడి మిగిలిన దానిని వివరముచే కొట్టివేయవలయును. ఈ కొట్టివేత కూడా త్రి జ్యాంక భాగమున కర్ణముల యందు మాత్రమే చేయవలయును. చక్రకర్ణ హృతమే భుక్తిలో త్రిజ్యాధిక కర్ణములలో నున్నచో ధనము ఫలమని చెప్పవలయును. తక్కువగా ఉన్నచో ఋణము ఫలముగా తేలును. అధికమున శుద్ధిచేయగా మిగిలినది వక్రగతిగా తెలియవలయును. 6, 1, 4, 1, 0, 3, 1, 6, 8, 5, 11 లలో చతుర్థాంశ కేంద్రాంశములలో కుజాదులున ఉన్నప్పుడు వక్రులుగా, చక్రశుద్ధాంశలచే రుజు వక్రతలను తెలియవలయును. క్రమజ్యాభాగము విషువువలె నక్షత్రముచే కొట్టి వేయవలయును. పన్నెండునుండి ఉద్ధరించబడిన క్షితిజ్యాభాగము, త్రిజ్యా భాగముచే గుణించినపుడు దిన వ్యాస భక్తమైనచో చాపమువచ్చిన శత్రువృద్ధిఫలమగును. ఆ చాపము ఉదక్రాంత మైనపుడు, విడివిడిగా కొట్టివేయ బడినపుడు ధనహీనుడగును. తన తన అహోరాత్రముల చతుర్భాగమున దినరాత్రి భాగములుండును. యామ్యక్రాంతిలో, విపర్యస్తముగా నున్నపుడు, దినక్షయమున దీనిని రెట్టింపు చేయవలయును. నక్షత్రభుక్తి ఎనిమిదివందల లిప్తలు. తిథి భుక్తి 72గా ఉండును. గ్రహలిప్తలు నక్షత్ర భుక్తులు, నక్షత్రములు, భుక్త్యాదులచే దినాదికమును తెలియవలయును. సూర్యచంద్రయోగ లిప్తలు మాత్రము నక్షత్ర భుక్తులచే విభజింపబడినపుడుగా యోగములుగా తెలియును. గతములు గమ్యములు అరవైచే కొట్టివేసినచో భుక్తియోగముచే నాడీ విభాగములను పొందును. సూర్యలిప్తలకంటే తక్కువగా ఉన్న చంద్రలిప్తలు భుక్తిచే విభజించబడి తిథులగును. ఇవి కూడా గతములు గమ్యములు అరవై సంఖ్యచే కొట్టబడును. ఇంతకంటే భుక్తి ఇక ఉండదు. శుక్ల ప్రతిపత్ మొదలగునవి తిథులు. రెంటితో కొట్టబడును. ఏడుతో కొట్టబడినచో ఒకటే అగును. మిగిలినవి బవ, బాలవ, కౌలవ, తైతుల, గరములను పేర్లను పొంది కరణములగును. అభ్రమున వణిజులున్నచో విష్టి అగును. పరార్ధభాగము కృష్ణపక్ష మగును. శకుని, నాగము, చతుష్పదము, కింస్తుఘ్నము అను నామములు ఏర్పడును. శిలాతలమువలె శుద్ధి చేసినపుడు, వజ్రలేపమువలె సమముగాచేసి భాగమున ఇష్టమైన అంగుళులచే సమమండలమును లిఖించవలయును. ఆ మండల మధ్యభాగమున శంకువును స్థాపించవలయును. శంకువు ద్వాదశాంగులి పరిమితము కావలయును. శంకుచ్ఛాయాగ్రము తాకిన ప్రదేశము పూర్వా పరాహ్ణదత్తమగును. అచట బిందువునుంచి పూర్వ అపర అను పేర్లుగల రెండు వృత్తములను ఏర్పరచవలయును. ఆ రెండువృత్తముల మధ్యలో అంచుతో దక్షిణోత్తరముగా రేఖ నేర్పరచవలయును. దక్షిణ ఉత్తర