ద్వాదశమాసస్థిత షష్ఠీవ్రత నిరూపణము

సనాతన మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా? నీకు ఇపుడు షష్ఠీవ్రతములను చెప్పెదను వినుము. ఈ వ్రతములను చక్కగా ఆచరించి మానవుడు అన్ని వాంఛితములను పొందును. చైత్ర శుక్ల షష్ఠినాడు ఉత్తమమగు కుమార వ్రతమును ఆచరించవలెను. ఇచట షణ్ముఖ దేవుని నానా పూజా విధానములచే పూజించి సర్వ గుణోపేతమగు పత్రమును సమర్పించి దీర్ఘాయుష్యమును పొందవచ్చును. వైశాఖ శుక్ల షష్ఠినాడు కార్తీకేశ్వరుని పూజించి మాతృ సౌఖ్యమును పొందును. జ్యేష్ఠ శుక్ల షష్ఠినాడు యధావిధిగా దివాకరుని పూజించి సూర్యానుగ్రహము వలన వాంఛితములను పొందగలుగును. ఆషాఢ శుక్లషష్ఠినాడు యథావిధిగా దివాకరుని పూజించి సూర్యానుగ్రహము వలన వాంఛితములను పొందగలుగును. ఆషాఢ శుక్ల షష్టినాడు పరమోత్తమమగు స్కందవ్రతము ఆచరించవలెను. ఆ దినమున ఉపవసించి శివపార్వతీ ప్రియ పుత్రుడగు కుమారస్వామిని పూజించి పుత్ర పౌత్రాది సంతతిని సకలాభీష్టములను పొందును. శ్రావణ శుక్ల షష్టినాడు శరజన్ముని పరమ భక్తితో షోడశోపచారములచే పూజించవలెను. షణ్ముఖుని అనుగ్రహమువలన అభీప్సితార్ధములను పొందితీరును. భాద్రపద శుద్ధ షష్ఠినాడు లలితా వ్రతము చెప్పబడినది. ప్రాతః కాలమున యధావిధిగా స్నానముచేసి స్త్రీ శ్వేతవస్త్రములను ధరించి, శుక్ల మాల్యములను ధరించి, వెదురుపాత్రలో నదీ సంగమ మృత్తికను స్వీకరించి, ఆ మృత్తికను పిండాకృతిగా ధరించి, ఆ పిండమున వనవిలాసినియగు లలితను అయిదు విధములుగా ధ్యానించవలెను. పంకజమును, కరవీరమును, నేపాలిని, మాలతిని, నీలోత్పలమును, కేతకిని, తగరమును ఒక్కొక్కదానిని నూట ఎనిమిది కాని, ఇరువది ఎనిమిది కాని స్వీకరించి, అక్షతలను, మొగ్గలను తీసుకొని వాటిచే దేవిని పూజించవలెను. ముందు నిలబడి గిరిశ ప్రియయగు దేవిని ప్రార్ధించవలెను. గంగాద్వారమున, కుశావర్తమున, బిల్వకమున, నీల పర్వతమున స్నానము చేసి హరిని పతిగా పొందితివి ఓ లలితా? సౌందర్యమూర్తీ! సుఖ సౌభాగ్యదాయిని! నీకు నమస్కారము. నాకు అనంత సౌభాగ్యము నిమ్ము! అను ఈ మంత్రమును చదువుచు చక్కని సంపెంగ పూవులచే పూజించి ముందు యథావిధిగా నైవేద్యమును సమర్పించవలెను. త్రిపుష్పములతో, కూష్మాండములతో, నారికేళములతో, దాడిమీ ఫలములతో, బీజ పూరములతో తుండీరములతో చిర్ధటములతో కూడిన కారవల్లులతో తత్కాల సంభవమగు ఫలములతో లలితాదేవి ముందు చక్కగా శోభింపచేసి, విరూఢ ధాన్యాంకురములతో, దీపావళులతో సార్థ సర్గణకములతో, సౌహాలక కరంజకములతో ధూపమును అర్పించి, గుణ పుష్పములతో, కర్ణవేష్టములతో, మోదకములతో ఉపమోదకములతో, బహుప్రకార నైవేద్యములతో, విభవానుసారముగా నైవేద్యము సమర్పించవలెను. రాత్రిపూట జాగరణమును చేయవలెను. గీత వాద్యములతో, నృత్యములతో నటులతో బహువిధ ప్రోక్షణలతో చెలికత్తెలతో కలిసుండి సాధ్వి ఆరాత్రిని చక్కగా గడుపవలెను. ఆ రాత్రి నాలుగు ఝాములు కనులు మూయకూడదు. కనులు మూసుకొనినచో దౌర్భాగ్యము, దౌష్కృత్యము కలదై గొడ్రాలు అగును. ఇట్లు జాగరణచేసి సప్తమినాడు నదికి తీసుకొనిపోవలెను. గీత వాద్యపురస్సరముగా గంధ పుష్పములతో పూజించి ఆ ప్రతిమను నైవేద్యాదులను బ్రాహ్మణోత్తమునకు ప్రదానము చేయవలెను. స్నానముచేసి ఇంటికి