దిక్కుల మధ్యమున అంచుతో పూర్వపశ్చిమ దిశలకు ఒకరేఖను ఏర్పరచవలయును. దిక్కులమధ్యనున్న మత్స్యములచే విదిక్కులను కూడా గుర్తించవలయును. మధ్యభాగము నుండి వెడలిన సూత్రములచే బయటికి చతురస్రమును చేయవలయును. భుజ సూత్రాంగులములచే దత్తమగునది ఇష్టప్రభ అనబడును. తూర్పు పశ్చిమములను ఆశ్రయించిన రేఖ సమమండలము అనబడును. నక్షత్ర మండలముకూడా విషువువలె ఉండునని చెప్పబడినది. తూర్పు పశ్చిమములలో ఉన్న రేఖకు విషువువలె నక్షత్రాగ్ర భాగముగా సాధించవలయును. ఇష్టచ్ఛాయ విషువత్తుల మధ్య ఉన్నది అగ్రా అనబడును. శంకుచ్ఛాయా కృతిచే కూడిన దాని మూలము ‘య’ వర్గనుండి కర్ణ భాగమగును. శంకును పరిశుద్ధిచేసినపుడు మూలమని, శంకు విపర్యయము వలన ఛాయయని వ్యవహరించ బడును. నక్షత్ర చక్రము యుగమున ముప్పది భాగములుగా తూర్పు భాగమున వ్రేలాడును. దానిని గుణించుటవలన నక్షత్ర దినములతో విభజించుట వలన ఆకాశ భాగమున లభించు భాగము రెంటిలో మూటితో పదితో కొట్టివేయబడినపుడు అయన మేర్పడును. దానిని చక్కగా విభజించినపుడు కాంతి ఛాయలేర్పడును. ఇవియే శుక్ల కృష్ణ పక్షములు. త్రిజ్యము శంకు ఛాయచే కొట్టబడినపుడు విషువత్ కర్కాభాగము చేయబడినపుడు లంబాక్షజ్యా భాగములు వాటి ఛాయలగును. లంబాక్షములు ఎపుడూ దక్షిణమున ఉండును. సాక్షాత్తు సూర్యునిచే కాని అపక్రమముగా కాని కలిసియున్నది దిక్సామ్యమగును. లేనిచో భేదమేర్పడును. మిగిలినవి సూర్యాంశలు. ఇవియే భుజజ్యా కోటి భాగములవలన ఏర్పడునవి. శంకుమానమును అంగుళము లచే రెట్టింపుచేసి యథా క్రమముగా భుజములను త్రిజ్యమును సాధించవలయును. కోటి జ్యాభాగములచే విభజించగా లభించిన దానియందు బయటిదళమున ఛాయా కర్ణము ఏర్పడును. స్వాక్ష అర్కనత భాగములకు దిక్సామ్యము, ఇతరత్ర భేదమును గుర్తించవలయును. దిగ్భేద్రోపక్రమము శేషమగును. త్రిజ్యముచే కొట్టబడినది జ్యా భాగమగును. పరమోపక్రమ మున జ్యా భాగమునపొందిన చాపమున సూర్యుడు మేషాది రాశి గోచరుడగును. సంశుద్ధి చేసిన చక్రార్ధ భాగమువలన కర్కాది రాశి గోచరుడగును. నక్షత్రార్ధ సంయుతి వలన తులాది గోచరుడగును. సంశుద్ధి చేయబడిన చక్రమువలన మృగాది నక్షత్రములలో మధ్యాహ్న సూర్యుడు స్ఫుటముగా గోచరుడగును. ఆ భాగము మందమైనను, చాలాసార్లు వామమైనను, దివాకరుడు మధ్యమున నున్నాడని ఫలము. ప్రాణహతులు గ్రహోదయమును తెలుపును. 1, 1, 8 సంఖ్యలచే కొట్టబడి గతిని తెలుపును. చక్రాసువులు లబ్ధముతో కలిసి అహోరాత్రాసువులుగా పేర్కొనబడును. మూడుమార్లు నక్షత్రాంశముచే ఆకాశాంశ ముచే కర్ణ భాగమున అర్థభాగ గుణములు అహోరాత్రార్ధ భాగముచే విభజించబడును. విడిగా ఒకటి, రెండు, మూడు సంఖ్యలచే విభజించబడి వేరువేరు చాపములుగా ఉండును.

మేషరాశి నుండి లంబోదయాసువులను క్రిందుగా శోధించి 8, 4, 2, 3లతో విభజించి, 5, 3, 1లుగా శేషము లభించిన చంద్రలిప్తలు అని తెలియవలయును. తమ ప్రదేశ భాగమున చరించు భాగమున కంటే తక్కువగా ఉన్నచో ఇష్టోదయాను వులగును. వ్యస్తములచే అవ్యస్తములచే కూడినవై కర్కటాదులగును. ఈ ఆరే ఉత్ర్కమముగా తులాదులు అగును. స్వేష్టాంశలగు భాస్కరాం శలను భోగ్యాసువులను తీసివేయవలయును. తమ తమ ఉదయమునుండి చక్కగా కొట్టివేయబడి విభజించబడి, భోగ్యములను విడిగా విభజించి తమ తమ మానమును అనుసరించి అభీష్ట ఘటికా సువుల నుండి భోగ్యాసువులను శుద్ధిచేయ వలయును. ఇట్లే ఏష్యలగ్నాసువులను కూడా శుద్ధిచేయ వలయును. ఇట్లే క్రమముగా వ్యాప్తి చెందును. మిగిలిన దానిని 30తో వ్యస్తమగుదానిని శుద్ధి చేయబడని దానిచే విభజించి భాగయుక్తమును, భాగహీనమును వ్యయనాంశమును వేరుచేసి, కుజతనుక్రిగా గుర్తించ వలయును. తూర్పు పశ్చిమములలో నినతనాడుల నుండి, అట్లే లంకోద యాసువులచే సూర్యునిలో క్షయ ధన భాగములను ఏర్పరచినపుడు మధ్య లగ్నము ఏర్పడును. భోగ్యాసువులు తక్కువగా ఉండి, భుక్తాసువులు అధికముగా ఉన్నచో అంతరలగ్నాసువులను చక్కగా శోధించి కాలమును సాధించవలయును. రాహువులేని సూర్య భుజాంశములు ఉన్నచో చంద్ర గ్రహమున ఇంద్రాల్పములు అగును. వాటిని పదుకొండుచే కొట్టివేసి ఏడును కలిపి 5, 10చే విభాగముచేసి అంశములను తెలియవలయును. సూర్యుని చంద్రుడు, చంద్రుని కుజుడు కప్పి వేయును. ఛాద్యఛాదక మానార్థమునకు అయిదు తగ్గించి గ్రాహ్య వర్జితముగా దానిని స్వచ్ఛన్నమును చేసి మానైక్యార్దాంశములో ఆరవ భాగమును అయిదులో కొట్టివేసి దానిని మూలముగా ఛన్నఘ్న మును స్వాంగోనముగా చంద్రతను హారమును నిలుపుటకు ఘటికాదులు ఉపయోగించును. ఇవి కూడా వ్యంగములైన భుజాంశ సమ్మితములచే చేయబడును. ఇపుడు ఇష్ట ఫలములచే తక్కువగా ఉన్నదానిని సూర్యుని భాగములో ఆరు గుణములు అగును. ఒకవేళ ఎక్కువగా ఉన్నచో దానిలోనే భాగములు ఏర్పరచ వలయును. ఇట్లు సుఖాంత్య భాగము స్పష్టమగును. గ్రానముచే స్వాహతమైన దానిలో ఛాద్యమాన మానములో విశేశోషకములు ఏర్పడును. ఇచ్చట పూర్ణాంతము మధ్యమమగును. దశాంతమున మూడు నక్షత్రములు తక్కువగా