తిరిగివచ్చి అగ్ని హోత్రమున హోమముచేసి దేవతలను పితృ దేవతలను మనుష్యులను ముత్తయిదువులను పూజించి, కన్యలకు భోజనము పెట్టి, పదిమందికో అయిదు మందికో బ్రాహ్మణులకు భక్ష్యభోజ్యములతో భోజనము పెట్టి భూరిదానములను ఇచ్చి నా విషయమున లలిత ప్రసన్నురాలగు గాక అని బ్రాహ్మణులను విసర్జించవలెను. ఈ సౌభాగ్య ప్రదమగు వ్రతమును ఆచరించు నరుడు కాని వారి కాని ఇతర దానములతో కాని, వ్రతములచే కాని, తపస్సులచే కాని, దానములచే నియమములచే కాని లభించు పుణ్యఫలము లభించును. అంతకాలమున సనాతనమగు శివలోకమును చేరి లలితా దేవితో చేరి చెలికత్తెవలె ఆనందించును. ఆశ్వయుజ శుక్ల షష్ఠి చన్దన అనబడును. ఆనాడు దేవిని పూజించి ఆలోకమును చెందును. రోహిణీ నక్షత్రముచే కాని, వ్యతిపాత్ తోకాని, మంగళవారముతో కూడియున్నచో కపిల అనబడును. ఈ కపిలా షష్ఠి యందు వ్రతమును చేయువాడు నియమతత్పరుడై సూర్యుని పూజించి, భాస్కరానుగ్రహమువలన వాంఛితార్ధములను పొందును. అన్నదానము, జపము, హోమము, పితృదేవర్షి తర్పణమును చేసినచో అదంతయూ అక్షయము అగును. కపిలాధేనువును వస్త్రమాల్యాను లేపనములచే పూజించి సూర్య ప్రీతికొరకు వేదజ్ఞుడగు బ్రాహ్మణునకు దానమును చేయవలెను. కార్తీక శుక్లషష్ఠి నాడు కాత్యాయనిని పూజించును. గంధాదికాని బ్రాహ్మణ పత్నిని, కాత్యాయనీతుష్టి కొరకు వస్త్రాలంకరణములతో పూజించిన కన్యపతిని, యువతి పుత్రుని పొందును. కార్తీక శుక్లషష్ఠి నాడు షణ్ముఖుడు సర్వదేవ పూజితయగు దేవసేనను పొందెను. కావున ఆ దినమున దేవసేనను షణ్ముఖుని సకలోపచారములచే పూజించినచో సర్వ స్ధిద్ధులను, సర్వాభీష్టములను పొందును. ఇచటనే వహ్నిపూజను చక్కగా సమర్పించవలెను. మార్గశీర్ష శుక్ల షష్టీ దినమున తారకాసురుడు సంహరించబడెను. కావున ఈ దినమున కుమారస్వామిని గంధపుష్పాక్షత ఫలములచే, వస్త్రాభరణములచే, వివిధ నైవేద్యములచే పూజించవలెను. ఈ మార్గశీర్ష శుక్ల షష్ఠి ఆదివారముతోకాని, శతభిషా నక్షత్రముతోకాని కలిసివచ్చినచో దానిని చంపాయందురు. ఆ దినమున పాపనాశకుడగు విశ్వేశ్వరుని దర్శించవలెను. పూజించవలెను. తెలియవలెను. స్మరించవలెను. ఈ దినమున చేయబడిన స్నాన దానాదికము లన్నియు అనంత ఫలముల నిచ్చును. పుష్యశుక్ల షష్ఠినాడు దినపతియగు భాస్కరుడు విష్ణు రూపుడు జగద్రక్షకుడు ఆవిర్భవించెను. కావున ఈ దినమున సర్వసౌఖ్యములను కోరువారు వివిధ ద్రవ్యములచే, గంధములచే వస్త్రాభరణములచే నైవేద్యములచే పూజించవలెను. మాఘ శుద్ధ షష్టి వరుణా అనబడును. ఈ దినమున సనాతనుడు విష్ణు రూపుడగు వరుణుని రక్త గంధ పుష్ప వస్త్రములచే ధూపదీపనైవేద్యములచే పూజించినచో సకలాభీష్టములను పొందును. ఫాల్గుణ శుక్ల షష్టినాడు దేవదేవుడగు పశుపతిని యధావిధిగా మృణ్మయ ప్రతిమనుచేసి ఉపచారములచే పూజించవలెను. విడిగా పంచామృత జలములచే శత రుద్రముతో స్నానముచేయించి శ్వేత గంధము కలది శ్వేత పుష్పములచే శ్వేతాక్షతలచే, బిల్వపత్రములచే, ఉమ్మెత్త పూవులచే, ఫలములచే, నానా నైవేద్యములచే పూజించి యధావిధిగా నీరాజనమును ఇచ్చి, క్షమాపణ వేడి, నమస్కరించి కైలాసమునకు పంపవలయును. ఇట్లు శివపూజను గావించిన నరుడు లేదా నారి ఇహ లోకమున సకల భోగములను అనుభవించి అంతమున శివలోకమును పొందును. (4/115)