నుండును. విడిగా ఆయాక్రాంతి అక్ష భాగములచే సంస్కరించునపుడు నతాంశములు ఏర్పడును. వీటిని రెంటితో కొట్టివేసినచో వచ్చిన అంశకృతులలో రెంటిని తగ్గించి సగము సూర్యాంశలతో కలిపి హారము చేయవలయును. మూడు నక్షత్రములతో తేలిన అంగాంశముల నుండి సూర్యాంశలను విడదీసి వచ్చిన అంశల కంటే తక్కువ అంశలతో కొట్టివేసినచో ఇంద్రలిప్తలు అగును. తీసివేయగా పొందిన అంశలను ఆలంబనముగా చేసుకొని సూర్యాంశల కంటే అధికమా న్యూనమా చూచి విశ్వఘ్నలంబనకలల కంటే తక్కువగా ఉన్నచో తిథులగును. అయిదు అంశలకంటే తక్కువగా ఉండి మొత్తము భాగమును ఆరుచే కొట్టివేసినచో ఆలవములలో తక్కువగా ఉన్నవి నక్షత్రాంశములగును. నతాంశములు వాటివలన కలిగిన అంశ ములు ప్రాధృతమగును. ప్రాధృతవర్జితమైనపుడు ఆరు చంద్రలిప్తలచే విభజించబడినవి నతాంశములు దిక్కును సూచించును. ఆ రెంటిలో భిన్నత్వమును చూచి ఒకదిక్కు స్ఫుటత్వమును పొందును. అపుడు కప్పివేసిన స్థితి పక్షమును సాధించదలచినపుడు స్థిత్యర్ధముచే ఆరింటిచే మూడింటిచే అంశలను కనుగొని ఆ యంశలచే జంటలుగా నున్న నక్షత్రాంశములను రెండింట ఉంచి వేరు చేయుట మొదటి వలెనే అని తెలియవలయును. ఇట్లు సంస్కరించినచో వాటినుండి స్ధిత్యర్ధములు స్ఫుటమగును. వాటితో హీనమగునపుడు మధ్యదర్శము కాలములుగా ముఖాంతములగును. సూర్యునికంటే తక్కువగానున్న విశ్వ ఈశాంశములు నవ పంచ దశాంశకములే యగును. కాలాంశల కంటే తక్కిన అంశలతో సూర్యుడు కూడియున్నపుడు చంద్రుని అస్తోదయములు అగును. మొదట సూర్యబింబమును చూచి ఉచ్చ వీక్షణమున లంబమును చూచి లంబ పాపబింబాంతర దృష్టులు సూర్యుని వ్యాపించు నక్షత్రములచే కొట్టబడినపుడు అస్తమయము నందు సావయవములు ఏష్యములేని తిథులు ఉండునని పండితులు తెలియవలయును. వ్యస్తముగా ఉన్నపుడు వ్యత్ర్కాంతి భాగములచే ద్విఘ్నతిథులతో ఆహృతములు స్ఫుటముగా తెలియవలయును. సంస్కారాది వలం బనము అంగులాద్యముగా కలుగును. అయిదంశల కన్నా తక్కువైనవై శుక్లపక్షము తిథులను తెలియవలయును. అట్లు కానిచో చంద్రునికి నాశోన్నతముగా గుర్తించ వలయును. అంగుళ లేఖనమున శృంగమును వేరు ప్రదేశమున ఉన్నతముగా చూపవలయును. అయిదు అంశలున్నపుడు పదిహేను అంశలు శేషకర్ణ హృతములను వేరుగా చూపవలయును. శ్రవణా నక్షత్రము త్రిజ్యము కంటే అధికము కాని న్యూనము కాని అయినపుడు కుజునివలన తనుభాగములు హరించబడును. ఋజు ఋజు భిన్నముల వివరమును గత్యంతరముచే విభాగముచేయబడి వక్ర ఋతువుల విషయ మున గతియోగామమును, గమ్యము అతీతమైనచో దినాదికమని తెలియవలయును. దక్షిణోత్తర ఖేట వివరము మానైక్యమున అల్పముగా ఉన్నచో, భేదలంబనము మొదట ఉన్నపుడు స్పుటమును తెలియుటకు సూర్యుని విషయమున మొదట చేసినట్లే చేయవలయును. సూర్యచంద్రులు ఒకే అయనమున ఉన్నచో విషయముగా ఉన్నపుడు క్రాంతి మండలములని, సమముగా ఉన్నచో ధృతమని తెలియవలయును. సూర్యచంద్రులు విపరీత ఆయనమున ఉన్నచో క్రాంతిలిష్తలుగా తెలియ వల యును. సూర్యచంద్రులు సములైనచో వ్యతీపాతమని, భగణార్ధమున తపోయుతులుగా తెలియ వలయును. సూర్యచంద్రులు భచక్రాంత చక్రార్ధమున ఉన్నచో దృక్కల్పముచే సాధించబడిన అంశము లతో కూడి ఉన్నచో అపక్రమములని తెలియవలయును. చంద్రుడు ఉచ్చపదమున సూచించబడి నపుడు క్రాంతి విక్షేప సంస్కృతమై సూర్యునికంటే అధికముగా నున్నచో క్రాంతి పాతమగునని తెలియవలయును. న్యూనమైనచో వామభావిగా తెలియవల యును. చంద్ర క్రాంతి విడిగాయుండి క్షేపముచే శుద్ధి పొందినచో క్రాంతి ఊర్జలు త్రిజ్యముతో భాగించబడి పరమాయ క్రమోద్ధతములై చాప మధ్యభాగమున జ్యాభాగములో సూర్యచంద్రులున్నపుడు చంద్రునినుండి గతమగు పాతము సూర్యగతి తాడితమగుచో శోదించవలయును. సూర్యునిలో చంద్రభుక్తిచే లిప్తాదులు హృతమైనపుడు చంద్రుని వలెనే ఫలమును తెలియవలయును. ఇట్లే విపర్యయముగా చంద్రపాతఫలమును తెలియ వలయును. ఇట్లు ఇద్దరి క్రాంతులు సమముగా వచ్చువరకు ఇట్లు చాలామార్లు చేయుచుండ వల యును. ఇట్లు రెండు క్రాతులు సమములైనపుడు చంద్రుడు ప్రక్షిప్తాంశకు తగ్గినపుడు పాతమును తెలియవలయును. పాతములేనపుడు అర్ధరాత్రికాఘాతమగును. అధికమైనప్పుడు తాత్కాలికా ఘాత మగును. అర్ధరాత్రార్ధములు స్థిరముగా చేసినపుడు సూర్యచంద్రుల వివరలిప్తలుగా తెలియ వల యును. చంద్రుని భుక్తముకాని షష్టిపాతకాలు నాడికలు. సూర్య చంద్రుల మానయోగము కొఱకు షష్టిచే గుణించి విభజించవలయును. ఇద్దరి భుక్త్యంతరముతో పొందిన అర్ధస్థితిని నాడికలవలె తెలియవలయును. మధ్యభాగము స్ఫుటమగు పాతకాలమగును. ఈ పాతకాలము స్థిత్యర్థ వర్జితమై నపుడు పాతకాల సంభవకాలమగును. ఆ సంయోగముపైన చెప్పిన సంజ్ఞ కలదగును. ఈ ఆద్యంత కాలములు మధ్యకాలము అతిభయంకరమైన కాలమని తెలియుము. ఈ కాలము భగభగ మండు చున్న అగ్నిహోత్రము వంటిది కావున అన్ని కర్మలయందు ఈ కాలమును పరిత్యజించవలయును. ఇట్లు గణితభాగము కొంచెము సంక్షేపముగా చెప్పితిని. ఇక ఇప్పుడు రాశిసంజ్ఞాపూర్వకముగా జాతకభాగమును చెప్పెదను. (2/54)